డెబ్బైఐదేళ్లుగా నెత్తురోడుతున్న పాలస్తీనా గాయం

“నా పేరు రోసలిండ్ పెచాస్కి. నేనిక్కడ న్యూ యార్క్ లో వేలాది మందితో జమగూడాను. మాలో చాలా మంది యూదులు కూడా ఉన్నారు. గాజా లో జరుగుతున్న మారణ కాండను వ్యతిరేకించడానికి ఇక్కడ మేము గుమిగూడాము. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఇది ఆగాల్సిందే. గాజా నుండి వస్తున్న దారుణమైన వార్తలు వింటూ మేము రోజూ దుఃఖిస్తున్నాము. మా సన్నిహిత మిత్రుడు మహమ్మద్ కుటుంబం గాజా లో ఉన్నది. వాళ్లంతా ఎడతెరపి లేకుండా కురుస్తున్న బాంబుల వర్షంలో, అనుక్షణం మృత్యుభయం తో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది ఇట్లా కొనసాగడానికి వీల్లేదు. మేము కొనసాగనివ్వం. మేము న్యాయాన్ని నమ్ముతాం. ప్రజలందరికీ బతికే హక్కుందని నమ్ముతాం. పాలస్తీనా ప్రజలు గత 75 ఏండ్లుగా తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. ఇది తప్పనిసరిగా ఆగాల్సిందే. అందుకే మేము ఇక్కడ గుమిగూడి, వారికి మా సంఘీభావం, మద్దతు తెలియజేస్తున్నాము. ‘మా పేరు మీద ఈ మారణకాండ కొనసాగడానికి వీల్లేదు’ అని ముక్తకంఠం తో ఎలుగెత్తడానికి మేము ఇక్కడ జమగూడాము. ఈ మారణకాండ వెంటనే ఆగాలి.

వయసులో నేను ఇజ్రాయిల్ దేశం కన్నా పెద్దదాన్ని.”

-రోసలిండ్ పెచాస్కీ – రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్, హంటర్ కాలేజీ న్యూ యార్క్.

అక్టోబర్ 7 నాడు పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ ఇజ్రాయెల్ లోకి చొచ్చుకుపోయి ‘మెరుపుదాడి’ చేసిన తర్వాత వెంటనే ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజా పై యుద్ధం ప్రకటించింది. హమాస్ దాడిలో దాదాపు 1200 మంది చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్న దాడిలో దాదాపు 8300 మంది పాలస్తీనా ప్రజలు, అందులో 3500 మంది పిల్లలు మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్ యుద్ధం ప్రకటించాక, ముందు గాజాను అన్ని వైపులనుండి దిగ్బంధనం చేసి అక్కడి ప్రజలకు అన్ని రకాల సహాయాన్ని రాకుండా చేసింది. ఐతే ప్రపంచవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనల వల్ల కొంత సహాయాన్ని అనుమతించింది. రెండు రోజులకు ముందు విద్యుచ్ఛక్తి, ఇంటర్నెట్, సెల్ ఫోన్ సర్వీసులు కూడా పూర్తిగా బందు చేయించి గాజా ను గాఢాంధకారం లో ముంచేసింది. అల్ -ఖుద్స్ ఆసుపత్రిపై కూడా దాడి చేయబోతున్నట్టు ప్రకటించింది. ఇది రాస్తున్న సమయానికి ఇజ్రాయిల్ సైన్యాలు, ట్యాంకర్లు, గాజా లోనికి చొచ్చుకుపోతున్నాయి. 23 లక్షల పాలస్తీనా ప్రజలు గాజా లో మృత్యువు కోరల్లో నెత్తురోడుతూ ప్రాణాల కోసం, తమ జీవితాల కోసం, తమ నేల కోసం, తమదైన దేశం కోసం అనుక్షణం పోరాడుతున్నారు. మొత్తంగా గాజానే ప్రపంచపటం మీదినుండి తుడిచివేసి, పాలస్తీనా ప్రజలకు అసలు భూగోళంమీద ఉనికి లేకుండా చేయాలన్నదే లక్ష్యంగా ఇజ్రాయిల్ యుద్ధం కొనసాగిస్తున్నది. అంతర్జాతీయ సమితి చేసిన ప్రతి విజ్ఞప్తిని, ప్రతి తీర్మానాన్ని పూర్తిగా పెడచెవి పెట్టింది. దానికి తోడుగా అమెరికా కోటానుకోట్ల ధనసహాయాన్ని, ఆయుధ సహాయాన్ని అందిస్తూ ఇజ్రాయిల్ కు తనని తాను రక్షించుకునే హక్కు ఉందని వత్తాసు పలుకుతోంది. అంతర్జాతీయ సమితి చేసిన యుద్ధ విరమణ శాంతి తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 14 దేశాల్లో అమెరికా ముందుంది . అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయిల్ కు బేషరతుగా మద్దతు ప్రకటించాడు. తానూ ఒక జియోనిస్టు అని ప్రకటించుకున్నాడు. అమెరికా ప్రజల కష్టార్జితమైన సొమ్ముని పాలస్తీనాలో ఇజ్రాయిల్ సృష్టిస్తున్న మారణ హోమానికి వత్తాసుగా తరలిస్తున్నాడు. పరిస్థితి క్షణక్షణానికీ దిగజారుతూ దారుణంగా మారిపోతున్నది. చరిత్ర లో మున్నెన్నడూ లేనట్టుగా మానవ హననం జరుగుతున్నది.

ఐతే ఈ సంఘటనల పట్ల స్పందిస్తున్న చాలా మంది, ‘హమాస్ చేసింది తీవ్రవాద చర్య, టెర్రరిస్టు చర్య, హమాస్ ఒక కరడు కట్టిన ముస్లిం తీవ్రవాద సంస్థ, అది అల్ -ఖైదా , ఐసిస్ లతో సమానమైన, దుర్మార్గమైన సంస్థ – దాని చర్యలను నిర్ద్వంద్వంగా ఖండించాలి, వ్యతిరేకించాలి – అది చేసిన దాడి నుండి తనను తాను రక్షించుకునే హక్కు, ప్రతీకారం తీర్చుకునే హక్కు ఇజ్రాయిల్ కు ఉంటుంది, కాబట్టి ఇజ్రాయిల్ ని సమర్థించాలి’ అంటూ వాదిస్తున్నారు . అంతర్జాతీయ సమితి చేసిన తీర్మానానికి ఓటు వేయ నిరాకరించిన భారత దేశం కూడా తీర్మానం లో హమాస్ టెర్రర్ ప్రస్తావన లేదు కాబట్టి ఓటు వేయడం లేదని ప్రకటించింది. సామాన్య ప్రజానీకానికి ఇది సబబే కదా అనిపిస్తుంది, ఇజ్రాయిల్ చేస్తున్నది సమంజసమే కదా అనిపిస్తుంది. తన ప్రజలపై తన నేల మీదే దాడి జరిగితే ఏ దేశమైన ఎట్లా ఊరుకుంటుంది? ఎందుకు ఊరుకోవాలి? అంటూ ఇజ్రాయిల్ కు తమ సమర్థింపు పూర్తి న్యాయబద్ధమైందే అని చాలా మంది వాదిస్తున్నారు.

ఇది నిజమేనా? ఇజ్రాయిల్ చర్యలు, చేస్తున్న యుద్ధమూ సమంజసమూ, న్యాయసమ్మతమేనా? దీని గురించి ఒక నిర్ధారణకు రావాలి అంటే, ఏది సమంజసమో గుర్తించగలిగే న్యాయాన్యాయాల విచక్షణ చేయడానికి వాస్తవాలూ, చరిత్రా కొంచెమైనా తెలుసుకోవాలి. ఏదీ శూన్యం లోంచి ఊడిపడదు కాబట్టి, ఏదీ హఠాత్తుగా జరగదు కాబట్టి ప్రతి దానికీ ఒక సందర్భమూ, చరిత్రా ఉంటాయి కాబట్టి దాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. జరిగే ఏ సంఘటనైనా అది ఒక చారిత్రిక సందర్భం లో జరుగుతుందని, జరుగుతున్నదని అర్థం చేసుకోవాలి. గతంలో జరిగిన అనేకానేక కుట్రలు, కుతంత్రాలు, ప్రచారమైన అనేకానేక అబద్దాలు , అలుముకున్న భ్రమలను, మిథ్యలను ఛేదించకుండా, చరిత్రను సక్రమంగా అర్థం చేసుకోలేము. చరిత్రను అర్థం చేసుకోకపోతే ప్రస్తుత సందర్భాన్నీ అర్థం చేసుకోలేము. గత 75 ఏండ్లుగా ఒక దేశం ప్రజలను, వాళ్ళ స్వంత దేశం నుండే వెళ్లగొట్టి, కాందిశీకులను చేసి, చెట్టుకొకరిని గుట్టకొకరిని చేసి, వాళ్ళ దేశమే వాళ్లకు కాకుండా చేసి, ఆక్రమించుకున్న ఇజ్రాయిల్ కుట్రపూరిత చరిత్రను అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం. అందుకు ప్రచారమైన అబద్దాలు, సృష్టించిన మిథ్యలు అన్నింటినీ ఛేదించాల్సిన అవసరమున్నది. లేకపోతె హమాస్ ఉత్తి ముస్లిం తీవ్రవాదులుగా, వారు చేసింది ఒక దుర్మార్గమైన ఉగ్రవాద చర్యగా మాత్రమే కనబడుతుంది. ప్రతిగా ఇజ్రాయిల్ చేస్తున్నది న్యాయసమ్మతమైన ఆత్మరక్షణగా, సమర్థనీయంగా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక విషయం ప్రధానంగా ప్రస్తావించాలి. దాదాపు రెండు వేల ఏళ్లుగా యూదుల పట్ల ఒక ద్వేషం ఉనికిలో ఉన్నది. యూదులని తక్కువ చేసి చూస్తూ, వారిని అవమానపరుస్తూ, వారిని హీనంగా భావిస్తూ, అనేకానేక కారణాల వల్ల చరిత్రలో యూదుల పట్ల ద్వేషమూ, వ్యతిరేకత అమలులో ఉండింది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, యుద్ధకాలం లో జర్మనీ లో హిట్లర్ నియంతృత్వం లో యూదుల పట్ల వ్యతిరేకత పరాకాష్టకు చేసుకుని లక్షలాది యూదులను హత్యాకాండకు గురిచేసిన హోలోకాస్ట్ గా పరిణమించింది. రెండవ ప్రపంచ యుద్ధం లో హిట్లర్, నాజీ జెర్మనీ మిత్రపక్షాలు ఓడిపోయాక, యూదుల పట్ల వ్యతిరేకతకు తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా యూదులు అన్ని దేశాల్లో బలపడ్డారు. అమెరికా సహాయం తో ఇజ్రాయిల్ బలమైన దేశంగా ఏర్పడింది. అమెరికా లాంటి అగ్రదేశాల ఆర్ధిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను అధీనం లో ఉంచుకుని యూదులు పాలకవర్గంగా ఎదిగారు. గణనీయమైన ఆధిపత్య శక్తిగా ఎదిగారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యూదుల పట్ల వ్యతిరేకత (anti-semitism) ఒక నేరంగా పరిగణింపబడుతున్నది. ఐతే ఇప్పుడు ఇజ్రాయిల్ చేస్తున్న ‘ఆత్మరక్షణ’ యుద్ధాన్ని సమర్థించకపోతే, దానిని వ్యతిరేకిస్తే అది యూదుల పట్ల వ్యతిరేకతగా ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఇజ్రాయిల్ సృష్టిస్తున్న మారణహోమాన్ని వ్యతిరేకించడం యూదుల పట్ల వ్యతిరేకత కానే కాదు. కాకూడదు కూడా. అట్లా పరిగణిస్తే అది చరిత్రను వక్రీకరించడమే. నిజానికి హిట్లర్ జరిపిన మారణకాండ (holocaust) పేరు చెప్పుకుని కొంతమంది యూదులు, దానిని ఒక ‘పరిశ్రమ’ గా మర్చి లాభాలు దండుకుంటూ, ఆధిపత్య విధానాలను అమలుపరుస్తున్నారు అని ఒక చర్చ కూడా ఉన్నది.

ఇంతకీ చరితలో ఏమి జరిగింది? ప్రచారం లో ఉన్న మిథ్యాలూ, అబద్దాలూ ఏమిటి?

ఇవాళ ఇజ్రాయిల్, పాలస్తీనా గా పిలువబడుతున్న ప్రాంతం, యూదులు రాకముందు ఖాళీ గా ఉన్న ప్రాంతమని, అక్కడ ఎడారి తప్ప ఏమీ లేదని ఒక పచ్చి అబద్దం ప్రచారం లో ఉన్నది. నిజానికి పాలస్తీనా రోమన్ల కాలం నుండి ఒక దేశంగా ఉన్నది. రోమన్లే పాలస్తీన్ ను పాలస్తీనా గా పేరుపెట్టారు. రోమన్ల కాలం లో తర్వాత బైజాన్టిన్ సామ్రాజ్యం లో ఒక భాగంగా సార్వభౌమ ప్రాంతంగా ఉండింది. తర్వాత పదహారవ శతాబ్దం ప్రారంభం నుండి తర్వాత నాలుగువందల ఏళ్లదాకా ఒట్టోమన్ సామ్రాజ్యం లో భాగమైంది. అప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు పాలస్తీనా ను క్రైస్తవుల పుణ్యక్షేత్రం గానే భావించారు. ఐతే యూదుల మతం, జుడాయిజం లో పుణ్యక్షేత్రాలకు అంత ప్రాధాన్యత లేకపోయినా కొంత మంది యూదులు జెరూసలేం కు తీర్థయాత్రలకు వెళ్లేవారు. 1800 కల్లా పాలస్తీనా ఒక ఎడారిగా మారిపోయిందని కట్టుకథ ఇజ్రాయిల్ ప్రచారం చేసింది. కానీ నిజానికి ఒట్టోమన్ సామ్రాజ్యం లో భాగంగా పాలస్తీనా ఒక స్వయంసమృద్ధి గల ప్రాంతంగా, వ్యవసాయిక ప్రాంతంగా అభివృద్ధి చెంది, ఆధునీకరణకు ద్వారాలు తెరిచింది. హైఫా, షెఫామ్ర్, టిబెరియాస్, ఏకర్ లాంటి పట్టణాలు అభివృద్ధి చెంది, రేవుపట్టణాలు ఏర్పడి ఇతర ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలు ఏర్పర్చుకుని అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థగా, ఐదు లక్షల జనాభాతో అలరారింది. అప్పటికి పాలస్తీనా లో అరబ్బులు, క్రైస్తవులు, యూదులుండేవారు. ఎక్కువ జనాభా (రైతాంగం) వెయ్యికి పైగా గ్రామాల్లో నివసిస్తే నగరాల్లో పట్టణాల్లో మధ్య తరగతి, ధనిక వర్గానికి చెందిన వారు ఉండేవారు. పాలస్తీనా లో ప్రధానంగా లౌకిక సామాజిక వ్యవస్థ అమల్లో ఉండింది. ముస్లిం లు, క్రైస్తవులు యూదులు ఒక సమిష్టి సమాజంగా కలిసిమెలిసి ఉండేవారు. అటువంటి సమాజం లో జియోనిజం విషబీజాలు నాటింది. జియోనిస్ట్ వలసవాదం మొత్తం పాలస్తీనాను యూదుల పరం చేయాలనే కుట్రతో, పంతొమ్మిదో శతాబ్దం చివరనా, ఇరవై శతాబ్దం ప్రారంభం లో యూదుల వలసలను ప్రోత్సహించి ముమ్మరం చేసింది. ఫలితంగా పాలస్తీనా ప్రజలని జియోనిస్టు వలసవాదులు వారి స్వాంతదేశం నుండే తరిమి కొట్టి తమ స్థావరంగా మార్చుకున్నారు.

జియోనిజం అంటే ఏమిటి? యూదులకు ఒక స్థలమంటూ లేదని, వాళ్ళు తమకంటూ నేల లేని ప్రజలనే ప్రచారం, పాలస్తీనా ఖాళీ ఎడారి ప్రదేశమనే అబద్దపు ప్రచారం తో జమిలిగా సాగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులకు తమ పవిత్ర స్థలమైన జెరూసలేం ప్రాంతం లో ఒక దేశం కావాలని, అది వాళ్లకే పరిమితమైన దేశం కావాలని కోరుకునే జాతీయవాదమే జియోనిజం. వలసవాదమైన జియోనిజం ఒకరకంగా జుడాయిజానికి తీవ్రరూపం. యూదులందరూ తమ పవిత్ర స్థలం జెరూసలేం కు చేరుకోవాలి అనే మత సంబంధమైన సెంటిమెంటుగా ఉపరితలంలో కనబడ్డా, అక్కడే తమదైన స్వంత దేశం (రాజ్యం) ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ అంతకుముందు నివసిస్తున్న ఆ ప్రాంత ప్రజలను బలవంతంగా వెళ్లగొట్టయినా సరే, ఆక్రమించుకోవాలి అనే జాతీయ వలసవాదానికి ప్రతిరూపమే జియోనిజం. 1897 లో ఆస్ట్రియా కు చెందిన జర్నలిస్ట్, రాజకీయ కార్యకర్త థియోడోర్ హెర్జెల్ ‘యూదులు తమకంటూ ఒక దేశం లేకపోతె మనలేరు’ అనే రాజకీయ నినాదం తో ఆధునిక జియోనిజానికి ఒక రాజకీయ సంస్థగా రూపమిచ్చాడు. 1897 లో స్విట్జర్ ల్యాండ్ బాసెల్ లో మొదటి సమావేశం ఏర్పాటు చేసిన థియోడోర్ హెర్జెల్, జియోనిస్ట్ సంస్థకు మొదటి అధ్యక్షుడయ్యాడు. యూదుల దేశం అప్పటికే పాలస్తీనా గా పిలవబడుతున్న ప్రాంతం లో ఏర్పాటు చేయాలని తీర్మానిస్తూ మొదటి కరపత్రం విడుదల చేసాడు. హెర్జిల్ జియోనిజానికి ఆద్యుడుగా చెప్పబడుతున్నా నిజానికి దానికి పునాదులు అంతకు ముందే బ్రిటిష్, ఫ్రెంచ్ సామ్రాజ్యవాదులు వేశారు. యూదుల వలసవాదంగా మారడానికి ముందు నిజానికి జియోనిజాన్ని క్రైస్తవ వలసవాద ప్రాజెక్ట్ లో భాగంగా చెప్పొచ్చు. తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా పాలస్తీనా ప్రాంతంపై, మధ్యధరా ప్రాంతం పై ఆధిపత్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదం వేసిన పన్నాగం లో భాగంగా యూదులు తమ మాతృభూమి పాలస్తీనాకు తరలిరావాలి అనే కుట్ర అమలైంది. లార్డ్ షాఫ్ట్స్ బరీ అనే బ్రిటిష్ రాజకీయ నాయకుడు ‘పాలస్తీనాలో యూదుల మాతృభూమి’ అనే నినాదాన్ని ప్రచారం చేసాడు. ఆ ప్రచారం మతపరమైనదే కాక ఒక వలసవాద వ్యూహం కూడా అనేది ఇప్పుడు స్పష్టమే.

1917 లో బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి ఆర్థర్ జేమ్స్ బాల్ఫోర్, బారన్ రోధ్స్ చైల్డ్ అనే ధనిక బ్రిటిష్ యూదు నాయకునికి ఉత్తరం రాస్తూ పాలెస్తీనా లో యూదుల మాతృదేశాన్ని ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అన్ని రకాల సహాయం చేస్తుందని హామీ ఇచ్చాడు. 1923 లో నానా దేశాల కూటమి (లీగ్ అఫ్ నేషన్స్) , బ్రిటీష్ వాళ్ళ అధీనం లో ఉన్న పాలస్తీనా లో యూదుల మాతృదేశాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను గ్రేట్ బ్రిటన్ కు అప్పజెప్పింది. దీని వెనక లార్డ్ షాఫ్ట్స్బరీ వేసిన బీజాలున్నాయి. ఆయన యూదుల వలసను బ్రిటిష్ ప్రభుత్వం క్రియాశీలకంగా సమర్థించాలి అని కాంక్షించిన విధంగానే, బ్రిటిష్ అధీనం లోని పాలస్తీనాకు బ్రిటిష్ సహాయ సహకారాలతో యూదుల వలసలు తీవ్రమయ్యాయి. ముందు మైనారిటీ యూదుల అభిప్రాయంగా ఉన్న జియోనిజం క్రమేపీ బ్రిటిష్ సామ్రాజ్యవాదం సహాయ సహకారాలతో వలసవాదంగా బలపడింది. రెండవప్రపంచ యుద్ధం తర్వాత బలహీనపడ్డ బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఆ ప్రాంతం నుండి వైదొలగిన తర్వాత మే 14, 1948 నాడు ఇజ్రాయిల్ దేశం ఏర్పడింది. 1949 లో 249,000 యూదులు ఇజ్రాయిల్ కు వలస వచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సామ్రాజ్యవాదం మధ్య ప్రాచ్యం లో (పశ్చిమాసియా లో) తన పట్టు పెంచుకోవడానికి, అక్కడ అరబ్ దేశాలపై ఆధిపత్యం కోసం, చమురు నిల్వలపై ఆధిపత్యం కోసం, మతపరంగా కూడా ఇజ్రాయిల్ కు ప్రత్యక్ష మద్దతు నిచ్చి జియోనిస్టు జాతీయ వలసవాదాన్ని పెంచి పోషిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు నేను కూడా జియోనిస్టునే అనడం వెనుక ఆ సామ్రాజ్యవాదమే, ఆ వలసవాదమే స్పష్టంగా బుసలు కొడుతున్నది. జియోనిజం అంటే జుడాయిజం కాదు, జియోనిజాన్ని వ్యతిరేకించడమంటే యూదుల పై వ్యతిరేకత (anti-semitism) కాదు అని అర్థం చేసుకోవడానికి, జియోనిజం అంటే జాతీయవాదం, వలసవాదం అని స్పష్టమవడానికి ఈ చారిత్రిక నేపథ్యం ఉపయోగపడుతుంది.

1948 లో జియోనిస్ట్ వలసవాదులు సాయుధ సైనికమూకలతో లక్షలాది పాలస్తీనా ప్రజలను తమ గ్రామాలనుండి తరిమేశారు. ఇజ్రాయిల్ ప్రధానంగా యూదులదే అయి ఉండాలనే వలసవాద సిద్ధాంతం తో పాలస్తీనా ప్రజలని తమ దేశం నుండి తమనే వెళ్లగొట్టారు. దీనినే నక్బా అంటారు, అరబిక్ లో నక్బా అంటే మహావిపత్తు అని అర్థం. 1948 లో లక్షలాది పాలస్తీనా ప్రజలను ఇల్లు లేని వాళ్ళను, ఊరు లేని వాళ్ళను, దేశమే లేని వాళ్ళను చేయడం నక్బా మొదటి అంకం. తర్వాత 1956 లో లక్షకు పైగా, వెస్ట్ బ్యాంకు గాజా ల నుండి 1967 లో మూడు లక్షల మందిని, 2000 కల్లా మరో రెండున్నర లక్షల మంది పాలస్తీనా ప్రజలను వివిధ యుద్ధాల్లో, దాడులు చేసి తరిమివేసారు,

ఐతే ఇజ్రాయిల్ లో, కొద్ది మంది అయినా యూదులు ప్రజాస్వామికంగా ఆలోచిస్తున్నారు. వాళ్లకు 1948 లో జరిగిన హత్యలు, అత్యాచారాలు, దుర్మార్గాలు తెలుసు. 1950 లో వేలాది పాలస్తీనియులని అరెస్ట్ చేసి జైళ్లలో కుక్కడం తెలుసు. 1956 లో కేవలం పాలస్తీనీయులైనందుకు సైన్యం చే హత్య చేయబడ్డ కాఫర్ ఖాసీం మారణకాండ తెలుసు, 1967 లో ఇజ్రాయిల్ యుద్ధ నేరాలు తెలుసు, 1982 లో కాందిశీకుల కాంపులపై బాంబుల దాడి తెల్సు, ఆక్రమిత ప్రాంతాల్లో పాలస్తీనా ప్రజల, యువతీ యువకుల అష్టకష్టాలు తెలుసు, నిరంతరం అమలవుతున్న దమనకాండ తెలుసు, ఇజ్రాయిల్ లో ఉన్న పాలస్తీనీయుల పట్ల వివక్ష (apartheid) తెలుసు. ధ్వంసమైన 531 గ్రామాలూ తెలుసు. రోజు రోజుకూ దుర్భరమవుతున్న వెస్ట్ బ్యాంకు గాజా ప్రజల పరిస్థితి తెలుసు. అమాయకులను హత్య చేస్తున్న మిలిటరీ ఆఫీసర్ల క్రూరత్వం తెలుసు. వాళ్ళు తమ గొంతు వినిపించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినా జియోనిస్టుల బలం చాలా పెద్దది. వాళ్ళ ఆగడాలకు అంతులేకుండా పోతోంది,

ఇజ్రాయిల్ గత 75 ఏండ్లుగా పాలస్తీనా ప్రజల మీద దమనకాండ కొనసాగిస్తూనే ఉంది. ఒక వలసవాద రాజ్యంగా, ఒక దురాక్రమణ దారుగా, ఒక వివక్ష రాజ్యంగా (apartheid) అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను, తీర్మానాలను తుంగలో తొక్కి దారుణమైన మానవ హననానికి పాల్పడుతోంది.

జియోనిస్టు వలసవాద, వివక్ష రాజ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని వలసవాద వ్యతిరేక పోరాటంగానే చూడాలి. ఆ క్రమంలో ఏర్పడ్డ పాలస్తీనా విమోచన సమితి శాయశక్తులా పోరాటం చేసి మధ్యే మార్గంగా, అగ్రరాజ్యం అమెరికా సమక్షం లో ఇజ్రాయిల్ తో రెండు రాష్ట్రాల ఏర్పాటుకి ఓస్లో ఒప్పందం పై శాంతాక్లాజు చేసింది, ఐతే దాన్ని కూడా ఇజ్రాయిల్ తుంగలో తొక్కింది. వెస్ట్ బ్యాంకు గాజాలో తన సెటిల్ మెంట్లు రోజు రోజుకూ మరిన్ని ఏర్పాటు చేస్తూ, ఎదిరిస్తే, వ్యతిరేకిస్తే దమనకాండ చేస్తూ పాలస్తీనా ప్రజలకు రోజూ నరకాన్ని చూపుతోంది. గాజా చుట్టూ పెద్ద గోడ కట్టి, ఆ ప్రాంతాన్ని ప్రపంచం లోకెల్లా అతి పెద్దదైన బహిరంగ జైలుగా మార్చింది. రోజూ ఇన్ని దురాగతాలు చేస్తున్నా, ఇంత మంది పాలస్తీనా ప్రజలను, పిల్లలను, స్త్రీలను చంపుతున్నా ఏనాడూ ఖండించని వాళ్ళు, వ్యతిరేకించని వాళ్ళు , ఇవాళ హమాస్ ది దుర్మార్గమైన ఉగ్రవాద దాడి అని ఖండన మండనలు చేస్తున్నారు. ఇజ్రాయిల్ కు ఆత్మరక్షణ హక్కు ఉంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మొన్నటి దాకా ఇజ్రాయిల్ చేసిన దురాగతాలను వ్యతిరేకిస్తూ పల్లెత్తు మాట కూడా తినకపోవడం పచ్చి హిపోక్రసీ. ఆత్మరక్షణ హక్కు ఇజ్రాయిల్ కే, పాలస్తీనా ప్రజలకుండదు అనడం ఆత్మవంచన.

హమాస్ 1987 లో మొదటి పాలస్తీనా ఇంతిఫాద (తిరుగుబాటు) తర్వాత ఏర్పడింది. పాలస్తీనా ప్రజల కోసం అనేక సార్లు అనేక ప్రయత్నాలు జరిగి విఫలమయ్యాక పుట్టిన మిలిటెంట్ సంస్థ హమాస్. అంతర్జాతీయ సంస్థల పర్యవేక్షణలో గాజాలో జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికల్లో గెలిచింది, ఏండ్లతరబడి పోరాటం తర్వాత , పాలస్తీనా ప్రజలు మిగతా నాయకులపై విసుగొచ్చి హమాస్ ను ఎన్నుకున్నారు. ఎన్నికల్లో ప్రజాస్వామికంగా గెలిచిన తర్వాత కూడా అమెరికా, ఐరోపా దేశాలు హమాస్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. తర్వాత ఇజ్రాయిల్ దాడులు ముమ్మరం చేసింది. గాజాలో సెటిల్మెంట్స్ నిర్మాణం ముమ్మరం చేసింది. ఎదిరించిన పాలస్తీనా ప్రజలపై తీవ్రమైన దమనకాండకు పాల్పడింది. అందుకే ఇన్నిరోజులు భరించి భరించి ఒకే సారి ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్టు మెరుపు దాడి చేసింది హమాస్. నిజమే అమాయకులు , స్త్రీలు, పిల్లలు చనిపోయారు. అది అవాంఛనీయం. బాధాకరం. కానీ దానికి బాధ్యత పూర్తిగా ఇజ్రాయిల్ దే , ఇజ్రాయల్ ను నిస్సిగ్గుగా సమర్థిస్తున్న అమెరికాదే.

గాజా మీద యుధం ప్రకటించి ఇప్పటికే 8300 మంది పాలస్తీనా ప్రజలని పొట్టన బెట్టుకున్న ఇజ్రాయిల్ దుర్మార్గాలను, నెతన్యాహు రక్తదాహాన్ని, అమెరికా సామ్రాజ్య వాద దాహాన్ని ముక్తకంఠం తో వ్యతిరేకించాల్సిన అవసరమున్నది. ఇజ్రాయిల్ వెంటనే యుద్ధాన్ని విరమించాలి. ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల నుండి వైదొలగాలి. పాలస్తీనా ప్రజలకు దురాక్రమణ నుండి స్వేచ్ఛ లభించి విముక్తి కావాలి.

కేవలం ముస్లిం వ్యతిరేకతతో గపాలస్తీనాను హమాస్ ను గుడ్డిగా వ్యతిరేకించే వారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అబద్దాలను, మిథ్యలను దాటి నిజాన్ని గ్రహించి, అణచివేతకు గురవుతున్న పాలస్తీనా ప్రజల పక్షం, న్యాయం పక్షం వహించాలి. నిజానికి అసలైన మత ఉగ్రవాది ఇజ్రాయిల్ అని, నెతన్యాహు అని గుర్తించాలి . జియోనిస్టు వలసవాదం అంతమైనప్పుడే ప్రపంచ ప్రజలకు శాంతి అని గుర్తించాలి.

One thought on “డెబ్బైఐదేళ్లుగా నెత్తురోడుతున్న పాలస్తీనా గాయం

Leave a Reply