నిరాకరణ

విందాం
కూలిన శిధిలాల కింద కొట్టుకుంటున్న
మశీదు హృదయ స్పందనని

500
సంవత్సరాలుగా చరిత్రని తన
పక్కటెములుగా చేసుకొని నిలబడిన
కట్టడపు ఆత్మావలోకనాన్ని

కట్టింది ఎవరైతెనేం
ఆచరించిన నమాజుల దువాల
పవిత్రతని కదా చూడాలి

నీయత్ తీసుకున్న
ప్రతి నమాజీయుడి
ఉజూ నీరు మేఘాలుగా మారి దువాలు
వర్షంగా కురిసిన అల్లా ఇల్లది

కైకేయి ద్రోహానికి చేయని నేరానికి
అడవుల పాలైన
మర్యాదపురుషోత్తముడిలా
ఒక్కోసారి దేవుడు కూడా బోనెక్కుతాడు
మానవ సూత్రాల న్యాయాన్యాయాలను
మౌనంగా భరిస్తాడు తనను బొమ్మను
చేసి మానవుడు ఆడుకోడాన్ని చూస్తూ
ఊరుకుంటాడు

నిజానికి ప్రతి భారతియుడిలో ఒక
ముసల్మాను ఉన్నట్టే ప్రతి ముసల్మానులో
ఓ భారతియుడుంటాడు వాడు కబీర్లా
రామగీతాలను ఆలపిస్తాడు

తెలుసుకోవాలి గానీ ప్రతి హిందువులో
షీర్ఖుర్మాలాంటి ముసల్మానూ ఉంటాడు
వాడు ప్రతి బేస్తవారం దర్గాకెళ్ళి ఫాతెహా
సమర్పిస్తాడు

మశీదు నిరాకరించడం అంటే
మనిషిని నిరాకరించడమని నీకు నీవు
తెలుసుకోవాలి

ముసల్మాన్ను నిరాకరించడం అంటే
హిందువు మిత్రుణ్ణి నిరాకరించడమనే
ఎరుకు నీకెవరు కలిగించాలి

మిత్రుడు మిత్రుణ్ణి నిరాకరించేలా చేసే
మతరాజకీయానికి ఈరోజు బలైంది
ఎవరూ…?
హిందువా ముసల్మానా
మందిరమా? మశీదా?

లేక పంచుకోవడానికి ఉన్న ఒకే ఒక్క
దేశమా?

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

Leave a Reply