‘ప్చ్.. ఈ పిల్లేమొ ఇట్ల ఇరకాటంల పెట్టింది. నాకు తెల్వకుండ ఏం చేసుకున్నా నాకీ బాదుండేది కాదు.’ అల్లకల్లోలమైన మనసుతోటి బరువుగ అడుగులు ఏసుకుంటొచ్చింది నాగమణి. కిరాణం డబ్బా పక్కన ‘మర్రిచెట్టు’ కింద ఉన్న ఒక ఎత్తైన రాయి సూస్కొని కూసుంది. బస్సు ఆగే స్టాప్ అది. కూసోనయితే కూసుంది కానీ పావుగంట కింద జరిగిన సంగతి తాలూకు ఉద్వేగం ఆగమాగం చేస్తుంది. బతుకంత అవమానం మోస్తనే ఉండాల్నేమో అనుకుంటున్న కొద్దీ మొఖం ఎర్రబారుతుందామెకు.
‘మన సందెమ్మ మంచిగ సదువుతుందే. ఎట్లనన్న ఇంకా బాగ సదివి జాబ్ చేస్తే దాని బతుకు బాగుంటది. తొందరపడుకులే బాబాయ్.’ అన్నది నాగమణి.
‘ఔ బిడ్డా! మంచిగ చెప్పినవ్ తియ్. నీ లెక్క తయారైందాన్క సూసి నెత్తిన గుడ్డ కప్పుకోవాలె.’ ఎటకారంగ అన్నడు రామయ్య. చిన్నబోయింది నాగమణి.
రామయ్యకు కోపం నడినెత్తికెక్కింది. తిట్లు అందుకున్నడు.
‘యినక యినక నీ మాటనే యినాలె యిగ. పిల్లొచ్చి తల్లిని యెక్కిరించిందనీ. ఏం మాట్లాడుతున్నవే పోరీ. నీకేం తాహతుందని పెద్దిర్కానికొచ్చినవ్.? నువ్వు జేసిన పనికే ఇజ్జతంత పోయి సగం సచ్చిండు మీ నాయిన. యిగ ఇప్పుడు నా వొంతు వొచ్చిందా? మమ్ముల్ని బొంద పెడ్తెగానీ మీ కండ్లు సల్లారేటట్టులేవు. థూ. నీయవ్వ. యేం ఆడపోరలు పుట్టిన్రురా నాయనా.’ చుట్ట బయటకు తీసి మంచం అవతలకు ఉమ్మిండు.
నాగమణికి కండ్లల్ల నీళ్లు గిర్రున తిరిగినయ్. వాటిని బయటికి చిమ్మకుండ చిన్నమ్మ దిక్కు సూశింది. చిన్నమ్మకు గూడ ముచ్చట నచ్చినట్టు లేదు. మొఖం దిప్ప్పుకొని ఎటో చూస్తుంది.
‘ఇగ యీడ కూసుంటె ఫాయిద లేదు.’ అనుకోంగనే ఇంట్లనుంచి బయటపడ్డది.
‘అవమానాలు పడటం పదేండ్ల కిందటనే అలవాటైంది. అమ్మనాయనలన్న మాఫ్ జేసిన్రు. కానీ యాడనన్న కనబడితె మందలించే బాబాయికి ఇన్నేండ్లకెల్లి కడుపుల ఇంత విషం ఉందా? బాబాయి ఇంటి దిక్కు సూశే అవసరం బడలే కాబట్టి తెల్వలేదు.’ బస్సు వచ్చి ఆగింది నాగమణి ముంగట. ఎక్కి ఖాళీ ఉన్న సీటు సూస్కోని కూసుంది.
రామయ్య నోట ఎన్నడూ తిరస్కారానుభవంలేదు నాగమణికి.
‘ఇయ్యాల ఆయన బిడ్డ సంధ్య తన ప్రేమ సంగతి తండ్రికి చెప్పమని బతిలాడితే కాదు ఆమె కోసం బాబాయి ఇంటి గడప తొక్కింది.’
అసలు ఆడపిల్లలను కన్నోల్లందరికీ తనలాంటోల్ల మీద ఇట్లనే కోపం ఉంటదేమో. అవసరం పడక సూడ్లేదు కానీ ఇన్నేండ్లల్ల గూడ లోకంతీరు ఏం మారలేదు అనుకుంది. మనసు మల్ల పచ్చి పుండైంది. కష్టాలు, సుఖాలు కలగాపులగమైన గతం కండ్ల ముంగటికొచ్చింది.
**
‘మీ నాయనున్నడా?’ చడీచప్పుడు లేని ఆ వాతావరణంల ఖంగున ఇనపడ్డది అనామక గొంతు. ఇంకా మొత్తం మగ గొంతుగా మారని జీరగొంతు. కిశోరావస్థను పట్టి చూపుతుంది.
యాప చెట్టుకింద నులక మంచంల పండుకొని నెత్తి ఆరబెట్టుకుంటున్న నాగమణి ఆ చప్పుడుకి లేశి కూసుంది. యీపున రెండు దెబ్బలు ఏసుకొని ‘లేడు’ అని జవాబిచ్చింది.
‘ఎప్ప్పుడొస్తడు?’ మల్ల అదే సౌండు. కోపమొచ్చింది నాగమణికి.
‘యీడి గొంతేంది ఇట్లుంది. డబ్బాల కంకరరాళ్లేసినట్టుందేందిరా నాయన. ఇనలేకపోతున్న.’ మనసుల అనుకుంట చికాకు మొఖం పెట్టింది. ఇంట్ల ఎవ్వరు లేరు కాబట్టి జవాబియ్యక తప్పలేదు.
‘పొద్దుగూకేసరికి వస్తడేమో. వస్తే ఏం జెప్పాలె?’ విసురుగ అడిగింది.
‘నేనొచ్చిపోయిన్నని చెప్ప్పు. మీ అమ్మ గూడ లేదా?’
‘లేదు. నేను అంటే ఎవ్వరు?’ తలకాయ నిలువుగ కిందకు మీదకు ఆడించుకుంట అడిగింది.
‘నన్ను గుర్తుపట్టలేదా? నీ క్లాస్‌మేట్‌ను. రెండు నెలల్లనే మర్షిపోయినవా?’ ఆశ్చర్యపోయిండు.
ఇద్దరూ పదో తరగతి పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నవాళ్లే.
‘క్లాస్మేట్వా?’ ఎవరబ్బా. ఇంత గుర్తుపట్టకుండ ఉన్నడు అనే ఆశ్చర్యం ఆమె మొఖంల కనబడ్డది. ఆమే అన్నది మళ్లీ.
‘ఏమో.! అంతమంది అబ్బాయిలున్నరు. నేను అందరిని గుర్తుపట్టలేను గాని, నీ పేరు, మీ నాయన పేరు చెప్పి పో. వచ్చినంక చెప్త. ఏం పనో చెప్పలేదు ఇంతకూ.’
‘క్లాస్‌మేట్లని గూడ మర్శిపోతవ్లే.’ కళ్లెగరేసి, మూతి ఇర్సిండు.
‘సర్లే ఇగ. నా పేరు అస్లమ్. మా నాయన పేరు ఇబ్రహీం. మా యింట్ల బాయి తొవ్వాలె. మీ నాయనను పిల్శుకరమ్మన్నడు మా నాయన. అందుకే వచ్చిన.’
‘ఓ! సారీ అస్లమ్. నీ పేరు తెల్సులే. రెణ్లెల్లల ఇట్ల మారి పోయినవు. వాయిస్ మారింది. కన్ఫ్యూజ్ అయిన.’ పశ్చాత్తాప పడ్డది.
‘ఇట్స్ ఓకేలే.! నేను మల్ల రావల్సిన పనైతే ఉండదు కదా. పక్కా చెప్తవుగా.?’ హామీ తీసుకొని ముస్కురాయించుకుంట ఎల్లిపోయిండు అస్లమ్.
అస్లమ్ ముస్కురాహట్కు నాగమణి గుండెల్లో సీతాకోకచిలుకలు మొలిచినయ్. అస్లమ్ పోవడానికి ఎన్కకు తిరిగిండు. నాగమణి లేశి నిలబడ్డది. అస్లమ్ ఇల్లు దాటిండు. నాగమణి తడకదాంక వచ్చి నిలబడ్డది. అతడు మూల మల్లిన తర్వాత తడక దగ్గరకేసి వచ్చి మంచంల కూలబడింది.
పది నిమిషాల కిందటి దాంక లేని రూపం మల్ల మల్ల సూడాలన్నట్లు ఆమె కండ్లల్ల కొలువైంది.
‘పక్కా చెప్తవుగా..!’ మాటతోపాటు అతడి నూనూగు మీసాల పెదాలపై విచ్చుకున్న లేత నవ్వు మాటిమాటికి గుర్తుకు వచ్చింది. ఆ ఒక్క గిలిగింత ఆమెను ఆమెకు కాకుండా చేసింది.
ఆరోజు సందేళ అమ్మనాయిన పని కెల్లొచ్చినా అస్లమ్ వొచ్చిపోయిన సంగతి చెప్పబుద్ధి కాలేదు. ఆమె అనుకున్నట్లు తెల్లారినంక అస్లమ్ రానే వొచ్చిండు.
‘ఎంకన్న మావా ఉన్నవా?’
‘ఆ ఆ.. అల్లుడా! దా దా! ఏందిటొచ్చినవ్?’ అడిగిండు వడ్డెర ఎంకన్న.
‘గుర్తుపట్టినవా నన్ను. మీ బిడ్డయితే రెండు నెలల్ల మొత్తం మర్షిపోయింది.’ నవ్విండు. నాగమణి మీద కంప్లైంటు ఇస్తున్నందుకు ఆమె కోసం సూశిండు కానీ కనబడలేదు.
‘అదేంది అల్లుడా.! నువ్వు మా ఇబ్రహీం బావ కొడుకువు గాదు. పోలికలు తెలుస్తనే ఉన్నయిలే.’ నవ్విండు ఎంకన్న.
‘అవును మామా. నాయన నిన్ను తీస్క రమ్మన్నడు. రిజల్ట్ వచ్చే లోపట ఇంట్ల బాయి రెడీ కావాల్నంట. కాలేజ్‌కు వేరే ఊరు పోవాలె కదనే. నేను లేకుంటే అమ్మకు కష్టమైపోతదని నాయన ఆలోచన చేస్తుండు.’ గబగబా మొత్తం చెప్పేసిండు.
‘జెర్రంత చాయ్ తాగి ఇద్దరం కలిసే పోదాం కూసో అల్లుడా.’ అనుకుంటనే ఇంట్లకు మొఖం తిప్పి బిడ్డను కేకేసిండు.
‘బుజ్జీ! ఇద్దరికి చాయ్ పట్కరా బిడ్డా.’
‘ఇద్దరికా. అమ్మా చాయ్ ఉడికిందానే,’ అనుకుంటనే వాకిట్లకు వచ్చింది నాగమణి. అస్లమ్‌ను చూడంగనే సిగ్గు ముంచుకొచ్చింది. ఎంటనే ఇంట్లకురికింది. చాయ్ తల్లి చేత పంపింది. చాయ్ తాగినంక ఇద్దరూ అస్లమ్ ఇంటికి బయల్దేరిన్రు.
**
‘ఓ బావా! ఎట్లున్నవే. ఔపడ్తనేలేవు. అంత బాగేనానే.’ చికెన్ కట్ చేస్తున్న ఇబ్రహీంను పలకరించిండు ఎంకన్న.
‘యాడ. వొస్తనే లేవైతివి. కూరగాయలు, చికెన్ ఏం తింటలేనట్టున్నవ్. బాగా జమా చెయ్ పైసలు.’ మజాక్ చేసిండు ఇబ్రహీం. ఇంట్లనే ముందు భాగంల చిన్నపాటి కిరాణం షాపు నడుపుతడు ఇబ్రహీం. పక్కనే చికెన్ గూడ అమ్ముతుంటడు.
‘మీ చెల్లె పెట్టిందే తింటున్నలే. నువ్వు చికెన్ పంపితే కాదంటదా ఏంది?’ తిప్పికొట్టిండు ఎంకన్న.
‘మీ బజార్ దిక్కు అప్ప్పుడప్ప్పుడు వొస్తనే ఉన్న. నువ్వు కనబడవైతివి. మా చెల్లే కనబడకనే పాయే.’ కట్ చేసిన చికెన్‌ను పాలిథిన్ కవర్ల ఏసి గిరాకీని పంపించి చేతులు కడుక్కొని వచ్చి కూసుండు ఇబ్రహీం.
‘మన భోజ్యగాని తండాకు గౌర్మెంటు రోడ్డు శాంక్షన్ అయింది కదనే. ఆడనే కంకర బోస్తున్నం. దాంతోటి అటే పోవుడైతుంది.’ ఇంటి దగ్గర ఉండని కారణం చెప్పిండు ఎంకన్న.
‘అట్లనా. మరె మీ అక్కేమో బాయి ఇప్ప్పుడే కావాల్నంటుంది. పెద్దోడు పదో తరగతి పరీక్షలు రాసిండు కదా. ఇన్ని రోజులు ఆడే నీళ్లు తెచ్చి బడికి పోయేటోడు. ప్యాసయితడంట. కాలేజ్‌ల చేరుతా అంటుండు. చిన్న పిల్లలతోటి కష్టమైతది బావా. అందుకని బాయి ఉంటే మంచిది అంటుంది మీ అక్క.’ చెప్పేసిండు ఇబ్రహీం.
‘రోడ్డు పని కాంగనే మొదలుపెడదాంలే బావా. ముందుగాల కోడ్‌ని గొయ్యాలే. నీళ్లు పడ్డంక యాటను గొయ్యాలె.’ వేళాకోళమాడిండు ఎంకన్న.
‘అట్లనే చేద్దాం లేవోయ్. ఎట్ల చేస్తవు? ఎప్ప్పుడు మొదలుపెడ్తవో చెప్ప్పు.’ క్లారిటీకోసం మల్ల అడిగిండు ఇబ్రహీం.
‘రోడ్డు పని కాంగనే ఇద్దరం వొస్తంలే బావా. ఎటు దిక్కు పడ్తుందో సూశిర్రా.’ ఇంటి పక్కనున్న ఖాళీ జాగాకెల్లి చూస్కుంట అడిగిండు.
‘ఏమో అది గూడ నువ్వే చూడు. కొబ్బరికాయ చేతులబెట్టి చూస్తవు కదా నువ్వు. జెర జల్దీ కానీయ్. మల్ల పిలగాడు చేతికింద లేకుంటే నాకు దుకాణం కూసొనుడు, ఇంట్లకు నీళ్లు తెచ్చుడు కష్టమైతది.’ తొందరపెట్టిండు ఇబ్రహీం.
‘సూద్దాం పా!’ అనుకుంట తువ్వాల తలకాయకు చుట్టుకొని ఖాళీ జాగా దిక్కు నడిషిండు ఎంకన్న.
‘తూ ఇదర్ బైఠ’ ఎనిమిదేళ్ల చిన్న కొడుకును షాపుల కూసోబెట్టి ఎంకన్న కెల్లి నడిషిండు ఇబ్రహీం.
అస్లమ్ గూడ వాళ్లతోనే ఉన్నడు.
రెండు వారాల తరువాత బాయి తొవ్వేటందుకు మాట్లాడుకున్నరు.
**
‘హాయ్! ఏ కాలేజ్‌ల చేరినవ్?’ పలకరించిండు అస్లమ్.
‘హాయ్. సిద్ధార్థ. నువ్వు?’ ఆసక్తిగా అడిగింది నాగమణి.
‘సిద్ధార్థలనే. ఎప్ప్పుడు జాయిన్ అయినవ్. కనబడలేదు.’
‘ఇయ్యాల్నే. మీ బాయి రెడీ అయిందా?’ అడిగింది.
‘ఆ అయింది. సరే గానీ హాస్టల్ల ఉంటవా? రోజూ వచ్చిపోవుడా? ఎట్లెట్ల?’ అడిగిండు.
‘మనూరోల్లు ఎంతమంది జాయిన్ అయిన్రు? ఇంకా ఎవరెవరు వొస్తున్నరో సూశి బాపుకు చెప్త. ఏమంటడో సూడాలె.’ చెప్పింది నాగమణి.
‘నేనైతే రోజూ వచ్చే పోత. మా అమ్మకు మస్తు కష్టమైతది. అయినా హాస్టల్ల నేనుండను.’ అస్లమ్ ఉద్దేశం స్పష్టంగ ఉంది.
నాగమణి ఆలోచనల పడ్డది. హాస్టల్ల ఉండొద్దని డిసైడ్ చేసుకుంది. తండ్రిని ఒప్పించుకోవాలనుకుంది.
నాలుగు కిలోమీటర్లు నడిచి బస్సు ఎక్కాల్సిన ఊరు వాళ్లది. బస్సు దిగిన తరువాత అంతే దూరం నడిచి ఇంటికి చేరుకోవాలి.
అస్లమ్, నాగమణిలను చూసి మరో పదిహేను మంది వచ్చిపోదామనే అనుకున్నరు. నడక బాధ లేకుండ సైకిళ్లపై వచ్చి ఒకరింట్ల పెట్టుకునేటట్లు ఆ ఊరి సర్పంచుతోటి ఈ ఊరి సర్పంచు మాట్లాడి ఒప్పించిండు.
ఎవరు ఏ సైకిల్ ఎక్కినా, దిగినా నాగమణి అస్లమ్ సైకిల్‌ను కబ్జా చేసుకుంది. ఆమె లోపల పెరుగుతున్న అనుబంధం, భావాలు అతడికి పూర్తిగా తెలవదు కానీ, కుటుంబాలల్ల దోస్తీ ఉండటంతోటి అందరికంటే కొద్దిగా ఎక్కువ క్లోజ్ అనుకుంటున్నట్టుంది అనే అనుకున్నడు అస్లమ్. దోస్తులు ఆటపట్టించినా నాగమణి లెక్కచేసేది కాదు.
ఒకరోజు నాగమణి అడిగింది అస్లమ్‌ను.
‘మీ అయ్యకు చెప్పి సెల్‌ఫోన్ కొనిపించుకోరాదు.’
‘రాదు. ఇప్పియ్యడు. డిగ్రీలనే సెల్. అయినా కాలేజ్‌ల అలో చేయరు?’
‘అట్లనా. నేను మా అయ్యను అడుగుదామనుకుంటున్న. ఎహే నువ్వు గూడ ఇప్పిచ్చుకో. కాలేజ్ తరువాత మాట్లాడుకుందాం.’ కొంటెగా ఉంది నాగమణి గొంతు.
వెనుకనుంచి వినపడుతున్న ఆమె గొంతుల ఏందో మర్మం ఉన్నట్టు అనిపించింది. ఏమీ మాట్లాడకుండ ఉండిపోయిండు.
‘ఏంది అస్లమ్ మాట్లాడవు. ఇంతగనం వొర్లుతున్న నేను.’ ఆమెకు తొందరగ చికాకు వస్తది.
‘ఏం లేదులే. ఇప్ప్పుడు సెల్ వొద్దు ఏమొద్దు. ముందు ఇంటర్ ఫస్ట్ మార్క్స్ రావాలె. నీ టార్గెట్ గూడ అదే పెట్టుకో.’ సైకిల్ ముందుకు పోతనే ఉంది.
‘ఓయబ్బో! సదువుల మేస్త్రీ దిగిండయ్యా. మేమందరం మొద్దులం మరి.’ మూతి తిప్పింది.
అస్లమ్ సైలెంటుగ ముస్కురాయించిండు తప్ప జవాబియ్యలేదు.
రోజు రోజుకు వాళ్లిద్దరి మధ్యన మాటలు ముదురుతున్నయ్. వాళ్ల మధ్య ఏందో నడుస్తుందని దోస్తులందరు చెవులు కొరుక్కోబట్టిర్రు.
ఒకరోజు గొల్లోల్ల నాగరాజు అస్లమ్‌ను ఊరి బయట పత్తి చేన్లకు తీస్కబోయి ఒక బండరాయిమీద కూసోబెట్టి విషయం అంత చెప్పిండు.
‘ఎహె! ఊకో. ఆ పిల్లేందో ఏరేటోల్ల సైకిల్ ఎక్కదు. అంతమాత్రాన లవ్ అనుకుడేందిరా? దిమాక్ గిట్ల కరాబయిందా మీ అందరికీ?’ తలకాయ పట్టుకున్నడు అస్లమ్.
‘నిజ్జం రా. ఆ మంగలోల్ల లలితను అడుగు. నాగమణి మీ స్టోరీ మొత్తం చెప్పిందంట.’ సీరియస్గ ఉంది నాగరాజు గొంతు.
‘అరేయ్! ఆ పోరి చెప్ప్పుడు కాదు. మేము మీతోటే వస్తున్నం. మీతోటే పోతున్నం. మీకు తెల్వకుంట ఏముంటదిరా మా మద్దెన?’ విసుక్కున్నడు.
‘ఏమోరా బయ్. ఇండ్లల్ల తెలిసిందనుకో మ్యాటర్ సీరియస్ అయితది. నాగమణితోటి చెప్ప్పు అట్ల చెప్ప్పుకుంట తిరగొద్దని. ఉత్త పున్యానికి బదనాం అయితర్రా. మనూర్ల కొట్లాటలు ఎట్లుంటయో తెలుసుకదా.’ నాగరాజు హెచ్చరికల దోస్తుగాని క్షేమం ఉంది.
‘సరేలే. రేపు కాలేజ్‌కు వస్తది కదా. మాట్లాడతా. మన బ్యాచ్ అందరికీ క్లారిఫై చెయ్యాల్నా ఇప్ప్పుడు.’ తలకాయ పట్టుకున్నడు.
‘ఇగ సైకిల్ ఎక్కిచ్చుకోకురా. ఎట్ల పోతదో పోయి రానీ. ఒక్కతే పోయొస్తుంటే తెలుస్తది.’ కచ్చగ అన్నడు నాగరాజు.
ఆ రాత్రి అన్నం సరిగ్గా తినలేదు అస్లమ్. నిద్ర పట్టలేదు. నాగమణిని పట్టుకొని దులిపేయాలనుంది. కాలేజ్కోసం బయటికొస్తేకానీ కలవదు.
‘రానీ చెప్త.’ కసిగ అనుకున్నడు.
అనుకున్న టైం రానే వచ్చింది. రోజూ స్టార్ట్ అయ్యే సైకిల్ పాయింట్ దగ్గరకు అందరికంటే ముందే వచ్చి నిలబడ్డడు అస్లం. ఆ తరువాత ఒక్కొక్కరు వస్తున్నరు.
‘నాగమణి కోసం తొందరగొచ్చినవా అస్లమ’ కిసుక్కున నవ్వింది గౌండ్లోల్ల రజిని.
ఉడికిపోతుంది అస్లమ్ మనసు. రాత్రంత నిద్రపోలేదని అతడి కండ్లు చూసినోళ్లకు ఊకెనే అర్థమైతది.
‘రానీ చెప్త’ పండ్లు కొరుక్కున్నడు. రజినికెల్లి కోపంగ చూసిండు. మాతోటే తిరుక్కుంట ఇజ్జత్ లేకుంట ఎట్ల మాట్లాడతరీ మనుషులు అని ఆమె గొంతు పిసికేయాలన్నంత కోపం వచ్చింది. కోపంగ ఉన్న అతడి చూపులకు తలకాయ తిప్ప్పుకుంది రజిని. ఇంతల నాగరాజు వచ్చిండు సైకిల్ మీద.
‘ఈ రోజు నీ సైకిల్ మీద నేను వస్త’ నాగరాజును అడిగింది రజిని.
‘వద్దులేవమ్మా! ఇయ్యాల నా సైకిల్ల గాలి తక్కువుంది. ఆ కోటి గాడి సైకిల్ మీద రా. నేను గా బక్క పిల్ల మీరాను ఎక్కించుకుంట.’ నవ్వుకుంట అన్నడు నాగరాజు.
కోపంతోటి చూసింది రజిని. లైట్ తీసుకున్నడు నాగరాజు.
అరగంట నుంచి ఎదురు చూస్తున్న నాగమణిలెక్కనే కనబడింది. గానీ అవునో కాదో అర్ధమైతలేదు. రోజు కంటే డిఫరెంట్‌గా ఉంది. లంగా ఓణీల ఉంది. కనకాంబరాలు నిండిన జడను ముందుకు ఏస్కోనీ అందమైన పూలచెట్టులెక్క అటే నడుచుకుంట వొస్తుంది ఒక అమ్మాయి.
‘అరేయ్ నాగ్గా. ఆ వచ్చేది నాగమణేనారా?’
‘ఆమె లెక్కనే కొడ్తుందిరా. జెరంత దగ్గరకు రానీ. గుర్తుపడదాం.’
కనుచూపు మేరకు వచ్చిందా పూల చెట్టు. అవును నాగమణే. దేవుడికి గట్టిగ పూజ చేసిందని ఆమె నుదుటన ఉన్న బొట్లు చెప్తున్నయ్. చేతికి కొత్త వాచీ పెట్టుకుంది.
అస్లమ్ కోపం సంగతి మర్చిపోయిండు. ఆమె దగ్గరరాంగనే నాగరాజు అందుకున్నడు.
‘ఏంది మేడం ఇయ్యాల స్పెషల్గ కనబడుతున్నవు. ఏంది కత.?’
‘నా బర్త్ డే రా. నిన్ననే టౌనుకు పొయ్యి కొత్త డ్రెస్ తెచ్చిండు మా నాయన. బాగుందానే.’ చేతికున్న గాజులు చూసుకుంటా రజినిని అడిగింది.
‘ఓ మస్తున్నవే. ఫస్ట్ టైం ఇట్ల చూస్తున్నమే నిన్ను. అందుకే దగ్గరికొచ్చినంక గుర్తుపట్టినం.’ అన్నది రజిని ఎగాదిగా చూసుకుంట.
‘స్టార్ట్ అవుదమా?’ సీరియస్గ నాగరాజువైపు చూస్కుంట అన్నడు అస్లమ్.
‘హర్రే! ఈడి పనైపోయిందిరా. ఇట్ల నేల చూపులు చూస్తుండు. ఇగ ఈడేం దులుపుతడు. ఛత్!’ మనసుల తిట్టుకుంటనే అస్లమ్ దిక్కు చూసిండు. తిట్టమని సైగ కూడ చేసిండు.
సైకిల్ హాండిల్ పట్టుకున్న అస్లమ్ వద్దు అన్నట్టుగ తలకాయ అడ్డంగ ఊపిండు. వాళ్ల సైగలు అర్థం కాని నాగమణి అస్లమ్‌ను పలకరించింది.
‘బర్త్ డే విషెస్ గూడ చెప్పవా అస్లమ’ తియ్యగ ఇనపడిన ఆ మాటల తీరుకు రాత్రి నుంచి కూడబెట్టుకున్న కోపమంతా వెన్నలెక్క కరిగిపోయింది. మొహమాటపడ్డడు. నవ్వు పులుముకొని నాగమణి దిక్కుకు మల్లిండు.
‘హాపీ బర్త్ డే.’ కొంచెం సిగ్గు పడుతూ చెప్పిండు. నాగరాజు నెత్తి కొట్టుకుండు.
నాగమణి బ్యాగు లోపట్నుంచి చిన్న బాక్సు తీసి అస్లమ్‌కు ఇచ్చింది. మరొక పెద్ద బాక్సు తీసి నాగరాజు చేతిల పెట్టింది.
‘అస్లమ్! ఇది నీ కోసమే స్పెషల్.’ మెల్లగా అన్నది అతడి వైపు చూస్తూ. ఆ చూపుల్లో ఆరాధన తొంగి చూసింది.
నాగరాజు గందరగోళంగా చూస్తున్నడు.
‘ఇంత పెద్ద బాక్సు ఎవరికోసం తల్లీ. నాకొక్కడికేనా.’ నాగరాజు కవిత్వంలెక్క అడిగిండు.
‘లేదురా. నువ్వు తీసుకొని రజినికియ్యి. అందరం తిందాం’ చెప్పింది నాగమణి.
అస్లమ్ పరిస్థితి అయోమయంగా ఉంది.
‘నిన్న నాగ్గాడు చెప్పింది నిజమే. ఈ పిల్ల వాలకం ఇంకోరకంగా ఉందే.’ ఆలోచిస్తున్నడు.
‘ఏంది అస్లం తినవు.? గులాబ్ జామూన్ మా జానకమ్మత్తతోటి చేపించిన. నీ కోసమే.’
‘నాగమణి తీరు సూటిగా స్పష్టంగనే ఉంది. యాడ కొట్టిందబ్బా దెబ్బ.’ చూపుడు వేలుతోటి కింది పెదవి కొరుక్కుంట ఆలోచిస్తున్నడు అస్లమ్.
‘నేను లంచ్ టైంల తింటలే.’ బాక్స్ బ్యాగుల పెట్టుకొని అప్పటికి వాయిదా వేసిండు.
అందరి సైకిళ్లు స్టార్ట్ అయినయ్. దారంతా అస్లమ్‌కు ఒకటే ఆలోచన. వెనుక కూసున్న నాగమణి మాట్లాడతనే ఉన్నా అతడి మనసు అల్లకల్లోలంగా మరెక్కడో ఉంది.
‘నేను అస్లమ్ సైకిల్ మీదనే వస్తా అన్నది మొదట్ల. రోజూ వస్తనే ఉన్నది. ఎవ్వరితోటి ఎక్కువ మాట్లాడదు. నాతోని ఇంట్ల ముచ్చట్లు, క్లాస్మేట్ల ముచ్చట్లు, టీచర్ల ముచ్చట్లు అన్నీ చెప్తనే ఉంటది. నేనే పట్టించుకోలేదా?’ పరంపర సాగుతుంది.
ఆరోజు క్లాసు అయిపోయిన తరువాత ఎవ్వరికోసం ఎదురు చూడకుండా నాగమణిని ఎక్కించుకొని ముందుగాల బయల్దేరిండు.
ఒక చిన్న కాలువపైన రోడ్డు పక్కన కట్టిన డ్రాప్ మీద కూసున్నరు ఇద్దరు. ముందు అస్లమే స్టార్ట్ చేసిండు.
‘ఏంది నాగమణి ఇది. అందరికి ఒక బాక్సు ఇచ్చి, నాకు వేరే బాక్సు ఎందుకు తెచ్చినవ్?’ ఆ గొంతుల మార్దవం తొంగి చూసింది.
ఎప్పటిలెక్క నవ్వుకుంట హుషారుగ కనబడే నాగమణి లేదు అక్కడ. కండ్లల్ల నీళ్లు. మొఖం ఎర్రబడింది. గొంతు నిండుకుంది. మాట పెగుల్తలేదు. తడబడుతున్నట్టు కనబడ్డది.
లంచ్ బాక్స్ తీసుకొని కాల్వలకు దిగి కొన్ని నీళ్లు తెచ్చి తాగమని ఇచ్చిండు. సైలెంటుగ అందుకుంది. కొన్ని తాగింది. ‘దోస్తుగాళ్లు ఏమనుకుంటరు చెప్పు? ఇప్పటికే ఏందేందో అనుకుంటున్నరంట. నువ్వే చెప్పూకుంట తిరుగుతున్నవంట. ఇంగ వేరేటోల్లకు సందిచ్చినట్టు కాదు? ఆల్లంతగనం పుకార్లు లేపితే మన ఇండ్లల్ల తెలిస్తే ఏమంటరు చెప్పు?’ మెత్తగ మాట్లాడుతున్నడు. అతడి మాటల్లో భవిష్యత్తు గురించిన ఆందోళన, తన ఇంటి పరిస్థితులు, తనకు ఉన్న బాధ్యతలు అన్నీటిని ఆమె అర్థం చేసుకోవాలని ఉన్నట్లుంది ఆ ధోరణి.
‘ఏమనుకుంటరు? ఏమన్న అనుకోనీ. ఔ! బరాబర్ చెప్పిన. అట్ల చెప్ప్పుకోవటం నాకిష్టం. నీకిష్టమా కాదా చెప్ప్పు.’ కండ్లు తుడుచుకుంట గట్టిగ నిలదీసింది.
‘మీ నాయన ఏమనుకుంటడు. మీ అమ్మ ఏమనుకుంటది. రోజు నేను సైకిల్ ఎక్కించుకొని తీస్కపోతే చూసినంత స్నేహంగ చూస్తరా రేపు?’
అంత దూరపు ఆలోచనకు ఆశ్చర్యపోయింది నాగమణి. ఏమీ మాట్లాడలేదు.
‘ఏమోలే. ఇంటికి పోదాం నడువు.’ లేచి నిలబడ్డది.
‘అది కాదు. రెండు మాటలు చెప్త విను.’
వెంటనే కూసుంది.
‘మా ఇల్లు చూసినవు కదా. మా పరిస్థితి తెలుసు కదా. నేనే పెద్ద కొడుకును. మాకు ఆ కిరాణా కొట్టు తప్ప ఇంకో ఆధారం లేదు. కొంచెం బాగా చదివితే ఏదన్న జాబ్ వస్తే నా తరువాత తమ్ముళ్లకు, చెల్లెళ్లకు ఆసరా అయితది. మా అమ్మ రోజూ ఈ విషయాలు చెప్తనే ఉంటది తెలుసా?’
‘తెల్వదు. నువ్వెన్నడు చెప్పలేదు కదా.’ ముభావంగ జవాబిచ్చింది.
‘ఇన్నిరోజులు అవసరం పడలేదు. ఇప్ప్పుడు చెప్తున్న కదా. చానా బాధ్యతలున్నయి. నీకు సెట్ కాను. నువ్వు ఆ ఆలోచనలు మానుకో. మంచిగ చదివితే నువ్వు గూడ జాబ్ చేయొచ్చు.’ సలహా ఇచ్చిండు.
‘థాంక్స్ నీ సలహాకు.’ విసురుగా లేచింది.
‘హర్రే. రెండు నిమిషాలు కూసో. మన దోస్తుగాళ్లు వచ్చినంక కలిసిపోదాం. మీ నాయన గూడ రెక్కలు ముక్కలు చేసుకుంటున్నడు. మీ అక్క పెండ్లికి అయిన అప్పే ఇంకా తీరుస్తున్నరు. అమ్మ గూడ కాయకష్టం చేస్తుంది కదా. నువ్వే ఆలోచించాలి. నీకు జాబ్ వస్తే ఆల్లు ఖుష్ అయితరు.’
‘నేనేమన్న చదువుకోను అని చెప్పిన్నా? జాబ్ చేయనని చెప్పిన్నా? ఎందుకు క్లాసులు పీకుతున్నవ్. అవును. నువ్వంటే ఇష్టమైంది. ఇప్ప్పుడు కాదు. మీ ఇంట్ల బాయి గురించి మా నాయనకోసం వచ్చినవ్జూడు అప్పటినుంచే మొదలైంది. అప్పటినుంచి గుండెల్లనే దాపెట్టుకున్న. నీకెన్నడన్న చెప్పిన్నా ఏంది?’ చికాకు, కోపం, ఏడుపు కలగలిసి తన్నుకొచ్చినయ్ నాగమణికి.
కంగారు పడ్డడు అస్లమ్.
‘అయ్యో! అట్లకాదు నాగమణి. నేను మరీ అంతలా ఎప్ప్పుడూ అనుకోలేదు. నాకు మా నాయన చేసిన అప్ప్పులు తప్ప ఏం గుర్తుండవు. సారీ.’
‘ఎవడిక్కావాలి నీ బోడి సారీ. నువ్వే ఉంచుకో.’ కండ్లు తుడుచుకుంటున్నది నాగమణి.
అస్లమ్ తన జేబుýనుంచి దస్తీ తీసి ఆమె కండ్లు తుడిచిండు. ఆమె చేతులు పట్టుకున్నడు. ఆమె కండ్లల్లోకి ప్రేమగా చూసిండు.
‘సరే మరి. మనం ఇద్దరం కలిసి ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్.డీ అన్నీ కలిసే చేస్తున్నం. సరేనా. అప్పటిదాకా మన విషయం పిట్ట పురుగుకు గూడ తెలవొద్దు.’ అస్లం కండీషన్ పెట్టిండు.
‘తెలిస్తేందంట. ఏం చేస్తరు?’ మొండిగ వాదించింది.
‘పిచ్చిదానివా మంచిదానివా. దోస్తానాకు పనికి రాని కులాలు, మతాలు పెండ్లిల్ల ముందుంటయి. అయినా ఎన్ని చూస్తలేము. సంపుకుంటున్రు ఒకల్లకొకలు. న్యూస్ చూడవా నువ్వు?’
‘అయితే ఏంది. మీ నాయన, మా నాయన మన లెక్కనే ఫ్రెండ్స్ కదా?’
‘ఛ. ఫ్రెండ్‌షిప్‌ల కనబడని అంతరాలు లవ్షిప్ల పుట్టుకొస్తయిలే. నువ్వు జర లోకంతీరు తెలుసుకో. రోజూ పేపర్ చదువు. విషయాలు అర్థమైతయి. అప్పటిదాకా ఏ విషయం ఎవ్వరితోనూ మాట్లాడనని మాటియ్యి నాకు.’
‘సరేలే. థాంక్స్.’
‘ఎందుకు’ ముస్కురాయించిండు అస్లమ్.
‘అట్ల నవ్వకురా. ఆ నవ్వే నా కొంప ముంచింది.’ బ్యాగు భుజానికి తగిలించుకుంట అన్నది నాగమణి.
ఇద్దరూ ఎప్పటిలాగే ఇంటిదారి పట్టిన్రు.
రోజులు గడుస్తున్నయి. ఇంటర్ అయిపోయింది. డిగ్రీ జాయిన్ కావాల్సి ఉంది.
**
‘అరేయ్ అస్లమ్. నాగమణికి ఇయ్యాల పెండ్లి చూపులంటరా!’ పొద్దు పొద్దున్నే షాపుల కూసోని చాయ్ తాగుతున్న అస్లమ్‌కు వార్త అందించిండు నాగరాజు.
ఏం అర్థం కాలేదు అస్లమ్‌కు.
‘నాగమణి ఏమన్నదిరా?’ జారిపోతున్న గుండెను గుప్పిట్లకు తెచ్చుకుంటున్నట్లు అడిగిండు.
‘నీతోటి చెప్పమన్నదిరా.’ సెలవులల్ల నాగరాజే ఇద్దరికీ మాటలు చేరవేస్తున్నడు.
‘ఎట్లనన్న పెండ్లి చేసుకోను, ఇంకా చదువుతా అని చెప్పమనురా. ఈ లోపట ఏం చేయాల్నో ఆలోచిస్తా.’ ఆ మాట చెప్పి పంపిండు.
ఆరోజు మధ్యాన్నం మల్లొచ్చిండు నాగరాజు. ఇద్దరు కలిసి ఊరవతలికి పోయిన్రు.
‘అరేయ్. అబ్బాయి పీజీ చేస్తుండంట ఓయూల. అంజనపెల్లి అంట. బాగనే ఉన్నోల్లంట. పదెకరాలుందంట. మంచి ఇల్లు అంట. అబ్బాయి కూడా బాగుండంట. కట్నం గూడ ఎక్కువ అడిగేటట్టులేరంట.’ చెప్ప్పుకుపోతుండు నాగరాజు.
‘ఎవరు చెప్పిర్రురా నీకు?’
‘ఇంకెవరు. మీ మామే చెప్పిండు.’
‘ఇంక మామ అయితడారా?’ దిగాలు పడ్డడు అస్లమ్.
‘నీకే మామ అయితడురా. నన్ను నమ్ము. ఇద్దరు కలిసి ఏ ఊరికన్న పారిపొండి. మెల్లంగ ఆల్లే ఒప్ప్పుకుంటరు.’
‘ఏం మాట్లాడుతున్నవురా. వద్దు. అందరు బాధ పడ్తరు. అయినా నేను చానా చదువుకోవాలె. మా ఇంటిని ఒక లెవెల్‌కు తీస్కరావాలే. నేనిట్ల పోతే తమ్ముళ్లేమో కానీ, మా చెల్లెండ్లకు పెండ్లిల్లు కావురా. అట్ల చెయ్యను.’
‘మీ చెల్లెళ్లు పెద్దగయ్యేటప్పటికీ అన్ని మారిపోతయిలేరా. అట్లెందుకుంటదిరా జమానా.’ నచ్చజెప్పచూసిండు నాగరాజు.
అస్లమ్ మనసు ఒప్ప్పుకోలేదు.
‘అట్ల పోలేనురా. నాకే కాదు. ఎంకన్న మామ గూడ నాకెర్కే. ఎంత బాదయితదిరా ఆల్లకు. నా సంతోషం కోసం ఇంత మందిని బాదపెట్టలేనురా’ అస్లమ్ కండ్లల్ల నీళ్లు తిరిగినయ్.
**
‘ఏం మాట్లాడుతున్నవే పోరీ. వొద్దు. మీ అయ్యను నేనే ఒప్పిస్త. జెరంత ఓపికపట్టు.’ మొబైల్ý మాట్లాడుకుంట నాగమణిని సంఝాయిస్తున్నడు అస్లమ్. ఈ మధ్యనే నాగరాజు సెల్ ఫోన్ కొనుక్కున్నడు. నాగమణికి ఆమె కాబోయే మొగుడు గిఫ్టుగ సెల్ ఫోన్ ఇప్పించిండు.
‘నువ్విట్లనే మాట్లాడుతుండు. మా అయ్య ఆడికి కట్టబెడ్తడు. సూస్తుండు నువ్వు. పెండ్లిలనే పాయిజన్ తాగుత చూస్కో.’ హెచ్చరించింది నాగమణి.
‘ఇగో. మంచి మాటలతోటి చెప్తున్న. నువ్వు అసుమంటి పనులేం చెయ్యవు. పెండ్లి చేసుకోవడం ఇప్ప్పుడే ఇంట్రెస్టు లేదని ఆ పోరగానితోటి చెప్ప్పు. ఫోన్ ఉందిగా. ఇప్ప్పుడే కాల్ చేసి చెప్పు రోజు రోజుకు అస్లమ్‌కు ఊపిరాడట్లేదు. ఏం చెయ్యాల్నో తోచట్లేదు. ఇంటర్ ఫస్ట్ క్లాస్‌ల పాస్ అయిండు అస్లమ్. మిగిలిన వాళ్లందరూ సెకండ్ క్లాస్‌ల పాస్ అయిన్రు. డిగ్రీ కాలేజీల జాయినింగ్ కోసం చూస్తున్నరు అందరూ.
‘ఏ పో. ముక్కు మొహం తెల్వదు. నేనెట్ల చేస్త ఫోను. నాకు మాట్లాడటం ఇష్టంలేదు.’ చెప్పేసింది నాగమణి.
‘చదువుకునే వయసుల జీవితానికి సంబందించి ఏం నిర్ణయాలు చేస్తం చెప్ప్పు మనం. ఏజ్ పెరగాలె. క్వాలిఫికేషన్ ఉండాలె. జాబ్ ఉండాలె. అప్ప్పుడు మీ అయ్యతోని మాట్లాడేటందుకు ఒక స్టేటస్ ఉంటది నాకు. ఇప్ప్పుడు నీ పెండ్లికొడుక్కు అది ఉంది. మరి నేనేం జెయ్యను చెప్ప్పు?’ అస్లమ్ క్లియర్గ ఉన్నడు.
‘మా బాపు చదివియ్యడంట. నేనేం చేస్త. ఇప్పటికే చానసార్లు చెప్పి చూసిన. చదువుకుంట అని. అయినా ఇంటలేడు.’
‘అన్నం తినకు. చదువుత అని మొండిపట్టు పట్టు. మీ బాపుకు నువ్వంటే చానా ఇష్టం. ఒప్ప్పుకుంటడు. నా మాటిను. సరేనా.’ ఒప్పించిండు అస్లమ్.
నాగరాజు వెళ్లి పోయిండు.
**
‘ఏం మొండి పిల్ల. ఎట్లున్నవ్.?’ నాగమణిని చానా రోజులకు చూసిండు అస్లమ్. డిగ్రీల జాయిన్ అయితున్నరు. హుషారుగ ఉంది అస్లమ్ గొంతు. నాగమణి మొఖంల సంతోషం. చానా రోజులకు ఒకలకొకలు చూసుకున్న ఆనందం అది. ఇప్ప్పుడు వాళ్లూరికే బస్సు వస్తుంది. సైకిళ్ల మీద వెళ్లే అవస్థ తప్పింది.
సిగ్గు పడుతూ చూసింది నాగమణి. మొబైల్ తెరిచి ఏదో రాసి ప్రేమ నిండిన కండ్లతో అస్లమ్ చేతికిచ్చింది.
‘ఐ లవ్ యూ’ హార్ట్ సింబల్‌తో రాసిన అక్షరాలు చదివే సరికి మైమరిచిపోయిండు అస్లమ్.
‘ఈ బంగారాన్ని పోగొట్టుకుంటే లైఫ్ అంత ఎంత పస్తాయిస్తుండేటోడ్నో’ అనుకున్నడు. మెల్లగ నాగరాజుకు చూపించిండు. నాగరాజు అస్లమ్‌ను హత్తుకున్నడు.
‘మనందరం ఎప్పటికి ఇట్లనే ఉండాలెరా’ అన్నడు కండ్లు తుడుచుకుంట.
వాళ్ళను చూసిన నాగమణి కండ్లు ఒత్తుకుంది.
‘మా బాపు ఒప్ప్పుకోకపోతే ఇయ్యాల ఇక్కడుండేదాన్ని కాదురా’ అన్నది నాగమణి.
‘పోనీలే. ఒప్ప్పుకున్నడుగా.’ అన్నడు అస్లమ్ గుంభనంగా. నాగరాజు సైలెంటుగ ముస్కురాయించిండు. అస్లమ్ చెయ్యి గట్టిగ నొక్కి పట్టుకున్నడు.
అం్పునపెల్లి పెండ్లికొడుక్కి అస్లమ్ ఫోన్ చేసి తన ప్రేమ గురించి చెప్పిన సంగతి వాళ్లిద్దరికే తెలుసుమరి. ఇంకా పై చదువులకు పొయ్యేదుందని రెండు మూడేండ్లదాంక పెండ్లి చేసుకోనని ఎంకన్నకు చెప్పేసిండు. ఇదంతా నాగమణికి తెల్వదు.
నాగమణి ఈడుకు వచ్చినప్పటి నుంచి అడుగడుగున పెండ్లి చూపుల గండాలే ఎదురైతున్నయి.
అస్లమ్ సెల్ ఫోన్ కొన్న తరువాత ఇద్దరి మధ్యన ముచ్చట్లు ఎక్కువైనయ్. ఫోన్ వదలని బిడ్డను చూస్తుంటే అమ్మనాయనలకు విసుగు వస్తుండే.
ఒక ఆదివారం పూట ఇట్లనే యాప చెట్టు కింద పండుకొని మస్తు ముచ్చట పెడ్తుంది నాగమణి. చికాకు పడిన వాళ్ల అమ్మ ఫోను గుంజుకొని ముచ్చటంత ఇన్నది. వణికిపోయింది నాగమణి. నిలదీసింది నీలమ్మ. విషయం మొత్తం చెప్పక తప్పలేదు నాగమణికి.
‘పొయ్యి పొయ్యి తుర్కోణ్ని తగులుకున్నవేందే’ శోకాలు పెట్టింది నీలమ్మ.
‘అయితేమైంది. మంచోడు. మంచిగ అందంగ ఉంటడు.’ చెప్పింది. బిడ్డ చెంప పగలగొట్టింది నీలమ్మ.
‘అందరు ఏమనుకుంటరు. నీ అక్కను అత్తగారోల్లు ఏమంటరు? ఆలోచించినవా? నీ ఒక్కదాని బతుకే సూస్కుంటవానే.’
‘అదంత నాకు తెల్వదు. అస్లమ్‌ను చేస్కుంటే ఆస్తి ఉండకపోవచ్చు కానీ అక్క లెక్క మొగుడి చేతుల తన్నులు తినను. అత్తగారింట్ల అక్కలెక్క కష్ట పడను. ఆల్లందరు మస్తు మంచోల్లు.’
‘ఇట్ల మాటలకెందుకింటవే నువ్వు. మీ నాయన రాని. కండ్లల్ల కారం బెడ్తే తెలిసొస్తది.’ పండ్లు నూరుకుంట పోయింది నీలమ్మ. వంట చేస్కుంటనే శోకాలు పెట్టింది.
జరిగిందంత అస్లమ్‌కు మెసేజ్ చేసింది. అతడు గూడ టెన్షన్ల పడిపోయిండు. దారి తెల్వలేదు. రెండు రోజులు గడిచిపోయినయ్.
మూడో రోజు దీపాలు పెట్టే యాల మస్కూరు వచ్చిండు అస్లమ్ వాళ్లింటికి.
‘రేపు పదకొండింటికి సర్పంచు ఇంటికి రమ్మన్నడు నిన్ను.’ ఇబ్రహీంకు చెప్పి పోయిండు.
సర్పంచు ఎందుకు పిలిపిచ్చిండో ఇబ్రహీంకు అర్థం కాలేదు. అస్లమ్‌కు తెలిసినా తండ్రితోటి చెప్పే సాహసం చేయలేకపోయిండు.
ఎప్పటిలెక్కనే తెల్లారింది. ఇబ్రహీం, అస్లమ్ సర్పంచ్ మల్లయ్య ఇంటికి చేరుకునేటప్పటికే ఎంకన్న, నీలమ్మ కూసోనున్నరు. కొంతమంది ఆల్ల కులపోల్లు గూడ ఉన్నరు.
ఇబ్రహీంకు అంతా అయోమయంగ ఉంది. అస్లమ్ ఇంటి గేటు దగ్గరనే నిలబడి తండ్రిని పొమ్మని చెప్పిండు.
‘కైకు రే. చల్ మై హూ నా.’ ఏదో అర్థమైనట్లు అభయమిచ్చిండు తండ్రి. జవాబు చెప్పలేని అస్లమ్ తండ్రి వెనుక అడుగులేసుకుంట పోయిండు. అస్లమ్ కంట్ల పడంగనే ఎంకన్న కోపంగ లేశిండు.
‘ఎంకన్నా. కూసో.’ గదమాయించిండు సర్పంచ్.
‘అన్నా. పిల్శినవంట.’ అన్నడు ఇబ్రహీం. ఎంకన్నకు కోపం ఎందుకో ఆ యింత అర్థం కాలేదు.
‘ఎందుకు పిల్శిన్నో నీకు తెల్వదా ఇబ్రహీము.’ మల్లయ్య గంభీరంగ అన్నడు.
‘ఏమో అన్నా. తెల్వదు. అగో ఆ సంతోష్ రెండు సార్లు చికెన్ ఉద్దెర తీస్కపోయిండు. అయినా ఇంకా నేనింకా పైసలే అడగలేదన్నా.’ నెత్తి గోక్కుంట చెప్పిండు ఇబ్రహీం.
‘నువ్వూ, నీ చికెన్ గోల. ఇంకేం పట్టదా నీకు?’ చికాకు పడ్డడు మల్లయ్య.
‘ఏమైందన్నా.’ ఆశ్చర్యంగ చూసిండు.
‘ఏం తెల్వకుంటనే ఊపుకుంట వచ్చినావ’ చేతులు తిప్పింది నీలమ్మ.
‘నీలమ్మా. ఊకో. మాట్లాడుతున్న కదా.’ మల్లయ్య చెయ్యి ఊపిండు.
‘ఏందే. ఏం అర్ధమైతలేదు. ఏం చేసిన నేను.’ ఇబ్రహీంకు అంత గజిబిజిగుంది.
‘నీ గురించి కాదు. నీ కొడుకేంజేసిండనుకుంటున్నవ్?’
‘ఏమో. తెల్వదే.’
‘అగో ఎంకన్న బిడ్డ, నీ కొడుకు యవ్వారమంట. ఏం చెప్తవో చెప్ప్పు ఇగ.’ జేబుల నుంచి సిగరెట్ తీసి వెలిగించిండు మల్లయ్య.
పక్కనే పిడుగు పడ్డట్టు అదిరిపడ్డడు ఇబ్రహీం. తలదించుకున్న కొడుకును చూసిండు. వాళ్లద్దరూ ఒక్క సైకిల్ మీద పోంగ ఎన్నోసార్లు చూసిండు. ఊళ్లె ఆడ పిల్లలు చదువుకోవాల్నంటే మగ పిల్లలు సైకిళ్ల మీద తీసుకపోనీయాల్నని చెప్పిన సర్పంచే ఇయ్యాల నిలదీసి అడుగుతున్నడు.
అయోమయంగ ఉంది ఇబ్రహీంకు.
‘క్యా హైరే యే?’ కొడుకును అడిగిండు.
ఒకసారి తండ్రిని చూసి మల్ల తలకాయ నేలకేసిండు అస్లమ్.
‘అట్ల నాజూకుగ అడిగితే చెప్తడు మరి. మా పొల్లను ఒళ్లు పలగ్గొట్టినట్టు కొడితే గాని చెప్పడుప..’ మెటికలు ఇరిసింది నీలమ్మ.
‘నాగమణిని కొట్టిన్రా అత్తా?’ అస్లమ్‌కు ఏడుపు తన్నుకొచ్చింది. తమాయించుకోలేక ఆమె ముందుకు ఉరికి అడిగిండు.
‘ఎవర్రా నీకు అత్తా. మీకు మాకు ఏం సాపత్యంరా.’ తిట్లు లంకించుకుంది నీలమ్మ.
‘అట్లనకు అత్తా. మీకు నచ్చినట్టే మేము ఉంటం గానీ నాగమణిని కొట్టకండి.’ కండ్లు తుడుచుకున్నడు అస్లమ్.
‘అస్లమ్. ఇదర్ ఆరే. ఏందిరా? ఏం మాట్లాడుతున్నవ్ నువ్వు?’ ఇబ్రహీం అడిగిండు.
‘హౌ అబ్బా. హమ్ దోనో ఏక్ దూస్రేకు పసంద్ కర్లియే.’ జవాబ్ ఇచ్చిండు అస్లమ్.
‘తేరీ ఔఖాత్ క్యా హైరే. కైసా సమాల్తా బచ్చీకు.?’ అడిగిండు ఇబ్రహీం. నాగరాజు ఎప్ప్పుడో వచ్చి అస్లమ్ పక్కన నిలబడ్డడు.
‘ఏ ఆపుర్రి. మాకు అర్థం కావాల్నా వద్దా. ఏమున్నా తెలుగుల మాట్లాడుర్రి.’ గద్దాయించిండు మల్లయ్య.
‘ఏం లేదన్నా. ఎట్ల సాత్తడు. ఏం చేస్తడు. అని అడుగుతున్నా.’ వివరించిండు ఇబ్రహీం.
‘ఇగో పెద్దయ్యా. నాగమణి, నేను ఒకలకొకలం ఇష్టపడ్డం. ఆర్నెల్ల కింద అంజనపెల్లి సంబందం వచ్చినప్ప్పుడు ఆమె విషం తాగి సచ్చిపోత కానీ పెండ్లి చేసుకోను అన్నది. మాకు చిన్నప్పటి నుంచే ఇష్టం ఉంది. మీరు జెర్ర మమ్మల్ని మంచిగ చదువుకోనిస్తే మా బతుకులు మేం బతుకుతం.’ ధైర్యంగ చెప్పిండు అస్లమ్. నాగరాజు ఫోన్ల నుంచి నాగమణికి ఇనబడ్డయి ఆ మాటలు.
‘ఏం మాట్లాడుతున్నవ్ ర బై. సదువుకుంటుంటే తెలివి వస్తుందా. పోతుందా. ఆల్ల కులమేంది. మీదేంది? ఎట్ల కుదుర్తదనుకుంటున్నవ్? అయ్యే ముచ్చట చెప్ప్పు. ఆ పిల్లను ఇయ్యాల్టి నుంచి ఇంట్లనే ఉంచుతరు. అర్దమైతుందా?’ మల్లయ్య చెప్పిండు.
‘తెలివి వస్తుంది కాబట్టే కులాలు లేవు. మతాలు లేవు అంటున్న పెద్దయ్యా. అందరం ఒక్కటే. మనం పెట్టుకున్నయే ఈ గోడలు. మేమిద్దరం కలిసే ఉంటం. కలిసే సస్తం.’ అస్లమ్ గట్టిగనే చెప్పిండు.
‘ఏముందయ్య మీ ఇంట్లె. ఏం తినబెడ్తవ్ మా బిడ్డకీ. ఏం సుకపడాల్నని మీ ఇంటికొస్తదనుకుంటున్నవ్?’ నీలమ్మ ఎగబడింది.
ఇబ్రహీం కొడుకును వెన్కకు లాగి పక్కన నిలబెట్టుకున్నడు. ఇంతల నాగమణి అక్కడికొచ్చింది.
‘నువ్వెందుకొచ్చినవే పొల్లా. ఇంట్లనే పడి సావమన్న కదనే.’ బిడ్డ మీదకు పోబోయింది నీలమ్మ. ఎంకన్న ఆమెను ఆపి కూసోబెట్టిండు.
‘మా ఇజ్జత్ తీసేటందుకే పుట్టిందిది.’ అనుకుంట కూలబడింది.
‘ఇగో పెద మామయ్యా. ఇండ్ల అస్లమ్ తప్పేం లేదు. నేనే ముందుగాల అస్లమ్‌ను ఇష్టపడ్డా. నాకు నచ్చిండు. చిన్నప్పటి నుంచే అస్లమ్ అంటే ఇష్టం. నేను వాళ్ల ఇంట్ల మనిషి లెక్క కలిసిపోతా. పెండ్లి చేసుకుంటే అస్లమ్నే చేసుకుంట. ఎవరికిచ్చి చేసినా నేను మనిషి లెక్క మిగలను.’ నాగమణి తుఫానులాగ వచ్చి అక్కడున్న వాళ్లందరినీ ఆశ్చర్యపరిచింది.
అస్లమ్‌కు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఇబ్రహీంకు కోపం వచ్చింది.
‘వడ్డెరోణ్నివోనారే తేరెకు. జాత్ పాత్ నైహేరే.’ అస్లమ్‌ను కొట్టడానికి మీద మీదకు పోయిండు ఇబ్రహీం. నాగరాజు ఇబ్రహీంను పట్టుకొని ఆపిండు.
‘మామయ్యా.’ పిలిచింది నాగమణి.
‘ఏ పోవమ్మా. ఎవరు మామయ్య. పో.’ ఈసడించిండు ఇబ్రహీం.
‘చిన్నప్పట్నుంచి అట్లనే పిలుస్త కదా మామయ్యా నిన్ను.’ నాగమణి అన్న మాటలకు ఇబ్రహీం గుండె కరిగింది.
‘బుజ్జీ ఇట్రా’ గద్దాయించిండు ఎంకన్న.
‘పెద్దయ్యా. ఒక్క ఏడాది ఆగండి. నాగమణికి నాకు పెండ్లి చేయండి.’ అస్లమ్ అర్థించిండు.
‘ఏంబెట్టి సాదాలనుకుంటున్నవ్ రా. చదువు గూడ అయిపోలే. ఎట్ల?’ మల్లయ్య అడిగిండు.
‘ఎట్లనోకట్ల. నేను కష్టపడతా. నాగమణికి తగ్గోడిని అయిత. అమ్మనాయినల్లెక్కనే ఎంకన్న మామను, అత్తను సంతోషంగ చూస్కుంట.’ అస్లమ్ భోరోసాగా చెప్పిండు. నాగమణి అస్లమ్ పక్కన నిలబడ్డది.
‘అరే! పెండ్లెట్లయితదిరా. బాసింగం కట్టుకుంటవా? మల్లెపూలు చుట్టుకుంటవా?’ ఎగతాళి కనబడ్డది మల్లయ్య గొంతుల. ఆడ చేరిన జనాలందరు గొల్లున నవ్విన్రు. అస్లమ్‌కు ఇన్సల్ట్గ అనిపించింది. అయినా మాట్లాడాల్సిన బాధ్యత తనదే. తండ్రిది కాదు. అనుకున్నడు.
‘ఇగో ఈ పిల్ల ఎటన్న ఎల్లిపోదాం అన్నది. నాకు మీరు అందరూ ఒక్క ఫామిలీ లెక్క కావాలె. ఇంత మంచోల్లను నేను కష్టబెట్టను పెద్దయ్యా.’
ముచ్చటేసింది మల్లయ్యకు. కానీ కులాన్ని ఒప్పించటం సర్పంచయినా తనతోటి అయ్యే ముచ్చట కాదనుకున్నడు. ఎట్ల తీర్పు చెప్పాల్నో అర్ధం కాలేదు. కొన్ని రోజులు పోయినంక మల్ల కూసుందామని చెప్పి ఎవరిండ్లకు వాళ్లను పంపించి ఊపిరి పీల్చుకున్నడు.
**
ఒక రకంగ పెద్దలకు ఎట్ల చెప్పాల్ననే భారం దిగినట్లుంది అస్లమ్‌కు. ఇప్ప్పుడు నాగమణితోపాటు కాలేజ్ నుంచి ఇంటికి వస్తలేడు అస్లమ్. మధ్యాన్నం కాలేజీ తరువాత ఒక మెడికల్ షాప్‌ల పనికి కుదురుకున్నడు. ఎంతోకొంత ఆదాయం వచ్చేటట్టు పని చేస్తున్నడు. నాగమణి గూడ చేస్తా అన్నది. వాళ్లింట్ల ఒప్ప్పుకోలేదు.
ఇబ్రహీం చిట్టీ వేస్తున్నడు అస్లమ్ జీతంతోటి. మూడు నెలలకే చిట్టీ ఎత్తి ఇంట్ల అవసరమైన బాత్ రూమ్, ల్యాట్రిన్, కిచెన్, ఇంక రెండు ఎక్కువ గదులు స్లాబ్తోటి కట్టించిండు. ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలకు షాపు మార్చిండు. షాపు ఉన్న స్థలాన్ని హాలు లెక్క మంచిగ తయారు చేసిండు. బాయిలోపటికి మోటర్ పెట్టించిండు.
‘ఇల్లు అంటే ఇన్ని సౌకర్యాలుండాలె కదా. గట్టి పిల్ల. వస్తెమాయె. ఇంట్ల ఎన్ని అమరినయో.’ మురిసిపోయింది అస్లమ్ తల్లి సమీన.
ఎట్లనో ఫస్టియర్ అయ్యేటప్పటికి ఇల్లు ఒక కొలిక్కి వచ్చింది. నాగమణి కాలేజీకి సరిగ్గా రాకపోయినా ఎగ్జామ్స్ రాసింది.
అస్లమ్ జాబ్ చేసుకుంటనే చదువుకుంటుండు. మంచి మార్కులతోటి ఫస్ట్ క్లాసే వచ్చినా బోర్డర్లనే వచ్చినందుకు బాధ పడ్డడు.
‘నా అంతటోడైతున్న కొడుకును ఎట్ల కొట్టాల్నో. ఏం చెప్పాల్నో. ఆడి బతుకు ఆడు బతుకుతడులే. ఏమైంది.’ కొద్ది రోజులకు రాజీపడ్డడు ఇబ్రహీం.
ఈలోపు అస్లమ్, నాగమణి కలిసి రిజిస్ట్రార్ ఆఫీస్‌ల మ్యారేజ్‌కు అప్లై చేసుకున్నరు. సరైన డేట్‌కు ఇద్దరూ మ్యారేజ్ చేసుకొని అస్లమ్ ఇంట్ల అడుగు పెట్టిన్రు.
కొడుక్కు ఇంత ధైర్యం ఎట్లొచ్చిందో అర్థం కాలేదు ఇబ్రహీంకు. కాగల కార్యం ఎవరో తీర్చినట్లు తనకు పని లేకుండా చేసినందుకు సంతోషంగనే ఉంది ఒకపక్క.
సమీనా సంతోషానికి హద్దులు లేవు. తన కొడుకును ప్రేమించే ఎవరైనా ఆ తల్లికి ఇష్టమే. విషయం తెలిసిన ఎంకన్న, నీలమ్మ దు:ఖపడ్డరు.
కొడుకు కోడలిని తీసుకుని ఇబ్రహీం, సమీనా దంపతులు ఎంకన్న ఇంటికి వెళ్లిన్రు. ఎన్నడూ బయటకు రాని సమీనా తమ ఇంటికి వచ్చేసరికి ఆశ్చర్యపోయిన్రు ఎంకన్న, నీలమ్మ. నులక మంచం వేసి దుప్పటి పరిచి కూసోబెట్టిన్రు. పిల్లలిద్దరూ నిలబడే ఉన్నరు. ఇద్దరికీ కాళ్లు మొక్కమని సైగ చేసిండు ఇబ్రహీం.
బిడ్డను పట్టుకొని దు:ఖ పడ్డరు ఎంకన్న దంపతులు.
ఎట్ల మాటలు మొదలు పెట్టాల్నో అsర్థŠం కాక ఆలోచిస్తున్న ఇబ్రహీంకు ఎంకన్నను ఓదార్చే అవకాశం దొరికింది. పోయి ఎంకన్నను వాటేసుకున్నడు. ఎంకన్న కండ్లల్ల నీళ్లు తుడిచిండు. ఇబ్రహీంను తీసుకొచ్చి మల్ల మంచంల కూసోబెట్టిండు. సమీన నీలమ్మను హత్తుకుంది. నీలమ్మ గుండె చెరువైంది. అస్లమ్, నాగమణి చెరోదిక్కు నిలబడి నీలమ్మను పట్టుకున్నరు. సమీనా ఆమెను కుర్చీల కూసోబెట్టింది.
‘ఏంది బావా? ఉత్తుత్త బావలం కాదు మనం.’ వాతావరణం మార్చేటందుకు ప్రయత్నించిండు ఇబ్రహీం.
‘ఆడపిల్లోడిని. ఊర్లె తలకాయ ఎట్ల ఎత్తుకొని తిరగాలె బావా?’ మల్ల దు:ఖం పొంగుకొచ్చింది ఎంకన్నకు.
‘బావా మనకేమన్న పెద్ద పెద్ద ఆస్తులా కొట్లాడుకోనీకి. పోనీ మనకేమన్నా పేర్లకు ముందు ఈకలు, పేర్లకు ఎన్క తోకలున్నయా పట్లు పట్టడానికి. మంచి మనసుతోటి ఆలోచించు. ఆ దేవుడే మనకు దారి చూపుతడు. లోకం అంటవా? అయ్యాల సర్పంచు మల్లన్న తప్పించుకున్న సంగతి యాదికుందా? గట్లనే బావా. జనానిదేముంది. అద�ష్టవంతులం డబ్బు ీVAదాలు మనకు లేవు. మనకు పిల్లలే కదా ఆస్తి. మంచిగ చూస్కుందాం. నా కొడుకైతే చానా మంచోడు బావా. నువ్వు దిగులు పడొద్దు.’ భుజం మీద చేయేసి చెప్పిండు ఇబ్రహీం.
రెండు రోజుల తరువాత రెండు కుటుంబాలు కలిపి ఒకటే దావత్ ఇచ్చిన్రు ఊరంతటికి. మల్లయ్య దావత్‌కు వచ్చిండు.
‘శభాష్ ర బిడ్డా. ఎట్ల చేస్తరా అనుకున్న. బాగుంది.’ అస్లమ్ భుజం తట్టిండు.
**
కొన్ని రోజులకు ఇద్దరూ డిగ్రీ కంప్లీట్ చేసుకొని పీజీకి హైదరాబాద్ వచ్చి కొత్త కాపురం పెట్టిన్రు అస్లమ్, నాగమణి. ఇద్దరి పేర్లు వేరు వేరు ఉండటంతోటి కిరాయిండ్లకోసం కష్టపడాల్సి వచ్చింది. చివరికి నాగమణి కాస్తా నజుమాగా మారి ఒక ఇంటిని సంపాదించుకున్నరు.
రంజాన్ వచ్చినా, దసరా వచ్చినా ఊరికి పోతున్నరు అందరినీ సంతోషపెట్టి వస్తున్నరు. ఇద్దరూ చదువుకుంటనే రకరకాల జాబ్‌లు చేసుకున్నరు. పీజీ అయిపోయన తరువాత పిల్లల ప్లానింగ్ పెట్టుకున్నరు. అస్లమ్ పిహెచ్.డీ. అయిపోయింది. ఒక ప్రైవేటు కాలేజీల ప్రొఫెసర్గ పని చేస్తున్నడు.
నాగమణి ఇద్దరు చిన్న పిల్లలను సంభాళించుకుంట పిహెచ్.డి ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అయితుంది. అస్లమ్ తమ్ముళ్లు, చెల్లెళ్ల చదువులకు సాయం చేస్తున్నడు. వాళ్లు ఎదుగుతున్నరు. జీవితం ఒక లక్ష్యంతోటి సాఫీగ సాగుతున్నది.
టౌన్ల బస్సు ఆగింది. ఈ లోకంలకు వచ్చింది నాగమణి. ఆకలి అయితుంది. బస్టాండుల తినడానికి కావల్సినయి తీసుకొని హైదరాబాద్ బస్సుకోసం ఎదురు చూస్తుంది. పాప్‌కార్న్ వాసన హాయిగా ముకుపుటాలకు తాకింది. అంతే తన కాలేజీ రోజుల్లకు పోయింది. వెంటనే అరడజను పాప్‌కార్న్ పాకెట్లు కొనుక్కొని సంతోషంగా బస్సు ఎక్కి కూసుంది. అస్లమ్, తను ఎప్ప్పుడూ పాప్‌కార్న్ కొనుక్కుని ఒకరినొకరు తినిపించుకోవడం గుర్తుకువచ్చింది. ఎన్నో తీపి జ్ఞాపకాలను తిరగేస్తూ టిక్కెట్టు అడిగిన కండక్టర్‌ను చూస్తూ ఆగిపోయింది. టిక్కెట్టు తీసుకున్న తరువాత పాప్‌కార్న్ ప్యాక్ విప్పింది. అంతలనే సంధ్య ఫోన్.
**
‘ఏమైందక్కా. నీ ఫోన్ కోసం ఎదురు చూసీ చూసీ చేస్తున్న. ఒక్క మెసేజ్ అయినా పెట్టకపోతివే.’ నిష్ఠూరం ధ్వనించింది సంధ్య గొంతుల.
బాబాయి మాట్లాడిన మాటలన్నీ గుర్తుకువచ్చినయ్ నాగమణికి. కండ్లల్ల మళ్ల నీళ్లు సుడులు తిరిగినయ్. తమాయించుకున్నది.
‘సూడవే. నువ్వు ఎట్లనైన చేసి నీ పెండ్లి ఆపించుకునే ప్రయత్నం చేయ్. నీమీద ప్రేమతోటి ఇంత దూరం వచ్చిన. నన్ను ఎట్ల ఇన్సల్ట్ చేయాల్నో అట్ల చేసిండు బాబాయి. మీరిద్దరు గట్టిగ నిలబడితే ఏం కాదు.’ నిశ్చయంగ చెప్పింది నాగమణి.
‘అంటే ఏమన్నడే.’ భయపడింది సంధ్య.
‘ఏమనుడేందే. నన్ను తిట్టరాని తిట్లు తిట్టిండు. నా మాట ఇనడం ఆయనకు ఇన్సల్ట్ అంట. ఎందుకంటే నేను ముస్లింను పెండ్లి చేసుకున్న. ఇగ నువ్వు అట్లనే ఇంకెవరినో అంటున్నవు. చెప్పి చూసిన. మీ అమ్మయితే నా దిక్కే సూడలేదే.’
‘అవునా. సరేలే అక్కా. ఏదైతే అదయితది. పెండ్లి వాయిదా ఏస్త. చదువుకున్నంకనే ఏదైనా దైర్యం చేస్త. ఈలోపు ఏదన్నా చిన్న జాబ్ చేసుకుంట. బాపూను పైసలు అడగకుంట జాగర్తపడ్త. నువ్వు వచ్చినంక ఇంటికి వస్త.’
‘మేము వచ్చే కాలం బాగ మారుతదని మా పెండ్లి అప్ప్పుడు అనుకున్నమే. ఏం మారలే. ఎట్ల మార్తరు చెప్ప్పు. ఎవరి లోకం ఆల్లదయింది. ఇంక పెరిగినయే బాబు ఈ గోలలు. సరేలే వచ్చినంక మాట్లాడుకుందాం. బాయ్.’
బస్సు స్టార్ట్ అయింది. కిటికీ నుంచి తలకాయ బయటకు పెట్టి అప్పటికీ ఇప్పటికీ మార్పులు గమనించుకుంటా ఒక్కో పాప్‌కార్న్ నోట్ల వేసుకుంట కూసున్నది నాగమణి.
**