పోషవ్వ

అది-1975 ప్రాంతం…
ఉదయం 9 గంటలు కావొస్తున్నది…
అడవుల్లో దాగినట్టుగా ఉన్న పల్లె.
ఆ పల్లెకు సంబంధించిన ఎరుకల వాడలో పిల్లలు, పెద్దలు, ముసలివాళ్లు, ఆడ మగ తేడా లేకుండా ఎవ్వరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. రోజువారీగా అప్పటికే కొందరు స్త్రీలు తమ ఇండ్ల ముందు ఈత కమ్మలు ఆరబెట్టుకుని, అక్కడే బుట్టలు, సిబ్బిలు, చుట్టకుదుర్లు… అల్లకానికి కూర్చున్నారు. మరికొందరు స్త్రీలు అల్లిన పొరకట్టలను ఊర్లో తిరిగి అమ్ముకురావడం కోసం సిద్ధం చేసుకుంటున్నారు. ముసలివాళ్లు పందులకు కుడితి కలుపుతున్నారు.
కొందరు పిల్లలు చేతిలో సత్తుగిన్నెలు పట్టుకొని ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన ఆహారాన్ని అడుక్కురావడం కోసం ఊర్లోకి వెళ్తున్నారు. కొందరు యువకులు పందులను మేపుకురావడం కోసం అడవుల్లోకి బయలుదేరుతున్నారు. ఆడపిల్లలు ఇంటి పనులు చేసుకుంటున్నారు.
పాము కాటుకు, కుక్క కాటుకు, తేలు కాటుకు అక్కడ మందులు కూడా ఇస్తారు, కాబట్టి ఆ తాలూకు ఇంటిముందు ఎవరో కుక్కకాటు బాధితులు హైరానా పడిపోతూ తిరుగుతున్నారు.
చూస్తే…అక్కడ మొత్తం ఓ పదిహేను దాకా ఈత కమ్మల గుడిసెలు ఉన్నాయి. ఓ నాలుగైదు మిద్దెలు ఉన్నాయి. వాటి ముందు మళ్ళీ ఈత కమ్మల కొట్టాలు ఉన్నాయి. వాటితో పాటుగా పెంకుటిండ్లు కూడా ఓ ఐదారు ఉన్నాయి. ప్రతీ ఇంట్లో శ్రామిక సౌందర్యం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నది. కొన్ని ఇండ్ల ముందు మాత్రం ఓ ఇడుపుగూడు కూడా కనిపిస్తున్నది. ఆ గూడుల్లో ఇంటి సంప్రదాయం అనుసరించి ఎల్లమ్మ, పోచమ్మ, బాలమ్మ దేవర్లను నిలుపుకున్న ఆచారం కనిపిస్తున్నది.
వాటన్నిటికి ఒక పక్కగా ఉన్న గుడిసె ముందు, నులక మంచం మీద కూర్చొని ఉంది, ఇరవై ఐదేండ్ల లింగమ్మ. కానీ అందరూ ఆమెను ‘సిన్న పోషవ్వ’ అని పిలుస్తారు. ఆమె ముఖం నిండా ఏదో పోగొట్టుకున్న దిగాలు నిండి ఉంది. ఆమె కూర్చుని ఉన్న మంచం దగ్గరే ఏడెనిమిదేళ్ల ఇద్దరు మగ పిల్లలు సంతోషంగా ఆడుకుంటున్నారు.
‘‘ఏమైంది పోషవ్వా… నిన్న వొచ్చినప్పటి సంది సూత్తన్న. పుంటికూర కట్ట లెక్క వాడిపోయి ఉండవు. పానం మంచిగలేదా?’’ ఎదురు గుడిసె ముందు కూర్చుని కుడితి కలుపుతున్న అరవై ఏళ్ల ఎంకటమ్మ అడిగింది.
లింగమ్మ సమాధానం చెప్పలేదు. కానీ అవునన్నట్టో కాదన్నట్టో తలాడిరచింది.
అంతలోనే –
ఎదురు సందు నుండి చీపురు కట్టలు తలమీద పెట్టుకుని ఊర్లోకి అమ్మడానికి వెళ్తున్న బాలమ్మ లింగమ్మను చూసి ఆగిపోతూ, ‘‘పోషక్కా… ఎప్పుడొచ్చినవు? ఎప్పుడొచ్చిన ఇంటికి వొచ్చి పలకరిస్తుంటివి. ఈ తాప సప్పుడు లేదు… ఆడుకుంటూ పిల్లలైనా వొచ్చేటోళ్లు. ఆళ్ళు గూడ రాలేదు’’ పలకరించింది. ఆమె లింగమ్మకు సమ వయస్కురాలుగా కనిపిస్తున్నది.
బాలమ్మకు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు లింగమ్మ. ఇదివరకు లాగే తలాడిరచింది.
‘‘పానవేమన్న మంచిగ లేదా అక్కా? సుస్తుగనే కనిపిత్తానవ్‌. సర్లే… పండుకో ఇగ. నేను ఊల్లెకుబొయి పొర్కట్టలు అమ్ముకొనొత్త్త్త’’ అంటూ అక్కడినుండి ముందుకు నడిచింది బాలమ్మ.
ఎంకటమ్మ కూడా లింగమ్మతో ఇంకేం మాట్లాడలేదు. కలిపిన కుడితి తీసుకుపోయి పంది గున్నల కోసం పెద్ద అటికెలో పోయసాగింది.
లింగమ్మ అట్లాగే తనలోతాను కృంగిపోతూ అక్కడే అట్లాగే కూర్చుండి పోయింది. కాగా- లింగమ్మ వాళ్ళింటికి నాలుగిండ్ల అవుతల ఉన్న ఇంటి ముందు కూర్చుని పని చేసుకుంటున్న అత్తాకోడళ్ళు లింగమ్మ గురించి జాలిగానో, సానుభూతిగానో మాట్లాడుతున్నారు.
‘‘అవునత్తా… ఆ ఎల్లన్న బిడ్డకు ఓలి కట్టిత్తాన్రట నిజమేనా?’’ ఈత కమ్మల నారతీస్తూనే లింగమ్మను ఒకసారి చూసి అడిగింది, కోడలు పున్నమ్మ. ఆమె వయసు పద్దెనిమిది దాకా ఉన్నాయి.
‘‘అవునంట…’’ సిబ్బి అల్లుతూ చెప్పింది నలభై ఐదేండ్ల అత్త మారెమ్మ.
‘‘రాత్రి ఒంటిగంటకు ఎల్లన్న అల్లుడు వొచ్చి పోషవ్వను పిల్లల్ని పెరికల మీద వొదిలిపెట్టి పోయిండంట. నీ కొడుకు చెంబట్క బొయి వత్తాంటె సూశి మాట్లాడిరడు ’’ చెప్పింది పున్నమ్మ.
‘‘అవునంట… వాడు నాతోటి సుత చెప్పిండు…’’ అని కాసేపు ఆగి- ‘‘పాపం ఆ పిల్ల… పోషవ్వ… నస్కుల సంది జూస్తున్న. ఇంటి ముందు అట్లనే పడివుంది… సగం పీనిగై పొయింది’’ బాధ పడిపోయింది మారెమ్మ.
‘‘అవునత్తా… పాపం పోషవ్వ. పొయి మందలిద్దామన్న సుత మనసొత్తలేదు’’ పున్నమ్మ గొంతులో కూడా బాధ ఎగిసిపడిరది.
‘‘నీకు తెలుసు గద… పోషవ్వోల్ల నాయినమ్మది సుత ఇదే బాధ. ఆల్ల నాయినమ్మ పేరు సుత పోషవ్వనే. ఈ పిల్ల సిన్న పోషవ్వ. ఆమె పెద్ద పోషవ్వ. నాయినమ్మ పేరు బెట్టినందుకు అదే సాలు తగిలినట్టుంది. అయినా పిల్ల పేరు లింగమ్మ . నాయనమ్మ లెక్క ఎర్రగుందని అందరూ ‘పోషవ్వ’ అని పిలువబట్టిండ్రు. ఆల్లమ్మ పేరుతోటి పిలవడం ఎల్లన్నకు అస్సలు నచ్చదు. పెద్ద పోషవ్వను ఎరిగిన జనాలు ఆ పిల్ల పేరును ‘సిన్న పోషవ్వ’ జేసిండ్రు…’’ చెప్పుకొచ్చింది మారెమ్మ.
‘‘అవును. ఆ పెద్ద పోషవ్వ గురించి అందరు చెప్పుకుంటాంటె యిన్న…’’ అంది పున్నమ్మ.
‘‘అది సావసొంటిది. అసొంటి జోలి మన ఇండ్లల్ల ఎక్కువ మాట్లాడొద్దు. నీ పెండ్లయి రెండేండ్లు అయితాంది. కానీ, ఆ జోలి నీతో నేను ఒక్క రోజు సుత పెద్దగ చెప్పలేదు. మనది గాని జోలి మనకు ఎందుకు అని మట్టసం ఉన్న. ఏందోలే… ఆ ఎల్లమ్మ తల్లి దయ ఉన్నంతకాలం మన సుకంగనే ఉంటం. ఎవ్వడో బాడకవ్‌ నాయళ్ళ కండ్లు మండితెనే మన బతుకులు ఆగమైతయి. అందుకే నీకు చెప్తుంట… మనం ఈత బర్గెకు పొయినా, మంది పెండ్లిళ్ళకి బొయినా, పేరంటం బొయినా, పజనం బొయినా, ఆకరికి సావుకుబొయినా నెత్తి నిండ కొంగు కప్పుకునే పోవాల్నని…’’ పనిలో పనిగా తన కోడలికి జాగ్రత్తలు గుర్తుచేస్తూ మాట్లాడిరది మారెమ్మ.
‘‘మొగుడ్ని, పిల్లల్ని వదిలిపోవడం అంటే సావు గాదు అత్తా… సావు కంటె పెద్దదే…’’ బాధ పడిరది పున్నమ్మ.
అంతలో…
ఇంటి ముందు కానుగ చెట్టుకు కట్టివున్న గుడ్డ ఉయ్యాలలో పసికందు ఏడుపు వినబడిరది. పున్నమ్మ వెంటనే తన పని ఆపేసి పరుగున ఉయ్యాల వైపు కదిలింది.
అదే సమయంలో….
‘‘క్కో క్కో క్కో…’’ అంటూ పరిసరాల్లో తిరిగాడుతున్న కోళ్లకు గింజలు వేస్తూ ఇంట్లోంచి బయటకు వచ్చి-
‘‘పోషవ్వ వొచ్చిందా’’ కోళ్లకు గింజలు వేస్తూనే తన కోడలు మారెమ్మను అడిగింది అరవై ఐదేండ్ల ముత్తవ్వ.
‘‘లేదు. ఈ… మన ఎల్లన్న బిడ్డ సిన్న పోషవ్వ గురించి మాట్లాడుతున్నం’’ బదులిచ్చింది మారెమ్మ.
‘‘గట్లనా. నేను ఆ పోషవ్వ వొచ్చింది అనుకుంటి’’ అంటూ అక్కడే కొట్టంలో కూచుని, తన కొంగు తీసి విసురుకోసాగింది ముత్తవ్వ.
‘‘పెద్ద పోషవ్వ రాక రెండేండ్లు అయితాంది. నీ మనువని పెండ్లికి ఆర్నెల్ల ముందు వొచ్చింది. మల్ల రాలేదు…’’ అంది మారెమ్మ.
‘‘అవును. రాక రెండేండ్లు దాటె. ఎట్లుందో ఏమో…’’ తలుచుకుంది ముత్తవ్వ.
‘‘వొచ్చి చేసేది ఏముంది? కొడుకులు మందలిత్తరా? మొగుడు మందలిత్తడా? మనువండ్లు, మనువరాండ్లు ‘అయ్యో మా నాయినమ్మ ఒచ్చింది’ అంటరా?… ఒచ్చి మనసు బాధబెట్టుకుని పోవుడు కంటె రాకపోయేదే మంచిగుంది…’’ మారెమ్మ మాట్లాడుతుంటేనే ఎవ్వరో కుర్రాడు సైకిల్‌ మీద వచ్చాడు.
‘‘మారెమ్మా…! మా తాత చెప్పిండు… పది పెండతట్టలు గావాలె. ఉన్నాయా? ఉంటే మా పసుల దొడ్డి కాడ ఇవ్వండి’’ చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు.
మారెమ్మ ఆలస్యం చేయలేదు. వెంటనే లేచి కొట్టంలో ఒక మూలగా పేర్చివున్న తట్టల్ని తీసుకుని, తలమీద పెట్టుకుని ఊర్లోకి నడిచింది.
అప్పటికి గుడ్డ ఉయ్యాలలో పసిబిడ్డ మళ్ళీ నిద్రలోకి జారిపోతుంటే… నుదుటి మీద ఒకమారు జోకొట్టి, నెమ్మదిగా ముత్తవ్వ వైపు నడిచింది పున్నమ్మ.
పోషవ్వ గురించి తనలో తానే ఏదో గుణుక్కుంటున్నది ముత్తవ్వ.
‘‘అవ్వా…’’ వెళ్లి ముత్తవ్వ పక్కలో కూర్చుంటూ మెల్లగా పిలిచింది పున్నమ్మ.
‘‘బరిగె పని ఒడిశిందా?’’ అడిగింది ముత్తవ్వ.
‘‘ఉంది గానీ… ఒగ శిన్న మాట’’ అంది పున్నమ్మ. ‘ఏ మాట!’ అన్నట్టుగా చూసింది ముత్తవ్వ.
‘‘అవ్వా! పెద్ద పోషవ్వ గురించి నేను ఎప్పుడు అడగలేదు. అడిగే ఔసురం రాలే. ఇప్పుడు సిన్న పోషవ్వ గురించి ఓలి మాట ఇన్నంక, పెద్ద పోషవ్వ కత తెల్సుకోవాలని ఉంది. ఈ మాట అత్తను అడిగితె ‘నీకెందుకు?’ అని మాట్లాడ్తది… అందికెనే నిన్ను అడుగుతున్న’’ అంది పున్నమ్మ.
అందుకు ముత్తవ్వ కాసేపు ఏదో ఆలోచిస్తూ తలాడిరచి- ఆ తర్వాత నెమ్మదిగా విషయంలోకి వస్తూ…
‘‘అవే మనవరాలా! మన ఎరుకలోల్ల సోపతిల ఓలి గురించి కొత్త కత ఏవుంది? సుత ఏవుంది? నా సిన్నతనం సంది ఈ గోసలు జూస్తుండ. ఈ కర్మ నాకు యాడ ఎదురైతదో అని యాడికి బొయినా మొకం దాసిపెట్టుకొని బతికిన. ఆ పెద్ద పోషవ్వ సుత అట్లనే బతికింది. కానీ ఆల్ల సుట్టాలు ఎవ్వరో సత్తె పొయి, దాని సావుకు తెచ్చుకుంది. అప్పట్ల ఆ తెల్లోల్లు, తురుకోల్లు రాజ్యం ఏలినప్పుడు ఓలి బాధలు ఎక్కువ. ఆల్లు పొయినంక సుత ఎక్కువనే. ఇందిరమ్మ రాజ్యం ఒచ్చినంక మెల్లగ తగ్గుకుంట ఒచ్చింది. పూరంగ తగ్గలే. ఎప్పుడు తగ్గుతదో ఏమో…’’ అంటూ మనవరాలు కళ్ళల్లోకి చూస్తూ- ‘‘సర్లే గని సిన్న పోషవ్వ సుత ఏంది? నువూ, మీ అత్త అదే మాట్లాడుతుండరు. నా మనువడు సుత నస్కుల అదే మాట్లాడుతుండె. ఇంతకు ఆడెవ్వడు? పిల్లను యాడ జూసిండు?’’ అడిగింది ముత్తవ్వ.
‘‘ఎవ్వడు… యాడ జూసిండు… ఇవన్నీ తెల్వదవ్వా! కానీ నీ మనువనికి తెల్సి పదిహేను రోజులయ్యింది. సిన్న పోషవ్వను ఇచ్చింది పక్క పల్లెనే గదా… ఆ ఊర్ల దోస్తులు నీ మనువనికి జెప్పిండ్రు. కానీ ఔనో కాదో అని నమ్మలే. నిన్న రాత్రి మొగడు ఒదిలిపెట్టి పొయినంక నిజం అని తెలిసింది’’ చెప్పింది పున్నమ్మ.
‘‘ఒదిలిపెట్టి పోతే నీకు ఎట్లా తెలిసిందే? ఎందుకు ఒదిలిపెట్టి పొయిండో’’ అంది ముత్తవ్వ.
‘‘నీ మనువనితో మాట్లాడిరడు’’ చెప్పింది పున్నమ్మ.
‘‘ఈడ ఎందుకు ఒదిలి పెట్టిండు? ఓలి పంచాయతీ యాడ? ఈడనా? అత్త గారి ఊర్లనా?’’ అడిగింది ముత్తవ్వ.
‘‘ వచ్చే వారం పంచాయితీ ఉందట. ఇష్టం లేక ఒకటే ఏడుత్తాందట. అందుకే వదిలిపెట్టి పొయిండు’’ అంది పున్నమ్మ.
ఆ మాటకు ముత్తవ్వ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్ళు సుడులు తిరిగాయి. చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది.
‘‘పెద్ద పోషవ్వ కత చెప్పవ్వా’’ మళ్ళీ విషయానికొచ్చింది పున్నమ్మ.
ముత్తవ్వ వెంటనే స్పందించలేదు.
కాసేపు అట్లాగే తనలో తాను దుఃఖించింది. అవ్వను చూస్తూ పున్నమ్మ కళ్ళల్లో కూడా నీళ్ళు సుడులు తిరిగాయి.
కాసేపు తర్వాత-
‘‘నాకంటే పెద్ద పోషవ్వ ఐదేండ్లు సిన్నది. నాకు ఇప్పుడు అరవై ఐదేండ్లు. దానికి అరవై ఏండ్లు ఉంటై. ఇద్దరి పెండ్లి ఒక్క నెలల్నే అయ్యింది. అది ఐదేండ్ల పిల్లప్పుడు మనువొచ్చింది. నేను పదేండ్ల పిల్లప్పుడు మనువొచ్చిన. మీ మామ సెంద్రన్న పుట్టిన ఐదేండ్లకు దాని పెద్ద కొడుకు ఎల్లన్న పుట్టిండు. ఇట్లా సిన్నతనం కాంచి నేను అది కలిసి మెలిసి ఉన్నం. మా పిల్లలు సుత కలిసి మెలిసి తిరిగి పెద్దోల్లు అయ్యిండ్రు. బావుల్ల, వాగుల్ల ఈతకు బొయినా, కుందేటి ఏటకు బొయినా, జత గట్టుకుని బోయేటోల్లు. పెండ్లిళ్ళు పజనాలు అయితే దాని సీర నేను, నా సీర అది కట్టుకునేటోల్లం. అట్లాంటిది… ఎవ్వడో ఓలి గట్టి దాన్ని ఎత్తుకపాయె. అది పొయినంక యాడాది వరకు నేను మనిషినే గాలేకపోయిన. నాకు దెయ్యం పట్టిందని మీ మావ నాకు అంత్రాలు కట్టిచ్చిండు. యా దయ్యం లేదు, భూతం లేదు. నాకు నా పెద్ద పోషవ్వ లేదనే బాధ.
పోషవ్వ ఎల్లిపొయిన ఐదేండ్లకు మీ మావ సెంద్రన్న పెండ్లి అయింది. మీ యత్త నాసరిగ పెద్దగాలొత్తె లేశిపొయేటట్టు ఉండె. పెండ్లి నాటికే పదిహేను ఏండ్ల పిల్ల. ఎనకెనుక ఇద్దరు పిల్లలు పుట్టిరి గానీ బతకలే. మూడో కాన్పు నీ మొగుడు. వీడు పుట్టి బతికి బట్ట కట్టినంక నేను పెద్ద పోషవ్వను మర్చిపొయిన’’ అంటూనే మళ్ళీ కండ్ల నీళ్ళు తూడుచుకుంది ముత్తవ్వ.
వింటూ పున్నమ్మ కూడా ఏడుస్తున్నది.
ముత్తవ్వ మళ్ళీ ఆగింది. తనలో తానే ఏడుస్తూ కాసేపు కళ్ళు మూసుకుంది. పున్నమ్మ కూడా మళ్ళీ ప్రశ్నించలేదు. కాసేపటి తర్వాత ముత్తవ్వనే మళ్ళీ చెప్పడం మొదలెడుతూ…
‘‘ముప్పై ఐదేండ్ల కిందటి మాట’’ అంటూ గతంలోకి ప్రవేశించింది.
**
అది-1940 ప్రాంతం…
రాత్రి 12 గంటలు కావొస్తుంది..
ఉరుములు, మెరుపులతో కూడిన వాన కుండపోతగా కురుస్తున్నది.
‘‘ముత్తవ్వా’’ పిలుస్తూ తలుపు తట్టింది ఇరవై ఐదేండ్ల పోషవ్వ.
అప్పటికే నిద్రలోకి జారుకుని ఉన్న ముప్పై ఏండ్ల ముత్తవ్వ పోషవ్వ గొంతు విని వెంటనే వచ్చి తలుపు తీసింది.
ఎదురుగా శోకదేవతలా నిలబడి ఉంది పోషవ్వ.
‘‘ఏమైంది?… ఏమైంది?’’ ఆదుర్దా పడిరది ముత్తవ్వ.
‘‘మీ అన్న నన్ను కొడ్తున్నడు’’ అప్పటికే వాతలుపడిన శరీరాన్ని చూసుకుంటూ భయంగా చెప్పింది పోషవ్వ.
‘‘ఎందుకు? ఏం జేసినవ్‌?’’ పోషవ్వను చేయి పట్టుకుని గుడిసె లోపలికి తోలుకుపోతూ అడిగింది ముత్తవ్వ.
‘‘ఆడెవ్వడో నన్ను మొన్న మా సిన్న తాత సావు కాడ చూసిండట. నేను ఎవరు? ఏంది? తెలుసుకొని ఇయ్యాల ‘ఓలి కట్టిత్త, నీ పెండ్లాం కావాలె’ అని మనిషిని పంపిండు. దీనికి నీనేంజేత్త? వోడు సూడాల్ననే నేను వాని ముంగట తిరిగిన అంటూ సార తాగి ఇష్టం ఒచ్చినట్టు కొడ్తున్నడు’’ అంటూ వల వలా ఏడ్వసాగింది పోషవ్వ.
‘‘అంత మాట అంటాండా? నువ్వు ఎట్లాంటి దానివో తెల్వదా? వత్తడేమో రానీ గట్టిగ అడుగుత. మీ యన్నసుత ఇంట్ల లేడు. పందుల బ్యారానికి బొయిండు. ఉంటె ఇంటికే బొయి అడిగెటోడు’’ అంటూ పోషవ్వ గాయాలను తన చీర కొంగుతో సుతారంగా అదమసాగింది.
‘‘అట్లా ఏం గాదే ముత్తవ్వా… నా మీద ఆయినకు అనుమానం ఏం లేదు.
నేను దూరమై పోతున్నందుకు కడుపులో ఎత తట్టుకోలేక, తాగి గట్ల తిక్క లేపుతున్నడు’’ మొగుడ్ని వెంటనే ఎనకేసుకొచ్చింది పోషవ్వ.
‘‘అంతే గదా. పెండ్లయి ఇరవై ఏండ్ల పొద్దు అయితాంది. కాపురానికొచ్చి పన్నెండు ఏండ్లు. ఇన్నేండ్ల సంది ఎన్నడూ ఒక్క దెబ్బ కొట్టలేదు. వువంటె పానం. పండుగ పూట నిన్ను పుట్టింటికి పంపి సుత ఉండలేడు. అంతేలే. రంది తట్టుకోలేక ఊగిపోతున్నడు…’’ ముత్తవ్వ సుత వెంటనే మాట మార్చింది.
‘‘నాకు నా మొగడు, నా పిల్లలు గావాలె. పైసలు వున్నా లేకున్నా ఇల్లిళ్లు అడక్కతిని బతుకుతం… ఇప్పుడేం జెయ్యాలే… ఎట్ల తప్పించు కోవాలే…’’ పోషవ్వ ఒకవైపు వణికి పోతుంది. మరోవైపు కండ్ల వెంట నీళ్ళు ధారగా కారిపోతున్నాయి. బయట వానతో ఆ కండ్ల నీళ్ళు వానతో పోటీ పడుతున్నాయి.
‘‘నీవు ఇప్పుడు ఏం ఆలోచన జేయొద్దు… బాదవడొద్దు… ఏడువొద్దు… సప్పుడు జెయకుంట పండుకో… పొద్దుగాల ఏదో ఒకటిజేద్దం’’ ఆ సమయానికి పోషవ్వను సముదాయించే ప్రయత్నం చేసింది ముత్తవ్వ.
అయినా పోషవ్వ వినిపించుకోలేదు. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. ముత్తవ్వ కూడా తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది.
**
రెండు రోజుల తర్వాత…
ఉదయం పదకొండు గంటలు కావొస్తున్నది…
ఆ రోజు వాడలో ఎవ్వరు కూడా తమ పనులకు వెళ్ళలేదు. అందరూ తమ పనులు పక్కకు పెట్టి ఉన్నారు. ఇక ఇండ్ల ముందు ఉన్న కొట్టాల్లో పందులు ఆ రోజు కొట్టాల్ని దాటలేదు. ఈత బరిగలు రోజూ ఎండ పొలుపుకు ఆరేయ్యబడేవి. కానీ అవ్వాళ చిన్న చిన్న మోపులు కట్టుకుని ఎక్కడివక్కడ ఉన్నాయి.
వాడకు చివరగా పెద్ద చింత చెట్టుకింద కుల పంచాయితీకి ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. జనాలంటా అక్కడే పోగై ఉన్నారు. బెరుమొంచో (కులపెద్ద), బెరుమొంచారా (పెద్దమనుషుల సమూహం), వరుసగా చెట్టుకింద వేసి ఉన్న మంచాల మీద కూర్చొని ఉన్నారు. వాళ్లతో పాటుగా వాడకు సంబంధించిన ఒకరిద్దరు పెద్ద మనుషులు కూడా కూర్చొని ఉన్నారు. వాళ్ళల్లో ఒకతను బుగ్గ మీసాలతో ఎత్తుగా బలిష్టంగా యాభై ఏండ్ల వయసులో నిగనిగలాడుతూ కనిపిస్తున్నాడు. తెల్లని పంచ చొక్కా ధరించి కిర్రు చెప్పులు తొడుక్కొని భుజాన గొంగడి వేసుకుని పెద్ద రుమాలు కట్టుకుని ముఖం నిండా సంతోషాన్ని పులుముకొని ఉన్నాడు. ఉండుండి మీసాలు దువ్వుకుంటున్నాడు. అక్కడ పోగైన అందరి చూపులు కూడా అతడి మీదే ఉన్నాయి. అతడే… పోషవ్వకు ఓలి కట్టి సొంతం చేసుకోబోతున్న మల్లన్న.
అప్పటికే ఎప్పుడో తాను కూడా అక్కడికి చేరుకొని… కొండంత విషాదంతో శూన్యంలోకి చూస్తూ… పెద్ద మనుషులకు సమీపంలో నిలబడి ఉన్నాడు, పోషవ్వ మొగుడు లింగన్న. తండ్రి పక్కనే నిలబడి ఉన్నారు ముగ్గురు పిల్లలు. పెద్దోడు ఎల్లన్న కు పదేండ్లు. నడిపోడు నాగన్నకు ఎనిమిదేండ్లు. చిన్నోడు బాలన్నకు ఆరేండ్లు. ఆ పిల్లల ముఖాల్లో కూడా తెలియని బాధ తాండవిస్తున్నది. పరిస్థితి అర్థం అవుతుందో లేదో తెలియదు కానీ, చుట్టూ జనాల్ని చూస్తూ ఆ పిల్లలు బిక్కుబిక్కుమంటూ నిలబడి ఉన్నారు.
కుల పంచాయతీ దగ్గర పోగైన జనాలు ఎవ్వరితో ఎవ్వరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదు. చేధించలేని గాంభీర్యమైన వాతావరణం అక్కడ చోటుచేసుకుని ఉన్నది. తరిచి చూస్తే… పిల్లలు, వయసు మళ్ళినవాళ్ళు, ముసలివాళ్ళు తప్ప, వయసులో ఉన్న ఏ ఒక్క స్త్రీ అక్కడ కనిపించడం లేదు.
కాసేపటికి…
ఓ నలుగురు పెద్ద ముత్తయిదువలు పోషవ్వను అక్కడికి తీసుకువచ్చారు. చూస్తుంటే పోషవ్వ పూర్తిగా నీరసించి ఉంది. మొగుడు లింగన్నలాగే ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నది.
పోషవ్వ రాకతో అక్కడ వాతావరణం మరింత గంభీరంగా మారిపోయింది. కొందరు తమలో తామే దుఃఖించడం మొదలెట్టారు. లింగన్న ఉబికి వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటున్నాడు. అందరికీ అతీతంగా మల్లన్న పెదవులపై మాత్రం గర్వంతో కూడిన చిరునవ్వు మెరిసింది.
ఆ బరువెక్కిన క్షణాల మధ్య అందర్నీ ఒకమారు కలియజూస్తూ బెరుమొంచో తన గొంతు సవరించుకుంటూ…
‘‘ఇడాకులు గావాలె అనేది ఓలి కడ్తున్న వారి కోరిక’’ పెద్దగా పలికాడు.
జనాలు ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. కానీ బెరుమొంచారా సమూహం నుండి ఒకరు కల్పించుకుంటూ ‘‘కానిద్దాం’’ అన్నాడు.
నెమ్మదిగా పెద్దమనుషులు అందరూ లేచి నిలబడ్డారు. బెరుమొంచో ముందు నడవగా లింగన్న, పోషవ్వ, మల్లన్న సహా జనాలు ఒక సమూహంలా అతడి వెనకాల నడిచారు. అందరూ వాడ చివరగా ఉన్న వేపమాను వద్దకు వెళ్లారు. బెరుమొంచో ఆదేశంతో వేపమాను మీద పసుపు కుంకుమలు పూసి పూలు జుట్టిన గొడ్డలితో మూడు గాట్లు వేసాడు లింగన్న. అంతే! పెద్దమనుషుల సాక్షిగా… జనం సాక్షిగా… ప్రకృతి సాక్షిగా లింగన్న పోషవ్వలకు విడాకులు జరిగినట్టుగా నిర్ణయం అయ్యింది. ఆ విషయాన్ని నిర్ధారిస్తూ….
‘‘పోషవ్వ లింగన్నలకు మొగడు పెండ్లాల బంధం తెగిపొయింది…’’ బెరుమొంచో గొంతు ఖంగు మంది.
మరుక్షణం పోశవ్వ తనకు తెలియకుండానే బిగ్గరగా ఏడవడం మొదలెట్టింది. అదిచూసి లింగన్న తన భుజం మీది షెల్ల తీసుకుని ముఖం దాచుకొని ఎక్కివెక్కి ఏడ మొదలెట్టాడు. తల్లిదండ్రులను చూస్తూ పిల్లలు గుక్కపట్టి ఏడవ సాగారు.
అందరి హృదయాలు బరువెక్కిపోయాయి. కానీ అందరూ కుల సంప్రదాయం ముందు నిస్సహాయులు అయిపోయారు. తర్వాత నెమ్మదిగా అందరూ మళ్లీ బెరుమొంచో వెనకాల వాడ వైపు కదిలారు. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. జనాలు ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. మల్లన్న సంతోషం పట్టరానిదిగా ఉంది. విడిపోలేక లింగన్న పోషవ్వలు మాత్రం దుఃఖ పీడితులై అల్లల్లాడిపోతున్నారు.
చూస్తుండగానే….
బెరుమొంచో ఒక కాగితం మీద మొగుడు పెళ్ళాలతో పాటుగా మల్లన్న వేలిముద్రలు తీసుకున్నాడు. తర్వాత మల్లన్న చేతిలో పోషవ్వ చేతిని ఉంచాడు. ఆ సమయంలో దుఃఖం మళ్ళీ ఏరులై పారింది. అదంతా దిగాంతాల్లో కలిసిపోతూనే ఉంది.
బెరుమొంచో తన బాధ్యత నిర్వర్తిస్తూ, అందరిని ఉద్దేశిస్తూ…. ‘‘మన ఎరుకల జాతిల మన తాత ముత్తాతల కాలం నుండి ఓలి సంప్రదాయం రెండు తీరుల ఉన్నది. పెండ్లిల్లలో పిల్లగాని తరుపున నచ్చిన పిల్లకు ఓలి ఇచ్చి , సంబంధం గట్టి జేసుకుంటరు. ఓలి ఇచ్చుకున్నంక రూకమాడుతరు. గట్లనే నచ్చిన ఆడిది పెండ్లాం అయినా సుత తప్పు లేకుంట ఓలిగట్టి సొంతం చేసుకుంటరు. పెద్దమనుషుల మధ్య ఒప్పందం చేసుకొని నచ్చిన ఆడదాన్ని ఎంట తీసుకొని పోతడు. ఈ ఓలిగట్టినంక ఆమె అతడికి భార్య లెక్కనే ఐతుంది. ఇప్పుడూ ఇదే జరిగింది. పోశవ్వ ఇప్పుడు లింగన్న పెండ్లాం కాదు. ‘సెటిల్మెంట్‌ పద్ధతి’లో తెల్లదొరల ఆజ్ఞ ప్రకారం స్టువర్టుపురం పోలీస్‌ ఠానాల పనిచేస్తున్న మల్లన్నకు రెండో భార్య. ఇందుకు గానూ మల్లన్న లింగన్నకు అచ్చరాల ఇరువది రూపాయలు చెల్లించిండ్రు.
మల్లన్న ఇష్ట ప్రకారం పోషవ్వను కోరుకున్నడు. కానీ పోషవ్వ లింగన్నలకు పుట్టిన సంతానాన్ని మల్లన్న ఒప్పుకోట్లేడు. పిల్లల బాధ్యత లింగన్న చూసుకోవాల్సి ఉన్నది. ఇందుకుగానూ మరో పది రూపాయలు అదనంగా లింగన్నకు మల్లన్న ద్వారా చెల్లించారు….’’ చెప్తూ, ఒక తెల్లని గుడ్డలో కట్టి ఉన్న మొత్తం ముప్పై రూపాయల నగదును లింగన్న చేతిలో ఉంచాడు.
బాధలన్నీ అక్కడ గడ్డ కట్టుకుపోయిన పరిస్థితిలో… తతంగం మొత్తం ముగిశాక మల్లన్న పోషవ్వ చేతిని పట్టుకొని ముందుకు కదిలాడు. లింగన్న పిల్లలు అక్కడే నిలబడి పోయారు. వెళ్తున్న తల్లివైపు పిల్లలు అసహాయులై చూస్తూ ఉండిపోయారు.
దూరం నుండి…
గుడిసె కన్నంలో నుండి…
జనాల మధ్య కనీకనిపించని పోషవ్వ లింగన్నలను చూస్తూ ముత్తవ్వ ఏడుస్తున్నది. అది చూస్తూ మూలన వున్న అత్తకు అత్తయిన ముసలవ్వ తన బాధను వెళ్లగక్కుకుంటూ…
‘‘ఓలి గట్టినోడు ఇప్పటికే ముసలోడు అయ్యిండు. వోడి మీద వోడి పైసల మీద మన్నుబడా… పోషవ్వ తోటి పిల్లలు ఉన్నరు అంట. ఈసం సెడికోరు ఉయ్యాల కట్టిగిండు… పోషవ్వ బతుకు ఆగమై పాయె…’’ కండ్ల నీళ్లు తూడ్చుకున్నది.
**
పోషవ్వ మల్లన్న వెంట వెళ్లిపోయాక, లింగన్నను రెండో పెండ్లి చేసుకోమని అయినోళ్లు అందరూ చెప్పిచూశారు. కానీ సవతి తల్లి బాధ వొద్దని లింగన్న రెండో పెండ్లి చేసుకోలేదు. తల్లి తండ్రి తానై పిల్లల్ని సాదుకున్నాడు. అట్లా పదేండ్లు గడిచిపోయాయి. ఆ లోపు లింగన్న మానసిక బాధతోనే కాలం చేశాడు. పెద్దోడు ఎల్లన్నకు తండ్రి పోయిన యాడాదిలోపు పెండ్లయింది. మరో ఏడాది తిరిగేలోపు ఆడబిడ్డ పుట్టింది. అందరూ ‘చిన్నపోషవ్వ’ అన్నారు. కానీ ఎల్లన్న ఆ పేరును ఇష్టపడలేదు. తన తండ్రి పేరు కలిసి వచ్చేలా ‘లింగమ్మ’ అని పేరు పెట్టుకున్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో పదేండ్ల తర్వాత ఒకరోజు అనుకోకుండా పోషవ్వ పల్లెకు వచ్చింది. వెంటే ఇద్దరు ఆరేండేడ్ల పిల్లలు ఉన్నారు. కొడుకులు ముగ్గురు ఆమెను పలకరించడానికి ఇష్టపడలేదు.
చేయని నేరానికి కుటుంబానికి దూరమై, బలవంతపు కాపురంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి, బతికే ఒక శాపంగా వెళ్లదీస్తున్న పోషవ్వ ఆ పదేండ్ల కాలంలో బయటకు రాలేకపోయింది. కానీ మల్లన్న కాలం చేయడంతో అతడికి పుట్టిన కొడుకు ను, బిడ్డను తీసుకొని మళ్లీ తన కుటుంబం కోసం వచ్చింది. కానీ అప్పటికే భర్త కాలం చేశాడు. కొడుకులు ఆదరించలేదు. అయినప్పటికీ పోషవ్వ పిల్లలపైన తన మమకారాన్ని తగ్గించుకోలేదు. కనీసం రెండు నెలలకు ఒకసారైనా వచ్చి ముత్తవ్వ ఇంట్లో కూర్చుని, దూరం నుండే తన పిల్లల్ని కళ్ళారా చూసుకుని వెళ్లిపోవడం మొదలెట్టింది. కాలక్రమంలో ముత్తవ్వ మొగుడు ఎవ్వరి ఇంట్లోనో పాము దూరిందని పట్టడానికి పోయి, అదే పాము కాటేసి కాలం చేసాడు. తెలిసిన పనిలోనే తన పెనిమిటి తనువు చాలించడంతో ముత్తవ్వ మనిషి కాలేక పోయింది. అట్లా గాయపడిన ముత్తవ్వకు పోషవ్వ ఒక అలంబన అయ్యింది.
**
‘‘ఇదీ నా పోషవ్వ కత. ఏమైందో… రెండేళ్ల సంది వస్తలేదు… మందలిత్తలేదు. ఎదురుజూసి కండ్లు కాయలు గాస్తున్నై. పోషవ్వ పదేండ్లకు కనబడ్డప్పుడు సంతోసించిన. గుడిసె కూలగొట్టి నా కొడుకు ఇల్లు గట్టినప్పుడు కూడా నేను అంత సంతోసించలేదు. మల్లా ఆ సంతోసం నాకు ఎప్పుడో ఏమో…! ఏది ఎవరి సేతులల్ల లేదు కదా…! ఆ తల్లి ఎల్లమ్మ దయవల్ల ఆ పిల్ల లింగమ్మ బతుకు ఇప్పుడు బాగుండని…’’ గతమంతా చెప్పుకువచ్చి దుఃఖ భారంతో అట్లాగే వెనక ఉన్న గోడకు వెనక్కి జారగిలబడిరది ముత్తవ్వ.
కథ విన్న పున్నమ్మ గుండె కూడా బరువెక్కింది. పూడుకు పోతున్న గొంతుతో ఏం మాట్లాడలేక పోయింది. అయినప్పటికీ నెమ్మదిగా లేచివెళ్ళి ఉయ్యాలలో పడుకున్న తన ఆడబిడ్డను జాలిగానో ప్రేమగానో చూస్తూ ఆప్యాయంగా తలనమరుకుంది.
**
రెండు రోజులు గడిచిపోయాయి.
లింగమ్మ తన అత్తగారింటికి వెళ్ళిపోయింది. వెంటే తల్లిదండ్రులు, చిన్నాన్న చిన్నమ్మలు, కొందరు దగ్గర చుట్టాలు, కులపోళ్ళు వెళ్లారు.
అనుకున్న ప్రకారం పంచాయితీ మొదలయ్యింది. రావాల్సిన అందరూ వచ్చారు. లింగమ్మ మొగుడు యాదయ్య తన ఇద్దరు పిల్లలతో ఒక పక్కగా సమస్తం కోల్పోయిన వాడిలా నిలబడి ఉన్నాడు. లింగమ్మ కూడా పూర్తిగా నిర్వీర్యమై పోయిన మనసుతో జీవశ్చవంలా నిలబడి ఉంది.
‘‘అమాయకుడు మన యాదయ్యకు మంచి తెలివైన పిల్ల దొరికిందని అనుకుంటిమి. ఈడు జోడు మంచిగ కుదిరిందని అనుకుంటిమి. మన దిష్టే తగిలెనో ఏమో…’’
‘‘గద్దొచ్చి కోడి పిల్లను ఎత్తుకపొయినట్టు ఆడెవ్వడో కొంపను ఆగం జేస్తున్నడు. నాలుగు ఎకరాలు పొలం ఉందట. ఎకరం పొలం అమ్మి ఓలి కడుతున్నడట ముసలి ముండాకొడుకు. వానికి ఏం పోయే కాలం ఒచ్చిందో!’’
‘‘లింగమ్మ కంటే పెద్ద పిల్లలు ఉన్నరట ఆనికి’’
బంధువులు అయినవాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
అట్లా కొంత సమయం గడిచింది…
‘‘ఇడాకులకు మర్రి లేదా యాప…’’ కుల పెద్ద అన్నాడు.
అందరూ సిద్ధం అయ్యారు. చెట్టుకు గాటు పెట్టడం కోసం సిద్ధం చేసిన గొడ్డలిని ఓ పెద్దమనిషి తన చేతుల్లోకి తీసుకోబోయాడు. అదే ఉదుటన ఒక్కసారిగా శివంగిలా దూకింది లింగమ్మ.
పెద్దమనిషి అందుకోబోతున్న గొడ్డలి తన చేతుల్లోకి తీసుకొని, ఎత్తి పట్టుకుని శక్తి దేవతలా ఊగిపోవడం మొదలు పెట్టింది. కళ్ళు పెద్దవిచేసి హూంకరిస్తూ ‘‘ఎల్లమ్మరా… నిన్ను వొదిలి పెట్టనురా…’’ అంటూ భీకరంగా అరవడం మొదలెట్టింది.
ఆ భయంకర రూపాన్ని చూసి జనాలు ఎక్కడ వాళ్ళు అక్కడ దూరం తప్పుకోవడం మొదలు పెట్టారు. పెద్ద మనుషులు కూడా దూరం జరిగారు. లింగమ్మను మన సొంతం చేసుకోవాలనుకున్న వాడు కూడా కాళికాదేవి లాంటి లింగమ్మను చూస్తూ అడుగు వెనక్కి వేశాడు.
ధైర్యం చేసి తల్లిదండ్రులు… కొందరు కులపోళ్ళు ఒకరిద్దరు చుట్టాలు మాత్రం అక్కడే నిలబడి, ‘‘శాంతించు తల్లీ శాంతించు… ఏదైనా తప్పు ఉంటే శాంతించు తల్లీ శాంతించు…’’ అంటూ వేడుకోలుగా అరవడం మొదలు పెట్టారు.
పది పదిహేను నిమిషాలు గడిచిపోయినప్పటికీ కూడా లింగమ్మ శాంతించలేదు. అట్లాగే గొడ్డలి ఎత్తి పట్టుకొని మహిషాసురమర్దిని పాప సంహారం కోసం తాండవిస్తున్నట్టుగా బీభత్సం సృష్టించ సాగింది. అక్కడ వేసి ఉన్న మంచాలను కుర్చీలను తెగ నరకసాగింది.
అంతా జరుగుతున్నా కూడా యాదయ్య మాత్రం పక్కకు కదలలేదు. పిల్లల్ని బిగ్గరగా పట్టుకొని అట్లాగే నిలబడి ఉన్నాడు.
‘‘మా ముగ్గురిని నరికేయి తల్లీ… ఈ పాడు బతుకు బతుకుడు కంటె నీ సేతిల సావడం మాకు సంతోసం…’’ అంటూ దీనంగా అర్థిస్తున్నాడు కూడా.
కాసేపటికి…
లింగమ్మ స్పృహ తప్పి కింద పడిపోయింది…
**
వారం రోజులు గడిచిపోయాయి.
లింగవ్వ మెల్లగా కోలుకుంది. చుట్టాలు, కులపోళ్ళు, అయినోళ్లు, ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్లి పోగా తల్లిదండ్రులతో పాటుగా ఒకరిద్దరు అక్కడే ఉన్నారు. ఊర్లో పెద్దమనుషులు ఇంటికి వచ్చారు. వెంటనే ఓ ఐదు మంది పెద్ద ముత్తైదువులను వెంట తీసుకొచ్చారు.
‘‘మన ఊరును… మన పాడిని… మన పంటను కాపాడుతున్న ఎల్లమ్మ గుడికి ఇప్పుడు నీవు పెద్ద దిక్కు… ఆషాడ బోనాలకు తొలి దీపం నీవే బెట్టాలే…’’ అంటూ లింగవ్వ ముఖానికి పసుపు రాసి, ఆఠాణ మందం కుంకుమ బొట్టుపెట్టి, ఆ మాట ఈ మాట మాట్లాడి కాసేపటికి వెళ్ళిపోయారు.
మరో రెండు రోజులు గడిచిపోయాయి. తల్లిదండ్రులతో సహా వచ్చిన బంధువులంతా వెళ్లిపోయారు. అందరూ వెళ్లిపోవడంతో ఇల్లు బోసిపోయింది.
‘‘లింగమ్మా ‘‘ పిలుస్తూ వచ్చాడు యాదయ్య. అతడి పిలుపులో ఇదివరకటిలా ఆత్మీయ భావన లేదు ఏదో తెలియని భక్తి కనబడుతుంది.
రెండు గదుల ఇంటిని జాజుమన్ను, పేడ కలిపిన నీళ్లతో అలికి… లోపల ఇంట్ల గోడల అంచుల వెంబడి సుద్దతో ముగ్గులేస్తున్న లింగమ్మ ఆ పిలుపుకు ఆగి చూసింది.
‘‘పిల్లలు యాడున్నరు?’’ అడిగాడు. ఆ అడగడంలో కూడా ఏదో గౌరవం కనిపిస్తున్నది.
నన్ను మొగుడు కూడా తనలో దేవతను చూస్తున్నాడని లింగమ్మకు అదివరకే అర్థమయిపోయినప్పటికీ మరోసారి కూడా అర్థం అయింది. అయినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా…
‘‘ఎల్లమ్మ గుడి కాడ పగటి ఏషగాళ్ళు కృష్ణ జాంబవంతుల ఆట ఆడుతున్నరట… చూసొత్తమని ఇప్పుడే ఎల్లిరి…’’ ఎప్పట్లా చెప్పింది.
యాదయ్య ఇంకేమీ మాట్లాడలేదు. అక్కడే జొన్నల సంచి మీద మీద కూర్చున్నాడు.
‘‘అయ్యా…’’ ముగ్గు బుట్ట పక్కకు పెడుతూ మెల్లగా పిలిచింది లింగమ్మ.
చూసాడు యాదయ్య.
దగ్గరగా వచ్చింది లింగమ్మ. వచ్చి అటూ ఇటూ చూసి… మొగుడికి మాత్రమే వినబడేట్టు గొంతు తగ్గించి… ‘‘నా గురించి ఏదో అనుకోవద్దు. నాకు ఏ ఎల్లమ్మ పూనలేదు. నా కాపురం నిలబెట్టుకునేందుకు నేను నాటకం ఆడిన… నాకు ఈ ఉపాయాన్ని చెప్పింది ఎవరో తెలుసా? సెప్తా యిను… ఆ రోజు తెల్లారితే కుల పంచాయితీ ఉందని రాత్రంతా మనం ఏడుస్తున్నం… అప్పుడు సిరిశైలం పోతున్న ఒక సామి మన ఇంటికి వచ్చిండు… మూగ సైగలు జేసిండు. నా బాధ తగ్గడానికి నా చెవిలో మంత్రం ఊదిండు… గుర్తుందా….! ఆ వచ్చింది సామీ గాదు సన్యాసి గాదు మా నాయనమ్మ. పోషవ్వ…! మా నాయన ఎల్లన్న, మా సిన్నాయనాలు, తనను రానివ్వరని… నా సంగతి గుర్తెరిగి అట్లా మారు ఏషం వేసుకొని వచ్చింది…’’ గుస గుసగా చెప్తూ పోయింది లింగమ్మ.
నోరేళ్ళ బెట్టాడు యాదయ్య.
‘‘ఈ ముచ్చట ఎవరితోటీ చెప్పొద్దన్నది… కానీ నీవు నన్ను ఎల్లమ్మ తల్లి లెక్క చూస్తున్నవ్‌. అందుకే చెప్పిన…’’ ఈ మాట కూడా అతడికి మాత్రమే వినబడేటట్టు చెప్పింది.
లింగన్న మొఖం ఆనందంతో వికసించింది.
‘‘మా నాయినమ్మ పానం మంచిగ లేదట. అందుకే రెండేండ్ల నుండి మా ఊరు వచ్చి మా నాయినోళ్ళను సుత సూత్తలేదు. ఐనా పానం మొత్తం మా మీద పెట్టుకొని ఉంది. అందుకే మన సంసారం నిలబెట్టింది. ఆరోజు తన సంసారాన్ని నిలబెట్టుకోలేకపోయింది గాని… తన మనవరాలును మాత్రం తానే ఎల్లమ్మ తల్లిలా కదిలొచ్చి కాపాడిరది…’’ చెప్తుంటేనే లింగమ్మ గొంతు గద్గదమైపోయింది. లింగమ్మ ఇక మాట్లాడలేకపోయింది.
కళ్ళ వెంబడి నీళ్ళు జారిపోతుంటే అట్లాగే నిలబడిపోయింది.
అంతా విన్న యాదయ్య ఉప్పొంగిపోయాడు. ఎదలోతుల పారవశ్యం తన్నుకు వస్తుంటే… తన ప్రియమైన భార్య లింగమ్మను అట్లాగే ఆలింగనం చేసుకున్నాడు.

                    **

పదాలకు అర్థాలు :

పొరకట్ట : చీపురు
కుడితి : మిగిలిపోయిన అన్ని ఆహార పదార్థాలను ఒక దగ్గర వేసి పులియబెట్టి, బియ్యం కడిగిన నీళ్లతో కలిపి, పందులకు ఆహారంగా ఇచ్చే పదార్థం.
పుంటికూర : గోంగూర
అటికె : వెడల్పాటి మూత వున్న మట్టి పాత్ర
పెఱిక : గాడిద సహాయంతో బరువులు మోసుకు రావడం
నస్కుల : తెల్లవారు జామున
మట్టసం : మౌనంగా
నాసరిగ : బక్క పలుచగా
ఎనకనుక : వెంటవెంటనే
బెరుమొంచో : కులపెద్ద
బెరుమొంచారా : కుల పెద్ద వెంట ఉండే ఇతర పెద్ద మనుషుల సమూహం.
కొట్టం : పాక లేదా గూడు
పొలుపు : నీరెండ లేదా పొద్దుటే వచ్చే లేత కాంతి
రూకమాడ : నిశ్చయ తాంబూలాలు
సెటిల్మెంట్‌ విధానం : బ్రిటిష్‌, నిజాం కాలాల్లో ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో సంచార జీవులుగా బతుకుతున్న ఎరుకలి వాళ్ళ ‘కుర్రు’ భాషను విని అదొక రహస్య కోడ్‌ లాంగ్వేజ్‌గా భ్రమపడి, ఎరుకల వాళ్లను గూఢచారులుగా అనుమానించి, ఎక్కడి వాళ్ళు అక్కడ బంధించారు. వాళ్లను జమీందారుల వద్ద, పోలీస్‌ ఠాణాల వద్ద, గ్రామాల్లో పోలీసు పట్వారీల వద్ద, దొరల వద్ద, బందీలుగా ఉంచేవాళ్లు. వాళ్ళను ఖాళీగా ఉంచకుండా వివిధ వృత్తి పనుల్లో శిక్షణ ఇప్పించేవాళ్ళు. ఈ విధంగా ఎరుకల తెగలకు సంబంధించి 1912లో ‘సెటిల్మెంట్‌ విధానం’ ఆరంభమైంది. ఈ పద్ధతిలో కొందరు ఎరుకల వాళ్ళు దొరలకు పోలీసులకు బానిసలుగా మారిపోయి కొంతవరకు స్వేచ్ఛ పొందారు.

ఈసం సెడికోరు : ఉయ్యాల కట్టిగిండు. ఇది ‘కుర్రు’ భాషలో ఉన్న సామెత. ఈత చెట్టుకు ఉయ్యాల కట్టినట్టు అని అర్థం.

పేర్లు :
పున్నమి రోజు పుట్టే పిల్లలకు ‘పున్నమ్మ’ అని, ఎల్లమ్మ దేవత పేరు మీద ‘ఎల్లమ్మ’, ‘ఎల్లయ్య’ అని పేర్లు పెట్టేవాళ్ళు. ‘ఈదమ్మ, ‘ఆదెమ్మ’, ‘మారెమ్మ’, ‘ముత్తమ్మ’ అనేవి కూడా దేవర్ల పేర్లు. తాత ముత్తాతల పేర్లు పెట్టేటప్పుడు కూడా ‘ముత్తవ్వ’ అని పేరు పెట్టుకుంటారు. అట్లాగే తమ ఇంట్లో పుట్టిన పంది గున్నలకు కూడా ఎరుకల వాళ్ళు తమ ఇష్టదైవాళ్ళ పేర్లు మనుషులతో సమానంగా పెట్టుకుంటారు. పశువులు కుటుంబ సభ్యులతో సమానం అన్నట్టుగా… వాళ్ళ ఇంట్లో పుట్టిన పంది గున్నలను కూడా వాళ్ళు పసిపిల్లల లాగే ప్రేమిస్తారు. వాటికి కొన్ని కుటుంబాల్లో బారసాలలు కూడా నిర్వహిస్తారు.

కవయిత్రి, కథా రచయిత, విమర్శకురాలు, పరిశోధకురాలు. పూర్వ పాలమూరు జిల్లా ఆత్మకూరులో పుట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ.(తెలుగు సాహిత్యం) చదివారు. పీఎచ్‌డీ పరిశోధన చేశారు. రచనలు : ఇప్పటి వరకు 10 నవలలు, 70 కథలు, వందలాది వ్యాసాలు, కవితలు రాశారు. అవార్డులు : 1. తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించే ‘కీర్తి పురస్కారాన్ని 2015 సంవత్సరానికి సంబంధించి ‘వాసిరెడ్డి రంగనాయకమ్మ’ స్మారక అవార్డు (నవలా విభాగంలో) పొందారు. 2. తెలంగాణ సారస్వత పరిషత్తు నుండి ధర్మనిధి పురస్కారం. పాకాల యశోద రెడ్డి అవార్డు (2023). ప్రస్తుత నివాసం హైదరాబాద్‌.

 

 

Leave a Reply