పడావు కాలువ కన్నుల్ల పానాలు బోద్దాము!!!

అనగనగా
ఒకవూరు…

లంకంత ఇళ్లు
విశాల అరుగులు

మూసినా తెరిసినా
అటుమూడు
ఇటు మూడు
ఇళ్ళకైనా
సప్పిడినవచ్చే దర్వాజా..

ఆ జోడురెక్కలు
వజనులో
వొంద కేజీలైనా
అల్కాగుండేవి..

ఆపక్క ఈపక్క
నడుమెత్తు మించి
ఎత్తైన కట్టలు
నడుమ రాకపోకల దారి..

వాకిలి కెదురుగా
కల్లాన్ని మించిన
కనిపించె బయలు..

సోలపురం రామన్నదో
సంగుబట్ల శాలన్నదో
గలుగుబాయి తిమ్మప్పదో
గన్యాగుల గోయిందమ్మదో

ఇంట్లనే సేదబాయి
సేతికందే ఊట
గచ్చు నిండా నీల్లు
కడపంచు జాలాడి
ఎండ ఎల్తురు వాన
నిండా బారే జాలి
నట్టింటి ఛత్తు కిటికీ

నేతమొగ్గాలన్నీ
పోగు జారకుండా
జరీ సీర లల్లేటి
ఖత్రి ఖన్దానులు
మూటా ముల్లె గట్టి
బొంబాయి బివాండి
బాటలు బట్టినంక

నౌకరీ కాయితం
సేత బట్టుకోని
కాలూని నోల్లమూ..
బతుకు లేనిచోట
బతుక వొయినోల్లమై
బడి జెప్పి వోస్తిమీ..
అంతు చిక్కని ఆ చెరువు
అమ్మ వొడి కౌగిట్ల
ఆడి పాడొస్తిమీ..

గౌసుద్దీన్ మునెప్ప
కాసిమన్న కేశన్న
వైకుంఠ కృప నర్స
ఆశ పాషలమయ్యి..
చింగారి మల్లేష
గట్టు విందప్పలతోని
చెట్టపట్టాల్ గట్టి
చెరబాసినోల్లమూ..

కండ్లముంగటే కాలం
కనుమరుగు అయిపాయె
కలిసిబతికిన కాపిరాలు
కుంగి కూలి కుమిలి
ర్యాలాకులల్లె
నేల రాలిపాయె..

వొట్టి బోయిన న్యాల
ఉత్త బీడై పాయె
పరవళ్ల నీళ్ళొచ్చి
భూమి పచ్చగయ్యెఆశ
బుడము జచ్చిపాయె..

కొలువు వయసుమీరి
వొజీఫా వొడ్డుదాటిచ్చె..
పడావు కాలువల్ల
తుమ్మలు మొలిసొచ్చే..
నడిగడ్డ బతుకేమో
నడిరేయి దిగులాయె..

బలిగేరి బత్తలయ్య
మాచర్ల బడెసావు
అయిజ తిక్కీరప్ప
మలకంటి తిమ్మయ్య
అలంపూరు జోగమ్మ
సర్దారు శాలి పైల్వాను
రాజోలి అడివేశ్వరస్వామి

జమిసేడు జములమ్మ
సద్దలోంపల్లె గోపన్న
గట్టు మినల్ల వుసేను
భవానీ మాతాంబ
ఆలూరు గోకర్సాబు
సింతరేవు అంజన్న
నందిన్నె బడే సాబు
గద్వాల మాసుం పీర్లు

జాతర్లు ద్యావర్లు
కిస్మసు కందూర్లు
ఏడేడు గ్యార్మీలు
సుంకులమ్మ గుళ్లోని
నిత్య భజకీర్తనలు
దౌదర్పీరు దర్గాలు
యాద్గీరు ఈద్గాలు

సలామతు గుండేటి
సంపదల సీమింట్ల
లీడర్లు ప్లీడర్లు
లిటిగేటు బ్రోకర్లు
నలుపు తెలుపుల
మెరిసి మెరిసేటి
సావులేని సంపద
ఏటంచు తోటయ్యి
ఎప్పుడూ పూసేటి
కుక్కల్నే తరిమిన
కుందేటి ఇలాఖల

రైతు బతుకేమి
ఇట్లెట్ల ఇక్కట్ల పాలాయె
అప్పుకిందికి పానాలు
పొయెటి దినమాయే

పొలమంతా కుదవలో
ఇంటిల్లిపాదెల్ల ఎట్టిలో
మూడేండ్లు తిరుగుళ్ళ
అసలు మిత్తిలు గలిసి
భూమల్ల చుక్తాయెనంటు
సీడు సాగీడ జూడు
రైతుమెడకు ఉరాయే !!

కంపిన్ల ఇత్తులూ
ఎగజల్లె ఎరువులూ
పుట్లకొద్దీ పురుగులూ
పిచికారీ మందులూ..

సవుకారి సర్కారు
ఎదురురెవ్వ రనుకుంట
ఎదలిప్పి ఎగుర్లాడి
దోస్తులమ్మేమనుకుంట
రాజ్యమే మేమంటు
సావేడ మాకంటు..

పురుగులూ ప్రభువులూ
వడ్డీ కాసుల గోతులూ
సమరానికి సయ్యంటూ
ఒక్కటై లేసినయ్..
పడగెత్తి నిలిసినయ్..

సందెడు మ్యాతేసి
సందెట్ల దాసి
కడుపు గాలుతున్నా
కలి కుడితి కలిపిపోసి
కడుపాకలి దీర్చిన
తలిదండ్రి రైతంటు..

దొతికలిప్పిన కాడెడ్లు
రాకాసి రాజ్యాన్ని
దునుమాడ కదలినయ్..
రంకేసి రేగినై..

ఏండ్లదేముందిలే
ఎన్నైన నిండుతయ్..
సంబరాలదేముందిలే
ఎపుడైన వొస్తయ్..

దిద్ద బెట్టిన సేతుల్ల
పిడికిట్ల జెండయ్యి
జంగంట వొస్తావా..??
జానంట ఇద్దాము..!!
పడావు కాలువ కన్నుల్ల
పానాలు బోద్దాము…!!!

పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)

Leave a Reply