ఔను…నేను, బానిసకొక బానిసను!

ఈ దేశచిత్రపటం మీద
మాయని మచ్చ ఏదైనా మిగిలి ఉందంటే
అది ఖచ్చితంగా 
నా ముఖమే అయి ఉంటుంది!

నెత్తురోడుతున్న అనామక దేహం 
తెగిపడుతున్న నాలుకలు 
విరిగిపోతున్న పక్కటెముకలు 
చిధ్రమైపోయిన ఆడతనం 
అంతెందుకు…
పూటకొక్కసారైనా అత్యాచారానికి గురయ్యే
బలహీన నిర్జీవ దేహం నాదే
నేను రెక్కలు విరిచేయబడిన పక్షిని!

వెలివాడలో పుట్టినందుకు
మూడుపదులు నిండకుండానే
నేలరాలే అభాగ్యురాలిని నేనే
ఔను నేను రేప్ చేయబడేందుకే
పుట్టించబడినదాణ్ణి!

ఇంత విశాల భూప్రపంచం మీద
నాకు రక్షణనిచ్చే గుంటెడు జాగా కరువే
నేను గడపదాటి కాలు బయటపెడితే
మదమెక్కిన కులంకుక్కలు
నన్ను కడుపార ఆరగించేదాకా
కామించక మానవు!

నేను తిరిగి యిల్లు చేరుతాననే
ఏ గ్యారెంటీ లేదు!
నా అరుపులు ఏ దేవుడూ వినలేడు
నా ఆక్రందనలు ఎవరి చెవికీ సోకవు
నాది అరణ్యరోదన!
నాది ఆధునిక అంటరాని ఆవేదన!

నేను దిక్కులేని శవాన్నయ్యాకగానీ
రాజ్యమూ, ఖాకీబలగము మేల్కొనవు!
నా అంత్యక్రియలను కూడా
గుట్టుచప్పుడు కాకుండా జరిపించే దేశం!

ష్…చప్పుడు చేయకండి!
మీకు బిడ్డలు, తల్లులు, చెల్లెల్లు ఉన్నారు కదా
కాస్త సిగ్గుపడండి!!

(మనీషా తదితర దళిత బిడ్డెల యాదిలో…)

ఆధునిక దళిత జీవితాన్ని అక్షరీకరిస్తున్న పదునైన కలం డా.పసునూరి రవీందర్. కవిత్వం, కథ, విమర్శ, పరిశోధన ప్రక్రియల్లో బహుజన దృక్పథంతో రాణిస్తున్నారు. తన అవుటాఫ్ కవరేజ్ ఏరియా కథా సంపుటితో తెలంగాణ నుండి కేంద్ర సాహిత్య అకాడెమి యువపురస్కారం అందుకున్న తొలి రచయిత. 'లడాయి', 'ఒంటరి యుద్ధభూమి', 'తెలంగాణ ఉద్యమపాట', 'గ్లోబలైజేషన్ సాహిత్య విమర్శ', 'ఇమ్మతి', 'పోటెత్తిన పాట' వంటి పలు పుస్తకాలు వెలువరించారు.

Leave a Reply