ప్రభాతమొక్కటే!

రోజూ చూస్తున్నదే
అయినా మొగ్గలు రేకులుగా విచ్చుకోవడం
యెప్పటికీ సంభ్రమమే!

సుకోమల మంచు రశ్మి నిలువెల్లా అద్దుకున్న కార్తీకాన
మనసు భరిణలో నింపుకున్న చామంతుల సోయగం
యెప్పటికీ అపురూపమే!

పనీపాటా లేనట్లు
ప్రతి పచ్చికబయలు మీదా
కొండా కోనల తీరం వెంబడి
నువ్వెందుకు నిర్విరామంగా తిరుగుతుంటావో
అసలెప్పటికీ అనూహ్యమే!

కార్తీకం వెళ్లిపోయే ప్రతీసారీ
పన్నెండు నెలల యెదురుచూపు అద్దుతూ
నిర్దాక్షిణ్యంగా బెంగని కానుక చేసి పోతుంది

అప్పుడంటుంది పొగమంచు మాసం
మెల్లగా…
మెల్లమెల్లగా…
నీలోపల కార్తీకంని అలానే అట్టిపెట్టుకో!
మనిద్దరం కలిసే ప్రయాణిద్దాం
నేనూ తాత్కాలికంగా వెళ్ళే వో రోజు వస్తుంది
అప్పుడు
నీ మనో సరస్సుని పద్మాలతో నింపడానికి
మరొక పూలరుతువు నిన్ను పలకరిస్తుంది
విరబూసే సూర్యరశ్మికై నీ మనో ద్వారాలని పూర్తిగా తెరచి వుంచు

ప్రభాతమొక్కటే
వైవిధ్యమంతా ప్రభాతపరిమళానిదే

సమీపించటానికి అనుమతి యెందుకు?
దా… కవిత్వమై విచ్చుకో!

కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, మూడు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, 'మసిగుడ్డ', 'ముక్త', 'ఇన్స్టంట్ లైఫ్', ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, ముక్త, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, 'నెమలీకలు పూసే కాలం' (కవిత్వం), 'మంత్రనగరి సరిహద్దుల్లో (ప్రేమ కథలు), 'పొగమంచు అడవి', 'మోహనదీ తీరంలో నీలి పడవ' (కవిత్వం) సంకలనాలుగా వచ్చాయి.

2 thoughts on “ప్రభాతమొక్కటే!

Leave a Reply