కుక్క కొరుకుతోంది… పల్లు అరిగేలా కొరుకుతూనే వుంది…
కొరకడం తప్పు కాదు. కొరికితే పల్లకి మంచిది. దవడలకి మంచి వ్యాయామమే. పల్లూ షార్ప్ అవుతాయి. యాక్టివ్గా వున్నట్టు కూడా.
ఇన్నాళ్ళూ బొమిక విసిరినప్పుడే పరిగెత్తేది. పట్టుకు తెచ్చేది. కొరికి వదిలేసేది. ఆటగా వుండేది. కాని యిప్పుడది అలవాటుగా మారింది. యీమధ్య దానికి పొద్దున్నా సాయంత్రం లేదు. పగలూ రాత్రి లేదు. నిన్నా నేడూ లేదు. అలుపూ సొలుపూ అంతకన్నా లేదు.
బుద్ధిగా కొరుక్కుంటోంది. పిలిస్తే తోక ఆడిస్తుందే తప్ప కొరకడం ఆపడం లేదు. అపరిచితులు వస్తే అప్పుడెప్పుడో అరిచేది. ఇప్పుడు అరవడం కూడా లేదు. దొంగలొస్తే కరవడమూ లేదు. కనీసం మొరగడమయినా లేదు. అప్పటికీ ముడ్డిమీద వొక్కటి వేసినా ‘కుయ్’మని అనడం కూడా లేదు.
ఇదేదో వొక్క కుక్క కతే కాదు. దాదాపు అన్ని కుక్కలదీ అదే పరిస్థితి.
అది కొరుకుతున్న బొమికని తీసి చూస్తే, దానికి మాంసపు రవ్వ- రవ్వంత కూడా అంటి లేదు. నిజం చెప్పాలంటే అది నిజం బొమిక కూడా కాదు. ఆర్టిఫిషియల్ బొమికె. తీసి చూస్తే కొరికీ కొరికీ గరకుగా మొనలు విరిగిన ముళ్ళకర్రలా వుంది. కాని కుక్క నోటినుండి చొంగ కారుతూనేవుంది. అందులో అంతలా నోరూరించేది యేమిటో బోధ పడలేదు. తినాల్సిన ఫుడ్ పెట్టినప్పుడు కూడా యింత ఆశగా ఆబగా తిన్నది లేదు. కొరికింది లేదు. కులికింది లేదు.
తెలీకుండానే యింటిల్లిపాదీ దానికి అటెన్షన్ యిస్తున్నారు అని అర్థమయ్యింది. మీడియా వార్తల్లో ప్రధానమైన వార్త యిదే. ‘కొరుకు- కొరికించు- కొరుకుతూనే వుండు’ అన్నట్టుగా తయారైంది వాతావరణం. కొన్ని కుక్కలు నోటికొచ్చింది కొరికి, చొంగ ధారగా వదిలి చాలా పేరు ప్రఖ్యాతులు గడించాయి కూడా.
చేతిలో బొమిక వుండగానే ముద్దుగా లాక్కొని కొరకడం మొదలు పెట్టింది. బొమికను లాగితే కూడా వదలలేదు. అది పట్టిన పట్టుకి నోట్లోని అరిగిన పల్లు కొన్ని గట్టి పల్లు కొన్ని విరిగి వూడి కిందపడ్డాయి. పల్లూ పసా లేని నోటితో రక్తం కారుతున్నా కొరుకుతూనే వుంది. ‘గుర్ గుర్’మంటూనే వుంది.
దగ్గరగా చూస్తే, ఆ బొమికమీద యేదో రాసివుంది. తినే దాని పేరేమో అని చూస్తే, కాదు. ‘సామాన్లు… చీర కట్టుకుంటే… దరిద్రపు ముండ యిలాంటి బట్టలెందుకు వేసుకు…’ అని వుంది. కొరికేయడంవల్ల చాలా అక్షరాలు చిత్తడి చిత్తడిగా చెరిగిపోయి వున్నాయి. అస్పష్టంగా వున్నాయి.
ఆ బొమికెను తీసి అవతలకు విసిరేస్తే కూడా తిరిగి తెచ్చుకుని కొరుక్కుంటోంది కుక్క.
ఎంతకాలం యిలా? అని అనుకుంటూ వుండగా మరో కొత్త బొమికె దానిముందు పడింది. వెంటనే దాన్ని క్యాచ్ చేసింది. పాతదాన్ని వదిలి కొత్తదాన్ని బరకా బరకా కొరకడం మొదలు పెట్టింది.
బొమికెని దాని పల్లనుండి లాగి పరిశీలనగా చూశాను. దానిమీద ‘కాస్టింగ్ కౌచ్ అదేదీ లేదు… మనం యేది యిస్తే అదే వస్తుంది, మా బిడ్డలకు జరగలేదే… క్యారక్టర్ వుండాలి’ అని వుంది.
ఆ బొమికను నా చేతుల్లోంచి లాగిపీక్కొని మళ్ళీ కొరుక్కోవడం మొదలుపెట్టింది.
పక్కనే బ్రహ్మాండం బద్దలైనా భూకంపం వచ్చినా అది తలతిప్పి చూడడం లేదు. కొరకడమయితే ఆపడం లేదు. దానిని యిప్పుడు కట్టడానికి గొలుసుల చైను అక్కర్లేదు. బెల్టు అక్కర్లేదు. అది బందీ. ఆ బొమికెకు బందీ. ఆ బొమికెలు యెక్కడి నుంచి వస్తున్నాయో యెవరు వేస్తున్నారో అది పసిగట్టలేకపోతోంది?! ‘కొరుక్కో’ అని యెజెండా యిచ్చినట్టు కొరుక్కుంటూనే వుంది.
‘మా హిందూ ధర్మాన్ని అవమానిస్తావురా ప్రపంచ యాత్రికుడా…’ అని యింకో బొమికె.
బొమికె మీద బొమికెలు వచ్చి పడుతూనే వున్నాయి.
అలా బొమికెలు కొరుకుతూనే కుక్కల జీవితం మొత్తం ముగిసిపోయేలా వుంది.
అలా బొమికలు విసురుతూ వుంటే పాపం కుక్కలకి పల్లు లేకపోయినా కొరుక్కోవడమే జీవిత పరమావధి అయ్యింది. వాటి సహజ స్వభావమయిన పసిగట్టడాన్ని అవి యేనాడో మర్చిపోయాయి?!
ఇప్పుడు బొమికెలకూ కొరతలేదు!
కొరుక్కొనే కుక్కలకూ కొదవలేదు! వాటి కొత్త గుర్తింపులకూ కొదవలేదు!
ఏదో జరగకూడనిది మాత్రం సాఫీగా జరిగిపోతున్నట్టే వుంది!