పాట ప్రాణమై బతికాడు

(తెలంగాణ ప్ర‌జాక‌వి గూడ అంజ‌న్న సుమారు అయిదు ద‌శ‌బ్దాలు ప్ర‌జా ఉద్య‌మాల్లో మ‌మేక‌మైన ధిక్కార స్వ‌రం, పాట‌ల ప్ర‌వాహం. త‌న మాట పాట‌ల‌తో జ‌న‌సంద్రాన్ని హోరెత్తించిన చెమ‌ట చుక్క‌ల ప్ర‌భంజ‌నం అత‌డు. క‌డ‌దాక ప్ర‌జ‌ల కోస‌మే బ‌తికిన గూడ అంజ‌న్న 21/06/2017 నాడు తుదిశ్వాస విడిచాడు. ఈ ప్ర‌జా గాయ‌కుని స్మృతిలో తెలుగువన్ పత్రికలో జూన్ 2017 లో నారాయణస్వామి రాసిన వ్యాసం ‘కొలిమి’ పాఠకుల కోసం…)

1983 లో అనుకుంట, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఒక సాహిత్య, సాంస్కృతిక పాఠశాల నిర్వహించినది. అరుణోదయ సభ్యులకు, సానుభూతిపరులకు పాటల గురించి, సంస్కృతిసమాజం గురించి చెప్పడానికి యేర్పాటు చేసినది. దానిలో పాల్గొనడానికి చాల మంది ఆరితేరిన కవులు, రచయితలు, కళాకారులు వచ్చినరు. దానిలో పాల్గొనడానికి పోయిన పద్దెనిమిదేండ్లపిలగాన్నైన నాకు అంతా కొత్తగ ఉన్నది.

అప్పటికే విద్యార్థి ఉద్యమాలల్ల పాల్గొనుకుంట కవిత్వం రాస్తు ఉన్న గని అట్ల అంతమంది కవులు కళాకారులతో పాల్గొనడం అదే మొదలు. మొదటి రోజు కళాకారులు పాటలుపాడుతున్నరు, కవులు తాము రాసిన పాటల గురించి వివరిస్తున్నరు చెప్తున్నరు. యెట్ల వాండ్లు ఆ పాట రాసెతందుకు పూనుకున్నరో యేది వాండ్లను కదిలించిందో చెప్తున్నరు. ఇంతలోఒకాయన చాలా సాదా సీదాగ ఉన్నడు.

కండ్ల అద్దాలు తుడుసుకుంట స్టేజి మీదికి పోయి పాడుడు మొదలు పెట్టిండు. అప్పటిదాంక గడబిడగ ఉన్న సభమొత్తం పూర్తి నిశ్శబ్దమైంది. ఆయన గొంతు సవరించుకోని పాడిండు – ఊరు మనదిరా ఈ వాడ మనదిరా … – సభ మొత్తం చప్పట్లు – నేను అఫ్సోస్ అయిన – ఇది గద్దరన్న పాట కద అన్న నా పక్క కూసున్న రామారావు తోని – కాదు – ఇది ఈయన రాసిన పాటనేగొప్ప పాట – ఈయన పేరు అంజన్న గూడ అంజన్న – గద్దరన్న దీన్ని బాగా పాపులర్ చేసిండు అన్నడు ఆయన. అవునా ఇంత గొప్ప పాట రాసింది ఈయననా – అని ఆశ్చర్యపోయిన – అంజన్న పాట ఐపోయినంక దాన్నెట్ల రాసిన అని వివరించి చెప్పినడు.

ఆయన స్టేజి దిగంగనే ఉరికి పోయి నమస్తె పెట్టి నన్ను నేను పరిచయం చేసుకున్న – ప్రేమగ మాట్లాడిండు – ఆ తర్వాత రెండు రోజులూ ఎన్నో విషయాలు చెప్పిండు – ఇంకా ‘భద్రంకొడుకో’, ‘అసలేటి వానల్ల’, ‘ఊరిడిసి నే బోతునా’ లాంటి గొప్ప పాటలెన్నో ఆయనే రాసినరని తెలిసి ఆయన మీద గొప్ప గౌరవం కలిగింది.

చాలా సాదా సీదా గా, యే మాత్రం ‘నేనిన్ని గొప్ప పాటలు రాసిన నేను చాల సీనియర్ కవిని’ అనే గర్వం గాని అహంకారం గాని లేకుండ అందరి తోని కలిసిపోయి తన అనుభవాలనుఅభిప్రాయాలను పంచుకున్నరు అంజన్న. ఆయనతో గడిపిన ఆ రెండు రోజులు యెన్నటికీ మరపు రానివి.

గూడ అంజన్న అనారోగ్యం తో ఉన్నరు, దవాఖాన ల ఉన్నరు అని తెలిసి చాలా బాధైంది. అంతకు ముందె పక్షవాతమొచ్చింది అని తెలిసినప్పుడు గుండెల్ని తొలిచినట్టనిపించింది. యెంతో చలాకీ గ వేదిక మీద చేతులూపుకుంట పాటలు పాడే అంజన్నకు పక్షవాతమా అని బాధైంది. ఇప్పుడు మల్ల అనారోగ్యమనంగనే ఇంకా రంది పుట్టింది. తొందరగ కోలుకోవాలె, అన్నమల్ల మామూలు మనిషి కావాలని కోరుకున్న.

మలి దశ తెలంగాణ ఉద్యమం ల చాలా ఆక్టివ్ గ పాల్గొని యెన్నో పాటలు రాసి ఊరూరా తిరిగి పాడిన అంజన్న తన కల సాకారమైనంక, తెలంగాణ వచ్చినంక ఆ ఆనందం యెంతో కాలంలేకుండనే అనారోగ్యం పాలు కావడం బాధ పెట్టింది. కోలుకుంటడు అనుకున్న అంజన్న హటాత్తుగ ఇట్ల మనని విడిచి వెల్లిపోవుడు అశనిపాతం లెక్క తగిలింది. పాటల కవి, గాయకుడు, కార్యకర్త ఐన అంజన్న ఇగ మనకు లేడనుకునుడు చాలా కష్టంగ ఉన్నది. అది వాస్తవమని తెల్సి భరించుడు చాల దుక్కంగ ఉన్నది.

ఆయనే చెప్పినట్టు, 1972-73 ల రాసినరు ‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా’ పాటను అంజన్న. ఆయన మొదటి పాట ‘ఊరిడిసి నే బోతునా, నేను ఉరిబెట్టుకుని సత్తునా’ అని కూడ చెప్పినరు. అప్పుడాయనకు 17 యేండ్లు అని కూడా చెప్పుకున్నరు. ఆయన పాటలన్ని యెట్ల రాసినరో చెప్పినరు. అదంత వింటుంటే ఒక గొప్ప పాఠం నేర్చుకున్నట్టనిపిస్తది. అంజన్న ప్రతి పాట ఆయన జీవితం నుండి వచ్చినదే. అన్ని పాటలు యేదో ఒక సంఘటన నుండో ఒక జీవితానుభవం నుండో పుట్టినయే.

తను తన జీవితంలో చూసిన అనుభవించిన సంఘటనను పాటగ కట్టి అంజన్న, ఆ సంఘటన వెనుక కార్య కారణ సంబంధం వెతికి పట్టుకున్నరు. అది కూడ యేదో తెచ్చి పెట్టుకున్నకృత్రిమమైన విషయంగానో కాక చాల సహజంగ ఆ పాటలో ప్రవేశ పెడతరు. అంటే యేదో తెచ్చిపెట్టుకున్న కృత్రిమ ముగింపు లెక్కనో, లేక యేదో సిద్దాంతం చెప్పాలె అన్నట్టో కాకుండ తాను చూసిన అనుభవంలోకి వచ్చిన జీవితంలోనుండే ఒక సారాంశంగ, ఒక సహజమైన ముగింపు, పరిష్కారం లెక్క చెప్తరు. దాదాపు ప్రతి పాట కూడ అట్లనే ఉంటది. కొన్ని పాటలల్ల ప్రశ్నలు అడుగుతడు.

‘అసలేటి వానల్ల ముసలెడ్ల గట్టుకు మోకాటి బురదల మడికట్టు దున్నితే గరిశెలెవరివి నిండెరా గంగన్న గుమ్ములెవరివి నిండెరా గంగన్న’ అని చాల అమాయకంగ కనబడే మౌలికమైన ప్రశ్న అడుగుతరు. అట్లే ‘ఊరు మనదిరా’ పాటలో మొత్తం భారతీయ సమాజంలో (మూడవ ప్రపంచ వ్యవసాయిక దేశాల్లో) ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి విధానం శ్రమ దోపిడీని చాలా సులభంగా అర్థమయెటట్టు, గుండెలకు హత్తుకుపోయెటట్టు చెప్తరు.

‘సుత్తి మనది కత్తి మనది
పలుగు మనది పార మనది నడుమ
దొర యేందిరో వాని దొర
తనమేందిరో’ అని పరిస్థితి (ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలు – గట్టు మీద దొరోడు చెట్టులెక్క నిలుసుండి…) చెప్పి, అట్ల యెందుకుంది అనే ప్రశ్న వేసి అది మారాలి, మారితే తప్ప మన బతుకులు మారవు అని చాల అంతర్లీనంగా గొప్పగా చెప్పిన పాట అది. నిజానికి దొర పీకుడేందిరో అని మార్చినరు తర్వాత పాడిన వాళ్ళు కానీ, దొరతనం అనడంలోనే చాలా విషయాలు అంతర్లీనంగా ఉన్నయి. దొరతనం అనేది కేవలం ఆర్థిక రంగం లోనే కాక అనేక రంగాల్లో ప్రతిఫలిస్తది.

అది కులం అణచివేత రూపంలో కావచ్చు, సాంస్కృతిక అణచివేత రూపంలో కావచ్చు మౌలికంగ భూస్వామ్య సంబంధాలు ప్రబలంగ ఉన్న భారతీయ సమాజంలో అన్ని రంగాల్లో ఉన్న దోపిడీని అణచివేతను దొరతనం అనే మాట ఇంకా బాగ సూచిస్తది. అట్ల ఆ పాట ప్రతి చరణంలో శ్రమ ఎవరు చేస్తున్నరు, ఫలితం యెవరు అనుభవిస్తున్నరు దానికి కారణం యేమిటి – కారణం తెలిసిన మనం యేమి చెయ్యాలె అని చాలా సూటిగానూ అంతర్లీనంగానూ యేక కాలంలో చెప్పినరు. ప్రతి ఒక్కరూ పాడుకోగలిగే సులభమైన బాణీలో ఉన్న ఆ పాట అందుకే ప్రజల్లోకి అట్లా చొచ్చుకు పోయింది. అందుకే ఈ పాట ప్రతి భారతీయ భాషలోకి అంతే గాక ఆఫ్రికా ఖండంలోని భాషల్లోకి అనువాదమై ప్రజల నాలుకల మీద దోపిడీ పీడనల నుండి విముక్తి దొరికే దాక చిరస్థాయిగ నిలిచి వారి జీవితంలో భాగమైంది.

అంజన్న పాటలన్నీ ప్రజలకు చిరపరిచితమైనవే. ఆయనే చెప్పుకున్నట్టు ప్రజలే ఆయనకు గురువులు, పాఠశాల, పాఠాలూ సమస్తమూ. ‘భద్రం కొడుకో’ పాట కూడా అట్లా ఆయన జీవితంలోని ఒక అనుభవం నుండి పుట్టినదే. హైదరాబాదులోని అసంఖ్యాక బస్తీ లలో పల్లెలనుండి వలస వచ్చిన కష్టజీవుల మధ్య యెదురైన ఒక అనుభవమది. రిక్షా తొక్కె తన కొడుక్కు ‘భద్రం కొడుకా, పైలం కొడుకా’ అని చెప్పే తల్లి మాటల్లోంచి పుట్టిందా పాట. తెలంగాణ నుడికారం, భాష ఆ పాటలో గుబాళిస్తయి.
‘రిక్షా యెక్కే కాడ దిగే కాడ
తొక్కుడు కాడ మలుపుడు కాడ
భద్రం కొడుకో జర పైలం
కొడుకో’ అని చెప్పి
‘పల్లెలల్ల పెద్ద దొరల బాధలతో యేగలేక
పొట్ట సేత పట్టుకోని పట్నమొచ్చిన’మని
పరిస్థితి చెప్తూ,
‘పెద్దపెద్ద బంగ్ల లల్ల పెద్దా పెంజరలుండు
నల్లా బాజారు నిండ నల్లా నాగులుండు
నలుగురు గూడిన కాడ నరలోకపు యముడుండు’ అని మొత్తం దోపిడీ వ్యవస్థను మూడు వాక్యాలల్ల చెప్పినరు అంజన్న. పెద్ద పెద్ద బంగ్లలల్ల ఉండే పెట్టుబడిదార్లు, నల్ల బజారు బ్లాక్ మార్కెటీర్లు, వారికి కాపు కాసే పోలీసు వ్యవస్థ రాజ్యమూ – ఇంత సులభంగా ఇంత బలంగానొ చెప్పిన పాట మరొకటి లేదు. కావాలని కవిత్వం పాటల్లో చొప్పించడం అంజన్న లక్షణం కాదు. ఆయన పాటలో కవిత్వం చాలా సహజంగా అంతర్లీనంగా పారే నది లెక్క ఉంటది అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ‘భద్రం కొడుకో’ పాట మొత్తం ఒక గొప్ప కవిత్వంతో గుండెల్నికదిలించే పాట.

అట్లా అంజన్న ప్రతి పాటలోనూ కవిత్వం నర్మ గర్భంగ ఉంటుంది. అంజన్న పాటలల్ల మరో లక్షణం తెలంగాణ నుడికారం తెలంగాణ పదజాలం. ప్రతి పాట అద్భుతమైన తెలంగాణపదాలతో పదబంధాలతో గుబాళిస్తు ఉంటయి. ‘అసలేటి వానల్ల’ పాటల అసలేరు అనేది ఒక కార్తె అని ఆ కార్తె ల వానలు యెక్కువ పడతయి అని అద్భుతంగ చెప్తరు. ఆశ్లేష కార్తెను తెలంగాణ ప్రజలు అసలేరు అని అంటరు. ఆ సూక్ష్మాన్ని పట్టుకున్నరు అంజన్న.

అట్లే ‘ఊరుమనదిరా’ పాటలో ఒక చోట ‘బందుకు పట్టేది మనం బరువులు మోసేది మనం’ అంటరు. అక్కడ బందుకు అంటే తెలంగాణల పక్కకు అని – అంటే పక్కకు జరిపేది మేమే బరువులు మోసేదీ మేమే అని అర్థం. అయితే ఆ పాట పాడినోల్లు బందుకు అనంటే తుపాకి అని అర్థమొచ్చెటట్టు పాడినరు.
తొలిదశ తెలంగాణ ఉద్యమం ల విద్యార్థిగ పాల్గొని, మలిదశ తెలంగాణ ఉద్యమంలో మొదట్నుంచి కీలక పాత్ర వహించిన అంజన్న తెలంగాణ గురించి చాల తక్కువ మంది మాట్లాడుతున్న సమయంలో ‘నా తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ’ అని గొప్ప పాట రాసినరు. అట్లే ‘అయ్యోనివా నువ్వు అవ్వోనివా’ లాంటి అనేక పాటలు రాసిన అంజన్న తెలంగాణ కోసం వందలాది విద్యార్థి యువజనులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంల
‘పుడితొక్కటి సస్తే రెండు
రాజిగ ఒరి రాజిగ యెత్తర
తెలంగాణ జండ రాజిగ ఒరి
రాజిగ’ అని ఒక గొప్ప పాట రాసినరు. పుట్టెటప్పుడు ఒక్కనిగనే పుట్టినా సచ్చెటప్పుడు మాత్రం ఒక్కనిగ సావద్దు ఆత్మహత్య చేసుకోవద్దు శత్రువుని దెబ్బ కొట్టే ఓడించే సావాలె అని అచ్చంగ తెలంగాణ నుడికారంతోని చెప్పి ప్రజల్లోకి చొచ్చుకు పోయి ప్రభావితం చేసినరు.

అట్ల చెప్పుకుంట పోతే అంజన్న ప్రతి పాటలో ఒక గొప్పతనము, సాహిత్యపరమైంది, సామాజికమైంది చెప్పుకోవచ్చు. భాషా పరంగా కూడా అంజన్న పాటలు వాటికవే సాటి. అత్యంత సులభమైన భాష, మాటల్లో సూటిదనం, పదపదానా తెలంగాన నుడికారం తో పాటు అంజన్న పాటల్లో అంతర్లీనంగ ఉండే కవిత్వం సంగీతం మనను అబ్బురపరుస్తది. ‘అసలేటి వానల్ల’ పాటలో ఉన్న విషాదమూ ప్రశ్నించే తత్వమూ పాట సంగీతంలో ఇమిడి పోవడం అంజన్న గొప్పదనం. అట్లే సిరిసిల్ల వేములవాడ జగిత్యాల ప్రజాపోరాటాలు ఉధృతంగ ఉప్పెనై చెలరేగి దొరల కాల్ల కింద దుమ్ము వాల్ల కండ్లల్ల ప్రతిఘటనై యెగసిపడ్డ సందర్భంలో అంజన్న రాసిన

‘ఇగయెగబడదామురో యెములడ
రాజన్న మనం ఇగ కలబడదామురో
యెములడ రాజన్న మనం’ పాటలో కొట్టెచ్చెటట్టు వినబడే పదాల లయ ఆగ్రహం ధ్వనించే ఉధృతి సంగీతం మనకు స్పష్టంగానె వినబడుతుంది. ఆ పాటను యెంత ప్రయత్నించినా మెల్లగ నిదానంగ పాడుకోలేము. అంజన్న గొప్ప కవే కాకుండ మంచి గాయకుడు కూడ. ఆయన పాటలను ఆయనే పాడుతుంటే వినడం ఒక గొప్ప అనుభవం. యే చరణం యెట్లా పాడాలో, యే వాక్యం యెట్లా నొక్కి దానికవసరమైన ఉద్వేగంతో పలకాలో ఆయనకే తెలుసు.

పదిహేడేండ్ల వయసు నుండే ప్రజల నుండి, జన జీవితం నుండి పాఠాలు నేర్చుకుని వాటిని అద్భుతమైన పాటలుగ మలిచిన అంజన్న ప్రజల జీవితాల్లో, ఆటపాటల్లో నుడికారంలో చిరకాలం బతికే ఉంటరు. ఆయన రాసిన పాటలు ప్రజల నాలుకల పై సజీవంగా పలుకుతూనే ఉంటయి. ఆయనకు మరణం లేదు. జీవితాంతం ప్రజల కోసమే తపించి వారికోసమే పాటలు రాసిన అంజన్నను ఆ ప్రజలు యెంతో ఆదరించినరు. ఆయన పాటలను అజరామరం చేసినరు. ఒక కవికీ కళాకారునికీ అంతకంటే యేమి కావాలె.

తను కలలు గన్న తెలంగాణ రాష్ట్రం తన జీవిత కాలంలో యేర్పాటు కావడం అంజన్న అదృష్టం మనందరి అదృష్టమూ కూడా. ఒక గొప్ప కవిగా ప్రజల నాలుకల పై చిరకాలం జీవించే అంజన్నకు ప్రజల నివాళి గొప్పది – ఆయనకు, లాంఛన ప్రాయమైన ప్రభుత్వ లాంఛనాలు లభించలేదని యెంతమాత్రమూ బాధపడాల్సిన అవసరం లేదు. సిసలైన ప్రజాకవి అంజన్న అమరుడు.

పుట్టింది సిద్ధిపేట‌, చదివింది జిల్లా ప‌రిష‌త్‌ హై స్కూల్ లచ్చపేట, స‌ర్వేల్‌, హైద‌రాబాద్‌ పబ్లిక్ స్కూల్, జేఎన్‌టీయూ, ఓ యూ. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా, అమెరికాలో గత 20 ఏండ్లుగా ఐటీలో, 14 ఏండ్లు విరసం సభ్యుడు. మూడు కవితా సంకలనాలు 'కల్లోల కలల మేఘం', 'సందుక', 'వానొస్తదా'?,  ఒక కవితా ప్రయాణ జ్ఞాపకాలు 'నడిసొచ్చిన తొవ్వ' – ఇప్పటిదాకా ప్రచురణలు. 'ప్రజాకళ', 'ప్రాణహిత'లతో సన్నిహిత సంబంధం.

Leave a Reply