పల్లేరు కాయలు

అనుకున్నదొక్కటి
అయ్యిందొక్కటి
శాసనకర్తలై
స్వజనుల శ్వాసకు
కావలుంటరనుకొంటే
పుట్టకొకడు
చెట్టుకొకడు
చీలి
నడిచే కాళ్ళ నడుమ
కట్టేలేస్తున్నరు
నోరుండి మాట్లాడలేని
కాళ్ళుండి కదలలేని
కట్టు బానిసలైనరు
నాలుగు అక్షరాలు
నేర్చినంక
చీకటి దారుల్లో
చుక్కల మధ్యన ఎలిగే
సందమామలైతరనుకొంటే
ఉన్నత పదవులు కొట్టి
ఉదరపోషణ కొరకు
ఊడిగం చేస్తున్నరు
అధికారులై
చట్టాల సాముగరిడీలు నేర్చి
సాటివాని కడుపులో
కుతకుత ఉడికే ఎసరుకు
సాయపడతరనుకొంటే
అయ్యా! యస్ అనీ
పిల్లాది మారి
అదే పని చేస్తూ
బంజారాహిల్స్ లో
ఇంద్రభవనాల్లో
వందిమాగదుల
బృందగీతాల్లో
పుట్టగొడుగులకు
పురుడు పోస్తున్నరు
పులిసిన ఆలోచనలకు
పుటం వేస్తున్నరు
కాస్తో కూస్తో
కాలిదూళికి
కనులు తెరవడం నేర్పి
నడకను సడుకు మీదికి
తెస్తారనుకొన్న సందె వెలుగులు
ప్రాజెక్టుల పాచి బువ్వకు ఆశపడి
పాదదాసులైనరు
అయ్యగారి మీద ఈగవాలినా
రోకలితోని కొట్టి
గోడకట్టిన గోగుపువ్వు
కొలువు కూటమిలో కొత్వాల్ అయినంక
కొలువుల కొలిమిమీద
చలినీళ్ళు చల్లిండు.
అక్షరాల ఆయుధాల తోని
పీనుగులను పితలను చేసి
పిలిసినా పిలువకున్నా పోయే
పిత్తులంగడి చేసిండ్రు
కొత్త శ్వాస పురుడు పోసుకోకుండా
పాడే కట్టి, పల్లకిని మోసిండ్రు.
పల్లెను అల్లుకొన్న తీగెరాగం
పట్నం రుచి మరిగినంక
కురుమూర్తి కొంగు బంగారమంటుంది.
సాధు జంగములకు సాగిలబడి మొక్కుతుంది
అధికారాన్ని, ఆయుధాన్ని వెంట పెట్టుకొని
నడిసొచ్చిన దారిల పల్లేరు కాయలను అలుకుతుంది.

కరీంనగర్ పట్టణంలో నివాసం. చేనేత జౌళి శాఖ లో ఉప సంచాలకులు గా పని చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. హైదరాబాద్ విశ్వ విద్యాలయం నుండి MA; MPhil. చెరబండరాజు నవల మీద MPhil, కట్టెపలక కవిత సంపుటి వెలువడింది. సాహిత్యం అధ్యయనం, కవిత్వం, వ్యాస రచనా, సాహిత్యంలో సమాజం అభిమాన విషయాలు.

Leave a Reply