పేద, బడుగు జీవితాల ప్రతిబింబాలు “మునికాంతపల్లి కతలు”

సాధారణ జన సమూహాల నుండి వచ్చే కథలలో జీవితం ఉంటుంది. గొప్ప తాత్వికత ఉంటుంది. ఎవరినీ ఆకర్షించలేని ఆ జీవితాలలో నిజం ఉంటుంది. ఆకర్షణ లేని చోట మాత్రమే నిజం ఉంటుంది అన్నది ఒప్పుకోవలసిన నిజం. సొలోమోన్ విజయ్ కుమార్ గారు రాసిన “మునికాంతపల్లి కతలు” మనసు నుండి మనసుకు, మెదడు నుండి మెదడుకు చేరవలసిన ఇతివృత్తాలు. మన చుట్టూ ఉన్నజీవితాలలోని లోతు, నిజాయితీ మాత్రమే మనిషిని మరో మనిషికి దగ్గర చేస్తాయి. ఆ జీవితాలను వదిలిపెట్టి ఎక్కడో కాల్పనిక జగత్తు, ఊహా ప్రపంచంలో విహరించే కథా వస్తువులు కాసేపు ఆనందాన్ని ఇచ్చినా, అవి నిజం కావు అన్న విషయాన్ని మరచిపోనివ్వవు. అది ఒప్పుకోలేక ప్రతి క్షణం ఆ అనుభవాలు నిజం కావచ్చు అన్న భ్రమతో జీవితాన్ని వెల్లదీస్తూ ఉంటారు కొందరు. దీన్ని రొమాంటిజం అంటారు విశ్లేషకులు. రొమాంటిజంలో కూడా ఓ కనీ కనిపించని విషాదం ఉంటుంది. అప్పుడే అది మనసును తాకుతుంది. అంటే జీవితంలో ఒక మనిషిని మరో మనిషితో మానసికంగా జత చేసేది కేవలం విషాదమే. వాస్తవిక జీవితాలను కథా వస్తువులుగా ఎన్నుకునే రచయితలు, అందుకనే విషాదంలో ఓ రోమాంటిజాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ కలయికతో కొన్నిసార్లు “దేవదాసు”, “శ్రీకాంత్” లాంటి పాత్రలు సృష్టించబడ్డాయి. కొన్నిసార్లు “దయానిధి” (చివరకు మిగిలేది), రాంబాబు (రత్తాలు రాంబాబు) లాంటి పాత్రలూ కూడా సృష్టించబడ్డాయి. చే గువేరా అన్నట్లు, “నిజమైన విప్లవకారుడు కూడా గొప్ప ప్రేమ భావాల మార్గనిర్దేశంలోనే నడుస్తాడు” ప్రేమ అనే భావాన్ని తాత్విక దృష్టిలో నిరంతరం దర్శించుకునే ప్రయత్నం చేస్తారు గొప్ప ప్రేమికులు. “మునికాంతపల్లి కతలు” ద్వారా రచయిత తనలోని ఆ గొప్ప ప్రేమను బైటపెట్టుకున్నారు. కొన్ని తరాలుగా అణిచివేతకు గురయిన ఓ వర్గానికి ప్రతినిధిగా, ప్రజా ఆలోచనలో మార్పు దిశగా కృషి చేస్తూ తన జాతి జీవిన సారాన్ని మన ముందుకు గర్వంగా తీసుకువచ్చారు. సాహితీ ప్రపంచంలో రచయిత ఎన్నుకున్న ఈ విప్లవ పంథాను మానవత్వాన్ని అర్ధం చేసుకోగల ప్రతి పాఠకుడు అభినందించి తీరతాడు.

తను రాసిన వాటిని కథలు కావని ఇవి కతలు అని చెప్పుకున్నారు రచయిత. తన ముందు మాటలో “కథ అనే ప్రక్రియను గురించి లాక్షణీకులు ఏవేవైతే చెబుతారో ఆ లక్షణాలను అనుసరిస్తూ ఇవి రాసినవి కావు. ఎందుకంటే జీవితం అనేది ఈ ప్రక్రియనూ అనుసరిస్తూ నడవదు కనుక ప్రక్రియ ఏదైనా జీవితాన్ని, ఆ జీవితం ఎలా ఉందో అలా ఉన్నదాన్ని ఉన్నట్టుగా అనుసరించాలని నా వ్యక్తిగత స్థిరాభిప్రాయం కనుక నేను వీటిని కథలు కావంటున్నాను” అని చెపుతూ “ఫలానా వాడి కత తెలుసునా..? ఆ పిల్ల కత ఇదీ… ! నీ కత నాకు తెలుసులే….! అని ఇలా అనటం అనుకోవటాల్లో అక్కడ ‘కత’ అని అంటుండేది ఒకరి బతుకును ఉద్దేశించి అని తెలుస్తొంది కదా. బుర్ర కథలూ, హరికథలూ అని వ్యవహరిస్తున్నప్పుడు అలా అంటోంది నిజానికి అచ్చంగా కథల్ని అనైతే కాదు కదా, అలాగే ఇవి కూడా కథలు కాని మా పల్లె మనుషుల బతుకుల కతలు”…. అని తన కతలను పరిచయం చేసుకున్నారు. ఈ విశ్లేషణ నాకు వ్యక్తిగతంగా చాలా నచ్చింది. ఈ వాదాన్ని అర్ధం చేసుకుని ఈ కతలు చదవడం ప్రాఠకులకు చాలా అవసరం.

చిన్నప్పుడు మినికాంతపల్లిలో ఆ ఇల్లూ ఈ ఇల్లు పట్టి తిరుగుతుండే రచయితకు తన సమూహం ఇచ్చిన పేరు ‘ఇళ్ళబుచ్చోడు”. ఆ తిరుగుడే తనని ఎందరికో దగ్గర చేసిందని, తనవారిని నిశితంగా గమనించే దృష్టి పెరిగింది, అదే ఈ కతలు ఇలా రావడం వెనుక కారణం అని కూడా రచయిత చెప్పుకున్నారు. తండ్రి విషాద మరణాన్ని, తల్లి కష్టాన్ని అవ్వ చెప్పిన వాన కతగా మనకు చెప్పగలిగే స్థైర్యం వెనుక జన జీవితాలతో వీరు చేసిన ప్రయాణం కనిపిస్తుంది. ఆ కత చూడని వీరి నాన్న శవాన్ని తన చుట్టూ పారుతున్న నీళ్ళ మీద చూస్తున్నట్టు శాశ్వత చిత్రాన్ని వీరి మనసుపై చిత్రించి పోవడమే కాక ఆ చిత్రం మనల్ని కూడా చేరేలా చేయగలిగింది. వ్యభిచారం చేసే దూదేకుల కుసీదా నుండి, సంసారి గ్రేసమ్మ దాకా ప్రార్ధనలు చేసుకోవడాని వచ్చే చర్చీ ఇద్దరినీ ఒకే రీతిలో భక్తులుగా స్వీకరించగలిగే ఆ పాస్టరు మనకు గుర్తుండిపోతారు. బంగారం పని చేసే వారి రాజా వీధికి వెళ్ళి అక్కడ మురికి నీళ్ళను జల్లెడ పట్టి నాలుగైదు బంగాలు నలుసులు దొరికేదాకా ఆ బురదలోనే రోజంతా గడిపి, మధ్య మధ్యలో భార్య బీడి నోటీకి తగిలిస్తూంటే తాగుతూ పని చేసే సెంచయ్య, డాన్సులతోనూ జనాన్ని రంజింప చేయగలడు. అతని డాన్సులలో, స్టేప్పులలో కడుపు నిండిన వారికి బూతు కనిపిస్తే, ఆలోచన ఉన్న మెదళ్ళకు జీవితం కనిపిస్తుంది, సమాజం కనిపిస్తుంది.

అందరి మల మూత్రాలను చేతులతో ఎత్తి దొడ్లు శుభ్రం చేసే సుబ్బులు కూతుర్ని డాక్టర్ని చేయగలిగింది. దేశాటనలో ఆనందాన్ని వెతుకుతూ తిరిగే కాశయ్య లో మనకు ఓ రాహుల్ సాంకృతాయన్ కనిపిస్తాడు. ఊర్లో అన్ని ఇళ్ళు తిరుగుతూ ప్రతి ఇంట్లో తలో ముద్ద అన్నం తినే, సే ముద్దలోడు బ్యాంక్ ఉద్యోగి కాగలిగాడు. తన ఉరికి, పెంచిన తాత కుటుంబానికి దిక్కు అయ్యాడు. చిన్నప్పుడు స్కూలుకు వెళ్ళడానికి ఊరంతా ఏకం చేసిన నాగార్జున దక్షిణాఫ్రికాలోని పెద్ద కంపేనీ ఉద్యోగిగా ఎదగడం, ఈ సంకలనంలో వచ్చే మరో సక్సెస్ స్టోరీ.

తన రోగాన్ని తప్ప మనసును చూడలేని సమాజం నుండి నిష్క్రమిస్తూ గొప్ప ప్రేమికుడిగా నిలిచాడు ఎంగిలోడు, ఇతన్ని ప్రేమించే ఓ తల్లి మనసు, వద్దని వెళ్లిపోయిన మరో స్త్రీ మనసును కూడా ఒకే సారి కతలో చూపుతూ, గొప్ప తాత్వికతను ప్రదర్శించారు రచయిత. పేడకళ్ల దగ్గర వచ్చిన గొడవను గుడిలో రాంభజన దాకా తీసుకెళ్లగలిగే అమాయక లచ్చుం మామ, ఎంగటవ్వలు, ఏడుగురు మనవరాళ్ళ, మనవళ్ళ కడుపు నింపడానికి సద్ది కూడుతోనే ఎంతో మాయ చేయగల పెంచలవ్వని మించిన గొప్ప వంటగత్తె మరొకరుండరేమో. ప్రేమగా పెంచుకున్న కూతురు పసుపు కుంకుమలు పోగొట్టుకుందని తాను కూడా బొట్టు పెట్టుకోవడం మానేసిన గొప్ప తల్లి మనసు ఆమెది. ఉరిలో నగ్నంగా తిరిగే పిచ్చివాణ్ణి దేవునిగా చేసి అతన్ని పూజించే అమాయక మునికాంతపల్లి జనం గురించి మరో కత ఉంది. బాప్టిజం తీసుకుంటే తాను ఇష్టపడే మందుకి దూరం అవ్వాలని బాధ పడుతూ, భార్య నోటికి జడిసి నోరు తెరవని పురుషోత్తం మామ ఆత్మహత్య కళ్లల్లో నీళ్ళు తెప్పిస్తుంది. దీని వెనుక మత రాజకీయం, కుటుంబపు రాజకీయం, సమాజ రాజకీయం కూడా కలిసి పని చేసిన విధానాన్ని రచయిత ప్రెజెంట్ చేసిన తీరు అద్భుతం.

మరో గొప్ప కథ “అడవి పందిని గొట్టే మొనగోళ్ళు” ఆ పందిని వేటాడే విధానం, దానిలో ఆ వేటగాళ్లు చూపే ప్రతిభ ఆశ్చర్యం కలిగిస్తాయి. “దోరంగా దాంకోని పులుల్ని, సింపాల్ని, తుపాకుల్తో గాల్సి, అయ్యి సచ్చినాక వోటి అమ్మిడి నిలబడి ఫోటోలు దియ్యిచ్చుకొనే మారాజులూ, దొరలూ మొనగోళ్ళా? సిమ్మ సీకట్లో కయిల్లో బడి రేతిరంతా లగువులెత్తి, అదుపు తప్పి దానికి సిక్కితే పేణాలు దీసే ఆ అడివి పందిని గొట్టిన ఈ మాలా ఎర్కిలా వొయిసు పిలకాయిలు మొనగోళ్ళా ? ఊరందురి కడుపుల్ని నింపే ఈ అడివి పందుల రోసాలకీ గొప్పతనాలకీ తక్కవేంద్యే??” అని రచయిత వేసిన ప్రశ్నలు అన్ని రకాల అహంకారాలను ఎదుర్కోవడానికి సంధించిన బాణాలు.

స్త్రీ పురుష ప్రేమ ఇతివృత్తంతో మూడు భిన్నమైన కతలు ఈ సంకలనంలో చూస్తాం. పరువు హత్య పేరుతో చనిపోయిన ప్రేమికురాలు బిజిలిని తలచుకుంటూ జీవితాంతం పిచ్చోడై బ్రతికిన రాఘురాం రెడ్డి జీవితం బాధ కలిగిసుంది. అలాగే మాల మాదిగ కులాలకు చెందిన ఈరబాబు ఎస్తర్ల ప్రేమ కత ఆనందం కలిగిస్తుంది. రచయిత ప్రేమించిన ముస్లిం యువతి ఫాతిమాను చివరకు ఊరి కోసం వదులు కోవల్సి రావటం, దీని వెనుక ఉన్న కుల, మత రాజకీయాలు ఆలోచన రేకెత్తిస్తాయి.

కుటుంబం కోసం వ్యభిచారం చేసే సిత్ర అనే ట్రాన్స్ జెండర్ కథ మనసును మెలిపెడుతుండి. బెంగుళురులో ఉద్యోగానికి వెళ్ళి బంగారం పిచ్చిలో మతి తప్పిన మేనమామ కత కూడా కొన్ని సామాజిక, మానసిక కోణాలవైపు ఆలోచన రేకెత్తిస్తుంది. ప్రజలందరినీ భయపెట్టిన మద్రాసు రౌడి పేరును ఉపయోగించుకుని అతన్ని హత్య చేసి ప్రియుడితో పారిపోయిన సెల్వి కథ వింటున్నప్పుడు అసలు మనిషిని మరో మనిషి నిజంగా సంపూర్ణంగా అర్ధం చేసుకోగలడా, మనిషిలోని మంచి చెడులను, కనిపెట్టగలడా అనిపించక మానదు. పిల్లలు లేరని భర్త దగ్గర నరకం చూసి చివరకు ఊరివారందరి మధ్య అవమానాలకు గురయి, అందం, జీవితం, కుటుంబం చివరకు మతి పోగొట్టుకున్న రమణ జీవితంలోని విషాదం, ఎందరో అమాయక స్త్రీల జీవితాలకు ప్రతీక.

ఈ కతలో చాలా సందర్భాలలో తిట్లు, బూతులు వినిపిస్తాయి. కాని వాస్తవిక జీవనాన్ని ప్రతిబింబించేటప్పుడు ఎటువంటి ముసుగు లేకుండా తన పల్లెలోని సంభాషణలను యధావిధిగా రాసారు రచయిత. ఈ బూతులు చదువుతున్నప్పుడు ఇబ్బందిగా అనిపించినా నాలో కొన్ని ఆలోచనలూ కలిగాయి. కడుపు మండినప్పుడు, తెలియని ఆవేశం, మోసం ఎదుర్కున్నప్పుడు, లేదా అహాన్ని పదర్శించేటప్పుడు మనిషి తిట్లను ఆయిధంగా చేసుకుంటాడు. అధికారం లో ఉన్నవాడు తన అధికారాన్ని ప్రదర్శించడానికి తిడితే, మరొకరి అధీనంలో ఉన్నవాడు కడుపుమంట ప్రదర్శించుకోవడానికి తిట్లనే ఆయిధాన్ని వెతుక్కుంటాడు.

కాని గమనిస్తే ఈ తిట్లన్నీ స్త్రీలకు సంబంధించినవి, సెక్స్ కు సంబంధించినవే. స్త్రీ పట్ల అధికారం, సెక్స్ లో మగవాడు ప్రదర్శించే ఆధిపత్యాన్ని అన్ని తిట్లలో గమనించవచ్చు. ఓ పురుషుడు మరో పురుషుడిని తిడుతున్నా, ఓ స్త్రీ మరో స్త్రీని తిడుతున్నా, అధికారం అనే కోణంలోనే ఈ తిట్లన్నీ ఉన్నాయి. బడుగు వర్గాలలోనే కాదు ఉన్నత వర్గాలలో వినిపించే తిట్లలో కూడా కొంత పద మార్పిడి తప్ప స్త్రీ, లేదా సెక్స్ ఇతివృత్తంతోనే అన్ని తిట్లు ఉండడం గమనించినప్పుడు మానవ సమాజంలో సెక్స్ కేవలం పవర్ ప్లేగా ఉందన్నని స్పష్టం అవుతుంది. పాశ్చాత్యులు మాట్లాడే ఇంగ్లీషు భాషలో తిట్లన్నీ కూడా స్త్రీ పురుష సంభోగంలో ఒక వ్యక్తి మరొకరిపై ప్రదర్శించే అధికారం ఇతివృత్తంగా వినిపించేవే. సహజంగా పితృస్వామ్య వ్యవస్థలో పురుషుడే అధికారి కాబట్టి తిట్లన్నీ ఆ పురుషాధిక్య భావజాలంతోనే ఉంటాయి. భర్త చనిపోయిన స్త్రీకి తెలుగులో రెండు పదాలున్నాయి. విధవ, ముండ. గౌరవంగా విధవ అంటే, ఆ రెండో పదాన్ని అందరూ తిట్టుగా ఉపయోగిస్తారు. భార్య చనిపోయిన భర్తను విధురుడు అని అంటారు. ఇది గౌరవంగా సంభోధించేది. తిట్టుగా ఈ పదానికి మరో పర్యాయ పదం లేదు. అంటే ఈ విషయంగా పురుషున్ని తిట్టవలసిన అవసరం లేదు. పురుషున్ని తిట్టాలన్నా అతని తల్లినో చెల్లోనో ప్రస్తావిస్తూ తిట్టడం జరుగుతుంది. ఇది భారతీయ సమాజంలోనే కనిపిస్తుంది. విడో అన్న పదాన్ని ఇంగ్లీషువారు తిట్టుగా ఉపయోగించరు మరి. అంటే తిట్లలో కూడా సాంస్కృతిక, సామాజిక, ఆర్ధిక తేడాలున్నాయి. అలాగే భర్త కాకుండా పరపురుషుడితో శారీరిక సంబంధం కలిగి ఉన్న స్త్రీకి ఓ తిట్టు మన సమాజంలో ఉంది. కాని పురుషుడ్ని తిట్టవలసి వస్తే ఆ పదాన్ని అతని తల్లికి సూచిస్తూ తిడతారు. అతన్ని నేరుగా తిట్టడం జరగదు. ఇది సమాజంలో స్త్రీల స్థితిని సూచిస్తుంది. ఇంగ్లీషులో దీనకి వాడే బిచ్ అన్న పదానికి అర్థం ఆడ కుక్క, లేదా నక్క అని. నక్క జిత్తులు చూపే స్త్రీని బిచ్ అంటారు. అక్కడ స్త్రీ శారీరక సంబంధాల ప్రస్తావన రాదు. కాని అక్కడ కూడా పురుషున్ని తిట్టేటప్పుడు స్త్రీ ప్రస్తావనతోనే తిడతారు. అది గమనించవలసిన విషయం.

మనిషి జీవితంలో సహజ క్రియ అయిన సెక్స్ పట్ల ఎంత చులకన భావం, అధికార భావం దాగున్నాయో అర్ధం చేసుకోవాలంటే ఈ తిట్లను గమనిస్తే చాలు. సెక్స్ చుట్టూ సమాజలోని చాలా వరకు బంధాలు తిరుగుతుంటాయి. మానవ మనుగడకు అది ప్రధానమైన క్రియ. కాని దాని పట్ల గౌరవం మాత్రం మానవ సమాజంలో లేదు. మనుషులు సెక్స్ అనే క్రియలో ఓ భాగస్వామి మరో భాగస్వామిపై అధికారాన్ని చూపడం, లేదా పూర్తి కంట్రోల్ సాధించాననే అహాన్ని ప్రదర్శించడం సాధారణం. దానికి పర్యవసానమే తిట్లలో అన్ని సమూహాలలో, సెక్స్ పరమైన తిట్లే అధికంగా ఉండడం, తాము కోరుకునే అతి పెద్ద ఆనందాన్ని, తాము జీవితంలో పొందాలని కోరుకునే అతి పెద్ద అనుభవాన్ని, మానవ సంబంధాలు, వికారాలు, ఆలోచనలు, రోగాలు, మానసిక సమస్యలు, రుగ్మతలను ఎక్కువ శాతం ప్రభావితం చేయగల ఈ సెక్స్ అనే క్రియ పట్ల ఇంత చులకన భావం మానవ సమాజంలో ఉన్నంత వరకు, స్త్రీ పురుష సంబంధాలలో మార్పు సాధ్యం కాదు. ఈ పుస్తకంలో ప్రతి కథలో ఆప్యాయంగా ఒకరినొకరు సంబోధించుకోవడం నుంచి, కోపాన్ని, అహాన్ని, అభిమానాన్ని, క్రౌర్యాన్ని ప్రదర్శించడం దాకా స్త్రీ, సెక్స్ ముఖ్యమైన విషయంగానే అన్ని తిట్లు ఉన్నాయి. నీళ్ల కుళాయిల దగ్గర స్త్రీల గొడవలు గమనిస్తే, పురుషులతో పాటు ఈ తిట్ల విషయంలో సెక్స్ పట్ల ఆలొచనా పద్దతిలో కూడా స్త్రీలలో ఆ మోటుదనం కనిపిస్తుంది. మన సమాజంలో సెక్స్ ను ఎలా చూడాలి, అనుభవించాలి, సంబోధించాలని చెప్పవలసిన అవసరం ఏనాడు చర్చకు రాకపోవడంలోని విషాదం ఈ కతలలో ప్రతి చోట అనుభవిస్తాం.

“అస్తిత్వవాదం” ప్రస్తుత సాహిత్యంలో ప్రధాన లక్ష్యం కాని కొంత మంది కథకులు దీని వెనుక తమలోని అక్కసును, కోపాన్ని, ఇతరులపై ప్రదర్శించే భాగంగా రచనలు చేస్తుంటారు. వారి కథలలో అణిచివేత పట్ల దుఖం, తరతరాల అన్యాయాన్ని ప్రశ్నిండానికి ఓ గొంతుక ఉంటుంది, కాని వారిలోని వ్యక్తిగత కోపం వారు చెప్పాలనుకున్న విషయాన్ని తేలికపరుస్తుంది. అన్యాయాన్ని ఎదుర్కుని, తమను అన్యాయం చేసిన, చేస్తున్న సమూహాలలూ, ఆలోచనలను, అధికారాన్ని ప్రశ్నిస్తుప్పుడు ఆ గొంతుకలో ఓ స్పష్టత చాలా అవసరం. ఈ స్పష్టతే వారు చేయాలనుకుంటున్న పోరాటానికి పెద్ద ఆయిధం అవుతుంది. ఆ ఆయిధాన్ని బలహీనపరచడానికి శతృ పక్షం వారి వ్యక్తిగత కోపాన్ని టార్గెట్ చేసి విషయాన్ని తేలికపరిచే ప్రయత్నం చేస్తుంది. ఆ అవకాశం లేకుండా చేయడానికి అన్యాయాన్ని ప్రశ్నించే ఆ బలమైన గొంతుకలో ఓ నిబ్బరం, ఆత్మవిశ్వాసం, నమ్మకం, బలం, స్పష్టత ఉండి తీరాలి. వీటితోపాటు వ్యక్తిగత కోపం, స్వార్ధం, కాంక్షలకు ఆ గొంతుక దూరం అవ్వాలి. అప్పుడే అణిచివేతకు ఎదురు నిలివగలిగే ఆ గొంతుకు నాయకత్వ హోదా వస్తుంది. సాహిత్యంలో ఆ హోదా అన్యాయానికి ఎదురు నిలిచి కలం పట్టే ప్రతి రచయితకూ అవసరం. ఈ సంకలనం చదివితే ఆ స్పష్టత ఈ రచయితలో ఉందని అనిపించింది. నిశ్చయంగా ఈ మధ్య కాలంలో నేను చదివిన గొప్ప కథా సంకలనం ఇది. రచయిత ఉపయోగించిన యాస, ప్రాస, బాస అన్నీ కూడా ఎన్నుకున్న కథా వస్తువులకు న్యాయం చేసాయి. మునికాంతపల్లి అన్న పేరు ఆ ఊరు ఒడ్డున ప్రవహించే సువర్ణముఖి నది పేరు ఇప్పుడు మారాయి అట. ఆ ఊరిలో జీవించిన కొందరి వ్యక్తుల నిజ జీవిత కథలు ఈ “మునికాంతపల్లి కతలు”.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

One thought on “పేద, బడుగు జీవితాల ప్రతిబింబాలు “మునికాంతపల్లి కతలు”

  1. “——“అస్తిత్వవాదం” ప్రస్తుత సాహిత్యంలో ప్రధాన లక్ష్యం కాని కొంత మంది కథకులు దీని వెనుక తమలోని అక్కసును, కోపాన్ని, ఇతరులపై ప్రదర్శించే భాగంగా రచనలు చేస్తుంటారు. వారి కథలలో అణిచివేత పట్ల దుఖం, తరతరాల అన్యాయాన్ని ప్రశ్నిండానికి ఓ గొంతుక ఉంటుంది, కాని వారిలోని వ్యక్తిగత కోపం వారు చెప్పాలనుకున్న విషయాన్ని తేలికపరుస్తుంది.——అన్యాయాన్ని ప్రశ్నించే  బలమైన గొంతుకలో ఓ నిబ్బరం, ఆత్మవిశ్వాసం, నమ్మకం, బలం, స్పష్టత ఉండి తీరాలి. వీటితోపాటు వ్యక్తిగత కోపం, స్వార్ధం, కాంక్షలకు ఆ గొంతుక దూరం అవ్వాలి. అప్పుడే అణిచివేతకు ఎదురు నిలివగలిగే ఆ గొంతుకు నాయకత్వ హోదా వస్తుంది. సాహిత్యంలో ఆ హోదా అన్యాయానికి ఎదురు నిలిచి కలం పట్టే ప్రతి రచయితకూ అవసరం. ఈ సంకలనం చదివితే ఆ స్పష్టత ఈ రచయితలో ఉందని అనిపించింది. “”‘

Leave a Reply