నువ్వు రిటైరయ్యాక ఏం చేయాలంటే..!

అవును… నీ ఉద్యోగ జీవితం ముగిసింది
ఇక నుంచీ నువ్వు పొద్దు పొద్దున్నే లేచి… కష్టపడి ఫలహారం తినేసి.. ఇరవై కిలోల అన్నం డబ్బా  మోసుసుకుంటూ.. ఆఫీసులో ఖాళీ చెయ్యఖర్లేదు
బస్సుల్లో భారంగా ఇంటికి అలిసి చేరనక్కర లేదు
మరి ఎట్లా గడిపేది కాలమంతా అంటావా…?  నువ్వు సోషల్ మీడియాలో చెప్పినట్లే ..ఏముంది.. ఏమోయ్ బ్రేక్ ఫాస్ట్ ఏంటీ.. 
ఏమోయ్ లంచ్ ఏంటీ…?
ఏమోయ్ నాలుగ్గంటల స్నాక్స్ ఏంటీ?
ఏమోయ్… డిన్నర్ కేంటీ
ఆకలో య్… ఆకలాకలి… అంటూ వంట బెత్తంతో తరిమి తరిమి తరిమేసి, ఆమె చేసింది ఎప్పటిలా తినేసి… పడుకునేసి.. లేచేసి, ఈవెనింగ్ వాక్ లో అరిగించుకునేసి… మళ్ళా రాత్రి కూడా తినేసి, బ్రేవ్ మని తేన్చేసి, మళ్ళీ పొద్దున్నే లేచేసి..
ఒక రెండు సీరియళ్ళు… మరొక రెండు సినిమాలు చూసేసి… కళా తృష్ణ తీర్చేసుకుని,   ఎఫ్.బీ, వాట్సాప్, ఇన్స్టాలో వేళ్ళు స్క్రోల్ చేసేసి,
దోస్త్ భార్య కడుపులో అల్సర్ తగ్గిందో లేదో అని గొప్ప మానవత్వంతో తెలిసేసుకొని,
మధ్యాహ్నపు మత్తు నిద్రలో జోగేసి… లేచేసి
చాయ్ తాగేసి ఇక ఫిట్ నెస్ కోసం ఈవెనింగ్ వాక్ చేసేసి… టెన్నిసో, బ్యాడ్మింటనో ఎగిరెగిరి ఆడేసేసి… దోస్తులతో ములాఖాత్ లు.. చాయ్ పాయింట్ లో వేడి వేడి చాయ్ లు
పాటలు, గజళ్ళు… ఆహా.. ఒహ్హో హోవ్… వావ్ వినేసి రాతిరి పార్టీల్లో తాగి తందనలాడేసేసి..గంభీరంగా రాజకీయాలు, సాహిత్య చర్చలూ చేసేసి… రాత్రి ఇంటికొచ్చి డిన్నర్ చేసేసి.. పన్లో పని… ఒక రెండు పోర్న్ లు  రహస్యంగా చూసేసుకుని
హాయిగా పడుకునేసేసి పొద్దున్నే పెద్ద మనిషి మొహమేసుకుని లేచేస్తే రిటైర్మెంట్ కాలం అంతా హాయిగా గడిచిపోతుందని… రిటైర్మెంట్ ముందు రోజు నీ ప్రకటన ఇదేగా ?
***
రిటైర్ అయ్యాక కూడా నీ స్వార్థ మేనా..
నీ రిటైరమెంట్ ప్లాన్ లో ఏదీ నీ సహచరి ?
***
నేను చెబుతున్నా విను
పని స్థలంలో నువ్వెంత బానిస చాకిరీ చేసావో..
నీ సహచరి కూడా రెట్టింపు చేస్తూనే ఉంది.
తన పీజీ సర్టిఫికెట్లు నీ ఫోటో ఫ్రేమ్ కింద దాచేసి, హౌస్ వైఫ్ గా కాదు హౌస్ ఖైదీగా మారిపోయి,
రోజుకి పన్నెండు గంటల పనిదినాలుగా మారిపోయి… నువ్వాఫీసుకు పరిగెట్టడానికి తాను సూర్య… చంద్రోదయాల మధ్య కాలమంతా.. పరిగెడుతూనే ఉంది.
కుటుంబాన్ని మోయడం కోసం పరిగెత్తే నీ పాదాల కింద వొత్తిడి తానైంది
నీకు వారసుల్ని ఇవ్వడం కోసం, తన దేహ కర్మాగారంలోని గర్భాశయంలోపల… బయటా కుట్లు వేసుకుంటూ… విప్పుకుంటూ ఉండిపోయింది.
తన అసిడిటీలు, మైగ్రేన్లు
నెలసరి ఆగిపోయినాక కూడా ఆగి ఆగి అవుతూ భయపెట్టే రక్తస్రావాలూ…
రొమ్ముల్లో గడ్డలూ క్యాన్సరో కాదో తెలుసుకునే భయపు బయాప్సీలూ అన్నీ దేహంలో కుత కుతా ఉడుకుతున్న లావాలా  దాచుకుంది.
రోజొక కొత్త వంటగా… నీకు చేసే వంటకి మంటగా  మారిపోయింది.
నీ ఆరోగ్యం నిద్రా తానైంది.
నువ్వు ఆరోగ్యంగా రిటైర్ అవడానికి తాను అనారోగ్యాల పుట్టగా మారిపోయింది
నీతో పాటు నీ వాళ్ళ బాధ్యతలని బరువుగా గుండె కొక్కాలకి మోసుకుంటూ తిరిగింది. 
వాళ్లంతా ఆమె నో యూజ్ & త్రో టిష్యూ పేపర్ గా చూస్తే మౌనంగా భరించింది.
ఆదర్శ కోడలుగా మరి ?
***
ఆమె ఇంకా ఏమేమి చేసింది ?
తన విరిగిన కలల్ని అందంగా అతికించుకుని,
నీ ఇంటి వాకిలికి ఆకుపచ్చని తోరణంగా కట్టింది.
నీ శ్వాసకి తన ఊపిరి తిత్తులు ఇచ్చింది.
రాత్రింబగళ్ళు నీ ఇంటికి తానే నింగీ నేలా రెండూ అయింది.
తాను నీకు… నీ వాళ్ళకి చేసి చేసీ… మనిషే అరిగిపోయింది.
తన అరిగి విరిగిన ఎముకలని నీ ముందు ఎప్పుడూ చప్పుడు చేయనివ్వలేదు.
నీ ముందు నొప్పి అనలేదు.
తన వెన్నుముక నరాలను నీ ఇంటి చుట్టూ.. తాడులా చుట్టి ఛాతీ ఎముకల గూడు మధ్య గుండెలా భద్రంగా కాపాడుకుంది.
వృద్దాప్యంలో గతి తప్పిన తన హృదయాన్ని  రాత్రుళ్ళల్లో  ఏ డాబా మీదో… పెరట్లోనో రహస్యంగా శృతి చేసుకుని ఉదయానికల్లా నీకోసం సర్దేసేది.
***
నీ కలలన్నీ తీరాయిగా !
ఇక ఇప్పుడు నువ్వేం చేయాలి?
చెప్తా విను
ఆమె ముందు మోకరిల్లాలి
ఆమెని కొన్ని వినయంగా అడగాలి
నీ రిటైర్మెంట్ కలలేమైనా ఉన్నాయా
నువ్వూ ఇంటి పని నుంచి రిటైర్ కావాలని అనుకుంటున్నావా అని
ఎక్కడికైనా యాత్రలు చేయాలనుకుంటున్నావా అని
నాలా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నావా అని
అవును… ఆమె నిద్రపుచ్చిన కలలతో ఇప్పుడు నువ్వు మాట్లాడాలి
***
నీ ఆండ్రోపాజ్ కి ముసుగేసేసి,
ఆమె మెనోపాజ్ ని వెక్కిరించకు
నీ నెత్తిన వెంట్రుకలు రాలి బట్టతల అయినా
తడి కంకర సిమెంట్ ని తిప్పే గుండ్రని టాంకులాంటి బాన పొట్టను, వేలాడుతున్న నీ మొఖపు ముడుతలను మాస్కు ల్లో… ముగ్గు బుట్టను… తెల్ల మీసాలను రంగుల్లో దాచేసుకుని..
ఆమె గుండెలు సాగిపోయాయని
చర్మం నునుపు.. గర్భసంచి  బిగువు సడలిందని.. వొళ్ళు కొవ్వెక్కి పోయిందని… ఆమె లోపలా బయటా ఎండిపోయిందని
ఆమె దేహాన్ని బాడీ షేమింగ్ చేయకు
ముందు నీ సెక్స్ హర్మోనులే పనిచేయక… నీ మర్మాంగాలు స్థంభించక వాలి వడలి పోతుంటే…
ఆమె మాత్రమే ఇక శృంగారానికి పనికిరాదని పక్క చూపులు చూడకోయ్
నీ ముసలి ముడుతల మొఖాన్ని అద్దంలో చూసుకుంటూ మురిసిపోవడం కాదు
అలసిన ఆమె దేహాన్ని ఇకనైనా ఇకనైనా గౌరవించు… ప్రేమించు
***
అవయవ దానం అంటూ గొప్పగా విల్లు రాయబోతావు కానీ
ఆమె సంగతేంటి ?
గుండె, గర్భసంచి, మెదడు, కళ్లు,కాళ్ళు చేతులతో పాటు తన సమస్త అవయవాలను.. ఆత్మతో సహా నీ ఇంట్లో కాలు పెట్టినప్పుడే నీకు, నీ కుటుంబానికి దానం చేసేసింది.
కానీ ఆమె ఎప్పుడూ విల్లు రాయలేదు
***
ఏమి చేయాలంటావా ?
నీ రిటైర్మెంట్ ప్లాన్ లో ఆమెనెలా కలుపుకోవాలంటావా?
చూడు… ముందు నీ కడుపు నింపుకోవడానికి నీ చేతులు వాడుకో
నీ చేతులు నోటి దాకా పోవడానికి ఆమె చేతులు నరకడం ఆపేయ్
వంటగది కేమీ జెండర్ వివక్ష లేదు
వంట గది ఏమీ ఆడది కాదు
అది నిన్ను కూడా రానిస్తుంది… నిన్నేమీ గెంటేయదు
***
ఇక…
మెనోపాస్ డిప్రెషన్ లో ఉన్న ఆమె ఎందుకో ఉండి ఉండి దుఃఖిస్తుంది
ఆవేశపడుతుంది… ఒంట్లోని వేడి ఆవిరుల హార్మోనులతో ఉడికి పోతూ ఉంటుంది
ఆమె దేహం ఆడే హర్మోన్ల ఆటను కప్పేసి ఆమెని ఓ కోపధారిగా, గయ్యాళిగా ముద్ర వేసే కుట్ర చేయకోయ్
ఆమె దేహం మనస్సు స్వాధీనంలో లేక  తాయి మాయి
అవుతూ ఉంటుంది.
ఇంత అవుతూ కూడా ఆమె నీ గురించే ఆలోచిస్తుంది.
ఏం చేయాలంటావా..?
ఆమె చేయి పట్టుకో
ఆమె రోజూ చాకిరీ చేస్తూ ఇంట్లోపల చేసే రన్నింగ్ కాదు కానీ…ఆమెనలా ఈవెనింగ్ వాక్ కి తీసుకెళ్ళు
ఆమె చూడాలనుకున్న కొత్త సూర్య చంద్రులను చూడనివ్వు
ఎప్పుడూ నీ డైటేనా… కాస్త ఆమెని కూడా          ఏమైనా తింటావా అని అడుగు
ఆమె కంచాన్ని నువ్వు నింపు
ఆమె మంచాన్ని నువ్వు సర్దు
ఆమెని హాయిగా నిద్రపోనివ్వు
ఆమె ఆపేసిన బొమ్మలకి రంగులు… కుంచెలు తెచ్చివ్వు
ఆమె మూసేసిన కలాన్ని తెరిచి… సగం రాసిన కవిత్వాన్నో, కథనో, నవలనో పూర్తి చేసుకోనివ్వు
రాసుకోవడానికో… పాడుకోడానికో ఆమెకో స్వంత గదిని కట్టివ్వు
లేదా ఆమె కట్టుకుంటుంటే ఆపకు
ఆమె దేహంలోకి వేళ్ళూనుకు పోయిన నీ దేహపు పారాసైట్ ను… ఆమె పెకిలించి అవతల పారేస్తుంటే.. చూడూ గమ్మున బయటకు వచ్చేయ్
నువ్వు ఆమె దేహంలోని రక్త మాంసాలను మూలుగతో సహా పీల్చి పడేసింది చాలిక
ఎప్పుడైనా చేసావా ఇలా… ఇప్పుడు చెయ్యు
***
ఆమెనే ఒక సముద్రం కదా…! ఆమె వొడ్డుని ప్రశాంతంగా ఉంచు
లేదా ఆమెకో సముద్ర తీరాన్ని ఇవ్వు
***
ఆమె మిగిలిన కాలాన్ని నీరసంగా అయినా ఆమెనే తీసుకొనివ్వు
మెల్లిగా ఆమె నుంచి దూరానికి జరిగి చూడు
ఆమె ఓ మహాద్భుతంగా మారకపోతే చూడు
ఏంటీ… ఇవేవీ చేయలేవూ?
సరే మరి
ఇక ఆమెని తోసేసి నువ్వు ఆక్రమించుకున్న ఆమె ఆకాశాన్నించి తప్పుకో
లేదా
ఆమె రహస్యంగా సృష్టించుకున్న రెండో ఆకాశాన్ని ఒప్పుకో…

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

One thought on “నువ్వు రిటైరయ్యాక ఏం చేయాలంటే..!

  1. అద్భుతంగా వుంది. చాలా బాగా రాశారు. 👌💐🌹💐

Leave a Reply