పోరాట బావుటా… పాల్గుణ

అమరుల బంధు మిత్రుల సంఘం పద్మకుమారి రాసిన ‘పాల్గుణ’ నవలిక కల్పిత ఊహ కాదు. ఆర్ధ్రత నిండిన వాస్తవం. మనుషుల ఉద్రేకాలు, ఉద్వేగాలు, త్యాగాలు, మట్టి పరిమళాలను హత్తుకున్నఉన్నత కార్యాచరణ ఒకవైపు, మరోవైపు రాజ్యం అమానుష అణచివేత, పాలక వర్గాల దుర్మార్గ స్వభావ చిత్రణే ‘పాల్గుణ’. ఒకరకంగా పద్మకుమారి తానుగా తన జీవితాచరణలో చూసిన, కలవరించిన, పలవరించిన మానవీయ సంవేదనే ఈ నవలిక రూపం, సారం.

1977 ఎమర్జెన్సీ తర్వాత 1980 దశకంలో తెలంగాణ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విప్లవోద్యమ నిర్మాణం, రైతాంగ పోరాటాలు, ‘జగిత్యాల జైత్రయాత్ర’ అది విప్లవ వెల్లువల కాలం. దొరలు పల్లెలు విడిచి పట్నాలకు పారిపోయిన సందర్భం. దీంతో దొరల తరపున ప్రభుత్వం విప్లవకారులపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు, ఎన్ కౌంటర్ లు చేసింది. చివరకు కల్లోలిత ప్రాంతాల చట్టం తెచ్చి, పల్లెల మీద ఉక్కు పాదం మోపింది. 1985 కల్లా ఒక భయానక వాతావరణం ఏర్పడింది. రెడ్డి ఆధిపత్య కాంగ్రెసు నుండి NTR నాయకత్వంలో కమ్మ ఆధిపత్య వర్గంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం అధికారం చేపట్టిన కాలం. ఈ దశకంలోనే విప్లవోద్యమం రాజుకున్న పల్లెల పక్కనే ఉన్న సింగరేణ ఉద్యమాలతో అతలాకుతలమైంది. భూస్వాములు, గుండాలు, వడ్డీ వ్యాపారులు దుర్మార్గ వ్యవస్థను విప్లవకారులు ఎదిరించి పోరాడారు. ఈ నవలలోని పాత్రలు (సజీవ) శ్యాం మామ, మల్లేశం మామ, ఇంకా అనేక మంది విప్లవకారులు సింగరేణి కార్మిక సమాఖ్య లాంటి విప్లవకర యూనియన్ నిర్మించి కార్మికులను సంఘటిత పరిచారు. ఉద్యమాలు నిర్మించారు.

నవలికలోని ప్రధాన పాత పాల్గుణది. బెల్లంపల్లి దగ్గరి గొల్లగూడెం. తండ్రి సింగరేణి కార్మికుడు. ఏడుగురు సంతానంలో పాల్గుణ ఐదోవాడు. (ఒక కూతురు ఉంది). పాల్గుణకు సింగరేణిలో ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రితో కలసి బొగ్గుబాయి దగ్గరిలోని మందమర్రిలో ఉండేవాడు. ఇంటి పనుల్లో పాలు పంచుకుంటూనే బొగ్గు బాయిల్లో జరిగే ఆందోళనలో మమేకమయ్యేవాడు. కార్మికుల తలలో నాలుకలా ఉండేవాడు. విద్యార్థి సంఘాల నిర్మాణం, కార్మికోద్యమాల్లో తలమునకలయే వాడు.

ఈ కార్యాచరణను చూసి పాలక వర్గాల కాపలాదారులు పోలీసుల బెదిరింపులు, అరెస్టులు చేసి హింసించేవారు. చివరికి రాత్రికి రాత్రి ఇంటి నుంచి తీసుకెళ్లి(కిడ్నాప్ చేసి)మాయం చేశారు. బిడ్డ బతికున్నాడో, చంపివేశారో తెలియని ఆందోళనకర స్థితిలో తల్లి, సహచరి మణి, బిడ్డ మిత్రులు, కార్మికులు, విప్లవకారుల మానసిక వేదన, దు:ఖం, చంసేస్తే కనీసం చివరి చూపుకైనా నోచుకోనివ్వని రాజ్య దుర్మార్గం నవల చదువుతున్న పాఠకుల గుండెల్లో సుడులు తిరిగే ఆవేదనను నింపుతుంది. కంట నీరు నిండుకుంటుంది. నిజానికి ఆ ముద్దు బిడ్డను కిడ్నాప్ చేసి హత్య చేశారు. కాని ఏం జరిగిందో తెలియని కుటుంబ సభ్యుల వేదన గుండెను పిండే వాస్తవం.

పాల్గుణ అనేది నిజంగా తల్లి దండ్రులు పెట్టిన పేరు కాదు. అది ఉద్యమం పెట్టిన పేరు. పాల్గుణ ఒక వ్యక్తి కాదు. సామూహిక శక్తి. అలాంటి ఎందరో విప్లవకారుల సర్వనామం. సింగరేణి కార్మికోద్యమ చైతన్యం, త్యాగం నూతన మానవావిష్కరణ మార్గం పాల్గుణ.

ఇది మూడు దశాబ్దాల కింది గాధ. ఈ రాజ్య హింస నేటికీ కొనసాగుతూనే ఉంది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులు, ఎన్ కౌంటర్లు కొనసాగుతూనే వున్నాయి. JNU విద్యార్థి నజీబ్ మాయం చేయబడ్డాడు. ఆ తల్లి బిడ్డను ఏం చేశారో తెలియక తల్లడిల్లుతుంది. నవలికను రాసిన పద్మకుమారి, అమరుల జీవితాలు చరిత్రలు కావాలి కదా? వాటి స్ఫూర్తే కదా మనకు కొనసాగింపు మార్గాన్ని చూపేదని, కన్నీటి తడిని, హృదయ వేదనను అమరుల చరిత్రలుగా మలుస్తుంది. పుస్తకం పేజీలు తిప్పివేస్తుంటే వేలి కొసలకు అంటిన తడి కన్నీరుగా ప్రతిఫలిస్తుంది. పాల్గుణ చదువుదాం. మనమేంటో, మాన బాధ్యతేంటో ఎరుక చేసుకుందాం.

సూర్యాపేట. అధ్యాపకుడు. బీఎస్సీ, బీఈడీ. ఎంఏ(తెలుగు సాహిత్యం) చదివారు. ప్రాథమిక విద్య దశ నుండి నాన్నపాఠశాలలో తెలుగు బోధించడం వల్ల తెలుగు సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడింది. కళాశాల దశ నుండీ అభ్యుదయ దృక్పథం కలిగిన వారి పరిచయం వల్ల ప్రగతిశీల సాహిత్యంపట్ల ఆసక్తి. కొన్ని కవితలు, పుస్తక సమీక్షలు రాశారు. అవి అధ్యాపక జ్వాలలో ప్రచురితమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

 

Leave a Reply