సామాజిక చీకట్లని వెంటేసుకు నడిచిన కవిత్వం

“ఔను నేనింకా నిషిద్ధ మానవుణ్ణే
నా అక్షరాలు ఆదుగులు నా ఊపిరి ఉనికి నిషిద్ధం
నా పుట్టుకే ఇక్కడ నిషిద్ధమైన సందర్భం!

ఐదు వేల ఏండ్లుగా నడిచొచ్చిన చరిత్రలోంచి
మళ్ళీ ఒక బుద్ధుడిలా
ఈ లోకం బాగుండాలని పచ్చని కల కంటాను
….
ఇంతకూ నేనెవర్ని??
నేను జాంబవంతుని మనవణ్ణి
బొటన వేలు తెగ్గోయబడిన ఏకలవ్యుని తమ్ముణ్ణి
….
ఈ అంటరాని భూమ్మీద
ఇవాళ నా పేరు వేముల రోహిత్
నిన్న మదారి వెంకటేషు, పుల్యాల రాజు
గొడ్లు కాసిన బాలరాజు
మొన్న సెంథిల్, అంతకు ముందు సునీత
పేరేదేతైనేం….పచ్చిపచ్చిగా నేనొక నిషిద్ధ మానవుణ్ణి
వెలివాడ నా వదలని నెట్ వర్క్
కులం నా వెంట నడిచే వైఫై” (నేనింకా నిషిద్ధా మానవుణ్ణే)

ఇది హైస్కూల్ విద్యలో పాఠ్యాంశంగా పెట్టాల్సిన కవిత. పసునూరి రవీందర్ అనే దళిత పోరాట కవి తన అస్తిత్వం గురించి చేసిన ప్రకటన ఇది. సిగ్గుపడగల సంస్కారం వున్న వారెవరైనా ఈ సమాజంలో మిగిలుంటే సిగ్గుపడేలా చేసే కవిత ఇది. ఆయన కవిత్వ సంపుటి “ఒంటరి యుద్ధ భూమి”లోని “బతుకు నేర్పిన పాఠం” అన్న కవితలోని పై వాక్యాలు నన్నెంతగానో వెంటాడాయి. సిగ్గుపడేలా చేసాయి.

“తత్వ శాస్త్రాలేవీ చదవకుండానే
తవ్వి కుప్ప పోసిన ఆలోచనల ముందు
జీవితాన్ని అంది పుచ్చుకున్నట్లు ఒక నిట్టూర్పు!

గెలవడం కోసం మృగం
శక్తినంతా కూడదీసుకున్నట్లు నేను

జవాబులు లేని ప్రశ్నల నడుమ
ఏదో తెలియని నమ్మంతో
ఈ ఒంటరి బైరాగి పయనం” (బతుకు నేర్పిన పాఠం)

ఇలాంటి మెచూర్డ్ వాక్యాలు ఈ సంపుటి నిండా చాలానే కనిపిస్తాయి. ఒక సందిగ్ద స్థితిని ఆవిష్కరిస్తూనే జీవితానికి ఒక విలువని సంతరించి పెట్టే అంతర్మథనం కనిపిస్తుంది. మన లోలోపల ఎంతటి పోరాట శక్తి వున్నా సామాజికాంశాల్లో మన పోరాటాల ప్రతిఫలం కేవలం మన చేతుల్లోనే వుండదు. అయినా పోరాటం అస్తిత్వంలో భాగం కాక మానదు. ఉన్నత విద్యావంతుడైన ఒక మేథో రచయితగా, జర్నలిస్టుగా సంఘంలో గౌరవ మన్ననలతో వర్తమానంలో నిలబడినప్పటికీ సాంఘీకంగా ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్న వర్గానికి చెందిన వ్యక్తిగా అతను కొన్ని వేల సంవత్సరాల పాటు సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక దోపిడీకి గురైన వారసత్వాన్ని తన మనములో, మననంలో, గమనంలో నిలుపుకుంటున్నాడు. అలా నిలుపుకున్న ఫలితంగానే సాహితీ సృజన చేస్తున్నాడు. అందులో స్నేహం వుంటుంది. ఆర్తి వుంటుంది. ఆగ్రహం వుంటుంది. కసి వుంటుంది. మార్పు గురించిన బలమైన కాంక్ష వుంటుంది. అందుకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కవిత్వ సంపుటి ప్రబల తార్కాణం.

పసునూరి రవీందర్ ఒక సంక్లిష్ట దశలో సాహితీ ప్రయాణం చేస్తున్న ఒక విలక్షణ సాహితీకారుడు. ఏమిటా సంక్లిష్టత అంటే ఉమ్మడి శత్రువెవ్వరో తెలిసినా చీలిన పోరాటకారులు, ఆశలు పెట్టుకున్న ఉద్యమాలు నిస్సారమై పోయి క్రాస్ రోడ్లల్లో పీడితుల్ని వదిలేసిన వైనం, పీడిత భాష మాట్లాడే పీడక ముసుగు వీరులు….ఇదీ వర్తమాన సంక్లిష్టత. ఈ సంక్లిష్టతని పసునూరి దృష్టికోణంలో గొప్ప నిర్దిష్టతతో అవగాహన చేసుకున్నారు. ఆ నిర్దిష్టత తన అస్తిత్వ స్పృహ నుండి వచ్చింది. ఆయన దళితుల్లో మరింత అణగదొక్కబడిన మాదిగ ఉపకులానికి చెందిన వారు. అందు చేతనే డప్పు సహజంగానే ఆయన కవిత్వానికి నాయకత్వ ప్రతీక అయింది. ఆయన అతను కథకుడు. గాయకుడు. కవి. వక్త. అన్నింటిలోనూ ఒకే స్థాయి మేథస్సుని, కళని, సృజనాత్మకతని చూపించగలవారు. తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకున్న వాడు. దళిత ఉద్యమ స్పృహతో వున్నవారు. ఈ విషయాల్లో రాజీ లేని తత్వమతనిది. అందుకేనేమో ఆయన కవిత్వంలో ఒక ఆగ్రహ సంవాదముంటుంది. తన జాతి తరపున చేసే సంభాషణ వుంటుంది. అలాంటి ఒక సంభాషణే ప్రణయ్ హత్య సందర్భంగా రాసుకున్నారాయన.

“నేను బుద్ధుడి అడుగుజాడల్లో
గుప్పెడు ప్రేమని గుండె కింద మోస్తూ విస్తరిస్తుంటాను

పారే నా ఉడుకు నెత్తురు కోసం
నువ్ వేట కుక్కలా ఎదురు చూస్తావ్” (ద్రోహ సంతకం)

ఇంతకు ముందే చెప్పినట్లు ఎన్నో అసందిగదతల నడుమ ఒక తాత్వికతని అన్వేషిస్తుంటాడు కవి. ఆత్మవంచనల, సర్దుబాట్ల జీవితాన్ని గుర్తిస్తూనే ఒక ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తుంటాడు.

“బ్లడీ లైఫ్ ని కసి తీరా తిట్టుకోవాలి
బిడ్డను కొట్టి పశ్చాత్తాప పడి ఏడ్చే తల్లిలా
మళ్ళీ దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకోవాలి
బతుకంటే పల్లేరు బాటే కాదు
పూల బాటని
ఒక పచ్చి అబద్ధాన్ని మోసుకు తిరగాలి
……
లోపలికి తొంగి చూడకు
మానని గాయాలు చేతులకు తగులుతాయి
నడుస్తూ నడుస్తూ వెనుకకు తిరిగావా
పురాస్మృతులేవో
నిన్ను తగులబెట్టి చలి కాచుకుంటాయి.
,,,,,
రాళ్ల దెబ్బల గుర్తులకు కాలమే మందు
గాయాలు పాతవే
తెగింపే ఎప్పుడూ కొత్తగా వుండాలి” (చిగురాకుల కల)

ఇలాంటి అనేక ప్రతికూల పరిస్తితుల్ని ఆయన పుష్కలంగా కవిత్వీకరించారు. ఏవేవో వాదనలు, వివాదాలు, స్వార్ధాలు, డైవర్షన్స్ పీడిత సమాజాన్ని చీలుస్తుంటుంది. అప్పుడు కలలు కూడా గాయపడే వాస్తవం బాధ పెడుతుంటుంది. ఈ సందర్భాన్ని ప్రభావవంతంగా కవిత్వీకరిస్తారాయన.

“ఈ బరువు మోయలేవు
బిగ్గరగా అరవాలనుకుంటావు
నీలోంచి నీ చేయే నీ నోరు మూసేస్తుంది
కలల వంతెన మీద జారి పడుతున్నప్పుడల్లా
అగాధం కండ్ల ముందుకొచ్చి భయపెడుతుంది
……
పోరాడి పోరాడి ఓటమి ముందు
కుప్పకూలిపోవటానికి….నిన్ను నువ్వే అప్పగించుకుంటావు
…….
నీ మీద పడి నువ్వే ఏడ్వడం
నీ కోసం నువ్వే ఏడ్వడం
ఇప్పుడు కాలం ఇచ్చిన బహుమానం” (తవ్వకం)

తన నోస్టాల్జియాలో కూడా బతుకు వేదనని పలికిస్తుంటారీ కవి.

“ఏ దిక్కులేని ఒంటరి ముసల్ది సందుగ
విసిరేసినట్టో … పారేసినట్టో…
ఇంత్లో ఓ మూలన అలిగిన పిల్లిలా నిద్రపోతున్నది
సందుగంటే ఇంటి జ్ఞాపకాల ఖజాన
…..
దాన్ని తెరిచే వరకే అదొక ప్రశాంత సముద్రం
దాన్ని తెరిస్తే నిండుగా రెక్కలు విప్పిన తుఫాను
కరిగిపోయిన కలలకు
కన్నీటి ధారలకు
సాక్ష్యంగా మిగిలిన బతుకు చిత్రం – సందుగ” (సందుగ)

చీలిన పీడితులు, ఉద్యమాల వైఫల్యాలు, మోసం చేసిన నమ్ముకున్న రాజకీయాలు, వెన్నుపోటు పొడిచే నాయకులు….ఇలా అన్ని ప్రతికూల, సంక్లిష్ట, సందిగ్ద పరిస్తితుల మధ్య ఆశని కోల్పోనివ్వని అస్తిత్వ స్పృహతో, భవిష్యత్తు మీద నమ్మకంతో ఈ కాలానికి అవసరమైన కవిత్వం పసునూరిది. తాత్వికతని గొప్ప స్థాయిలో పలికించిన కవి అక్కడక్కడా ఆగ్రహం ఎక్కువైన చోట మాత్రం కొంత పలచనై పోయినట్లు అనిపిస్తుంది. ఈ చిన్ని లోపాన్ని సరి చేసుకుంటే తెలుగు కవిత్వంలో కాగడాలా మండగలడాయన.

(“ఒంటరి యుద్ధభూమి” పసునూరి రవీందర్ కవిత్వం. ప్రచురణ: మట్టి ముద్రణలు. పేజీలు: 177, వెల రూ.125/-. ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు)

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

One thought on “సామాజిక చీకట్లని వెంటేసుకు నడిచిన కవిత్వం

  1. నాలో ఉన్న కవిని, నా ఆర్తిని ఆవేదనను సరిగా పట్టుకున్న సమీక్ష ఇది. నా కవిత్వాన్ని ఇష్ట పడ్డందుకు అరణ్య కృష్ణ గారికి, ప్రచురించి నందుకు కొలిమి ఎడిటోరియల్ టీమ్ కు జై భీమ్ లు. ✊✊✊
    -Pasunoori Ravinder

Leave a Reply