పునరావృత దృశ్యం

దృశ్యం మారుతుందేమోనన్న ఆశే గాని
మళ్ళీ మళ్ళీ అదే దృశ్యం పునరావృత మౌతున్నది
అనాది నుండి ఆధునికం దాకా
పాతాళం నుండి అంతరిక్షం దాకా
ఎంత ఎగిసామని విర్ర వీగినా
ఎక్కడ వేసిన గొంగడి అక్కడే కునారిల్లుతున్నది

మతమో, సాంప్రదాయమో
పురుషాధిక్య భావజాలమో, ఆధిపత్య అహంకారమో
అమ్ముల పొదిలోని ఏదో ఒక బాణం
అతివల వేటకు సదా సిద్దంగా ఉంటున్నది

లొంగ దీసుకోవడం హక్కుగ మారిన లోకం కదా!
అంగాన్నో, హృదయాన్నో, ఆలోచననో ఏదైతేనేం
దేన్నో ఒక దాన్ని గాయపరచడం నిత్యకృత్యమైంది
లైంగిక దాడులతో శరీరాన్ని
మతంతో మెదడుని
నియంత్రించడం సులువైంది

సహగమనం నుండి హిజాబ్ దాకా
పెళ్లి నుండి సహజీవనం దాకా
మగవాడి బలుపో
మతవాది గెలుపో
ప్రస్ఫుటమై తీరుతున్నది

పదే పదే పునరావృతమయ్యే ఈ దృశ్యం
నిత్యం హృదయాలను చిధ్రం చేస్తూనే ఉన్నది
ఈ దృశ్యం మారేదెప్పటికనే ఆగ్రహాన్ని ఎగదోస్తూ….
ఆలోచనలు రగులుస్తూ…


పుట్టింది పెరిగింది ఖమ్మం జిల్లా గ్రామీణం లో. ఉద్యోగ రీత్యా నివాసం ఉంటున్నది హైదరాబాద్ లో. విద్యార్థిగా, కార్మికుడిగా, కార్మికోద్యమ కార్యకర్తగా, గ్రూప్ 1 అధికారిగా రూపాంతరం చెందినప్పటికీ తనను తాను భావజాల రంగ కార్యకర్తగా మలచుకొని చెప్పదలచుకున్న అంశాన్ని కవిత, కథ, వ్యాసం, వంగ్యం... దేనిలో అంశం సమర్థంగా ఆవిష్కృతమౌతుందనుకుంటే, పాఠకుడికి సులభంగా చేరుతుందనుకుంటే ఆ ప్రక్రియలో రచనలు చేస్తుంటారు.

3 thoughts on “పునరావృత దృశ్యం

  1. గుడ్ తూములూరి గారూ..
    నీ కవితలు , సంధోర్భిచితంగా మీ వ్యాఖ్యలు చూస్తున్నాను. అభినందనలు. భావజాల రంగంలో మీకృషికి ధన్యవాదాలు..

  2. చక్కని భావం. అంతే చక్కని అభివ్యక్తి. వెరసి చక్కని సామాజిక స్పృహ కలిగిన కవిత. అభినందనలు వెంకటేశ్వరరావు

Leave a Reply