పిడికెడు మనిషి!

ఇంట్లో బీరువా సర్దుతోంటే – ముత్యాల దండ కనిపించింది. నార్త్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు ‘మనాలీ’లో ఓ యువకుడు రోడ్డు మీద తిరుగుతూ అమ్ముతుంటే… ముచ్చటేసి కొన్నాను. అవి ఒరిజినల్ ముత్యాల – లేకా పూసలా తెలీదు కానీ, ఆ యువకుడు ఒరిజినల్ ముత్యాలని చెప్పాడు. నమ్మినా నమ్మకపోయినా అయిదొందలిచ్చి ముత్యాల దండ తీసుకున్నాను, అంత పెద్ద ఖరీదు కూడా కాదు కదాని!

అప్పుడు కొన్నానంటే… వచ్చాక బీరువాలో పెట్టాను. వాటిని బంగారుతో కలిపి దండలా చుట్టించుకోవాలని గానీ, ఏ బంగారు లాకెటో చేయించి మెడలో వేసుకోవాలని గానీ ఆలోచనే రాలేదు. ఎప్పుడు బీరువా సర్దినా దాన్ని చూసి మనానీలో కొన్నానని గుర్తు తెచ్చుకుని, మళ్ళీ యథాప్రకారం అలా బీరువాలో వుంచేయటం జరుగుతోంది.

ఈసారీ బిరువాలోంచి ఆ దండ తీసి చేత్తో పట్టుకుని హాల్లో కూర్చున్నాను. నా ఫ్రెండ్ సుజాతకు ఫోన్ చేసాను. ‘మనాలీకి మనం టూర్ వెళ్ళి ఎంతకాలం అయ్యింది?’ అని ప్రశ్నించాను.

ఏ డాటా అయినా ఫింగర్ టిప్స్ మీదే వుంటుంది సుజాతకి, అంత మెమొరీ తనకి! నవ్వి చెప్పింది ‘2007లో… అంటే పన్నెండేళ్ళు దాటాయి.’

మాటల్లో ముత్యాల దండ గురించి చెప్పాను. ముత్యాలు చెక్కు చెదరలేదు. బహుశ ఒరిజినల్ కావొచ్చు. తను కూడా అదే మాట అంది. గోల్డ్ షాప్ కి వెళ్ళి – వాటిని చెక్ చేయించి, ధరించడానికి అనుకూలంగా ఏదైనా చేయించాలన్న ఆలోచన వచ్చింది ఇద్దరికీ.

సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో గోల్డ్ షాప్ లో వున్నాం. బజారులో అక్కడ వరుసగా గోల్డ్ షాపులు వున్నాయి. తరుచూ వెళ్ళే నవీన్ షాప్ కే వెళ్ళాం.
దగ్గరే షాపులో వున్న ఓ అరవైయేళ్ళ వ్యక్తికి ఆ ముత్యాలు చూపించాడు నవీన్. అతడు నాతో అన్నాడు ‘చాలా మంచి ముత్యాలు ఎక్కడ కొన్నారమ్మా?’ చెప్పాను నేను.
‘అరే, అగ్గువలో ఇచ్చాడు!’ అశ్చర్యపోయాడు. ‘ఏం చేస్తారు వీటినీ… గోల్డ్ పూసల్లో చుట్టించుకుంటారా లేక…?’ అడిగారు నవీన్. నా దృష్టి షాపులో కనిపిస్తున్న రంగురంగుల క్రిస్టల్స్ పై పడింది. సుజాతతో అన్నాను ‘క్రిస్టల్స్ తో లాంగ్ చైన్ లాగా చుట్టించుకుంటాను.’


గ్రీన్, రెడ్ క్రిస్టల్స్ ని చూపించాడు నవీన్. నేను కాస్త పింక్ షేడ్ వున్న రెడ్ క్రిస్టల్స్ ని ఎంపిక చేసుకుని వాటిని మరీ పొడుగు – పొట్టీ కాకుండా మధ్యస్తంగా వుండి నెక్లో వేలాడేలా చేయించమన్నాను. సుజాతకి కూడా నా ఐడియా నచ్చింది. లాకెట్ చేయించుకోమని అడిగాడు నవీన్. గోల్డ్ ధర తగ్గాక చేయించుకుంటానని చెప్పాను. నవ్వి “యాభై వేలకి హెచ్చేలా వుంది కానీ, ధర తగ్గేలా లేదమ్మా’ అన్నాడు.
డబ్బులు చెల్లించాను. ముత్యాలు, క్రిస్టల్స్ కలిపి దండలా కుచ్చేవాళ్ళు వేరే వుంటారనీ, తన షాప్ కి ఎదురుగా రోడ్ క్రాస్ చేసి వెళితే ఆశోక్ అనే అబ్బాయి ఓ షాప్ గద్దెమీద కూర్చొని వుంటాడని చెప్పి, సదరు అశోక్ తో ఫోన్లో మాట్లాడాడు నవీన్.

అలా దండ కుచ్చినందుకు అతడు ఎంత తీసుకుంటాడని అడిగాను నవీన్ ని. ఓ వంద రూపాయలు ఇవ్వమన్నాడు నవీన్.
నేను, సుజాత రోడ్ క్రాస్ చేసి వెళ్ళాం ఆశోక్ దగ్గరికి. పక్కన చిన్న స్టూల్స్ రెండు వుంటే కూర్చున్నాం వాటి మీద.


ముత్యాలూ, క్రిస్టల్స్ ఇచ్చాను.
ఆశోక్ ప్లాస్టిక్ వైర్ ని సాగదీసి… కాలి బొటన వేలికి చుట్టుకుని దాన్ని మరోపక్క పట్టుకుని దానికి దారం కలిపి… మొత్తం మీద తనదైన శైలిలో వాటిని దండలా కుచ్చటం ప్రారంభించాడు.
నేనూ, సుజాతా ఏదో బాతాఖానీ వేసుకున్నాం . పది నిమిషాల తరువాత అడిగాను ఆశోక్ ని ఇంకా ఎంత టైం పడుతుందని. మరో పది నిమిషాల్లో అయిపోతుందని చెప్పాడు.


ఇంతలో సుజాతకి వాళ్ళాయన నుండి ఫోన్! ఇంటికి చుట్టాలొచ్చారనీ, ఆ దగ్గర్లోనే – మార్కెట్లో తానున్నాననీ, తీసుకెళ్ళడానికి వస్తున్నాననీ!
‘ఇలా ఒక దండ కుచ్చినందుకు నీకు దాదాపు ట్వెంటీ మినిట్స్ పడుతుంది కదా – మరి డబ్బులు ఎంత తీసుకుంటావ్?’ అడిగింది సుజాత.
‘హండ్రెడ్ అని చెప్పాడు కదా నవీన్’ అన్నాను నేను.
‘అంటే… పూసలని బట్టీ, దండ సైజ్ ని బట్టి వుంటుంది. నవీనన్న కరక్టే చెప్పిండు. మీరు అడిగిన సైజ్ కి వంద రూపాయలే తీసుకుంటా’ అన్నాడు ఆశోక్.
సుజాతా వాళ్ళాయన వచ్చాడు. ‘వస్తానే, నీ పని కూడా అయిపోవచ్చింది కదా బై!’ అంటూ వెళ్ళిపోయింది సుజాత.


‘నగలు చేయించుకునే వాళ్ళు వస్తారేమో కానీ, ఇలా క్రిస్టల్స్ దండలా చేయించుకునేవాళ్ళు కూడా వస్తారా… తక్కువ కదా! రోజుకి ఎంత సంపాదిస్తావు?’ అడిగాను కుతూహలంగా.


‘ఖచ్చితంగా ఇంత అని వుండదు – వచ్చే కస్టమర్స్ ని బట్టి వుంటుంది. ఒక్కోసారి ఎక్కువ రావచ్చు, ఒక్కోరోజు పనే వుండకపోవచ్చు’ యథాలాపంగా చెబుతున్నాడు అశోక్.


‘పూసలకి రంధ్రాలు సన్నగా వున్నప్పుడు దారం గుచ్చటం కష్టం మేడం. నల్ల పూసలు దండలుగా కుచ్చి పెట్టమని చాలా మంది వస్తుంటారు. అప్పుడు వర్క్ కి తగిన డబ్బు అడుగుతాను. అంటే… ఇంకో వందో… యాభైయో ఎక్కువన్నమాట! కొందరు బేరమాడి చాలా తగ్గించి ఇస్తారు.”
‘అలా చేస్తే బాధనిపిస్తుంది కదా!’ అన్నాను సానుభూతిగా. ‘బాధకాదుకానీ… కొంచెం మా కష్టం చూడాలి కదా! అయినా నేను ఎవర్నీ డిమాండ్ చేయను మేడం! అడుగుతాను, వాళ్ళిష్టం… ఇవ్వకపోతే… పోనీ అని అనుకుంట.’ పూసలు గుచ్చటం అయింది.

‘దండకి హుక్ పెట్టాలా, లేకపోతే స్క్రూ పెట్టాలా?’ అడిగాడు నన్ను. ఏది గట్టిగా వుంటుంది?’ ప్రశ్నించాను. స్క్రూ పెడుతానన్నాడు. సరేనన్నాను.
మా ఇద్దరి సంభాషణలో – ఈ పని ద్వారా అశోక్ కి నెలకి పది నుండి పదిహేను వేల మధ్య ఆదాయం వస్తుందనీ, అతడికి పెళ్ళయిందనీ, ఇద్దరు కొడుకులనీ, ఓ ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూల్లో వాళ్ళు క్లాస్ ఫస్ట్, క్లాస్ సెకండ్ చదువుతున్నారనీ గ్రహించాను. ‘డబ్బెలా సరిపోతుంది?
పిల్లల చదువు, ఇంటి ఖర్చులు… వీటన్నింటికీ?’ ఆశ్చర్యం అనిపించి అడిగాను.

“సరిపెట్టుకుంటే సరిపోతుంది. అనవసరంగా ఖర్చు చేయను మేడమ్.” ‘అమ్మా నాన్నా వున్నారా?
‘ఆ వున్నారు మా వూర్లో! అప్పుడప్పుడూ వెళ్తుంటాం – వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి కావలసినవి కూడా కొనిస్తా!’ కొంచెం ధీమాగా చెప్పాడు అశోక్.
‘ఎక్కడికక్కడ ఇలా టైట్ గా వుంటే… సడెన్ గా ఏదైనా అవసరం వస్తే ఎట్లా, అమ్మా నాన్నకి మెడికల్ ట్రీట్మెంట్ .. అలాంటి వాటికి?’
అశోక్ మాట్లాడలేదు. దండ పూర్తయింది. “వేసుకుని చూడండి మేడమ్’ అన్నాడు. వేసుకుని చూసి బాగుందన్నాను. పర్సులోంచి యాభై నోట్లు నాలుగు తీసి ఇచ్చాను. అశోక్ లెక్క పెట్టి ఎక్కువ వచ్చాయని రెండు నోట్లు తిరిగి ఇచ్చేస్తుంటే అన్నాను –
‘వుండనీ – తీసుకో. కష్టపడ్డావు కదా!’ ‘వంద రూపాయల కష్టమే మేడమ్ – రెండు వందలది కాదు!’ అన్నాడు కాస్త నవ్వుతూ. ‘ఇష్టంతోనే ఇచ్చాను, కాదనకు!’ అన్నాను అభిమానంగా.


‘వద్దు మేడమ్ తీసుకోండి, వందకే మాట్లాడుకున్నాం కదా, నాకు ఎక్కువ తీసుకోవడం ఇష్టముండదు!’ అన్నాడు స్వాభిమానంగా.


‘నీది సూక్ష్మకళ! దీనికి వెలకట్టలేం! నువ్వు వంద అన్నావు – నాకు రెండొందలనిపించింది… అంతే!’ అన్నాను మెచ్చుకోలుగా చూస్తూ.
“మీరు ఈమాత్రమన్న మాట్లాడి – మా మంచి చెడు తెలుసుకున్నరు. ఇది చాలు మేడమ్. డబ్బులు తీసుకోండి.”
అతడిలోని కళకే కాదు – స్వాభిమానానికీ, నిజాయితీకి కూడా వెలకట్టలేమనిపించింది.

ముందుకు చాచి వున్న అతడి చేతిలోంచి ఒక యాభై నోటు వెనక్కి తీసుకుని ‘కనీసం ఒక యాభై అయినా వుండనీ!’ అన్నాను.
నా మాటల్లో నిష్ఠూరం ధ్వనించిందేమో! అశోక్ ఆ యాభై నోటుని తీసుకుని ‘థాంక్యూ మేడమ్!’ అన్నాడు.


ఇంత తక్కువ ఆదాయంతో ఈ కుర్రాడు కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నాడు? ఇక ముందెలా పోషిస్తాడు? అనే సందేహం మనసుని తొలిచేస్తోంటే – వెళ్ళబోతూ… ఓ ప్రశ్న వేసాను. ‘అశోక్, రేపు ఎలా గడుస్తుంది అనే భయం – ఆలోచన వస్తాయా ఎప్పుడైనా?’


“ఇప్పుడు ఎట్ల నడుస్తుందో… రేపు కూడా అట్లనే నడుస్తది మేడమ్! భయం లేదు – ఆలోచన లేదు. అట్ల భయపడితే ఈ రోజు పని శ్రద్ధగా, ఇష్టంగా చేయలేం కదా! ఇప్పుడు ఈ పని చూపించిన దేవుడు… రేపు కష్టమొచ్చిన నాడు ఈ పని చాలదనుకుంటే… ఇంకొక పని చూపిస్తడు. పిట్టలు, పశువులు ఎట్ల బతుకుతున్నయో అట్లనే నేను కూడా! గుప్పెడు గుండె – పిడికెడు మనిషిని! ఎట్లనన్న బతుకుత మేడమ్! నేను ఎక్కువ చదువలేదు – నా పిల్లలు చదువుకుని ఏదో ఉద్యోగం చూసుకుంటే మంచిగనే! లేకుంటే వాళ్ళే ఏదైనా పని నేర్చుకుని బతుకుతరు. ఇప్పటి సందే రంది పెట్టుకుంటే… బతుకుడు కష్టం కదా!’ అన్నాడు అశోక్.
అతడిలో నిలువెత్తు ఆత్మవిశ్వాసం కనబడింది నాకు.


ఆటో ఎక్కి ఇంటికి బయల్దేరాను. దారంతా అశోక్ గురించే ఆలోచిస్తున్నాను. చిన్న చిన్న ఉద్యోగాలు చేయటం నామోషీగా భావిస్తూ… గొప్ప గొప్ప ఉద్యోగాలు కావాలని భీష్మించుకుని, ఏ పనీ చేయకుండా కాలాన్ని వ్యర్థంగా గడిపే యువకులు కొందరు – తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని దర్జాగా కరగదీస్తూ… వ్యసనాలకి బానిసలై జల్సా చేయడమే జీవిత పరమావధిగా బ్రతికే యువకులు కొందరు – ఎంత డబ్బు సంపాదించినా… ఇంకా సంపాదించాలనే యావతో… అసహనం, టెన్షన్స్ తో బ్రతికే యువకులు కొందరు – ఇలాంటి యువతకి ‘అశోక్’ ఆదర్శం కదా అనిపించింది. కష్టాన్ని నమ్ముకోవటం – పనికి తగిన ప్రతిఫలాన్ని నిజాయితీగా ఆశించడం – ఆత్మ విశ్వాసంతో బ్రతకడం… ఇవి చాలు కదా బ్రతకడానికి!


‘పిడికెడు మనిషిని’ అని అతడన్న మాట గుర్తొచ్చింది.


నిజమే! పిడికెడు మెతుకులు మాత్రమే కోరుకునే పిడికెడు మనిషి! అల్పసంతోషి!

సంతుష్ట జీవి… అశోక్!

రచయిత్రి

Leave a Reply