పట్టాల మీద చంద్రుడు

ఆ రాత్రి తెల్లవారనే లేదు

‘జీవితకాలం లేట’నిపించిన రైలు
లిప్తపాటులో దూసుకువచ్చిన రాత్రి

కలవని పట్టాలమీద
రంపపు కోత చక్రాలతో
కన్నీటి చుక్కలని ఖండఖండాలుగా
విసిరివేసిన చీకటి రాత్రి

గమ్యం మరచిన దారిలో
అలసిన ఒంటరి మనిషి ఆక్రందన
పట్టాలని ఒరుసుకుంటూ
దుఃఖ సముద్రమై ప్రవహించిన రాత్రి

ఆ రాత్రి ఇంకా తెల్లవారనే లేదు

రైలుపట్టాల మీద చంద్రుడూ, నక్షత్రాలూ
నాణెంలా నలిగిపోయి
వెన్నెల విలపించిన విహ్వల విగత రాత్రి

గడ్డకట్టిన మంచులాంటి ఏకాకి దుఃఖమో
లోలోపల ఎగసిఎగసిపడే జ్వాలలో
వేగంగా దూసుకొచ్చే రైలుని ఢీ కొట్టి
మృత్యువును కౌగిలించుకున్న కరాళ రాత్రి

ఆ రాత్రి బహుశా ఇక ఎప్పటికీ తెల్లవారదేమో

***

ఎక్కడని పోల్చుకోవాలి నిన్ను?

చావును వరించిన
చిట్టచివరి క్షణాల విషాదంలో

జీవితాన్ని తృణప్రాయంగా
తిరస్కరించిన చరమరాత్రి
ఛిద్ర శకలాలలో

ఆవేశమో, ఆక్రందనో
దుఃఖమో, క్రోధమో
నెత్తుటిచుక్కలై రైలుపట్టాలపై ఇంకిన
కన్నీళ్ళలో

గుర్తు పట్టలేని శకలాలలో
జ్ఞాపకమై మిగిలిన మనిషి
చెదిరిపోయిన ఆశలలో

గుండెదిటవుకు వీడ్కోలు పలికిన
కటిక చీకటి దారిలో
వెలిగి ఆరిన దీపాల జాడలలో

చంద్రుడు ఛిద్రమై
వెన్నెల గాయమై
నెత్తురు చీకటై
తెల్లవారని రాత్రిలో

ఇప్పుడిక ఎక్కడని పోల్చుకోవాలి నిన్ను?

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

4 thoughts on “పట్టాల మీద చంద్రుడు

  1. విప్లవకారుడుగా వెలుగుందిన చంద్రుడులోని వెలుగు చీకట్లను బాగా వడ కట్టారు..

  2. వెన్నెల విలపించిన విహ్వల విగత రాత్రి

  3. కవిత బావుందని అనాలంటే భయమేస్తోంది కిరణ్.
    సమూహాలతో కలిసి నడిచిన మనుషుల ఒంటరి నిష్క్రమణలు, మన విడివిడి ప్రతిస్పందనలు ఇక చాలవనిపిస్తోంది. ఇంకా బలంగా, సామూహికంగా మాట్లాడాలి మరికొందరినైనా కాపాడుకునేందుకు.

    1. అవును నాకు భయమేస్తుంది, చంద్రుడంత బాధితుడను నేను, సామూహికంగా నన్ను కాపాడండి, మరణించిన తరువాత ఓదార్పు కంటే బ్రతికుండగానే మరణం దరి చేరకుండా కాపాడండి. తుమ్మలపల్లి ప్రసాద్, 9912010030

Leave a Reply