కారంచేడు మారణకాండ(1985లో)కు ప్రతిచర్యగా పోటెత్తిన ఉద్యమం నుండే తెలుగునాట దళితవాదం ఒక కొత్త ప్రాపంచిక దృక్పథంగా అభివృద్ధి చెంది, దళితవాద సాహిత్య ఉద్యమం వెల్లువగా వచ్చింది. అప్పటికి నేను మహిళా జనజీవన అధ్యయనంలో తలమునకలుగా వున్నాను. ఉత్పత్తి రంగాలలో శ్రమ దోపిడీ, పీడనకు గురవుతున్న కర్షక కార్మిక వర్గం వలెనే స్త్రీలు ఉత్పత్తి రంగంతోపాటు పునరుత్పత్తిలోనూ దోపిడీ, పీడన, అంతులేని హింసకు గురవుతున్నారని తెలుసుకొంటూ దిగ్భ్రాంతికి, ఆందోళనకు లోనవుతూ మహిళా ఉద్యమాలతో మమేకమవుతున్న కాలం అది. స్త్రీలు కావటం అనేది వివక్షకు, హింసకు కారణం అయినట్లుగానే దళితులు కావటంవల్ల కారంచేడులో అంతమంది మూక దాడికి, హత్యకు గురికావటం సహజంగానే నన్ను కలవరపరిచింది. ఆ నాటి నుండి దళిత జీవన సమస్యల అధ్యయనం నా ఆసక్తులలో ఒకటి అయింది.
అటు స్త్రీవాదం, ఇటు దళితవాదం కూడా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ, వాద వివాదాలకు గురిఅవుతూ విస్తరించిన 90వ దశకపు ఉద్వేగ చరిత్రలో దళిత వాద సాహిత్య ఉద్యమం, నాకు తెలియని ఒక కొత్తమానవ సమాజాన్నిరక్తమాంసాల చలన చైతన్యాలతో చూపించి నా అవగాహనను విస్తృతం చేసింది. నిస్సందేహంగా అది అంతకుముందే సాహిత్య విద్యార్థిగా మాలపల్లి వంటి నవలలు, గబ్బిలం వంటి కావ్యాలను చదవటంవల్ల పొందిన దళిత స్పృహ కంటే భిన్నమైనది. విశిష్టమైనది. భిన్న సామాజిక వర్గాల నుండి అస్తిత్వ చైతన్యంతో, ఆత్మగౌరవ స్పృహతో సాహిత్యం వచ్చేకొద్దీ జీవితాన్ని ప్రతిఫలించే సాహిత్య స్వభావం సమగ్రతను పొందటమేకాదు, ఒకరి గురించి ఒకరు తెలుసుకొనే కొద్దీ ఆయా సామాజిక వర్గాల మధ్య స్నేహపూర్వక సంభాషణకు అవకాశం పెరుగుతుంది.
ఆ రకంగా ప్రజాస్వామిక మానవ సంబంధాల నిర్మాణానికి, ఆచరణకు దారులు వేసిన ఉద్యమంగా దళితవాద ఉద్యమం పట్ల, దళితవాద సాహిత్యం పట్ల అభిమాన ప్రకటకైనా, అభిప్రాయ ప్రకటకైనా ‘అవుట్ సైడర్’ ని కావటం వల్లనో, ఇతరేతర సాహిత్య వ్యావృత్తుల వల్లనో అవకాశాలు నాకు అంతగా కలగలేదు. అయినా దందహ్యమాన దళిత దశాబ్దిలో గుండె డప్పు కనకయ్య కథల పుస్తకం ‘మేమిట్లుండం’(1998) కు ముందుమాట వ్రాయటం, ఎండ్లూరి సుధాకర్ ‘మల్లెమొగ్గల గొడుగు’ (1999) ఆవిష్కరణ సభలో (రాజమండ్రి) మాట్లాడటం, ఆ తరువాత సమీక్ష వ్రాసి ప్రచురించటం (వార్త ఆదివారం అనుబంధం), నాకు చాలా ఇష్టమైన జ్ఞాపకాలు. అప్పుడప్పుడు దళిత కవిత్వం పై, దళిత స్త్రీవాద కవిత్వంపై సభలలో మాట్లాడినా, అస్తిత్వవాద సాహిత్యం గురించో స్త్రీవాద సాహిత్యం గురించో వ్రాసినప్పుడు అందులో భాగంగా చర్చించినా దళిత సాహిత్యంపై ప్రత్యేకంగా వ్రాయలేదే అన్న అసంతృప్తి నాలో మిగిలే ఉంది. కొలిమి పత్రిక మిత్రులు దళిత సాహిత్యం మీద ప్రతినెలా వ్రాస్తారా అని అడిగినప్పుడు సాహసమే అనిపించినా అంగీకరించటానికి కారణం అదే.
తెలుగునాట దళిత ఉద్యమ చరిత్ర, సాహిత్య చరిత్ర, సిద్దాంతాల పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని 1985 వరకు వచ్చిన దళిత సాహిత్య స్వభావాన్ని స్థూలంగా నిర్ధారించుకొని, 1985 తరువాత దళిత సాహిత్య ప్రత్యేకతను నిర్దిష్ట రచనల ఆధారంగా నిరూపించటం ఈ శీర్షిక నిర్వహించటానికి నేను ఎంచుకొన్న పద్ధతి.
1.
మనుస్మృతి గురించి ఎక్కువ మాట్లాడుకుంటుంటాం. కానీ మనువాద భావజాలాన్ని మానవ జీవిత సంబంధాలలో చొప్పించి, నిరూపించి అది చాలా సహజమైంది అన్నట్లుగా ఒక సామాజిక సమ్మతిని సృష్టిస్తూ, వ్యాపింప చేస్తూ వచ్చిన ప్రాచీన సాహిత్యం పై మనం మరింత మాట్లాడుకోవలసి ఉంది. 1991 నుండి బోయి విజయభారతిగారు పురాణాలు కుల వ్యవస్థ స్థిరీకరణలో నిర్వహించిన పాత్ర గురించి విస్తృతంగా చేసిన చర్చ ఒకటే ప్రధానంగా కనిపిస్తుంది. 2000ల సంవత్సరంలో డాక్టర్ పిల్లి శాంసన్ ప్రచురించిన “దళిత సాహిత్య చరిత్ర” పుస్తకంలోను, ఆచార్య బన్న అయిలయ్య వంటివారు విడి వ్యాసాలలోనూ నన్నయ నుండి ప్రారంభమైన ప్రాచీన లిఖిత సాహిత్య చరిత్రలో వర్ణవ్యవస్థ గురించి, దళితుల స్థితిగతుల గురించి చేసిన పరిశీలనలు, విశ్లేషణలు కొన్ని ఉన్నాయి. అయితే ఇది ఇంకా విస్తృతంగా, సూక్ష్మం గా చేయవలసిన పని. ఆ పని ప్రస్తుతాంశం కాదుగానీ, ప్రస్తుత చర్చను ఆముక్త మాల్యదలోని రెండు పద్యాలతో ప్రారంభించటం సముచితంగా ఉంటుందనుకొంటున్నాను.
“కల( డొకరుండు పేరుకొన ( గాని కులంబు మదీయభక్తు( ,డి
య్యిల మును వాఁడు వామనత నే వసియింపనొ పుణ్యభూమి, నం
దులకొక యోజనత్రయపు దూరపుటూర వసించి, బ్రాహ్మవే
ళల ( జనుదెంచి, పాడు మము లాలస మంగళ నామ కైశికిన్.
ఆహరహంబు నమ్మహాత్ముండు
జాత్యుచిత చరిత్రమ
మత్ప్రీత్యర్థం బూ(ది తనదు హృదయము శుచితా
నిత్యంబుగఁ దత్తను సాం
గత్యము మసిపా (త మానికంబై యొదుగున్
ఆముక్త మాల్యద ఆరవ ఆశ్వాసంలో మాలదాసరి కథలోని మొదటి పద్యాలు ఇవి. ఈ పద్యాలు వ్రాసింది శ్రీకృష్ణదేవరాయలే అయినా కావ్యంలో ఈ కథ చెప్పినవాడు శ్రీమహావిష్ణువు. విన్నవాడు విష్ణుచిత్తుడు. రచయిత రాజు. వక్త సాక్షత్తు భగవంతుడు. శ్రోత వైష్ణవ బ్రాహ్మణ భక్తుడు. ఈ ముగ్గురి సంబంధంలో మాలజాతి గురించి అన్యాయమైన అసమ సంబంధాల భావజాలానికి కల్పించబడుతున్న ఆమోదాన్ని గురించి ఆలోచించాలి.
మొదటి పద్యంలో ‘పేరుకొనగాని కులంబు’, రెండవ పద్యంలో ‘జాత్యుచిత చరిత్ర’ అన్నవి కీలకమైన మాటలు. పేరుకొనగాని కులము అంటే చెప్పటానికి కూడా నిషిద్ధమైన తక్కువ కులం. ఆ రకంగా మాల, మాదిగలు చూడకూడని తాకకూడని వాళ్ళు. ఊళ్లకు బహిష్కృతులు. అలాంటి జాతికి చెందిన మాల దాసరిని మహావిష్ణువు ‘మదీయ భక్తుడు’ అని ఎంత సగర్వంగా చెప్పాడో అదే స్థాయిలో అతను తన సంతోషం కోసం ‘జాతికి ఉచితమైన చరిత్ర’ తో ప్రవర్తిస్తున్నాడని కూడా చెప్పటం గమనించవచ్చు. విష్ణువు కానివాడు రాజు కాలేడు అని, రాజు లక్షణం వర్ణాశ్రమ ధర్మ పరిరక్షణ అని కదా మధ్యయుగాల భూస్వామ్య రాచరిక సంస్కృతి చెప్తుంది..!? రాజైన శ్రీకృష్ణదేవరాయలు శ్రీమహా విష్ణువు ముఖంగా భక్తుడిని కదా అని మాలదాసరి అహంకరించి తనజాతికి నిర్దేశించబడిన జీవన విధానాన్ని ధిక్కరించక తనకు ప్రీతిని కలిగించాడని చెప్పటం రాజ్యం అంటే అది మనుధర్మ బద్ధమైనదేనని స్పష్టం చేస్తుంది.
శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1529 మధ్య కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఆముక్తమాల్యద రచనాకాలం 1519. ఆనాటి రాజనీతికి ప్రాతినిధ్యం వహించిన పద్యాలు ఇవి. వర్ణ అసమానతలు సహజమైనవి రాజుకు, విష్ణువుకు కూడా ప్రీతికరమైనవి అన్న సూత్రంపైనే ఆ తరువాతి కథ అంతా నడుస్తుంది. వర్ణ అసమానతలను ప్రశ్నించిన శైవ వైష్ణవ భక్తి ఉద్యమాల నేపథ్యంలో మాల దాసరికి భక్తుడు కావటానికి, భక్తి మహిమ చూపటానికి అనుమతి లభించింది కానీ జాతికుల స్థాయీభేదాల చట్రాన్నిఅధిగమించి కొత్తజీవితం నిర్మించుకొనే వీలు లేకపోయింది. గుడి దగ్గరకు వస్తాడుగానీ గుడిలోకి ప్రవేశంలేదు. ప్రాకారానికి అవతల ప్రదక్షిణాలే. ముఖ్యజాతివాళ్ళకు తొలగితొలగి పోవటమే. శూద్రులెవరైనా దయతలచి పెట్టె ప్రసాదం కోసం, పొసే నీళ్ల కోసం ఎదురుచూపులే. వేదపఠనం నిషిద్ధం కనుక పాటే అతనికి ఆరాధనా సాధనం. ఈ మొత్తం క్రమంలో ఏ అసంతృప్తులకు, ఘర్షణకు లోనుకాకుండా తరతరాలుగా శిక్షణ యీయబడిన జాతికి ప్రతినిధి మాల దాసరి. ఇలాంటి మనుషులలో అసమానతల పట్ల, అవమానాల పట్ల కోపం ఎప్పటినుండి వ్యక్తమవుతూ వచ్చింది? ఆత్మగౌరవ చైతన్య ప్రకటన ఎప్పుడు మొదలైంది ? అంటే సామూహికంగా ఒక ప్రణాళిక ప్రకారం పరిష్కారాన్ని కోరుతూ వ్యక్తమైనప్పుడే తిరుగుబాటు మొదలైందనుకుంటాం.కానీ మనం గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. వ్యక్తం కాకపోవచ్చుగానీ వ్యక్తిగతస్థాయిలో ఆ కోపం, ఆ ధిక్కారం మనిషి అంతరాంతరాలలో అలజడి పెడుతూనే ఉంటాయి. అయితే అవి పైకిరాకుండా రకరకాల నైతిక, సాంస్కృతిక నిషేధాలతో అణచివేయబడుతూనే ఉంటాయి. అనివార్యమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు అవి స్వచ్ఛందంగా బయటకు వస్తాయి.
కృష్ణదేవరాయలు సృష్టించిన మాల దాసరినే చూడండి. దారితప్పి అడవిలో బ్రహ్మరాక్షసుడిని ఎదుర్కొన్న సందర్భంలో అతను భగవంతుడి ముందు, చాతుర్వర్ణ వ్యవస్థ ముందు వినమ్రుడై ఒదిగిఉన్నట్లు కాక స్పందించి ఆలోచించి ఆచరణకు దిగే సంపూర్ణ మానవుడుగా కొత్త అవతారం ఎత్తటం గమనిస్తాం. అందుకు కారణమైనది అతనిలో మేల్కొన్న ఆదిమ ఆదివాసీ జీవనానుభవం. మాల దాసరిని వర్ణిస్తూ రాయలు అతని చేతిలో ఉన్నాయని చెప్పిన బాణాలు రేయింబళ్లు ప్రకృతితో, జంతు జాలంతోటి సహజీవనంలో అత్యంత సహజంగా యుద్ధవీరుడుగా బ్రతికిన అనుభవజ్ఞానపు అవశేషం అనుకోవచ్చు. వైష్ణవం మధ్యలో వచ్చింది. అతని పూర్వపు జీవితవిధానాన్ని పూర్తిగా మార్చివేసి బెదురు బతుకుకు అలవాటు పడేట్లు చేసినది ఆ మతాధికారమే. బ్రహ్మరాక్షసుడు ఎదురుపడి తనను ఆహారంగా తీసుకొనటానికి సిద్ధపడ్డప్పుడు అతను బాణాలతో, చేతులతో ప్రతిఘటించి నిలబడటానికి మాల దాసరి చేసిన ప్రయత్నమంతా సహజ జీవన లాలసతో , మానవ చైతన్య సౌందర్యంతో ప్రకాశిస్తుంది. “ పెనగక ప్రాణరక్షణ ముపేక్షయొనర్చుట పాపము” అన్న జీవన సూత్రంమీద ఆధారపడిన ప్రతిఘటన అది. ప్రాణం కాపాడుకొనటానికి పెనుగులాడవలసినదే. పెనుగులాట లేకుండా ప్రాణరక్షణ పట్ల ఉపేక్ష, ఉదాసీనత జీవ సహజ లక్షణం కాదు. జీవ సహజ లక్షణాన్ని కోల్పోవటం పాపం గా పరిగణించబడుతుంది. బ్రహ్మరాక్షసి వంటి వర్ణవ్యవస్థతో తలపడటానికైనా ఆ సూత్రమే ఆలంబనగా చేసుకోదగినది.
చిత్రంగా వేల సంవత్సరాలుగా, తరతరాలుగా పుట్టుక వల్ల వివక్షకు, అవమానానికి, హింసకు గురవుతూ ఇటు సామాజిక న్యాయం, అటు శ్రమఫలితం దక్కక ఉపాంతీకరించబడిన దళతుల సమస్యను చర్చలోకి తెచ్చిన చైతన్యానికి కారణమైన క్రైస్తవమిషనరీలు భారతదేశంలోకి ప్రవేశించిన కాలం కూడా మాల దాసరి కథ వ్రాయబడిన కాలమే. పోర్చుగీసు దేశస్థుడైన వాస్కొడిగామా 1498 లో తొలిసారి కాలికట్లో అడుగుపెట్టినప్పటికీ పోర్చుగీసువారు సముద్ర తీరప్రాంతాలను ఆక్రమించుకొంటూ గోవా వరకు వ్యాపించి, కోటలు కట్టుకొంటూ ఆర్ధిక, రాజకీయ ప్రాబల్యం పెంచుకొంటూ వచ్చింది మాత్రం ఈ కథను వ్రాసిన శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలోనే. శ్రీకృష్ణదేవరాయలు ఎవరి నుండి ఆధునిక తుపాకులు, అశ్వాలు సంపాదించి సైన్య బలాన్ని పెంచుకొని బీజాపూర్ సుల్తానులను యుద్దాలలో గెలిచాడో, ఆ పోర్చుగీసువారు ఆ సమయంలో కేరళ , తమిళనాడు వంటి దక్షిణ దేశ ప్రాంతాలలోను,గోవా వంటి కొంకణ దేశ ప్రాంతాలలోనూ క్రైస్తవమత మత ప్రచార కార్యక్రమాలు విస్తరించుకొంటూ పోయారు. మతమార్పిడులు ముమ్మరమయ్యాయి. 1516 లో మద్రాస్ లో చర్చి నిర్మించబడింది. ఆ క్రమంలో 17, 18 శతాబ్దులలోనే రాయల సీమ, నెల్లూరు, కృష్ణా జిల్లాలకు అక్కడి నుండి క్రమంగా 19వ శతాబ్ది నాటికి కోస్తా ఆంధ్రకు క్రైస్తవమిషనరీల కార్యకలాపాలు విస్తరించాయి. ఆంధ్రదేశంలో మాల, మాదిగలు లక్ష్యంగా మతమార్పిడులు జరగటం ఎంత వాస్తవమో వాటితో పాటు వాళ్ళు కల్పించిన విద్యా వైద్య సౌకర్యాలు దళితులలో కులమత అణచివేతలకు సంబంధించిన ఆధునిక ఆత్మగౌరవ చైతన్య వికాసానికి దోహదకారులు కావటం కూడా అంతే వాస్తవం.
2.
దళితుల చరిత్రను, దళిత ఉద్యమాలను అధ్యయనం చెయ్యటానికి క్రైస్తవ మిషనరీల రచనలు ప్రధానమైన వనరు అంటారు ప్రొఫెసర్ యాగాటి చిన్నారావు (ఆంధ్రప్రదేశ్ నూరేళ్ళ దళిత ఉద్యమం, సంక్షిప్త చరిత్ర, సమాంతర 1912) ఆ సందర్భంలో ఆయన ‘ఎమ్మా రౌషన్ బుష్ క్లోవ్’ రచనను ప్రస్తావించారు. అది 1899 నాటి రచన. దానికి వివిన మూర్తి చేసిన తెలుగు అనువాదాన్ని 2009లో మనసు ఫౌండేషన్ వారు ప్రచురించారు. ఆ పుస్తకం తెలుగునాట దళిత జీవిత చరిత్రను ఎలా నమోదుచేసిందో ఒక సారి చూద్దాం.
ఇంగ్లీష్ లో ఈ పుస్తకంపేరు “While Sewing Sandals Or Tales of a Telugu Pariah Tribe” తెలుగులో ఇది “చెప్పులు కుడుతూ.. కుడుతూ ..” అనే పేరుతో వచ్చింది. ఈ పుస్తక మూల భాషా రచయిత Emma Rauschenbusch -Clough . పుస్తక అనువాదకులు ఆమె పేరును ‘ఎమ్మా రొషాoబు క్లౌ’ అనిపేర్కొన్నారు. ఎమ్మా 1859లో పుట్టింది. ఇరవై మూడేళ్ళ వయసుకి (1882) కి ఉమెన్స్ బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ ఆఫ్ వెస్ట్ కి మిషనరీ అయింది 1883లో భారతదేశానికి వచ్చింది. అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ యూనియన్ పక్షాన అప్పటికే ఒంగోలులో మిషనరీగా వున్న జాన్ ఇ క్లౌ కు సహాయకురాలిగా పనిచేసింది. 1894లో స్విట్జర్లాండ్ లోని బెర్న్ యూనివర్సిటీ నుండి “ఎ స్టడీ అఫ్ మేరీ ఉల్ స్టోన్ క్రాఫ్ట్ అండ్ ది రైట్స్ అఫ్ ది ఉమెన్” అనే అంశం పై పనిచేసి పిహెచ్ డి డిగ్రీని పొందింది. 1898లో అది అచ్చు అయింది. 1894లోనే ఆమె జాన్ ఇ క్లౌ ను వివాహం చేసుకొంది. అతనితో పాటు ఒంగోలులోనే నివసిస్తూ క్రైస్తవమత ప్రబోధకురాలిగా పనిచేసే క్రమంలో మాదిగలను దగ్గరగా చూస్తూ, వారి జీవితాల గురించి, మత సంస్కృతుల గురించి తెలుసుకొంటూ ఆమె వ్రాసిన పుస్తకమే “చెప్పులు కుడుతూ… కుడుతూ..” పదిహేడేళ్ళుగా తనకు బాగాతెలిసిన మాదిగ స్నేహితుల అనుభవాల జ్ఞాపకాల గాధలను వింటూ వాటన్నిటిని ఒకపద్ధతి ప్రకారం కూర్చటం ఈ పుస్తకం ప్రత్యేకత.
ప్రధానంగా ఇది మౌఖిక కథనాల సంపుటి అయినా చారిత్రక మూలాలతోనూ, సాహిత్య ఆధారాలతోనూ పోల్చి సరిచూస్తూ ఆ మౌఖిక కథనాల సామాజిక సంబద్ధతను నిరూపించటం ఆమె అనుసరించిన రచనా పద్ధతి. అలాగే క్రైస్తవ మతంలోకి మారిన తన కాలపు తనకు పరిచయస్తులు అయిన వ్యక్తుల గురించిన కథనాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రత్యక్షంగా చూసి తెలుసుకొన్న సమాచారంతో పాటు ఆ వ్యక్తులు స్వయంగా కానీ వాళ్ళ గురించి ఇతరులు కానీ చెప్పిన విషయాలను కలుపుకొంటూ వ్రాసిన కథనాలు అవి. క్రైస్తవం తీసుకొనటానికి ముందు వాళ్ళ సామాజిక ఆధ్యాత్మిక జీవిత స్థితి గతులు, తీసుకొనే క్రమంలో వాళ్ళు పడిన ఘర్షణ, తీసుకొన్నతరువాత ఎదుర్కొన్న సమస్యలు, పరిష్కరించుకొన్నతీరు అనే నాలుగు అంచెలు ఈ కథనాలలో కనిపిస్తాయి. మొత్తంగా ఈ పుస్తకం జనం నుండి, మరీ ముఖ్యంగా మాదిగల నుండి సేకరించిన గాథల సమాహారం. అయితే వాటిమధ్య ఒక గతితర్కాన్ని చూడటానికి, చూపటానికి ఆమె చిత్తశుద్ధి తో ప్రయత్నించింది అంటారు అనువాదకులు వివిన మూర్తి.
1899లో నిలబడి ఒంగోలులో ఇరవైఏళ్లక్రితం అంటే 1879లో ఒక ఏడాది కాలంలోనే పదివేల మంది మాదిగలు క్రిస్టియన్లుగా మారటం వెనుక చాలామంది భావిస్తున్నట్లు 1876-78 మధ్య వచ్చిన కరువు ఒక్కటే కారణమా అంతకు మించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అని ఎమ్మా రొషాoబు చేసిన అన్వేషణ నుండి పుట్టిన గ్రంథం ఇది. ఈ పుస్తకం కోసం ఆమె చేసిన పనులు రెండు. మొదటిది – క్రైస్తవ విశ్వాసిగా ‘ మానవ హృదయం మీద భగవంతుని ప్రత్యక్ష మహిమ కోసం వెతకటం’. రెండవది క్రైస్తవం వైపు మూకుమ్మడి మార్పిడిని సాధ్యంచేసిన ప్రత్యేక పరిస్థితులను శోధించటం. చెప్పులు కుడుతూనే మాదిగలు చేసిన సత్యాన్వేషణ గురించి చెప్పటం, మాదిగల స్థానంలో నిలబడి వారి నేత్రాలతో పరిస్థితిని చూడటం ఈ పుస్తక రచనలో తన ఉద్దేశాలని ఆమె ముందుమాటలో పేర్కొన్నది.
ఈ పుస్తకంలో ఆరు అధ్యయాలు ఉన్నాయి. మొదటిది ‘గ్రంధాలకు ఎక్కని చరిత్ర’. ఇందులో అయిదు ఉపశీర్షికలు ఉన్నాయి. రెండవది ‘పురాతన మాతృపూజ’. ఇందులోనూ అయిదు ఉపశీర్షికలు ఉన్నాయి. మూడవ అధ్యాయం ‘క్రైస్తవమూ-గురువులు’. ‘నజరయ్య నుండి క్రీస్తువరకూ’ అనేది నాలగవ అధ్యాయం. అయిదవ అధ్యాయం ‘రెండు మతాల యుద్ధభూమి’. ఆరవ అధ్యాయం ‘క్రైస్తవం శక్తి’. ఈ నాలుగు అధ్యాయాలు మూడేసి ఉపశీర్షికలతో ఉన్నాయి. ఒక పురాతన తెగ అనే తొలి అధ్యాయంలో ఆమె రెండు ప్రతిపాదనలు చేసింది. ఒకటి -మాదిగలు తొలిద్రావిడ జాతి. మరొకటి – సంప్రదాయాల పట్ల విసుగెత్తి, గురు బోధనలతో ధార్మిక సత్యాన్వేషణ ప్రారంభించి, బహు దైవత్వభావన నుండి ఏక దైవత్వం వైపు వేసిన తొలి అడుగులు మాదిగలను క్రైస్తవం వైపు నడిపాయి. తరువాతి అధ్యాయాలన్నీ ఈ ప్రతిపాదనల నిరూపణమే.
మొదటి రెండు అధ్యయాలలో ప్రధానంగా మాదిగల ప్రాచీనతను నిర్ధారించే ప్రయత్నం- పరోశోధనా స్థాయిలో పూర్వ నిర్ధారణల ప్రస్తావనతో ,తూలనాత్మక విశ్లేషణతో సాగుతుంది.మాదిగలు తమ మూలపురుషుడుగా చెప్పుకొనే ఆది జాంబవుడు ఉన్నతమైన,గౌరవకరమైన స్థానం నుండి దిగజారిపోవటానికి కారణంగా చెప్పబడే కథను ప్రస్తావించింది. కామధేనువుకు కాపరి వెల్లమాను కాగా దాని పాలమీద హక్కుభుక్తాలు దేవతలకు దఖలు పరచబడిన సందర్భంలో అతనిలో జనించిన ఫలానుభవ అపేక్షవల్ల జరిగిన అవకతవకను సరిచేయలేక పోవటం కారణంగా ఆది జాంబ వంతుడు తన ఉన్నతస్థానాన్ని కోల్పోయాడని ఈ కథ చెప్తుంది.గౌరవస్థానంలో ఉన్నప్పటి ఆది జాంబవంతుడిని అదే విధంగా గౌరవంతో చూడబడిన రామాయణ జాంబవంతుడిని పోల్చి చెప్తూ వాళ్ళ వారసులైన మాదిగలు పూర్తిగా వెలివేయబడ్డవాళ్లు కావటం పట్ల విచారం వ్యక్తం చేసింది రచయిత్రి.
ఒక జాతి చరిత్రను తవ్వి తీయాలంటే శాసనాలు మొదలైన చారిత్రిక ఆధారాలతోపాటు సంప్రదాయాలవైపు, పురాణాలవైపు కూడా చూడాల్సి వస్తుంది అంటుంది ఎమ్మా రొషాoబు క్లౌ. అలాగే వృత్తి గాయకుల కథనాలకు కూడా చెవి ఒగ్గాలంటుంది. మాతంగ జాతి, మాతంగ రాజు మొదలైన పేర్లు ప్రస్తావించబడిన శాసనాలను, బాణభట్టు కాదంబరి, సోమదేవ భట్టు సేకరించిన కథాసరిత్సాగరం వంటి సాహిత్య రచనలను ప్రస్తావిస్తూ మాదిగల ప్రాచీనతను సూచించింది. అంతే కాదు, కొనికలూరి ఎల్లయ్య అనే మాదిగ మిత్రుడు తమ ఇంట ఆచారంగా వున్న మాంతంగి సంప్రదాయాన్ని గురించి చెప్పిన కథనం ఆధారంగా మాతృస్వామ్య వ్యవస్థలోని మాతృ ఆరాధనలో దాని మూలాలు ఉన్నాయని, అది ప్రధాన స్రవంతి సంప్రదాయాలతో ఆదాన ప్రదానాలు జరుపుకొంటూ మార్పులకు లోనవుతూ వచ్చిందని నిరూపించింది. భారతంలోని మాతంగ మహర్షి కథ, పురాణాలలోని పార్వతిశక్తి రూపాలలో ఒకటైన మాతంగికథ, జమదగ్ని భార్య, పరశురాముడి తల్లి అయినఎల్లమ్మ కథ, స్థానిక చరిత్రలలో కనబడే ఎల్లమ్మ కథ -మొదలైనవాటిని పోల్చిచూస్తూ వాటి ద్వారా శైవ వైష్ణవాలు ఆదివాసీ సంప్రదాయం మీద పట్టు సాధించటానికి జరిపిన విఫల యత్నాన్ని గుర్తించే ప్రయత్నం చేసింది ఎమ్మా రొషాoబు క్లౌ. మాదిగ స్త్రీ అరుంధతిని ఒక బ్రాహ్మణుడు పెళ్లాడదలచిన కథను చెప్తూ తమ కులంలోకి, కుటుంబంలోకి పరాయివాళ్ళను ప్రవేశించకుండా నిరోధించటం అనే బ్రాహ్మణీయ ఆచారం మాదిగల ఆచరణలోకి కూడా ఎలా చొచ్చుకువచ్చిందో సూచించింది. ఆ వివాహానికి అభ్యంతర పెట్టినందువల్ల అరుంధతి ఇచ్చిన శాపమే మాదిగల హీనస్థితికి కారణం అన్న కల్పన గురించి కూడా ప్రస్తావించింది. మాదిగల పెళ్లి తంతులో ఆకాశంలో నక్షత్రంగా వెలుగుతున్న ఆరంజ్యోతిని చూసి నమస్కరించే సంప్రదాయం వున్న సంగతి కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించబడింది. హిందూ వివాహతంతులో బ్రాహ్మణుల దగ్గర నుండి అన్ని కులాలలోనూ ఈ సంప్రదాయం ఉండటం ఆశ్చర్యం కలిగించక మానదు. అరుంధతిని బ్రాహ్మణీయ సంస్కృతిలో కలిపేసుకొనటం అనాలా దీనిని?
ఇంత గొప్ప స్వంత, స్వతంత్ర సంప్రదాయం ఉన్న మాదిగలు ఎప్పుడు ఎలా దాస్యంలోకి నెట్టబడ్డారు? వూరి బయటకు వెళ్లగొట్టబడ్డారు? అంటే ఖచ్చితమైన కాలాన్ని నిర్ధారించి చెప్పలేకపోవచ్చుకానీ ద్రావిడ తెగల పరస్పర సహకార సంబంధాల సమాజం ఆర్యుల వలస ప్రభావం వల్ల రూపొందిన భారతీయ కుల వ్యవస్థలో స్థానం లభించని ఆదిమ ద్రవిడ గ్రామాల చర్మకారవృత్తి పనివాళ్లు గ్రామాల బయట ఇల్లు కట్టుకొని ఉండాలన్న ఒప్పందం ఏదో కుదిరి ఉంటుంది అని ఆమె వూహ. ఇక ఇప్పుడు మాదిగల జీవితం ఎలావుందీ? వెట్టిబానిసలుగా గ్రామానికి సంబంధించిన సమస్త చాకిరీ, అధికారుల ఇళ్లల్లో ,పొలాలలో చాకిరి, వ్యవసాయ శూద్రకులాల కుటుంబాల సేవలు, చచ్చిన పశువుల చర్మం బాగుచేసి చెప్పులు ,తదితర వ్యవసాయవసర తోలు పనిముట్లు -చేయటం వారి విధి అయింది. ఇంతాచేసినా ఆకలి, దరిద్రం, అంతులేని హింస వాళ్ళ నిత్యజీవితానుభవాలు.
ఎమ్మా రొషాoబు క్లౌ తరువాతి నాలుగు అధ్యాయాలను మాదిగల ధార్మిక తత్వ నిర్ధారణకు ఉపయోగించింది. బంగారపు తాతయ్య, పుల్లికూరి లక్ష్మయ్య, బండారు పుల్లయ్య, పశిగోపు బసయ్య,బద్దెపూడి కన్నయ్య, ఉల్లూరివారి కుటుంబం, కొమ్ము పున్నయ్య, కొల్లు రామయ్య, ఎండ్లూరి రత్నం, నంబూరి కుటుంబం, మునసబు దుర్గయ్యనాయుడు, మొదలైన వారి జీవిత కథనాలు ఇందులో ప్రధానం. బంగారపు తాతయ్యతో పాటు అతని భార్య సత్యమ్మ, ఉల్లూరి ఇంటి ఆడబడుచు ఉక్కమ్మ, కొమ్ము పున్నయ్య భార్య సుబ్బమ్మ, రామయ్య భార్య, నంబూరి సోదరుల తల్లి, ఆనందయ్యభార్య, కిష్టయ్య భార్య- ఇలాంటి స్త్రీల అనుభవాలు కూడా ఈ కథలలో కనిపిస్తాయి. వీళ్ళలో నంబూరి కుటుంబం ఒక్కటే మాల తెగకు సంబంధించినది. మిగిలినవాళ్ళందరూ మాదిగలే. 1866లో ఒంగోలుకు తెల్ల ప్రబోధకుడు ( జాన్. ఇ . క్లౌవ్ ,ఎమ్మా రొషాoబు క్లౌ భర్త ) వచ్చిననాటి నుండి అతని సంబంధ ప్రభావాలలో క్రైస్తవ మార్గంలోకి వచ్చినవాళ్లు వీళ్లంతా. వీళ్ళ గురించి చదువుతుంటే వీరశైవ మత సర్వోతృష్టతను చాటటానికి కాకతీయుల కాలపు వాడైన పాల్కురికి సోమనాథుడు శైవభక్తుల కథలతో వ్రాసిన బసవపురాణం లోని అతని సమకాలపు భక్త బృందమే గుర్తొస్తుంది.
ఈ కథల ద్వారా ఎమ్మా రొషాoబు క్లౌ మాదిగలు క్రైస్తవం వైపుకు రావటానికి పరిపక్వమై ఉన్న భౌతిక పరిస్థితులపై ప్రసరింప చేసిన వెలుగు ప్రధానమైంది. వీరశైవం వలెనె రామానుజుని వైష్ణవం కూడా జాతికుల భేదాలకు అతీతంగా అందరూ విష్ణుభక్తులు కావచ్చునని చెప్పింది. ఆ క్రమంలో కొంతవరకు మాదిగలు రామానుజ మతాన్ని అనుసరించటం ప్రారంభించారు. బంగారపు తాతయ్య ఆ రామానుజ సంప్రదాయ కుటుంబంలో వాడే. కానీ వాళ్ళెవరికీ ఆ మతతత్వం అర్ధంచేసుకొనే అవకాశం సామాజికంగా లేకపోయింది. అటువంటి పరిస్థితులలో వాళ్ళ ఆధాత్మిక అవసరాలకు పోతులూరి వీరబ్రహ్మయోగి చెప్పిన రాజయోగం అందుబాటులోకి వచ్చింది. బంగారుతాతయ్య బండికట్ల వీరమ్మ అనే వీరబ్రహ్మయోగి శిష్యురాలివల్ల అట్లా రాజయోగం ఉపదేశం పొందినవాడే. అతని వంటివాళ్ళుఇంకా చాలామంది. భగవంతుని బహుళ రూపాలను, విగ్రహారాధనను నిరసించి భగవంతుడిని శక్తిగా సంభావించి ధ్యానించటం ఏదైతే ఉందో అదే వాళ్ళను క్రైస్తవానికి దగ్గర చేసిందంటుంది ఎమ్మా రొషాoబు క్లౌ. వెలవబోయే అవతారం కోసం ఎదురుచూడండి వంటి వీరబ్రహ్మం తత్త్వార్ధాలు క్రీస్తురాకడనే సూచిస్తాయని ఆమె వ్యాఖ్య. రాజయోగి మతం ఒకే దైవాన్ని ధ్యానించమన్నది కనుక దానికి అలవాటు పడ్డవాళ్లకు ఆ దైవం జీసెస్ క్రీస్తే అని చెప్పటం చాలా సులువు అని కూడా అందామె.
అట్లాగే నజరయ్య మతం కూడా క్రైస్తవానికి దగ్గర దోవ అయింది. క్రైస్తవులు కాకముందు తాము నజరయ్య మతం వాళ్లమని కొందరు చెప్తుండగా విని ఆ నజరయ్య ఎవరో పరిశోధించి తెలుసుకున్నది ఎమ్మా రొషాoబు క్లౌ. ఒక పండు ముసలి మాదిగతో సంభాషించి అతని జ్ఞాపకాల నుండి ఆమె నజరయ్య 1825నాటి గురువు అని నజర్ అనే మహమ్మదీయుడే నజరయ్య అయ్యాడని త్రిపురాంతకంలో ప్రతియేటా అతని పేరుమీద పండగ జరుగుతుందని, అతని ఉపదేశ పద్దతి హిందూ యోగుల పద్ధతి వంటిదే అని, అతని బోధలవల్ల మాదిగలు విగ్రహారాధన వదిలి ఏకదైవత్వం వైపు వచ్చారని ఆమె తెలుసుకున్నది. వీరబ్రహ్మేంద్ర యోగి మతమైనా, నజరయ్య మతమైనా కుల సమానతను చెప్తాయి కనుక అవి మాదిగల సాంఘిక స్థాయిని పెంచాయి. అందువల్లనే వాళ్ళు క్రైస్తవం వచ్చేవరకు వాటిని అంటిపెట్టుకొని ఉన్నారని ఆమె నిర్ధారించింది.
అలాగే కులం, కుటుంబ సంబంధాలు వదిలి పాలక కులాలు సేవకులు అనే అంతరాలను వదిలి ఏడాదికి ఒకసారి ఒక రాత్రి ఒక ఇంట్లో సమావేశమయ్యే చర్మనిష్ఠ శాఖ అనే మరొక మత సంప్రదాయం గురించి కూడా కూడా ఈ పుస్తకంలో పేర్కొనబడింది. మాదిగలకు ప్రవేశం కల్పించిన ఇటువంటి మతాలు అన్నీ క్రైస్తవ శక్తి సంపాదనకు మెట్లుగా పనిచేసాయాని ఆమె అంటుంది.మాదిగల ఆధ్యాత్మిక జీవితక్రమాన్ని అర్థం చేసుకొని వ్యాఖ్యానించే క్రమంలో రామానుజుడు, వీరబ్రహ్మేంద్ర యోగి, నజరయ్య వంటి వ్యక్తుల మత విధానాలమధ్య ఎమ్మా రొషాoబు క్లౌ చూసిన గతితర్కం కొత్తది.
ఈ కథలన్నిటిలో మరొక సామాన్యాంశం క్రైస్తవంలోకి మారాలన్న ఆలోచన ముందుగా పురుషులకు కలగటం. అట్లా మతం మారటం కుటుంబానికి ఇష్టంలేనప్పుడు వాళ్ళను వారించే బాధ్యత భార్య మీద మోపబడుతుంది. ఏడ్చి గోల చెయ్యమని, కలిసి కాపురం చెయ్యనని బెదిరించమని ఒత్తిడి చేస్తారు. అయితే ఏ భార్య భర్త మీద గెలవలేదు. బాప్టిజం తీసుకొనటానికి పొయ్యేది పొయ్యేదే .. నువ్వు వస్తే రా.. లేకపోతే లేదు .. అని భర్త గట్టిగా అనగానే భార్య అతనిని అనుసరించటమే జరిగేది. సత్యమ్మ అయినా, సుబ్బమ్మ అయినా తమ తమ భర్తల తో పాటు క్రైస్తవధర్మాన్ని ప్రచారంచేస్తూ, సేవా కార్యక్రమాలలో పాల్గొన్నవాళ్ళే.
మతం మార్చుకొనేవాళ్ళు ఎవరూ కూడా కుటుంబం ఎంత అభ్యంతరపెట్టినా, ఎన్ని ఇబ్బందులు కల్పించినా కుటుంబాన్ని వదులుకొనక పోవటం, సహనం తో పరివర్తనకు ఎదురుచూడటం, అంతిమంగా కుటుంబం మొత్తాన్ని క్రీస్తు మార్గంలోకి మళ్లించ టమే ఈ కథలలో కనిపించే మౌలికాంశం.
ఇవన్నీ సరే, మాదిగల జీవన సంవేదనను ఈ రచన ఎంతగా ప్రతిఫలించింది? క్రైస్తవం వాళ్ళ జీవితంలో తీసుకువచ్చిన అభివృద్ధి ఏమిటి ? అన్నవి ప్రధానమైన ప్రశ్నలు. వీటికి లభించే సమాధానాలను బట్టే ఈ పుస్తకం విలువ.
తోలును పదును చేయటం, చెప్పులు కుట్టటం, చచ్చిన పశువుల చర్మం ఒలిచి శుద్ధి చేయటం, తోళ్ల వ్యాపారం చేయటం, శూద్రుల వ్యవసాయభూములలో కౌలుదార్లుగానో, రైతుకూలీలుగానో పనిచేయటం వారి జీవన విధానం. ఇంతాచేసి గొడ్డుమాంసం తినటం, పంటల రోజుల్లో వచ్చిన కూలి గింజలతో అన్ని కడుపులూ, అన్ని రోజులూ పూర్తిగా నిండే పరిస్థితులే వుండవు. కరువు కాలంలో వాళ్ళ పరిస్థితి మరీ దుర్భరం. 1876-78 మధ్య కాలపు కరువు ఏడాది పొడుగునా ఆకలితో మాడ్చింది. వేలాది మంది మరణానికి కారణమైంది. అప్పుడే ఒంగోలు మిషనరీ బకింగ్ హామ్ కాలువ నిర్మాణానికి కాంట్రాక్ట్ తీసుకొని పని కల్పించి ఆదుకొన్నది. అయితే క్రైస్తవం యొక్క ప్రధాన ప్రభావం మాదిగల సామాజిక జీవితంలో వేసిన ప్రభావమే అసలు చెప్పుకోదగినది. ఎర్రపాలెం మాదిగలలో ముక్తిమార్గం క్రీస్తే అని చెప్పటానికి బండారు పుల్లయ్య వచ్చిన సందర్భం లో మాదిగ పెద్ద అతనిని తమతోపాటు అన్నంపులుసు తింటారా లేక శూద్రుల చేత ఒండించి పెట్టమంటారా అని అడిగాడు. హిందూ గురువులు ఉపదేశానికి వచ్చినప్పుడు మాదిగల ఇంట తినటానికి ఇష్టపడకపోవటం, తిండి సామగ్రి ఇచ్చి శూద్రుడిచేత వండించి పెట్టటం వాళ్లకు అలవాటే.
అంటరానివాళ్ళము అన్న ఎరుకతో సర్దుబాట్లకు అలవాటుపడినవాళ్లు మాదిగలు. బండారు పుల్లయ్య ఆ అంతరాన్ని తిరస్కరించి వాళ్ళతో కలిసి తిన్నాడు. హిందూ గురువుల కాళ్ళుకడిగి ఆ నీటిని తాగటం, తినటానికి కోడిని తే, సారా తే అనే అధికారపూర్వక ఆజ్ఞలు అనుసరించి ప్రవర్తించాల్సి రావటం వంటివి లేకపోవటం క్రిస్టియన్ బోధకులను వాళ్లలో ఒకడిగా తీసుకొనటానికి, ఆత్మగౌరవంతో నిలబడటానికి కారణం అయ్యాయి. వెలివేయబడటానికి బదులుగా వాళ్లే ఇతరులను వెలివేసే స్థితికి క్రైస్తవం వాళ్ళను తీసుకువచ్చింది అంటుంది ఎమ్మా రొషాoబు క్లౌ. క్రైస్తవం తీసుకొన్న కుటుంబాలకు మతం మార్చుకోక పాత సంప్రదాయాలనే పాటించే అతిథులు వచ్చినప్పుడు ఆ కుటుంబాల వాళ్ళు తాము తినే మూకుళ్లను ముట్టుకోనియ్యకపోవటం, బయటివాళ్ళు తిన్న మూకుళ్లను మళ్ళీ వాడకపోవడం వంటి పద్ధతులు పాటించటాన్ని ప్రస్తావిస్తూ ఈ వాక్యం పలికింది ఆమె.
నంబూరి ఆనందయ్య వీరబ్రహ్మేంద్ర యోగి సంప్రదాయానికి చెందినవాడిగా కులభేదాలు పోతాయన్ మాటను విశ్వసించాడు. కానీ అవి వాస్తవ ప్రపంచంలో ఏ కుదుపుకు లోనుకాకుండా యధాతథ స్థితి కొనసాగింపునే చూస్తున్నాడు. సమాజానికి మాల, మాదిగలు సమానంగా వెలివేయబడ్డవాళ్లే అయినప్పటికీ వాళ్ళు పరస్పరం అస్పృశ్యులు.దీనికి క్రైస్తవం చూపించే పరిష్కారం ఏమిటి అని అతను సవాల్ చేసినప్పుడు అప్పటికే క్రైస్తవం తీసుకొన్న పెంటయ్య ఒంగోలు మిషన్ ప్రాంగణంలో కులంలేదని, అందరూ కలిసి తింటారని, ఒకే బావి నీళ్లు తాగుతారని పాత అస్పృశ్యతలు ఎవరైనా పాటించబోతే చీవాట్లు తినాల్సివస్తుందని చెప్పింది విన్నతరువాత అతనిలో క్రైస్తవంపట్ల సానుకూలత ఏర్పడటం చూస్తాం.
క్రైస్తవ నియమాలలో భాగంగా చచ్చిన గొడ్డు మాంసం తినం అనే నియమాన్ని ఆచరణలోకి తేవటం వాళ్ళ జీవితంలో గుణాత్మక మార్పుకు కారణం అయింది. ఇన్నాళ్లు వూళ్ళో చచ్చిన గొడ్డును తెచ్చుకొని చర్మం ఒలిచి మాంసాన్ని శుభ్రపరచుకొని వండుకు తినటం, నిలవ చేసుకొనటానికి వీలుగా బాగుచేసి ఎండపెట్టటం వంటి పనులు చేసేవాళ్ళు. సాధారణంగా పశువులు ఏ జబ్బులో వచ్చి చనిపోయేవి కనుక మాంసం చాలావరకు పాడయిపోయేది సంప్రదాయమానో , తినటానికి మరొకటిలేకనో అదే తిని రోగాలపాలు కావటమూ జరిగేది. చచ్చిన గొడ్డు మాంసం తినగూడదన్న క్రైస్తవ నియమం గౌరవకరంగా జీవించటం అనే సంస్కృతిని వాళ్లలో అభివృద్ధిపరిచింది. ఇది శూద్రులకు, తదితరులకు మింగుడు పడలేదు. తాత తండ్రుల కాలపు ఆచారాలను వదిలేస్తున్నారని ఆందోళన పడ్డారు. కూచిపూడి గ్రామంలో జరిగిన ఒక ఘటనను రచయిత్రి ప్రస్తావించింది. జబ్భుపడ్డ ఎద్దు చస్తే మాదిగలకు దానిని ఇయ్యటం తానుచేసిన పెద్ద ఉపకారం అనే అహం గ్రామీణులలో ఉంటుంది. చచ్చిన ఎద్దు తనది కనుక మాదిగలు చెప్పులు కుట్టి ఇయ్యటం విధాయకం అని వాళ్ళనుకొంటారు. కానీ క్రైస్తవం కలిగించిన చైతన్యంతో మాదిగలు చచ్చినగొడ్డుమాంసం తినమని పూడ్చి పెట్టటమే కాకుండా చెప్పులు ప్రతిఫలంలేకుండా కుట్టి ఇయ్యటానికి నిరాకరించారు. ఇది ఒక రకంగా గ్రామ పెత్తందారీ వ్యవస్థపై ఒక తిరుగుబాటు కూడా.
క్రైస్తవం ఆదివారం ప్రభువు ప్రార్ధనకే గానీ రోజువారీ బతుకుతెరువు పనులు చేసుకొనటానికి కాదు అని చెబుతుంది. జీతానికి గానీ, పనిగంటలకు గానీ సంబంధించిన ఏ హక్కు లేని మాదిగల జీవితంలో ఆదివారం పనిచెయ్యకపోవటానికి దొరికిన ఈ అవకాశం అనేది నిజంగా విప్లవాత్మక మైనదే. వెట్టి బానిసలుగా మాదిగలు ఎప్పుడుపిలిస్తే అప్పుడు యజమానులు చెప్పే పనులు చేయటానికి సిద్ధంగా ఉండాలి. అటువంటప్పుడు ఆదివారం పనిచేయము అని వాళ్ళు ప్రకటించటం పెత్తందార్ల అధికారానికి , అహంకారానికి పెద్ద దెబ్బ. అది శ్రామిక వర్గ తిరుగుబాటు అవుతుంది. అందుకని నూర్పిళ్ళు అయినతరువాత మాదిగలు హక్కుగా వచ్చే తమవంతు ధాన్యాన్ని తీసుకుపోకుండా చేయటం ద్వారా వాళ్ళను నియంత్రించాలని, ధాన్యం చేరవేసే పని ఆదివారం నాడే పెట్టుకొన్నారు వ్యవసాయదారులు. ఇలాంటి వేధింపులతో ఆదివారం సెలవు అనే విప్లవాన్ని అణచివేయటానికి జరిగిన ప్రయత్నాలు ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి. మీరసలు మాపనులకే రావద్దని బెదిరించి అదుపులో పెట్టాలని కూడా చూసారు. కానీ వాళ్ళ జీవితమే మాదిగల శ్రమ మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆ బెట్టు ఆత్మహత్యా సదృశమే అవుతుంది. ఆదివారం సెలవు అనే ఒక్క అంశం మాదిగల జీవితంలో ప్రవేశపెట్టిన నూతన స్వతంత్ర భావన చాలా విలువైనది, నిర్ణయాత్మకమైనది.
సారాయి తాగవద్దు, దొంగతనం చేయవద్దు వంటి నైతిక విలువల ఆచరణకు క్రైస్తవంలో చాలా ప్రాధాన్యత ఉంది. అవి మాదిగల జీవితంలో స్వీయ సంస్కారాలను అభివృద్ధి పరిచాయి. బహుభార్యత్వాన్ని కూడా క్రైస్తవం అంగీకరించదు. ఇద్దరు భార్యలు ఉన్న అతనికి బాప్టిజం ఇయ్య నిరాకరించటం కూడా ఇందులో ప్రస్తావించబడింది. సంప్రదాయ మతాచారాలలో ,గ్రామదేవత ఉత్సవాలలో డప్పులుకొట్టటం, నాట్యం చేయటం వంటి పనులు తరతరాలుగా చేస్తున్నవే అయినప్పటికీ క్రైస్తవం తీసుకున్నాక విగ్రహారాధనలో పాల్గొనరాదన్న నియమంతో నిరాకరించగల కొత్త స్వేచ్ఛను వాళ్ళు పొందారు. అందువల్ల వాళ్ళు గ్రామ కారణాల, మునసబుల దౌష్ట్యానికి గురికావలసి వచ్చింది.
క్రైస్తవ మిషనరీలు మాల, మాదిగలకు పాఠశాలలు పెట్టి చదువుకొనటానికి ప్రోత్సహించటం భూవసతి గల వారిలో మాదిగలు చదువుకొంటే మరి మనపని ఎలా చేస్తారు అని ఒక బెదురును కూడా కలిగించింది.
జీవితాన్ని తమకోసం జీవించే కొత్త చైతన్యం మాల, మాదిగల జీవితంలోకి క్రైస్తవం ఎలా తీసుకువచ్చిందో చెప్పే “ చెప్పులు కుడుతూ.. కుడుతూ..” అనే ఈ పుస్తకం 20వ శతాబ్దానికి ఒక వైతాళిక గీతిక.
చాల బావుంది.
పుస్తకం దొరుకుచోటు
thanks rajayyagaaroo… manasu foundation vari prachurana
navodaya book house,vishalandhra book house lo
ఆముక్తమాల్యద తో మొదలు పెట్టి చెప్పులు కుడుతూ… లోకి వెళ్లి సాహిత్య చారిత్రక విశ్లేషణ చాలా గొప్పగా చేసారు.
thanks prabhugaaroo