పసల గీత

మా అమ్మ ఇంట్లో పని చేసుకుంటే నేను నిద్దర లేసి నీళ్ల కడ ఎత్తుకొని నీళ్లకు పోదామని బయలుదేరిన. మా ఇంటి నుండి ఊర్లో నాలుగు మలకవులు తిరిగి పోవాలి నీళ్ల బోరు కాడికి. ఆ నాలుగు మలుపులు దావ సమీసే యాలకి ఊర్లో ఏమి జరిగినయో అవి అన్ని మన కంట్లో, చెవులులో పడతాయి. నేను బోరు కాడికి ఎల్ల బారిన నాతోపాటు పైట వేసిన నలుగురు… వాళ్ళందరు ఒకరు రేటకు, ఒకరు ముని చేతికి, చేతి మణికట్టుకు కట్టు కట్టు కొని కడవలు సంకన వేసుకొని వస్తా ఉన్నారు. నడివీధిలో నునువు మీసకట్టు మొలుస్తున్న మగ పిల్లకాయలు అంతా ఒట్టి కాలికి, లోదొల్లకు, రేట్లకు కట్లు కట్టుకొని తిరగతా ఉండారు. బంతి భోజనానికి కూర్చున్నట్లు ఈడొచ్చిన ఆడ, మగ పిల్లకాయలు అంతా కట్లు కట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఇంతలో రామక్క నన్ను చూసి “అదేమీ నువ్వు గీసుకో లేదా పసల గీత!. అందరూ ఆవుల కాడికి పోయి గీతలు వేసుకున్నారు అంట. అదేందో రాజ్యాలు గెలిసినోళ్లు గీసుకున్న్య అది ఒక లెక్క. పశువులు కాటికి పోయి పసల గీతలు కూడా ఒక గణకార్నమేన. ఆ గాయాలు మానాలంటే వారం దినాలైన పడతాయి. పండ్లు తప్పించుకొను కాకపోతే ఏంది అది అని పెద్దలు అందరూ తిడతా ఉండారు. నిన్న నేను లేను. అత్త మా అమ్మ వెనకింటి సంతకు పోయింటి వచ్చే యాలకి పొద్దు లేదు. అని చెప్పి కడవ నీళ్లు ఎత్తుకొని ఇంటికి పోతి. అన్నం పొద్దు కాడ.

నా జతగత్తి, మల్లి ఇంటి కాడికి పోయిన. వాళ్ళ ఇంటి ముందర జోబిడి ఉంది. వాల్ల ఇండ్లల్లో ఆడోల్లు ముట్టు ఉంటే, ఐదు రోజులు ఇంట్లో కి పోకుండా ఆ జోబిడీలో ఉంటారు. ఊర్లో అందరూ ఈ పట్టింపులు వదిలేసిన, “మల్లి వాల్లమ్మ వదల్లే దు. ఆయమ్మ అంతా.. శాత్రల మనిషి. ఎవరైనా వచ్చి, ఏందమ్మా! ఇంకా ఎవురు ఇవన్ని పాటిస్తారు అంటే… “ఏలుకు గోరు యాల అడ్డం” అంటుంది. తలతిక్క మనిషి. మల్లికి, వాల్ల అమ్మ గిన్నెలో అన్నం, చెంబుతో నీల్లు ఎత్తక పోయి మల్లికి ఇస్తా ఉంది. అప్పుడు పోతి నేను. మల్లి నన్ను చూసి “ఏం అబ్బా? ఎక్కడ పోయింటివి. మూడు దినాల నుండి నీ మగమే బంగారు అయింది” అనే! “పని దొరికితే పోతిని. నువేమి ? గుడసలో వుoడావు , ఎందుకు?” అంటే మల్లీ… “నేను మూడుదినాలు అయ్యింది, ఇంటికి దూరమై”అనే. “అదేంది నువు నాకంటే అయిదు దినాలు ఎనక కదా!” అంటి.

నేను కూడా అట్లే అనుకున్న. మొన్న మా నాయన సంత చేసుకొని వస్తా, ఆవులు మేపను పోమ్మా అంటే నేను ఉత్తరం పక్క ఉన్న అడివి కల్లా.. ఆవును తోలుకొని పోతి. ఆ పొద్దు మన ఊరి ఆవుల మందలు అన్నీ కూడా అట్లే వచ్చా అలివేలత్త, రామత్త, నరసింములు, అంజి గోడు, సీత అత్త ,పార్వతి, శీనుగాడు ఇంతమంది… ఆవులు తోలుకొని అడవికి పోతిమి. ఆవులు అన్ని, గుమ్మడికాయల గుండు చుట్టూ కారం గడ్డి పచ్చగా ఉంటే మేస్తా ఉండాయి. ఆవులు చిల్లబారకుండా తలోదిక్కున నిలబడ్డారు. నేను నక్కరాతి కాడ నిలబడి ఉంటే , నా కాలి ఇంటి! సల, సల కారినట్టు అనిపిచ్చ. ఏందబ్బా ఇది అని చూస్తే మైలు గిని, పక్కనే వున్న దొనబండలో నీళ్ళు ఉంటే కడుక్కొని లో పావడ ఉంట చేసి కాళ్ల సందుల్లో అదుముకుంటి. అప్పుడు నుండి ఎప్పుడెప్పుడు పొద్దు గుంకు తుందా అని బిరిన్నా, బొక్కడు పెరక్క, తినండి అని ఆవలను అదిలిస్తూ వుంటే నా బాద అంతా సీత అత్త చూసి యాలనే మేసే ఆవుల్ని అదిలిస్తా ఉండావు. అని అడిగే. ఇంట్లోకి రాకుండా అయిపోయిన అంటి . ఆయ్యో సరేలే దానికి తలుపా , దాల ముందరమా? అడ్డమేయను పోలింమింద గాలి, ధూళి సోకుతుంది. అంత ముట్టాకు పెరికి జల్లో పెట్టుకో. పరిగెత్తి, పరిగెత్తి ఆవులు మేపితే పొద్దు గుంకు తుందా? దాని టయానికి అది గుంకుతుంది. నువు పోయి గుమ్మడి కాయలా గుండు కింద కుసో నేను ఆవులు వంగేస్తా అనే. అట్ల అయి పోయిన.. ముట్టు. అని చెప్పే మల్లి. సరే “మల్లి” నేను నీ కోసమే జాలరి పూలు తెచ్చినా. నువ్వు అయితే ఐదు దినాల వరకు బొట్టు, పూలు పెట్టుకోవు కదా మీ అమ్మ కన్నా ఈ.. అనేసి ఆడపోస్తి . సరే నేను యాప గింజలు ఏరే దానికి పావల్ల మల్లా మావిటాల ఊర్లో సాసవల చిన్నమ్మ నాటకం యాస్తారంట. బిరినే పనులు అవ్వగుట్టల మే యాప గింజలు సేరు ఇరవై రూపాయలు అవి అమ్మి గంగమ్మ జాతరకి సిటి పావడ ఎర్ర పైట తీసిస్తానని చెప్పింది మా అమ్మ. నేను పోతా ఉండా అనేసి వచ్చేస్తి. నేను ఆ పొద్దు నాటకం మింద జుమతో మా అమ్మ మీద సూపడ వేయకుండా ఉన్నిపని, లేని పనులన్నీ చేసేసినా.. సాయంత్రం అందరం, తినేసి నాటకం సూన్ను పోతిమి. మా కంటే ముందే ముసిలి, ముతక చిన్న, పెద్ద, పిల్లలు అంతా నాటకం ముందర సాపలు, దిండ్లు, దుప్పట్లు పరుచుకొని స్టేజి ముందర వరకు కుర్చున్నారు. కొంతమందైతే కాళ్లు పారసాపు కొని వాల్లకు కావలసిన వాల్లకోసం తావు చేసుకున్నారు. మేము కాసంత చోటు ఎతు క్కొని కూసుంటిమి. అందరూ పార్టీలు కట్టుకొని స్టేజి మీదకు వచ్చిరి. మా కాడికి చిన్నపిల్ల కాయలు అంతా రెండు వరసలు, స్టేజి ముందర కూర్చున్నారు. ఆ డ్రామా ఆడే వాళ్ల మోకాళ్లకు రంగులు, వాళ్ల జిగు, జిగు గుడ్డలు, వాళ్ల కిరీటాలు, గదలు, చూసి పిల్లలంతా కప్పలు అరిచినట్లు అరస్తా ఉండారు. పెద్దలంతా వాళ్ళని సద్దు మనగండి అని తిడతా ఉండారు. నాకు సుమారుగా బుద్ధి వచ్చినప్పటి నుండి చూస్తా ఉండా, వాల్లు పాడే పద్యాలు ఆ కత పెద్దగా బుర్రకు ఎక్కేది కాదు. మా వయసు పిల్లలమంతా నాటకం లో బఫన్ చెప్పే ఉభ కతలు ఇని, నగే దానికే మేము పొయ్యేది. సాసవల చిన్నమ్మ ఆ కత లో ఆయమ్మ హరి భక్తురాలు, పతివర్త, వాల్లు అత్తగారింటి లో, శివ భక్తులు చిన్నమ్మ ను, హరిని కొలవద్దు, శివుని కొలువు అంటారు. ఆ మాట వినలేదని కష్టాలు పెడతారు. లాస్టు కు ఆయమ్మే గెలుస్తుంది. ఎన్ని కష్టాలు పడి నిలదొక్కుకుంటే అంత పతివ్రత అని అర్థం. ఇది కథ, ఈ ఆట మధ్యలో అప్పుడప్పుడు బఫన్ వస్తాడు. తమాషా పాటలు, మాటలు బలే ఉంటాయి.

“ఇప్పుడు కుమ్మి ఆడ పెడితే యాడపాయ గుమ్మి తీ
మదనపల్లి సంతలోన మంగమ్మ గుమ్మి తి
ఇప్పుడు కుమ్మి ఈపెడితే యాడ పాయ రా గుమ్మితీ.
వాయలపేట సంతలోన వానజన్మది గుమ్మి తీ
భలే వాగు తుంది గుమ్మి తి
ఇప్పుడు కుమ్మి ఆడ పెడితే ఏడ పాయిర గుమ్మితి” ఇట్ల పాడితే అందరూ నగేది ఇంకొక పాట

“బాకరాపేట అడవిలోన ఓ సాయిబు
బండి తోలుకొని ఒంటిగ బోతుంటే ఓ సాయిబు
పలుపు తోడుగా వద్దామనుకుంటే ఓ సాయిబు
ఇంట్లో బలే పోరు ఓ సాయిబు
నిన్ను ఇ డవ బుద్ధి లేదు ఓ సాయిబు
మరవ బుద్ధి లేదు ఓ సాయిబు
సాకిరేవు చౌవడమసాక్షిగా పాలించ బుద్ధి లేదు ఓ సాయిబు” ఇట్లాంటి. ఈ పాటలన్నీ ప్రేమికుల పాటలు పాడేది. అరేయి అంతా నాటకం కాన్నే పడుకుని తెల్లారి లేచి ఇళ్లకు పోయే వాళ్ళం. నాటకం లో జరిగిన ఉభ కథలు, పాటలు, నాలుగైదు రోజులు పనులు కాడ చెప్పుకోని నవ్వుకునే వాల్లము.

ఆ పొద్దున్నే” మల్లి , నేను” బోరునీళ్లకు పోతిమి. ఇంతలో సీత అత్త కూడా వచ్చా. ఐదారు మంది బోరుకాడ జమ అయితిమీ. సీత అత్త “నాకు వదలండి నీళ్లు, నేను బిరిన్న పోవల్ల. ఆవులుకు పొద్దు అవుతుంది”అనే. నేను “అదేమీ కుదరదు నువు అయ ఆపిసరేమీ.. అత్త నీ వంతు వచ్చినప్పుడు నువు పట్టుకొని పో అంటే మీమామ రామ అక్క కొడుకు శీనుగోనికి వైద్యంచేయను పోయినాడు. నేను ఒక్కదాన్నే ఉండేది. వదలండి” అనే. సీతత్త మొగుడు నాటు వైద్యం చేస్తాడు. ఆయప్ప చెయి గుణం మంచిదని, పనితనం ఉన్నోడే అని అందరూ చెప్పుకుంటారు. ఆ వైద్యం వాల్ల తాతల నాటిది. ఎక్కడెక్కడోళ్ళో వస్తా ఉంటారు. వీళ్ళ తాత వైద్యంలో ఇంకా పలాత్తుడు. ఆ య్యప్ప తో పనిబడి ఎవరైనా ఇంటికి పోతే ఇంటి కాడ ఎవరూ లేకుంటే తలుపులు,bదాల మందారాలు మాట్లాడతాయి అంట.! యాటి నుండి వచ్చినారు? ఏంపని అని అడగతాయి అంట! ఇట్లని అందరూ చెప్పుకునే వాళ్ళు. కానీ ఈ అప్పకి అంత లేదు. కొన్ని చిట్కాలు ఉన్నాయి. అగ్ని గుండం చుట్టూ మంతరించి కట్టు కడితే ఎవురు అగ్గిలో నడిచిన కాలదంట. జాతరలో బలి వేసేటప్పుడు ఆయ్యప్ప దగ్గర ఆమోదం తీసుకోవల్ల. లేదంటే ఆ కత్తితో ఎంత నరికిన పై తోలు కూడ తెగదు. దానికి కూడా మంత్రం వేస్తాడు. ఇట్లాంటి పేరువుంది. “శీనుగానికి ఒళ్ళు బాగలేదు అని మీ మామ ను తోడుకొని పోయినారు” అనే.. అత్త. సరే నీళ్లు కొట్టు కొని పో అని అందరం వదిలేస్తిమి. ఆయమ్మ ఎనకల మేము ఇండ్లకు పోతిమి.

ఆ మావిటాల, “మల్లీ “మా ఇంటి కాడికి వచ్చా. “ఏమే వచ్చింది” అంటి. మా అమ్మ చెప్పా సీత అత్త వాళ్ళ ఇంటి కాడికి పోయి ఉలవలు ఉంటే ఒక దోసెడు పెట్టించుకుని రమ్మనింది. మా నాయనకు పడిశం పట్టింది. ఉలవ రసం చేసుకుని తాగితే పడిశం మానుతుందంట. దావింటి కుక్కలు ఉంటాయి. వాళ్ళ ఇంటి కాడికి పోను భయం నాకు. తోడుగా రా పోదాము అంటే… సరే పద, పోదామని ఇద్దరం పోతిమీ.

సీత అత్త మా ఇద్దరి కళ్ళచూసి “ఏమి నాయనా ఇట్ల వస్తిరి” అని అడిగింది. “మళ్లీ మా అమ్మకి ఉలవలు కావాలంట దోసెడు పెట్టు. మా నాయనకి రసం కాయలంట” అని అడిగా. ఇంతలో మామ మందులు సంచి ముందర పెట్టుకొని మంత్రాలు, తంత్రాలు మూలికలు అన్ని కలబెడతా ఉండాడు. మాకళ్ళ చూసి “ఏమి కోడండ్లు ఇట్ల వచ్చినారు. కూర్చోండి. అన్నం తిందురూ ”అనీ మాట్లాడుతున్నట్లే, మల్లీ మామ అంచుకు పోయి, మామ “శీనుగోనికి ఎట్లుంది” అనే. ఏమి గుణము లేదు, అయినా అట్లాంటివి అన్నీ మీకెందుకు అనే. ఆ మామ,కానీ మల్లీ చెప్పు మామ, చెప్పు మామ అని కతి కిచ్చి అడగతా ఉంది. మామ అక్కడ, ఇక్కడ దిక్కులు చూసి “యాడ అనద్ధండి నేను వానికి వచ్చింది సూతకం జ్వరం. ఆ మాట నేను గుమ్మంగా రామ అక్కకు చెప్పిన, రామక్క నన్నే, నువు ఉండరా ఎత్తు తెలియని బిడ్డకు రంకు అంటగడతావ ఇట్ల అని దిక్కళ్ల ఊర్లో తెలిస్తే మా పరువు ఏమయ్యేది. మా ఓడు అట్లా ఓడు కాదు. నువ్వు యాడ అనద్దు నీ వైద్యం వద్దు. నువ్వు వద్దు పోరా అనింది. నా మాట వినలేదు. వాల్లు నా మాట విని కంట్లో కలికం వేయ లేదంటే గడిచేది కష్టం. దానిపైన వాల్ల ఇష్టం” అనే మామ.

“భద్రం. ఈ మాట యాడన్న నోరుజారేరు”అనే. సీతక్క దోసెడు ఉలవలు పెట్టే. అవి ఎత్తుకొని దావకు ఎలబారితిమి. ఎందుకో మళ్ళీ మొగాన కత్తి ఏస్తే రగతం లేదు. మళ్లీ కల్ల చూసి దావలో చెయ్యి పట్టి నిలఏసి వానికెవునికో బాగ లేదంటే నీకు ఏమి చింత. వాడు నువ్వు ఒక్కటైనారు కదా. వాని మీద నీకు మనసు ఉంది కదా నిజం చెప్పు , ముందే శీను గోడు వాల్లమ్మ, నాయనా నిన్ను ఇమ్మని అడిగినారు కదా అంటి. నేను ఆ మాటకు మల్లీ అవును మా అమ్మ నాయన ఉండు ఊర్లో నా బిడ్డని ఈయన బారెడు దూరంగానే ఉన్ని లే కష్టమో, సుఖమో మేము చూడము అదే దగ్గరుంటే సంతోషం ఐతే చూస్తాం బాధను చూడలేము. అందుకే మేము ఉండు ఊర్లో ఈయము, అని మొండికేసి నారు. కానీ నాకు వాడంటే ఇష్టమే అనే. మల్లీ, నీ వాలకం చూస్తుంటే ఏదో అయినట్టుంది చెప్పు అంటి.

“మే నేను, నువ్వు, పాన, పాన నేస్తం కదా. నీకో మాట చెప్పల్లా. నీ కడుపులోనే పెట్టుకోమే” అనే.. నేను పానం పోయినా చెప్పను చెప్పు అది ఏందో అంటే మళ్లీ నేను ఐదు దినాలకి ముందు అడివికి ఆవులు తోలుకొని పోయింటి కదా. ఆడ ముట్టు అయ్యుంటే సీత అత్త నన్ను గుమ్మడి కాయల గుండు కాడ కుసోమనింది. ఆ గుండు పెద్దది ఎవరు ఎక్కలేరు కదా. నీకు తెలుసు కదా. అందరూ ఉత్తరం పక్క గొడ్లు వంగేస్తా ఉంటే గుండు నీడ తూర్పున ఉందని నేను నీడ పక్కకు పోయి కుసున్నా. ఆడ అడివి కప్పరిల్లు ఉందని ఆ కప్పరిళ్లు కోసం వచ్చి నాడు శీనుగాడు. నాకు వాడంటే ఇట్టమే. కానీ మా అమ్మ, నాయన కచ్చితంగా చెప్పినారు “వాన్ని చేసుకోకూడదు, వాన్ని చేసుకున్నావు అంటే మేము చచ్చిపోతాము” అని నన్ను బెదిరించారు. అది కాక మాకు ఒంటిగా కలుసుకునే అవకాశం దొరకలా . ఆపొద్దు అనుకోకుండా అడవిలో కలిసినాము. మల్ల అట్లా అవకాశం దొరుకుతుందో లేదో అని ముందు వాడే బలవంతం చేసినాడు. సరేలే ముట్లులో కలిస్తే ముట్టు నిలదు అనుకుంటిమి. ఇంత జరుగుతుంది అనుకోల. ఎట్ల మే చేసేది అనే. ఆపొద్దు వాడు ఎవరి కంట్లో పడకుండా జారుకున్నాడు. నేను ఎవరన్నా చూస్తారేమో అని భయపడి కాళ్లు చేతులు వనకత ఉంటే సీత అత్త నన్ను చూసి ”ఏమే! ఏమైంది? ఎందుకట్లా అయిపోయావు?” అని అడిగింది. “బండ మీద కాలు జారి పడి దొర్లుకుంటూ వచ్చినాను” అంటి. “బయట జేరిన ప్పుడు పోలిమి మీద పడకూడదు. మంచిది కాదు” అనే. ఆ భయంతోనే నేను ఆ మూడు దినాలు ఇంట్లో నుండి బయట కూడా రాలా. వానికి అందుకేనేమో సూతకం జ్వరం వచ్చింది. “కలికము ఎయ్యకపోతే చచ్చిపోతాడు ఏమో” అనే. ఆయమ్మీ మాటలు వింటా నే నాకు ఒక్కసారిగా తలకాయి పని చేయల. మే పెద్దోల్లను రేపు అ డగదాం. ఈ పొద్దు, పొద్దు గుంకి పోయింది. పోదాం పద అని ఆ రేత్రీ మా ఇద్దరికి ముండ్ల మింద పడుకున్నట్లు ఉంది. ఆ తెల్లారి ఇద్దరం ఇంట్లో పనులన్నీ చేసి మూడో మనిషి చూడని తావకి వచ్చి ఏంమె చేసేది. మే నేను శీను గాన్ని చాటుగా పోయి చూసి వచ్చినా. తలకాయ బరువు, కండ్లు మంటలు, తలకాయ నొప్పి, జ్వరంతో అరిసి అబ్బరిస్తా ఉన్నాడు అంటి.

నేను పోయి “సీత అత్త మొగునికి జరిగిందంతా చెప్పేద్దామా”అంటి. మల్లి “మే.. చెప్పినావంటే, అది ఎట్ల పోయి ఎట్ల వస్తుందో, నిన్ను చంపేస్తారు. అదేమన్నా చిన్నా చితక పనియ. ఊర్లో అందరూ నీ మీద గుస గుస చెప్పుకుంటారు. రేపు పెండ్లి అవుతుందా! గమ్మునుండు” అంటే, ఎట్ల మే చేసేది అని ఆలోచిస్తా ఉంటే, నేను “నాగవ్వను అడగదాం పద మే” అంటి. మా ఊర్లో అందర కాటికి ముసల్ది నాగవ్వ. ఆ అవ్వ ఇంటి ముందర కూసోని, వక్క రోల్లో వక్క ఆకు ఏసీ దంచుతా ఉంది. “ఏం చేస్తా ఉండావు అవ్వ” అని;పోయి చెరో పక్కన కూసుంటిమి. “ఏం తీరుబాటుగా ఉండారే. పనికి, పాటకు పోలేదా?” అనే అవ్వ. ఈ పొద్దు బిడువగానే ఉండాము. అవ్వను అడిగినా ము సూతకం జ్వరం అంటే ఏందవ్వ ? అది వస్తే ఏం చేయాలా? అంటే. ”అయినా అట్లాటి వాడితో మికేం పని యాల అడగతా ఉన్నారు” అనే. ”ఊరికే తెలుసుకుందామని చెప్పు అవ్వ” అని అడిగితిమి. “అవున్లే మీ అట్లా వయసులో వాళ్లు తెలుసుకోండి, మొన్న మా సావిత్రమ్మ కొడుకు కొత్తగా పెళ్లి అయితే వాళ్ల పెళ్ళాం బయట జేరితే తాపత్రం పట్లేక కలిసి నాడంట. వాని పెళ్ళానికి సూతకం జ్వరం వచ్చింది. బయట చేరిన ఆడదాన్ని కలిస్తే కొంతమందికి వంటక, కామ సూతకం జన్ని, జ్వరం వస్తుంది. మల్ల దాని మొగినికి తొడ చింపి ఆ రగతం, నల్లి రగతం, రెండు ఒట్టి మిరపకాయలు కొన గిల్లేసి ఈ రెండిటి రక్తం, ఒక్కొక్క బొట్టు వేసి, కంట్లో కాటుక పెట్టి నట్లు పెడతారూ. అప్పుడు నోట్లో, కళ్ళల్లో సోన కారిపోయి అప్పుడు ఆ నొప్పులు తగ్గుతాయి”అనే. అవ్వ, సరే అవ్వ పని ఉంది అని ఇద్దరం జారుకుంటిమి.

నాగ అవ్వకే చెప్పదామా, ఆ అవ్వ అయితే బయట ఏయదు. ఆడ ఆడ చెప్పుకుంటుంటే విన్నాము. ఆ అవ్వ వంతలు చేయడంలో ఆడ మగను మల్లేయడంలో, ఆ యమ్మ పేరు మోసింది. ఆ యవ్వ ఒంటరిగా ఉండేది చూసి పోతిమి. మమ్మల్ని చూస్తూనే “ఏమండే మళ్ళా వచ్చినారు”అనే. “అవ్వా నీతో ఒక మాట చెప్పల్ల. నీ మీదనే బారం” అని జరిగింది చెప్పితిమి. “ఎంత పని చేసుకున్నారే” అని ఆ నా బట్టను మన ఊరు చెరువు కాడికి రమ్మంటా. మీరిద్దరూ ఎవరికీ తెలియకుండా ఆడికి వచ్చేయండి. వచ్చేటప్పుడు నల్లులు రెండు పట్టుకొని పల్చని గుడ్డలో వేసుకొని రండి” అనే. మల్లీ ”మా ఇంట్లో నల్లులు లేవు” అనే. “మేము కూడా మొన్న పండక్కు ఇల్లంతా సున్నము తోపుసేసినాము. ఇంకా ఎవరి ఇంట్లో ఉండాయి, ఎట్ల చేసేది” అనే. నిన్న సీత అత్త వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ గోళ్ళు చూసినా.. గోళ్ళ నిండా రక్తము గీతలే నల్లులు రేయి కరిచేది ఎక్కువ. వాళ్ళింటికి పోయి రెండు పట్టుకొని వద్దామా అంటి. వాళ్లు ఎందుకు అని అడిగితే ఒక పని చేద్దాం. నువు ఆ అత్తతో మాట్లాడతా ఉండు. నేను చిన్నగా పట్టుకుంటా అని ఇద్దరం మాట్లాడుకొని పోతిమి. సీతత్త పొయ్యి కాడ సంగటి గెలకతా ఉంది. ఆయత్త మజ్జిగ చిలికి నెయ్యి గాంచి అమ్ముతుంది. మమ్మల్ని చూసి ఏమి వచ్చింది అని అడిగా. నేను ఉండు కోని అత్త మా నాయనకు పిప్పి పళ్ళు అయింది అంట, పొల్లు ఊదిచ్చుకోవళ్ళంటా, వెన్న పాస ఉంటే కొంచెం ఇయి అని అడిగితే కాంచేడు ఉండండి ఇస్తాను అనే. ఏం దత్త మీ ఇంట్లో గోళ్ళకి రక్తం రాకినారు అంటే.. “నల్లులు ఎక్కువ ఉండాయి. అవిటి బాద చెప్పను అలివి కాదు. ఎట్ల చెప్పేది! రేయి దీపం ఆపేస్తే నిద్ర ఉండదు. రాక్షసులు వచ్చి మా రక్తం తాగినట్లు తాగతా ఉండాయి. రేయి అంతా వూస పుల్లలు ఎత్తుకొని బొక్కలు లోడి చంపుకుంటా కుసో వలసిందే. నిద్ర ఉండదు” అని బాధ పడే అత్త ఆడికి ఎన్నెన్నో చేసినాము. పోలేదు. మా రగతమంతా అవిటి కెసరి పోతా ఉంది అని, ఇంద ఎన్న పాస ఎత్తుకొని పోండి” అనే. మేము ఆ యమ్మతో మాట్లాడతా ఉన్నట్లే గోడ గిల్లి రెండు నల్లులు పట్టుకొని వచ్చేస్తిమి. ఆ యమ్మ ఇచ్చిన వెన్నపాస దావలో చెరు కొంచెం నాకేస్తిమి. మేము ఇంట్లో ఇద్దరం కొడివిలి, టవాల్లు ఎత్తుకొని బయలుదేరుతుoటే మా అమ్మ ఎక్కడికి అని అడిగే. కట్టెలకు మల్లి, నేను ఇద్దరం ఇక్కడే దగిరి దాపులకే అని చెప్పి వస్తిమి. నాగవ్వ, శీనుగాడు మాను కింద కూసోని ఉండారు. అవ్వ మందాకు, ఇవన్నీ ఏసీ నల్ల గాజు ఒప్పుతో నా తొడ కొంచెం చింపి, నల్లిని చంపి రక్తం, అన్నీ యేసి వానికి కంట్లో కాటుక లాగా కలికం పెట్టా. ఆ మంటకు వానికి కండ్లల్లో, నోట్లో సోన కారిపోయే. జుట్టు బట్టి పైకి లేపినట్లు తేరుకోని ఇంటికి పాయ. మల్లీ తొడ కి మందు ఆకు, వేసి కట్టు కట్టే. మల్లీ వాళ్ల ఇంట్లో కాలు ఎగరేసి నడుస్తా ఉంటే వాళ్ళమ్మకు, కట్లుకు, పోయిoటే కట్టి తగిలింది అని చెప్పిందంట. మల్ల ఏడు నెల్లకి మల్లికి పెళ్లి అయ్యా. మళ్లీకయినా ఆరు నెలలకి నాకు పెళ్లి అయ్యింది. పండగలకు, పబ్బాలకు పుట్టిన ఇండ్లకు వచ్చినప్పుడు మళ్ళీ నేను కలుసుకునేవాళ్ళం. మంచి చెడ్డ మాట్లాడుకుంటూ ఒకసారి నాతో చెప్పింది మల్లీ. “నా మొగుడు ఒగ నాడు తొడ మీద కనాన్ని చూసి, ఆ కనము ఏంది” అని అడిగినాడు. “పెద్దలు అంటానే ఉంటారు కదా గాయం మానిన కనము మానదని. దానికి నేను మేము ఆవులు మేపను పోతా ఉంటే అప్పుడు మాయవ్వ చెప్పేది ఒంలు మీద యాడ అన్న కానీ పచ్చబొట్టు, కానీ, పసల గీత కాని ఉండల్లా. లేదంటే దేవుడు కాళ్లు, చేతులు సంగటి కట్లుకు నరక్క పోతాడంట” అని చెప్పింది. అందుకే మేము పిల్లోలప్పుడు ఆవులు కాడ, ఆవులు మేపిన్నట్లు గుర్తు ఉండాలని గాజు ఒప్పులతో కనికి రాళ్లతో పసల గీత గీసుకున్నాము. అది ఆ పసల గీత అని చెప్పిన” అనింది. నిజమే మా ఊరిలో ఆడా, మగా ఆవులు, గొర్రెలు మేపే టప్పుడు చిన్నప్పుడు చేసిండే పనులన్నీ సంతోషాలు, బాధలు, ఆటలు, పాటలు అన్ని గుర్తు పెట్టుకునే దానికోసం పసల గీతలు గీసుకుంటారు. ఆ గుర్తు చూసినప్పుడల్లా చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తొస్తాయి. పుండు మానినా గాయం మానలేదు.

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర  బురుజు మాదిగపల్లె. కథా రచయిత్రి. వ్యవసాయ కూలీ కుటుంబం. ప్రధాన వృత్తి వ్యవసాయం. రచనలు వీరి వ్యావృత్తి. ముప్పై కథలతో 'ఎదారి బతుకులు' కథా సంపుటి ప్రచురించారు. ఇప్పటివరకు అరవై కథలు రాశారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 'నవోదయం' మాస పత్రిక నిర్వహిస్తున్నారు.

Leave a Reply