ప్రగతిశీల సాహిత్యంలో ఉన్న ప్రగతెంత?

ప్రగతిశీల సాహిత్యం డీల్ చేసిన ప్రధాన వస్తువు ఆర్ధిక అసమానతలు. ఆ రకపు తిరుగుబాటు కూడా ఇందులో భాగమే.’పేద వాళ్ళంతొకటి బాధలన్నీ ఒకటి’ అనే  వర్గ తాత్వికతనే పదే పదే పలువిధాలుగా చూపింది.కుల, లింగ,మత, ప్రాంతీయ ఇతివృత్తాల్ని  పట్టించుకోలేదు.ఎక్కడన్నా, ఎప్పుడన్నా పట్టించుకున్న సందర్భాలలో కూడా వాటిని ఆర్ధిక విషయాలుగానే చూపింది.ఆర్ధిక పునాది నుంచి వెలువడిన అంశాలుగా మాత్రమే చిత్రించింది.ఆర్థికానికి అతీతమైన వాటి స్వతంత్ర అస్తిత్వాన్ని గుర్తించ నిరాకరించింది.అగ్రకుల కార్మికుల చేత కూడా అవమానించబడే పీడిత కులాల ప్రత్యేక పీడనను విస్మరించింది.పేద హిందువుల చేతుల్లో కూడా వివక్షకు గురయ్యే ముస్లింల ప్రత్యేక అస్తిత్వాన్ని పట్టించుకోలేదు.పేద మగవాళ్ళూ, శ్రామిక మగవాళ్ళు , చివరికి బిక్షమెత్తే మగవాళ్ళు కూడా స్త్రీల మీద పెత్తనం చూపే పితృస్వామిక వాస్తవికతను సెకండరీ గా చూసింది.బాధితుల్ని పట్టించుకున్నంతగా బాధితుల చేతిలో బాధితుల్ని పట్టించుకోలేదు.పేదరిక ఆధారిత సమస్యల్ని కేంద్రీకరించి వివక్ష, లోకువ తనంలకు చెందిన రక రకాల సమస్యలను సాహిత్యం లోకి తేవడంలో అరకొర ప్రయత్నాలు మాత్రమే చేసింది.

ప్రగతిశీల సాహిత్యానికి బయట , అంటే వామపక్ష, విప్లవ పార్టీ సాహిత్య కూటములకు బయట ఉండి కుల,మతాల వాస్తవికతను గొప్పగా చిత్రించిన కవుల్నీ, రచయితల్నీ  ప్రగతిశీల సాహిత్య విమర్శకులు చిన్నచూపు చూశారు.ప్రయత్నపూర్వక మౌనంతో పక్కన పెట్టారు. హిందూ మతాన్నీ, కుల వ్యవస్థ నీ వైభవీకరించిన విశ్వనాథ సత్యనారాయణ రాసిన సాహిత్యానికి ప్రత్యామ్నాయంగా కుల నిర్మూలనా సాహిత్యాన్ని నిర్మించిన జాషువాను విస్మరించి శ్రీశ్రీనే విశ్వనాధకు ప్రత్యామ్నాయ కవిగా ఈ విమర్శకులు చూపారు.

“ఆ అభాగ్యుని రక్తమునాహరించిఇనుప గజ్జలతల్లి నర్తనము చేయుకసరి బుసకొట్టు నాతని గాలిసోకనాల్గు పడగల హైందవ నాగరాజు” అని డైరెక్టుగా విశ్వనాథ పూజితమైన హిందూ కులవ్యవస్థ ను  తాత్వికంగా ఎండగట్టిన జాషువాను సొంతం చేసుకోవాల్సింది బోయి సెకండ్ రేట్ కవిగా చిత్రించారు. వందల పేజీల సాహిత్య విమర్శను వెలువరించి ప్రతి చిన్న రచయితనీ వదలకుండా విశ్లేషణ కు గురించేసిన కొ. కు.లాంటి వారుకూడా జాషువా గురించి ఎక్కడా మాట్లాడరు. కొ. కు.ల్నీ, రావి శాస్త్రుల్నీ, కా.రా ల్నీ ,చా. సోల్నీ  భుజాలకెత్తుకున్న మార్క్సిస్టు విమర్శకులు వారికి సమాంతరంగా  కుల వాస్తవికతను కథలుగా మలిచిన వారిని పట్టించుకోలేదు.రావిశాస్త్రీ, కా.రా.లు ఆర్ధిక నియతివాద కథలు రాస్తున్న సమయంలోనే కుల సమస్యను ఆధారం చేసుకుని జరుగుతున్న పీడనను చిత్రిస్తూ కొలకలూరి ఇనాక్ గొప్ప కథలు రాశాడు. మరో వైపునుంచి బోయ జంగయ్య కూడా ఇదే దారిలో ముమ్మరంగా రాశాడు.దళిత వాస్తవికతను ఎన్నదగిన కథలుగా, నవలలుగా మలచిన చిలకూరి దేవపుత్ర వున్నాడు.కానీ మన సోకల్డ్ ప్రగతిశీలురికి వీరు కనపడలేదు. వీరి సాహిత్యానికి తగిన గౌరవాన్నిచ్చి విశ్లేషించిన మార్క్సిస్టు విమర్శకులే లేరు. చిక్కనవుతున్న పాట, పదునెక్కినపాట, నిశాని లాంటి దళిత కవితా సంకలనాలు కవిత్వం లో కొత్త ఆకాశాల్ని తెరిచిన సందర్భంలో వాటిని విశ్లేషిస్తూ రాసిన ప్రముఖ ప్రగతిశీల విమర్శకులెవరూ లేరు.స్త్రీవాద కవిత్వాన్ని జ్వాలాముఖి, ఎస్.వి.సత్యన్నారాయణ లాంటి వారు మగ అహంకారం తో కొట్టి పారేశారు. స్త్రీవాద కవిత్వాన్ని నెత్తిన పెట్టుకోగలిగిన చే.రా.దళిత కవిత్వం పట్ల మౌనం వహించడం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ప్రగతిశీలత అనబడేది హైందవత్వాన్ని అంతరంగీకరించుకుని బతుకుతుంది.ఆ ఆచరణ ప్రభావం వారు సృష్టించే సాహిత్యం లో, సాహిత్య విమర్శలో ఇప్పటికీ అందరిలో కాకపోయినా ఎక్కువమందిలో ప్రతిఫలిస్తుంది.

ప్రగతివాద సాహిత్యం హైందవత్వాన్ని అంతరంగీకరించుకుంది అనడం ఎందుకంటే రామరాజ్యమే సామ్యవాదం అని రాసిన వామపక్ష కవులున్నారు. హిందూ దేవుళ్లనీ, వారి ఆయుధాలనీ అభ్యుదయ ప్రతీకలుగా వాడిన శ్రీశ్రీలాంటి కవులున్నారు.వస్తువులో విప్లవాన్ని దట్టించిన విప్లవకవులు శిల్పంలో హైందవాన్ని ఆశ్రయించారు.హిందూ దేవుళ్ళ  ప్రత్యర్థులైన రాక్షసుల్ని అందరిలాగే వీరూ చెడుకూ, విలనిజానికీ ప్రతీకలుగా భావించారు.’చదువుకున్నోనికన్న సాకలన్న మేలే’ అనే బ్రహ్మణవాద భావజాలాన్ని యధాతధంగా స్వీకరిస్తూ గద్దర్ లాంటి వారు రాశారు.ఉపయోగించిన భాషలోనూ హైందవత్వం వదిలించుకోని విప్లవ రచయితలు వున్నారు.

“అల ద్వాపర యుగంలో శంఖ చక్రగదాధారి అయిన వాసుదేవ కృష్ణుడి మీద అక్కసు పెంచుకుని ఓడిద్దామని పుండ్రదేశ పాలకుడైన వాసుదేవుడు నకిలీ శంఖ చక్రగదలు ఉత్పత్తి చేయించుకుని కయ్యానికి కాలు దువ్వాడు.ఫలితం శృంగభంగం.విప్లవ సాంస్కృతికోద్యమానికీ శేషేంద్ర విప్లవ వాగాడంబరానికీ ఇంతే సాపత్యం”
పై పేరా చూస్తే ఏ హిందూవాదో రాసినట్లు అనిపిస్తుంది. కానీ ఇది రాసింది విప్లవ సాహిత్య వైతాళికుల్లో ఒకరైన కె.వి.ఆర్. విప్లవ సాంస్కృతికోద్యమాన్ని  కృష్ణుడితోనూ ,శేషేంద్ర శర్మను పుండ్రదేశ పాలకుడితోనూ పోల్చాడు కె.వి.ఆర్.ఇందులో ఉన్నది హైందవాన్ని జీర్ణించుకున్న ప్రగతిశీలత అని వేరే చెప్పక్కర్లేదు.

అయితే ప్రగతిశీల సాహిత్యం అంతా ఇలాగే ఉందా అంటే లేదనే చెప్పాలి. ఇంకా అలాగే ఉందా.ఏమీ మారలేదా అంటే.మారిందనే చెప్పాలి.ముఖ్యంగా విప్లవ సాహిత్యం దళితబహుజన దృక్పధాల వెలుగులో తనను తాను చెరుగుకునే పనికి పూనుకుంది.దళితబహుజన సాహిత్యాన్ని గుర్తించి విశ్లేషించడం కూడా మొదలయ్యింది.ఈ మార్పు ఆహ్వానించదగినదే కానీ ఇది చాలదు.

కవి, సాహిత్య విర్శకుడు, సామాజిక విశ్లేషకుడు, దళిత బహుజన సాహిత్య ఉద్యమకారుడు. తెలుగు దళిత బహుజ సాహిత్య సిద్ధాంతాన్ని రూపొందించి, పెంపొందించడానికి కృషిచేశారు. 'చిక్కనవుతున్న పాట'(1995), 'పదునెక్కిన పాట'(1996) కవితా సంకలనాలు తీసుకురావడానికి కృషిచేశారు. దళిత బహుజన కవిత్వంలో అంబేద్కరిజం వ్యక్తమైన తీరును విశ్లేషిస్తూ దళిత బహుజన సాహిత్యం దృక్పథం రాశారు. 'The Essence of Dalith Poetry' అనే ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించారు. ఇటీవలే 'కవితా నిర్మాణ పద్ధతులు', 'సామాజిక కళా విమర్శ' అనే పుస్తకాలు ప్రచురించారు. తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు(1995), ఇటీవల కలేకూరి, శంబూక, గిడుగు రామ్మూర్తి అవార్డులు వచ్చాయి.

11 thoughts on “ప్రగతిశీల సాహిత్యంలో ఉన్న ప్రగతెంత?

 1. బ్రాహ్మణ కవుల నీతిని బట్టబయలు చేశారు…
  పరిశోధనాత్మక వ్యాసం రాశారు. అభినందనలు వందనాలు

 2. నిజమే, ప్రగతి వాదులు అగ్ర వర్ణాల సాహిత్యాన్ని చూసిన చూపులో పాక్షికత మీ మాటలతో తేటతెల్లమవుతోంది…. ఈ చూపు నేటి విమర్శకులకు కూడా అవసరం…

 3. లక్ష్మీ నరసయ్య గారు మీ విమర్శను అంగీకరిస్తున్నాను. మీరన్నట్లు ‘ప్రగతిశీల'(మార్క్సియన్ నేపధ్యం గలవారు) వాదులు మరుతూ.. ఉన్నారు. మీ లాంటి వారు అదేపనిగా యింకా కమ్యూనిస్టు లను/ప్రగతిశీల వాదులపై గుప్పించే విమర్శలలో ఒక 50% కులతత్వ, మనుతత్వ, మతతత్వ, కార్పొరేట్ ఊడిగత్వ పాలకులపైకి సంధించాలని ఆకాంక్షిస్తూ

  సి.భాస్కర్రావు,8639195989

 4. అందుకే “ caste is not just division labour , but is division of labourers”… అన్నాడు అంబేద్కర్ మహాశయుడు. వామపక్ష గబ , విప్లవ పార్టీ సాహిత్య కూటములకు బయట ఉండి కుల,మతాల వాస్తవికతను గొప్పగా చిత్రించిన కవుల్నీ, రచయితల్నీ  ప్రగతిశీల సాహిత్య విమర్శకులు చిన్నచూపు చూశారు”… నిజం.
  దైవత్వాన్ని రాక్షసత్వాన్నీ అంగీకరించిన వారు ప్రగతిశీలవాదులూ, వామపక్ష భావజాలవాదులూ ఎలా అవుతారో నాకు ఎప్పటికీ అర్ధం కాదు.

 5. నిజం. అద్భుత వ్యాసం. బడుగు బలహీన వర్గాల ఐక్యతకు ఈ వ్యాసం నిప్పురవ్వ లాంటిదని నా అభిప్రాయం.
  ప్రగతిశీల సాహిత్యంలో ఉన్న ప్రగతి సాంప్రదాయక సాహిత్యానికి కొనసాగింపు మాత్రమే. రాజకీయ ఆర్ధిక అసమానతల పరంగా ఆయా వ్యక్తులు ఎదుర్కొన్న విషయాలను సాహిత్యంలో పేర్కొన్నారు. అదీ తమ సాంప్రదాయక మూలాలను తమకు తెలియకుండానే సాహిత్యంలో ప్రస్థావించారని మీ గొప్ప వ్యాసం ద్వారా అర్ధమవుతుంది. ఈ సాహిత్యంలో “సామాజిక వివక్ష, అంతరాలను ” అంత బలంగా ప్రతిబింభించకపోవడానికి ఏకైక కారణం వారు పీడితులు దుఃఖితులు కాకపోవడమే.
  సంగిశెట్టి శ్రీనివాస్ సార్ ఎప్పుడూ అనే మాట కూడా ఇదే. “గాయపడ్డ వాళ్లే గొంతు విప్పాలని, అన్యాయానికి గురయిన వాళ్లే ప్రశ్నించాలి” అక్షరాలా వాస్తవం.
  “బాధితుల్ని పట్టించుకున్నంతగా బాధితుల చేతిలో బాధితుల్ని పట్టించుకోలేదు.” లోతైన మాట. ఆధునిక సాహిత్య విప్లవాలకు హేతువు కూడా ఈ అంశమే కారణం. ఈ వ్యాసంద్వారా ఇక మీద సాహిత్యంలో మార్పులకు దారి పడుతుందని ఆశిస్తున్నాను. ఇంత మంచి వ్యాసాన్ని అందజేసినందుకు వ్యాసకర్తకు వేదిక నిర్వాహకులకు కృతజ్ఞతలు

 6. సాహత్యంలోను, బయిటా కూడా తరుచూ ఎదురవుతున్న ప్రశ్నే. ఇది ఎప్పుడు ప్రతి మనిషిలో రగులుతుండాల్సిన ప్రశ్న. ఎవరికి వారు విడిపోయి ప్రత్యేక చట్రాల్లో జీవిస్తున్నపుడు ఆచట్రాలను బ్లాస్ట్ చేయడం కంటే గొప్ప పనేముంటుంది. మీదైనా శైలిలో, రీతిలో మీరు ఆ పని చేస్తున్నారు ఎప్పటికప్పుడు సరికొత్త ఆయుధాలతో ముందుకు వెళుతున్నారు. మీకు అభినందనలు. అదే సమయంలో సరికొత్త బంధనాల్లోకి వెళ్ళకుండా ఎరుకలో ఉండటం ప్రధానం అనిపిస్తుంది.

 7. మీ వ్యాసం చదివాక చాలా విషయాలు తెలిసాయి సర్.

 8. మంచి వ్యాసం సర్…సమూహాన్ని చైతన్య పరిచే వ్యాసం .ధన్యవాదాలు సర్

 9. ఆలస్య మైనప్పటికీ అవసరమైన విమర్శనుచేపట్టారు.అభినందనలు

 10. లక్ష్మి నరసయ్య గారు సాహిత్య విమర్శ అనాది సాహిత్యం లో జరుగుతన్న కుట్రలు కళ్ల కు కట్టినట్లు వివరించారు సాహిత్యం మరచిన మూలాలు మరల గుర్తుకు తెచ్చి నవీన విమర్శ కు శ్రీకారం చుట్టి కవులు ను విమర్శ కులకు దిశ నిర్దేశం చేసి నట్టు ఉన్నది

Leave a Reply