నైస్ గర్ల్ సిండ్రోం

అనుమానాలు సుడిగుండాలై
వెంటాడుతుంటాయి
తల్లీ పెళ్ళాం చెల్లీ కోడలూ….
అన్ని పాత్రల్లో మెప్పించే
బరువును వేదికలుగా మోస్తూనే ఉంటాం

ఇది చేయి అది చేయకు అంటూ
పరువు ప్రతిష్టల అలంకారం చేస్తే
తలూపే గంగిరెద్దులమవుతాం

సహనానికి లేని హద్దులు
శరీరాలకి తగిలిస్తారు
తాళి కట్టించుకున్నందుకు
ఎగతాళిని కానుకచేస్తారు

ఆచి తూచి అడుగులేస్తాం
అవరోధాలని పక్కకు తప్పించి
బండరాళ్లని సైతం మెత్తగ చేస్తాం
నిర్మల నదిలా సాగుతూంటాం

“మంచి” అనబడే
బలిపీఠంపై ఇంకా గొర్రెలమవక్కర్లేదు
మంచు బిందువులకి “చల్లటి”
ముద్ర అవసరం లేదు

వంకరటింకరలూ ఎత్తుపల్లాలూ,
చీలిన పాయలూ, తగిలిన గాయాలూ
తిరిగే ప్రతీ మలుపులోనూ
కొత్త దారిని వెతకాలి
నచ్చినట్టు బతకాలి

భూమ్యాకాశాలు కలుస్తున్నాయని చెప్పే
అబద్ధపు ఉద్రిక్త వరద రాత్రి
పోటెత్తి ప్రవహించాలి!!

పుట్టినదీ, పెరిగినదీ, చదువుకున్నదీ హైదరాబాదు లో. 'వచన కవితా పితామహుడు' కుందుర్తి ఆంజనేయులు గారి మనవరాలు. ఫ్రీవెర్స్ ఫ్రంట్ బాధ్యతను కొనసాగించిన కుందుర్తి సత్యమూర్తి గారి కూతురు. బాల్యం నుంచీ ఫ్రీవెర్స్ ఫ్రంట్ పురస్కార సమావేశాలకు వెళ్ళటం, ప్రముఖులైన కవులతో, వారి పుస్తకాలతో సంబంధబాంధవ్యాల వలనా, కవిత్వం రాయాలనే తపనతో  గత కొంతకాలంగా కవిత్వం రాస్తున్నారు. పదిహేను వరకూ వివిధ అంతర్జాల పత్రికలలో ప్రచురితమయ్యాయి. M.Com, MBA, PGDCA చదివారు. ప్రస్తుతం సింగపూర్ లో నివాసం. migrant workers welfare కోసం పని చేసే ఒక NGO లో పని చేస్తున్నారు. రంగవల్లికలు వేయడం, బొమ్మలు గీయడం, పెయింటింగ్ హాబీలు. త్వరలో తొలి వచన కవితా సంపుటి వస్తోంది.

One thought on “నైస్ గర్ల్ సిండ్రోం

Leave a Reply