పర్యావరణ సంక్షోభ కాలంలో మార్క్స్ జీవావరణ ఆలోచనలు

పర్యావరణ సంక్షోభ తీవ్రత పెరుగుతున్న కొద్దీ కొత్త సాంకేతిక విజ్ణానం, కొత్త సామాజిక సిద్ధాంతాలు ఆవిష్కరింపబడుతున్నాయి. అంతేకాదు అనేక సామాజిక, రాజకీయార్థిక సిద్ధాంతాలను  విమర్శనాత్మక  దృష్టితో పునఃపరిశీలన చేస్తున్నారు.  మార్క్స్ ను కూడా ప్రకృతి విధ్వంసం, పర్యావరణ మార్పు కోణం నుండి చూడడం దాదాపు నాలుగు దశాబ్దాల క్రిందటే మొదలయ్యింది. 

ఈ సందర్భంలో మార్క్స్ మీద, సాంప్రదాయ మార్క్సిస్టుల మీద కొన్ని తీవ్రమైన విమర్శలు   ఇటు  మార్క్సిస్టు క్యాంపు నుండి అటు  బయటి నుండి వచ్చాయి. అందులో ప్రధానంగా (1) మార్క్స్ తన సిద్ధాంతాన్ని కేవలం మనిషి కేంద్రంగా (anthropocentric view) నిర్మాణం చేశాడు. సంపద సృష్టింపబడటంలో, పోగెయ్యబడటంలో కేవలం మానవ శ్రమ శక్తి విలువనే పరిగణలోకి తీసుకున్నాడు కాని, ప్రకృతి విలువను, ఇతర జంతువుల పాత్రను లెక్కలోకి తీసు కోలేదు.  (2) ఆయన మనిషి తన శ్రమతో, పరిజ్ఞానంతో ప్రకృతిని తన అవసరాలకు అనుకూలంగా మార్చుకోగలడు అని భావించాడు (technological deterministic view). ఉత్పత్తి శక్తుల పురోగాభివృద్ధితో ప్రకృతిని జయించవచ్చు, ప్రగతికి బాటలు వేయవచ్చు, సమాజంలో చీకటిని పారదోలవచ్చు (promethean view) అని అనుకున్నాడు. ఆ అతివిశ్వాసంతోనే ప్రకృతి ఆధారిత ఉత్పత్తి పరిస్థితులు  (conditions of production = nature) తెబ్బతింటే అవి  ఏ విధంగా పెట్టుబడి అభివృద్దికి, మొత్తంగా మానవ పురోగాభివృద్దికి ఆటంకంగా మారుతావో (nature’s limits) ఆలోచన చేయలేదు. చేసినా లోతుల్లోకి పోయి వివరించలేదు. కాబట్టి ప్రకృతి విద్వంసం, పర్యావరణ సమస్యలకు మార్క్స్ దగ్గర సమాధానం లేదు. ఇది ప్రధానమైన విమర్శ . 

ఈ విమర్శకు   అనేక స్పందనలు వచ్చాయి. ఈ కాలంలో రాబోయే సమస్యలన్నింటిని ముందే ఊహించి వాటికి సమాధానాలు ఎందుకు చెప్పలేదు అనేది ఆయన ఇప్పటి వరకు ఎందుకు బతకలేదు అని అడిగినట్లే అవుతుందని ఎలాంటి చర్చ చెయ్యకుండానే ఆయన మీది విమర్శను కొందరు కొట్టిపారేశారు.  మరికొందరు  ఆ విమర్శను   సవాలుగా తీసుకొని    మార్క్స్ ప్రచురిత రచనలను, ప్రచురింపబడని అనేక రచనలను ప్రకృతి దృష్టితో పరిశోధించి అతను జీవావరణం గురించి ఏమి నేర్చుకున్నాడు, తన ఆలోచనలను ఎలా నోట్స్ గా రాసుకున్నాడు, అందులోని సారాన్ని తన రచనలలోకి ఎలా తీసుకొచ్చాడు, అవి ఈనాటి పర్యావరణ సమస్యలను అర్థం చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతాయి, సోషలిస్టు సమాజంలో  మనిషి-ప్రకృతి సంబంధాలు ఎలా ఉండాలని అనుకున్నాడు అనే అనేక విషయాల మీద పెద్ద చర్చ ప్రధానంగా అకడమిక్ రంగంలో చేస్తున్నారు.  ఈ చర్చలను నడపడంలో మంత్లీ రివ్యూ పత్రిక, దాని ఎడిటర్ జాన్ బెల్లమీ ఫాస్టర్; జేంస్ ఓ కన్నర్ స్థాపించిన క్యాపిటలిజం, నేచర్, సోషలిజం పత్రిక ప్రముఖ పాత్ర పోషిస్తునాయి. దాని ప్రభావంతోనే (ముఖ్యంగా పాశ్చాత్య సమాజాలలో) ఎరుపు-ఆకుపచ్చ రాజకీయాలు (Red-Green politics) ముందుకొచ్చాయి.

ఇదంతా మార్క్స్ మీద మచ్చ తొలిగించడం కోసం ఆయనకు ఆకుపచ్చ రంగు పులుమడం కాదు. కేవలం మూఢభక్తితో మార్క్స్ ను సమర్ధించడానికో, కొత్త సమస్యల కాలంలో మార్క్స్ ను మళ్ళీ మళ్ళీ  బతికించుకోవడానికో చేస్తున్న ప్రయత్నం అంతకన్నా  కాదు. నిజాయితీగా, హేతుబద్దంగా మార్క్స్ ను తిరిగి చదువుకొని   అతను పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ విధంగా శ్రామికులకే కాదు, ప్రకృతికి కూడా హానికరమయ్యిందో అనే విషయాన్ని ఎలా వివరించాడో తెలుసుకునే ప్రయత్నం. అంతేకాదు బూర్జువా, ఉదారవాద సిద్ధాంతవేత్తలు పెట్టుబడిదారీ సమస్యలకు పెట్టుబడిదారీ సాంకేతిక (technocratic), మార్కెట్ సంబంధింత పరిష్కారాలనే చూపిస్తున్న సందర్భంలో  ప్రకృతి విధ్వంస సమస్యకు మార్చాల్సింది టెక్నాలజీ కాదు వ్యవస్థను అనే సృహను కలిపించింది కూడ మార్క్సిస్ట్ పర్యావరణ రాజకీయాలే. 

అయితే ముందుగా స్పష్టం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమంటే రెడ్-గ్రీన్ రాజకీయాలు అనగానే ఇది మార్స్కిస్టుల్లో మరో చీలిక వర్గంగానో, వర్గ రాజకీయాలను పక్కదారిపట్టే ప్రయత్నంగానో చూడకూడదు. ఇది కేవలం వర్గ దృష్టితో పర్యావరణాన్ని, అది విధ్వంసం అవుతున్న తీరును, దానిని ఆపడం/ఎదిరించడం కోసం చేయవల్సిన పోరాటాల గురించి చెప్పే ఒక జ్ణానసిద్ధాతం, ఆచరణా మార్గం. ఇది కచ్చితంగా విశాల వర్గపోరాటంలో భాగమే అవుతుంది ఎందుకంటే రెడ్-గ్రీన్ రాజకీయాలు ఎదురించేది పెట్టుబడిదారి వర్గాన్ని, ఆకాక్షించేది సోషలిస్ట్ సమాజాన్ని. అయితే ఆ రాజకీయాలు ఆయా స్థల కాలాలకు అనుకూలంగా వివిధ పోరాట రూపాలను, ఎత్తుగడలను అవలంభిస్తున్నాయి. 

ఈ సందర్భంగా మార్క్స్ జీవావరణ ఆలోచనలను సంక్షిప్తంగా నైనా పరిశీలిద్దాం. ఈనాడు అనేక  రూపాలాలో బయటపడుతున్న పర్యావరణ సమస్యలకు ఆనాడే  మార్క్స్ సమాధానాలు రాసి పోలేదు, కాని ఈ సమస్యలకు మూలమైన పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ఏ విధంగా ప్రకృతిని, మనిషిని ద్వంసం చేస్తుందో చాలా స్పష్టంగా చెప్పాడు. పెట్టుబడిదారీ వ్యవసాయం గురించి విశ్లేషిస్తూ పెట్టుబడిదారుడు కేవలం శ్రామికున్నే కాదు, నేలను కూడా దొంగతనం చేస్తాడు. పెట్టుబడిదారీ వ్యవస్తలో వ్యవసాయంలో కనబడే ప్రగతి అంతా నేల సారాన్ని దోచే ప్రగతే. పెట్టుబడిదారి ఉత్పత్తి విధానంలో టెక్నాలజీ, ఇతర ప్రక్రియలతో సంపద సృష్టికి మూలమైన మనిషి (శ్రామికుడు), మట్టి (ప్రకృతి) ధ్వంసం కాబడుతాయి అని మార్క్స్ “పెట్టుబడి”లో స్పష్టం చేశాడు.  (Marx, 1976. Capital Vol.1, Penguin publishers, p.637-638). శ్రామికున్ని దొంగతనం చెయ్యడం అనేది అతని/ఆమె శ్రమను పెట్టుబడిదారుడు ఏ విధంగా దోపిడీ చేస్తాడో చెప్పే ప్రక్రియకు సంబంధించింది. ఇక భూమిని దొంగతనం చెయ్యడమంటే అధిక ఉత్పత్తి కోసం భూమి సారానంతా పంట రూపంలో తీసుకొని తిరిగి ఆ భూమికి కావాల్సిన పోషకాలను (నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం) ఇవ్వకుండ ప్రకృతి జీవక్రియలో బీటలు బారేటట్లు (metabolic rift) పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం చేస్తుంది. ఈ విషయాన్ని మార్క్స్ చాలా వివరంగా పెట్టుబడి మూడో వాల్యూంలో “The Genesis of Capitalist Ground Rent” చాప్టర్ లో స్పష్టం చేశాడు. 

జీవక్రియ బీటలు బారడటం లేదా విభజన అంటే ఏమిటి? జీవక్రియ అనే భావనను మొదటగా ప్రవేశపెట్టింది జర్మన్ రసాయన, వ్యవసాయ శాస్త్రవేత్త జస్టస్ వాన్ లైబిగ్. తాను 1842లో ప్రచురించిన “Organic Chemistry and its Applications to Physiology and Pathology” అనే ప్రసిద్ద గ్రంధంలో జీవక్రియ అనేది ఒక జీవసంబంధమైన భావన, అది ఒక జీవి మనుగడకు కావాల్సిన పదార్థాలు (materials), శక్తి  (energy) ఏవిధంగా నిరంతర చలన పక్రియలో వుంటాయో అనే విషయాన్ని చెబుతుందని వివరించాడు.  తనకు కావాల్సిన పదార్థాలను, శక్తిని ఏ జీవైనా ఏ విధంగా తన పర్యావరణం నుండి పొందుతుందో, తిరిగి వాటిని మరో రూపంలో (వ్యర్ధంగా) ఎలా పర్యావరణంలో భాగం చేస్తుందో అనే విషయాన్ని  వివరించాడు లైబిగ్.  ఈ పక్రియ నిరంతరంగా ఒక చక్రీయ పద్దతిలో (cyclical process) జరుగుతుంది. ఒకవేళ ఆ చక్రీయ పక్రియకు ఎక్కడైనా ఆటంకం జరిగితే అది పూడ్చలేని అగాధంగా మారుతుంది.

మెటాబలిక్ రిఫ్ట్ కు సంబంధించిన శాస్త్రీయతను చాలా జాగ్రత్తగా చదువుకున్న మార్క్స్ జీవిక్రియ సూత్రాలను పెట్టుబడిదారీ వ్యవసాయానికి అన్వయించాడు. పెట్టుబడిదారీ వ్యవసాయదారుడు నేల శక్తిని (అంటే భూమిలోని పోషకాలను) ఒకవైపు, శ్రామికుడి శ్రమశక్తిని మరొకవైపు కొల్లగొట్టి పంటలు పండించి ఆ పంటను పట్టణాలకు తరలించి లాభాలు పొందుతాడు. ఆ పంటల వినిమయం ద్వారా పట్టణాలలో పోగయ్యే వ్యర్థం ఏ రకంగా కూడా గ్రామాలలోని పంట భూములకు చేరవు. అంటే పంట భూమిని విడిచి పోయిన పదార్థాలు, శక్తి మరలా ఏ రూపంలో కూడా వెనకకు వచ్చి ఆ భూమి సత్తువను పెంచే పని చేయడం లేదు. ఈ విధంగా భూసారాన్ని ఎత్తుకుపోవడాన్ని మార్క్స్ “ప్రకృతి దొంగతనం”గా భావించాడు. ప్రకృతి దొంగల (పెట్టుబడిదారుల ) మూలంగా పరిమితంగా వుండే భూసారం తరిగిపోయి ఆ నేలలోని జీవక్రియ బీటలు బారుతుంది. జీవక్రియ బీటలు బారడం అనే పక్రియ కేవలం పంట భూమికే పరిమితం కాలేదు.

మార్క్స్ జీవక్రియను పదార్థాల ప్రసరణా (circulation of matter) వ్యవస్థగా అర్థం చేసుకున్నాడు కాబట్టే ఆ పదార్థాలు చక్రీయ దిశలో ప్రయాణం చేయకపోతే ఆ జీవక్రియలో ఉండే సహజీవన సంబంధాలు (symbiotic relationships) దెబ్బతిని ఆ వ్యవస్థ  ఎక్కువ కాలం కొనసాగదు అనే నిర్థారణకు వచ్చాడు. అది పంట భూముల్లో అయినా, మరెక్కడైనా. జీవక్రియలో బీటలు పడే సూత్రాన్ని మార్క్స్ మెటఫారికల్ గా ఉపయోగించి ఉత్పత్తి సాధనాలకు, ప్రాధమిక ఉత్పత్తిదారుడుకి ఉండే సంబంధాలను; గ్రామానికి పట్టణానికి వుండే సంబంధాలను; సమాజానికి, ప్రకృతికి మధ్య ఉండే సంబంధాలను; వలస దేశాలకు, వలసపాలక దేశాలకు ఉండే సంబంధాలను వివరిస్తూ అవి పెట్టుబడిదారీ వ్యవస్థలో ఏ విధంగా కోలుకోలేని విభజనకు (irreparable rift) దారితీస్తుందో వివరిస్తాడు. దీని కోసం బ్రిటిష్ వ్యవసాయంలో ఏర్పడిన భూసార సంక్షోభాన్ని ఉదాహరణగా తీసుకొని అది ఏవిధంగా పెట్టుబడి అభివృద్ధితో ముడిపడి వుందో స్పష్టం చేస్తాడు.

పెట్టుబడిదారీ వ్యవస్థలో హేతుబద్దమైన వ్యవసాయం (rational agricultur) అనేది అసాధ్యమయినది, ఎందుకంటే పెట్టుబడిదారుడు తన అత్యాశతో ప్రకృతిని ఎప్పుడు ఒక ఉచిత బహుమతిగా చూస్తూ దానిని పూర్తిగా  కొల్లగొట్టడానికే ప్రయత్నిస్తుంటాడు అని చెప్పాడు. ప్రకృతి పరిమితుల మూలంగా పెట్టుబడి విస్తరణకు   ఇబ్భందులు ఏర్పడినప్పుడు పెట్టుబడిదారుడు దానిని ఒక పెద్ద ఆటంకంగానే భావించి ఆ సమస్య నుండి బయట పడటానికి ఉత్పత్తి శక్తుల (టెక్నాలజీ) అభివృద్ధిపై తన దృష్టి సారిస్తాడే తప్ప దానితో రాజీ పడడానికో, దానిని పునరుద్ధరించడానికో ప్రయత్నం చెయ్యడు. అందుకే ఉత్పత్తి శక్తులను నిరంతరం అభివృద్ది చెయ్యకపోతే పెట్టిబడిదారీ వ్యవస్థ మనుగడ సాగించలేదని మార్క్స్, ఏంగిల్స్ “కమ్యూనిష్టు ప్రణాళిక”లోనే ప్రకటించారు.

మార్క్స్ “దొంగ వ్యవస్థ” (robbery system) అనే మాటను లైబిగ్ ఇంగ్లిష్ వ్యవసాయం గురించి వివరిస్తూ వాడిన మాట నుండి తీసుకున్నాడు. అయితే లైబిగ్ వివరణ కేవలం ప్రకృతి శాస్త్ర సూత్రాల వరకే పరిమితమయితే మార్క్స్ తన చారిత్రక భౌతికవాద సిద్ధాంతం ఆధారంగా  దాని పరిధిని విస్తరింప చేశాడు.  దోపిడీ/దొంగతనం మూలంగానే మనిషికి, ప్రకృతికి మధ్యవున్న సహజీవన సంబంధం దెబ్బతిని వాటి మధ్య విభజన పెరుగుతుందని,  పెట్టుబడిదారీ వ్యవస్థ మనిషిని ప్రకృతి నుండి విడదీస్తుందని, పరాయీకరణ చేస్తుందని చారిత్రకంగా వివరించాడు. 

పెట్టుబడిదారులు ప్రకృతిని ఎంతగా వాడుకుంటారు అనేది వాళ్ళ ఇష్టా అయిష్టాల మీద కాకుండా వాళ్ళు ఉత్పత్తి చేసిన సరుకులకు మార్కెట్ లో ఎలాంటి విలువ వుంటుంది అనే దాని మీద ఆధారపడి వుంటుంది. వాళ్ళకు ప్రకృతిని కొల్లగొట్టడం  లాభసాటి వ్యవహారంగా మారినప్పుడు వాళ్ళు ఇక దేని గురించీ (కాలుష్యం, వ్యర్థం, అడవుల నరికివేత, తగ్గిపోయే భూసారం, జీవవైవిధ్యం, ప్రజల అనారోగ్యం …) ఆలోచించరు. కేవలం లాభాలను తప్ప. ఈ క్రమంలో మార్క్స్ మానవ పురోగతి చరిత్రకు, ప్రకృతి మార్పు చరిత్రకు వుండే గతితార్కిక సంబంధాన్ని వివరిస్తూ వాటి మధ్య వుండే పరస్పర ప్రభావాన్ని సామాజిక ఉత్పత్తి సంబంధాల దృష్టి నుండి పరిశీలించాడు. 

ఇంగ్లాండ్ సమాజం భూస్వామ్యం నుండి పెట్టుబడిదారీ వ్యవస్థలోకి పరివర్తన చెందిన క్రమాన్ని అధ్యనం చేసిన మార్క్స్ ఆ మొత్తం ప్రక్రియలో జరిగిన ప్రధానమైన అంశాలను ఎలా వివరించాడనేది ఇప్పుడు మార్క్సిస్ట్ పర్యావరణవేత్తలు సమాజం-ప్రకృతి దృష్టి కోణం నుండి చూస్తున్నారు. వారి దృష్టిలో మార్క్స్ మొత్తం సమాజ మార్పులో నాలుగు అంశాలను  వివరించాడు. 1. ప్రకృతితో సహా ప్రతిదీ సరుకుగా మారిపోవడం. 2. సామూహిక ఆస్తి రద్దై దాని స్థానంలో వ్యక్తి ఆస్తి ఉనికిలోకి రావడం (ప్రైవేటీకరణ). 3. పరాయీకరణ సహజ పరిణామం కావడం. మనిషి మనిషి నుండి, మనిషి ప్రకృతి నుండి, ప్రకృతి ప్రకృతి నుండి పరాయీకరణ చెందడం. (ఇక్కడ మనిషి అంటే శ్రమ). 4. సామాజిక విభజన ద్వారా సమాజం నిటారుగా చీలిపోవడం. (ఉత్పత్తి సంబంధాల ఆధారంగా ప్రాధమిక ఉత్పత్తిదారులు/శ్రామికులు, పెట్టుబడిదారులుగా విడిపోవడం, సమాజం గ్రామాలుగా, పట్టణాలుగా విడిపోవడం.) అయితే వీటన్నింటిలో అంతస్సూత్రంగా జరిగే రెండు ప్రక్రియలు ఏమంటే, ఒకటి, వేరుచేయడం (rift), రెండు, లేకుండాచేయడం/కొల్లగొట్టడం  (dispossession). ఈ రెండు ప్రక్రియలు పెట్టుబడిదారీ వ్యవస్థ తొలినాళ్ళ నుండి ఇప్పటి వరకు నిరంతరాయంగా జరుగుతూనే వున్నాయి. ఈ రెండు ప్రక్రియలు జరగడానికి దోపిడీ వర్గాలు రాజ్య వ్యవస్థలోని అన్ని రంగాలను, అంగాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాయి. తమ దోపిడీకి సమ్మతి దొరకనప్పుడు “చట్టబద్ధంగా” బలాన్ని ప్రయోగిస్తున్నాయి.

మార్క్స్ ప్రకృతిని మనిషియొక్క జీవం లేని దేహంగా (“Nature is man’s inorganic body”) అభివర్ణిస్తాడు. దీనర్ధం మనిషి ప్రకృతిలో భాగం; ప్రకృతి మనిషిలో భాగం. ఆ మనిషి జీవంతో వుండాలంటే ప్రకృతితో నిరంతర జీవక్రియా సంబంధాన్ని కొనసాగించాలి. మనిషి మారుతున్న ప్రకృతికి అనుగుణంగా తన జీవన విధానాన్ని మార్చుకోవాలి. అంతేకాని సొంత లాభాల కోసం , పెట్టుబడి అభివృద్ధి కోసం జీవావరణ విధ్వంసం చేస్తూ కాదు. ఈ విషయాన్ని అర్థం చేయించడానికి మార్క్స్ మనిషిని ప్రకృతీకరించాడు (naturalization of human), ప్రకృతిని మానవీకరించాడు (humanization of nature). ఈ రెండిటిని భావవాదులు చెప్పే ఆధ్యాత్మిక మార్గంలో కాకుండా గతితార్కిక పద్దతిలో వివరిస్తాడు. మనిషి ప్రకృతిని మార్చే క్రమంలో తాను కూడా ఎలా మారుతాడో/మారుతుందో విశ్లేషిస్తాడు. 

మార్క్స్ తాను “జర్మన్ ఐడియాలజీ ” లో చెప్పినట్లు ఏ చరిత్రనైనా రెండు వైపుల నుండి చూడొచ్చు. ఒకవైపు మానవ చరిత్ర, రెండోవైపు ప్రకృతి చరిత్ర. ఈ రెండు ఒకదానికొకటి స్వతంత్రంగా వుండవు. రెండూ ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేసుకుంటూ సహ పరిణామం (coevolution) చెందుతాయి. అయితే మనిషి ప్రకృతి చలన సూత్రాలను అర్థం చేసుకోకుండా దానితో సంఘర్షిస్తే విపత్కర పరిస్థితులకే దారితీస్తాయి. అంతేకాదు సమాజ పరివర్తనకు కూడా ప్రకృతి అడ్డంకిగా మారుతుంది. అందుకోసమే ప్రకృతి మీద పూర్తి ప్రావీణ్యత (mastering nature) సాధించాలని మార్క్స్, ఏంగెల్స్ ప్రతిపాదించారు. (అయితే mastery అనే పదానికి తప్పుడు అర్థాలు తీసుకోని మార్క్స్ ప్రకృతిని లొంగదీసుకొని దాని మీద విజయం ప్రకటించమని అన్నాడనే వక్రభాష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది వేరే చర్చ.)   

ఈనాటి అన్ని పర్యావరణ సమస్యలకు మార్క్స్ సమాధానం చెప్పాడని అనడం కాని, చెప్పాలని కోరుకోవడం కూడా అతిశయోక్తే అవుతుంది. కాకపోతే మార్క్స్ తప్పనిసరిగా ఈ నాటి సమస్యలకు కారణభూతమైన అంశాలను ప్రస్తావించాడు. వాస్తవానికి  మన సమాజం ఎంతగా మారిందో అంతగా మారలేదు కూడా. మనిషిని, ప్రకృతిని పరాయీకరణ చెందించే వ్యవస్థ రూపాలు మారాయి కాని పరాయీకరణ కాకుండా వుండే పరిస్థితి లేదు. అన్నింటిని మించి “కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నట్లుగా” కేవలం కొన్ని సంపన్న దేశాల,  దోపిడీ వర్గాల  ప్రయోజనాల కోసం మొత్తం జీవావరణాన్ని ద్వంసం చేసి మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేసే పరిస్థితి వచ్చింది. మార్క్స్ చెప్పినట్లే అప్పుడైనా ఇప్పుడైనా ప్రకృతి సమస్య సారాంశంలో వర్గ సమస్యనే. కేవలం ప్రకృతి కోసమే పోరాటాలు చేయడం కుదురదు. “ప్రకృతి ప్రేమికులు” అలా ఎవరైనా చేసినా అది సంపూర్ణమైనది కాదు. వర్గ పోరాటాల ద్వారానే  మనిషి, ప్రకృతి విముక్తి సాధ్యమవుతుంది.

మార్క్స్ తరువాత ఎందరో మార్క్సిస్టులు పర్యావరణానికి సంబంధించిన తాత్విక ఆలోచనలను, ఆచరణలను ముందుకు తెచ్చారు. సోవియట్ యూనియన్ తన తొలినాళ్ళలో (1920, 30లలో) మనిషికి, ప్రకృత్తికి మధ్య సహజీవన సంబంధాన్ని వృద్ధి చేయాడానికి కావాల్సిన సామాజిక జీవక్రియ (social metabolism) నిర్మాణం కోసం చాలా పనులు చేసింది. కాని తర్వాత కాలంలో అది కూడా ఉత్పత్తి శక్తుల అభివృద్ధి, ఉత్పత్తి పెరుగుదల మీదే తన దృష్టిని కేంద్రీకరించింది. దీని మూలంగా మొత్తం మార్క్సిస్ట్ రాజకీయాలన్నీ ఉత్పాదకత (productivist) రాజకీయాలనే విమర్శ వచ్చింది.

ఆ విమర్శ నుండి పాఠాలు నేర్చుకొని సమసమాజాన్ని కోరుకునే ప్రతి ఒక్కరు ప్రకృతికి స్నేహ హస్తాన్ని అందించే మానవ సమాజాన్ని నిర్మాణం చెసే రాజకీయాల దిశగా అడుగులు వేయాల్సివుంది. సుస్థిరమైన మానవ అభివృద్ధి జరగాలంటే జీవావరణ సుస్థిరత్వానికి (ecological sustainability) అవకాశాలు ఇవ్వాలి. కానీ పెద్ద మొత్తంగా జీవావరణం సామ్రజ్యవాద, పెడ్డుబడిదారీ శక్తుల చేతుల్లో బందీ అయిపోయింది. 

ప్రకృతి చెరలో వుండగా మనిషి స్వేచ్ఛగా బతకడం కష్టం. కాని మనిషి పేదరికం, నిత్య శ్రమ దోపిడీ, పీడనలలో వుంటే ప్రకృతి విముక్తి ఆలోచనలు చేయడం కష్టం. కాబట్టి అంతిమంగా మనిషిని, ప్రకృతిని విముక్తి చేయగల వర్గపోరాటాలే మన ముందున్న ప్రధాన దారి. 

[ఈ వ్యాసం డివివియస్ వర్మ సంపాదకత్వంలో మార్క్స్ 139వ వర్ధంతి (మార్చ్ 14) సందర్భంగా ప్రచురించిన “కార్ల్ మార్క్స్ – మేగా 2, మనకు తెలియని మార్క్స్ రాతప్రతులు, రచనలు” (మార్చ్ 2022) పుస్తకంలో ప్రచురింపబడింది.]   

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

One thought on “పర్యావరణ సంక్షోభ కాలంలో మార్క్స్ జీవావరణ ఆలోచనలు

  1. వామపక్ష కార్యకర్తలకు, పర్యావరణ కార్యకర్తలకు కూడా మంచి అవగాహనను అందించే వ్యాసం… అశోక్ కు కృతజ్ఞతలు!

Leave a Reply