నీలీరాగం – 4

1930 లో తెలంగాణలో సాంస్కృతికోద్యమంగా ప్రారంభమై సామాజిక ఆర్ధిక సంస్కరణలను ఆశిస్తూ 14 ఏళ్లుగడిచేసరికి రాజకీయ ఉద్యమంగా కొత్త నిర్మాణం తీసుకొన్న నిజాంరాష్ట్రాంధ్ర మహాసభలు కూడా ఆదిఆంధ్ర ఉద్యమానికి సంబంధించిన సంవాదాలకు వేదిక కావటం గమనించవచ్చు. తెలంగాణలో అప్పటికి వున్న అన్ని సంస్థలను కలుపుకొని నిజాం పాలనలో తెలుగువాళ్ల ఆకాంక్షలను ఒక బలమైన స్వరంగా వినిపించటం లక్ష్యంగా ఏర్పాటు చేయబడిన సభలు ఇవి. 1930 మార్చ్ 3, 4, 5 తేదీలలో జోగిపేటలో జరిగిన నిజాం రాష్ట్ర ప్రథమ ఆంధ్ర మహాసభలో ఆహ్వాన సంఘ అధ్యక్షుల( హైకోర్టు వకీలు అనంత వెంకట రావు) అధ్యక్షోపన్యాసంలో విద్య, స్త్రీ విద్య మొదలైన అంశాలతో పాటు ఆది మాంధ్రుల అభివృద్ధి గురించిన ప్రస్తావన కూడా ఉంది. ఆ సభకు భాగ్యరెడ్డి వర్మ హాజరు కావటమే కాదు, ఆదిహిందువుల అభివృద్ధి గురించి ఒక తీర్మానం ప్రవేశపెట్టాడు. “ఆది హిందూవుల విద్యా సౌకర్యాదులను బెంపొందించుటకు వలయు ప్రయత్నములను జేయుటకై ప్రభుత్వము వారిని, అంటరాని తనమును దొలగించుటకై ప్రజలను నీ మహాసభ వారు కోరుచున్నారు” అనే తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టగా ఎం. నారాయణరావు, సరస్వతమ్మ ఆమోదించారు. ఆ సభలో అంగీకరింపబడిన 32 తీర్మానాలలో ఇది తొమ్మిదవది.

దేవరకొండలో 1931మార్చ్ లో జరిగిన ద్వితీయ ఆంధ్ర మహాసభలో కూడా “జిల్లాల లోని ఆది హిందూవులకు విద్య పరిశుద్ధత, సౌజన్యాసులందు శ్రద్ధ కలుగునట్లు ప్రబోధము కలిగించి శక్తి కొలది వారి ఇక్కట్లను, తొలగించుటకుగాను, గట్టి ప్రయత్నములు సలుపుట అత్యవసరమని అభిప్రాయపడుచు, ఈ కార్యమున తోడ్పాటుకు విద్యాధికులును, ధనా ధికులును, వతందార్లును అగు దేశ సోదరులనీ మహాసభ వారు ప్రార్ధించుచున్నారు.” అని తీర్మానం చేశారు కూడా. ఆ సభల సందర్భంగా ఆదిహిందూ క్రైస్తవ గూడెం లో ఆది హిందూ ధార్మికప్రచార సభ జరిగింది. అక్కడ జనాన్ని సమీకరించటానికి ముందుగా మాటూరి బలరామయ్య ‘సతీ సులోచన’ హరికథ చెప్పించారు. భాగ్యరెడ్డివర్మ అక్కడ సమావేశమైన స్త్రీపురుషులను ఉద్దేశించి మాట్లాడాడు. మర్నాడు వీధులన్నీ తిరిగి సంస్కరణలగురించి, అస్పృశ్యతా నివారణం గురించి, ఉపన్యాసాలిచ్చారు. ఆ నాటి మధ్యాహ్నం ఆంధ్రమహాసభ ఆవరణలో ఆఊరి తూర్పు పడమర గూడాల నుండి, చుట్టుపక్కల గ్రామాలనుండి వచ్చిన ఆది ఆంధ్ర స్త్రీపురుషుల సమావేశం బి. చిత్తరయ్య అధ్యక్షతన జరిగింది. భాగ్యరెడ్డి వర్మ మాట్లాడాడు. ఆది హిందువులకు వెట్టిచాకిరీ తొలగింపు, బాలబాలికలకు నిర్బంధ ఉచిత విద్య, అస్పృశ్యతానివారణ, దేవాలయ ప్రవేశం, నూతులలో నీరు తోడుకొనటం వంటి సంస్కరణల కోసం తీర్మానాలు చేశారు.

మూడేళ్లకు 1934లో ఖమ్మంలో మూడవ ఆంధ్ర మహాసభ జరిగే నాటికి అస్పృశ్యతా నివారణ పట్ల వివాదాలు తలెత్తాయి. ఆసభలో జరిగే సంఘసంస్కార చర్చలు సనాతను లకు కష్టం కలిగిస్తాయని అందువల్ల శాంతికి భంగం కలుగుతుందని కనుక ఖమ్మంలో ఈ సభలు జరుపనీయవద్దని అధికారులకు విన్నపాలు వెళ్లాయి. సహపంక్తి భోజనాలు,దేవాలయ ప్రవేశం వంటి పనులతో వర్ణసాంకర్యం జరుగుతుందన్న ప్రచారం జరిగింది. సనాతనుల పక్షాన ‘అస్పృశ్యతా విషయములు’ అనే కరపత్రం కూడా ప్రచురించబడింది. అస్పృశ్యత దోషమని, ప్రాచీనుల వాడుక కాదని, కృత్రిమ కల్పన అని దానిని మాన్పించాలని ఆధునికులు చేస్తున్న వాదాన్ని మనుధర్మశాస్త్రం, విజ్ఞేశ్వరీయం వంటి వాటిని ఉదహరిస్తూ నిరాకరించి, ధర్మములు తెలిసినవాళ్ళే అధికులని, గుణం వల్ల అస్పృశ్యులు బ్రాహ్మణత్వం పొందుతారని భారత రామాయణాలను ఉదహరిస్తూ వివరించిన ఆ కరపత్ర రచయిత దాశరథి వెంకటాచార్యులు. ఆయన ఎవరో కాదు, అభ్యుదయ రచయితలుగా ఆ తరువాత కాలంలో ప్రసిద్ధులైన దాశరథి రంగాచార్యుల, కృష్ణమాచార్యుల తండ్రి. సురవరం ప్రతాపరెడ్డి ఆయన కరపత్రంలోని మనువాదాన్ని తిప్పికొడుతూ, విషయాలలో పరస్పర విరుద్ధత ఉందని విమర్శిస్తూ గోల్కొండ పత్రికలో వ్రాసాడు. ఈ వాదవివాదాల నేపథ్యంలో డిసెంబర్ 13,14, 15 తేదీలలో మూడవ ఆంధ్రమహాసభలు జరిగాయి. దానిప్రభావం ఆ సభ మీద బాగానే పడింది.

ఆహ్వాన సంఘ అధ్యక్షులు అయితరాజు జీడికంటి రామారావు తన ఉపన్యాసంలో అస్పృశ్యత వల్ల సోదరన్యాయం చెడిందనీ, వారి దైన్యతను పోగొట్టటానికి ప్రయత్నించక పోవటం మానవధర్మ విరుద్ధమని చెప్తూనే వారికి పారిశుధ్యత బోధించటానికి,చచ్చిన గొడ్డు మాంసం తినటం, తాగటం వంటి దురభ్యాసాలను మాన్పటానికి, విద్య చెప్పించటానికి, వాళ్ళ పట్ల దౌర్జన్యాలు మానటానికి, జీవనాధారం కల్పించటానికి పరిమితమై పనిచేస్తే సరిపోతుందనీ దేవాలయ ప్రవేశం, సహపంక్తి భోజనాలు వంటివి ఇప్పుడు తలపెట్టక పోవటమే మేలని ఒక మధ్యే మార్గాన్నిసూచించాడు. పులిజాల వేంకట రంగారావు అధ్యక్షోపన్యాసంలో దురాచారమెంత పురాతనమైనను తక్షణమే త్యజించవలసినదేనని నవ జీవనమొసగు సంస్కారము నూతనమైననూ అవలంబింపదగినదేనని చెప్పి కూడా, సనాతనులకు సంస్కార ప్రియులకు మంచిచెడులు గురించి అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ ఒకరి ఆశయాలను ఒకరు తిరస్కారబుద్ధితో చూడవద్దని ఒకరిమార్గమునకొకరు అవరోధం కల్పించవద్దని హితవు చెప్పటం యథాతథ స్థితి కొనసాగింపుకు పరోక్ష అనుకూలత తప్ప మరొకటి కాదు.

ఈ సభకు భాగ్యరెడ్డివర్మ రాలేదుకానీ తన అభిప్రాయాలను వ్రాసి పంపాడు.’భారత లక్ష్మి సుపుత్ర హైందవాగ్రజ మహోదయులారా’ అని సంబోధించి విషము కక్కే పాములకు పాలు పోసి, చీమలకు చక్కెర పెట్టి, రాళ్లు రప్పలను పూజించే దయాళువులు -తమవలే అన్ని అవయవాలు కలిగి ఆత్మజ్యోతి తో వెలిగే మనిషిని అస్పృశ్యుడని దూరంగా తొలిగి పొమ్మని కేకలేస్తారు ఎందుకని ప్రశ్నించాడు. హిందువులు పెట్టె బాధలకు ఓర్వలేకనే అనేకులు అన్యమతాలలోకి మారిపోతున్నారని ఒక వాస్తవాన్ని చెప్పాడు. ‘మా జాతిసంఖ్య ఏడుకోట్లు సుమా! ఆది శక్తి మాలో విజృంభించినది. త్వరలో గమ్యస్థాన మాక్ర మించగలమని విశ్వాసము, ధైర్యము’ ఉన్నాయని ప్రకటించాడు. ‘అస్పృశ్యతాదోష పాప నివారణము కొరకు హిందూ మహాజనులు ప్రాయశ్చిత్తమొనరించు కొనవలసి యున్నది’ అని హెచ్చరించాడు. ఆది హిందువులను అస్పృశ్యులుగా నిర్ణయించి , ఊరిబయటకు గెంటివేసి చేయించరాని పనులనెల్ల చేయించి, ఉండటానికి స్థలం, తినటానికి తిండి, కట్టటానికి బట్టా లేకుండా చేసి పీడించిన హిందూ సమాజం పట్ల సహనం నశిస్తున్న దశలో భాగ్యరెడ్డి వర్మ చేసిన ధర్మాగ్రహ ప్రకటన ఇది.

ఆ సభలో ఆది ఆంధ్రుల విషయమై తీర్మానాలేవీ లేకపోవటం గమనించవచ్చు. గోల్కొండ పత్రిక సంపాదకీయాల (1934 డిసెంబర్ 15 ) వలన నిమ్నజాత్యుద్ధరణం గురించిన తీర్మానం మహాసభలో ప్రవేశపెట్టబడలేదని, అందుకు తెరవెనుక కుట్ర ఎదో జరిగిందనీ తెలుస్తున్నది. ఇది సనాతన వాదుల పనేనా అన్న ప్రశ్న, వాళ్ళు మరీ నిమ్నజాతుల వారికి విద్య, పరిశుభ్రత అన్న సాధారణాంశాలను కూడా వ్యతిరేకించేంత మూర్ఖులా అన్న సందేహం రెండూ వ్యక్తం అయ్యాయి ఈ సంపాదకీయాలలో.

మరుసటి సంవత్సరం అంటే 1935 జనవరి 26 నుండి 28 వరకు సిరిసిల్ల లో జరిగిన నాలుగవ ఆంధ్రమహాసభలో ఆహ్వానసంఘాధ్యక్షుడు ఆవునూరి వేణుగోపాలరావు తన ఉపన్యాసంలో అంటరానితనం అమానుషం ,అసాంఘికం అని స్పష్టం గానే చెప్పాడు. అన్యమతం అవలంభించినప్పుడు అస్పృశ్యులు స్పృశ్యులుగా మారిపోతున్నప్పుడు స్వమతంలో ఉన్నప్పుడు అస్పృశ్యత అన్నది వూహకు అందని విషయం అన్నాడు. సంబంధ బాంధవ్యాలు, సహపంక్తి భోజనాలు చేయనవసరం లేదు, ముందు అంటరాని తనం వీడి తోటిమానవులుగా వాళ్ళను గౌరవిద్దాం అని అభ్యర్ధించాడు. ఆ సభకు అధ్యక్షుడు అయిన మాడపాటి హనుమంతరావు అధ్యక్షపీఠం నుండి నిమ్నజాత్యుద్ధరణ అవసరాన్ని, అందుకు చేపట్టవలసిన చర్యలను గురించి ప్రస్తావించి నిజాం ప్రభుత్వం విద్య, పరిశుభ్రత సౌజన్యాదుల పెంపొందించి వారి కష్టాలు తొలగించటంలో తోడ్పడాలని తీర్మాన ప్రకటన చేసాడు. అది ఆమోదించబడింది. ఆ సందర్భంలో ఆది హిందూ జనోద్ధరణకు పరాయణులపక్షం పాటుపడుతున్న హనుమకొండకు చెందిన ఆదిమాంధ్రుడు పీసరి వీరన్న మాడపాటి హనుమంతరావు మెడలో పూల మాలవేసి అభినందించినట్లు తెలుస్తున్నది. ఆయన గురించిన సమాచారం సేకరించగలిగితే వరంగల్ లో దళితఉద్యమ గతిక్రమాన్ని అంచనా వేయటానికి వీలవుతుంది.

ఆమరుసటి సంవత్సరం (1936) డిసెంబరు 15,16,17 తేదీలలో షాద్ నగర్ లో జరుగనున్న అయిదవ ఆంధ్ర మహాసభ సందర్భంగా 1936 డిసెంబర్ 10 నాడు వెలువడిన హైద్రాబాదు బులెటిన్ ఖమ్మం సభలను ప్రస్తావించి సాంఘికాభివృద్ధి విషయంలో ఆ నాడు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు లేకపోయినా ప్రజాభిప్రాయం ఇంకా రూపొందలేదు కనుక, పూర్వాచార పరాయణుల పక్షం బలవంతమై ఉంది కనుక సాంఘిక సంస్కరణను ప్రోత్స హించటానికి ప్రత్యేకమైన ఉపసంఘాన్ని స్త్రీల సంఘం వలే స్థాపించటం అవసరమని సూచించినప్పటికీ ఆవిషయం ఆంధ్ర మహా సభ నిర్వాహకులు ఆలోచించినట్లు కనబడదు. అయినప్పటికీ ఆంధ్ర మహాసభ మాత్రం సనాతనుల పక్షాన కాక ఆధునికుల పక్షానే నిలబడిందన్నది మాత్రం వాస్తవం.

ఆహ్వాన సంఘ అధ్యక్షులు వెంకట నారాయణరెడ్డి తన ఉపన్యాసంలో నిమ్నజాత్యుద్ధరణ సమస్యకు వివాదకాలం పోయిందని ప్రకటించటం, దానిమీద చర్చకూడా ఇక అవసరం లేదని, కార్యరూపంలోకి తీసుకు రావటమే తక్షణ కర్తవ్యం అని అందుకు అవసరమైన విధానాలు, సదుపాయాలు సమకూర్చు కొనటానికి సిద్ధం కావాలని చెప్పటం దానినే సూచిస్తాయి. అదే సభలో 1936 నవంబర్ 12 న హరిజనుల దేవాలయ ప్రవేశానికి ఆజ్ఞాపత్రం ఇచ్చిన తిరువాన్కూర్ మహారాజును అభినందిస్తూ నిజాం ప్రభుత్వం కూడా ప్రభుత్వ బావులను, నల్లాలను ఉపయోగించు కొనటానికి హరిజనులకు ఇతరులతో సమానంగా హక్కులు కల్పించాలని, పాఠశాలలో హరిజన బాలబాలికలకు పాఠశాల జీతం, పరీక్ష ఫీజు మాఫ్ చేయాలని, ప్రత్యేక విద్యార్థి వేతనాలు ఏర్పాటుచేయాలని, సందర్భాను సారం ఇతర విధములైన అనుకూలములను కల్పించాలని వేరువేరుగా తీర్మా నాలు ప్రవేశపెట్టినప్పుడు వాటిని బలపరుస్తూ సురవరం ప్రతాపరెడ్డి సనాతనపక్షం వారి వాదన లను పసలేనివిగా చేసాడు. ఇప్పుడీ తీర్మానాలను వ్యతిరేకిస్తే మనము హిందూ మతా నికి మహా అపకారం చేసినవాళ్ళం అవుతామని హెచ్చ రించాడు. ‘పెద్దపెద్ద నాయకులందరూ హరిజనులనింత కాలము నీచముగా చూచి నందులకు మనము ప్రాయశ్చిత్తము పెట్టుకొన వలెననుచున్నారు’ అనిచెప్పటం ఖమ్మం సభలకు భాగ్యరెడ్డివర్మ పంపిన సందేశాన్ని గుర్తుచేస్తుంది. ఆ మాటను ప్రస్తావించటం ద్వారా మనమే కాదు తీర్పులు ఇచ్చేవాళ్ళం ; మనమీద తీర్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారని మనం గుర్తించి మసలుకోవాలి అని హితవు చెప్పినట్లయింది.

ఈ తీర్మానాలపై వచ్చిన ఆక్షేపణలకు సమాధానం చెప్తూ పరమతాలవారికే లాంటి హక్కులిస్తామో, అంతకంటే నీచమైన హక్కులను గాక ఎక్కువ హక్కులనే మనము హరిజనులకీయవలెనని సామాజిక న్యాయ దృష్టితో చెప్పిన చిదిరె మఠం వీరభద్రశర్మ ప్రస్తుత తీర్మానములలో హరిజన దేవాలయ ప్రవేశము లేదు కనుక అందరూ ఏకగ్రీవంగా ఆమోదించ వచ్చునని చెప్పటం ఒక వైరుధ్యమే. మత సాంస్కృతిక భావజాలానికి మనిషి పై ఉన్న పట్టును, ఆ పట్టునుండి బయటపడటానికి జరిగే పెనుగులాటను ఇలాంటి సందర్భాలనుండే అర్ధం చేసుకొనటానికి ప్రయత్నించాలి.

డిసెంబర్ 6 నుండి 8 వ తేదీవరకు 1937 లో నిజమాబాద్ లో ఆరవ ఆంద్ర మహాసభలు జరిగాయి. అధ్యక్షులు మందుముల నరసింగరావు తన ఉపన్యాసంలో సంఘ అసమానతలకు కారణము ఒక స్త్రీపురుష విభేదమేగాక వర్ణవిభేదము కూడా ముఖ్య కారణం అని అభిప్రాయపడ్డాడు. ‘స్పృశ్యతా అస్పృశ్యతా భేదము ఒకానొకప్పుడు అప్పటి పరిస్థితులను బట్టి సకారణముగా ఏర్పడినను ఏర్పడి యుండవచ్చును’ అని సనాతనుల అభిప్రాయాన్ని మన్నిస్తున్నట్లుగానే మాట్లాడి ‘కానీ వర్తమాన కాలపరిస్థితులననుసరించి, ఈ తత్వమును స్థిరీకరింపజాలము’ అని నిక్కచ్ఛిగానే చెప్పాడు. “ఈ అస్పృశ్యులలోనే అలజడికలిగి తమ దుర్గతిని తెలుసుకొని స్వతంత్రకై పోరాడుచున్నట్టి యీ సమయమున, అగ్రజాతులవారు యీ సాంఘిక హెచ్చుతగ్గులు స్థిరముగా నుండుటకై పోరాడకూడదు. సాధారణ మానవ హక్కులను పొందు అవకాశము కలిగించి సహాయపడవలయును.” అని హితవు చెప్పిన తీరు సంవాదాలకు ముగింపు పలకవలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది. (ఆధారం: కె. జితేంద్రబాబు – నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు మొదటి, రెండు భాగాలు మార్చ్ 2007)

1917లో మచిలీ పట్నం నుండి వేమూరి రాంజీరావు సంపాదకత్వంలో నిమ్నజాతుల ఉద్ధరణకోసం దీనబంధు పత్రిక ప్రారంభమైంది. అంతవరకు మాసపత్రికగా ఉన్నది 1923 నుండి వార్తాపత్రికగా మారింది.( పొత్తూరి వెంకటేశ్వరరావు, తెలుగు పత్రికలు & డాక్టర్ జి.కె.డి. ప్రసాద్, దళిత జర్నలిజం, 2012) అలాగే రాజమండ్రి కేంద్రంగా దిడ్ల పుల్లయ్య సంపాదకత్వంలో 1927లో ఆదిమాంధ్ర మాసపత్రిక ప్రారంభం అయింది. 1940 వరకు కొనసాగిన దీనబంధు, 1950 లలోనూ కొనసాగిన ఆదిమాంధ్ర పత్రిక సంచికలు లభిస్తే దళిత సామాజిక, సాహిత్య ఉద్యమ గతి స్వభావ నిర్ధారణకు అవసరమైన అసలైన మూల సమాచారం అందుబాటులోకి రావచ్చు.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply