పహారా

ఎదురీత దూరమెంతో స్పష్టతుండదు
ప్రయాణం ఏకముఖంగా సాగుతుంటుంది
మంచి రంగుతో పైనుండి కమ్ముకునే
మంచు-తెలుపు బూడిద
చేరబిలిచేది నిన్ను చల్లబరచడానికేనని
నీకు తెలియదు గాక తెలియదు
ఒక్కో వరదసుడి ఎదురైనప్పుడల్లా
దిగువమార్ల జారిపోతుంటావు

తరలిపోయే సహజ వనరుల్ని చూస్తే
తగలబెట్టబడిన యక్షులెందరో
నింగిలో తారలై కనబడతారు నీకు;
సోదరులూ సోదరీమణులెందరో
నక్షత్ర దీపాలై శోకిస్తూ
తళుక్కున మెరిసి మాయమౌతారు
నీ గుండె మంటలు కోపంతో గర్జిస్తాయి
దోపిడి మూకలు ఎన్ని వేషాలు మార్చినా
ఇక ఫలితం ఉండదు

అగ్నికణం లాంటి ఒక్క చైతన్యపు రవ్వతో
నీ జీవితం కొత్తగా మొదలౌతుంది
నువ్వు గట్టిగుండెతో ముందుకు కదలగానే
నిన్నాపడానికి యత్నించిన ఆటంకాలన్నీ
నీ తోవలో వారధులౌతాయి
నీ చలనాన్ని అడ్డుకోజూసిన ఒక్కో కాలగండం
నీ దారిలో మైలురాయిగా నిలిచి ఉంటుంది

క్రమంగా ఎదుగుతావు
నెమ్మదిగా బలం పుంజుకుంటావు
నీ కదలికల్ని స్తంభింపజేయాలనుకుని
నిన్ను శాసించిన సంకెళ్ళన్నీ
నోళ్ళమీద తాళాలు వేసుకుని
నీ ముందు కొయ్యబారి నిలబడిపోతాయి
అప్పటికి వేళ్ళు కొంకర్లుపోయి
చలిలో గడ్డకట్టిన అపరిచిత వీరులంతా
జాజ్వల్యమానమై మండే నీ చుట్టూ చేరి
నీ కళ్ళలోంచి కొన్ని నిప్పురవ్వల్ని తీసి
వారి గుండెల్ని వెలిగించుకుంటారు

ఎప్పటి నుండో ఘనీభవించిన నిశ్శబ్దం
నెగళ్ళ కొయ్యల మధ్యనుండి టప్ టప్మంటూ
పగుళ్ళుబార్చే జ్వాలలోపడి దగ్ధమౌతుంది
నిప్పు సెగలు ఉప్పందించగానే
పుల్ల పుడక కర్ర దుంగ మొద్దు మోడు ఒక్కొక్కటీ దివిటీలై లేచి నిలబడతాయి
అప్పటికప్పుడు ఉడుకుపట్టే పిడికిళ్ళన్నీ
ఒక్కొక్కటీ ఒక్కో యక్షుడిలా మారి
ఆ దివిటీలందుకుని దేశ సంపద కాపుకొస్తాయి

ఒక్కో ప్రజావనరు చుట్టూ ఒక్కో అగ్నివలయం..
ఒక్కో రూపాయిని కావలించుకుని
ఒక్కో చెమటబొట్టు..
కాగడాలతో కాపలా ఉంటాయ్
ఉదయమిత్రుడివై నీవు పంచిన వెలుతురులో
ఈ దేశానికి ఒక కొత్త జీవితం మొదలౌతుంది!

కవి, రచయిత. పుట్టింది శ్రీకాకుళం జిల్లాలో బడగాం అనే మారుమూల పల్లె వ్యవసాయ కుటుంబంలో. చదువు: M.A.(English), M.A.(Telugu), B.Sc., B.Ed. వృత్తి: ఉపాధ్యాయ వృత్తి. రచనలు: 1) వలస పక్షుల విడిది - తేలినీలాపురం (2005) 2) కొంగా! నా గోరు మీద పువ్వెయ్యవా...(నానీ సంపుటి) (2010). ఇంకా వివిధ పత్రికల్లో వందకు పైగా వచన కవితలు, కొన్ని సాహితీ వ్యాసాలు, సమీక్షా వ్యాసాలు ప్రచురించబడ్డాయి. గత రెండు దశాబ్దాలుగా సాహిత్యంతో అనుబంధం.

One thought on “పహారా

  1. యువ చైతన్యం కంచరాన వారికి అభినందనలు

Leave a Reply