నెమరువేతల కాలం

1
చాలా నెమరువేతల్ని ఒదిలి వెళ్ళావు
వేనవేల మిణుగుర్లుగా…
ఈ వనమంతా…

2
నీ జ్ఞాపకాలు గాలిని స్వర్ణమయం చేసే
దీగూడు దీపాలు

నా జీననసందర్భాలన్నీ నీ సహచర్యంతో
ముడిపడినవి కదూ
నా కదలికలపై నీ స్నేహ సంతకం ఓ ప్రత్యూషం
ఈ అరణ్యం నిజానికి నీ ప్రతిబింబం

3
ఒంటినిండా బట్టలు లేని
ఆ ఆదీవాసి పసివాడి ఒంటికంటుకున్న మట్టి
నీ ఆలీవ్ గ్రీన్ యూనిఫాం లాగే అనిపిస్తుంది

అడవిలోకి
వేటకోసం వచ్చిన గోండు తాత
దేహ ముడతలు
ఆగ్రహంలోనో దుఃఖంలో ఉన్నపుడు పడే
నీ భృకుటిలా అనిపిస్తాయి

ఆదివాసీ ఉత్సవాల్లో యువకులు ఊదే బూర
నీ విప్లవ నినాదంలా ఉంటుంది

గుట్టలనూ పొదలనూ రాళ్ళనూ దాటుకుంటూ
కదులుతున్నపుడు
నీ కదలికల చురుకుదనం వెంటవస్తుంది

వాళ్ళు బుట్టలు నేస్తున్నపుడు
పోడులో నాట్లువేస్తున్నపుడు
జంతువులను కాపు కాస్తున్నపుడు
నీ పరిసర స్పృహ గుర్తొస్తుంది

ఉషస్సంధ్యల మధ్య కాలం విస్తరిస్తున్నపుడు
ఆచరణకీ అధ్యయానానికీ మధ్య నువ్వు ఏర్పాటు చేసుకున్న పరిమితులు గుర్తొస్తాయి

యుధ్ధంలో గాయపడినపుడు
నొప్పితో నీలా సంభాషిస్తాను
నీలా ఓపికగా గాయాలను ఆధినంలోకి తెచ్చుకుంటాను

తినడానికి లేనపుడు ఆకలినీ
దాహంగా ఉన్నపుడు దాహాన్నీ
నీలా అనునయించడం నేర్చుకున్నాను

చెంచులు బాణం ఎక్కుపెట్టినపుడు
నీ ఆయుధ నైపుణ్యం కళ్ళముందు కదలాడుతుంది
లక్ష్యం తప్పని నీ గురి గుర్తొస్తుంది

భళ్ళున తెల్లవారినపుడు
యుధ్ధం పెట్టే ప్రతి పరీక్షకూ ముందు నీ సంసిధ్ధత
మదిలో మెదులుతుంది
అడవి రాత్రి చీకటి పరదాలను కప్పుకున్నప్పుడు
అలికిళ్ళకు తగ్గట్టు తెరుచుకునే నీ కనుల సున్నితత్వమూ,
గాఢ నిద్రని జయించిన నీ సంయమనమూ
నాకు ఆదమరుపులో అప్రమత్తత నేర్పాయి

నీ సమాయత్త ఛాయలతో ఇక్కడి తావులన్నీ నిండిపోయాయి
ఆ కోకిల గానంలో నీ పాటలూ,
సెలయేటి రాగంలో నీ మాటలూ,
గాలి తరంగాల్లో నీ కదలికలూ
నిశిరాత్రి నీరవంలో నీ మౌనమూ
తొలిపొద్దు పొడుపుల్లో మెలుకువా
అన్నింటిలో
నీ జాడలెప్పుడూ కనబడతూ ఉంటాయి

అడవితల్లి ఒడిలో లాలించబడిన నీ వ్యక్తిత్వం
ఆకాశమంత వాస్తవం
మన సాంగత్యం ఒక సామూహిక నిజం
సమూహ పథంలో కష్టాలకు ఎదురునిలవడం నేర్పిన విద్యుల్లతా
నీవు దారిలా పరిచిన ఈ వెలుతుర్నీ
చీకటి కూడా ప్రేమించడం నేర్చుకుంది…

నేర్చిన కళలన్నింటినీ నక్షత్రాలకు పంచుతున్నది
నక్షత్రాలు పండువెన్నెలతో
సమీక్ష జరుపుతున్నాయి
పండువెన్నల అరణ్యంపై పరుచుకున్నపుడంతా
మిణుగుర్లు నీ గురించిన పాఠాలు స్వీకరించి కీటకాలకు బోధిస్తున్నాయి

కీటకాలు ఆకులతోనూ ఆకులు పుష్పాలతో పుష్పాలు ముళ్ళతోనూ
ముళ్ళు సీతాకోకలతోనూ ముచ్చటిస్తున్నాయి

ఈ తతంగాన్ని విన్నపుడంతా నా పెదవి మీద నవ్వు అప్రమేయంగా తళుక్కుమంటుంది
ఒకరిలో ఒకరు విస్తరించుకోవడం అంటే ఏమిటో
నిన్నూ అరణ్యాన్ని చూసి నేర్చుకోవాలి…

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

One thought on “నెమరువేతల కాలం

  1. నిన్నూ,. అరణ్యాన్నీ చూసి నేర్చుకోవాలి

Leave a Reply