ప్రజా మేధావులు, కొలిమి రవ్వలు

సమాజ పురోగతికి మానవ శ్రమే మూలమన్నది తెలిసిన విషయమే. అయితే ఆ శ్రమ కేవలం భౌతికమైనది మాత్రమేకాదు, బౌద్ధికమైనది కూడ. ఎంత అలవాటైన పనైనా ఆలోచన చేయకుండ చేయలేము. అంటే బౌద్ధిక శ్రమ లేకుండ, కేవలం భౌతిక శ్రమతో ఏ అర్థవంతమైన పని కూడ చేయలేము. ఈ అర్థంలో చూసినప్పుడు శ్రమజీవులు, బుద్ధిజీవులు అనే విభజన రేఖ సరైనది కాదు. అయితే “మేధావులు” అనే భావన మధ్యయుగాల నుండి సమాజాన్ని ముందుకు నడిపిన లేదా వేరుజేసిన “పునరుజ్జీవనం” కాలంలో (14- 16 శతాబ్దాల్లో) పుట్టినప్పటికి, ముఖ్యంగా పారిశ్రామికాభివృద్ది, పెట్టుబ‌డిదారి ఉత్పత్తి సంబంధాలు సమాజంలోకి వచ్చిన తర్వాత జరిగిన వర్గ విభజనలో భాగంగా భౌతిక/శారీరక శ్రమ నుండి వేరు కాబడి కేవలం బౌద్ధిక/మానసిక శ్రమకే పరిమితం చేయబడిన సమూహమొకటి ఉనికిలోకి వచ్చింది. ఈ సమూహం (వర్గం అనలేము) సమాజ విధులు (social functions) నిర్వహించడానికి కావాల్సిన పరిజ్ఞానం, ఆలోచనలను, విలువలను, సంస్కృతిని సమాజానికి అందించడమే తన పనిగా పెట్టుకుంది.

ఈ విభజనను సమాజ పురోగతికై అద్భుత కృషి చేసిన ఎందరో మేధావులు గుర్తించారు. 1868లో మొదటి అంతర్జాతీయ వర్కింగ్ మెన్స్ అసోసియేషన్ కు మార్క్స్ ను అధ్యక్షుడిగా ప్రతిపాదించినప్పుడు “నేను ఆ పదవికి అర్హుడను కాను. ఎందుకంటె నేను హెడ్ వర్కర్ ను, హాండ్ వర్కర్ ను కాదు” అని సున్నితంగా తిరస్కరించాడు. చివరికి “International” గా పిలువబడే కార్మిక సంఘానికి చెప్పులు, బూట్లు తయారుచేసే ఒక కార్మికుడు, జార్జ్ ఆడ్జర్ మొదటి అధ్యక్షుడయ్యాడు. దీనర్థం మార్క్స్ తనను తాను “ఉన్నతుడని” చెప్పుకోవడం కాదు. వాస్తవానికి అధ్యక్ష పదవి తీసుకోలేదు. కానీ, ఆ సంఘంలోసభ్యుడిగా వుంటూ అంతకు మించిన మేధో శ్రమ చేశాడు. బుద్ధిజీవులనుకునే వాళ్ళు భౌతిక శ్రమజీవులకు (కార్మికులకు, రైతాంగానికి) తోడుగా కుడి ఎడమలుగా వుండాలని చెప్పడమే. అదే సందర్భంలో కార్మికవర్గం మీద మార్క్స్, ఎంగెల్స్ త‌మ‌కున్న ప్రగాఢ విశ్వాసాన్ని కూడ ప్రకటించారు. ఒక్కసారి కార్మికవర్గం విప్లవ చైతన్యాన్ని పొంది ఆ దారిలో నడిస్తే ఇక వాళ్ళ చరిత్రను వాళ్ళే రాసుకోగలరని నమ్మారు. కానీ, నిరంతరం ఆచరణలో, శ్రమలో వుండే కార్మికవర్గానికి అనేక మేధోపరమైన పరిమితులు ఉంటాయి. కాబట్టి మేధావులు సమాజ స్థితిగతులను, రాజకీయ ఆర్ధిక విశ్లేషణలను, చారిత్రిక అనుభవాలను సమగ్రంగా కార్మికవర్గానికి అందించడం కనీస బాధ్య‌త‌గా భావించారు. అంతేకాదు, కార్మికులంతా ఒక వర్గం అనే సృహ వారికి కలుగడంలో మేధావుల పాత్ర చాలా కీలకమైనదని కూడ గుర్తించారు.

మార్క్స్ – ఎంగెల్స్

నిజంగానే, ఆధునిక కాలంలో బుద్ధిజీవుల సహకారం లేకుండ విజయవంతమైన ఉద్యమాలు అరుదు అనేది ఒక చారిత్రిక సత్యం. ఇలాంటి సమూహాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నదే ఈ వ్యాసంలో ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్న సామాజిక శాస్త్ర పరిశోధనలలో చర్చింపబడినదే, అయినా మళ్ళీ మళ్ళీ దీని గురించి మాట్లాడుకునే రాజకీయ సందర్భంలో ఉన్నాము. ఇది కేవలం భారతదేశ పరిస్థితి మాత్రమే కాదు. ప్రపంచ పరిస్థితి. నిరంకుశ పాలకులు ప్రపంచ రాజకీయ పటం నిండా నిండిపోతున్నారు. కనీసం ఉదారవాద భావనలకు కూడ తావులేని స్థితిని తీసుకొస్తున్నారు. ప్రజాస్వామ్యం మొక్కుబడి పదమయ్యింది. న్యాయవ్యవస్థ, చట్టబద్ధత విలువల రాహిత్యంగా మారిపోయాయి. ఇటువంటి సందర్భాల గురించి మేధావులు ఏంచెప్తారు అనేదే కాకుండా మేధావుల గురించి కూడా మాట్లాడుకోవడం అవసరం. అయితే ఈ మేధావులు సజాతీయమైన (homogeneous) సమూహం కాదు.

మేధావులు ఎందుకు మేధోశ్రమలో ఉంటార‌నే విషయాన్ని అర్థం చేసుకోవడానికి అనేక ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. అందులో ముఖ్యంగా మూడు ప్రధానమైనవి: (1) మేధావులు వర్గాతీతులు, (2) మేధావులే ఒక వర్గం, (3) మేధావులు వర్గానికి లోబడి వుండే వాళ్ళే.

మేధావులు ఎంతో నిష్పాక్షికంగా ఎలాంటి రాగద్వేషాలకు, ప్రలోభాలకు లోనుకాకుండ సత్యాన్వేషణ చేస్తారు కాబట్టి వాళ్ళను ఒక వర్గానికి పరిమితం చేయడం సరికాదనేది మొదటి వాదన. అంతేకాదు అనేక వర్గాల నుండి వచ్చిన వ్యక్తులు తమ మేధోశ్రమ క్రమంలో తమ తమ వర్గాల నుండి వేరుచేయబడి ఒక వర్గరహిత సమూహంగా మారుతారన్నది ఆ వాదన సారాంశం. కేవలం వర్గం మాత్రమే కాదు కుల, లింగ, జాతి పరిమితులను దాటి మేధావులు పనిచేస్తారు. ఇలా పనిచేస్తారు కాబట్టే వాళ్ళ మేధో ఫలితాలకు సాధికారత, విశ్వజనీన‌త ఉంటుంది. వాళ్ళకు సమాజంలో గొప్ప గౌరవం దొరుకుతుంది. వాళ్ళు చేసే మేధోశ్రమకు స్వేచ్ఛ లభిస్తుంది అనేది ముఖ్య ఉద్దేశం. ఇదంతా చదవడానికి ఎంతో ఉన్నతంగా ఉన్నప్పట్టికి, వాస్తవంలో ఇది జరిగే పనేనా అన్నది మొదటి సందేహం. కేవలం విద్య, జ్ఞానం మనిషిని కుల, వర్గ, లింగ, జాతిరహితులను చేస్తుందనుకుంటే అది ఒక భ్రమనో లేక ఆదర్శవాదమో అవుతుంది. ముఖ్యంగా దోపిడీ కులాలు, వర్గాలు అధికారాన్ని, పెత్తనాన్ని కొనసాగించే సమాజంలో జ్ఞాన ఉత్పత్తి అయా వర్గాలకు, కులాలకు అతీతంగా ఉంటుందని భావించడం భ్రమే. ఎందుకంటె జ్ఞానం అంటేనే అధికారం. అధికారమే ఏది జ్ఞానమో నిర్ణయిస్తుంది. ఈ రెండింటి మధ్య గతితార్కిక సంబంధం ఉంటుంది.

ఇక రెండో ప్రతిపాదన, మేధావులే ఒక వర్గం. మేధావులు వాళ్ళ మధ్య ఉండే సాన్నిహిత్యం, సంఘీభావం, నైపుణ్యం, వాళ్ళు ప్రకటించుకునే అస్తిత్వం, నిర్మించుకునే సంస్కృతి మూలంగా ఒక “కొత్త” వర్గంగా తయారవుతారు. అయితే ఈ “కొత్త” వర్గంలో విమర్శనాత్మక మేధావులతో (critical intellectuals) పాటుగా, సాంకేతిక మేధావులు (technical intelligentsia) కూడా ఉంటారు. ఈ మేధావులు విశ్వజనీయ ప్రతిపాదనల దిశగా పనిచేస్తూ సమాజం మీద తమ ప్రభావాన్ని చూపించే పని చేస్తుంటారు. ఈ “వర్గం” లో భాగం కావడం మూలంగా మేధావులకు కావాల్సినంత “సాంస్కృతిక పెట్టుబడి” (cultural capital) లభ్యమవుతుంది. ఇది తమ సొంత ప్రయోజనాల కోసమే కాకుండా, అధికారంలో వుండే వర్గాలను ప్రభావితం చేయడానికి కూడ పనికొస్తుంది. అయితే, వీళ్ళు ఏక గొంతుకగా, ఒక “కొత్త” వర్గంగా ఉంటారు అనేది నమ్మలేని విషయం. ఎందుకంటే ఈ “వర్గం” శూన్యంలో పనిచేయదు. ఒక నిర్థిష్ట సామాజిక, రాజకీయార్థిక పరిస్థితుల్లో పనిచేస్తుంది. ఆ పరిస్థితులలో ఉండే వర్గాలతో (ముఖ్యంగా దోపిడీ కుల, వర్గాలతో) ఈ మేధావులు ఎలాంటి సంబంధాలు కలిగివుంటారన్నదే ముఖ్యం.

మార్క్సిస్ట్ దృష్టికోణం నుండి వచ్చిందే మూడో ప్రతిపాదన. మార్క్సిస్టులు మూలాలు వెతుకుతారు. అసలు ఈ మేధావులు ఎవరు, ఎక్కడి నుండి వస్తారు, ఎందుకు మేధోశ్రమను ఎంచుకుంటారు, ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తారు, వాళ్ల ప్రయోజనాలు ఏంటి . ఈ ప్రశ్నలకు సమాధానం మనిషి ఉనికికి (being), స్పృహకు (consciousness) ఉండే సంబంధ పరిశీలన దగ్గర మొదలవుతుంది. మార్క్స్ దృష్టిలో స్పృహ కాదు మనిషి ఉనికిని నిర్ణయించేది, అతని/ఆమె యొక్క సామాజిక ఉనికి (social being) వారి స్పృహను నిర్ణయిస్తుంది. ఇక్కడ “సామజిక ఉనికి” అంటే కేవలం సమాజంలో మనిషి స్థానం మాత్రమే కాదు, ఆ మనిషి సామాజంలో ఉన్న వర్గాలతో ఎలాంటి సంబంధాలలో ఉన్నాడు, ఎలాంటి చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నాడు అని అర్థం. ఈ అర్థంలో ఒక వ్యక్తి సామాజిక వర్గం (social class) కేవలం ఒక వర్గంలో పుట్టడం మూలంగానే నిర్ణయించలేము. అది ఆ వ్యక్తి యొక్క వర్గ స్పృహను బట్టి, ఆ వ్యక్తికి ఉత్పత్తి వ్యవహారాలతో ఉన్న సంబంధాలతో నిర్ణయించాల్సి వుంటుంది. మొత్తంగా మార్క్స్ చెప్పదలుచుకున్నది వర్గ స్పృహ గురించి. మరి మేధావులకు ఈ వర్గ స్పృహ ఎలా వస్తుంది?

దీనికి సమాధానంగా అంటోనియో గ్రాంసీ చెప్పిందేమంటే వర్గ సమాజంలో మేధావులు వారికి వారుగా ఒక వర్గంగా ఉండడం కాని, లేదా వర్గరహితంగా, స్వతంత్రులుగా ఉండడం కాని వీలుకాదు. ఎందుకంటే ప్రతి సమాజంలో వివిధ వర్గాలు తమ ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవహారాలను చక్కబెట్టడానికి, వాటికి చట్టబద్దత ఏర్పరుచుకోవడానికి ఒక మేధావి వర్గాన్ని తయారుచేసుకుంటాయి. ఆ మేధావులు ఆయా వర్గ సంబంధాల నుండే వస్తారు కాబట్టి వాళ్ళను “ఆర్గానిక్ ఇంటెలెక్చువల్స్‌” అన్నాడు. బూర్జువాలు, కార్మికులు తమ తమ మేధావులను తయారు చేసుకుంటారు. వర్గాలకు అతీతంగా ఉన్నామని అనుకునే “సాంప్రదాయ మేధావులు” (traditional intellectuals) ఒక సామాజిక భ్రమలో ఉన్నట్లే అని అంటాడు గ్రాంసీ.

సాంప్రదాయ (బూర్జువా) మేధావులు రాజ్యానికి, పెట్టుబడికి సేవ చేస్తూ వ్యవస్తీకృత హింసలో(structural violence) భాగమవుతూ వుంటే, కార్మికవర్గ (ప్రజా) మేధావులు అణగారిన వర్గాల, కులాల, జాతుల, ప్రాంతాలకు అండగా వుంటూ వాళ్ళ పోరాటాలకు మద్దతుగా నిలబడుతారు. మొత్తంగా అన్ని రకాల అధికార కేంద్రాలకు, ఆధిపత్యాలకు వ్యతిరేకంగా గొంతు విప్పుతారు.

అయినా మార్క్స్ కు మేధావుల మీద ఎప్పుడు ఒకింత అనుమానమే. అందుకే వాళ్ళను అవకాశవాదంతో ఊగిసలాడే పెటీబూర్జువాలుగా భావించాడు. కార్మికవర్గ ప్రయోజనాలతో మమేకం కాలేని మేధావులు తమ స్వప్రయోజనాల కోసం అతివేగంగా పెట్టుబడి వలలో పడిపోతారు. చివరికి కార్మిక వ్యతిరేక ధోరణులతో ప్రజాశతృ వర్గంలో భాగమవుతారు. ఈ క్రమం సామ్రాజ్యవాద ప్రపంచీకరణ సందర్భంలో చాలా వేగవంతంగా జరుగుతుంది. వాళ్ళు కోఆప్ట్ కావడమే కాకుండా ఉద్యమాలు చేసే ప్రజల మీద, మేధావుల మీద దుమ్మెత్తిపోస్తూ వాళ్ళ మీద జరిగే హింస స్వయంకృతాపరాధ‌మ‌ని రాజ్యభాష మాట్లాడుతారు. వాళ్ళు ముసుగు దొంగలని, ప్రజా వ్యతిరేకులనే సత్యాన్ని చరిత్ర రికార్డ్ చేస్తుంది.

అయితే ప్రజా మేధావులు మాత్రం అన్ని రకాల పీడనల నుండి, దోపిడీ నుండి ప్రజలను విముక్తి చేయడానికి వాళ్ళతో పాటుగా నడుస్తారు. ప్రజల పక్కనుండో లేక పై నుండో నడవడం కాదు, వాళ్ళలో భాగమై నడుస్తారు. ఆ నడకలో వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తూ అణగారిన వర్గాల చైతన్యానికి ఒక ఏజంట్ గా పనిచేస్తారు. ఆ పనిలో ప్రజల నుండి నేర్చుకుంటారు. ప్రజా కొలిముల రాజేస్తారు. ఆ కొలిమిలో తమని తాముగా సానబెట్టుకుంటారు. కొలిమి రవ్వలై చైతన్యాన్ని పంచుతారు.

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

Leave a Reply