ప్రజాస్వామ్యంలో ఫాసిస్టులు ఎలా గెలుస్తారు?

కేంద్రంలో మళ్లీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఎంతో మంది ప్రగతిశీల ఉద్యమకారులను,  లౌకిక ప్రజాస్వామిక వాదులను కలవరపెడుతుంది. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాలలోనూ పంచుకుంటున్నారు. ప్రజలు ఫాసిస్టు పాలకులకు పూర్తి మెజారిటీ ఇచ్చి మళ్లీ అధికారం ఎట్లా కట్టబెట్టారని ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆవేదనను అర్థం చేసుకోవచ్చు, కానీ, దానికి సమాధానం కేవలం ఎన్నికలను విశ్లేషిస్తే దొరకదు. 

దాదాపు డెబ్భై ఏండ్లుగా కొనసాగుతున్న తతంగమే అయినా ఈ ఎన్నికలు మరీ స్పష్టంగా తన బూటకత్వాన్ని ప్రకటించుకున్నాయి. ఎన్నికలు బూటకమని చెప్పడానికి ఇప్పుడు పెద్ద సిద్ధాంత చర్చ కూడ అవసరంలేని స్థితి వచ్చేసింది. కేవలం కులం, మతం, డబ్బు ఆధారంగా ఎన్నికలు జరుగుతున్నాయంటేనే అవి అప్రజాస్వామికమైనవని, ఆధిపత్యం తప్ప మరే విలువలు లేనివని అర్థమవుతుంది. ఈ విషయం ప్రజల స్పృహకు రాలేదని కాదు, కాకపోతే ఎన్నికలంటేనే ఈ విధంగా వుంటాయనే ఒక ఆధిపత్య విలువను అన్ని బూర్జువా పార్టీలు ఒక సాధారణ విషయంగా మార్చేశాయి. దానిని ప్రశ్నించడం కూడా వృథా అన్నంత గట్టిగా మెజారిటీ ప్రజల మెదళ్ల‌లో పాతేశారు.

వాస్తవం ఇంత నగ్నంగా ఉంటే, ఉదారవాద విలువలతో “నీతివంతమైన” ఎన్నికల ద్వార సమాజాన్ని మార్చేద్దామని కలలు కనే సమూహాలు ఇంకా ఉన్నాయి. మార్చేయవచ్చు అనే ఒక భ్రమను ప్రచారం చేసే బుద్ధిజీవులు, రాజకీయ నాయకులూ ఉన్నారు. ఈ సమూహాలకు దేశ రాజకీయార్థిక‌, సామాజిక పరిస్థితి, దోపిడీ వర్గాల, కులాల కునీతి, వాళ్ల బలం, ఎత్తుగడలు  ఇంకా అర్థం కాలేదనే అనుకోవాలి. ఒకవేళ అర్థమయితే, పార్లమెంటరీ ప్రజాస్వామ్య భ్రమల్లో కూరుకుపోయి వాస్తవాన్ని విస్మరిస్తున్నారనే అనుకోవాలి.

మొత్తంగా సారాంశంలో పాలకవర్గ ప్రయోజనాలను కాపాడడానికే (కొంత ప్రోగ్రెసివ్ అంశాలు వున్నప్పటికి) అమలులోకి వచ్చిన రాజ్యాంగాన్ని “రక్షించుకుందాం” అని నినదించిన పార్టీలను రాజ్యాంగాన్ని “భక్షించే”  పార్టీ ఓడించింది. ఈ సందర్భంలో ప్రగతిశీలవాదులు కొంత నిరుత్సాహపడటం గమనిస్తుంటె నాకు అమెరికాలో ట్రంప్ ఎన్నిక సందర్భంగా తన అభిప్రాయాన్ని చెప్పమని కోరినప్పుడు ఒక అమెరికన్ ఆదివాసీ చెప్పిన మాల్కం ఎక్స్  మాటలు గుర్తుకొస్తున్నాయి. “ఒకడు దైవదూత రూపంలో వచ్చి దయ్యంలా పడుతాడు. మరొకడు ముందే తన దయ్యం రూపాన్ని ప్రకటించుకొని వస్తాడు.” రూపాలు వేరైనా, సారంలో ఇద్దరూ ఒక్కటే. ఎందుకంటే ఇద్దరి ప్రయోజనాలు ఒక్కటే. పార్లమెంటరీ రాజకీయ నాటకంలో స్టేజ్ మీదనే వీళ్లలో బేధాలు క‌నిపిస్తాయి. కానీ, స్టేజ్ వెనుకాల లేదా దిగినాక అంతా ఒక్కటే. అయితే ఇది చలా తేలికైన సూత్రీకరణ. దీనిని దాటి ఇంకా మూలాలలోకి పోవాలి.

ముందే చెప్పినట్లు, ఎన్నికల ప్రక్రియనే బూటకం అయినప్పుడు (ఈ మాట ఇప్పుడు చంద్రబాబు లాంటి బూర్జువా నాయకుడు కూడా అంటున్నాడు. అయితే ఆయన ప్రయోజనం వేరే) ఎవరు గెలిచినా, ఓడినా ప్రజలకు ఒరిగేది ఏమీ వుండదు. అయినా కూడ ఫాసిస్టు విధానాలను తమ అజెండాగా ప్రకటించుకొని అమలుచేస్తున్న రాజకీయ పార్టీకి మళ్లీ పట్టం కట్టడం కొంత కలవరపెట్టేదే. అయినా ఆశ్చ‌ర్య‌పడేది ఏమి కాదు. ఎందుకంటే చరిత్రలో కూడ ఫాసిస్టులు ప్రజల మద్దతును కూడగట్టుకోగలిగారు. అది ఎలా సాధ్యమయ్యింది, వాళ్ల‌ ఎత్తుగడలు ఏమిటో అర్థం చేసుకుంటే కాని ఈ ఎన్నికల అసలు విషయం అర్థం కాదు.

నిజమే. ఫాసిస్టులు అధికారంలోకి రావడం అంటే ఒక బూర్జువా పార్టీ నుంచి అధికారం మరో బూర్జువా పార్టీ తీసుకోవడం లాంటిది కాదు. అంతకు మించిన రాజకీయ ప్రక్రియ జరుగుతుంది. ఎందుకంటే ఫాసిస్టులు ఎన్నికల్లో లేదా ఎన్నికల కోసమో పుట్టరు. వాళ్ల‌కు ఎన్నికలు ఒక వాహనం మాత్రమే. ఎన్నికల ద్వారా లభించే ప్రజల “మద్దతు”తో ఉదారవాద స్వభావం ఉండే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఫాసిస్టు నియంతృత్వం వైపుగా మలుపుతారు. ఆ క్రమంలో చైతన్యవంతమైన పౌర సమాజాన్ని, అది సంపాదించుకున్న రాజకీయ  విలువలను ధ్వంసం చేసి వాటి స్థానంలో ఒక భజన “మేధావి” వర్గాన్ని, అరాచక మూకను ఏర్పాటు చేసుకుంటుంది. రాజ్యం భాషలోనే చెప్పాలంటే “అర్బన్ ఫాసిస్టులను” తయారు చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ అంతా ఒక “నూతన ఫాసిస్టు మానవున్ని” నిర్మించే దిశగా అడుగులు వేస్తుంది.  ఈ పనిని కాషాయపు ఫాసిస్టులు ఇప్పటికే మొదలుపెట్టారు.

నూతన ఫాసిస్టు మానవున్ని అహేతుకతమైన భావోద్వేగ దూకుడు ( irrational emotional aggression) మీద నిర్మితం చేస్తున్నారు. ఇది ఒక ఉన్మాద స్థాయికి తీసుకుపోయే పనిలో వున్నారు. కనీస ప్రజాస్వామిక, లౌకిక విలువలను సైతం సహించక వాటిని ధ్వంసం చేసి, వాటి స్థానంలో బ్రాహ్మణీయ హిందూ ఆధిపత్యాన్ని నిలబెడుతున్నారు. దేశమంటే ఒకే ఒక మతమని, కేవలం హిందువులదే దేశమని, హిందువులు కాని వాళ్ళు దేశీయులే కారని, వాళ్ళు హిందువుల దయాదాక్షిన్యాల మీద బ‌తకాలని, భారతీయత అంటేనే హిందుత్వ అనే వాదనను ప్రజల నిత్య జీవితంలో భాగం చేసే కుట్రలు చేస్తున్నారు.

ఏక జాతి అనే అతివాద ధోరణిని కాపాడుకోవడం కోసం దేశానికి ఒక “శక్తివంతమైన నాయకుడు” అవసరమని సంఘ్ పరివార్ శక్తులు నెత్తుటి చరిత్రే అర్హతగా మోడీని మరో “ఉక్కు మనిషి”గా ప్రచారం చేసి విజయవంతమయ్యాయి. ఆ నాయకుడే బయటి, లోపలి “శతృవుల” నిలువరించగలుగుతాడనే ప్రచారం ఎడతెరపి లేకుండా ప్రజల్లోకి తీసికెళ్ళి అది నిజమే కాబోలు అనేంతగా ఫాసిస్టులు చేయగల్గారు. ఈ మొత్తం ప్రచారమంతా ద్వేషం, హింస, అణిచివేత, యుద్ధం పునాదుల మీదనే జరిగింది. దేశానికి ఒక ప్రజాస్వామిక నాయకుడు (ఉదారవాద అర్థంలోనైనా) కాదు, ఒక ఫాసిస్టు నియంత కావాలనే భావనను ప్రజల మెదళ్ళలోకి ఎక్కించడంలో హిందుత్వ శక్తులు సఫలమయ్యాయి. దాని కోసం దేశంలో పెరుగుతూ వస్తున్న దిగువ, ఎగువ మధ్యతరగతిని పునాదిగా ఎంచుకొని పనిచేశారు.

నయా ఉదారవాద ప్రపంచీకరణ సందర్భంలో ముఖ్యంగా మధ్యతరగతి తన రాజకీయ స్వభావాన్ని మార్చుకుంది. పౌర స‌మాజంలో కనీస ప్రేక్షక పాత్రను కూడ వదులుకొని చివరికి ఒక మార్కెట్ వినియోగదారుడిగా  మార్చబడింది. మధ్యతరగతిని మార్కెట్ కు బంధీ చేయడానికి ఆధునిక పరిజ్ఞానం, సమాచార విజ్ఞానం ఒక అత్యవసరం చేశారు. ఈ ఆధునిక మానవుడి నిత్య జీవితమంతా పరిజ్ఞానం మీదనే ఆధారపడి నడుస్తుంది, కాని సమాజానికి సంబంధించిన ఆలోచనలు మాత్రం పురాతనమైనవి. ఆర్థికంగా పెట్టుబడిదారి ఆలోచనలు, సామాజికంగా (నయా) భూస్వామ్య పోకడలు. 

మొత్తంగా సమాజ అభివృద్ధి నిరోధక తత్వం. ఇటువంటి అభివృద్ధి నిరోధక ఆధునికుడు (reactionary modernist) ఫాసిస్టులు కలలుగనే రేపటి “నూతన ఫాసిస్టు మానవుడికి” ప్రాథ‌మిక రూపం.

ఈ నూతన మానవుడు ప్రశ్నలను సహించడు. ఎందుకంటే తన తలను పెట్టుబడి ఉన్మాదానికో లేక మతోన్మాదానికో ఎప్పుడో తాకట్టు పెట్టాడు. పురాణాలను విజ్ఞానశాస్త్రం చేసినా, నేరస్తులు చట్టసభల్లో ప్రజా ప్రతినిధులుగా మారినా, న్యాయం చీకటి గదుల్లో బంధీ అయినా తప్పులేమీ కనబడవు. ఎందుకంటే తనొక పరాధీన జీవి. ఇటువంటి జీవులను ఆడించడానికి ఫాసిస్టులు చెప్పిందే మళ్లీ మ‌ళ్లీ చెబుతారు. అబద్దాలను నిజమని నమ్మేలా చేస్తారు. మొత్తంగా ఒక మాస్ హిస్టీరియా ను సృష్టించి, తద్వార అహేతుకమైన, అరాచకమైన శక్తులను తయారుచేస్తారు. ఇవన్నీ దేశ ప్రయోజనాల కోసం “దేశ భక్తులు” చేస్తున్న పనిగా చెప్పుకుంటారు.

ఇటువంటి సామాజిక సందర్భంలో చరిత్ర చెబుతున్నట్లు ఉదారవాద ప్రజాస్వామ్యం ఒక అడుగు వెనుకకు వేస్తే, ఫాసిజం పది అడుగులు ముందుకు వేస్తుంది. ఇక ప్రజలను విడదీయడానికి వాడు నిరంతరం కుట్ర చేస్తూనే వుంటాడు. మాట మాట్లాడకుండ భయాన్ని ఆయుధంగా ప్రయోగిస్తూనే ఉంటాడు. పోరాడే ప్రజల మీద యుద్ధం తీవ్రం చేస్తాడు. అణగారిన కులాల, మతాల, జాతుల మీద హింసను కొనసాగిస్తాడు. ఇవన్నీ చేయకపోతె వాడు ఫాసిస్టే కాడు. అయితే, ప్రజలు, వాళ్ల‌కు మద్దతుగా నిలబడే బుద్ధిజీవులు, కవులు, రచయితలు, కళాకారులు ఎప్పటికి బాధితులుగానే మిగిలిపోరు. వాడి బెదిరింపులకు బెదిరిపోరు. అనివార్యంగ తమ ఆచరణ పరిధిని విస్తరించుకుంటారు. అయితే చరిత్ర చెబుతున్నట్లు  ఫాసిజాన్ని పార్లమెంటులో ఓడించలేము. అది కేవలం అనేక ప్రజా పోరాటాల ద్వారానే సాధ్య‌మవుతుంది. ప్రజలు త్యాగపూరిత పోరాటాల ఒరవడిలో ఏకమవుతారు. ఫాసిస్టులను ఒంటరి చేస్తారు. ప్రజలు ఎన్నికల్లో ఓడినా, పోరాటాలలో గెలుస్తారు. ఇదే చరిత్ర చెబుతున్న సత్యం. అంతిమ విజయం ప్రజలదే. 

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

9 thoughts on “ప్రజాస్వామ్యంలో ఫాసిస్టులు ఎలా గెలుస్తారు?

 1. అది ఎలా అన్నదే ఇప్పుడు అందరి ముందు వున్న ప్రశ్న?

 2. very good one ///
  అశోక్ గారు — అసలు దేశం లో ప్రజాసామ్యం అంటూ ఉందా ???
  కుల మత పట్టింపులు నేటికి ఉన్నాయి –దళితు ల్లో కూడా మాల –మాదిగ — అంటూ ఎక్కువ తక్కువలు అవసరమా — వీళ్ళు మారేది ఎప్పుడు — యూనిటీ వచ్చేది ఎప్పుడు ??
  యి రోజుల్లో ప్రతి వెధవ నాయకుడే —- ఈజీ పోస్ట్ — కలిసి వస్తే పదవులు — డబ్బు కు కుదువ ఉం డ దు –మితి మీరిన అవనీతి — దోపిడి —
  యిక ఫ్యామిలీ వారసత్వ పాలనలు — 70 ఏళ్ళ స్వాతంత్రం లో —దేశాన్ని పాలిస్తుంది కొన్ని కు టు౦ బా లే —

  నేటి ఎన్నికల్లో –మోడీ // రాహుల్ // మమత –మాయావతి
  రాహుల్ నాయకుడా సర్ —ఎంతకాలం నెహ్రు ఫ్యామిలీ రాజరికం —
  మాయావతి కాలం లో అవనీతి — దోపిడి — విగ్రహాలు — తన విగ్రహాలు — యివి దేశానికి అవసరమా
  మమత — DICTATORSHIP పాల న — అందుకే గండి పడ్డది

  కాంగ్రెస్ పాలన లాగా కుంభ కోణాలు — దోపిడి లేదు మోడీ 5 ఏళ్ళ లో —అందుకే తిరిగి మోడీ రావడం —
  నేటి రచయితల్లో — గ్రూప్ లు –కక్షలు — రాసేది ఒకటి — వాళ్ళు పాటించేది మరొకటి
  గుర్తింపు కోసం నానా గడ్డి క రుస్తూ —-బిరుదల కోసం నాయకుల చుట్టూ తిరుగడం
  యిక మాయమయి పోతున్న తెలుగు భాష

  రోండవ స్వాతంత్ర పోరాటం రావాలి —అగ్రకులాల వ్యవస్థ ను తుడిచి పెట్టాలి
  జనం తిరుగ బడాలి

  మార్పు అప్పుడే ——- ఒక ఆశ

  బుచ్చి రెడ్డి గంగుల

  *** నేను BJP వాణ్ని కాదు ***

 3. ఇప్పటి పరిస్తితిని వివరిస్తూ చేసిన మంచి విశ్లేషణ.

 4. పరాధీన జీవుల సంఖ్య దేశంలో రోజు రోజుకి పెరిగిపోతుంది. ఫాసిస్టులదే పైచేయి అవుతుంది. ఎవడి జీవితానికి వాడే స్వయంగా సంకెళ్లు వేసుకొని బ్రతుకుతున్నాడు. ఎవడి జైలు వాడే నిర్మించుకొని అదే ప్రపంచంగా జీవిస్తున్నాడు. బుద్ధిజీవులు, కవులు, రచయితలు, కళాకారుల ప్రపంచం కూడా మారింది. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో ఎవరి మనోభాలు ఏమిటో అర్ధం చేసుకోవడం కష్టంగా ఉంది. మనిషి మనసులోకి వెళ్ళి చూసే రోజులు పోయాయి. ఇప్పుడు మనసు స్థానంలో హార్డ్ డిస్క్ లు వచ్చేసాయి. అందులో కాపీ పేస్టులు తప్ప సహజ సిద్ధంగా పుట్టే భావాలు ఉండటంలేదు. మొత్తగా మనిషి ఏమి కోల్పోకూడదు అదే కోల్పోతున్నాడు.ఇప్పుడు ముందుగా ఎవరైనా కోల్పోయిన మనిషిని వెతికి పట్టుకోవడమే. పోయిన మనుషులు దొరికితే ఫాసిజాన్ని పరుగులు పెట్టించడం పడ్డ సమస్య కాదేమో !

 5. విశ్లేషణ బాగుంది. మాస్ హిస్టీరియా కరెక్టుగ చెప్పారు.

 6. SC, ST రిజర్వుడు స్థానాల MP, MLA పదవులకు,

  BJP అభ్యర్థులుగా పోటీ చేసే వారు,

  మబ్బులో నుంచి ఊడి పడిన గంధర్వులా ?

  స్వజాతి హనన వారధులా ?

  చాతుర్వర్ణ వ్యస్థను,

  ఆతరువాత సరికొత్తగా పంచములను సృష్టించిన,

  మత దర్మాల పునరుద్ధరణ లక్ష్యంగా,

  అస్పృశ్యతా కౄరత్వాన్ని రాజ్య వ్యవస్థలో(రాజ్యాంగాన్ని మార్చి) సుస్థిరం చేసే ధ్యేయం ఉన్న

  BJP కి SC, ST ల నుంచి అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తులు లభించటం ఏమిటి !!!

  తాము పుట్టి వచ్చిన సాటి కుటుంబాలూ, శ్రామికులూ ఐన నిరు పేదలకు న్యాయం చెయ్యాలనా ?

  వెన్ను పోటు పొడవాలనా ?

  కులమంటే కత్తి,
  మతమంటే మత్తు,
  కుల మతాల ఎత్తులు,
  సాములోర్ల జిత్తులు.

  కులము కూడెట్టదు
  మతము మత్తెడతది.

  నిజం తెలిసి మసలుకుంటే
  మనుషులుగా వుంటరు.

  మోసగించి ఆశపడితే,
  బుగ్గి బూడిడౌతారు.

  ఈ మొత్తం ప్రస్తుత దుస్థితికి కారణం

  1917 అనుభవం తరువాత 1950వ, దశకం నుంచీ ప్రజా వ్యతిరేక ఫాసిస్టు ఉన్మాద శక్తులు తమ ఫిలాసఫీలో స్పష్టమైన (contrast) మార్పు చేసుకున్నారు.

  ఉద్యమాల ఉధృతిని చల్లార్చే / పల్చబజార్చే పధకాలూ ఎత్తుగడల మెలి ముసుగులు వేసుకున్నారు.

  అణచివేతను తిరస్కరించే నియమాల రాతలు(రాజ్యాంగాలు)కాగితాల మీదా,

  అణచివేతను అధికార యంత్రాంగం చేతలలో,
  అమలుకు అనువుగా,

  అధికారం కైవసం చేసుకునే పాలక ముఠాలు

  తేనెలొలికే మాటలు, హామీలు కొందరూ,

  ధర్మం నియమం నిష్టల కాఠిన్యం కొందరూ,

  వ్యతిరేక స్వరాలను మట్టు బెట్టే గుర్తు తెలియని మూకగా కొందరూ,

  చట్టం తన పని తాను చేస్తుందనే వ్యాఖ్యానాల కాకమ్మ కబుర్లలో సహా

  వ్యూహా రచనలు చేసుకున్నారు.

  తమ వ్యూహాలకు దన్నుగా

  అశేష ప్రజలను నిర్వీర్యులను చేసే,

  జనాకర్షక పథకాల ప్రకటనలకు(ప్రజలకు అందవచ్చును లేదా తమ ఏజెంట్లు దిగమింగ వచ్చు)వనరుగా,

  ప్రజల పెదరికాన్నీ, అజ్ఞానాన్నీ యధా స్థితి నుంచి దిగజార్చే ఎత్తుగడలు రూపొందించు కున్నారు.

  కానీ ఉద్యమకారులుగా ముందుకొస్తున్న వారి ఐక్యాత??? !!! ‘ ‘ ‘- – – / / /!₹? !₹? !₹? !?₹ ఇ లా మి గి లి పో యా రు ఊ ఊ ఊ…………

Leave a Reply