ప్రజాయుద్ద ‘వీరుడు’

పి.చంద్‌ రాసిన వీరుడు నవల కల్పితం కాదు. మన కండ్ల ముందు జరిగిన వాస్తవ చరిత్రకు సజీవ సాక్షం.

23, జూన్‌ 1996లో సింగరేణిలోని శ్రీరాంపూర్‌ ఏరియాలోని నన్పూర్‌కాలనీలో ఒక కార్మికుని ఇంట్లో సింగరేణి కార్మిక సమాఖ్య నాయకుడు రమాకాంత్‌ ఉన్నాడనే సమాచారం తెలిసి వందలాది మంది సాయుధ పోలీసులు చుట్టుముట్టి వేలాది మంది జనం చూస్తుండగానే సాగించిన హత్యాకాండను దాదాపు పదహారు గంటలపాటు విరోచితంగా ప్రతిఘటించాడు. ఇద్దరు పోలీసులు హతమార్చి, మరో ఇద్దరిని గాయపరిచి రమాకాంత్‌ అమరత్వం చెందిన వాస్తవ సంఘటనకు అక్షర రూపం.

తెలుగు సాహిత్యంలో చంద్‌ది ప్రత్యేకమైన స్థానం. ఆయన ప్రజల ఆశలను, ఆకాంక్షలను, ఆరాట పోరాటాలను ఎంతో ఆర్తి, అంకిత భావం, నిబద్దతతో అక్షర బద్దం చేసి కథలు, నవలలుగా అందించారు. ఆయన రచనల్లో ఎక్కువ భాగం ప్రజా పోరాటాలను చిత్రించినవే. ప్రజాఉద్యమాలకు నాయకత్వం వహించిన ఉద్యమకారుల జీవితాలను ఆధారంగా చేసుకొని ఆయన రాసిన నవలలు, ఆనాటి కాలమాన పరిస్థితులను, ఉద్యమాల తీరుతెన్నులను అవగాహన చేసుకోవడానికి ఎంతోగానో ఉపయోగపడుతాయి. మరో మాటలో చెప్పాలంటే ప్రజాఉద్యమాల చరిత్ర సాహిత్యరూపం సంతరించుకొని భావితరాలకు స్పూర్తినిస్తాయి.

విప్లవోద్యమం సామాన్యులను అసమాన్యులుగా చేస్తుంది. సమస్త అన్యాయాలకు, అసమానతలకు వ్యతిరేకంగా, దోపిడి పీడనలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసే యోధులుగా తీర్చిదిద్దుతుంది. ఈ నవలలలోని కథానాయకుడు మాదిరెడ్డి సమ్మిరెడ్డి. పేద రైతు కుటుంబంలో పుట్టిపెరిగిన సామాన్య యువకుడు. గ్రామాల్లో బతుకుతెరువు లేకపోవడంతో పొట్టచేత పట్టుకొని కాలరీ ప్రాంతానికి వచ్చి బొగ్గుగని కార్మికులుగా మారిన వేలాదిమంది యువకుల్లో అతను ఒక్కడు.

గ్రామీణ ప్రాంతంలో భూస్వాములు, దొరల దోపిడీ పెత్తనం ప్రజలను పీల్చిపిప్పి చేసేది. కాలరీ ప్రాంతంలో మేనేజ్మెంటు దోపిడి, బొగ్గుబాయి దొరల ఆధిపత్యం మరోరూపంలో కొనసాగేది. మేనేజ్మెంటుకు వంతపాడే అవినీతిపరులైన జాతీయ కార్మిక సంఘ నాయకులు, కాలరీ ప్రాంతంలో పెచ్చరిల్లి పోయిన గుండాయిజం, ప్రభుత్వ సారాయి దుకాణాలు కార్మికుల మూల్గుల్ని పీల్చేవి. వందల అడుగుల భూమి పొరల లోతుల్లో ఊపిరి ఆడని గర్మిపేసుల్లో గుక్కెడు గుక్కెడు నీళ్లు తాగుతూ శ్రమిస్తారు. తమ రక్తాన్ని నీళ్లు చేసుకొని నిత్యం ప్రమాదాల మధ్య కార్మికులు బొగ్గు ఉత్పత్తి చేస్తరు. అదే కార్మికుని గుడిసెలో మాత్రం ఒక్క కరెంటు బల్బు వెలగలేదు. మురికి కూపాల్లాంటి కార్మికుల బస్తీల్లో కనీస మానవ అవసరాలు నోచుకోక ఏండ్లకుఏండ్లు దుర్భర జీవితం గడిపారు. ప్రజలు బతకలేని పరిస్థితుల నుండే పోరాటాలు పుట్టుకొస్తాయి. ఆ పోరాటాలే సమ్మిరెడ్డిలాంటి సామాన్య మనుషులను అసమాన పోరాట యోధులుగా తీర్చిదిద్దాయి.

ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జగిత్యాల జైత్రయాత్ర మీదుగా వీచిన విప్లవగాలులు బొగ్గు గనుల్లో అగ్గిరాజేసింది. అంతవరదాక
భయంభయంగా బతుకుతున్న కార్మికులను సంఘటిత పరిచి చైతన్యవంతుల్ని చేసింది. తమ సమస్యలపై తామే పోరాడే యోధులుగా
చేసింది. ఆ క్రమంలోనే విప్లవ కార్మిక సంఘమైన ‘సింగరేణి కార్మిక సమాఖ్య’ ఆవిర్భవించింది. దాదాపు పాతిక సంవత్సరాలు తమ సమస్యలపైన మాత్రమే కాకుండా మద్యపాన వ్యతిరేక పోరాటం వంటి అనేక సామాజిక సమస్యలపై విరోచిత పోరాటాలు చేసి విజయం సాధించారు. వెజుబోర్డు వంటి జాతీయస్థాయి సమస్యల సాధన కోసం సుదీర్ఘ సమ్మె పోరాటం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వెన్నులో వణుకు పుట్టించారు. ఒక్కమాటలో చెప్పాలంటే సికాస ఈ తలకిందుల సమాజాన్ని చక్కదిద్దె ప్రయత్నం చేసింది. అయితే ఈ పోరాటాలు, విజయాలు ఏవీ కూడా అయాచితంగా రాలేదు. నిత్యనిర్భంధాలను ఎదుర్కొంటూ దాదాపు వందమంది అమరుల త్యాగాలతో భారత కార్మికోద్యమ చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టించారు.

ఈ మొత్తం పరిణామక్రమమే సమ్మిరెడ్డిని సికాస నాయకుడిని చేసింది. ప్రభుత్వం కాలరీ ప్రాంతంలోకి సకల సాయుధ బలగాలను దింపి సికాసను లీగల్‌గా పనిచేయనియ్యకుండా చేసిన సందర్భంలోనే సమ్మిరెడ్డి తన భార్యపిల్లలను వదిలి అజ్ఞాత జీవితంలోకి వెళ్లిపోయారు. ‘అశోక్‌’గా మారి శ్రీరాంపూర్‌ ఏరియా బాధ్యత తీసుకొని ఉద్యమ నిర్మాణం చేపట్టాడు. దాదాపు పదమూడు సంవత్సరాలు తన అజ్ఞాత జీవితంలో వేలాదిమంది పోలీసులు ఆయన కోసం అణువణువు గాలించేది. నిత్య నిర్భంధాల మధ్య చావు అంచున నిలబడి అనేక పోరాటాలకు, వెజుబోర్డు వంటి సమ్మెలకు నాయకత్వం వహించాడు.
రమాకాంత్‌ ఎన్‌కౌంటర్‌ నాటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన ఒక విలేఖరి దృష్టి కోణంలో కథనం సాగుతుంది. ఒకవైపు ఆయన ఎన్‌కౌంటర్‌ జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా వర్ణిస్తూనే మరోవైపు శకలాలు శకలాలు వచ్చే జ్ఞాపకాల రూపంలో విప్లవోద్యమ నేపథ్యాన్ని, సమ్మిరెడ్డి త్యాగమయ విప్లవ జీవితాన్ని ఆవిష్కరిస్తాడు. పోలీసులు చట్టుముట్టగా ఒక ఇంట్లో బందీ అయిన రమాకాంత్‌ చుట్టే కథంతా నడుస్తుంది. మరోవైపు వేలాది జనం తమ ప్రియతమ నాయకున్ని తమ కండ్ల ముందే హత మార్చాలని చూస్తుంటే, తమ చుట్టుముట్టి ఎటుకదలకుండా కట్టడి చేస్తున్న పోలీసులను లెక్కచెయ్యక కసితో, కోపంతో రగలిపోతూ చేసే నినాదాల హోరులో మనం కలిసి పోతాం…పాలకుల ఫాసిస్టు హత్యాకాండను చూసి వణికిపోతాం. కోపంతో మనకు తెలియకుండానే మన పిడికిళ్లు బిగిసిపోతాయి.

విప్లవకారుల మహోన్నత త్యాగానికి, సాహసానికి శిఖరాయమానంగా నిలిచిన రమాకాంత్‌కు విప్లవజోహార్లు.


(వీరుడు నవలకు రాసిన ముందుమాట)


21.12.2023

పుట్టింది వడ్డిచర్ల, జనగామ జిల్లా. నెల్లుట్లలో పెరిగాడు. జనగామలో సదివిన మట్టి పెడ్డ. వరంగల్లు నగరంలో వలస బతుకు మనుగడ. ఉపాధ్యాయ బోధన విద్యలో నల్లబల్ల మీద అక్షరాలకు అభద్ర కూలీ గొంతుకవుతాడు. చాయ్ నీళ్లు లేకున్నా సాహిత్య సాన్నిహిత్యాన్ని కోరుకుంటాడు. కవి, రచయిత, జర్నలిస్ట్, పరిశోధకుడు, అధ్యాపకుడు. ప్రముఖ తెలుగు పత్రికల్లో పాత్రికేయుడిగా పని చేశాడు. ప్రస్తుతం ఉస్మానియా యునివర్సిటీలో 'తెలుగు సాహిత్యంలో చేనేత వృత్తి జీవనచిత్రణ'పై పరిశోధన చేస్తున్నాడు.

Leave a Reply