మహిళలలో చైతన్యాన్ని, పోరాట స్ఫూర్తిని కలిగించే నైజీరియన్ నవల – అమీనా

“అమీనా” మహమ్మద్ ఉమర్ అనే ఒక నైజీరియన్ రచయిత రాసిన మొదటి నవల. ఇది ఇప్పటికి 36 భాషలలోకి అనువదించబడింది. దీన్ని రచయిత ఆంగ్ల భాషలో రాసారు. సింహాద్రి సరోజిని ఈ నవలను తెలుగులోకి అనువాదం చేస్తే, ప్రజాశక్తి బుక్ హౌస్ దీన్ని 2010 లో ప్రచురించారు. ఈ మధ్య వచ్చే చాలా అనువాదాలు తెలుగులో పేలవంగా ఉంటున్నాయన్నది నేను గమనించిన విషయం అయితే ఈ పుస్తకం మాత్రం అనువాదకురాలు చాలా శ్రద్ధగా పెట్టి తెలుగులోకి తెచ్చారని ఖచ్చితంగా చెప్పవచ్చు. పాత్రల మధ్య ఎంతో చర్చ నడిచే సమయంలో కూడా ఎక్కడా అది పరభాషా నవల అనే ఆలోచన రానీయకుండా అనువాదకురాలు శ్రద్ధ తీసుకున్నారు. మానవ హక్కులు, పోరాటం, సిద్ధాంతాల చర్చ జరిగే సందర్భాలలో ఆవిడ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని నాకు అనిపించింది. వీరిని తప్పకుండా అభినందించాలి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఎన్నుకుని ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను. ఇందులో అమీన అనే ఒక నైజీరియన్ మహిళ జీవితం ద్వారా ఆ దేశంలోని మహిళల స్థితిని వారి దుర్భర జీవితాలను, మానవ హక్కుల ఉనికే తెలియని ఎందరో నిర్భాగ్యుల వేదనాభరిత జీవితాన్ని, మహిళా సమస్యలను, వారిలో రాజకీయ చైతన్యం తీసుకురావలసిన ఆవశ్యకతను రచయిత తెలుపుతారు. “మనం అవసరమైన విషయాల పై మౌనం వహించిన రోజున జీవితాల ముగింపు మొదలవుతుంది” అన్న మార్టిన్ లూధర్ కింగ్ జూ. మాటను ప్రస్తావిస్తూ రచయిత సామాజిక, రాజకీయ చైతన్యం దిశగా మహిళా ప్రపంచాన్ని నడింపించే ప్రయత్నం చేసారు.

ఇది నైజీరియన్ ముస్లిం మహిళల జీవితం మాత్రమే కాదు. ఇందులో ప్రపంచ మహిళ కనిపిస్తుంది. ప్రపంచంలో మహిళ స్థానం, మహిళల పట్ల పురుష సమాజ వైఖరి అన్ని దేశాలలో ఒకే రకంగా కనిపిస్తుంది. ఆర్ధికంగా విద్యాపరంగా కొన్ని సాంస్కృతిక కారణాల వలన కొన్ని దేశాలలో మహిళల జీవనం కాస్త మెరుగ్గా ఉండి ఉండవచ్చు. కాని ఆ దేశాల పురుషులతో పోలిస్తే ఇప్పటీకీ వారు వివక్ష ఎదుర్కుంటున్నారన్నది నిజం. కొన్ని దేశాలలో మహిళల పట్ల వివక్ష తక్కువ అయితే మరి కొన్ని దేశాలలో చాలా ఎక్కువ. ఆసియా ఆఫ్రికా ఖండాలలో మహిళ పరిస్థితి దయనీయంగా ఉన్నదని చెప్పవచ్చు. అందువలనే ఈ నవలలో ప్రస్తావించిన సమస్యలు కేవలం నైజీరియన్ ముస్లిం సమాజ సమస్యలు కావు. ప్రతి దేశంలో వివక్ష నెదుర్కుంటున్న మహిళా సమస్యలు. వీటిని అధిగమించాలంటే పోరాటం ఒక్కటే మార్గమని, స్త్రీలు సంఘటితమవ్వాలని, తమ పరిస్థితి బాగు పడడానికి వారే పూనుకోవాలని, ఉద్యమించాలని, తమ సమస్యల మూలాలను వెతికి పట్టుకోగల సామాజిక స్పృహ, అవగాహన వారికి కలగాలని రచయిత బలంగా కోరుకుంటారు.

ఈ నవలలో ముఖ్య పాత్ర అమీనా. యూనివర్సటిలో లా చదువుతున్న యువతి. తల్లి ఆమెను చదువుకొమ్మని చాలా ప్రోత్సహిస్తుంది. తండ్రి ఒప్పుకోకపోయినా అతనితో పోట్లాడి మరీ అమీనాను యూనివర్సిటికి పంపిస్తుంది. చదువు వలనే ఆమె మెరుగైన జీవితాన్ని పొందగలదని ఎన్నో సార్లు అమీనాకు బోధిస్తుంది. అయితే తల్లి ఆరాటం అమీనాకు అర్ధం కాదు. ప్రతి కన్నె పిల్లలాగే ఆమెలో ఎన్నో కోరికలు. తల్లి చనిపోయిన తరువాత తండ్రి ఆమె వివాహం జరిపించి చేతులు దులుపుకుంటాడు. అమీనా వివాహం ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్న ధనవంతుడైన అల్లాజీ హారూన్ తో జరుగుతుంది. ఆమె అతనికి నాలుగో భార్య. కొత్త భార్యను స్నేహితులకు పరిచయం చేస్తూ అతను ఇలా అంటాడు “మన ముస్లిం మతం ముస్లిం పురుషుడు నలుగురు భార్యలను వివాహమాడేందుకు అనుమతిస్తొందని మీ అందరికీ తెలుసు. నూతన విజయం, నూతన భార్య అనేది నా సిద్ధాంతం. అల్లా దయవల్ల నాకు కొన్నేళ్ళ క్రితం స్థానిక ప్రభుత్వ స్టోర్ కీపర్ గా ఉద్యోగం రాగానే నా మొదటి భార్యను పెళ్ళి చేసుకున్నాను. మళ్ళీ అల్లా దయవల్లనే నేను రాష్ట్ర అర్ధిక శాఖలో అకౌంటెంట్ పదవిని పొందగానే నా రెండవ భార్యను వివాహమాడాను. అల్లా నాకు వ్యాపారం చేసేందుకు మార్గం చూపగానే మూడవ పెళ్ళి చెసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆయన దయవల్లనే నేను రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాను. అందుకు నాల్గవ వివాహం చేసుకున్నాను.” ఇక అప్పుడు అమీనా వైపు తిరిగి అతను “నువ్వు నా నాల్గవ భార్యవు. అయితే చివరిదానవు మాత్రం కాదు” అంటాడు. ఈ మాటలతో ఆ దేశపు పురుష ప్రపంచంలో భార్యల స్థితి అంచనా వేయవచ్చు.

అతని భార్యలందరూ ఒకే ఇంట్లో వేరు వేరు గదులలో ఉంటారు. ఒకరి పట్ల మరొకరు అసూయతో రగిలిపోతూ ఒకరిపై మరొకరు భర్తకు పితూరీలు చెబుతూ ఉంటారు. భర్త వాటిని నిజమని నమ్మితే భార్యతో ఎలా అయినా ప్రవర్తించవచ్చు. భర్త ఎక్కడ తమని వదిలిపెడతారో అని భార్యలు నిత్యం భయంతో జీవిస్తూ ఉంటారు. అమీనా ముందు ఆ ఇంట్లో తన సౌకర్యాలకు, విలాసవంతమైన జీవితానికి ఆనందిస్తుంది. ఆమె యూనివర్సిటీ లో ఉన్నప్పుడు విద్యార్ధి ఉద్యమ నాయకురాలు ఫాతిమా ఆమె సహచరి. ఇప్పుడు పెళ్ళి అయిన తరువాత కూడా ఫాతిమా తో ఆమె స్నేహం అలానే ఉంటుంది. ఫాతీమా అమీనాకు ప్రపంచం గురించి, అందులో స్త్రీల పరిస్థితులు, ఇవన్నీ చెప్పి ఆమెలో చైతన్యం తేవాలని ప్రయత్నిస్తుంది. హై సొసయిటీ స్త్రీలతో ముందు అమీనా కలిసి గడపాలని అనుకుంటుంది. కాని ఆ ప్రపంచం ఆమెకు నచ్చదు. అంతా నాటకీయంగా అనిపిస్తూ ఉంటుంది. ఫాతీమా విద్యార్ధి నాయకులతో జరిపే సమావేశాలను రహస్యంగా అమీనా గదిలో జరుపుతూ ఉంటుంది. ఎప్పుడో ఒక సారి వచ్చే భర్త, తనను ద్వేషించే ఇతర భార్యలు, తనకు నచ్చని ధనిక వర్గపు స్త్రీల మధ్య ఒంటరయిపోయిన అమీనా ఫాతీమాకు ఆమె స్నేహితులకు ఎన్నో సార్లు ఆతిథ్యం ఇస్తూ వారి మాటలు వింటూ ఉంటూంది. క్రమంగా ఫాతీమా ఆమె చేత దేశ రాజకీయ సామాజిక పరిస్థితులపై రాసిన పుస్తకాలను చదివిస్తుంది. మార్క్స్ కేపిటల్ తో పాటు నైజీరియా ఉద్యమకారులు సామాజిక శాస్త్రజ్ఞులు రాసిన పుస్తకాలను అమీనా చదవడం మొదలెడుతుంది.

అమీనా తో కొన్ని వ్యాపారాలు చేయించాలని ఆమె భర్త అనుకుంటూ ఉంటాడు. అమీనా కు భర్త ధనవంతులైన స్నేహితులు నచ్చరు. ఫాతీమా ఆమెకు పేదరికపు స్త్రీల జీవితాలను గమనించమని చెబుతుంది. వయోజన విద్యా కేంద్రాలను స్థాపించి స్త్రీలకు చదువు నేర్పించవలసిన అవసరం గురించి చెబుతూ అమీనా లాంటి స్త్రీలు తమకున్న వనరులతో స్త్రీ సమాజానికి ఉపయోగపడాలని ప్రోత్సహిస్తుంది. అమీనా భర్త ఒకసారి “ఆడవాళ్ళు కబుర్లు చెప్పుకుంటారని పురుషులు చర్చిస్తారని” చెబుతూ స్త్రీల పట్ల తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తాడు. తన భర్త తో పాటు అతని స్నేహితుల జీవితాలనూ అమీనా పరిశీలించడం మొదలు పెడుతుంది. ప్రగతీశీల విద్యార్ధి ఉద్యమకారులతో చర్చలలో పాల్గొని తమ దేశంలో స్త్రీలను సమాజం ఎలా పెంచుతుందో, స్త్రీలలో ఆలోచనను ఎలా అణిచివేస్తుందో తెలుసుకుంటుంది. “ఆమెను గృహిణిగా, తల్లిగా తన పాత్రను పోషించేందుకు వీలుగా పెంచుతారని, ఆమె తన సోదరులను తన కంటే ఎక్కువగానూ, భర్తను యజమానిగానూ, సాధారణంగా పురుషుల్ని తమ కంటే గొప్పవారిగానూ చూసే విధంగా పెంచబడుతుందని. ఆమె వ్యక్తిగతంగా ఉమ్మడిగా ఎదిగేందుకున్న అన్ని అవకాశాలనూ సమాజం కాల రాస్తుందని” తెలుసుకుంటుంది. గ్లోరియా అనే మరో స్త్రీ ద్వారా దేశంలో పేదలు ఇంకా పేదవారవడం, ధనికులు ఇంకా ధనికులవ్వడం వెనుక ఉన్న అర్ధిక అసమానతలను తెలుసుకుంటుంది.

ఆ సమయంలోనే మూడో భార్య, అమీనా పై చెప్పిన మాటలు విని భర్త ఆమెను అనుమానించి ఆమెతో చాలా దురుసుగా ప్రవర్తిస్తాడు. అమీనాకు భార్యగా ఆ ఇంట్లో తన స్థానం, సమాజంలో తన గౌరవం గురించి మొదటి సారి అనుమానం ఏర్పడుతుంది. ఫాతీమా మాటలలోని నిజం అర్ధమవుతుంది. ఫాతీమా దేశంలోని రాజకీయ ధనవంతులతో చేసిన చర్చలు ఆమెలో చాలా మార్పు తీసుకువస్తాయి. “వ్యాపారులు, సాంప్రదాయిక పాలకులు, మత నేతలు, రిటైర్డ్ సైనికులు, పోలీసులు, నౌకాదళ అధికారులు, రిటైరైన పౌర ఉద్యోగులు వంటి వారందరూ పాశ్చాత్య పెటుబడిదారీ దేశాల వెంటపడి పిచ్చి కుక్కల్లా పరుగులు తీస్తున్నారు” అన్న అవగాహన వచ్చిన తరువాత తన వంతుగా తాను కూడా ఉద్యమం కోసం ఎదో చేయాలనే తపన ఆమెలో బయలుదేరుతుంది. అప్పుడే చిన్నతనంలో వివాహం అయి బిడ్డను కని ఆరోగ్యం దెబ్బతిన్న ఒక పేద బాలిక స్థితిని ఆమె గమనిస్తుంది. లారై అనే ఆమెను తన సంరక్షణలోకి తీసుకుంటుంది. అటువంటి స్త్రీలకోసం తాను కొంత పని చేయాలని అర్ధం చేసుకుంటుంది. ఫాతీమాలోని పట్టుదల, ధైర్యానికి కారణం ఆమె విషయ పరిజ్ఞానమే అన్నది అర్ధం చేసుకున్నాక అమీనా కూడా విపరీతంగా చదవడం మొదలెడుతుంది.

అమీనా బకారో ఉమెన్స్ అసోసియేషన్ అనే సంస్థను ఏర్పాటు చేయడానికి పూనుకుంటుంది. ఫాతీమా మరికొందరు విద్యార్ధి సంఘాల నాయకుల సహాయంతో అమీనా మహిళా సంఘం నిర్వహణ కార్యప్రణాళికను అవగాహన చేసుకునే ప్రయత్నంలో పడుతుంది. మెల్లిగా తను కూడా సమావేశాలకు వెళ్ళడం మాట్లాడడం చేస్తుంది. ముందుగా వయోజన విద్యతో ఆ సంస్థ తన పనులు మొదలెడుతుంది. ప్రభుత్వం తమకు సహాయం చేయడానికి ముందుకు రాకపోవడం, చులకన చేయడం, సమస్యలు సృష్టించడం చూసాక ప్రభుత్వ అధికారుల నైజం పట్ల కూడా ఆమెలో ప్రశ్నలు తలెత్తుతాయి. ఉన్నత పదవిలో ఉన్న ఉద్యోగుల బాధ్యతారాహిత్యాన్ని ప్రభుత్వం పెంచి పోషించడం చూసి ఆశ్చర్యపోతుంది. మెల్లగా కొందరు నర్సుల సహాయంతో తమ సంస్థ ద్వారా మహిళల ఆరోగ్యం కోసం కూడా పని చేయాలని మహిళలలో తమ జీవితాల పట్ల అవగాహన తీసుకురావాలని అమీనా ప్రయత్నిస్తూ ఉంటుంది. తమ దేశం మెల్లగా విదేశి పెట్టుబడులతో ఎలా నిర్వీర్యం అవుతుందో తమ దేశ రాజకీయ నాయకులు అభివృద్ధి పేరుతో ఎంత అరాచకంగా ప్రవర్తిస్తున్నారో పూర్తిగా ఇప్పుడు ఆమెకు అవగతం అవుతుంది.

అమీనా ఆరునెలల కొడుకు ఒక రోజు జబ్బు పడతాడు. ఇంట్లో భర్త ఉండడు. బిడ్డ మందు కోసం డ్రైవర్ ను బజారుకు పంపుతుంది అమీనా. మందు తీసుకొచ్చిన తరువాత వాంతి చేసుకుంటున్న బిడ్డను పట్టుకుని మందు వేయడానికి డ్రైవర్ సహయం కోరుతుంది. అప్పుడే ఆమె భర్త వచ్చి తన గదిలో పరాయి మగాడున్నందుకు అమీనా ను విపరీతంగా కొడతాడు. ఆ రోజు మందులేక అ బిడ్డ చనిపోతాడు. అప్పుడు అమీనాకు తన అస్తిత్వం పట్ల ఎన్నో ప్రశ్నలు పుడతాయి. ఈ సంఘటన తరువాత ఆమె పూర్తిగా తన సంస్థ కోసం పని చేయడం మొదలెడుతుంది. తనకున్న కొంచెం భూమి దానితో పాటు ఇంకొందరి భూమి కలుపుకుని అమీనా సంఘటిత పరిచిన స్త్రీలంతా సామూహిక వ్యవసాయం ప్రారంభిస్తారు. మెల్లగా మహిళలను సంఘటితపరిచి వారికి చదువుతో పాటు వృత్తివిద్యా తరగతులను కూడా ఆమె నిర్వహిస్తుంది. దేశ అంతర్జాతీయ సమస్యలపై అమె అవగాహన ఎంతగా పెరుగుతుందంటే, తన భర్త పరిచయం చేసిన విదేశి మితృడితో ఆమె చర్చకు భయపడదు. తమ పెట్టుబడులు నైజీరియా ఉన్నతికి మూలం అని చెప్పే అతనితో అమీనా ఇలా అంటుంది “మీరు యంత్ర పరికరాలు ఎందుకు దుగుమతి చేసుకోరు? మీరు ఎప్పుడు తయారైన వస్తువులే ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు? పరికరాలు ఎలా తయారు చేసుకోవాలో మీరు మాకెందుకు నేర్పరు? మా సహజ వనరులు తీసుకెళ్ళడం పట్ల మీకు ఆసక్తి ఎందుకు? ఆ వనరులను ఇక్కడే ఎందుకు ప్రాసెస్ చేయరు? స్థానిక పరిశ్రమను పెరిగేందుకు ఎందుకు ప్రోత్సహించరు? ఇక్కడ పరిశోధనా సంస్థలు నిర్మించడంలోనూ, వాటికి నిధులు సమకూర్చడంలోనూ మీరు ఎందుకు ఆసక్తి చూపరు? మా వనరులు దొంగలించేందుకు సహాయం చేస్తారు గనుక దేశభక్తి రహిత ఆఫ్రికా నేతలకు మీరెప్పుడు మద్దతెందుకిస్తారు? అమాయక ప్రజలను చంపుతారని తెలిసి కూడా మీరు ఆయిధాలను ఎందుకు దిగుమతి చేస్తున్నారు? యుద్దం వంటి వాటి వల్ల ప్రభావితమౌతున్న లైబీరియా వంటి ప్రాంతాల నుంచి మీరు వజ్రాలను ఎందుకు ఎగుమతి చేస్తున్నారు? మరో మాటలో చెప్పాలంటే మీరు ఆఫ్రికాలో యుద్ధాలు, ఘర్షణలు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు”

అమీనా ప్రశ్నలలో ఆమె అవగాహనా శక్తి, నిజాలను నిర్భయంగా చూసి ప్రశ్నించగల ధైర్యం కనిప్సిస్తాయి. ప్రభుత్వం పై సైనిక తిరుగుబాటు జరగవచ్చని ఆమె భర్త చెప్పినప్పుడు కూడా “అధికారంలోకి ఎవరు వచ్చినా దేశ పరిస్థితులలో మార్పు ఉందదని. ఒక నిరక్షరాస్యుడైన సైనికుడు తనదైన పద్ధతిలో దేశ నాయకత్వాన్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి తమ దేశ దౌర్భాగ్యం” అని ఫాతీమాతో కలిసి ఆలోచిస్తుంది. పన్నులు కట్టమని ఒత్తిడి తెచ్చే ప్రభుత్వం పై స్త్రీ లందరూ నిరసన తెలిపాలని ఉద్యమిస్తారు. దానికి అమీనా నాయకత్వం వహిస్తుంది. “నువ్వు ముందుకెళ్తే చనిపోతావు. వెనెక్కెళ్ళినా మరణీస్తావు. అందువల్ల ముందుకెళ్ళేందుకే నిశ్చయించుకో” అంటూ మహిళలంతా ఒక్క తాటిపై నిలచి ప్రశాంతంగా ప్రభుత్వ వైఖరి పట్ల తమ నిరసన తెలుపుతారు. ప్రభుత్వం పోలీసులను పంపి మహిళా సమావేశం పై స్మోక్ బాంబులను విసిరడంలో కొందరు మహిళలు గాయపడతారు. లారై పోలీసు కాల్పులలో మరణిస్తుంది. అమీనా కూడా చాలా దెబ్బలు తిని జైలు పాలవుతుంది. జైలులో ఆమె భర్త ప్రభుత్వ పోలీసులతో వచ్చి ఆమెను వారి నిరసన ప్రతిపక్షాల ప్రోద్భలంతో జరిగిందని చెప్పి శిక్ష తప్పించుకొమ్మని చెప్పినా అమీనా అమ్ముడుపోవడానికి ఒప్పుకోదు. చివరకు ఆమె మరో స్నేహితురాలు లాయరుగా వాదించి ఆమెని విడిపించడం, జరుగుతుంది.

విద్యార్ధి నాయకులను ప్రభుత్వం జైలు పాలు చేస్తుంది. ముఖ్య నాయకులు విదేశాలకు పారిపోతారు. అక్కడి నుండి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అమీనా ను భర్త ఆమె కోసం కట్టిన కొత్త ఇంటికి తీసుకునివస్తాడు. ఆమెకు మరిన్ని విలాసాలు సమకూర్చి ఆమెను ఉద్యమం నుండి మళ్ళించాలని ప్రయత్నిస్తాడు. గర్భవతి అయిన అమీనా అతనికి ఎదురు చెప్పదు. ప్రభుత్వం మారిన తరువాత పాత ప్రభుత్వంలోని మంత్రులే ఈ ప్రభుత్వం లో చేరి పెద్ద పదవులలోకి వెళతారు. ఆమె భర్త కూడా పాత ప్రభుత్వాన్ని వదిలి పెట్టి అవకాశవాదిగా మరో పెద్ద పదవి ని అందుకుంటాడు. ఆమెకు కూడా ప్రభుత్వం తమ శాఖలో ఒక పదవి ఇవ్వాలని అనుకున్నప్పుడు అమీనా తాను ఆ పదవిని స్వీకరించనని తన నమ్మకాలను ఆదర్శాలను అమ్ముకోనని తన తోటి స్త్రీల అభివృద్ధికి సంబంధించిన పనులు తాను ఇక ముందు కూడా చేస్తానని గట్టిగా చెబుతుంది. విదేశంలో ఉన్న ఫాతీమా తో సంభాషిస్తూ తన కొత్త కార్యక్రమాల గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది.

నవల మొదట్లో అమీనా ఒక నిస్సహాయ అందమైన ముస్లిం ధనికుని భార్యగా కనిపిస్తుంది. కాని చదువు తెచ్చిన అవగాహనతో ఉద్యమంలో పని చేస్తున్న మిత్రుల సహాయంతో ఎదుగుతుంది. తన తోటి స్త్రీల కోసం పని చేయడమే కాక చివరకు తన దేశ భవిష్యత్తు కోసం తానే ఉద్యమకారిణిగా మారడానికి సంసిధ్ధమవుతుంది. ఆమెలో విద్య తెచ్చిన ఈ మార్పు నిజంగా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సరైన సామాజిక అవగాహనతో స్త్రీలు ఒకటిగా నిలబడితే తమ ఉన్నతి కోసం తాము ఎంత పని చేయవచ్చో, ఎందరికి స్ఫూర్తిదాయకం కావచ్చో అమీనా జీవితం చెబుతుంది. ధనమనే మోహంలో విలాసాల మోజుతో విద్యావంతులైన స్త్రీలు సోమరులుగా బ్రతుకుతున్న సమాజంలో స్త్రీ విద్య, స్త్రీ చైతన్యం, స్త్రీల ఐకమత్యం ఎన్ని ఆశాజనకమైన మార్పులు తీసుకురాగలవో, దేశ భవిష్యత్తుకు ఎటువంటి పునాదులు వేయగలవో చర్చించిన గొప్ప నవల అమీనా. ఇది చదువుతున్నంత సేపు ఇది కేవలం నైజీరియాలో స్త్రీల జీవితం అనిపించదు. మన చుట్టూ మనం చూస్తున్న స్త్రీల నిస్సహాయత, అవిద్య, బేలతనం, అన్నీ ఆ పాత్రలలో కనిపిస్తాయి. కాని తమ జీవితాలను మెరుగుపర్చుకోవడానికి తాము ప్రయత్నించాలనే అవగాహన వారిని శక్తివంతమైన మనుష్యులుగా మారుస్తుంది. స్త్రీ చైతన్యం నేటి సమాజ అవసరం. దాన్ని గొప్ప ఉద్యమ స్ఫూర్తితో ప్రస్తావించిన నవల అమీనా. ఈ మధ్య కాలంలో వచ్చిన గొప్ప అనువాద నవల ఇది. ఇందులో ఎన్నో జాతీయ అంతర్జాతీయ సమస్యల పై చర్చలుంటాయి. అవి ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను పరిచయం చేస్తాయి. “అమీనా” చాలా విలువైన సమాచారం ఇచ్చే స్ఫూర్తిదాయమైన నవల. చాలా గంభీరమైన అంతర్జాతీయ విద్రోహాలను సరళమైన భాషలో విపులంగా చర్చించే ప్రయత్నం రచయిత చేయడం వలన ఇది తప్పకుండా అందరూ చదవవలసిన పుస్తకం.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

Leave a Reply