నువ్వక్కడ

నువ్వక్కడ
శిథిలాల కొమ్మలకు పూసిన
జ్ఞాపకాలపూలను
ఏరుకోవడానికే వెళ్ళుంటావు
వెళ్ళీవెళ్ళంగానే
ఆ నేల కింద దొరికిన
అమ్మ కన్నీటి ముత్యాలను
జేబులో వేసుకుని
నాన్న నులివెచ్చని స్పర్శను
ఊహలలో కౌగిలించుకుని ఉంటావు
బ్రతుకు సముద్రంలోని
కెరటాలదెబ్బకు
బీటలు వారిన
ఒంటరి పడవొకటి
ఎదురుచూపుల తెరచాపై
నీకు చోటిచ్చి ఉండి ఉంటుంది
గోడకు వేళ్ళాడే పాతకాలెండర్
గాలికి ఆడుతూ
గతస్మృతులను గొంతెత్తి పాడిందా
కాలాగ్ని సెగకు
మసకబారిన కలలు
నీ గుండె పొరలను ఒలిచాయా
ఎన్నాళ్ళకో వెళ్ళావు కదా
గాయాలపై ముసిరిన
తలపుల ఈగలను తోలుకుంటూ
ఇంటి మరమ్మతు కోసం
ఆలోచనల కసరత్తు చేసి ఉంటావు
కూలిపోతున్న పైకప్పును
చిటికెనవేలుపై పట్టుకుని
ఆ స్ధానంలో
ఒక ఆకాశాన్ని నిలబెట్టాలనే
నీ ఆశ
ఎన్నో ఏళ్ళ నుండి
అల్లకల్లోలాలతో తలపడుతూ
అల్లుతున్న వసంతస్నప్నంతో
ఏకాకి శిశిరంలో
చిరుదివ్వెను వెలిగించాలనే
నీ ఆకాంక్ష
పరవాలేదు
నీ కోరిక బీజం
ఏదో ఒకనాడు పచ్చగా మొలకెత్తకపోదు
పురాతన పుస్తకంలోని
అక్షరాలను కళ్ళకద్దుకుంటూ
కొత్త పుటలలో
ఆ పరిమళాలను ప్రతిబింబించడమే కదా
జీవితమంటే

ఊరు విశాఖపట్నం. కవయిత్రి. కథలు, కవిత్వం, నవలలు చదవడం ఇష్టం. కవిత్వమంటే మరింత మక్కువ. వివిధ పత్రికల్లో కవిత్వం ప్రచురితమైంది. త్వరలో ఓ కవిత సంకలనం రానుంది.

4 thoughts on “నువ్వక్కడ

  1. ఏదో ఒక నాడు పచ్చగా మొలకెత్తక పోదు

  2. చాలా బాగుంది. జ్ఞాపకాల పేజీల నిండా కరిగిపోయిన ఆనంద భాష్పాలే, వలికి పోయిన కన్నీళ్లే.

  3. అద్భుతమైన అభివ్యక్తి. అవును…. జీవితమంటే అదే…. ధన్యవాదాలు..

Leave a Reply