అవును పాలస్తీనా ఇప్పుడో అమ్మా నాన్న లేని అనాథ
పిల్లలే లేని విషాద ఒంటరి వృద్ధ
పాలస్తీనా ఇల్లే లేని నిరాశ్రిత
పాలస్తీనా మొఖాన్ని కోల్పోయిన దేహం
పాలస్తీనా దేహాన్ని కోల్పోయిన ఆత్మ
**
ఇళ్ళు అక్కడ ఇళ్ళు కావు… శవాలను మోసే పాడెలు
పాలస్తీనాలో ఇళ్లే లేవు
పాలస్తీనా ఒక శిథిల దేశం
ఖండ ఖండాలుగా నరకబడ్డ పసిపిల్లల దేహాల సాక్షిగా అక్కడ ఇళ్ల శిథిలాలు కూడా రోదిస్తాయి
సూర్యోదయాన్నే… అక్కడ అమ్మలు కాలిపోయిన శిధిలాల నుంచి కొన్ని రాళ్లను, కొన్ని కపాలాలను కెలికి కెలికి ఇంకొన్ని చేతి ఎముకలను దొరక్క పోయినా కొంత బూడిదను తెచ్చుకుంటారు
తన పాప స్కూలు సంచీని సగం కాలిన పుస్తకాన్ని తినే కంచాన్ని పగిలిన పొయ్యిని, నీళ్ల కూజాని మరో తల్లి తీసుకుపోతూ ఉంటుంది
సంధ్య వేళల్లో యుద్ధ విమానాల సడి తగ్గగానే
సామూహిక సమాధుల మీద చెవులు ఆనించి తమ వాళ్ళ హృదయ లయలు వింటూ ఉంటారు
నాన్నలు గిన్నెలు, బట్టలు, భార్యా పిల్లలతో బాంబుల నుంచి తప్పిస్తూ ఇళ్ళల్లోంచి వీధుల్లోకి పరిగెడుతుంటారు
వాళ్ళకి బ్రద్దలైన తమ ఇంటి శబ్దం వినిపిస్తుంది
ఇక వాళ్ళకి అక్కడ ఇళ్ళు ఉండవు
**
ఇప్పుడు ఆమెకో అతనికో…
పిల్లలకో ఇల్లంటే విరిగి విడిపోయిన తలుపు … కొట్టుకెళ్లిపోయిన కిటికీ రెక్క…
ఊరవతల మురికి వాడైన గుడ్డల గుడారం ఇల్లొక పురాజ్ఞాపకం
ఇల్లు వాళ్ళ నిద్రలోని కలలో ఒక కల
ఇల్లంటే… మృత శిశువుకి ఎగిరొచ్చిన అమ్మ బురఖానో…
చున్నీనో కఫన్ గా మారడం
ఆ పసివాళ్లకు ఇల్లంటే బాంబుల దాడిలో ఛిద్రమైన బడి
బీటలు వారి ఇక పిల్లలు ఎగరలేని మైదానం
నాన్న కొనిచ్చిన ముక్కలైన బొమ్మ
విరిగిన పలకా బలపం
ఇల్లంటే రొట్టె ముక్క కోసం గుంపులో కలబడి చనిపోవడం
బాంబులు చిమ్మిన గంధకం ఒళ్ళంతా చర్మవ్యాధై పాకడం
వాళ్ళకి ఇల్లంటే బాంబులకి చిక్కకుండా కాసిన్ని బట్టలు, బిస్కట్, రొట్టె ముక్కలతో బతకడానికి సిద్ధమై దాక్కోనే స్థావరాలు ఇళ్లంటే వాళ్ళకి తెగిపోయిన కాళ్ళు చేతులు… కళ్ళతో రక్త స్రావమవుతూ
ఒళ్ళంతా సూదులు గుచ్చబడే ఆసుపత్రులు
ఇల్లంటే అమ్మ నాన్నలు వాళ్ళ పిల్లల శవాలు మోసుకునే జాగా
ఇల్లంటే పిల్లలకు అమ్మ నాన్నల సమాధులు
పిల్లలకి అక్షరాలు దిద్దుకొనే రక్షణ శిబిరాలే ఇళ్ళు
ఇల్లంటే… ఇల్లు లేని రంజానును సమాధుల మధ్య జరుపుకోవడం
ఇల్లు కాపాడుకోవడానికి రోడ్ల మీద మరో యుద్ధ విమానం పేలకూడదని అల్లాకి దువా చేయడం
ఇల్లంటే బాల్యం ఆకలికి బిచ్చమైపోవడం
**
ఆ ఇళ్ళు మామూలు ఇళ్ళు కావు మరి
అవి ఏ క్షణమైనా మారబోయే సమాధులు
అవి యుద్ధం పేల్చిన ఇళ్ళు
యుద్ధం కాల్చిన ఇళ్ళు
అవి శిథిలమయ్యే దాకా యుద్ధం చేసిన ఇళ్లు
యుద్ధం… యుద్ధం అయిన ఇళ్లు
ఆ ఇళ్ళు యుద్ధపు ఆనవాళ్లు
స్వేచ్ఛా గీతాన్ని పాడినందుకు గొంతుల్లో కత్తులు… గుండెల్లో బాంబులు దింపించు కుని బ్రద్దలై ఛిద్రమైన ఇళ్లు
అవునవి పాలస్తీనా ఇళ్ళు
**
రండి
ఒట్టి యుద్ధమైన పాలస్తీనాని చూడండిటు వీధి వీధిలో… మనుషులు మనుషుల్ని… మనుషులు శవాల్ని..
అమ్మలు పిల్లల్ని… పిల్లలు అమ్మల్ని… నాన్నలు పిల్లల్ని వెతుక్కుంటూ… వెక్కుతూ ఉంటారు
శిథిలమైన ఇంటి శిలా ఫలకం మీద తండ్రి పేరుని కన్నీళ్లతో ముద్దాడుతూ ఉంటాడు ఒక పిల్లాడు
విరిగిన తలుపులని పట్టుకొని ఉంటుందో అమ్మ
రొట్టెలు కాల్చిన పొయ్యి విరిగిన దేహంతో అమ్మ చేతుల కోసం ఆకలితో చూస్తుంటుంది
కుట్టు మిషనొకటి సగం కుట్టిన బట్టతో దుమ్ము కొట్టుకు ఊగుతూ ఉంటుంది
విరిగిన సైకిల్ ఒకటి తెగిన పిల్లవాడి కాలుతో రక్తమోడుతూ ఉంటుంది
పగిలి సగమైన ఇంటి అరుగుమీద అమ్మ పోయిన పసిపిల్ల నిద్రకు జోగుతూ ఉంటుంది
మురికి కాలువల్లో దాహం తీర్చుకునే పిల్లలు
రొట్టె దొరక్క గడ్డి తినే
బాల్యం ఎముకల పోగై చివరి శ్వాస తీసుకుంటూ ఉంటుంది
ఒక్క రొట్టె ముక్క కోసం వందమంది పిల్లలు ఎగబడి ఏడ్చే సామూహిక దుఃఖపు కేకలు ఆకాశాన్ని చీలుస్తూ ఉంటాయి
ఉన్నట్లుండి కాళ్లు చేతులూ… కళ్లు కోల్పోయిన వాళ్ళు కుంటివాళ్ళై… గుడ్డి వాళ్ళై వీధుల్లో పాకుతూ ఉంటారు
ఇళ్ల శిథిలాలను పెకిలించి శవాలను గుర్తు పట్టే పనిలో రోజూ వీధుల్లోకెక్కుతారు
శవాలు దింపే బండ్ల వెంట పిచ్చి వాళ్ళై ఏడుస్తూ పరిగెడుతూ ఉంటారు
శిథిలాల్లోనే ఆడవాళ్ల గాయపు దేహాలతో శత్రువుల కామం చల్లార్చబడుతుంది
యుద్ధం ఇళ్లనే కాదు వాళ్ళ వొంటినీ ఛిద్రం చేస్తుంది.
**
అయినా వాళ్ళు
ఆ శిధిలమైన ఇళ్ళల్లోంచి… ఇంటికొకళ్ళుగా మిగిలిన మనుషులు
ఇళ్ల ఆనవాళ్లుగా మిగిలిన వాళ్ళు
ఇంటిని ఒకప్పుడు నిలబెట్టిన
ఇంటిని ఒకప్పుడు కలిపి ఉంచిన
ఇంటిని రాత్రుళ్ళల్లో నిద్ర పుచ్చిన
ఇంటిని ఒకప్పుడు కడుపు నింపిన
ఆ శిథిలాలను పునాది రాళ్లను ఏరి ఏరి
శిబిరానికి తెచ్చి దాచి పెట్టుకుంటూ ఉంటారు
యుద్ధం ముగిసిన రోజున మళ్లీ ఇల్లొకటి కట్టుకుందామని యుద్ధ విమానాలు లేని ఆకాశాన్ని కలగంటూ ఉంటారు
అమరుడైన తమ కొడుకుల… భర్తల రక్తమోడే చొక్కాలని శిబిరపు శిఖరానికి జెండాలా ఎగరేస్తుంటారు ఆ భార్యలు… తల్లులు
కూలిన ఇంటి శిధిలాల మధ్య నుంచి ఆమె- అతడు నొప్పితో కూడిన… శిథిలమైన తమ ఇళ్ల జ్ఞాపకపు పాటొకటి అలవికాని నొప్పితో పాడుతూనే ఉంటారు
పిల్లలు అమావాస్య రాత్రుళ్ళల్లో కూడా వెన్నెల నృత్యాలు చేస్తుంటారు
కవులు పాటలు రాస్తూ గాయకులు పాడుతూ ఉంటారు
నాయకులు దేశ దేశాల సందేశాలు వినిపిస్తూ ఉంటారు
సంగీత కారులు చిరిగి కుట్లు బడ్డ తబలాని చితికిన వేళ్ళతో పూర్వీకుల మార్మిక దీవెనల మంత్రాలతో వాయిస్తూ ఉంటారు
అమ్మలు.. ఇక ఆ శిధిలాల మట్టితోనే అలికిన కొత్త పొయ్యి మీద మమకారవు రొట్టెలు చేస్తుంటారు
అవును… యుద్ధం ఆపనంటున్న వాడి వికటాట్టహాసానికి బదులుగా వాళ్ళంతా శిథిల గృహాల్లో తమ వాళ్ళ దేహ శకలాల మధ్య
యుద్ధ కవిత్వాన్ని
కోల్పోయిన జీవితాల సాక్షిగా
సామూహికంగా ఆలపిస్తూనే ఉంటారు.
నిడివి ఎక్కువున్నా చివరి దాకా చదివించ గలిగిన కవిత. Excellent
యుద్ధ భీభత్స దృశ్యాలను ఇంటి చుట్టూ అల్లిన తీరు ఆర్తిగా వుంది.