నువ్వు వెళ్ళిపోయాక…

ఎవరో ఒక కవి
నిన్ను పల్లవికట్టి పాడుతాడు

చెల్లాచెదురైపోయిన పిట్టల్ని
పిలుచుకొచ్చేందుకు
నీ పాటను నేర్చుకుంటుంది అడవి

కూడలిలో నీ పోస్టర్ వద్ద
ప్రతి బిడ్డకు
తన తల్లికి చేసిన ప్రమాణం గుర్తొస్తుంది

నీ సమాధిపై మొలిచిన గడ్డిమొక్కలు
గాలి వీచినప్పుడల్లా పువ్వులు రాలుస్తూ
నిన్ను నిద్రపోనివ్వవు

నువ్వు నీళ్ళు పోసి పెంచిన
రోడ్డు పక్క చెట్టు
ప్రతి ఉదయం నీ జ్ఞాపకాలతో మేల్కొంటుంది

ఇంటి గేటు వరకూ వచ్చాక
నువ్వు లేవని గుర్తొచ్చి
నిశ్శబ్దంగా మరలుతాడు సూర్యుడు

నీ పేరు ఎప్పుడు
విశేషణంగా మారిపోయిందో
నీకు తెలియదు
కొత్తగా పుట్టిన ఒక నక్షత్రానికి
నీ పేరు పెట్టిన విషయం కూడా

విచిత్రంగా
నీ శతృవులెవరూ నిన్ను మర్చిపోరు
నువ్వు వెళ్ళిపోయాక కూడా
పొలమారకుండా నీకు ఒక్క పూటా గడవదు

నీ మరణం
ఆరిపోతున్న మంటను ఎగదోస్తుంది
వెలుగు కోసం ఎత్తిన నీ పిడికిళ్లు
విత్తనాలవుతాయి

చావు కేవలం ఒక విరామమన్న
నీ మాటల్ని
టైం లైన్ మీద రాసుకుంటుంది భూమి

జననం: ఒంకులూరు, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, ఉపాధ్యాయుడు.  వివిధ పత్రికల్లో కవితలు, అభినయ గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

Leave a Reply