వాళ్ళిలా
నిన్ను కరివేపాకుని చేయడం
నీకు మింగుడుపడకపోవచ్చు
వండేవాడికి
ఏం కావాలి?
ఏదో ఒకటి వేసి
రుచిగా వండి వార్చడమేగా!
వాడి వంటకంలో
నేనో నువ్వో లేదూ మరొకడో
దినుసులం అంతే.
ఒక్కో నది మీద
ఒక్కో పడవను ఎన్నుకోవడం మాత్రం
వాళ్ళకేం కొత్త?
తెలుసు కదా!
కొరడా కొనలకు దాహం ఎక్కువ
ఏదో దేహం
ఏదో వ్యవస్థను పీల్చి బతుకుతాయి
సంతలో ఓ మూల నిలబడి
మూలికలమ్మే వాడికి
ఏం కావాలి?
మంది బలహీనతలే వాడి పెట్టుబడి
వాగ్దానం
వాడు రహస్యంగా దాచుకున్న వల
సరే..
అప్పుడు మనం ఆశపడ్డాం
ఆ గొడుగు
వేసవిని దాటిస్తుందనుకున్నాం
వర్షంలో మునిగిపోకుండా
తప్పించుకోవచ్చనీ అనుకున్నాం
గొడుగులా కనబడ్డది
కేవలం నీడేనని
ఆ మాటకొస్తే..
నీడలన్నీ భ్రమలేనని
ఇక్కడుండేవన్నీ ఎడారులేనని
వాళ్ళింకోసారి నేర్పించారు
వాళ్ళదంతా
ఒక్కటే తోలు అయినప్పుడు
నీ వేళ్ళు
ఎక్కడెక్కడున్నాయో
నువ్వు వెతుక్కోవాలి కదా
ఒక్క పిడికిలిగా కట్టాలి కదా
జాగ్రత్త!
నువ్విప్పుడు ఎదురెళ్లేది
రాజకీయ సముద్రానికి
ఒక్క పగులు చాలు
పుట్టి మునిగిపోతుంది
ఇప్పుడు
పిట్టలన్నీ పాడాల్సింది
ఒక్కటే పాట!
చరణాలన్నీ రాసుకోవాల్సింది
ఒక్క
పిడికిళ్ళసిరా తోనే!