పాలస్తీనా విముక్తి పోరాటంలో డాక్టర్ల పాత్ర: డాక్టర్ ఘసన్ అబు-సిత్తాతో ఇంటర్వ్యూ

ఇంటర్వ్యూ: మేరీ టర్ఫా
(అనువాదం: శివలక్ష్మి పట్టెం)

(డాక్టర్ ఘసన్ అబు-సిత్తాతో మేరీ టర్ఫా చేసిన విస్తృతమైన ఇంటర్వ్యూను 2024, మార్చి 5 న Mondoweiss ఆన్‌లైన్ పత్రికలో ప్రచురించారు. అందులో డాక్టర్ ఘసన్ అబు-సిత్తా విముక్తి పోరాటాల్లో వైద్యం శక్తిసామర్థ్యాలను, జియోనిజం మారణహోమ స్వభావాన్ని చర్చించాడు. ఇజ్రాయెల్ జాతి నిర్మూలన వ్యూహం ప్రయోగిస్తున్నప్పుడు, దానిని ఎదుర్కోవడానికి మనకు జీవితం పట్ల ఉండాల్సిన నిబద్ధత గురించి మాట్లాడాడు.)

డాక్టర్ ఘసన్ అబు-సిత్తా, లండన్‌లో పనిచేస్తున్న ప్లాస్టిక్, రీకన్‌స్ట్రక్టివ్ శస్త్రవైద్యుడు. తన వృత్తిజీవితంలో ఎక్కువ భాగం ఘర్షణ ప్రాంతాలలోని ఆపరేటింగ్ థియేటర్లలో గడిపారు. అతను యవ్వనదశలో వైద్యవృత్తిని అభ్యసించడానికి అంతగా ఇష్టపడలేదు. అతని తండ్రి వైద్యుడు. నేటి చాలా మంది వైద్యుల పిల్లలలాగానే అతను, ఇంకేదైనా చేయాలని సామాజిక శాస్త్రాలలో కెరియర్ ని ఎంచుకుందామనుకున్నాడు. 1982లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దండయాత్ర జరిపినప్పుడు మొదటిసారిగా అబూ-సిత్తా వైద్యంలోని సాధ్యతలను అర్థం చేసుకున్నాడు. వైద్యుడు-రోగి మధ్య వుండే వ్యక్తిగత పరస్పర చర్యను దాటి వైద్యానికి వున్న విస్తారమైన శక్తిని తెలుసుకున్నాడు. అతను సర్జన్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవలి సంవత్సరాల్లో అతని పని అతన్ని మోసుల్, యెమెన్, డమాస్కస్, లెబనాన్‌కు నడిపించింది. లెబనాన్ లోని అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ బీరుట్ లో అతను కాన్ఫ్లిక్ట్ మెడిసిన్ ప్రోగ్రామ్‌ను ప్రప్రధామంగా స్థాపించాడు. మళ్లీ మళ్లీ, అతని పని అతన్ని గాజాకు తీసుకువెళ్ళింది.

2003 లో “అబౌట్ గాజా” (About Gaza) పేరుతో ఒక డాక్యుమెంటరీ రిలీజయింది. సూట్ లో ఉన్న అబూ-సిత్తా, చేతిలో ఒక లెదర్ బ్రీఫ్‌కేస్‌తో, బిజీగా ఉన్న ఒక కూడలిని దాటుతున్న ఫుటేజీతో డాక్యుమెంటరీ ప్రారంభమవుతుంది. ఆ సీన్ కట్ చేస్తే కొన్ని సెకన్ల తర్వాత కొన్ని బిల్డింగ్‌ల మధ్య శిథిలాల కుప్పలతో ఫ్రేమ్ కనిపిస్తుంది. అబూ-సిత్తా గాజాకు వెళ్లడానికి ఒక ఆరునెలల సెలవు తీసుకున్నాడని , “ఒక డయాస్పోరా (వేరే దేశానికి వలసపోయి జీవిస్తున్న) పాలస్తీనియన్‌గా, నా అస్తిత్వం ఇక్కడే ఉంది అని నేను భావించాను. నేను గాజాలో ఎన్నడూ నివసించనప్పటికీ, నేనెప్పుడూ నా స్వస్థలంగా భావించే ప్రదేశం పాలస్తీనా. నా జీవితంలోని రెండు ప్రవాహాలు- నా వృత్తి, నా గుర్తింపు కలిసేది ఇక్కడే” –అని వాయిస్ ఓవర్ ద్వారా వివరించాడు.

అబూ-సిత్తా కువైట్‌లో ఒక పాలస్తీనా కుటుంబంలో జన్మించాడు. 1948లో దక్షిణ పాలస్తీనాలో నివసిస్తున్న లక్షల మంది వేరే జనంతో పాటు, ఆయన కుటుంబం తమ ఇళ్లను బలవంతంగా విడిచిపెట్టి, పారిపోయి గాజాలో ఆశ్రయం పొందింది. ఇంటర్వ్యూలలో తన కుటుంబ చరిత్రను పంచుకునేటప్పుడు, అబూ-సిత్తా తనను తాను సరిదిద్దుకోవడం నేను కొన్నిసార్లు గమనించాను: మొదట “నా కుటుంబంలోని శరణార్థులు” అని మొదలుపెట్టి, వెంటనే “శరణార్థులుగా చేయబడ్డారు” అని సరిదిద్దుకున్నాడు. భాషాపరమైన ఖచ్చితత్వపు ప్రాముఖ్యతను, మనం రోజువారీ భాషలో సాధారణీకరించే దౌర్జన్యం పట్ల తన స్పృహను ఇలా నొక్కిచెప్పాడు. అతని పూర్వీకుల గ్రామం మాయిన్ అబు-సిట్టా (Ma’in Abu-Sitta). అది ఇజ్రాయెలీలు ఆక్రమించుకుని “సరిహద్దు కంచె” అని పిలిచే ప్రదేశం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇజ్రాయెల్‌ సెటిలర్లు దానిని స్వాధీనం చేసుకుని కిబుట్జిమ్‌గా (Kibbutzim) అభివృద్ధి చేసుకున్నారు. (ఇజ్రాయిల్ లో ముఖ్యంగా ఉమ్మడి వ్యవసాయం ఆధారంగా నిర్మించబడిన చిన్న గ్రామాలను కిబుట్జిమ్‌ అంటారు.) అందులో భాగంగానే నిరిమ్ (Nirim), మాగెన్‌ (Magen) గ్రామాలున్నాయి. అబూ-సిత్తా మామయ్య పేరు సల్మాన్ అబు-సిత్తా. ఆయన ఒక డాక్టర్, విద్యావేత్త. ‘అట్లాస్ ఆఫ్ పాలస్తీనా’ అనే పుస్తకం కూడా రాశారు. ఇటీవల “Mondoweiss” అనే న్యూస్ వెబ్సైట్ కోసం రాసిన ఒక వ్యాసంలో: “మీరు ఈ కిబ్బట్జిమ్‌ల పేర్లు విన్నప్పుడు, అవి ఎవరి నేలలో నిర్మించబడ్డాయో గుర్తు చేసుకోవాలి. ఈ భూమి యజమానులు ఇంటికి తిరిగి వచ్చే హక్కును ఎన్నడూ వదులుకోలేదని మీరు గుర్తుంచుకోవాలి” – అని రాశారు.

రఫా క్రాసింగ్ పూర్తిగా మూసేసి గాజాను మొత్తంగా దిగ్బంధం చేయబడడానికి కొంచెం ముందు – అంటే అక్టోబరు 9, సోమవారం ఉదయాన ఈజిప్ట్ గుండా గాజాలోకి ప్రవేశించిన చివరి గ్రూపులో డాక్టర్ ఘసన్ అబు-సిత్తా కూడా ఉన్నాడు. గాజాలోని ప్రధాన వైద్యకేంద్రమైన అల్-షిఫా హాస్పిటల్‌ కి సురక్షితమైన మార్గాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఆయన పనిచేయడం ప్రారంభించాడు. మొదటి కొన్ని రోజుల్లోనే, గాజాపై ఎడతెరపి లేని బాంబు దాడుల్లో గాయపడ్డవారి సంఖ్య మొత్తం గాజా స్ట్రిప్ లోని పడకల సామర్థ్యాన్ని (2,500 మందికి పైగా) మించిపోయింది. అబు-సిత్తా ప్రత్యక్ష ప్రసారాలలో ఒక ఇంటర్వ్యూ తర్వాత మరొక ఇంటర్వ్యూలో కనిపిస్తూ, తాను చూస్తున్న మారణహోమాన్ని వివరిస్తూ, ఆదమరచిన ప్రపంచాన్ని కదిలించే ప్రయత్నం చేశాడు. అక్టోబర్ 12 న, సి ఎన్ ఎన్ (CNN) ఛానల్ కి చెందిన క్రిస్టియన్ అమన్‌పూర్‌తో మాట్లాడుతూ, దాడి జరిగిన కొద్ది రోజులలోనే ప్రాథమిక వైద్య పరికరాలు అందుబాటులో లేవని చెప్పాడు. గాజా ప్రజలపై జరుగుతున్న ఈ యుద్ధం వల్ల కలిగే, విస్తృతమైన విపత్కర పర్యవసానాల గురించి శ్రోతలను గట్టిగా హెచ్చరించాడు. “ఇది మానవ-నిర్మితమైన విపత్తు”, ఇజ్రాయెల్ పదిహేను సంవత్సరాల దిగ్బంధం వల్ల గాజా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ “అప్పటికే చావుబతుకుల్లో ఉంది” అని చెప్పాడు. 2023, అక్టోబర్ 17 న అల్-అహ్లీ హాస్పిటల్‌లో జరిగిన ఊచకోత సమయంలో అబూ-సిత్తా అదే హాస్పిటల్‌లో పని చేస్తున్నాడు. దాడి జరిగిన వెంటనే ఆసుపత్రి ప్రాంగణంలో గుట్టలు గుట్టలుగా దుప్పట్లతో కప్పబడిన శరీరాల మధ్యనుంచి సాక్ష్యమిచ్చిన వైద్యుల్లో అబు-సిత్తా ఒకరు. హ్యూమన్ రైట్స్ వాచ్ విడుదల చేసిన నివేదికలో ఆ సంఘటనను “పేలుడు” అని పేర్కొంది; “ఆధారాలు పొరపాటున పేలిన రాకెట్ అని సూచిస్తున్నాయనీ, పూర్తి దర్యాప్తు చేయవలసి ఉందనీ” వెల్లడించింది. తమ ప్రాథమిక పరిశోధనలను నివేదికగా విడుదల చేసేముందు హ్యూమన్ రైట్స్ వాచ్ వారు గాజాలో ఉన్న ఒక్క వ్యక్తిని కూడా సంప్రదించలేదని, ఇజ్రాయెల్ దళాల నుండి తరలింపు ఆదేశాలను, బాంబు బెదిరింపులను అందుకున్న ఆసుపత్రి డైరెక్టర్ తో కూడా మాట్లాడలేదని, అబూ-సిత్తా తర్వాత ఘాటుగానే విమర్శించాడు.

నవంబర్‌లో గాజా వదిలి వచ్చినప్పటినుండీ, గాజాలో జనజీవితాన్ని మట్టుబెట్టే పనిలో ఉన్న “కిల్లింగ్ మెషిన్ మాస్క్వెరేడింగ్ ఆస్ స్టేట్‌” (అసత్యాల ముసుగులో మారణకాండలు చేసే రాజ్యం) కి వ్యతిరేకంగా పోరాడటానికి అబు-సిత్తా కట్టుబడి ఉన్నాడు. అతను సమావేశాలకు హాజరయ్యాడు, ప్రత్యక్ష సాక్షిగా తన వాంగ్మూలాన్ని ప్రపంచానికి అందించాడు. కాల్పుల విరమణ కోసం వాదిస్తూ ఎన్నో టి.వి ఇంటర్వ్యూలు చేశాడు. బాంబులు ఆగిపోయిన వెంటనే పునర్నిర్మాణానికి సిద్ధంగా ఉండాలని, దానికవసరమైన వేగాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని, అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చాడు. ఇటీవలి వారాల్లో అతను ‘ఘసన్ అబు-సిత్తా చిల్డ్రన్స్ ఫండ్’ ను ప్రారంభించాడు. ఇది గాయపడిన పిల్లలను గాజా నుండి లెబనాన్‌కు తెచ్చి సమగ్ర, వైద్య, మానసిక, సామాజిక సంరక్షణను అందించడానికి కట్టుబడి పనిచేసే కార్యక్రమం.

లండన్ కాలమానం ప్రకారం ఫిబ్రవరి 20 ఉదయం డాక్టర్ అబు-సిత్తా – నేను (మేరీ టర్ఫా) జూమ్ ద్వారా మాట్లాడుకున్నాం. మేము మానవుల విముక్తి పోరాటాల్లో వైద్యం పాత్ర గురించి, గాజాలో జరుగుతున్న మారణహోమంలో పాశ్చాత్య మీడియా భాగస్వామ్యం గురించి మాట్లాడాము. జియోనిజం గురించి, జాతిసంహారానికి పాల్పడుతున్న సెటిలర్ వలసవాద భావజాలం గురించి, శవ రాజకీయాల గురించి, జాతి హననాల వికృత తర్కాల సమయాల్లో జీవితం పట్ల ఉండవలసిన తిరుగులేని నిబద్ధతల గురించి వివరంగా చర్చించాము.

మా సంభాషణ నిడివి, స్పష్టత కోసం సవరించబడింది.

మేరీ టర్ఫా: గాజాలో ఉన్నప్పుడు, మీరు జేమ్స్ బాల్డ్విన్ రాసిన ఈ పదాలను ట్వీట్ చేసారు:

“ఏదీ స్థిరంగా ఉండదు, కలకాలం ఏదీ చలనం లేకుండా ఉండదు; భూమి నిత్యం కదులుతూ ఉంటుంది, కాంతి నిత్యం మారుతూ ఉంటుంది, సముద్రం రాయిని అరగదీయటం మానదు. తరాలు పుట్టడం ఆగిపోదు, వారికి మనమే బాధ్యులం, ఎందుకంటే వారికి ఉన్న ఏకైక సాక్షులం మనమే. సముద్రం ఎగిసి పడుతుంది, కాంతి క్షీణిస్తుంది, ప్రేమికులు ఒకరినొకరు హత్తుకుంటారు, పిల్లలు మనల్ని అంటిపెట్టుకుని ఉంటారు. మనం ఒకరినొకరం వదిలేసిన మరుక్షణమే, సముద్రం మనల్ని ముంచెత్తుతుంది, కాంతి మాయమౌతుంది.”

నేను మీ ఈ ట్వీట్ చదివినట్లు గుర్తు, మీకు ఈ ట్వీట్ చేసినట్లు గుర్తుందా? ఆ సమయంలో మీ మనస్సు ఎక్కడ, ఎలా ఉంది?

డా. ఘసన్ అబు-సిత్తా: నేను జేమ్స్ బాల్డ్విన్‌ను అమితంగా ప్రేమిస్తాను కాబట్టి ఆ కోట్ గురించి చాలా స్పష్టంగా ఆలోచించినట్లు నాకు గుర్తుంది. అతను, ఇతర రచయితల కంటే చాలా ఎక్కువగా, విప్లవకారుడి కోపం, కర్కశత్వాలతో పాటు మానవతావాది అయిన ఆలోచనాపరుడి సున్నితత్వం, దయ కలిగివున్నాడని నేను భావిస్తాను. ఆ సమయంలో నేను అల్-షిఫా కాంపౌండ్‌ లో కాలిన గాయాల యూనిట్ ఉన్న భవనంలో మెట్లు ఎక్కుతూ, అల్-షిఫా హాస్పిటల్ ను అంతర్గతంగా నిర్వాసితులైన వారి క్యాంపుగా మార్చిన కుటుంబాలను చూస్తున్నాను. వారు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటున్న తీరు, వారు తమ పిల్లలను అపురూపంగా చూసుకునే విధానం… వారు ఒకరితో ఒకరు వ్యవహరించే తీరు… ప్రేమ, వాత్సల్యం, సున్నితత్వాల నిరంతర చర్యలద్వారా ఇజ్రాయిలీలు సృష్టించిన మారణహోమాన్ని అధిగమించాలని ఆ ప్రజలు చాలా ముందుగానే నిర్ణయించుకున్నారు. వారినలా చూసినప్పుడు నేను జేమ్స్ బాల్డ్విన్ ను కోట్ చేశాను.

మేరీ: మీరు ఆ కోట్ ట్వీట్ చేసినప్పుడు, మీ ఉద్దేశంలో ‘కాంతి’ ఏమిటి?

డా.అబు-సిత్తా: ప్రజలు ఒకరిపట్ల ఒకరు, పూర్తిగా అపరిచితుల పట్ల ప్రదర్శించే ప్రేమ చర్యలే కాంతి రూపాలు. కుటుంబాన్ని కోల్పోయిన, గాయపడిన పిల్లలను, ఇతర గాయపడిన పిల్లల కుటుంబాలు చూసుకునే విధానం, చూసిన నాకు కేవలం ప్రేమ మాత్రమే మారణకాండల ప్రపంచానికి ప్రతిఘటన మార్గంగా తోచింది.

మేరీ: కాబట్టి, ఆ మానవత్వపు కోణంలో, కాంతి ఆరిపోలేదు. చాలా మంది తమ ఫోన్ స్క్రీన్‌లపై చూస్తున్న మారణహోమం వల్ల కలిగే అపారమైన నిరాశను, ప్రజలు కనబరుస్తున్న పట్టుదలను చూసి అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా, ఈ కోట్ రెండింటి సారాంశాన్నీ అందిస్తుంది.

డా.అబు-సిత్తా: ఖచ్చితంగా. ఒక పాలస్తీనా జంట గురించి జరిగిన కథనం చెప్తా. ఇక వేచి ఉండలేమని నిర్ణయించుకున్న ఆ జంట, ఒక రకమైన ప్రతిఘటన చర్యగా రఫాలోని ఒక డేరాలో తమ వివాహాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. మీరు అలాంటి ప్రతిఘటనలను ఇప్పటికీ, ఎప్పటికీ అన్ని సమయాలలో చూస్తారు. ఆ కాంతిని నాశనం చేయడం కోసం ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నప్పుడు ప్రపంచం గుడ్లప్పగించి చూస్తుండటం మన హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అంతా అయిపోయాక చేతులు పిసుక్కుంటూ, తల అడ్డంగా ఊపుతూ “ఎంత దారుణంగా అంతా నాశనం చేశారు కదా” అని వాపోవడానికి ప్రపంచం ఎదురుచూస్తోంది.

మేరీ: గాజా గురించి భూతకాలంలో మాట్లాడే వ్యక్తులను చూసి నేను దిగ్భ్రాంతి చెందుతున్నాను. గాజా ప్రజలు ప్రస్తుతం సజీవంగా లేనట్లుగా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం?

డా.అబు-సిత్తా: అవును. ఇప్పుడు జరుగుతున్న హింస ఆపలేనిదైనట్టు మాట్లాడుతున్నారు. మనం చనిపోయినవారిని తిరిగి తీసుకు రాలేం, కానీ ప్రతిరోజూ చంపబడుతున్న 150 నుండి 200 మంది చనిపోకుండా ఆపవచ్చు. మనం చనిపోయినవారిని తిరిగి తీసుకు రాలేం, కానీ ఉత్తరాన ప్రజలు ఆకలితో చనిపోకుండా చూసుకోవచ్చు. నా ఉద్దేశ్యంలో, ఇది ఇప్పటికీ… ఉదారవాదంతో, యూరోపియన్-అమెరికన్ ఉదారవాదంతో, పాశ్చాత్య ఉదారవాదంతో ఉన్న సమస్య. అది చారిత్రకవాదం ద్వారా తన పాపాలను కడుక్కోవడానికి ప్రయత్నిస్తుంది.

పాశ్చాత్య దేశాలలోని శ్వేతజాతి ఉదారవాద ఆలోచన ఇప్పుడు గాజా అంతమవ్వాలని వేచి చూస్తోంది. ఆ తర్వాత మారణకాండను చారిత్రాత్మకం చేయడం ద్వారా దాని పాపాలను కడిగివేసుకోవడంలో అది పూర్తిగా నిమగ్నమై ఉంటుంది. ఈ ప్రపంచ వ్యవస్థకు గాజాలో ప్రజలు చనిపోవాల్సిన అవసరం ఉంది, వారిని చంపడానికి ఇజ్రాయెల్‌కు ఆయుధాలను విక్రయించాల్సిన అవసరం ఉంది. అలాంటి ఈ వ్యవస్థలో పెట్టుబడి పెట్టిన శ్వేతజాతి ఉదారవాదం ఈ మారణహోమాన్ని నిరోధించలేదు. కానీ అదే సమయంలో, ఈ ఉదారవాదం విక్టోరియన్ కాలంతో పాటు, 20వ శతాబ్దపు మొదటి అర్ధభాగంలోని జాతి ఆధిపత్యానికి మెరుగైన నైతిక, సాంస్కృతిక ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. అందుకని అంతా అయిపోయాక ఈ మారణకాండను చారిత్రాత్మకంగా విశ్లేషించి, మళ్ళీ ఎప్పుడూ ఇలాంటివి పునరావృతం చేయబోనని వాగ్దానం చేస్తూ విలపిస్తుంది.

మేరీ: అవును. ప్రజల నుండి ఎలాంటి ముప్పు లేనప్పుడు వాళ్లగురించి దుఃఖిస్తారు.

డా.అబు-సిత్తా: ఖచ్చితంగా. వాళ్లు ఏమీ చేయనవసరం లేనప్పుడు.

మేరీ: ప్రస్తుతం గాజాలో మౌలిక సదుపాయాలపై, ప్రత్యేకించి వైద్య సదుపాయాలపై జరుగుతున్న దాడి విస్తృతి కనీవినీ ఎరుగనిది. కానీ అదే సమయంలో, మొత్తంగా ఇప్పుడు జరుగుతున్నట్టు కాకపోయినా, ఇజ్రాయెల్‌కు వైద్యులను, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోవడంలో ఖచ్చితంగా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. కాబట్టి కొన్ని రకాలుగా, మనం చూస్తున్నది చాలా కొత్తగా ఉంది, కానీ కొన్ని రకాలుగా ఇది అసలు కొత్తేమీ కాదు. మీ ఉద్దేశ్యంలో కొత్తగా ఏం జరుగుతోంది, ఎప్పటినుండో జరుగుతున్న నమూనాల్లోనే కొనసాగుతున్నదేమిటి?

డా.అబు-సిత్తా: మీరు చెప్పింది నిజమే. 1982, జూన్ 4న, లెబనాన్‌లోని ప్రతి పాలస్తీనా రెడ్‌క్రెసెంట్ సొసైటీ ఆసుపత్రిపై వైమానిక దాడులు చేస్తూ ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై దాడిని ప్రారంభించారు. ఆరోగ్య వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ చేసే యుద్ధాల శవరాజకీయాలలో ఎప్పుడూ భాగమే.

నేటివ్ (మూలవాసులు) లకు సెట్లర్లకు మధ్య వున్న సంబంధాన్ని నిర్దేశించే తర్కాన్ని ఆస్ట్రేలియన్ చరిత్రకారుడు పాట్రిక్ వుల్ఫ్ నిర్మూలన తర్కం (లాజిక్ ఆఫ్ ఎలిమినేషన్) అని చెప్పాడు. ఆ నిర్మూలన తర్కం ఇంతకాలం పాలస్తీనా ప్రజల బహిష్కరణ, బదిలీ, వేర్పాటులతో పాటు ఊచకోతలు, విస్తృత-స్థాయి హత్యలు వంటి హంతక సాధనాలను ఉపయోగించింది. ప్రస్తుతం వాటిని దాటి పాలస్తీనా జాతిని పూర్తిగా నిర్మూలించడానికి జాతిసంహారం (genocide) కొనసాగిస్తోంది. అందువల్ల, ఇజ్రాయెలీలు గతంలో ఉపయోగించిన అనేక సాధనాలు కలిసి ఇప్పుడు పూర్తి యుద్ధ వ్యూహంగా మారడాన్ని మనం చూస్తున్నాం. ఆరోగ్య రంగాన్ని లక్ష్యంగా చేసుకునే సాధనాలు ఈ యుద్ధ సైనిక వ్యూహానికి కేంద్ర సిద్ధాంతాలుగా మారాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లక్ష్యం ఒక జాతి నిర్మూలన లక్ష్యం. వేర్పాటు, నిశ్శబ్ద బహిష్కరణ వంటి సాధనాలతో పాటు ఇతర మారణహోమ సాధనాలను ఉపయోగించడానికి బదులు ఇప్పుడు ఇజ్రాయెల్ సమాజం మూలవాసుల నిర్మూలనకు జాతిసంహారాన్నే ప్రధాన మార్గంగా ఉపయోగించడం వైపు పరివర్తనం చెందింది.

మేరీ: అంటే “అప్పుడే అందరినీ (పాలస్తీనియన్లను) వదిలించుకోవలసింది” అనే జియోనిస్ట్ పశ్చాత్తాపానికి ఇప్పుడు ఆ పని పూర్తి చేసే సమయం వచ్చిందంటారా?

డా.అబు-సిత్తా: ఇది బెన్నీ మోరిస్ (ఇజ్రాయిలీ చరిత్రకారుడు) యుద్ధం అని నేను మొదటి నుండి చెబుతున్నాను. బెన్నీ మోరిస్ తన మొదటి పుస్తకాన్ని వ్రాసిన కొన్ని దశాబ్దాల తర్వాత, హారెట్జ్‌ (Haaretz) పత్రికలో జియోనిస్ట్ ఉద్యమం చేసిన అతిపెద్ద తప్పు వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్లను బహిష్కరించకపోవడం అని చెప్పాడు. ఆ పని చేయకపోతే, జియోనిస్ట్ ప్రాజెక్ట్ విఫలమవుతుంది, ఖచ్చితంగా ఓడిపోతుంది అని అన్నాడు. యుద్ధాన్ని ఆపడానికి ఇజ్రాయెలీల విముఖతలో మనం దాన్ని చూడవచ్చు. ఇజ్రాయెల్‌లో ప్రతిచోటా “వాళ్ళను అంతమొందించండి”(Finish them off) అని చెప్పే బంపర్ స్టిక్కర్లు కనిపిస్తాయి.

మేరీ: మీరు గాజాలో ఉన్నప్పుడు, ఎంతగానో ప్రజలతో మమేకమై పని చేశారు. అలా మీ డ్యూటీని బాధ్యతగా కొనసాగించడానికి కొంతస్థాయి భావోద్వేగ నిర్లిప్తతను పాటించాల్సిన అవసరం వచ్చుండాలి కదా. అదే సమయంలో, మీరు చూస్తున్న వాటి గురించి మీరు పంచుకున్న విషయాలు, మీ గ్రహణ శక్తి, మిమ్మల్ని ఒక సున్నితమైన, నిశితంగా గమనిస్తున్న వ్యక్తిని బహిర్గతం చేసాయి. మీకు అదెలా సాధ్యమయింది?

డా.అబు-సిత్తా: మనల్ని ప్రభావితం చేసేవి గాయాలు గానీ శవాలు గానీ కాదు. జీవంతో తొణికిసలాడుతున్న వ్యక్తుల కథలు, ఛిద్రమైన జీవితాలు, గాయాలకు ముందు జీవితాల సంగ్రహావలోకనాలు మనల్ని పూర్తిగా భావోద్వేగంలో ముంచెత్తుతాయి. వైద్యపరమైన అంశాల్లో నిర్లిప్తంగా వ్యవహరించడానికి అలవాటు పడివుంటాం. ఎందుకంటే, మానసికంగా ఆ ప్రక్రియను కొనసాగించడానికి శిక్షణ పొంది వుంటాము. అదొక మానసిక ప్రక్రియ: “ఇదొక అవయవ గాయం. ఇది శరీరం నుంచి బహిర్గతమైన ఒక ఎముక. నేను చనిపోయిన కణజాలాన్ని నిర్మూలించాలి. నేను ఈ గాయాన్ని శుభ్రం చేయాలి. నేను ఈ పునర్నిర్మాణ ప్రక్రియ కోసం ప్లాన్ చేయాలి.” నేను చేయవలసింది ఈ పనులే! కానీ ఆ కేసులకు ముందూ తరువాతా జరిగే విషయాలు… ఆ శరీరం, ఆ జీవితం విచ్ఛిన్నమైన ముందు క్షణంలోని జీవితపు ఛాయలు మనను తాకినప్పుడు మనల్ని ప్రభావితం చేస్తాయి. అవి మనల్ని ప్రభావితం చేయకుండా, మనల్ని దుఃఖంలో ముంచకుండా ఆపలేము.

మేరీ: అలాంటప్పుడు మీరు మీ పనిని ఎలా కొనసాగిస్తారు? అంటే వేరే ఛాయిస్ లేదు కదా?

డా.అబు-సిత్తా: అక్కడి పరిస్థితులను తట్టుకోవాలంటే ఎటువంటి ఛాయిస్ ఉండదు. చుట్టూ సునామీలా గాయాలతో వచ్చినవారు ఉంటారు. రోజుకి 10 లేదా 12 కేసులను పూర్తి చేయకపోతే, ఈ రోగులకు మళ్ళీ ఆపరేటింగ్ గదికి వెళ్లే అవకాశం లభించదని తెలుసు. ఎందుకంటే ఒక్క రోజులో, 400 లేదా 500 మంది గాయపడినవారు ఆసుపత్రికి వస్తున్నారు.

మేరీ: ప్రజల విముక్తి ఉద్యమాలలో వైద్యులు చారిత్రాత్మకంగా ముఖ్యమైన పాత్ర పోషించడం అనేది మనం చాలాకాలంగా చూసిన, చూస్తున్నవాటిలో ఒక భాగమే. దీనిగురించి మనకు అనేక చారిత్రక ఉదాహరణలున్నాయి. అది ఎందుకు అని మీరు అనుకుంటున్నారు?

డా.అబు-సిత్తా: ANC (సౌత్ ఆఫ్రికాలోని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్) కంటే, లాటిన్ అమెరికా ప్రజల కంటే పాలస్తీనియన్లలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇతర ప్రదేశాల కంటే పాలస్తీనా విముక్తి ఉద్యమంలో, పాలస్తీనా స్వీయ-నిర్ణయాధికార భావాల్లో ఆరోగ్యం ఎప్పుడూ కీలక పాత్రను పోషిస్తోంది. 1950ల నుండి, బీరుట్‌లోని అమెరికన్ విశ్వవిద్యాలయం, కైరో విశ్వవిద్యాలయం వంటి విశ్వవిద్యాలయాల నుండి బయటకు వస్తున్న వైద్యులు స్థాపించే ఉచిత క్లినిక్‌ల ఆవిర్భావాలలో మీరు దీన్ని గమనించవచ్చు. PLO (Palestine Liberation Organization) లెబనాన్ అనుభవంలో పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ, దాని ఆరోగ్య కేంద్రాలు పోషించిన ప్రధాన పాత్రలోనైనా చూడవచ్చు. ఆ తర్వాత, మొదటి ఇంతిఫాదా (తిరుగుబాటు) సమయంలో, మెడికల్ రిలీఫ్ కమిటీలు, హెల్త్ వర్క్ కమిటీల యూనియన్ ప్రజలను సమీకరించే ప్రణాళికలో కేంద్రంగా ఉన్నాయి.

నేను ఇప్పుడే దోహా నుండి తిరిగి వచ్చాను. అక్కడ జరిగిన సమావేశంలో అబ్దెలాజీజ్ అల్లబడి (Abdelaziz Allabadi) ఉన్నాడు, అతను టెల్ అల్-జాతర్‌ (Tel al-Zaatar) పై దాడి జరిగినప్పుడు అక్కడున్న ఇద్దరు యువ వైద్యులలో ఒకడు. ముస్తఫా బర్ఘౌతి (Mustafa Barghouti) రెండవవాడు. అతను ఇతర యువవైద్యుల బృందంతో కలిసి, మొదటి ఇంతిఫాదా సమయంలో మెడికల్ రిలీఫ్ కమిటీలను ఏర్పాటు చేశాడు. ప్రతిఘటనలో ఆరోగ్య వ్యవస్థల కీలక పాత్రను మనం గమనించవచ్చు. ఇప్పటి ఆరోగ్య వ్యవస్థల, వైద్యుల ప్రతిఘటనల మూలాలను పాలస్తీనా విముక్తి భావజాలంలోని ఆ ప్రవాహంలో చూడవచ్చు.

మేరీ: అది ఎలా జరుగుతుంది? ఎందుకంటే నేను పొందే వైద్య శిక్షణలో అలాంటిదేమీ లేదు. యునైటెడ్ కింగ్డమ్ లో కూడా అలా ఉండదనే అనుకుంటున్నా.

డా.అబు-సిత్తా: విషయం వైద్యం గురించి కాదు, ప్రజల జీవితాలను దగ్గరినుంచి చూడడానికి, వారి పోరాటాన్ని చేరుకోవడానికి వైద్యానికి ఉన్న తక్షణ సామర్థ్యం గురించి. వైద్యవృత్తి మనల్ని పోరాటం మధ్యలో నిలబడటానికి అనుమతిస్తుంది, రాజకీయాలు మనం చూస్తున్నదాన్ని అర్థంచేసుకోవడానికి తోడ్పడుతాయి. అవే ఆ రకమైన వైద్య క్రియాశీలతను (మెడికల్ ఆక్టివిజం) లేదా వైద్య విముక్తి భావజాలాన్ని (మెడికల్ లిబరేషన్ ఐడియాలజీ) రూపొందిస్తాయి.

మేరీ: అవును, ఇతర రంగాలలో హాస్యాస్పదంగా అనిపించే విషయమైనా, వైద్యంలో మాత్రం రాజకీయాలను దూరంగా ఉంచాలని నేర్పిస్తారు. వైద్యవృత్తిలో ఉన్నవారికి వాళ్లు కలిసి పనిచేస్తున్న ప్రజల జీవితాలతో సంబంధం వుండొద్దనే అంచనాలుంటాయి. పాలస్తీనాలో అలాంటివేవీ లేవని తెలుస్తోంది.

డా.అబు-సిత్తా: ఈ కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణలకు ముందు నేను జాతీయ ఆరోగ్యసేవను (నేషనల్ హెల్త్ సర్వీస్) చూశాను. ఆరోగ్యాన్ని వినియోగ వస్తువుగా మార్చడమనే వికృతమైన భావనపై వైద్యం కార్పొరేటీకరణ ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం, రాజకీయాలను వేరుచేయాలనే ఈ హాస్యాస్పదమైన ఆలోచన ఆరోగ్యాన్ని సరుకుగా మార్చే ప్రక్రియను నిరాటంకంగా కొనసాగేలా చేస్తుంది. వైద్యంలో రాజకీయాలకు స్థానం లేదని చెబుతారు కానీ వైద్యం మొత్తంగా రాజకీయాలకు సంబంధించినదే.

ప్రజారోగ్య విషయాల్లో రాజకీయాల పర్యవసానాలు, ఎవరికి ఏ ఆరోగ్య సదుపాయాలు అందించగలమనే విషయంలో రాజకీయాల పరిణామాలు – అనేవి వైద్యంలో చాలా కీలకమైన అంశాలు.

మేరీ: పాలస్తీనా విముక్తి పోరాటంలో డాక్టర్లు పోషించే పాత్ర ఏమిటని మీరు అనుకుంటున్నారు?

డా.అబు-సిత్తా: టెల్ అల్-జాతర్ ఊచకోత కావచ్చు, లేదా ’82లో బీరుట్ ముట్టడి, లేదా మొదటి ఇంతిఫాదా, లేదా రెండవ ఇంతిఫాదా, (ఇజ్రాయెల్-ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌ లోని పాలస్తీనా భూభాగాల కోసం పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌లో చేపట్టిన నిరసనలు) లేదా ఈ యుద్ధం కావచ్చు… ముఖ్యంగా ఇలాంటి సంక్షోభ సమయాల్లో, ఆరోగ్య సంరక్షణ రంగం ప్రజల కోసమే పనిచేయాలి.

ఈ యుద్ధంలో ఇజ్రాయెలీల నుండి, పాలస్తీనియన్ వైద్యుల నుండి మనం తెలుసుకున్నదేమిటంటే – జాతి ప్రక్షాళన చేయడంలో ఆరోగ్యవ్యవస్థను సర్వ నాశనం చేయడం చాలా కీలకమైన అంశం. అక్కడ జరుగుతున్న దాని నుండి మిగతా ప్రపంచం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయమిది. ఆరోగ్య వ్యవస్థను నాశనం చేయకుండా ఒక ప్రాంతం నుండి ఒక జాతి ప్రజలను నిర్మూలించలేరు.

ఇజ్రాయెల్ సైన్యం ఆరోగ్య వ్యవస్థలోని ప్రతి అంశాన్ని కూల్చివేసి, నాశనం చేయాలని పట్టుబట్టింది- ఆసుపత్రుల భౌతిక విధ్వంసం మాత్రమే కాదు, 340 మంది వైద్యులు, నర్సులు, వైద్యాధికారులను చంపడం, వైద్య కళాశాలలను నాశనం చేయడం, మందులు అందుబాటులోకి రానివ్వకుండా నిరోధించడం, వాహనాలకు ఇంధనం దొరక్కుండా చేయడం- ఇలాంటి దూరాగతాలు చేస్తూ వారు ఆరోగ్య వ్యవస్థను తాపీగా తొలగించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఆధునిక యుగంలో – ఆరోగ్య వ్యవస్థను నాశనం చేయకుండా మనుషులను జాతిపరంగా అంతమొందించలేరనే విషయాన్ని ఇది సూచిస్తోంది. ఎందుకంటే ఆరోగ్య వ్యవస్థలు సమాజంలో ప్రజలకు ఆధారంగా నిలుస్తాయి. పాలస్తీనా ఆరోగ్య కార్యకర్తలు, పాలస్తీనా ఆసుపత్రులు యుద్ధం ప్రారంభం నుండి ఇజ్రాయెల్ సైన్యం చేసిన తరలింపులను, బెదిరింపులను తిరస్కరించాయి.

మేరీ: అవును, వైద్యం మనుషుల్ని మృత్యువు నుంచి రక్షిస్తుంది. వైద్యులు కూడా స్థూలస్థాయిలో, తమను తాము ప్రజారక్షకులుగా భావించుకుంటారు. అయితే సూక్ష్మస్థాయిలో నేనొక విషయం గమనించాను. ఇప్పుడే కాదు – గత కొన్ని దశాబ్దాలుగా- వాళ్లు పాలస్తీనియన్ అయినా, మిలిటెంట్ అయినా, వచ్చిన వారందరికీ, దయతో, మానవాళికి చికిత్స చేయాలనే సత్సంకల్పంతో ఉండేవారిగా ఇజ్రాయెల్ వైద్యులను ప్రధాన అమెరికన్ మెడికల్ జర్నల్స్‌ ప్రదర్శిస్తాయి. కానీ పాలస్తీనా వైద్యులను దయలేనివారిగా, ద్వేషపూరితమైనవారిగా, ఇజ్రాయెలీలకు వైద్యం నిరాకరించేవారిగా, మొత్తంగా వైద్యులే కానట్టుగా చూపెడతాయి.

డా.అబు-సిత్తా: అవును. పాలస్తీనా వైద్యులంటే వారి ఉద్దేశంలో తెల్లటి కోట్లు వేసుకున్న కార్యకర్తలు. తెల్లకోటు వేసుకున్న రాజకీయ కార్యకర్తలు. ఈ యుద్ధం గురించిన ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, పాశ్చాత్య మీడియా పాలస్తీనియన్ గొంతులను నొక్కేయడమే గాక, ఇజ్రాయెలీల ప్రకటనల నుండి జియోనిజాన్ని రక్షించడానికి ఇజ్రాయెల్ గొంతులను కూడా సెన్సార్ చేయవలసి వచ్చింది. యుద్ధ ప్రారంభంలో, 400 మంది ఇజ్రాయెల్ వైద్యులు ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోవాలని IDF (Israel Defense Forces) కి పిలుపునిస్తూ ఒక పిటిషన్‌పై సంతకం చేశారనే వాస్తవాన్ని పాశ్చాత్య పత్రికలు వ్యాఖ్యానించడం గానీ ఏ రకంగానైనా నివేదించడం గానీ చేయలేదు. ఇంటర్నేషనల్ కోర్ట్ (ICJ-International court of Justice) తీర్పు, ఇంటర్నేషనల్ కోర్ట్ మౌఖిక ప్రకటనలు బయటకు వచ్చేవరకూ ఇజ్రాయెల్ రాజకీయ నాయకులు చేసిన చాలా మారణహోమ ప్రకటనలు, గాజాను జాతిపరంగా ప్రక్షాళన చేయాలని పిలుపునిచ్చే ప్రకటనలు వారాలకు వారాలు నివేదించబడలేదు. కాబట్టి పాశ్చాత్య మీడియా కేవలం పాలస్తీనియన్ గొంతులను నొక్కేయడమే కాకుండా, ఇజ్రాయెల్ జియోనిజం ఇమేజ్‌ను రక్షించే లక్ష్యంతో ఉగ్రమైన, క్రూరమైన ఇజ్రాయెల్ గొంతులను కూడా నొక్కేస్తోంది. ఎందుకంటే ఈ వ్యక్తులు ఇప్పుడు 75 సంవత్సరాలుగా ఎలాంటి శిక్షలూ, పర్యవసానాలూ లేని అహంకారంతో మత్తెక్కి ఉన్నారు. అందుకే పాశ్చాత్య దేశాలలో వారి సహ-కుట్రదారులు చెప్పొద్దనుకునే విషయాలను వీరు బాహాటంగా చెప్తారు.

మేరీ: దానిని ‘సైకోసిస్’ అని పిలవడం నాకు చాలా కష్టం. ఎందుకంటే, ఒక విధంగా, అలా పిలవడం వాళ్ళ బాధ్యత నుండి వాళ్లను తప్పించడమే.

డా.అబు-సిత్తా: ఖచ్చితంగా. ఇది 30, 40 దశకాలలో జర్మన్ల మనోవికారం. ఇది 80లలోని తెల్ల దక్షిణాఫ్రికా బోయర్ల (17వ శతాబ్దం చివరలో దక్షిణ ఆఫ్రికాలో స్థిరపడిన డచ్, హ్యూగ్నోట్ జనాభా) మానసికవ్యాధి. వాళ్లు మాట్లాడే మాటలను ఎవరూ విమర్శించకపోవడం వల్ల వాళ్లు మాట్లాడేది సరైనదేనని అనుకుంటారు. ఇది ఎవరూ పలకకూడని మాటల సాధారణీకరణ. అప్పుడు పలకకూడని మాటలను చెప్పడం ప్రారంభిస్తారు. అయితే వాళ్లు గ్రహించనిదేమిటంటే పాశ్చాత్య ఉదారవాదం పూర్తి కపటత్వంపై ఆధారపడి ఉంటుంది. అది చెప్పేదానికీ చేసేదానికీ పొంతన లేకుండా పూర్తి భిన్నమైన వ్యతిరేకతపై ఆధారపడి ఉంటుంది. మీకు ఒకటి కావాలి కానీ మాటల్లో మాత్రం దానికి పూర్తిగా భిన్నమైన విషయం చెప్పాల్సి ఉంటుంది.

మేరీ: అయితే, నాకు కష్టమైన విషయమేమిటంటే, ఉదాహరణకు మనం రోగుల మానసిక సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నామనుకోండి, వారికి అంతర్దృష్టి ఉందో లేదో మనం తెలుసుకోవాలి. వీళ్ళకు (ఇజ్రాయిలీలకు) స్పష్టంగా అలోచించే సామర్థ్యం లేదనిపిస్తోంది.

డా.అబు-సిత్తా: వారికి అంతర్దృష్టి లేదని నా ఉద్దేశ్యం. మనుషుల్ని, ఇళ్లను పేల్చివేస్తూ, వ్యక్తుల వస్తువులను దొంగిలిస్తూ వాళ్లు చేసే టిక్‌టాక్ వీడియోలను చూస్తే అర్థమవుతుంది. అక్షరాలా, పాలస్తీనా వంటగదుల్లో ఇజ్రాయెల్ సైనికుల వంట నైపుణ్యాల గురించి మొత్తం కథనాన్ని ప్రచురించింది కదా హారెట్జ్ (హిబ్రూ, ఇంగ్లీష్ భాషలలో ప్రచురించబడే ఇజ్రాయెలీ వార్తాపత్రిక)? ఇజ్రాయెల్ ఇప్పుడు జెనొసైడల్ బుడగలో జీవిస్తున్న సమాజం. వారు పాలస్తీనియన్లను ఎంత అమానవీయంగా చూస్తున్నారంటే, వాళ్ళ దృష్టిలో ఇప్పుడు పాలస్తీనియన్లు మనుషులే కాదు. వాళ్లకు పాలస్తీనియన్లు అదృశ్యమైపోయారు. కాబట్టి అవి ఎవరి వంటగదులూ కావు. వాళ్ళ దృష్టిలో వాళ్లు నేర్పించిన అద్భుతమైన వంట నైపుణ్యాలను వాళ్ళ కొడుకు ఫీల్డ్‌ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను ఎవరి ఇంట్లోనూ లేడు. అతను ఆ ఇళ్లలోని వ్యక్తులను చంపి ఉంటాడనే ఆలోచనే వాళ్లకు లేదు.

మేరీ: అయితే 48లో వాళ్ల తాతలు అదే పని చేశారు. (స్థానికులను జాతిపరంగా ప్రక్షాళన చేసిన తర్వాత) వారు ప్రజల ఇళ్లలోకి చొరబడ్డారు.

డా.అబు-సిత్తా: అవును! ప్రజల ఇళ్లను ఆక్రమించుకున్నారు. వారి ఫర్నిచర్ దొంగిలించారు. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఒక పుస్తకంలో పాలస్తీనియన్ ఇళ్ళ నుండి ఎంత దోచుకున్నారనే దాని గురించి మాట్లాడుతూ బెన్- గురియన్ అనుకుంటా , “ఈ మనుషులున్న దేశంలోనే మనం జీవించవలసి ఉంటుందనే ఆలోచనను నేను భరించలేక పోతున్నాను” – అని అన్నాడు.

మేరీ: సాటి మనుషుల పట్ల ఈ వ్యక్తుల ప్రవర్తన అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. ఇంత మానవత్వం లేకుండా ఎలా…

డా.అబు-సిత్తా: నేను చికిత్స కోసం గాజా బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న పిల్లల మెడికల్ రిపోరట్లను చాలా సమీక్షిస్తాను. ఎంతో మంది పిల్లల్ని స్నైపర్‌లు కాల్చారు. చిన్న పిల్లల్ని! స్నైపర్ గురించిన విషయమేమిటంటే పెరిస్కోప్ లు, టెలిస్కోప్ లతో వాళ్లు కాల్చేవాళ్లను దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. అంటే ఆ స్నైపర్ కు తాను పిల్లలను కాలుస్తున్నానన్న విషయం తెలుసు.

నేను అల్-అహ్లీలో ఉన్నప్పుడు, మేము క్వాడ్‌ కాప్టర్‌ల ద్వారా కాల్చబడిన చాలామందిని చూశాం. ఆ డ్రోన్‌లకు స్నైపర్‌ గన్‌లు అమర్చుతారు. ఒక రోజున, నాకు బాగా గుర్తుంది, ఇరవై మందికి పైగా ఆ కాల్పుల గాయాలతో వచ్చారు. ఆ వీడియో గేమ్‌కు మరో వైపున ఉన్న 18, 19, 20 ఏళ్ల (ఇజ్రాయిలీ) యువకుల గురించి నేను ఆలోచించాను. వాళ్లు తొమ్మిది సంవత్సరాల పిల్లవాడినీ, వాళ్ళ అమ్మనూ షూట్ చేయాలని నిర్ణయించారు. వాళ్లు ఆ స్థితికి ఎలా వచ్చారో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తే మన ఊహకు, భాషకు అందకుండా ఉంటుంది.

మేరీ: వాళ్లు అలాంటి చర్యలు చేయడానికి కారణమైన మానసిక స్థితి గురించిన వివరణ లేదా సర్దుబాటు ఇవ్వడం మన పని కాదని నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను. ఇది ఆపడానికి ప్రయత్నించాలి.

డా.అబు-సిత్తా: అవును మనం ఆపే ప్రయత్నం చేయాలి. ఇందులో ఎలాంటి సర్దుబాటుకు లేదా సాకులకు తావు లేదు. ఇది జాతి నిర్మూలన భావజాలం. మనం దానిని ఓడించి తీరాలి. ఇజ్రాయిలీలు ఇప్పుడు ఖైమర్ రూజ్ (Khmer Rouge) స్థాయిని మించిపోయారు. (కంపూచియా ప్రధాన మంత్రి పాల్ పాట్ నాయకత్వంలో ఖైమర్ రూజ్ కంబోడియన్ పౌరులను క్రమబద్ధంగా హింసించి, 1975 నుండి 1979 వరకు, 1.5 నుండి 2 మిలియన్ల మందిని చంపింది.) మనం ఖైమర్ రూజ్ ఏ విభాగం కోసం సర్దుబాటు చేస్తామో చెప్తూ కూర్చోలేము కదా. ఇజ్రాయెల్ సమాజంలో వైద్యులు, టాక్సీ డ్రైవర్లు, విద్యావేత్తలను మనం చూస్తున్నాం. ఇజ్రాయిలీ యూనివర్సిటీలలో పని చేస్తున్న పాలస్తీనియన్ విద్యావేత్తలు వాళ్లు ఎదురుకుంటున్న పరిస్థితుల గురించి చెబుతున్నారు. చివరకు లీగల్, పౌర హక్కుల డిపార్ట్మెంటుల్లో కూడా వాళ్ళ ఇజ్రాయిలీ సహోద్యోగులు వాళ్ళతో మాట్లాడే తీరు చెబుతున్నారు. వాళ్ళున్న స్థితి నుండి మానవత్వం వైపు అడుగులువేయడం గురించి వాళ్ళే నిర్ణయించుకోవాలి. కానీ మిగిలిన ప్రపంచం వాళ్లను ఓడించవలసిన అవసరం ఉంది.

మేరీ: మీరు చాలా కాలంగా గాజాకు వెళ్తున్నారు. డా. ఆంగ్ స్వీ చాయ్ (Dr. Ang Swee Chai) తన పుస్తకం, “బీరూట్ నుండి జెరూసలేం వరకు” (Beirut to Jerusalem)లో మీతో పాటు గాజాకు ప్రయాణించినట్లు పేర్కొన్నారు. గాజాలో విజిటింగ్ సర్జన్ల పాత్ర ఆపరేషన్లు చేయడం కన్నా ఎక్కువ అక్కడి వైద్యులకు మరింత శిక్షణ నివ్వడం, వైద్య సామాగ్రిని అందించడమని ఆమె వివరించారు. స్థానికంగా ఉన్న పాలస్తీనా వైద్యులు సమర్థులు. వారు చంపబడుతున్నారు, కానీ నైపుణ్యాల పరంగా ఎటువంటి లోపం లేదు. మరి అలాంటప్పుడు, అక్కడ డాక్టర్‌గా మీ పాత్ర ఏమిటి?

డా.అబు-సిత్తా: ఈసారి, గాయపడిన వారి సంఖ్య చాలా పెద్దది. అంటే… యుద్ధానికి ముందు గాజాలో పడకల సంఖ్య 2,500. మొదటి వారం చివరి వరకే 2,500 మందికి పైగా గాయపడ్డారు. కాబట్టి నేను అక్టోబర్ 7న వెళ్లాలని నిర్ణయించుకున్నది అక్కడి వైద్యుల నైపుణ్యం సరిపోదనే ఆలోచనతో కాదు. గాయపడిన వారి సంఖ్యతో పోలిస్తే అక్కడ ఈ పని చేయగల వారి సంఖ్య చాలా తక్కువ అని నాకు తెలుసు కాబట్టి నేను ఆ నిర్ణయం తీసుకున్నాను.

మేరీ: ఇక్కడి వైద్యులలో గాజాకు వెళ్ళి సహాయం చేయాలని బలంగా కోరుకునేవారున్నారు. కానీ కొంత సంకోచం ఉంది, ఎందుకంటే వైద్య సామాగ్రి అందుబాటులో లేకపోతే, ఏ రకమైన సహాయం అందకపోతే మనం ఏమి చేయగలం అని ఆలోచిస్తున్నారు.

డా.అబు-సిత్తా: ఏమీ చేయలేం. నా ఉద్దేశ్యంలో, ఇదే పెద్ద సమస్య: మీరు ఎక్కడికి వెళతారు? సందర్శించే వైద్య బృందాలకు వసతి కల్పించడానికి గాజా మొత్తంలో యూరోపియన్ హాస్పిటల్ ఒకటి మాత్రమే మిగిలి ఉంది. ఇజ్రాయెలీలు పూర్తిగా వ్యవస్థను నాశనం చేయడం వల్ల వాస్తవానికి ఒకరకంగా ఇప్పుడక్కడ వైద్య సిబ్బంది ఎక్కువే ఉన్నారు. ఎందుకంటే గాజా మొత్తంలో ఇప్పుడు యూరోపియన్ హాస్పిటల్‌లోని తొమ్మిది ఆపరేటింగ్ రూమ్‌లు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇజ్రాయిలీలు చేస్తున్న ఇంకో దుర్మార్గమేమంటే కొత్త కెపాసిటీతో కొత్త ఫీల్డ్ హాస్పిటల్స్ రాకుండా అడ్డుకుంటున్నారు.

మేరీ: ఇంత దారుణం ఎలా సంభవమో నాకు అర్థం కావడం లేదు…

డా.అబు-సిత్తా: ఇది జెనోసైడ్. ఇది నూటికి నూరుపాళ్ళూ జాతిసంహారం. సమస్య ఏమిటంటే, మనం జెనొసైడ్ గురించి అదొక రూపకంగా లేదా సైద్ధాంతిక నిర్మాణంగా మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు గాజాలో జరుగుతున్నది అక్షరాలా ఒక జాతి మొత్తాన్నీ నేలమీద లేకుండా తుడిచిపెట్టాలనే మారణహోమం. ఇది గణితశాస్త్రపరంగా జాతి హననం. శిథిలాల కింద ఉన్న వ్యక్తుల సంఖ్య, మరణించిన వారి సంఖ్య, నివేదికలలో బయటకు రాని వారి సంఖ్య, అంటువ్యాధులు, ఆకలితో నిశ్శబ్దంగా మరణిస్తున్న వారి సంఖ్యతో మొత్తం కలిపి మనం 40,000 నుండి 50,000 మరణాల వరకు చూస్తున్నాం. రెండున్నర మిలియన్లలో అంతమంది హత్యలంటే, గణితశాస్త్రపరంగా, ఆ శాతం జాతిసంహారంగా పరిగణించబడుతుంది. 13,000 మంది చిన్నారుల హత్యలు కూడా జెనొసైడ్ ను సూచించే సంఖ్య. కాబట్టి అక్కడ జాతిసంహారానికి వ్యూహరచన జరుగుతోంది. ఇది ఒక జాతి మొత్తాన్నీ నాశనం చేయాలనే మారణహోమ వ్యూహరచనలో భాగమే!

మేరీ: ఇదంతా బాహాటంగా, ఏ దాపరికం లేకుండా జరుగుతోంది. అదే అర్థం కాకుండా ఉంది.

డా.అబు-సిత్తా: వాళ్ళ చర్యలకు శిక్షలుండవనే అహంకారం. వాళ్ళు 75 సంవత్సరాలుగా శిక్షార్హతలనుండి మినహాయింపబడ్డారు. వాళ్లు యుద్ధాన్ని ప్రారంభించమే తమ నేరాలను ఒప్పుకుంటూ మొదలుపెడతారు. యుద్ధాన్ని ప్రారంభించే ముందు, ఏమి చేయాలనుకుంటున్నారో మొత్తం ప్రపంచం ముందు ఒప్పుకుంటారు. యుద్ధం జరుగుతున్నంత కాలం వాళ్లు చేయాలనుకుంటున్నది మౌఖికంగా అంగీకరిస్తూనే ఉంటారు. కెమెరాలు లేని ప్రదేశాలలో, తమ నేరాలను తామే వీడియో-రికార్డ్ చేస్తారు. ఎందుకంటే ఈ 75 సంవత్సరాలుగా వాళ్లకు శిక్షలు గానీ, పర్యవసానాలు గానీ లేవు. ఫలితంగా చర్యలకు పర్యవసానాలుండే ప్రపంచం నుండి వాళ్లు దూరమైపోయారు.

ఇజ్రాయెలీల చర్యలకు ప్రతిగా ఎప్పుడూ పర్యవసానాలుండవు. ఎందుకంటే వైద్య పత్రికల సంపాదకీయ బోర్డుల నుండి బి బి సి, సి ఎన్ ఎన్, రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ వరకు, పశ్చిమ దేశాలు వాళ్ల నేరాలకు శిక్షలు లేకుండా సదుపాయాలను నిర్మించి పెట్టాయి. రాజకీయ నాయకత్వం నుండి సహాయమే కాకుండా ఎన్నో రకాలుగా వాళ్లకు పర్యవసానాలు లేని వ్యవస్థను తయారు చేసిపెట్టారు. ఆ సదుపాయాలు వాళ్లు వాస్తవం నుండి దూరమయ్యే ఈ స్థితికి రావడానికి సహాయపడ్డాయి. ఈ స్థితిలో వాళ్లు ఏదీ చూడలేరు లేదా చూడవలసిన అవసరం లేదు. వాళ్ళు చేసేది మిగతా ప్రపంచంపై ఎటువంటి ప్రభావం చూపుతుందో అనే విషయం వాళ్లకు అవసరం లేదు. ఎందుకంటే 35000 మంది చంపబడిన లెబనాన్ దాడి మొత్తాన్నీ పాశ్చాత్య విద్యాసంస్థలు, పాశ్చాత్య మీడియా, లండన్‌లోని ఇజ్రాయెల్ రాయబారి హత్యాయత్నానికి ప్రయత్నించారని, PLO (The Palastine Liberation Organization) ని నాశనం చేయవలసిన అవసరానికి సంబంధించినదిగా చిత్రీకరించారు. ప్రతి ఇజ్రాయెల్ జాతి నిర్మూలన చర్యను పాశ్చాత్యులు నిత్యం కప్పిపుచ్చుతూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 2023, 2024లో జరుగుతున్న ఈ దుశ్చర్యలకు ఎలాంటి పరిణామాలు లేవు. కానీ 75 ఏళ్లుగా తాము చేస్తున్న చర్యలకు లేని పర్యవసానాలు ఇప్పుడు ఉంటాయని ఇజ్రాయెలీలు ఎందుకు అనుకుంటారు?

మేరీ: ఎప్పుడైనా ఖండనలు జరిగినా “ఇది ఇజ్రాయెల్ జనాభాలో మెజారిటీ ప్రజలు కోరుకునేది కాదు” అని మినహాయింపులతో ఖండిస్తారు. “కొందరు ఇజ్రాయెలీలు ఇలా లేదా అలా చేస్తారు,” “కొందరు సెటిలర్లు అలాంటి పనులు చేస్తున్నారు” అంటూ మనం చూస్తున్న వాటిని అసాధారణమైన విషయాలుగా మార్చడానికి ఎప్పుడూ ఒక ఫ్రేమ్‌ లో పెడుతుంటారు. వాళ్ళ ప్రవర్తన నుండి విస్తృతమైన నిర్ధారణలు లేదా నమూనాలను రూపొందించడానికి అనుమతించరు.

డా.అబు-సిత్తా: అవును. ఎంతమంది, ఎలాంటి స్థానాల్లో ఉన్నవాళ్ళు చేసినా సరే. ఒక ఇజ్రాయెలీ పిల్లల డాక్టరు ఆమె ప్రతిరోజూ ఉదయం నిద్రలేచి, తాను పనికి వెళ్లేలోపు పాలస్తీనియన్ పిల్లల్ని చంపడాన్ని చూడటానికి అల్ జజీరా టివి ని చూస్తానని చెప్తూ తన అరబ్ సహోద్యోగులను వెక్కిరిస్తుందట.

మేరీ: ఇది చాలా కలవరపెట్టే విషయం. ఇందులో విస్తృతమైన శాడిస్ట్ ఆనందం ఉంది.

డా.అబు-సిత్తా: అవునవును. ఖచ్చితంగా నూటికి నూరుపాళ్ళూ పైశాచికానందమే!

మేరీ: కానీ మనం అవతలి వైపు మరీ ముఖ్యంగా గాజా ప్రజలలో చూస్తున్న మానవత్వంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. “గాజాలోని ప్రజలు తమ మానవత్వాన్ని కాపాడుకుంటున్నారు” అని అనడం వింటుంటాం. కాదు, కాదు, వాళ్లు మొత్తం ప్రపంచానికి సంబంధించిన మానవత్వాన్ని కాపాడుతున్నారు.

వైద్యవృత్తికి ఉన్న సామర్థ్యం గురించి గాజా మీకు ఏమి నేర్పింది?

నేను దాదాపు వేరే వృత్తిని ఎంచుకోబోయి వైద్యంలోకి వెళ్లాను: లెబనాన్ పై దాడి నా యుక్తవయసులో నామీద చాలా నిర్మాణాత్మకమైన ప్రభావం చూపింది. మా నాన్న డాక్టర్ అయినందువల్ల, నేను మెడిసిన్ చేయాలనుకోలేదు. బ్రిటన్ లో ఉన్న PPE (పాలిటిక్స్, ఫిలాసఫీ, ఎకనామిక్స్) అనే కోర్సు చేయాలనుకున్నాను. అయితే ఏ ఇతర వృత్తీ చేయని విధంగా ప్రజల జీవితాలను దగ్గరగా చూసే వీలును వైద్య వృత్తి కల్పిస్తుందని నేను గ్రహించాను. వైద్యులు స్థూల, సూక్ష్మస్థాయిలలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలరు. మనం క్లినిక్‌లో ఏమి చూస్తున్నామో దానిని మెరుగ్గా చూడగలిగే దృష్టి, విశ్లేషణాత్మక నైపుణ్యాలతో మనల్ని మనం సన్నద్ధం చేసుకోగలిగితే, అది మరింత సుసంపన్నమైన జీవితం అవుతుంది. ఎందుకంటే సూక్ష్మ స్థాయి నుండి, విస్తృత స్థాయిలో విషయాలను అర్థం చేసుకోవచ్చు. మనం గనక విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకుంటే, వైద్యాన్ని కేవలం వైజ్ఞానిక శాస్త్రంగానే కాకుండా, సామాజికశాస్త్రంగా కూడా చూడగలిగితే, ప్రతి రోగిని ఒక పెద్ద వ్యవస్థలో భాగంగా చూడడం వీలవుతుంది.

ఆ తర్వాత తలుపుల వెనక ప్రజలు అనుభవించే బాధలను, గొంతులు నొక్కివేయబడ్డ ప్రజలను చూడగలిగే అవకాశం కలుగుతుంది. పాశ్చాత్యదేశాలలో వైద్యవృత్తిని చాలా గౌరవప్రదంగా పరిగణిస్తారు కాబట్టి వ్యవస్థ సిద్ధంగా లేని మార్గాలలో ఆందోళన చేసే అవకాశం దొరుకుతుంది. మనం వైద్యులం కాబట్టి మనం ఆందోళన చేయడం ప్రారంభించినప్పుడు, మనల్ని వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అన్నింటికన్నా హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, నేను బ్రిటిష్-పాలస్తీనియన్ డాక్టర్ అని మరీమరీ చెప్పవలసి ఉంటుంది, ఎందుకంటే మనం గనక కేవలం పాలస్తీనియన్ డాక్టర్ అయివుంటే, మన సాక్ష్యానికి ఏమీ విలువ ఉండదు. బంగారు రంగు జుట్టు, నీలికళ్ళ, బ్రిటిష్ వైద్యుడి సాక్ష్యానికి ఉన్న విలువ మన సాక్ష్యానికి ఉండదు. కాబట్టి జియోనిస్ట్ ప్రాజెక్ట్‌ ను రక్షించడానికి వారు సృష్టించిన ఈ గోడలోని పగుళ్లను కనుగొనడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దాని ద్వారా మన స్వరం వినిపించవచ్చు. మనం చికిత్స చేసిన బాధితులకు మనం సాక్ష్యంగా నిలబడవచ్చు ఎందుకంటే అది మన బాధ్యత. మన రోగుల కథలను ప్రపంచానికి తెలియజెప్పడం మన బాధ్యత.

మేరీ: డాక్టర్ గా విశ్వసనీయత కలిగి ఉండాలంటే మీరు బ్రిటిష్, లేదా పాలస్తీనియన్ బ్రిటిష్ అయివుండాలి : ఇక్కడ ప్రధాన వార్తా పత్రిక అయిన లాస్ ఏంజిల్స్ టైమ్స్ లో ఇటీవలే గాజాలో వైద్యం గురించిన ఒక కథనాన్ని ప్రచురించింది, అది వైరల్ అయింది. దాని హెడ్‌లైన్, “నేను అమెరికన్ డాక్టర్‌ని” అని మొదలవుతుంది.

డా.అబు-సిత్తా: అవును, నేను అది చూశాను! “నేను అమెరికన్ డాక్టర్‌ని.” “నేను ఈ గోధుమ రంగు మనుషుల్లా ఉన్మాదిని కాను, అందుకే నేను మీకు నిజం చెబుతాను,” అన్నట్టుగా ఉంది. కానీ నిజం బయటకు రావాలని తహతహలాడే మనం అలాంటివి పట్టించుకోకుండా ఉండాల్సి వస్తుంది.

మేరీ: అందులోని రాజకీయాలను గమనించడం నేను ఆపివేయలేదు, కానీ పట్టించుకోవడంలేదు. నాకు కథ బయటకు రావడం మాత్రమే కావాలి. వాళ్ళు మనల్ని మనుషులుగా చూడరు. అది చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. మీరు చెప్పినట్లుగా, మీరు మీ స్వంత మనుషుల నుండి దూరంగా ఉండటానికి సిద్ధంగా ఉంటేనే మీరిక్కడ ఒక మనిషిగా చూడబడతారు.

డా.అబు-సిత్తా: 60వ దశకం చివరి నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలకు మనం బాధితులం. ఉత్తరాదికి సమానమైనదిగా దక్షిణాది జాతీయ విముక్తి గురించి ఇప్పుడు మాట్లాడలేము. ఇప్పుడు మనం దాతృత్వం గురించి తప్ప సంఘీభావం గురించి మాట్లాడలేము. సహనం గురించి తప్ప దృఢత్వం, స్థిరత్వాల గురించి మాట్లాడలేము. ఇంకా ఎన్నో ఇతర విషయాల గురించి మాట్లాడలేము. మన జాతీయ విముక్తి భాషను మన నుండి దోచుకున్నారు.

మేరీ: మీరు అక్టోబరులో గాజాకు వచ్చినప్పుడు ఏమి ఊహించారు?

డా.అబు-సిత్తా: ఇది 2014 లో జరిగిన యుద్ధం లాగానే కానీ ఇంకా దారుణంగా ఉండబోతోందని ఊహించాను. కానీ ఈ యుద్ధాన్ని దేనితోనూ పోల్చడానికి లేదు. ఇది భిన్నమైన యుద్ధం. ఇది జాతి నిర్మూలన యుద్ధం. దీనికీ – ఇతర యుద్ధాలకు మధ్య ఉన్న తేడా సునామీకి, వరదలకు మధ్య ఉండే వ్యత్యాసం లాంటిది. అవి రెండూ నీటి వల్ల వచ్చే ఉపద్రవాలే, కానీ వాటిమధ్య సారూప్యత అక్కడే ముగుస్తుంది.

మేరీ: మీరు చూసిన సంఘటనలు మిమ్మల్ని మార్చి ఉండవచ్చని అనుకుంటున్నాను.

డా.అబు-సిత్తా: ఖచ్చితంగా. అందరూ మారినట్టే నేను కూడా మారిపోయాను. అంటే, నా అనుభవం వల్ల నేను మారాను, కానీ ఎవరూ మారకుండా లేరని నేననుకుంటాను. ఇక్కడ జరిగే విషయాలను గమనిస్తున్న పాశ్చాత్యదేశాలలో నివసిస్తున్న శ్వేతజాతీయేతర వ్యక్తులు ఎవరైనా మారకుండా ఉంటారని నేను అనుకోను. లూలా మాటలు వింటే, ఈ యుద్ధం దక్షిణాదికి ఉత్తరాదితో ఉండే సంబంధాలలో మార్పు తీసుకువచ్చిందని గ్రహించవచ్చు.

మేరీ: ఇక్కడ నుంచి మీరెటు వెళతారు? మీ దిశ, ఆలోచనా ధోరణి ఎలా మారింది? భవిష్యత్తులో మీరు పోషించబోయే పాత్ర గురించి మీకు ఏమనిపిస్తోంది?

డా.అబు-సిత్తా: నేను ఇప్పటివరకు సేవ చేయలేని వారికి సేవ చేయడానికి నా శేష జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్నాను. నా జీవితం ఇంకా పూర్తిగా గాజాతో ముడిపడి ఉండబోతోంది. గాజాను పునర్నిర్మించడమే చనిపోయినవారి పట్ల మన బాధ్యత అని నేను బలంగా విశ్వసిస్తున్నాను.

ఈ యుద్ధం గురించిన సంగతేమిటంటే… దీనివల్ల అంతులేని బాధ కలిగినప్పటికీ, ఈ యుద్ధం ఇజ్రాయెల్‌ను మనుషుల్ని చంపే యంత్రమే తప్ప మరొకటి కాదని ప్రపంచానికి బహిర్గతం చేసింది. అది పోట్లాడే యంత్రం కూడా కాదు, అది కేవలం మనుషుల్ని చంపే యంత్రం. ఇంతమందిని చంపడం తప్ప, వాళ్ళు ఏం సాధించారు? వాళ్లు భూమి మీద పట్టు సాధించలేకపోతున్నారు. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌ను తిరిగి ఆక్రమించు కోలేకపోతోంది. అది గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించగలిగింది, కానీ గాజా స్ట్రిప్‌ని మళ్లీ ఆక్రమించకోలేకపోతోంది. 1948లో పాలస్తీనియన్లు తమ భూమిని తామే విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెబుతుంటారు. జాతిసంహార యుద్ధం జరుగుతున్నప్పటికీ పాలస్తీనియన్లు గాజాలోనే ఉన్నారు. జాతిసంహార యుద్ధం జరుగుతున్నప్పటికీ, ఉత్తరాన 700,000 మంది ఉన్నారు. భీభత్స మారణహోమ యుద్ధం మధ్యలో కూడా, ప్రజలు తమ మాతృభూమి గాజాలోనే ఉన్నారు. పాలస్తీనియన్లు అనుభవించిన దానిలో నాలుగింట ఒక వంతు చిత్రహింసలు అనుభవించిన మరే ఇతర దేశాలవారైనా వాళ్ళలా ఉండలేరు.

ఈ మారణహోమ యుద్ధాన్ని నిర్వహించడానికి, ఇజ్రాయెలీలు, వాళ్లు తిరగులేనివి అనుకున్న పిడివాదాలను, వాళ్లు స్థిరీకరించుకున్న పుక్కిటిపురాణాలను వదులుకోవలసి వచ్చింది. ఏ పుక్కిటిపురాణాల ఆధారంగా తమ రాజ్యాలు నిర్మించుకున్నారో, వాటిని వదులుకుని ఆ రాజ్యాలు మనుగడ సాధించలేవు. ఇజ్రాయెల్ ప్రజల ప్రాణాలను రక్షించడానికి రాజ్యం ప్రతిదీ చేస్తుందనే వ్యవస్థాపక కల్పితకథ స్పష్టంగా అవాస్తవమని తేలిపోయింది. సాంకేతిక విజ్ఞానానికి అదే నిష్పత్తిలో అధికార శక్తిశామర్థ్యాలు ఉంటాయనే అపోహ పూర్తిగా తొలగించబడింది. 50 లక్షల డాలర్ల మెర్కావా (ఇజ్రాయిల్ సైన్యం వాడే యుద్ధం ట్యాంకులు) వాహనాలను స్థానికంగా తయారు చేయబడిన 500 డాలర్ల ఆర్ పి జి (RPG-Rocket Propelled Grenade) లు నాశనం చేస్తున్నాయి.

బందీలుగా ఉన్న ఇజ్రాయెలీల కుటుంబాల గురించి మర్చిపోయారు. ఇజ్రాయెల్ సమాజం ఈ బందీల ప్రాణాలను కాపాడాలని కోరుకునే దానికంటే ఎక్కువగా ఈ నరమేధ యుద్ధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. వాళ్ళ బందీలందరూ ఇజ్రాయిలీల బాంబుల దాడుల్లోనే చనిపోయే స్థితి వచ్చింది.

మేరీ: ఇజ్రాయిల్ యుద్ధం గెలిచే సూచనలు ఏమీ కనిపించడం లేదు. ఇది ఎంత కాలం కొనసాగినా, నిరంతర నరమేధం తప్ప వేరే ఏదీ జరిగే అవకాశం లేదు.

డా.అబు-సిత్తా: ఇజ్రాయెలీలు అల్-షిఫా హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అబు సిల్మియేహ్‌ (Dr. Mohammed Abu Silmiyeh) ను అరెస్ట్ చేశారు. టీవీ ముందు నిలబెట్టి, హాస్పిటల్ కింద సొరంగాలు ఉన్నాయని చెప్పమని బలవంతం చేశారు. వాళ్ళు అతని రెండు చేతులు విరిచారు. ఇతర వైద్యుల ముందు అతనిని మెడను గొలుసుతో కట్టేసి అతనిని జంతువులా చేతులు కాళ్ళ మీద నడుస్తూ నేలపై ఉన్న ప్లేట్ లోని ఆహారాన్ని తినమని హూంకరించారు. ఇదంతా ఎందుకంటే అతను టీవీలో వచ్చి వాళ్ళు చెప్పమన్న అబద్ధాలు చెప్పడానికి నిరాకరించాడు.

ఇజ్రాయెలీలు అల్-షిఫా హాస్పిటల్ ముందు విజయం సాధించినట్టు సూచించే ఒక దృశ్యాన్ని, ఫోటో ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి చూపాలనుకున్నారు. కానీ అది వాళ్లకు వీలు కాలేదు.

మేరీ: ప్రస్తుతం ప్రపంచానికి ఎలా కనబడాలనే దానిపైనే వాళ్ళ దృష్టి ఉంది. డాక్టర్ల పట్ల మాత్రం వాళ్లకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది: వైద్యులను అరెస్టు చేయడం, వైద్యులను అవమానపరచడం, చివరకు ఇటీవల వైద్యుల లాగా మారువేషాలు వేసుకుని నటిస్తున్నారు కూడా. పాలస్తీనియన్లకు వైద్యులు అంటే ఎంత గౌరవమో వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి అలాంటి దుర్మార్గపు చర్యలు చేపడుతున్నారని నేను అనుకుంటున్నాను.

డా.అబు-సిత్తా: ఇది ఇజ్రాయెల్ సెట్లర్ వలసవాదానికి కేంద్రమైన శవ రాజకీయాలకు సంబంధించిన విషయం. మనం ఇంతకుముందే చర్చించినట్లుగా పాలస్తీనా విముక్తి ఉద్యమంలో వైద్యం, ప్రజల ఆరోగ్య సంరక్షణలనేవి చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. అంటే, ఇజ్రాయెల్ చేసే శవ రాజకీయాలకు ఒక పేరు లేకముందే, పాలస్తీనియన్లకు సహజంగానే తమ జీవిత రాజకీయాలు ఇజ్రాయిలీల మరణ రాజకీయాలకు విరుగుడుగా ఉన్నాయి. అంటే వాళ్ళ మారణహోమ రాజకీయాలు, పాలస్తీనియన్ల జీవిత రాజకీయాలతో చేస్తున్న యుద్ధమిది.

మేరీ: లెబనాన్‌లో పిల్లలకు పునర్నిర్మాణ శస్త్రచికిత్స అందుబాటులో ఉండేలా సహాయపడటానికి మీరు ఒక ప్రాజెక్ట్‌ ను ప్రారంభిస్తున్నారని విన్నాను. ఆ ప్రాజెక్ట్‌ ద్వారా మీరు చేయబోయే పనుల గురించి కాస్త వివరించగలరా?

డా.అబు-సిత్తా: పునర్నిర్మాణ శస్త్రచికిత్సలో, యుద్ధగాయాలు, వేరే రకం గాయాలకన్నా భిన్నమైనవి. కాబట్టి డాక్టర్లకు గొప్ప నైపుణ్యం, విస్తృతమైన అనుభవం అవసరం. దురదృష్టవశాత్తూ, అలాంటి సౌకర్యాలు లెబనాన్‌లో తప్ప ఎక్కడా ఉనికిలో లేవు. ఎందుకంటే లెబనాన్‌లో, జరిగిన అంతర్యుద్ధం ఫలితంగా, 2006 లో జరిగిన యుద్ధం ఫలితంగా, లెబనాన్ ఇరాకీ రోగులకు, సిరియన్ రోగులకు ఆరోగ్య కేంద్రంగా మారింది. ఇతర ఏ దేశాలలోనూ లేనివిధంగా యుద్ధగాయాలతో వ్యవహరించడంలో లెబనాన్ ఆరోగ్య వ్యవస్థలో, చివరికి ప్రైవేట్ రంగంలో కూడా అనుభవం, నైపుణ్యం ఉన్నాయి. లెబనాన్ లో వలెనే బహుశా జార్డన్‌లో కూడా చాలా మంది వైద్యులు సైన్యం ద్వారా వస్తారు కాబట్టి అక్కడ అలాంటి అనుభవమున్న వైద్యులు ఉంటే ఉండవచ్చు.

ఈ పిల్లలకు వారి బాల్యంలో 8 నుండి 12 వరకు శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. అవి సంక్లిష్టమైన గాయాలు, వాటికి సంక్లిష్ట చికిత్సా మార్గాలు చేపట్టవలసి ఉంటుంది. ఈ శస్త్రచికిత్సల తర్వాత శారీరిక పునరావాసాలతో పాటు పిల్లలలో మానసిక సామాజిక పునరావాసాలను కల్పించే మల్టీడిసిప్లినరీ కేర్ చాలా అవసరమవుతుంది. నేను AUB (అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెరూట్) లో ఉన్నప్పుడు, INARA (పునర్నిర్మాణ శస్త్రచికిత్సను అందించడానికి అంకితమైన ఒక సంస్థ) ద్వారా సిరియన్ యుద్ధంలో గాయపడిన పిల్లలకు శస్త్రచికిత్సలు చేసే ఏకైక ప్రోగ్రామ్‌ను నిర్వహించాను. కాబట్టి ఆ అనుభవాల వల్ల వచ్చిన నైపుణ్యాన్నివ్వడమే గాక ఆ రకమైన ఆచరణ మార్గం ద్వారా బాధితులందరికీ సంపూర్ణ సేవను అందించాలి. కాబట్టి పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు మాత్రమే కాదు, అవసరమైన మానసిక, సామాజిక సహాయాలను కూడా అందిస్తాం. గాయాలు నయం చేయడం మాత్రమే కాదు, దానికి మించి పునరావాసం కల్పించడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఈ పిల్లలు తిరిగి గాజాలో పునరేకీకరణ చెందేలా పని చేస్తాం. సంక్లిష్టమైన గాయాలతో ఉన్న ఈ పిల్లలకు వారికి అవసరమైన చికిత్సను అందించడానికి, ఆ నైపుణ్యాలను సంపాదించడానికి శత విధాలుగా కృషి చేస్తున్నాం.

మేరీ: మౌలిక సదుపాయాలన్నీ సమగ్రంగా ఏ లోటూ లేకుండా ఉన్నట్లు తోస్తుంది. ఈ ఏర్పాట్లన్నీ ఒక ప్రత్యేకమైన జనాభా కోసం అమలు చేయవల్సి వుంది.

డా.అబు-సిత్తా: అవును. ఈ సంక్లిష్టమైన అవసరాలను చూసే దృష్టి, అనుభవమూ, నైపుణ్యమూ వున్న వైద్యులను సమకూర్చుకోవాలి.

మేరీ: నేను ఒక గమనికతో ముగించాలనుకున్నాను – ఆశాజనకమైనది కాకపోయినా ఈ సందర్భం చాలా మందికి చాలా విషయాలను స్పష్టం చేసినట్లు నేను భావిస్తున్నాను.

డా.అబు-సిత్తా: అవును. ఆశాజనకమైన సందర్భం కాదు కానీ స్పష్టతనిచ్చే సందర్భం.

మేరీ: అవును. ఈ సందర్భంలో మనందరం వైద్యవృత్తి లోపల, వెలుపల చేయవలసింది ఏమిటని నేను ఆలోచిస్తున్నాను.

డా.అబు-సిత్తా: ఈ జెనొసైడ్ ప్రాజెక్ట్ ను ఓడించడమే మనం చేయవలసిన పని అని నేను భావిస్తున్నాను. జాతి హననమే ఇజ్రాయెలీలు మొదలుపెట్టిన యుద్ధానికి అంతిమ లక్ష్యం కాబట్టి, వాళ్ళు దానిని కాల్పుల విరమణకు అంతర్గత భాగంగా స్థాపించడానికి ప్రయత్నిస్తారు. ఇజ్రాయెలీలు ఎప్పుడూ యుద్ధంలో సాధించలేని వాటిని కాల్పుల విరమణలో సాధించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఇజ్రాయిలీలు ముట్టడిని పొడిగించేందుకు ప్రయత్నిస్తారు. అంటువ్యాధులు సోకడంవల్ల, గాయాల వల్ల చనిపోయే వారి సంఖ్యను పెంచడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా ఈ జాతిహనన ప్రాజెక్టును కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. ఇజ్రాయిలీల ఈ ప్రాజెక్టును ఓడించడమే మన పోరాటం కావాలి.

మేరీ: అన్ని రంగాలలో…

డా.అబు-సిత్తా: ఖచ్చితంగా అన్ని రంగాలలో శ్రద్ధ పెట్టాలి. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఇంతకు ముందెప్పుడూ జరగని రీతిలో మన కళ్ళముందే ఇదంతా జరుగుతుంటే చూస్తున్నాం. మనం జెనొసైడ్ ప్రాజెక్ట్ వివిధ హంగులను చూస్తున్నాం. ఒక జాతి నిర్మూలన ప్రాజెక్ట్ అంటే మనుషులను భౌతికంగా నిర్మూలించడం మాత్రమే కాదు, సమాజాన్ని ధ్వంసం చేయడం కూడా ఉంటుంది. అంటే విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, శ్మశానవాటికలు, గాజాలోని చారిత్రక భవనాలు, చారిత్రక అంశాలను సర్వ నాశనం చేస్తారు. వాటితో పాటు మనుషుల భౌతిక నిర్మూలన, అన్నీ సమాంతరంగా ఒకదానితో మరొకటి కలిసి జరుగుతాయి. ఈ మారణహోమం ప్రాజెక్ట్ ను ఓడించాలంటే – హాస్పటల్స్ ని పునర్నిర్మించడం, పాఠశాలలను పునర్నిర్మించడం, విశ్వవిద్యాలయాలను పునర్నిర్మించడం, శ్మశానవాటికలను పునర్నిర్మించడం, ధ్వంసమైన చారిత్రక ప్రదేశాలను పునర్నిర్మించడం-వీటన్నిటినీ పునర్నిర్మించడం కూడా మారణహోమాన్ని ఓడించడంలో కీలకమైన భాగం అవుతుంది. ఎందుకంటే యుద్ధం ఆగిపోగానే జెనొసైడ్ ఆగిపోదు.

కెనేడియన్లు, ఆస్ట్రేలియన్ల విషయంలో మనం చూసినట్లుగా, వలసలుగా వచ్చి స్థిరనివాసాలేర్పరచుకున్న సెటిలర్ సొసైటీలు ఒక నిర్మూలన రూపంగా జాతిసంహారం వైపు మళ్ళితే, వాళ్ళు ఇక ఎన్నటికీ వెనక్కి తగ్గలేరు. కెనేడియన్లు 70వ దశకంలో స్థానిక పసిపిల్లలను చంపి పాఠశాల ఆవరణల్లో ఏ విధంగా పాతిపెట్టారో మనం చూశాం. 80వ దశకంలో ఆస్ట్రేలియన్లు ఆదిమవాసుల బావులను విషపూరితం చేయడానికి ఎలా ప్రయత్నించారో కూడా మనం చూశాం. కాబట్టి దీని గురించిన విషయం ఏమిటంటే, ఇది వెస్ట్ బ్యాంక్, ఇజ్రాయిల్ లోని పాలస్తీనియన్లకు, లెబనాన్, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్‌ లకు కూడా చిక్కులు తెచ్చి పెడుతుంది. సెట్లర్ సమాజాలు ఒకసారి జాతిసంహారంలోకి దిగితే, అవి ఎప్పటికీ తిరిగి వెనక్కి వెళ్ళవు.

మేరీ: ఆ విధంగా ఇది అస్తిత్వానికి సంబంధించినదే. ఇజ్రాయెలీలు దీనిని వాళ్ళ అస్తిత్వానికి సవాలుగా భావించడంలో తప్పులేదు. కాకపోతే వాళ్లు మృత్యువు పక్షంలో ఉన్నారు.

డా.అబు-సిత్తా: అవును. ఇంకొక జాతిని ధ్వంసం చేసి వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నారు.

మేరీ: ఇజ్రాయిలీలు ప్రస్తుతం ఇదే ఆలోచిస్తున్నారనే ఎరుకతో మనం ముందుకు నడవాలి. పాలస్తీనియన్లను పూర్తిగా అంతమొందించాలనే వాళ్ళ ఉద్దేశ్యం గురించి సూటిగా చర్చ జరగడం లేదు. ఇక రెండు-దేశాల పరిష్కారం (టూ-స్టేట్ సొల్యూషన్) గురించిన చర్చలు వినిపిస్తున్నాయి.

డా.అబు-సిత్తా: అవును, ఖచ్చితంగా. మాడ్రిడ్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇరాకీలను చంపడాన్ని సమర్థించుకునేందుకు కూడా ఇదే పరిష్కారం గురించి చర్చించారు. అమెరికా ఇబ్బందుల్లో చిక్కుకున్న ప్రతిసారీ ఆ వాదనను బయటకు తీసుకువస్తారు. పాలస్తీనియన్లు చేసిన చారిత్రక తప్పిదం అదే. మీరు గమనించండి, వర్ణవివక్ష భావజాలాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ తప్ప మిగతా అన్నిటిపై చర్చలకు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ANC) సిద్ధంగా ఉండింది. ఒక భావజాలంగా జియోనిజాన్ని అంతమొందించడంపై దృష్టిని కేంద్రీకరించడంలో పాలస్తీనియన్ల వైఫల్యం స్పష్టమే. అది లేకుండా చర్చలకు గానీ సహజీవనానికి గానీ అవకాశం లేదు. ఇప్పుడు దానికి మనం మూల్యం చెల్లిస్తున్నాము. సెట్లర్ వలసవాద భావజాల స్వభావాన్ని పసి గట్టడంలో, అంచనా వేయడంలో పూర్తి వైఫల్యం చెందాము.

మేరీ: చివరిగా ఒక ప్రశ్న, మీరు ఆశావాహంగా ఎక్కడ మీ దృష్టిని నిలుపుతున్నారు?

డా.అబు-సిత్తా: ఓ, గాజాలో. ఖచ్చితంగా గాజా లోనే!

(మేరీ టర్ఫా రచయిత్రి, వైద్య విద్యార్థి)

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

Leave a Reply