“మేము చేసే పని మాత్రమే అశుభ్రం, కానీ మేము కాదు…!”

తెల్లవారి లేచేసరికి గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని మనుష్య సమాజం ఎంతో కొంత సజావుగా నడుస్తోందంటే దానివెనుక కనిపించకుండా నిరంతరం శ్రమించే కొన్ని శ్రామిక సమూహాలు వుంటాయి. ఆ సమూహాలు ప్రజా ఆరోగ్య రక్షణలో తమని తాము సమిధలుగా మార్చుకుని అత్యంత ముఖ్యమైన పని చేస్తున్నారు. అయినా గానీ, ఆ సమూహాలకి ఒక గౌరవ ప్రదమైన గుర్తింపు లేదు. సంక్షేమ పథకాలు, హక్కులు అల్లంత దూరంలో వుంటాయి. వారి వ్యక్తిగత ఉనికికి ఒక పేరు (అది ఏదైతేనేం!) వున్నాగానీ సంబోధన ఏనాడూ ఆ పేరుతో కాకుండా ‘అవమానకరంగానే’ వుంటుంది. వారి అవసరం సమాజానికి ప్రతిరోజూ వుంటుంది. వారు ఒక్కరోజు రాకపోయినా ఇళ్లు, వీధులూ కంపు గొడుతూ వుంటాయి. నగర నిర్వహణ లో వారి పని అత్యంత ముఖ్యం. అయినా గానీ ఆ పని చేసే మనుషులకు గౌరవం, వేతనం అత్యంత దయనీయం. ఆ మనుషులు చేసే పని కావాలి గానీ ఆ మనుషుల నీడ కూడా సహించలేని విధంగా వుంటాయి భద్రజీవుల ముఖారవిందాలు. వాళ్లు అడుగుపెడితే తమ కొంపలు కూలిపోతాయాయేమో అని గగ్గోలు పెడుతూ ఎంత అవమాన పర్చటానికైనా సిద్ధపడతారు. వారి పనికి ఇవ్వాల్సిన చిల్లర పైసలు (మీరు సరిగ్గానే చదివారు, అవి చిల్లర పైసలే!) చేతికి ఇవ్వటానికి కూడా ఇష్టపడని, అసలు వారి ఉనికిని మనుషులుగా కూడా గుర్తించని సమాజం ఇది. ప్రతిరోజూ కళ్ల ముందు కనిపిస్తున్నా గానీ ఉన్నత, మధ్య తరగతి ప్రజాల్లోనే కాదు ఆఖరికి దిగువ తరగతి ప్రజల ఆలోచనల్లోకి కూడా రాని ప్రజలు ఎవరైనా వున్నారు అంటే అది నిస్సందేహంగా సఫాయి/శుభ్రత పనిచేసే కార్మికులు అని చెప్పవచ్చు. నిచ్చెనమెట్ల కుల సమాజంలో అట్టడుగున వున్నఈ పనిచేసే వ్యక్తుల పట్ల మన సమాజానికి గౌరవం కానీ, కృతజ్ఞత కానీ వుండదు. రాజ్యాంగ హక్కులు కల్పించాల్సిన, అమలు చేయాల్సిన ప్రభుత్వ వ్యవస్థలు కూడా శ్రమ దోపిడీని నిర్బంధంగా అమలు చేయించాలని చూస్తాయి కానీ కనీస రక్షణలు కల్పించాల్సిన బాధ్యతను కూడా తీసుకోవు.

ప్రతిరోజూ తెల్లవారకముందే రోడ్ల మీదకు వచ్చి ఇంటింటికీ తిరిగి ఘనమైన కుటుంబాలన్నీ కలిపి ఏ మాత్రం స్పృహ, బాధ్యతా లేకుండా చేసే చెత్త నంతా ఏ రకమైన రక్షణా లేకుండా తీసి, దూరంగా మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లకు వాహనాల్లో తీసుకువెళ్ళేది ఈ కార్మికులే! నిజానికి వారు ప్రతి రోజూ పిల్లలు, పెద్దల మాలమూత్రాలతో దుర్వాసనతో వుండే డైపర్ వ్యర్థాలను, పాడైపోయి పాచికంపు కొట్టే, కుళ్లిపోయిన ఆహార పదార్థాల సంచులను మోసుకు వెళ్లాల్సి వస్తుంది. వాటితో పాటు పదునైన బ్లేడులు, పగిలిపోయిన గాజు సీసాలు, చాలా హానికారకమైన వ్యర్థాలు కూడా వుంటాయి. కాళ్లకు, చేతులకూ, ముఖానికీ ఏ రకమైన రక్షణా లేకుండానే ఈ పనులు చేయాల్సి వస్తోంది. నిజానికి తడిచెత్త పొడి చెత్త అనేదాన్ని ఇంటి స్థాయిలోనే విడివిడిగా చేయగలిగితే ఈ కార్మికులకు పని కొంచం సులభతరం అవుతుంది. కానీ, ఆ క్రమశిక్షణ లో వుండటానికి మర్యాదస్తులకు సుతరామూ ఇస్టం వుండదు. పైగా చెత్తవాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం అనుకుంటారు. ఈ పని మొత్తం ఈ శ్రామికులు ఒకరకంగా స్వచ్చందం గానే చేయాలి. వాళ్ళకు ప్రభుత్వాల నుండీ కనీస వేతనం కూడా రాదు. వాహనాలు కూడా సబ్సిడీలో బ్యాంక్ లోన్ ద్వారా తీసుకోవాల్సిందే. ఆ అప్పు తీర్చుకోవాల్సిందే. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా ఆ పనిలో పాలు పంచుకోకపోతే కుటుంబం గడిచే పరిస్థితి వుండదు. అతి కొద్దిమంది మాత్రమే ఈ పనులు చేసుకుంటూ కూడా చదువుకోగలుగుతున్నారు. అధిక శాతం మంది పిల్లలు కనీసం హైస్కూల్ వరకూ కూడా చదువుని కొనసాగించే పరిస్థితి లేదు. అయినప్పటికీ, ఆ పనిలో తల్లిదండ్రులకు సహాయం చేస్తూనే చదువుకుంటున్న పిల్లలు కొంతమంది కనిపిస్తున్నారు. అలా చెత్త ఏరే పనిచేస్తూ డిగ్రీ చదువుతున్న ‘జయలక్ష్మి’ అనుభవాన్ని తన మాటల్లోనే తెలుసుకుందాం.

“ఉదయం… అందరూ ఆహ్లాదంగా లేచే వేళల్లో… మేము పనికి బయలుదేరాలి. చెత్త బండి ఎక్కి… గడపగడపకూ తిరిగి చెత్త సేకరించాలి… జీవితమంటేనే నిత్య పోరాటం.. నేను పెరిగిన బస్తీ.. మా ఇంటి పరిస్థితి.. కష్టపడితే కానీ నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్ళవని చిన్నప్పుడే అర్థమయ్యేలా చేశాయి. మా చుట్టూ పక్కల చెత్తతో కుళ్లిపోయిన వాసనలతో తెల్లవారు ఝామున 4 గంటలకు నిద్ర లేచి, మా కుటుంబంతో కలిసి 600 ఇళ్లకు ఇంటింటికీ వెళ్లి రెండు కిలోమీటర్ల మేర చెత్తను సేకరించాలి. ఉదయం 5 గంటలలోపు తడి పొడి చెత్త తో నిండి కంపు కొట్టే వాహనం పైకి వెళ్లడాన్ని వూహించుకోండి. కొంతమంది మమ్మల్ని చెత్త సేకరించేవారు అని పిలుస్తారు. మరికొందరికి మేము ర్యాగ్ పికర్స్ మి. మరికొంతమంది కి మేము మనుషులమే కాదు. మేము మా భోజనం, నిద్ర, మా కుటుంబాలతో సమయం గడవటం, పిల్లలు పుట్టడం, మనుషులు చనిపోవటం అన్నీ ఒకే స్థలంలో వుంటాయి. ఈ దృశ్యం, దుర్గంధం అన్నీ నా ప్రతి జ్ఞాపకంలో పాతుకుపోయాయి. రాత్రి పడుకునే ముందు ఆలోచన, పొద్దున్నే ఎక్కడ ఎవరు ఫిర్యాదు ఇస్తారేమో అని ! పొద్దున లేచాక ఇంకో బాధ! ఎక్కడ చెత్త శుభ్రంగా తీసినా రాకపోతే రెండు మూడు రోజులు అయ్యింది అని అనుమానిస్తారేమో అని! నిద్రలోనే ఏడుస్తూ పనికి వెళ్ళాక భయం, బడికి అందుకోలేనేమో అని!

పొద్దున ఖాళీ కడుపుతో పని మొదలు పెట్టాక తిరిగి ఇంటికి వచ్చాకే భోజనం. మధ్యమధ్యలో ఆ కాసింత చాయ్ కొండంత బలం ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. మరీ ఎక్కువ ఆకలి వేస్తే ఏ చెట్టు కిందనో, ఏ పబ్లిక్ టాయిలెట్స్ పక్కనో కూర్చుని ఎవరైనా ప్లాస్టిక్ కవర్ లో చుట్టి ఇచ్చిన రాత్రి అన్నాన్ని ఆ పూట ఆకలి తీర్చుకోవటానికి ఉపయోగించుకుంటాం. కొన్ని అపార్ట్మెంట్లలో లిఫ్ట్ లోకి ఎక్కనివ్వరు కానీ చెత్త తీసుకు వెళ్ళాలి. అలాంటి చోట అన్ని అంతస్తులు పైకి ఎక్కి దిగి, కాళ్ళ నొప్పులతో పని చేయాలి. మూత్ర విసర్జన చేయాల్సి వచ్చినా అపార్ట్మెంట్లలో అనుమతించని మహానుభావులు ఎందరో..!

600 ఇళ్లల్లో బరువైన డబ్బాలను, సంచులను మోసేసరికి విపరీతమైన చేయి నొప్పి, నడుము నొప్పి చాలా సాధారణ విషయం అయిపోతుంది. బండిలో చెత్తను విడదీసేటప్పుడు, మనుషులు ఎంత క్రూరులో కళ్ల ముందుకు వస్తుంది. కొంతమంది ఏ మాత్రం ఆలోచించకుండా వాడేసిన శానిటరీ ప్యాడ్లు, ఇంట్లో పిల్లలకో, పెద్దలకో వాడిన కంపు కొట్టే డైపర్స్ వాటిని శుభ్ర పరచకుండా అలాగే చెత్త కవర్లలో తోసేస్తారు. ఎలాంటి రక్షణ లేకుండా , గ్లౌజ్ లు లేకుండా వట్టి చేతులతో పట్టుకుని తడి, పొడి చెత్తను విడగొట్టాలి. పైన ఇలా విడగొట్టేటప్పుడు కాళ్లకు వివిధ గాజు పెంకులు కోసుకుపోయినా, ఆ ఘాటైన వాసనకు కాళ్లకు చేతులకు పుండ్లు అయినా వాటి బాధ మామూలుగా వుండదు. అలా అని ఒక్కరోజు కూడా పని ఆపలేము.

ఉదయం 5 గంటలకు నారోజు మొదలవుతుంది. అప్పుడు బయలుదేరితే 8 గంటలకు మళ్లీ తిరిగి వస్తాను. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించాలి. ఇళ్ళన్నీ పూర్తయ్యే సరికి మధ్యాన్నం పన్నెండు అవుతుంది. కానీ నేను కాలేజీకి వెళ్ళాలి కాబట్టి 8 గంటలకల్లా ముగించుకుని వస్తాను. మిగిలినవి మా అమ్మా వాళ్లు చేస్తారు. సెలవు రోజులైతే పూర్తిగా నేనే చేస్తాను. సేకరించిన చెత్తలో ప్లాస్టిక్, ఐరన్, గాజు వంటివి విడదీసి అమ్ముకోవాలి. అదే మాకు ముఖ్యమైన ఆదాయమార్గం. వారం అంతా ఏరుకొచ్చి, ఒకచోట పేర్చి, వాటిని మళ్లీ విడదీసి అమ్మాలి అంటే కనీసం మూడురోజులు పడుతుంది. ఇలా వారంలో మూడు రోజులు అదే చేస్తాం. ఆ విడదీసే పనివున్న రోజు తిండి తినలేం. ఎంత శుభ్రంగా చేతులు కడిగినా అంత గలీజుగా వున్నవాటిని ముట్టుకున్నాక ఆ చేతులతోనే తినలేము. మేము చేసే పని మాత్రమే అశుభ్రం, కానీ మేము కాదు కదా…! వాసన వచ్చినప్పుడు, కాళ్ళు చేతులకు పుండ్లు అయినప్పుడు , ఆకలితో పని పూర్తిచేసినప్పటికీ రాని బాధ ఎవరైనా మా పేరు పెట్టి పిలవకుండా ఏయ్ చెత్తా! చెత్త అమ్మాయి, చెత్త అబ్బాయి, చెత్తది అని పిలిస్తే మాత్రం వస్తుంది. సహించలేము. ఆ వివక్షకు తిరగబడతాం. అందరూ వివక్ష చూపించరు. కొంతమంది వారి పిల్లలతో సమానంగా మమ్మల్ని చూసినప్పుడు, సాయం అడిగినప్పుడు చిన్నచూపుతో కాకుండా మాతో నడిచినప్పుడు, చదువులోగానీ ఇతరత్రా విషయాలలో మేము సాధించిన విషయాలను చూసి అభినందించి మాపట్ల గౌరవం, ప్రేమతో చూసే ఆ వక్క చూపు కోసం ఎంతటి కష్టమైనా, ఎంతటి వివక్ష నయినా తట్టుకుని, పట్టుదలతో నిలబడటం పెద్ద కష్టమేమీ కాదు అనిపిస్తుంది. మమ్మల్ని మనుషులుగా గౌరవించండి అని వేడుకోవటం లేదు, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుగా డిమాండ్ చేస్తున్నాము, ఆర్డర్ చేస్తున్నాము.”

హైదరాబాద్ మహానగరం చుట్టూ అధికారిక లెక్కల ప్రకారమే నాలుగు లక్షల మందికి పైగా చెత్త శుభ్రం చేసే కార్మికులు వున్నారని ఈ మధ్యే సంఘంగా రూపొందిన ‘హైదరాబాద్ గార్బేజ్ కలక్టర్స్ కలెక్టివ్’ ప్రకటించింది. ఒకప్పుడు తమకు రావలసిన పైసల కోసం కూడా దీనంగా అడిగే పరిస్థితి నుంచీ ప్రభుత్వం నుంచీ, సమాజం నుంచీ తమకు న్యాయబద్ధంగా రావలసిన డిమాండ్లను స్పస్టంగా సమూహ ధైర్యంతో ప్రకటించే విధంగా సమీకృతం అవుతున్నారు. “మమ్మల్ని మనుషులుగా గుర్తించండి అని మేము అడుక్కోవటం లేదు, డిమాండ్ చేస్తున్నాం, ఆర్డర్ చేస్తున్నాం ” అనే స్టైర్యాన్ని ప్రకటించిన జయలక్ష్మి మాటల్లో ఈ సమూహ ధైర్యం కనిపిస్తుంది. చదువు అందిస్తున్న ఆత్మ విశ్వాసం, భవిష్యత్ పట్ల ఆశావాహ దృక్పథం వ్యక్తమవుతుంది.

వారు ఒక సమూహ శక్తి గా ప్రభుత్వం ముందు పెడుతున్న డిమాండ్లు ఇవి:

  1. చెత్త సేకరణ కార్మికులను అత్యవసర కార్మికులుగా గుర్తించి వారికి ఐడీ కార్డులు ఇవ్వాలి. 2. ఆరోగ్య & రక్షణ కిట్ లను అందించి పని ప్రదేశాలలో భద్రత కల్పించాలి.
  2. వ్యక్తిగత, ఆరోగ్య, అంగ వైకల్య, వాహన భీమా సౌకర్యాలను ప్రభుత్వమే బాధ్యత తీసుకుని చేయించాలి.
  3. ఈ శ్రామికులను ఈఎస్ఐ హెల్త్ పాలసీలో భాగం చేసి ఆరోగ్య భద్రత కల్పించాలి.
  4. చెత్తబండి నిర్వహణ కోసం వార్షిక గ్రాంటు అందించాలి.
  5. చెత్త సేకరణ కార్మికులందరికీ డబల్ బెడ్రూం ఇండ్లు అందించాలి.
  6. చెత్త సేకరణ కార్మికులు ఎదుర్కుంటున్న వేధింపుల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి.

పౌర సమాజానికి చేస్తున్న విజ్ఞప్తులు:

  1. ఇళ్ల నుంచీ చెత్త సేకరించినందుకు గానూ కనీసం రూ.150/- (ఇదే చాలా తక్కువ, కానీ ప్రస్తుతానికి దీనికి పరిమితమయ్యారు) నెల మొదటివారంలోనే ఇవ్వాలి, పదే పదే తిప్పించుకోకూడదు.
  2. అమర్యాదగా ప్రవర్తించకూడదు. గౌరవంగా పేరు పెట్టి పిలవాలి.
  3. నెలంతా పని చేయించుకుని ఇల్లు ఖాళీ చేసేటప్పుడు డబ్బులు ఎగ్గొట్టకూడదు.
    వీరి డిమాండ్ల పట్ల అసహనం అయ్యే అధికారులూ, వీళ్ళకు కూడా హక్కులు కావాలా అని నొసలు చిట్లించే ‘మర్యాదస్తులయిన పౌరులూ’ ఈ శ్రామిక సమూహం చేస్తున్న ఆర్డర్ ను పాటించకపోతే, ఆ ‘చెత్త మనుషులు’ అని తీసి పారేస్తే ఆ చెత్త చేతులే భవిష్యత్తుని శాసిస్తాయి అని అర్థం అయ్యేరోజు ఎక్కువ దూరం వుండకపోవచ్చు.

రచయిత్రి, అనువాదకురాలు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్, సంపాదకురాలు. మహిళా ట్రాన్స్ జెండర్ సంఘాల ఐక్య కార్యాచరణలో భాగంగా బాధిత సమూహాల హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. పర్యావరణ విధ్వంసానికి దారితీసే యురేనియం, వ్యవసాయ విధానాల వంటి సమకాలీన రాజకీయ అంశాలపై మహిళలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు ఎదుర్కుంటున్న వివిధ సమస్యలపై నాలుగు దశాబ్దాలుగా  ఉద్యమిస్తున్నారు. ఆయా సమస్యలపై  వివిధ పత్రికలలో కాలమిస్టుగా విస్తృతంగా వ్యాసాలు రాస్తున్నారు.  వాటిని 'ప్రవాహం', 'రైతుల ఆత్మహత్యలు-మనం’ పేరిట రెండు సంకలనాలుగా ప్రచురించారు. స్త్రీలు ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యలపై 'సవాలక్ష సందేహాలు' పుస్తకానికి కె.లలితతో, 'స్త్రీవాద రాజకీయాలు - వర్తమాన చర్చలు' పుస్తకాన్ని ప్రొఫెసర్ రమా మెల్కోటెతో కలిసి సంపాదకత్వం వహించారు. భాషా సింగ్ రచించిన ‘UNSEEN’ పుస్తకాన్ని 'అశుద్ధ భారత్'గా, ప్రొఫెసర్ జంగం చిన్నయ్య పరిశోధనాత్మక రచన ‘DALITS AND THE MAKING OF MODERN INDIA' ని 'ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు' పేరిట తెలుగులోకి HBT కోసం అనువదించారు. 'కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్' కమిటీ తరపున రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల జీవన భద్రత కోసం పని చేస్తున్నారు.

Leave a Reply