ప్రజాస్వామిక విలువల కోసం పరితపన పరిపూర్ణ వ్యాసాలు

“విజయవాడ రోజుల్లో – 1965 ప్రాంతంలో – తన రచనా వ్యాసంగం మొదలైంది. మొదట్లో వ్యాస పరంపర. దానితో పాటు విజయవాడ ఆకాశవాణి లో వివిధ విషయాలమీద ప్రసంగాలు. ఆ తర్వాత కథలు.”  నంబూరి పరిపూర్ణ  గురించి ఆమె పిల్లలు శిరీష , అమరేంద్ర , శైలేంద్ర  చెప్పిన మాటలు ఇవి. ( ఒక మాట – శిఖరారోహణ , 2016) 1965 నుండి వ్యాసాలు వ్రాస్తున్నా సంకలితం అయిన వ్యాసాలు మాత్రం 1997 – 2016 మధ్యకాలానివి. 

వ్యాసం ఆలోచన ప్రధానమైన ప్రక్రియ. సృజన సాహిత్యం లో రచయిత కొంతవరకు తాను కనబడకుండా పాత్రల చాటున దాక్కునే అవకాశం ఉంది. కానీ వ్యాసం అలాకాదు. అది సమాజంతో రచయిత చేసే ప్రత్యక్ష సంభాషణ. సామాజిక భావజాల సంస్కృతితో సంఘర్షించటం. అందువల్ల రచయిత దృక్పథం నిగ్గు తేలి కనబడుతుంది. ఆ రకంగా వ్యాసం రచయిత వ్యక్తిత్వానికి , నిబద్ధతకు నిలువుటద్దం వ్యాసం. 

నంబూరి పరిపూర్ణలో భావనా శక్తి  బాల్యంలో నాటక కళా రంగ సంబంధంలో వికసించటం మొదలైనా – ఆమే చెప్పినట్లు ‘దేశభక్తి, ప్రజల ప్రగతి కేంద్రంగా వున్న రాజకీయాల నేపథ్యం గల    కుటుంబ  రాజకీయాల ప్రభావం ఆమెను  హైస్కూల్ చదువుల నాటికే ఆలోచనా శీలిని చేశాయి. స్వప్రయోజన దృష్టితో కాక ఆత్మగౌరవ స్పృహతో ప్రజాస్వామిక భావజాలంతో చేయవలసినది ఏదో , చేయగూడనిది ఏదో విచారించ గల వివేకం అలవడింది. ఆ తరువాత కమ్యూనిస్టు విద్యార్థి కార్యకర్తగా  విలువల కోసం మాట్లాడటం , నిలబడటం ఆమె వ్యక్తిత్వమై వికసించింది. అందువల్ల ఒక సామాజిక అవసరంగా  ఆమె రచనా వ్యాసంగం వ్యాసం తో ప్రారంభం కావటం సహజంగా జరిగిపోయింది. 

అయితే గుర్తింపు దశకమైన 1960 లలో ఒక స్త్రీగా తన అనుభవాలను  , ఆలోచనలను, అభిప్రాయాలను స్త్రీలందరి సాధారణ అనుభవాలతో సంవదింప చేసుకొంటూ   స్త్రీ సమస్యల పైనా, దళిత జీవన సమస్యల పైన ప్రతిభ, ప్రగతి , వార్త వంటి పత్రికలలో  ఆమె వ్రాసిన తొలి  వ్యాసాలు  లభించటం లేదు. లభిస్తున్న వ్యాసాలు జీవనయానంలో ఒడిదుడుకులను ఎదుర్కొని స్థిమిత పడిన తరువాత,  వ్రాసినవి. మరీ ముఖ్యంగా  నూతన ఆర్ధిక సంస్కరణలతో దేశం వేగవంతమైన మార్పులకు లోనవుతూ ప్రపంచీకరణ వరవడిలో కొట్టుకు పోతున్న తరుణంలో  మహిళల పట్ల, దళితుల పట్ల  మాత్రం భూస్వామ్య భావజాల సంస్కృతే అమలవుతూ తెలుగు సమాజం సంఘర్షణాత్మక దశలో ఉన్నసమయానికి వ్యాఖ్యానాలుగా వ్రాసిన వ్యాసాలు ఇవి. జనబాహుళ్యాన్ని సంబోధించి చైతన్యవంతం చేసే లక్ష్యంతో వ్రాసిన ఈ వ్యాసాలను పత్రికా వ్యాసాలని , పాపులర్ వ్యాసాలనీ అనవచ్చు. ఒక విషయం మీద సామాజిక అవగాహనను పెంచి చైతన్యం కలిగించటం లక్ష్యంగా ఆయా సందర్భాలను , అవసరాలను బట్టి వ్రాసిన వ్యాసాలు కనుక ఒకే విషయం  రెండు మూడు వ్యాసాలలో చర్చకు రావటం, ఒకే అభిప్రాయం మళ్ళీ మళ్ళీ చెప్పటం అనివార్యం అయింది.

స్థూలంగా పెళ్లి, కట్నం, ఆర్ధిక స్వవలంబన, మద్యం , మీడియా , హిందూత్వం, ప్రజా స్వామ్య రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు మొత్తంగా మానవ సంబంధాలు నంబూరి పరిపూర్ణ వ్యాసాలకు విషయాలు అయ్యాయి.   

పరిపూర్ణ వ్యాసాలలో  వస్తువు రీత్యా  మహిళా సమస్యకు సంబంధించినవి ఎక్కువ.  1994 బీజింగ్ సదస్సు తరువాత అంతర్జాతీయంగా ప్రచారంలోకి వచ్చిన మహిళా సాధికారత భావన  నేపథ్యంలో చదువుకొని  ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కూడా  స్వతంత్రంగా , సాధికారతతో  బతక లేకపోతున్న సామాజిక వాస్తవం తనను కలవరపెడుతుండగా రకరకాల కోణాలనుండి దానిని ఆమె చర్చకు పెట్టింది. పెళ్లి కేంద్రంగా సమస్యలను గుర్తించటం ఒక రకం. ఆ సమస్యలలో బలమైంది కట్నం. చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న యువతులకు  కూడా కట్నం ఇయ్యనిదే పెళ్లిళ్ల కావటం కష్టమైపోతున్నస్థితిలోని అపసవ్యత పరిపూర్ణను బాధించటం చూస్తాం. (చదువుకుని సన్యాసినులమవుదామా ) పెళ్లాడబోయే పిల్లతో పాటు కట్నంగాను, ఆమె నెలసరి సంపాదనగానూ వచ్చే ఆర్ధిక ప్రయోజనమే భావి అభివృద్ధికి పెట్టుబడిగా చూసే మగవాడి స్వార్ధాన్నిపెంచిన వ్యవస్థాగత దుర్మార్గాన్ని  ఏవగించుకొన్నది. అదే సమయంలో   కట్నం ఇచ్చి పెళ్లి చేసుకొంటానికి సిద్ధపడుతున్న  ఆడపిలల్ల ఆత్మగౌరవ రాహిత్యాన్ని విమర్శించింది. స్వతంత్రంగా భర్తను ఎంచుకొనే చొరవ, కులాంతర వివాహాలకు సంసిద్ధత స్త్రీలలో పెరగాలని ఆశించింది. 

పెళ్లి ఒక్కటే ఆడపిల్ల జీవిత లక్ష్యం కాకూడదని పరిపూర్ణ అభిప్రాయం ( స్వావలంబన సగటు స్త్రీ గమ్యం కావాలి ) అసలు సమస్య పెళ్లి తరువాతనే మొదలవుతుందని. పాలనా పోషణలకు భర్త మీదే ఆధారపడి ఉండటం స్త్రీని హీనం చేస్తుందని సంప్రదాయం , వంశ ప్రతిష్టల ముసుగులో అది నగ్నంగా బయటకు కనబడకపోయినా భర్తకు భార్యపట్ల ఇష్టం తగ్గిన సందర్భాలలో , భర్తలు తాగుడు , జూదం మొదలైన వ్యసనాలకు లోనైన సందర్భాలలో ఆర్ధిక పరాధీనత ఎంత దుర్భరమో తెలిసివస్తుందని కనుక స్త్రీలు స్వయంపోషణ శక్తిని అలవరచుకొనాలని,  సాధికారత సాధ్యమయ్యేది అప్పుడే అని అంటుంది ఆమె. 

మగవాడి  సులభ ఆర్జనకు  కట్నం పెళ్లిళ్లు సామాజిక సమ్మతి పొందిన మార్గం అయినప్పుడు దానికి మరోముఖం  వరకట్నపు  హత్యలు , ఆత్మహత్యలు అవుతాయని పరిపూర్ణ అభిప్రాయపడింది. ( ఇది స్త్రీల అస్తిత్వానికే పెను సవాల్ ) మగవాళ్ళను హంతకులుగా మారుస్తున్న దురాచారం ఎవరికీ పట్టని సమస్య అయితే స్త్రీల ఉనికికే ప్రమాదం కదా అని హెచ్చరిస్తుంది. పెళ్లి వ్యవస్థలో  మగవాడిని పెట్టుబడి సరుకుగా మార్చిన కట్న కానుకల సంప్రదాయం నానాటికీ మరింత విస్తరిస్తూ, ఘనీభవించటానికి రాజకీయాలనుండి విద్యా వైద్య రంగాల వరకు అన్ని సామాజిక రంగాలలో పెచ్చరిల్లుతూ విలువలను నాశనం చేస్తున్న దుర్నీతి అక్రమ ధన ఆకాంక్షల తో ఉన్న సంబంధాన్ని గుర్తించి నిరసించింది రచయిత్రి. పెళ్లి ద్వారా భార్య వైపు నుండి ఈజీ మనీ ని ఆశించే పురుషులను ఇది మీ బతుకు పోరాటపటిమను నశింపచేసేది కాదా ? అని నిలదీసి ఆత్మవిమర్శ చేసుకోమంటుంది. ( మన మహిళలు ఆది నుండి సమిధలే ) 

ఆడ ప్రాణం ఇక్కడ చెల్లని నాణెం  వ్యాసంలోనూ స్త్రీల బ్రతుకులకు విలువలేకుండా చేసిన కట్నపు హింసను నిరసించింది. దానితో పాటు ఆడ శిశువులను హత్య చేయటం దగ్గర నుండి దాంపత్య సంబంధాలలో రెండోతరగతి పౌరురాలి స్థాయిలో స్త్రీలు పడే కనిపించని హింసను, పనిచేసే చోట లైంగిక వేధింపులను  స్త్రీలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలను , స్త్రీ శరీరాన్ని చౌక చేసి అంగడి సరుకుగా మార్చిన వ్యవస్థను,  రక్షణ ఇయ్యవలసిన పోలీసు స్టేషన్లలో , న్యాయం ఇయ్యవలసిన న్యాయస్థానాలలో  ఎదురయ్యే శత్రుపూరిత అనుభవాలను ప్రస్తావిస్తూ  స్త్రీలకు ప్రాధమిక హక్కులు , మానవ హక్కులు నిరాకరించబడ్డాయి అని ఆందోళన ప్రకటించింది. స్వయంశక్తితో బతకటం , అసమానతలకు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం తప్ప విముక్తికి మరొక మార్గం లేదని ఆమె నొక్కి చెప్పింది. 

 2

మానవ సమాజాల ఆవిర్భావ వికాసాల గురించిన పరిపూర్ణ దృక్పథం లౌకిక  సామాజిక సంబంధమైనది. స్త్రీలకు సహజ లైంగిక స్వేఛ్చ , మాతృస్వామ్యం ఉన్న దశ నుండి ఆర్య జాతి రాకతో ఉత్పత్తి వనరుల పై ఆధిపత్యంతో పాటు స్త్రీల పై పురుషుల అధికారం స్థిరపడుతూ వచ్చిందని పితృస్వామ్య వ్యస్థకు జరిగిన పరివర్తన స్త్రీని పురుషుడి కుటుంబానికి లోబరచిందని ‘సామాజిక పరిణామ క్రమంలో మగువ జీవితం’  అనే వ్యాసంలో వివరించింది. దీనినే పురాణేతిహాస కథనాల ద్వారా నిరూపించిన వ్యాసం ‘నీతి నియమాలూ, ధర్మ శాస్త్రాలూ స్త్రీలకు మాత్రమేనా?’ . 

ఈ వ్యాసంలో ఆమె స్త్రీ పురుషుడి ఆస్తిలో భాగంగా పరిగణలోకి వచ్చిన కాలాన్ని ప్రస్తావిస్తూ అది హరిశ్చంద్రుడు చంద్రమతిని అమ్మటంలో కనబడుతుందని అంటుంది. శీలం పాతివ్రత్యం స్త్రీల  విషయం లో అనితర ప్రాధాన్యతను సంతరించుకొనటం రాముడు సీతను అగ్నిప్రవేశం చేయించటంలో , ఆమె శీలం  గురించి ఎవరో ఏమో అనుకొన్నారని అడవులకు పంపటం లో కన బడుతుందని దానికి పరాకాష్ట సతీసుమతి కథ అని అభిప్రాయపడింది పరిపూర్ణ. సతీసహగమనం వరకు పాతివ్రత్య భావాన్ని సాగదీసిన వ్యవస్థను విమర్శిస్తుంది. పురుష సమాజం స్త్రీలకు ప్రత్యేకించి నిర్మించిన విధి నిషేధాల వ్యవస్థకు స్త్రీ సమాజంలో సమ్మతి సాధించబడటం , ఏ ప్రశ్నల లేకుండా    ద్వంద్వ లైంగిక నీతిని ఆమోదించి స్త్రీలు బతికెయ్యటం అసలు విషాదం అని పరిపూర్ణ వేదన పడింది. ఈ ద్వంద్వ లైంగిక నీతి వ్యవస్థ వర్తమానంలో పరువు పేరుమీద ఆడపిల్లల హత్యలకు కారణం అవుతున్నదని 1999 లోనే  సమకాలపు సంఘటనలను ప్రస్తావిస్తూ గుర్తించి చెప్పటం విశేషం.   

ద్వంద్వ లైంగిక నీతి ఎంత ప్రమాదకరంగా పరిణమించిందో ప్రేమ పేరుమీద స్త్రీలపై సమకాలంలో పెరిగిన దాడులను , హింసను ప్రస్తావిస్తూ వివరించింది పరిపూర్ణ ‘ప్రేమోన్మాదులా – కామోన్మాదులా’ అనే వ్యాసంలో. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు అన్ని దశలలో స్త్రీల జీవితంపై సర్వ అధికారాలు మగవాడికి దఖలు పరిచిన వ్యవస్థలో మగాడు తిరక్క చెడ్డాడు; ఆడది తిరిగి చెడింది వంటి ద్వంద్వ విలువలు పురుషుడి విశృంఖలతకు మహిళల కట్టడికి బాగా పనికివచ్చాయని ఆ క్రమంలోనే  యవ్వన దశకు వచ్చిన  మగపిల్లలకు  ఆడపిల్లలకు ఒకరిపట్ల ఒకరికి అనురాగమో ఆకర్షణో సమానంగా కలుగుతాయని అర్ధం చేసుకోలేని , అంగీకరించటానికి ఇష్ట పడలేని సమాజం  పరువు పేరు మీద ఆడపిల్లలను హత్య చేయటానికి వెనుకాడని దశకు చేరుకొనటం, తమ ప్రేమను అంగీకరించలేదని మగపిల్లలు ఆడపిల్లల మీద యాసిడ్ దాడులకు , హత్యలకు తెగించటం జరుగుతున్నదని  పరిపూర్ణ వాదన. ద్వంద్వ నైతిక విలువల సమాజం మగవాడికి ఇస్తున్న ఆధిక్యత , కలిగిస్తున్న అహం ఆడపిల్లలపై హింసకు ఎంతగా కారణం అవుతున్నదో చెప్తుంది పరిపూర్ణ ఈ వ్యాసంలో . 

స్త్రీలపై అత్యాచారాలకు స్త్రీల వస్త్రధారణ రెచ్చగొట్టేదిగా ఉండటమే కారణమని తరచు వినబడే మాట. బాధితులనే బాధ్యులుగా చేసే ఈ వైఖరిని స్త్రీవాదులు ఖండిస్తారు. ఈ విషయంలో నంబూరి పరిపూర్ణ వాదన మరొక కోణం నుండి సాగింది. వ్యక్తి స్వేచ్ఛ ,అస్తిత్వ తపన ఆహ్వానించ దగినవే అయినా పశ్చిమదేశాల నాగరికత మోహంలో పడటం ఏమి సబబు అన్నది ఆమె ప్రశ్న. కార్పొరేట్ రంగం ,సినిమా రంగం రెండూ స్త్రీ శరీరాన్ని పెట్టుబడిగా చేసుకొని ఎదుగుతున్నాయని స్త్రీ జాతి నైతిక సామాజిక సాంస్కృతిక విలువల వినాశనానికి కారణం అవుతున్నాయని ఇతర వ్యాసాలలో కూడా ఆమె ప్రస్తావించింది. ఈ వ్యాసంలో ఆ రెండు రంగాలు స్త్రీల నగ్న , అర్ధ నగ్న దేహాలను  వ్యాపారానికి వ్యాపారానికి ఆకర్షణీయమైన పెట్టుబడిని చేసి ప్రదర్శిస్తుంటే అది దుష్టపు చూపులకు కారణం అవుతున్నదని అటువంటి వస్త్రధారణ అనుకరణ సమాజంలో స్త్రీలపై అత్యాచారాలకు కారణం అవుతున్నదని ఆమె భావించింది. అందుకనే స్త్రీలు శరీరాలను దుష్టుల దృష్టి నుండి జాగ్రత్తగా కాపాడుకొనటానికి ఫ్యాషన్ల పేరు మీద అంగ ప్రదర్శనకు అవకాశమిచ్చే దుస్తులను పరిహరించాలని కోరుకొన్నది.  

3

స్త్రీల జీవితాన్ని సమస్యాత్మకం చేయటంలో మద్యం ప్రధాన పాత్ర వహిస్తున్నదని పరిపూర్ణ గట్టిగా నమ్ముతుంది. స్త్రీజాతికి మేలు చెయ్యాలని జరిగిన సంస్కరణోద్యమాల సత్ఫలితాలను అభావం చేస్తూ ప్రేమ పేరు మీద స్త్రీల మీద జరుగుతున్న దాడులకు , హింసకు స్త్రీ భోగ వస్తువు అన్న భూస్వామ్య సాంఘిక ధర్మం ఎంత కారణమో సామ్రాజ్య వాద దోపిడీ కూడా అంతే కారణమని చెప్తూ మనమిప్పుడు పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం తప్ప అసలైన ప్రజాస్వామ్యంలో లేము అని అభిప్రాయ పడుతుంది ఆమె. ఈ వ్యవస్థ కులాధిక్యత రాజకీయ ఆధిపత్యం కలవాళ్ల అబ్బాయిలను జులాయిలను చేసి స్త్రీల మీదికి వదులుతున్నదని చట్టాలను అతిక్రమించి ప్రవర్తించినా , హత్యలు చేసినా శిక్ష అనేది లేకుండా పోతున్నదని వేదన పడుతూ వ్రాసిన “మహిళాభ్యున్నతి మట్టిపాలు కావలసిందేనా?” వ్యాసం ముగింపులో “ప్రభుత్వం మరింత పట్టుదలతో,అత్యుత్సాహంతో ప్రవేశపెడుతూ ప్రోత్సహిస్తున్న మద్యపాన విధానం  ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించ గలదని నమ్ముదామా ? అని ఒక ప్రశ్న వేస్తుంది  సమస్యలను మరింత తీవ్రతరం చేయటానికే ప్రభుత్వ మద్యం విధానం ఉపయోగపడుతున్నదన్న నిరసన తో కూడిన ధ్వని అందులో వినబడుతూనే ఉంది. 1999 నాటికే ప్రభుత్వ మద్యం విధానం మీద పరిపూర్ణ అభిప్రాయం అది. 

మహిళల బ్రతుకుల్లో మద్యం మంటలు ( 2009) వ్యాసంలో ఆ విషయాన్ని వాచ్యం చేసింది. “ మిగిలిన పాలనా విధానాల మాట అటుంచి, ప్రభుత్వం అమలు చేస్తున్న స్వేచ్ఛా మద్యపాన విధానం స్త్రీల బ్రతుకుల నిండా చేదు నింపుతోంది” మగవాళ్ల తాగుడు కుటుంబంలో ఆడవాళ్ళ మీద హింసను మరింత పెంచటం గురించి చెప్తూ ప్రభుత్వాలు ఏ పార్టీ కి చెందినవయినా మద్యాన్ని కోట్ల ఆదాయపు వనరుగా భావిస్తున్నది తప్ప పేదల కష్టార్జితాన్ని పిండుకొని అది ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తున్నదో చూడటానికి నిరాకరిస్తున్నదని అంటుంది. ఒక వైపు ఏటేటా మద్యం అమ్మకాల టార్గేట్స్ ను రెండింతలు , మూడింతలు పెంచేస్తూ మరొకవైపు మద్యపాన దుష్ఫలితాల గురించి ప్రజలకు బోధించటానికి మద్యపాన వ్యతిరేక కమిటీని వేయటం లోని వైరుధ్యాన్ని గుర్తించి ఏవగించుకొనటం చూస్తాం. వందలాది మద్యం షాపులు, వేలాది బెల్టు షాపులు స్త్రీల బ్రతుకుల్ని వారి సంసారాలను బాగుచేయాటానికేనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది అని సంక్షేమ రాజ్య స్వభావాన్ని కోల్పోతున్న ప్రభుత్వం మీద ఆగ్రహం ప్రకటించింది పరిపూర్ణ. 

యువతరం పరుగు ప్రతిభ వైపా పతనం  వైపా అనే వ్యాసంలోనూ ప్రభుత్వ మద్యం విధానం మీద ఈ ఆగ్రహం కనబడుతుంది. స్త్రీల మీద అత్యాచారాలు పెరగటానికి , హత్యలు జరగటానికి మద్యం మత్తు ప్రధాన కారణం కావటాన్ని నొక్కి చెప్పింది. ఎన్నికల రాజకీయాలలో  ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేవిధంగా మద్యంతో ఓట్లు కొనుక్కొనే పద్ధతి భాగం అయిపోవటం గురించి బాధపడింది.  

4

స్త్రీని గురించి సాటి మనిషి అన్న సంస్కారాన్ని కాక అనుభవానికి అందుబాటులో ఉన్న వస్తువు అన్న  చౌకబారు  భావనను ప్రజలమెదళ్లలోకి చొప్పిస్తున్న సినిమా , టెలివిజన్ వంటి మాధ్యామాల పై పరిపూర్ణ విమర్శనాత్మకంగా స్పందించింది.  బాల్యంలో  ఒక సినిమాలో ప్రహ్లాద పాత్రలో నటించిన పరిపూర్ణ  సినిమారంగ పరిణామాల గురించి ఆసక్తికరమైన పరిశీలనలు చేస్తూ 90వ దశకంలో వ్యాసాలు వ్రాసింది.     ‘వినోదమా  విద్రోహం గానీ’  అనే వ్యాసంలో  సినిమా పౌరాణిక ఇతివృత్తాలతో మొదలై జాతీయోద్యమ కాలంలో ఉదాత్త ఆశయాలతో కూడిన జీవితం  ఇతివృత్తంగా ఎదిగిందని , జానపదాలు, సాంఘికాలు గడిచి ఈ నాడు సినిమా చౌకబారు వినోద ప్రక్రియ గా మారిపోయిందని బాధపడుతుంది. కథలో భాగంగా కాక స్త్రీపాత్రలు అంగాంగ ప్రదర్శనల కోసమే కావటాన్ని గర్హించింది. అసభ్య అశ్లీల చిత్రాలు యువత వక్రమార్గం పట్టటానికి కారణం అవుతున్నాయి అంటుంది. ఇవి  స్త్రీ జాతి విలువను గౌరవ ప్రతిష్టలను మంటగలుపుతూ స్త్రీల మీద అత్యాచారాలకు, హింసకూ కారణం అవుతూ ఉన్నాయి కనుక వీటిని అరికట్టే పోరాటాల అవసరాన్ని నొక్కి చెప్పింది. సినిమాతో పాటు టెలివిజన్ కూడా దీనికి తోడు కావటాన్ని సమాజాన్ని అరాచకంలోకి నెట్టెయ్యటాన్ని విమర్శిస్తూ ‘ మీడియా మాయలో మసిబారుతున్న మనుషులు’ వ్యాసం వ్రాసింది. ‘వెర్రితలలు వేస్తున్న బుల్లి తెర’ వ్యాసంలో ఒకప్పుడు పత్రికలలో వచ్చే నవలలు, కథలు చదువుతూ రేడియో వింటూ  గడిపే   గృహిణుల విశ్రాంతి సమయం ఇప్పుడు బుల్లి తెర చేత ఆక్రమించబడిందని,స్త్రీలమధ్య సదవగాహన, సామరస్యం , సహోదరీత్వం ఏ మాత్రం చూపించని ఇతివృత్తాల సీరియల్స్ జీవితంలో సృష్టించే విధ్వంసం గురించి ఆలోచించాలని హెచ్చరిస్తుంది రచయిత్రి.  టీవీ ద్వారా నట్టింట్లోకి వచ్చి కూర్చున్న అశ్లీల అసభ్య కార్యక్రమాలు కుటుంబ సంబంధాలలో అసహనాన్ని జీవితం గురించిన తప్పుడు దృక్పథాన్ని మెదళ్లలోకి ఎక్కించటం గురించిన ఆందోళన ఇందులో ఉంది

నిజానికి 2001 లో ప్రకటించబడిన మహిళా సాధికారత విధానం సినిమా టీవీ మాధ్యామాలు జండర్ వివక్షను బలపరిచే విధంగా మళ్ళీ మళ్ళీ ప్రవేశపెడుతూ ప్రచారంలో ఉంచుతున్న స్త్రీలకు సంబంధించిన స్టీరియో టైపు ( నమూనా )  పాత్రలు ప్రమాదకరమైనవని గుర్తించి వాటిని రద్దుచేయగల విధానం అభివృద్ధి చేయాలని పేర్కొన్నది. పదిహేనేళ్ళు గడిచినా టీవీలో స్త్రీ పాత్రలకు సంబంధించిన ఈర్ష్యాసూయలు, ఆధిపత్య పెనుగులాటలు, విద్వేషాలు ప్రధానమైన కొత్త నమూనాలు మరింత పెరుగుతూ వచ్చాయి తప్ప పాతనమూనాలను బద్దలు కొట్టే ప్రత్యామ్నాయ  కార్యక్రమాల రూపకల్పనే జరగలేదు. ఈ నేపథ్యంలో వెర్రితలలు వేస్తున్న బుల్లి తెర వ్యాసంలో వ్యక్తమైన రచయిత్రి ఆందోళనను , ఆవేదనను అర్ధం చేసుకోవచ్చు. 

 5

ఆధునిక యుగంలో బ్రాహ్మణీయ  హిందుత్వ ఆధిపత్య సంస్కృతి అన్ని జీవన రంగాలలోకి ఎలా వ్యాపించి ఎటువంటి ప్రభావాలు చూపిస్తున్నదో గమనిస్తూ దాని గురించి  హెచ్చరించటానికి పరిపూర్ణ అనేక వ్యాసాలు వ్రాసింది.  మండల్ కమీషన్ సిఫార్సుల ప్రకారం వెనకబడిన కులాలకు ఉన్నతవిద్యా సంస్థలలో రిజర్వేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ వెల్లువెత్తిన ఉద్యమాలను ప్రస్తావిస్తూ పరిపూర్ణ   ‘పునాదులు బాగుంటే ప్రతిభకు కొదవేంటి?’  అనే వ్యాసం వ్రాసింది. అందులో ఆమె హైందవం ఈ దేశంలో ఒక ప్రత్యేక సాంఘిక సంస్కృతిని పెంచి పోషిస్తున్నదని,   కులీనులు, హీన కులజులు, సవర్ణులు , అవర్ణులు అని ప్రజలను విడగొట్టి  తమ  శ్రమతో సకల సంపదలను సృష్టించి సవర్ణులకు అందిస్తూ వారిని సేవిస్తూ బ్రతకటమే అవర్ణులకు ధర్మంగా చేసిందని పేర్కొన్నది. వెట్టితో , మట్టితో బ్రతికే దళిత బలహీన వర్గాలు మనుషులుగా వ్యక్తులుగా వికసించటానికి భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టబడిన రిజర్వేషన్ విధానాన్నిప్రతిభ పేరు చెప్పి  అంతగా వ్యతిరేకించటం,ద్వేషించటం ఏమి సబబు అన్నది ఆమె ప్రశ్న. కుల నేపథ్యం వల్ల లభించే సామాజిక హోదా ,  ఆర్ధిక ఉన్నత  స్థితి   వున్నవాళ్లు దళిత బలహీన వర్గాల ప్రతిభా సంపాదనకు అవరోధంగా ఉన్న పరిస్థితుల గురించి పట్టింపు లేకుండా మాట్లాడటాన్ని గర్హించింది. అదే సమయంలో దళితులలో ఉన్నత ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు ప్రత్యేక సంపన్న వర్గంగా రూపొంది సామాన్య దళితుల నుండి వేరై పోవటాన్ని గురించి కూడా హెచ్చరించింది. 

బ్రాహ్మణీయ హిందూత్వం దళితులు, ముస్లిముల  ఆహారపుటలవాట్ల మీద, మత విశ్వాసాలమీద నియంత్రణ విధించే నియంత స్వభావాన్ని సంతరించుకొని ఆధిపత్యం చెలాయిస్తున్న సమకాలపు మాత రాజకీయాల  మీద పరిపూర్ణ ఆగ్రహం ‘ఇష్టమైన తిండి- ఇష్ట దైవ దర్శనం చంపి వేయవలసిన నేరాలా?’ (2016) అనే వ్యాసంలో వ్యక్తమైంది.   పూర్వజన్మ కర్మలు, స్వర్గనరక ఊహలు, వందల వేల దైవాలతో మూఢవిశ్వాసాలతో నిండిన తంతులతో కూడిన హిందూ మతం మానవీయత, హేతుబద్ధత కల బౌద్ధాన్ని అణచివేసి దైవం పేరుతో దోపిడీకి దిగటానికి రాజ్యాన్ని సాధనంగా చేసుకున్నదని రాజు దైవంశ సంభూతుడు అన్న నమ్మకాన్ని స్థిరీకరించి ఏక కాలంలో రాజ్యానికి, మతానికి మనుషులు లొంగి ఉండేట్లు తయారు చేసిందని  చారిత్రక అవగాహనతో చెప్పింది. బ్రాహ్మణ నాయకత్వంలో నడుస్తున్న భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలు ఆవు , ఎద్దు మాంసాన్ని వండుకు తినే జనాన్ని వేధించటం, హింసించటం. అన్యమత స్వీకరణను  అడ్డగించటం , అందుకు కారకులని క్రెస్తవ ముస్లిం మత బోధకుల మీద దాడులు చేయటం అన్యాయం అని స్పష్టంగా చెప్పింది. మత స్వీకరణగానీ, ఆహారస్వీకరణ గానీ వైయక్తికమైన ప్రాధమిక హక్కులు , అవి పరిరక్షించాలని అభిప్రాయపడింది. ఆ క్రమంలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయ దళిత విద్యార్థులు ఎద్దుమాంసం తినటాన్ని పండుగలా చేసుకొనటాన్ని సమర్ధించింది. హిందూత్వ పరిరక్షకులు వాళ్ళ మీద దాడి చేసి భీభత్సాన్ని సృష్టించటాన్ని ఖండించింది. హైందవం కుల వివక్షల, అసమానతల నిలయం అని చెప్పటానికి ఆమె సందేహించలేదు. 

అలాగే హిందూమతం లోని కర్మ సిద్దాంత మర్మాన్ని కూడా విప్పిచెప్పింది నంబూరి పరిపూర్ణ ( ఉందోలేదో పాప’కర్మం’ అణచివేతే అసలు మర్మం) మనిషితనకర్మలకు తగిన ఫలితాన్ని పొందటం జరుగుతుందని చెప్పే వాదంలో ఉన్నది ఆ పేరుమీద కొందరిని అణచివుంచి దోపిడీని కొనసాగించటమే అంటుంది ఆమె. అనేక తరాలపాటు ప్రజల మానసిక భౌతిక జీవితాన్ని ప్రభావితం చేస్తూ వస్తున్న కర్మ సిద్ధాంతం మగవారికంటే ఎక్కువ మహిళల అణచివేతకు కారణం ఔతున్నదని,  అసమానతలకు, అన్యాయానికి అణచివేతకు, బతుకు లోని  అవకతవకలన్నిటికీ పూర్వజన్మ కర్మలే కారణమన్న భావం ఆడవాళ్ల భావప్రపంచాన్ని ఏలుతున్నదని  ఆమె అభిప్రాయపడింది. 1997 లోనే ఆమె స్త్రీల ను నియంత్రిస్తున్న మతభావజాల వ్యవస్థను సంబోధించి మాట్లాడటం విశేషం. 

బహుభార్యత్వం భూస్వామ్య రాచరికాల నాటి  వ్యవస్ధ. దానికి మతం దేవుళ్లను ఒరవడిగా తయారుచేసి సమ్మతిని సంపాదించి పెట్టిందని వివరిస్తూ పరిపూర్ణ ‘బహుభార్యాత్వానికి దైవాల ఒరవడి’ అనే వ్యాసం వ్రాసింది. ‘హైందవంలో దళిత మహిళ’(2012)  అనే వ్యాసంలో కులపరమైన అణచివేతకు,  దోపిడీకి కారణమైన హైందవ నీతి , ధర్మ సూత్రాలు పురుష పక్షం వహించి స్త్రీజాతిని క్రూరంగా అణగ దొక్కి బానిసలను చేశాయి  అంటుందామె. ఆర్జన ఉన్నప్పటికీ  దళిత మహిళ ను నడిపించేది కూడా హైందవ మనుధర్మమే అని అభిప్రాయపడింది. కుటుంబంలో పురుషుడి ఆధిపత్యం , హింస దళిత మహిళకు కూడా తప్పటం లేదని, ఏ హిందూ మత ధర్మానికి లోబడి వాళ్ళు జీవిస్తున్నారో  ఆ మతం వాళ్ళను   దేవాలయ ప్రవేశనికి  వెలివేస్తూనే ఉందన్న లోక వాస్తవాన్ని గుర్తు చేసింది. హైందవమే కాదు క్రైస్తవ ఇస్లాం మతాలు కూడా స్త్రీని తక్కువగానే చూస్తాయని అందువల్ల స్త్రీలు, ప్రత్యేకించి దళిత బహుజన మహిళలు మతాల శుష్క బోధనల నుండి, పక్షపాతపు నీతి ధర్మ సూత్రనుండి బయట పడటం కోసం విద్య నేర్చుకోవాలని అభిలషించింది. 

 6

స్త్రీలకు చట్టసభలలో స్థానం కల్పించే చిత్త శుద్ధిలేని పార్టీల పట్ల , ప్రభుత్వాల పట్ల నంబూరి పరిపూర్ణ అసహనాన్ని ప్రదర్శించింది. (మాటల్లో ఘనం చేతల్లో శూన్యం- మహిళా ప్రాతినిధ్యం)  బహుళజాతి కంపెనీలకు సముద్ర  తీర పోర్టులను , కోస్టల్ కారిడార్లను, బాక్సయిట్ గనుల కోసం అడవిని అప్పగిస్తూ మూడుపంటలు పండే భూములను అణువిద్యుత్ ప్రాజెక్టులకు అప్పచెబుతూ ఉన్న ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్యాన్ని, సంక్షేమాన్ని పూర్తిగా అభావం చేస్తున్నాయని సమైక్య పోరాటాలవల్ల తప్ప ప్రజల కనీస అవసరాలు తీరవని  ,ప్రాధమిక పొరహక్కులు అమలు కావని కూడా ఆమె భావించింది. ( ప్రజాస్వామ్యమా -యిది కార్పొరేట్ల రాజ్యామా ). మానవ సంబంధాలు దెబ్బతినటం  , యువతరం చెడిపోవటం, మొత్తంగా సామాజికఆర్ధిక అధికార  రాజకీయ నైతికత తో ముడిపడినవే అన్న అవగాహన ఆమెకు ఉన్నది అని సూచించే ప్రత్యేక వ్యాసాలు- తెగిపోతున్న మానవ సంబంధాలు- వంటివి కొన్ని ఉన్నా నిజానికి ఏ సమస్యను చర్చినా దాని అంతఃసూత్రం అదే కావటం గమనించవచ్చు. 

పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య అయినా స్త్రీ పురుషుల మధ్య అయినా కులాలుగా విడగొట్టబడిన మనుషులమధ్య అయినా  తెగిపోతున్న మానవ సంబంధాలు బలపడటానికి స్నేహ సమానతలు వెల్లివిరిసే ప్రజాస్వామిక దృక్పథం మనుషులకైనా, ప్రభుత్వాలకైనా ఉండవలసిన దేనని  నంబూరి పరిపూర్ణ విశ్వాసం. 

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply