పునఃరారంభం!

“ఈళ్లకి కార్లు బంగ్లాలు యాన్నుంచి వచ్చినయబ్బా” అని ఊర్లో వాళ్ళని చూసి బిత్తరపోయారు పాలెమోళ్ళు. అప్పటిదాకా లోయర్ మిడిల్ క్లాస్ జనం గబుక్కున అప్పర్ క్లాస్ అయిపోయారు మరి. పాలెంలో ఏమో ఆ ప్రభుత్వ ఉద్యోగాలున్న నలుగురు తప్ప మిగతా చిన్నా చితకా పనులు చేసుకునే వాళ్లే,
వాళ్ళకీ ఆశ పుట్టే, అట్లనే వాళ్ళ బతుకూ మారిద్దనీ.

ఊరి చరిత్రే ఊర్లో జనం తీరు చెప్పిద్ది. ఊర్లో కొప్పుకొండ ఫేమస్ కొండ. హైదరాబాద్ కి చార్మినార్ పేరు తెచ్చినట్టు ఈ ఊరికి పేరు తెచ్చింది ఈ కొండ. ఏ పేరూ? ఎర్రగొండపాలెం అని. ఆ కొండ ఎర్రగా ఉంటది గదా మరి, దాని చుట్టూ, ఆమాటకొస్తే ఊరు చుట్టూ కొండలే. అవన్నీ ఎర్రగానే ఉంటాయి. కొప్పుకొండకి కాస్త ఎడంగా మరో చిన్న కొండ. దేశంలో ఊరికి దగ్గరగానో, ఊరిలోనో కొండ ఉంటే అది ఖాళీగా ఉండదు, ఏ వెంకటేశ్వర స్వామి వైకుంఠ గిరిగానో, జీసస్ కల్వరి కొండగానో మారిపోతుంది. అట్టా కొప్పు కొండమీద గుడినీ, చిన్న కొండమీద సిలువని స్థాపించి ఆ స్థలాలు దేవుళ్ళవి గా గట్టిగా మాట్లాడితే స్థాపించిన వాళ్ళవిగా అధికారికంగా ప్రకటించుకున్నారు పూర్వం. ఆ విధంగా కొండలమీద కులాల కాలనీలు వెలిసిన చరిత్ర ఎన్ని ఊర్లకి లేదూ!

గుడ్ ఫ్రైడే కి ముందు వారం మట్టల ఆదివారం జరిగేది. ఫిలిప్ చిన్నప్పుడు మట్టల ఆదివారం నాడు స్కూల్ పిల్లోల్లకి తాటి మట్టలు, కొబ్బరి మట్టలు పట్టించి పోలోమని ఊరంతా తిప్పి ఈ చిన్న కొండ మీదికి తీసుకొచ్చారు. వెనకాలే పెద్ద ఇనుప శిలువ ఫాలో అయింది. దాన్ని “హల్లెలూయ” అని ఈ కొండమీద పాతేసారు. అప్పట్నుంచి అదంతా చేపిచ్చిన పెద్ద మనిషి జోసెఫ్ తానే పాలెంలో గొప్పోన్నన్నట్లు బిర్రుగా ఉంటాడు. చూట్టానికి నల్లగా ఉన్నా తెల్ల చొక్కానే వేస్తాడు. బుర్రు మీసాల వల్ల గంభీరంగా ఉంటాడు. ఎమ్మెల్యే కాడ మాట చెల్లించుకోగలిగే మనిషి పాలెంలో ఈయనొక్కడే.

అసలే సన్నగా చామన చేయాలో ఉండే ఫిలిప్. ఇంకాస్త కుచించుకొని పోయి ఆయన ఇంటి మెట్లు ఎక్కాడు. కొన్నాళ్ళు పోలీస్ కి ట్రై చేసాడు. ఇప్పుడు ఏజ్ బార్ కాబట్టి ప్రైవేట్ కాలేజీలో రికార్డు అసిస్టెంట్ గా చేస్తున్నాడతను. అతని రాక గెట్లోనే చూసి “రా అల్లుడూ, మే.. అబ్బాయికి కూడా అన్నం పెట్టు” ముద్ద నములుతూ జోసెఫ్.

“ఇప్పుడేం వద్దులే గాని, మా బావకి ఆ కాలనీ ఇళ్లు శాంక్షన్ చేపించు మామా, ఎన్నిసార్లు పెట్టినా రావట్లా, లేదంటే మా నాన్న ఇచ్చిన స్థలం అమ్ము, అక్క వాటా ఇవ్వు అంటాడు బావ, అక్క ఏమి చెప్పలేక దిగులు మోహమేసుకొని కూర్చుంది, నాక్కూడా అలాగే ఉందిలే” ఫిలిప్.

“మీ వోడు పార్టీ మారితే వచ్చిద్దేమోరా పిలుపూ, నాతో ఎమ్మార్వో ఆఫీస్ కాడికి రా, ఈసారి చేపిద్దాంలే, ఇదిగో తిను” స్టూల్ మీద ప్లేట్ జరిపాడు.

గురువారం ఎవరింటికి వెళ్ళినా అంతే, పైన ఒట్టి తునకలు కర్రకి అరేసి ఉంటాయి. ఈ రెండు రోజులూ వొట్టి తునకల కూరో, వేపుడో తినాల్సిందే. ప్రేమని కురిపియ్యడానికి తిండి ఓ ఋజుమార్గం. తప్పక చెయ్యి కడిగాడు ఫిలిప్.

** **

ఆ రెండు కొండల మధ్యలో అర కిలోమీటర్ దూరాన పాలెం, ఊరికి తోకలా. మరే, ఆ కొండల దగ్గర చాలా మందికి చాలా మెమరీలుంటాయి, అవన్నీ చెప్పుకోవద్దులే. చెంబు పట్టుకొని కొప్పుకొండ దాకా రావడం వీళ్ళకి తప్పని ఆటవిడుపు. అక్కడి సమాధులని చూసి భయపడటం అస్సలు తెలీదు. ఎందుకంటే అవన్నీ పాలెం జనం తాత ముత్తాతలవే. ఎవరైనా ఇళ్లు కట్టేటప్పుడు ఆర్కిటెక్చర్ లో పోటీ పడతారు, వీళ్ళు మటుకు సమాధుల డిజైన్ లో కూడా పోటీ పడతారు.

చర్చి వెనకాలే ఫిలిప్ ఇళ్లు. చిన్నప్పుడు ఎప్పుడు చదువుకుందాం అన్నా చర్చి స్పీకర్ సౌండ్ ఆవాహయామి అంటుండేది. కాబట్టే బావ ఇంటికి పోయి కూర్చునేవాడు… టీవి ముందు. ఇంక తిట్టిచుకునేవాడు. కాలనీ కుడివైపున పాత ఇళ్లల్లో ఉండే ఫిలిప్ వాళ్ళు కొత్త ఇళ్లల్లో ఉండే మేనమామ కొడుక్కి అక్కనిచ్చారు. చదువుకీ, ఖర్చులకి బావే సపోర్టు నిలబడ్డాడు. కాబట్టే నేమో ఆ పెయింటు పనిలో వచ్చినది ఆడపిల్లకి కొద్దిగ కూడా దాచలేక పోయాడు. బావ ఏ పని చెప్పినా చేయడానికి రెడీ గా ఉంటాడు బామ్మర్ది.

అలాంటి బావా బామ్మర్దులు కిషోర్ కీ ఫిలిప్ కీ తగువు పెట్టింది ఏదనీ! పాలెంలో కొత్త డిస్కషన్.

** **

ఇంట్లోనుంచి బైటికి రాగానే “ఎవురిది మామా ఇది” ఫిలిప్ నోరు తెరిచాడు.

“కాలనీలో తొలి కిరాణా కొట్టు వెలిసిందిరా. ఎవరిదా అని చూస్తే సెట్టిగారు”

“ఈ ఐడియా మనకెందుకు రాలేదనీ!” అన్నాడు కళ్ళు ఇంత చేసి.

“యాపారం చేసే తెలివి మనకుంటే ఎప్పుడో బాగుపడుదుము. అందుకే అన్నారు పెద్దోళ్ళు”

“ఏమని?”

“మాదిగోడికి మైలు దూరం పోయినాక ఎలిగిద్దంట”

“మామో, నేను పీజీ చేశాను, అట్ట అంటే ఒప్పుకోను” ఆయన పెడసరం ఫిలిప్ కి తెలుసు.

“ఎవరూ ఒప్పుకోరులే ఈ రోజుల్లో, ఇట్ట జరిగినప్పుడు మటుకు ఎర్రి లేసిద్ది”

“వాడికేం పెదనాన్న, ఇంక కోటీశ్వరుడు అయిండులే” అప్పుడే వచ్చి అరుగు మీద కూర్చొని అందుకున్నాడు రమేష్.

“చతుర్లాడమాకు ఎంపిపి బావా” ఫిలిప్.

రమేష్ “ఏదోక రోజు ఎంపిపీ అవుతా… రా” అనేవాడు. అందుకని అదే పేరుతో పిలుస్తారు జనం, అతని పిట్టకాయం రాజకీయాల్లో సరి తూగలేదు. ఇప్పుడు ఖాళీ ఏం కాదు, టీ కొట్టుకాడ అన్ని చర్చా వేదికలకి వక్త. లోకంలో ప్రతి విషయం ఆయన చెవిలో ఉంటది.

ఇంక తగులుకున్నాడు “లేదురా బామర్ది, ఊర్లో రియల్ ఎస్టేట్ హైదరాబాద్ తో పోటీ పడుతుంది, నిన్నటిదాకా పాలెం పక్కన చిల్ల చెట్ల స్థలాలు ఇప్పుడు అడుగు ఐదు లక్షలు పలుకుతుంది”

ఫిలిప్ మొహం మీద ఫోకస్ లైట్ పడ్డట్టు దగామన్నది “ఇప్పుడిక జీవితం మారినట్టే” వెలుగు మొహమంతా పులుముకుంది.

“ఎందుకని అంత డిమాండు, ఈ ఊర్లో ఒక ఫ్యాక్టరీ లేదు, రైల్వేస్టేషన్ లేదు, సరైన ఉపాదే లేదు కదా?” ఫిలిప్.

“దొనకొండ లో రాజదాని అన్న కాన్నించి లేసింది లేవడం, ఇంక దిగలే, దెబ్బకి సామాన్యుడు ఊర్లో స్థలం కొనటానికి లేకుండా పోయింది. ఏదో మీలాంటి వాళ్ళు తాతలు ఇచ్చిన స్థలాలు ఉంటే బాగుపడ్డట్టే” బుజం తట్టాడు రమేష్.

‘బావ కి ప్రభుత్వ స్థలం వచ్చిద్దీ, నాకు అమ్మితే వచ్చే డబ్బు బిజినెస్ కి కొద్దిగా దారి చూపించిద్ది ‘ అని చకచకా వెళ్ళి అర్జీ పెట్టొచ్చాడు ఫిలిప్.

** **

ఆ సడన్ శ్రీమంతులు ఎట్ట అయ్యారోనన్న ప్రశ్నకి ఆ రోజు ఆన్సర్ దొరికింది.
ఎప్పుడూ రానిది బావ ఇంటికొచ్చాడు “ఒరే… ఆ గవర్నమెంట్ స్థలం రాదుగాని, నా మాట విను, ఎదురుగా ఉన్న స్థలాలు అమ్మి కార్లల్ల తిరుగుతున్నరు మూర్తి, వెంకట రెడ్డి, నరసింహులు, బ్రోకర్ నరేంద్ర. ఈ ప్లాట్ల బిజినెస్ లో ఉన్నట్టుండి రాకెట్ లా పైకి లేచినరు” బావ.

ఫిలిప్ కి ఎక్కడం మొదలయింది.

“పాలెంకి ఎడం పక్క మన స్థలాలు ఉల్లా, వాటికి మంచి రేటే వచ్చింది, ఎంతకాలం ఈ బతుకు, టైం వచ్చినప్పుడు మారాల” గ్యాప్ లేకుండా శంఖం ఊదాడు బావ.

‘ఏదైతేనేం, బావ మంచి ఆలోచనే చెప్పాడు, ఉన్న ఒక్క స్థలం చిల్లరకే లేకుండా పోతుందని బాధపడ్డా, మంచి రేటే వచ్చింది” బుర్ర తొలచడం మొదలైంది.
“కానియ్యి రా, నాలుగు రూపాయలు వస్తే స్థలాలు మద్దెరగ కొనచ్చూ” జోసెఫ్ మామ.

అంతే, గాల్లో కార్లు నడిపాడు ఫిలిప్. బ్రోకర్ నరేంద్రలా తానూ ఇల్లు కట్టచు, ఏదన్నా బిజినెస్ పెట్టుకోవచ్చు, బావ కి ఎలాగూ సాయపడటం, అక్క బాధ తీరటం. ఇన్ని పనులు ఒకే విషయంతో తీరుతాయి. ఊహల్లో సర్ఫింగ్ చేసేశాడు.

తనకూ అదే ఉద్దేశం ఉన్నా, బావ చెప్పినాకనే నిర్ణయించుకున్నట్టు “సరే, నీ ఇష్టం బావా” అన్నాడు.

తెల్లారి స్థలంముందు కారు, దాని ఓనర్ నరేంద్ర, అతని ఓనర్ శివశంకర్.

“మన బంధం ఇప్పటిదా? పూర్వం నుంచీ ఉన్నదే, ఈరోజుల్లో అంతా మామా బాబాయ్ అని పిలుచుకుంటున్నారు, కలిసి పోతున్నారు, చిన్న కులం లేదు, పెద్ద కులం లేదు, అది గదా కావాల్సింది.” నవ్వుతున్న నరేంద్ర గడ్డం పండిన తీరిది. అతన్ని మాజీ సర్పంచ్ శివశంకర్ రైట్ హ్యాండ్ అంటారు, పోనీలే లెఫ్ట్ హ్యాండ్ కాలేదు, దేనికి వాడే వాడో!

ఫిలిప్ పెద్ద రియాక్ట్ కాకుండా ఆలోచిస్తున్నాడు… “అతనన్నదీ నిజమే, టీ కొట్టు కాడ, ఎలక్షన్ల కాడ, బస్టాండ్ లో జరిగే చిన్నాచితకా పనులకు జనమంతా ఒకటే”.

ఫ్లో ని కొనసాగిస్తూ “మూడు లక్షలు ఫిలిప్స్” నరేంద్ర.

ఆ ఎలక్ట్రానిక్ కంపెనీ పుణ్యమా అని ఊర్లో తన పేరు బహువచనం ఆయింది. ఫిలిప్ మూడు కుంటల స్థలానికి మాజీ సర్పంచ్ కట్టిన రేటు మూడు లక్షలు.

గాలి స్తంభించి ఎగిరే కారు ఫిలిప్ నెత్తిమీద పడ్డట్టు ఉంది. శివ శంకర్ మౌనంగా ధ్యానిస్తున్నడు. ఫిలిప్ కొన్ని నిమిషాలకి తేరుకొని ముందుకొచ్చి, చెయ్యి పెద్దాయన వైపు చూపించి “రోడ్డుకి అవతల దీని ఎదురుగా ఉన్న స్థలం ఈ సర్పంచి గారిదే కదా, 25 లక్షలకి అమ్మాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ చెబుతున్నాడు, మధ్యలో పది అడుగుల రోడ్డు తప్ప ఇంకేమన్నా ఉందా, ఇది మూడు లక్షలకు ఎట్ట వస్తది, అది ఎంతో ఇదీ అంతే కదా” బలం లేకున్నా బలమైన గొంతుతో అరిచాడు ఫిలిప్.

అతన్ని అలాగే చూసాడు మాజీ సర్పంచ్, మందపాటి మీసాన్ని పళ్ళతో నరుకుతున్నాడు. జోసెఫ్ కంచె కి ఇరుక్కున్న గొర్రెలా గిలగిల మన్నాడు “అంతే ఏందిరా, రోడ్డు అవతల పాలెం ఉంది కదా, అటుపక్క ఉన్న స్థలం పాలెంలోకి వచ్చిద్ది, అంత రేటు యాన్నించి వచ్ఛిద్ది” ఊర్లో పెద్దలకి వంత ఈ పెద్ద.

“జోసెఫ్ మామ మాకు సపోర్ట్ చేస్తడనుకుంటే ఇదేంది, కంచే చేను మేసినట్టు” అని ఆయన వైపు బిత్తరపోయి చూసాడు ఫిలిప్.

“ఇదెలాగో పాలానికి చివర ఉంది కదా, ఊర్లోవాల్లు ఇల్లు కడితే ఊర్లో స్థలమే అయిద్ది” లాజికస్త్రాలు తీస్తున్నాడు.

“అసల పాలెంలో స్థలం పాలెంవాడు తప్ప ఊర్లో వాడు ఎవడు కొంటాడు చిన్నోడా” శివ శంకర్ అస్త్రం.

“నిజమే, ఎంత స్తలమైనా మాకు మేమే అమ్ముకోవాల కొనుక్కోవాల, డబ్బులు రావని” తెలిసే తండ్రులు ఇచ్చిన రోడ్డు పక్క స్థలాలు ఏదో రేటుకి తెంచుకున్నరు చాలా మంది పాలెం జనం. కొన్నారు ఊర్లో జనం. ఆ డబ్బులూ వాల్ల ఇళ్లల్లో చిన్న చిన్న ఫంక్షన్ల కీ, చీరలకి, తాగుల్లకీ చిల్లా కొల్లా అయ్యి, మళ్ళీ పాత బతుకే అయింది.

ఫిలిప్ సూటిగా చూసి “వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, పాలెం అయితే నేల కాదా! మనం అడిగేది మార్కెట్ రేటే గా” ఎకనామిక్స్ కీ కులానికి లింక్ సరిగ్గా తెలిసినోడు. అంబేడ్కర్ సైతం ఆర్థిక సిద్ధాంతాన్ని వెలికి తీసింది ఇక్కడేగా.

మళ్లీ అతనే “ఎలాగైనా దీన్ని మార్కెట్ రేట్ కి అమ్మి బావకి ఇల్లు కట్టిస్తా, నా పాత మిద్దె కూడా రిపేర్ చేపిచ్చుకుంటా, మిగిలితే మీలాగే కారు కొంటా”

“ఎట్ట పోతుందో చూద్దాం లేరా, అందరం ఈన్నే ఉంటాముగా” శివ శంకర్.

పెద్దాయన మాటకి మరింత బిగుసుకున్నాడు ఫిలిప్.

బావ కిషోర్… వీడు బేరం తెంచేసాడని చేతిలో సిగరెట్ పాకెట్ నలిపి పారేశాడు, ఆ పాకెట్ సైజులో లేకపోవడం బామ్మర్ది అదృష్టం.

ఇంటి దారిలో మండుకున్నాడు బావ “మనవాళ్ళు ఎవరూ ఆ రేట్ కి అమ్మలేదని తెలుసు కదరా, అన్నీ ఇట్టనే చెడనూకుతవు.”

ఫిలిప్ మౌనంగా ఉన్నా మనసు మాత్రం మౌనంగా లేదు, “ఏదో పంతంతో అనేసాము, అసలు ఆ రేటుకి స్థలం పోతుందా? ఊహ తెలిసినప్పటి మార్కెట్ రేటు కి పాలెం స్థలం అమ్మిన మొనగాడు లేడు. అది రోడ్డు సైడు ఉన్నా తగిన రేటుకి ఎందుకు పోదో అర్థం కావట్లేదు.”

తొలిసారి అడిగి లేదని పించుకున్నాడు శివ శంకర్, ఈ మూలమీద చాలామంది స్థలాలు వాళ్ళే కొన్నారు, తిరిగి భారీ రేట్లకి అమ్మారు. అదో సిండికేట్.
ఆ మర్నాడు జరిగింది పాలెంలోకెల్లా విచిత్రం. బామ్మర్ది దార్లో కనిపిస్తే తల తిప్పుకుపోయాడు బావ.

** **

వారం పదిరోజులు ఎడమొహం పెడమొహంగా అయ్యాక, ఫిలిప్ కి ఎందుకో ఊపిరి సలపనట్టుంది, మొహం కల తప్పింది “ఇక ఎంతకో ఒకంతకి అమ్మి పార్నూకితే పోయిద్దేమో. లేదంటే ఈ మా మధ్య దూరం శాశ్వితంగా అవుతుందేమో” సన్నగా దడ. బావకి ఫోన్ కలిపాడు, తియ్యలేదు, ఐదారు సార్లు చేసినా లాభం లేకపోయింది. దడ పెద్దదైంది.

అక్కకి చేశాడు.

“ఒరేయ్ పిలుపూ… నేనే చేద్దాం అనుకున్నా, బావ పేరు మీద ఇంటికి గవర్నమెంట్ స్థలం రాబోతుందట, జోసెఫ్ మామ చెప్పిండు” గాప్ ఇవ్వకుండా అంది.

అప్పుడు కదా అతనికి హాయిగా ఊపిరందింది. సాయంత్రం అక్క ఇంటికి వెళ్ళాడు. బావ కోపం తగ్గి శాంతంగా ఉన్నాడు, బామ్మర్ది రాకని చూసినా పట్టించుకోలేదు.

ఫిలిప్ కి అందరి మొహాల్లో వెలుగు నచ్చలేదో ఏమో, మళ్లీ రభస రేపాడు “వాళ్లిచ్చే బోడి స్థలం మనకు అక్కర్లేదు” ఫిలిప్ విసిరిన బాణం, బావ వీపుకి దిగినట్టు ఉంది.

“ఉత్త పుణ్యానికి గౌర్నమెంట్ ఇస్తుంటే వద్దంటాడు ఏంది వీడు? యాడనైనా బామ్మర్ది అంటే బావ బాగు కోరుకుంటాడు కానీ ఇట్ట మాత్రం చెయ్యరు” గడ్డానికి అంటిన పెరుగన్నం తుడవడం ఆపి అన్నాడు బావ.

ఈ బామ్మర్ది వాలకానికి బావేందీ, పాలెమంతా ఆశ్చర్యపోయింది. పోదూ మరి, చేతివృత్తుల వాళ్లకి అంటే టైలర్ల కి, ఫోటోగ్రాఫర్లకు, ఆటో డ్రైవర్లకు, పెయింటర్ లకీ వగైరా వగైరా చాలా మందికి ఊర్లో గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు కేటాయించింది. అదేదో అందరినీ పిలిచి నీకిదీ, నీకిది ఇది అని పట్టాలిస్తే సరిపోదూ… అలా జరగలా, వెరైటీగా అయ్యిందిలే.

శిలువకొండ వారగా ఉన్న ఖాళీ స్థలాలకు ఏ పాపం తెలీదు, పాపమంతా జనందే.

“మీరు పోయి ఇల్లు కట్టుకోండి, మేము వచ్చి ఎంక్వైరీ చేసి పట్టాలిస్తాం” అన్నారు ఎమ్మార్వో. ఇదేదో వెరైటీగా ఉందే అనుకున్నారు విన్నవాల్లు. ఆరోజు నుంచీ అక్కడికి వచ్చి ఎవరికి దొరికింది వాడు తన ప్లాటుగా ప్రకటించుకున్నారు, పునాదులు కూడా మొదలు పెట్టారు. వాళ్ళల్లో ఫిలిప్ గాడి బావ కిషోర్ బాబు కూడా ఉన్నాడు. ఇల్లు అనుకున్నాడుగా, కాబట్టి ‘హమ్మయ్యా, మనకు ఓ సమస్య తీరింది’ అనుకోటం బానే ఉంది.

లిస్ట్ చూస్తే నాలుగొందల మందిలో పాతిక ముప్పై దాకా ఇజ్రాయిల్ పేట వాళ్ళే. కాలనీకి ఆ పేరున్నా అందరికీ పాలెమనే అలవాటు కాబట్టి అలాగే అందాం. ఆ కొద్దిమంది పాలెమోల్లు కాకుండా మిగతా అంతా ఊర్లో వాళ్లే. ఈ స్థలాలు మార్కాపురం హైవే కి దగ్గరగా ఉండటం వల్ల మంచి కాలనీ ఏర్పడిపోతుందని అందరికీ సంతోషంగానే ఉంది. అట్టానే ఉంటే ఇంత చెప్పుకోము కదా, మొన్న సాయంత్రం పూట హుటాహుటిన ఎమ్మార్వో అక్కడికొచ్చి “మేము పట్టాలు జారీ చేసేదాకా కట్టడాలు ఆపేయండి” అని హుకుం జారీ చేశాడు. జీ హుజూర్ అన్నారు జనం.

“ఆ ముక్కేదో ముందే ఏడవచ్చుగా” అని వీళ్ళు ఏడుస్తూ పైన సిలువ దాకా వేసుకున్న బేస్ మట్టాలు కూల గొట్టుకున్నారు, కిషోర్ తో సహా ప్రతి ఒక్కరికీ దాదాపు యాబై వేల నష్టం. ఎందుకు ఆపారో ఎవరికీ అర్థం కాలేదు. ఫిలిప్ గాడికి తప్ప.

“లిస్టులో ఉన్న పాలెం వాళ్ళకి స్థలాలు పాలానికి వచ్చి తీర్మానం చేస్తాను” అన్నాడు ఎమ్మార్వో.

అక్కడొచ్చిది డౌటు “ఊర్లో పెద్ద తలకాయలందర్నీ వదిలేసి మన మీద స్పెషల్ ఫోకస్ ఏమిటి? అందరికన్నా ముందు మనకే ఎందుకు స్థలాలు జారీ చేయడం, ఈ కౌగిలి దృతరాష్ట్ర కౌగిలి కాదుకదా” ఎంపీపీ రమేష్ చెవులు కొరికాడు ఫిలిప్.

అతనేదో సలహా ఇచ్చే ఉంటాడు. తెల్లారితే చర్చి పక్కన కమ్యూనిటీ హాల్లో మీటింగ్. బావ అన్నం పూర్తిగా తినేదాకా ఆగి అందుకున్నాడు బామ్మర్ది “కొత్తగా వేరే చోట స్థలాలు కేటాయిస్తారని అనుకుంటున్నారు, కొత్తగా ఇచ్చేది వద్దని చెప్పు.”

కిషోర్ చేతిలో టవల్ విసిరేసి “ఇచ్చేది వద్దనే దరిద్రుని నిన్నే చూస్తున్నా, ఉన్నదేదో అమ్ముకోకుండ ఇచ్చేదాంట్లో సొంతిల్లు కట్టుకోవచ్చు. అర్థమైందా! రేపు అక్కడికి వచ్చి ఇదే మిడిమేలంతోటి ఆఫీసర్ ని ఏమన్నా అన్నావంటే అదే ఆఖరు” అని అగ్గిపెట్టె లటుక్కున జేబు లో పెట్టుకొని నడిపయ్య కొట్టుకాడికి పోయాడు.

ఫిలిప్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, మౌనంగా బైటికి వచ్చేసాడు.

అక్కకి, వాళ్ళ కూతురికి, పక్కింటి వాళ్ళకి, అసలు కాలనీ మొత్తానికి బుర్ర తక్కువవాడిలా కనపడ్డాడు ఫిలిప్.

** **

మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మార్వో వచ్చాడని తెలియడంతో కిషోర్ బామ్మర్దికి తెలీకుండా హుటాహుటిన వచ్చేశాడు. వెనకాలే బామ్మర్ది ఫాలో అయ్యాడనుకొండి. లోనికి వెళ్ళగానే బావ బలవంతంగా బయటకు తోసేసాడు.

“పోరా ఈన్నుంచి”

“ఏంది బావా నువ్వు, తిక్కొడి లాగా, చెప్పేది అర్దంకాదు నీకు, లే” నెట్టినంత పని చేశాడు.

అంతే… వచ్చింది ఎక్కడ పోతుందో నన్న భయమో ఏమో, కిషోర్ మొహం ఎర్రబడింది, ఒక్క అడుగేసి లాగి ఒక్కటిచ్చాడు, చెంప అదిరిపోయింది. ఫిలిప్ కళ్ళ నీళ్ళు కనబడకుండా వెనక్కి తిరిగాడు.

లబ్ధిదారులంతా పాలేమొల్లేగా ‘ఎట్టాంటి ఆత్మీయులు యిట్టా వేరైతున్నారు ‘ అని జాలి కురిపించారు. ఎమ్మార్వో సైతం బిత్తరపోయారు. ఆయనని గమనించి తమాయించుకున్నాడు కిషోర్. మిగతా అధికార్లు ముందుకొచ్చి గదిమారు.

పేతురు సముద్రపు నీళ్ళమీద అడుగులు వేసినప్పుడు ఎంత వణికాడో అంత వణుకుతో మెట్లు దిగాడు బామ్మర్ది. మనసు కుంపటిలో వేసినట్టుంది.

నడిపయ్య కొట్టు కాడ కూర్చొని ముచ్చట్లుపెట్టిన రమేష్ చూపులో పడ్డది అతని సాగర ఘోష. పిలిచి వివరమడిగాడు. స్థలము, మర్మము… మద్యన తారుమారులు.

మూడుముక్కల్లో పండు వలిచి నోట్లో పెట్టాడు ఫిలిప్.

“ఒరే బామర్దీ, ఎన్నిసార్లు చెప్పిందే చెప్తవు, ఏదోకటి ఆలోచించాలి, నీకు విషయం అర్దం కావాలంటే మన పాలెం పుట్టుక ఎట్ట అయిందీ తెలియాలి”

“కొత్తగా పుట్టేదెంది? ఎప్పటినుంచో ఉన్నదేగా!”

“కాదురా సామీ, అసలు పాలెం ఈడ కట్టుకునే వాళ్ళం కాదు. ఇంత ఎడంగా ఉండేవాళ్లం కాదు, మా తాత చెప్పేవాడు. ఇది ఇప్పుడు సంగతి కాదు, పూర్వం మన కాలనీలో పది పదిహేను ఇల్లు ఉండేది. మురారి పల్లి, చాపల మడుగు, లేళ్ల పల్లి, త్రిపురాంతకం లాంటి ఊళ్ల నుంచి వచ్చే మాదిగోల్లంతా అక్కడొక్కల్లు, ఇక్కడొకళ్ళు ఉండేవాళ్ళు, అప్పుడు ఎవరికి ఇల్లు ఉన్నాయి, అన్నీ గుడిసెలే కాదు. గవర్నమెంట్ వాళ్ళు పాలెంకి కాలనీ ఇస్తామని చెప్పి ఒక స్థలం చూపించారు. అది కూడా తెలిసిన మెయిన్ బస్టాండ్ లో కొలుకుల సెంటర్ పక్కనే. అప్పట్లో అది ఇంత డవలప్ కాదులే”

“అవునా, అసలు నమ్మేటట్టు లేదే, మళ్ల కొప్పుకొండ దార్లో ఎట్ట వచ్చి పడ్డాం?”.

“అది మన పెద్దోళ్ల మేధావితనంరా సామీ, మీ జేజయ్య ఎక్కడెక్కడి వాళ్ళందర్నీ దగ్గరికి చేర్చిండు. ఇల్లు రాపియ్యటానికి, అప్పుడు మీ ఇల్లే ఇక్కడ అన్నిటికీ కీలకం, బాగా బతికారులే, ఒక వారం తర్వాత ఏం జరిగిందో తెలుసా, పాలెంలో డాబా ఇల్లు వెంకటయ్య అని ఒకాయన ఉన్నాడులే, అయనదొక్కటే అప్పట్లో డాబా ఇల్లు. జనం కాడ సంతకాలు పెట్టుకొచ్చి ఆఫీసర్ల కి అర్జీ ఇచ్చిండంట, అక్కడ కొట్టింది దెబ్బ, ఆ అర్జీలో ఏముందో తెలుసా! మా ఆచారం, వ్యవహారం వేరు, దున్నలు కొస్తాం, తోలు అరేస్తాం, తగులాటలు, డప్పు కొట్టి సందడి చేస్తాం. అవి మీకు పడవు, లేనిపోని తలకాయ నొప్పి, మేము ఊర్లో ఎందుకులే, ఈన్నే దూరంగా ఉంటాం అని రాసిండంట, ఆఫీసర్ బిత్తరపోయిండు. ఇంక వాళ్లే వొద్దన్నప్పుడు చేసేదేముంది అని సరే అన్నడు. అప్పుడు జనం బిత్తరపోయారు. ఇంగ ఎవరిని అని ఏం లాభం. మనకి సిగ్గుండాల”

ఆ డాబా వెంకటయ్య కీ జోసెఫ్ మామకీ తేడా ఉన్నట్టు అనిపించలేదు ఫిలిప్ కి,
“అలాంటి తప్పే జరుగుతుంది రా, ఆలోచించుకో” అని టీ అందరికీ చెప్పాడు రమేష్. వెనక్కితిరిగి నడిచాడు ఫిలిప్, వాళ్ళు పిలుస్తున్నది చెవికి సోకినా మెదడుని చేరలేదు.

నిబ్బరంతో కమ్యూనిటీ హాల్ లోకి అడుగుపెట్టాడు.

అందరి పేర్లు చదివి ఫైనల్ డెసిషన్ కి గట్టిగా ఊపిరి పీల్చాడు ఎమ్మార్వో,
తమ వూపిరి ఉగ్గబట్టుకున్నారు జనం.

బామ్మర్ది ని చూసాడు కిషోర్, వొద్దని తల అడ్డంగా ఆడించాడు. అది బుర్రకి చేరినట్టు లేదు.

ఎమ్మార్వో ” మీ పాలెం వాళ్ళందరికీ స్థలాలు కొప్పు కొండకింద ఇస్తాం, ముందు కేటాయించిన కాలనీలో జనాభా ఎక్కువ అయిపోయారు, అందరికీ చాలవు” ఆజ్ఞ ప్రకటించాడు.

జనాభా ఎక్కువైన ప్రతిసారీ తప్పు కోవాల్సింది, దూరం పోవాల్సిందే ఎవరు, అనే ప్రశ్న రానేరాదు, ఎందుకంటే సమాధానం సిద్ధంగా ఉంది కాబట్టి.

కొండ కింద… అన్నప్పుడే ఆ కొండ రాళ్ళు దొల్లుకుంటు వచ్చి అతని గుండెల్లో పడ్డాయి. ఎందుకంటే కొండ కింద ఉంది స్మశానం మాత్రమే, ఆ మూల నుంచి ఈ మూల కి అదే.

ఆ కొండగుట్టల మీదనే మా తాత ముత్తాతల సమాధులు.

“ఇది మనం ఊరు నుంచి మరింత అవతలికి వెళ్లడం, మరింత ఎడం గా, ఇప్పుడు ఏం చేయాలి? పథకాలు మన మీద అమలవుతాయి, కానీ దాని రూపేది!” ఫిలిప్ హృదయ ఘోష.

“ఒరే… మనం, మన స్మశానాల కన్నా ఎక్కువ కాదు” ముందుకొచ్చిన బామ్మర్ది తో అన్నాడు కిషోర్. అతని మెదడులో పడింది మట్టి… సమాధి మట్టి. ఫిలిప్ నోరు పెగల్లేదు, మథనం ఆగలేదు. మిగతావాళ్ళు చాలా ఆనందంగా తలాడించారు. ఆ వైనానికీ అవాక్కయి చూసారు ఇద్దరూ.

అసలు రాదనుకొన్నది, కొసరైనా వస్తుందిగా అనేమో, ఈ అమాయకత్వం కాదూ అధికారులని గెలిపిస్తున్నది!

కిషోర్ రాని నవ్వుని పులుముకొని బైటికి నడిచాడు. ఇప్పుడు అడ్డం తిరిగితే తనతో పాటు అందరివీ పోవచ్చు. బావ కళ్లలో కొండ వెనక ఉన్న చెరువునే చూశాడు ఫిలిప్. లోన మండిన నిప్పు కనికలు మీద విసిరేందుకు సిద్ధమయ్యాడు. ఒక్క అడుగు వేశాడో లేదో బావ రెండు చేతులూ జోడించాడు. తల అడ్డంగా ఊపాడు. అంతకన్నా మార్గం లేదని ఇద్దరికీ తెలుసు. లోన నిప్పులు తననే దహించనీ. తానూ వెనక్కి తిరిగాడు,
ఎకనామిక్స్ లో డిమాండ్ ఎఫెక్ట్ సూత్రానికి కులాన్ని కూడా చేర్చాలి. డిమాండ్ ని ప్రభావితం చేసేవాటిలో ఇది కూడా ఒకటి కదా.

ఒకచోట అభిమానం చంపుకుని ఓడి, ఇంకో చోట కూడా ఓటమికి సిద్ధ పడ్డారు. పాలెం స్థలం జన్మలో మార్కెట్ రేట్ కి అమ్మలేమని తెలిసొచ్చింది.

“ఆ స్మశాన స్థలం వచ్చినా రానట్టే. బావకి పాలెంలోనే ఇల్లు కట్టియ్యాలి” గట్టిగా అనుకున్నాడు. బ్రోకర్ నరేంద్ర కి కబురు పెట్టారు, చివరి ఓటమి కోసం ఇద్దరూ ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ రెండు బంగారు కొండల మధ్య.

ఊరు యర్రగొండ పాలెం, ప్రకాశం జిల్లా.  కథా రచయిత, ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్.  నాగార్జున యూనివర్సిటీలో M.A. (జర్నలిజం అండ్ మాస్ కమ్యూనకేషన్) చేశారు. తెలుగు వెలుగు, బాల భారతం పత్రికల్లో కొంతకాలం ఆర్టిస్ట్ గా పని చేశారు. కథలకి, పుస్తకాలకి ముఖచిత్రాలు గీసారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ గా, సినిమాల్లో రచయితగా పని చేస్తున్నారు. ఇప్పటికి 13 కథలు, కొన్ని వ్యాసాలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి.  తన కథ 'కేరాఫ్ బావర్చి' కథా సాహితీ వారి ' కథ19 ' లో వచ్చింది. మంచి పేరు తెచ్చింది.

Leave a Reply