పరుగెత్తు, పరుగెత్తు

పరుగెత్తు, పరుగెత్తు
బ్రతుకు నుంచి పారిపోతావో
తప్పించుకోలేని చావు నుంచి పారిపోతావో
కాచుకున్న ఆకలిచావు నుంచి పారిపోతావో,
పొంచివున్న అనారోగ్య మరణం నుంచి పారిపోతావో
క్రిక్కిరిసిన జనసమ్మర్ధపు దారులలో పారిపోతావో,
ఎవరూ తోడురాని చీకటి సందులలో పగెత్తుతావో
మృత్యువు తచ్చాడే రహదారులలో భారంగా అడుగులు ఈడుస్తూ నడుస్తావో
ఎంతకీ కలవని రైలుపట్టాల మధ్య ఒంటరిగా సాగిపోతావో
పారిపో, పారిపో…

పరుగెత్తు, పరుగెత్తు
పొట్టకూటికోసం వదిలేసి వచ్చిన ఇంటివైపు వెళతావో
ప్రేమగా పిలిచే స్మశానాలలోకి పారిపోతావో
కుడి వైపుకో, ఎడమ వైపుకో
ఉత్తరం వైపో, దక్షిణం వైపో
రుజాగ్రస్త సూర్యోదయం ముంగిట సొమ్మసిల్లి కూలిపోతావో
గాయపడిన పాదాలతో నెత్తురు కక్కుకుంటున్న అస్తమయంలోకి మెల్లగా వెళ్ళిపోతావో
దాహంతో ఎండమావులవైపు నడుస్తావో
ఎన్నటికీ దొరకని భద్రతకోసం వెదుకుతూ సాగిపోతావో
ఏకాకిగా నీనీడతో నువ్వే మాట్లాడుతూ నడుస్తావో
నలుగురితో కలిసి మౌనంగా నడుస్తావో
పారిపో, పారిపో

పరుగెత్తు, పరుగెత్తు
నువ్వు సృష్టించిన, నిన్ను నిరాకరించిన నగరాల నుండి
నువ్వు నిర్మించిన, నిన్ను తిరస్కరించిన రాజధానులనుండి
నువ్వు మెరుగులు దిద్దిన, నిన్ను చీకటిలోకి తోసిన వెలుతురు లోకాలనుండి
నువ్వు నిలబెట్టిన, నిన్ను తరిమివేసిన ఆకాశ హర్మ్యాలనుండి
బ్రతుకునుంచి చావులోకి
చావు నుంచి చావులోకి
పారిపో, పారిపో

పరుగెత్తు, పరుగెత్తు
నావని మింగి, మృత్యుగుహలా నోరు తెరిచిన సముద్రం వైపు దిగులుగా చూస్తావో
తరలించేందుకు ఏ విమానమూ దిగిరాని ఆకాశం వైపు ఆశగా చూస్తావో
కర్కశత్వం విసిరిన లాఠీదెబ్బని తప్పించుకుంటావో
కరతాళధ్వనులు మారుమోగే భద్రలోకపు నిర్లక్ష్యాన్ని మోస్తావో
బాటసారి గొంతుతడిపిన మనుషుల మంచితనాన్ని సంచీలో నింపుకుంటావో
చేరగలనో లేదోనన్న బేలతనంతో దీనంగా సాగుతావో
ఎంతదూరమైనా నడుస్తాననే భరోసాతో సాగుతావో
పరుగెత్తు, పరుగెత్తు..

(30 మార్చి 2020)

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

4 thoughts on “పరుగెత్తు, పరుగెత్తు

  1. Very moving poem Kiran. We are running for known and unknown destiny. It is unbelievable to witness the determination and potential of people who has faith in their mind and body. well described. Thank you

  2. సుధా గారు నమస్తే. మీ కవిత చాలా బాగుంది. ధన్యవాదములు
    ఇ.రఘునందన్ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు(Ex SP College Student 1980-1983 Batch.)

  3. చాలా బాగుంది, కిరణ్!…. ఒక వైపే కొట్టుకు పోయేవారిని బ్యాలన్స్ చేస్తుంది….. ఈ కరోనా చీకటి ముగిసి తర్వాత కార్యశీలురకు అసలు కర్తవ్యం సూచిస్తున్నది!

Leave a Reply