పారాహుషార్

నాదేశం
పూరి గుడిసెలు, అద్దాల మేడలు
నిరుపేదలు, ధనికస్వాములు
నిమ్నకులాలు, అగ్రవర్ణాలు
ప్రశ్నించే వాళ్లు, మౌన మాస్కులు
బయటకు రాలేనంత అనాది అనాచార
కుడ్యాల అంతరాల్లోనే ఉన్నరు.

శియ్యకుండలు, పప్పుకుండలు
శిధిల బతుకులు, శీతల బతుకులు
ఉత్పత్తికారులు, దోపిడీదారులు
దేశభక్తులు, దేశభోక్తలు
అంటుపడ్డోడు,పెట్టినోడుగా
ఎవ్వరింట్లో వారే
అందనంత సోషల్ డిస్టెన్స్ లోనే ఉన్నరు
నీకు తెల్వని ముచ్చట కాదు!

చెమటచుక్కలు, పన్నీరు చుక్కలు
బతుకుపోరు, మెతుకుపోరు
ఓటిచ్చిన ఓటరు, లాటిచ్చిన లీడరు
త్యాగదనులు, బోగస్ దనులు
పీడితులు, పీడకులు బరిగీసినట్లుగ
నక్కకు నాగలోకమంత దూరంలో ఉన్నరు
కలపడం నీతాత వశం కాదు!

డ్రాగన్, ఈగల్ డ్రగ్ మాఫియా
కరోనా కుట్రకాలాన్ని ఛేదించడానికి
భౌతిక దూరం తప్పదు
మానసిక ఐక్యచలనంతో
నివురు కప్పిన నిప్పులు ప్రజారాశులు
పారాహుషార్!

పుట్టింది వడ్డిచర్ల, జనగామ జిల్లా. నెల్లుట్లలో పెరిగాడు. జనగామలో సదివిన మట్టి పెడ్డ. వరంగల్లు నగరంలో వలస బతుకు మనుగడ. ఉపాధ్యాయ బోధన విద్యలో నల్లబల్ల మీద అక్షరాలకు అభద్ర కూలీ గొంతుకవుతాడు. చాయ్ నీళ్లు లేకున్నా సాహిత్య సాన్నిహిత్యాన్ని కోరుకుంటాడు. కవి, రచయిత, జర్నలిస్ట్, పరిశోధకుడు, అధ్యాపకుడు. ప్రముఖ తెలుగు పత్రికల్లో పాత్రికేయుడిగా పని చేశాడు. ప్రస్తుతం ఉస్మానియా యునివర్సిటీలో 'తెలుగు సాహిత్యంలో చేనేత వృత్తి జీవనచిత్రణ'పై పరిశోధన చేస్తున్నాడు.

9 thoughts on “పారాహుషార్

  1. కవిత బాగుంది. సమస్యను చెప్తూనే మన దేశ దౌర్భాగ్యాన్నీ ఎండగట్టినవ్.

    1. అన్న మీ కవిత్వం చాలా బాగుంది

  2. 💐💐🙏🙏👌💐💐 సార్ చాలా బావుంది కవిత🙏🙏

Leave a Reply