ఆ తల్లిని మొదటిసారిగా దాదాపు పద్దెనిమిది ఏండ్ల కింద చూసిన. తన కూతురును రాజ్యం దొంగ ఎదురుకాల్పుల్లో కాల్చేస్తే, ఆమె అంతిమయాత్రలో గుండె పగిలి ఏడుస్తుండగా చూసిన. మళ్ళీ అదే రాజ్యం తన కొడుకు మీద దొంగ కేసులు పెట్టి జీవితఖైదు చేస్తే, అతని సహచరితో మాట్లాడుదామని వెళ్ళినప్పుడు ఆ అమ్మను కలిసిన. కాని ఎక్కువగా మాట్లాడలేకపోయిన. అప్పటి నుండి మనసు కొంత ఎల్తిగా వుంది. మాట్లాడాలని ఉన్నా, ఏదో తెలియని జంకుగా వుంది. భద్రజీవితపు అపరాధ భావన ఒకవైపు. ఆ తల్లి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితి, నిస్సహాయత మరోవైపు. అయినా ఎలాగైనా మాట్లాడాలని, ఆ కూతురు, కొడుకు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఫోన్ (వీడియో కాల్) చేసిన.
ఆ తల్లి సూర్యవతి. ఆ కూతురు గంగాభవాని. ఆ కొడుకు ప్రొ. సాయిబాబ. అతని సహచరి వసంత.
వీడియో కాల్ ఎత్తగానే, “అమ్మా బాగున్నరా? పోయిన సంవత్సరం మీ ఇంటికి వచ్చిన, గుర్తు పట్టిండ్రా,” అని అడిగిన.
“బాగనే వున్నమ్మా. వచ్చే వుంటవు. కాని గుర్తులేదు,” అని బదులిచ్చింది.
“ఏంటమ్మా పోయిన సంవత్సరానికి ఇప్పటికే బాగా చిక్కిపోయినవ్,” అనగానే, “అవునమ్మా, చావు అంచులదాకా పోయింది ప్రాణం. సంవత్సరం నుండి మందుల మీద నడిపిస్తున్న,” అని చెప్పింది.
“అమ్మా, మీతో మాట్లాడాలని ఫోన్ చేసిన,” అని మరేదో అనబోతుండగానే, “అవును నాయనా మనమందరం మాట్లాడుకోని నా కొడుకును ఎట్లాగైనా బయటికి తీసుకు రావాలి. నా బెంగంతా ఆయన గురుంచే తండ్రి. నా కొడుకు మీద గవర్నమెంట్ ఎందుకు పగ పట్టిందో? వాడేమైనా నడవగలడా? బరువులు ఎత్తగలడా? తుపాకితో కాల్చగలడా?” అంటూ చెప్పుకుంటూ పోతుంది. నేను భయపడినట్లే ఆ తల్లి తన కొడుకును విడిపించే శక్తి నాలాంటి నిస్సహాయులకు ఉందనుకుంటుంది. అదే సమయంలో ప్రజలు నిరంతర సంభాషణలో ఉండాలని, ప్రశ్నించాలని, పాలకుల మెడలు వంచాలని చెబుతున్నట్లుగా ఉంది.
మనసులో ఎదోలావున్నా, “సరే అమ్మ,” అని చెప్పి, “సాయిబాబ మీద పెట్టిన దొంగ కేసు గురుంచి ప్రపంచానికి తెలిసిందే. కాని అంతటి ప్రజామేధావి ఎలాంటి పరిస్థితుల మధ్య పుట్టి పెరిగిండు, ఎలా ప్రజా ఉద్యమాల వైపు ఆకర్షితుడయిండు. ఇలాంటి విషయాలు మాట్లాడుకుందాం. ఈ విషయాలు ప్రజలకు తెల్వాలి,” అని నేను అనగానే అమ్మ చెప్పడం మొదలుపెట్టింది.
“చాలా కష్టాలు అనుభవించినం నాయన. చెప్పాలంటే చాలా వుంది. నా చిన్న మనుమడు ‘అన్నీ చెప్పు నానమ్మా, ఒక బుక్ రాస్త ‘ అంటుండు” అంటూ పొడిపొడిగా చెప్తుంటే, “అమ్మా, ఆ కష్టాలేవో నాకు కూడ చెప్పు. ప్రపంచానికి గంగాభవాని లాంటి, సాయిబాబ లాంటి వ్యక్తులు ఎలా పుట్టుకొస్తారో తెల్వాలి. కంగారు పడకుండ అన్ని నెమ్మదిగ చెప్పమ్మ” అని చెప్పిన.
ఇక ఆ అమ్మ చెప్పడం మొదలు పెట్టింది.
“మాది అమలాపురంకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే జనుపల్లె అనే చిన్న గ్రామం. నాకు ముగ్గురు పిల్లలు. పెద్దోడు సాయి, తర్వాత గంగాభవాని. అందరికన్న చిన్న రాందేవ్. పెద్దోడికి, చిన్నోడికి ఆరేండ్లు తేడ. మా పెద్దోడు మూడు నిండి నాలుగేండ్లు పడేవరకు టపటపమని నడిచేవాడు. ఆ తర్వాతే నడుస్తూ నడుస్తూ పడిపోయేవాడు. ఎందుకు పిల్లాడు ఇలా పడిపోతుండని ఊర్లో వున్న ఆర్ ఎం పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, ‘ఏమి కాలేదమ్మ కేవలం కాళ్ళ నొప్పులతో పడిపోతుండు,’ అని చెప్తె ఇంటికి వచ్చేసినం. కాని ఆ రాత్రి పిల్లాడు ఎక్కడ పడితే అక్కడే కదలకుండ వుండిపోతుండు. మళ్ళీ వెంటనే హాస్పిటల్ కు తీసుకుపోయిన. అక్కడ నయం కాకపోతే విశాఖపట్నం, పుట్టపర్తి అన్ని చోట్లకు తీసుకుపోయిన. చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్న. పిల్లాడు చివరికి ముద్దలాగ తయారయ్యిండు. విశాఖపట్నంలో డాక్టరైతే ‘ఈ ముద్దను ఎలా తీసుకొచ్చావమ్మా. ప్రాణాలకైతే గ్యారంటీ ఇవ్వలేను’ అని చెప్పి హాస్పిటల్ లో చేర్చుకున్నడు. అలా నెల రోజులు అక్కడే వుంటే నర్సులు రోజు వచ్చి ఎక్సర్‌సైజులు చేపించేవారు. అలా చేయంగ కొద్ది కొద్దిగ కదలిక వచ్చింది. ఇంకా ఎక్కువ రోజులు అక్కడే వుండే స్థోమత లేక పిల్లాడిని తీసుకొని ఇంటికి వచ్చేసినం. ఇక అప్పటినుండి నా కొడుకు భూమి మీద కాళ్ళుచేతులతో పాకడం మొదలుపెట్టిండు.”
“ఆయనకు చిన్నప్పటి నుండే చదువంటే మహా ఇష్టం. కాని స్కూల్ కు పోవడం కష్టమై ఇంటి దగ్గరే ఉండేది. అయితే మా ఇంటికి దగ్గర్లో వుండే స్కూల్ పిల్లలు వాళ్ళ బడి అయిపోయాక మా ఇంటికి వచ్చి సాయికి చదువు నేర్పించేవాళ్ళు. అట్ల మూడో తరగతి వరకు ఇంటి దగ్గరే చదువుకొని డిరెక్ట్ గా నాలుగో క్లాస్ కు స్కూల్ కు వెళ్లిండు. అప్పటి నుండి తానే పాక్కుంటూ వెళ్ళడం మొదలుపెట్టిండు. ఇక చిన్నోడికి ఆరు ఏండ్లు వచ్చేటప్పటికి సైకిల్ నేర్చుకోని అన్నని ఎక్కడికైనా తనే తీసుకెళ్ళేవాడు.”
“సాయిబాబను మళ్ళీ డాక్టర్స్ కు ఎప్పుడైనా చూపించారా?” అని అడిగితే…
“సాయి ఏడో క్లాస్ లో వున్నప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్ శర్మ గారు, “విశాఖపట్నం మిషినరీ హాస్పిటల్ నుండి ఆర్థోపెడిక్ డాక్టర్స్ వస్తున్నారు మెడికల్ క్యాంప్ కు. సాయికి సర్జరీ చేస్తే ఏమైనా బాగవుతదేమో చేపిద్దాం,” అని చెప్పాడు. మేము కూడ సరే అని సర్జరీ చేపించాము. మాకు హాస్పిటల్ లోనే ఒక చిన్న రూం ఇస్తె అక్కడే వుండేవాళ్ళం. చిన్నోడు అక్కడి నుండే స్కూల్ కి వెళ్ళేవాడు. దాదాపు నాలుగు నెలలు అక్కడే వున్నం. సర్జరీ తర్వాత కాళ్ళలో బలం రావడానికి, కండరాలు సాగడానికి కాళ్ళకి ఇసుక బ్యాగులు బరువులుగా వేలాడతీసేవాళ్ళం. బాధను భరిస్తూ అట్లనే మంచం మీద పడుకునేవాడు. అంత బాధలో కూడా ఎప్పుడు తన పరీక్ష గురించే అడిగేవాడు. అప్పుడు ఏడో క్లాస్ బోర్డ్ ఎగ్జాం కదా అందుకే అది రాయలేక పోతనేమో అని దిగులు పడేవాడు. శర్మ డాక్టర్ గారు, “సాయి! నువ్వు దిగులు పడకు, నిన్ను పరీక్షకు నీనే తీసుకపోత,” అని చెప్పేవారు. అట్ల బెడ్ మీది నుండి మోసుకపోతే కూడ పరీక్షల్లో ఫస్ట్ వచ్చిండు. ఆ సర్జరీ తర్వాత ఇంకా మెరుగు కావాలంటే ఇలాంటి పిల్లలకు పెద్ద ఆపరేషన్స్ కేవలం రష్యాలో మాత్రమే చేయగలరు అని మెడికల్ క్యాంప్ డాక్టర్స్ చెప్తె వెంటనే వాళ్ళకు సాయి ఉత్తరం రాశాడు. అయితే ఖర్చులు పెట్టుకోని వస్తె పరీక్షలు చేసి మళ్ళీ నడిచే అవకాశం ఏమైనా వున్నదా, లేదా చెప్తమన్నరు. గ్యారెంటీ లేదు, పోయే స్థోమత కూడా లేదు,” అని అమ్మ చెప్పింది.
అమ్మ ఈ విషయాలు చెప్తుంటే నా కళ్ళ ముందు రెండు దృశ్యాలు కదులాడుతున్నవి. ఒకటి, మంచంలో కదలలేని స్థితిలో, తీవ్రమైన నొప్పులతో వుండి కూడ తన పరీక్షల గురించి ఆలోచిస్తున్న సాయిబాబ. రెండు, ఒంటరి అండా సెల్ లో భౌతికంగా సగం శరీరం చచ్చుబడిపోయినా ప్రపంచం మొత్తాన్ని తన నిర్బంధ ఆవరణలో ఊహించుకొని అద్భుతమైన ఆలోచనలు చేస్తున్న, వాటిని కవిత్వీకరిస్తున్న సాయిబాబ. ఈ రెండు దృశ్యాలలో నాకు సాయిబాబ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసమే కనిపిస్తుంది. అన్నింటికి మించి అతని నిబద్ధత. తాను నమ్మిన రాజకీయాల కోసం ప్రాణాన్ని సహితం పణంగా పెట్టడం. దాని ముందు కాలమే తలవంచుకుంది. అందుకే “నేను చావును నిరాకరిస్తున్నాను” అని మొండి ధైర్యంతో ప్రకటించిండు. అతని ఆత్మస్థైర్యం ముందు దోపిడీ పాలక రాజ్యం ఎప్పుడో ఓడిపోయింది.
అమ్మ చదువుల గురుంచి చెబుతుంటె, “మీ ముగ్గురు పిల్లలు స్కూల్ కు వెళ్లేవాళ్లా?” అని క్లారిటీ కోసం అడిగిన.
“గంగాభవాని ఏడు పాసయ్యింది. తర్వాత ‘మనకు బతుకుదెరువు ఉండాలి కదమ్మా. అందరు చదువుకుంటే ఫీజులకు, పుస్తకాలకు డబ్బులు ఎక్కడినుండి వస్తవి. వాళ్లిద్దరు చదువుకోని’ అని తనే చదువు మానేసింది. ఆమెనే సొంతంగ కష్టపడి కుట్టుమిషిను నేర్చుకొని బట్టలు కుట్టడం మొదలుపెట్టింది. ఇల్లు గడవడం కోసం బిడ్డ బాగా కష్టపడింది” అని చెప్పింది.
గంగాభవాని గురుంచి వినగానే ప్రేమలో, త్యాగంలో స్త్రీలు ఎందుకు ముందుంటరో ఈ సమాజానికి ఎప్పటికైనా అర్థమవుతదా అనిపించింది. ఆమె తన కుటుంబం కోసం త్యాగం చేయడంతో మొదలు పెట్టి ప్రపంచాన్నే తన కుటుంబం చేసుకుంది. ఆ విశాల కుటుంబంలో అణగారిన ప్రజల విముక్తి కోసం తాను ఎంచుకున్న పోరాట మార్గంలో తన ప్రాణాలనే త్యాగం చేసింది.
అలా ఆలోచిస్తూనే, “గంగాభవాని కుట్టుమిషన్ ఆదాయం సరిపోదు కదా, మీకు ఇంకే విధంగైనా డబ్బులు వచ్చేవా?” అని అడిగిన.
“మాకు మూడెకరాల భూమి ఉండేది. వీళ్ళ నాన్నగారు భూమంతా తగలెట్టాడు. చివరకు ఏ పని దొరికితే ఆ పని చేశేవాడు,” అని చెప్తుంటె, “ఆ భూమి ఎట్ల పోయిందో కాస్త వివరంగ చెప్పమ్మ,” అని అడిగిన.
“వీళ్ల నాన్నగారు వ్యవసాయం చేసే స్థితిలో లేకపోతె ఆ భూమిని ఆయనకు తమ్ముడు వరుసయ్యే ఒకతనికి కౌలుకు ఇచ్చి అమలాపురం పోయి బతుకుతున్నం. సంవత్సరానికి ఒకసారి కౌలు డబ్బులు ఇస్తుండేవాడు. ఒకసారి పిల్లల బడికి ఫీజ్ కట్టాల్సి వచ్చినప్పుడు కౌలు డబ్బులు అడగడానికి పిల్లల పంపిన. ఆయన ‘మీకు ఇక కౌలు డబ్బులు ఇవ్వను. మీ నాన్నగారు నా దగ్గర నాలుగు వేల రూపాయలు అప్పు తీసుకున్నడు. అప్పు తీర్చలేక నాకు ఆ భూమిని అమ్మేశాడు’ అని అన్నడు. మాకెవ్వరికి ఆ అప్పు తీసుకున్నది తెలువదు. ఆ డబ్బులు ఏంచేసిండో కూడ తెలువదు. అట్ల ఆయన మంచి పంట పండే మూడెకరాల మాగాణిని నాలుగు వేలకే లాగేసుకున్నడు. ఇక అప్పటి నుండి అన్నీ కష్టాలే.”
ఆ భూమి ఆక్రమణ గురించి కాస్త క్లారిటీ ఇవ్వమని అమ్మకు పక్కనే ఉన్న చిన్న కొడుకు రాందేవ్ ను అడిగిన. అతను వెంటనే, “కౌలుకు తీసుకున్నాయన ఆ మూడెకరాల భూమిని మా నాన్నకు నాలుగు వేలు అప్పు ఇచ్చానని రాయించేసుకున్నడు. ఇప్పుడయితే ఆ భూమికి ఎకరానికి అరవై లక్షల వరకు ఉంటుంది. దాని మీద ఫైట్ చేయడానికి నేను, సాయి మాకు తెలిసిన ఒక లాయర్ ద్వార కోర్టులో కేసు వేసినం. అప్పుడు సాయి పది, నేను ఆరో క్లాస్ చదువుతున్నం. అయితే కోర్టులో మా నాన్న తన వెర్షన్ చెప్పడానికి నోరు కూడ విప్పలేదు. దానితోటి ఆ కేసును బయటనే సెటిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక లక్ష ఎనభై వేలు ఇవ్వాలని చెప్పి అందులో అన్ని అప్పులు, ఖర్చులు తీసేసి చివరకు డెబ్భై వేలు ఇచ్చారు. అయితే మాకు ఆ డబ్బులు ఎక్కడ పెట్టాలో కూడ తెలువదు. అప్పుడు మాకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. మా లాయర్ ‘ఈ డబ్బులు మీ దగ్గర వుంటె మీ నాన్న పాడు చేస్తడు, నా దగ్గరే వుంచుకొని నెలనెలా ఇంటరెస్ట్ ఇస్త’ అన్నడు. అలా ఆయన దగ్గరే చాలా కాలం ఆ డబ్బులు ఉండె. అవే మా ఇంటి ఖర్చులకు పనికొచ్చినవి. మేము హైదరాబాద్ కు మూవ్ అయినప్పుడు ఆయన ఆ డబ్బులన్నీ ఇచ్చేశాడు.”
రాందేవ్ ఇంకా చెప్తూనే వున్నడు… “దీనికి తోడు అప్పుడు కొత్తగా ఎన్.టీ.ఆర్ రేషన్ కార్డ్స్ ఇచ్చినప్పుడు అక్కడున్న తహిసిల్దార్ లోకల్ గా చదువుకున్న పిల్లలకు వెరిఫికేషన్ పని ఇచ్చిండు. ఆ పనిలో నేనూ, సాయి ప్రతి ఇంటికి పోయి వివరాలు తీసుకోని వెరిఫై చేస్తే వాళ్ళకు కార్డ్ ఇచ్చేవాళ్ళు. అట్లా చేస్తే కార్డుకు నలభై పైసలు ఇచ్చేవాళ్ళు. స్కూల్ నుండి వచ్చాక చేసేవాళ్ళం కాబట్టి వారానికి దాదాపుగ ఇరవై రూపాయలు సంపాదించేవాళ్ళం.”
మధ్యలో అమ్మ కలిపించుకోని, “పిల్లలు ఎగ్జాం అయ్యేటప్పుడు నీళ్ళు ఇచ్చేవాళ్ళు. దానికి కొంచం డబ్బులు వచ్చేది,” అని చెప్పింది. అది నాకు అర్థం కాలేదు. “అదేంటో కాస్త వివరంగ చెప్పమ్మ,” అని అడిగిన.
“అప్పట్లో పదో తరగతి పరీక్షలప్పుడు పరీక్ష రాసే పిల్లలకు ఎవరికైనా దాహం వేసి నీళ్లు కావాలంటే మా చిన్నోడు వెళ్ళి నీళ్ళు గ్లాస్ లో పోసి ఇచ్చేవాడు. దానికి రోజుకింత డబ్బులు ఇచ్చేవారు,” అని చెప్పింది.
మొత్తంగా నోట్లోకి నాలుగు ముద్దలు పోవడానికి ఎన్ని రకాల పనులు చేయగలరో అన్నీ చేశారు. నడవలేననో, చేతకాదనో చెప్పుకునే లగ్జరీ వాళ్ళకు ఎక్కడుంటుంది?! బహుశా ఇదేనేమో ఆ కుటుంబానికి ప్రజల కోసం కష్టాలను భరిస్తూ పనిచేసే శక్తినిచ్చింది అనిపించింది.
“అమ్మా, సాయి చదువుకు సంబంధించిన విషయాలు చెప్తారా?” అని అడిగితే…
“వాడికి మొదటి నుండి చదువంటే ప్రాణం. అన్నిట్లోను ఫస్ట్ వస్తుండే. అందుకని అందరి టీచర్లకి సాయి అంటే ఎంతో ప్రేమ వుండేది. ఎవ్వరు ఏ రోజు ఈ పిల్లాడికి కాళ్ళు లేవు, ఏమి చేస్తడు అని గేళి చేయలే. తక్కువ చేయలే. అందరు బాగా చూసుకునేది. సాయి పదో తరగతిలో మొత్తం జిల్లాలోనే ఫస్ట్ వచ్చిండు. అప్పటి నుండే తన తోటోల్లకి ట్యూషన్స్ చెప్పేవాడు. కాని ఎప్పుడు కూడ పైసా పుచ్చుకునేవాడు కాదు. మా ఇల్లు చిన్నగున్నా ఖాళీ స్థలం చాలా ఉండేది. పిల్లలందరు వచ్చి కూర్చొని చదువుకునేది. అట్లా అయనకు ఎంతో మంది స్నేహితులు అయ్యారు. అందరు అయనను ప్రాణంలాగ చూసుకునేవాళ్ళు. పదో క్లాస్ లో ఉన్నప్పటి నుండే వసంత కూడ పరిచయం. ఇద్దరిది ఒక్కటే క్లాస్. పది అయిపోయాక కాలేజ్ కు వెళ్ళేటప్పుడు వాళ్ళ స్నేహితులే తనని తీసుకుపోయేవాళ్ళు. తమ్మున్ని ‘నువ్వు చదువుకోరా బుజ్జి, మేము తీసుకెళ్తములే’ అని వాళ్ళే తీసికెళ్ళి మళ్లీ దిగబెట్టేవాళ్ళు,” అని చెప్పింది అమ్మ.
తనకు మూడో తరగతి వరకు స్కూల్ పిల్లలే ఇంటికి వచ్చి చదువు చెప్పారనే కృతజ్ఞత కావొచ్చు తాను ట్యూషన్ చెప్పినా పైసా తీసుకోలేదు. సమాజం నుండి తీసుకున్నది, సమాజానికి ఇవ్వడమంటే ఇదే కదూ! బహుశా ఈ ప్రాధమిక సామాజిక భావనే సాయిబాబను మొత్తంగా శ్రమజీవుల పక్షపాతిని చేసిందేమో!
రాందేవ్ చెప్పిన ప్రకారం పదో తరగతి తర్వాత సాయిబాబ పాలిటెక్నిక్ కోర్స్ కోసం ఎంట్రన్స్ రాస్తే కాకినాడ పాలిటెక్నిక్ కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చింది. కాని అక్కడ చేరడానికి వెళ్తే అక్కడ ఉన్న టీచర్స్ ‘నువ్వు వికలాంగుడవి కదా, ప్రాక్టికల్స్ లో చాలా కష్టమవుతది’ అని నిరుత్సాహపరిస్తే వెనక్కి వచ్చేశాడు. అయినా కూడ సైన్స్ మీద ఉన్న ఇష్టంతో అమలాపురం లోనె ఎస్.కే.బీ.ర్ కాలేజ్ లో ఇంటర్ యంపిసి గ్రూప్ లో చేరాడు. కాని ఇంటర్ లో కూడ ప్రాక్టికల్స్ కు చాలా ఇబ్బంది. రెండో అంతస్తులో ఉండటంతో చాలా ఇబ్బంది పడ్డాడట. మన సమాజం వికలాంగుల భౌతిక పరిమితులను దృష్టిలో పెట్టుకోని సంస్థల నిర్మాణం ఎప్పటికైనా చేసుకోగలదా అంటే అనుమానమే! అయితే ఇంటర్ తర్వాత భౌతిక ఇబ్బందులను దృష్టిలో వుంచుకోని బీఏ (ఇంగ్లిష్) అదే కాలేజీలో చేరిండు. అక్కడే తన క్లాస్మేట్, తర్వాత సహచరి అయిన వసంత కూడ ఇంటర్, డిగ్రీ చదువుకుంది.
అమలాపురం నుండి సాయిబాబ పీజీ చెయ్యడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చాడు. అక్కడే తనకు విద్యార్థి ఉద్యమాలు, ముఖ్యంగా మండల్ కమిషన్ ఉద్యమం సాయిబాబ మీద చాలా ప్రభావం వేసింది. సమాజ (కుల, వర్గ, లింగ, జాతి) సమస్యల మూలాలు వెతకడం అక్కడినుండే నేర్చుకున్నడు. ఆ తర్వాత అప్పటి సీఫెల్ లో ఎంఫిల్ చేస్తూ ఆ ఆలోచనలు మరింత పదునెక్కించుకున్నడు. అప్పుడే వసంతతో పెళ్ళి కావడం, దానితో తన కుటుంబం అంతా హైదరాబాద్ కు మారడం జరిగింది. హైద్రాబాద్ కు వచ్చాక గంగాభవాని అన్న నుండి స్ఫూర్తి పొంది మహిళా సంఘంలో పనిచేస్తూ, ఆ తర్వాత తన చైతన్యంతో విప్లవోద్యమంలోకి పూర్తి కాలం కార్యకర్తగా వెళ్ళిపోయింది. దాదాపు అయిదేండ్లు పని చేశాక 2001లో బూటకపు ఎదురు కాల్పుల్లో అమరురాలయ్యింది.
అప్పటికే పిహెచ్ డి చేయడానికి ఢిల్లీ వెళ్ళిపోయిన సాయిబాబ అక్కడే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాం లాల్ అనంద్ కాలేజ్ లో ఇంగ్లిష్ అధ్యాపకుడిగా ఉద్యోగం సంపాదించాడు. అతను ఢిల్లీ వెళ్ళే వరకు కూడ వీల్ చైర్ కొనుక్కోలేని పరిస్థితి. అమలాపురం నుండి ఢిల్లీ వరకు పాక్కుంటూనే పోయిండు. అక్కడి నుండే ఒక ప్రజామేధావిగా అణగారిన ప్రజల ఉద్యమాలకు అండగా “నిలబడినడు”. ఆ “నేరానికే” దోపిడీ కుల, వర్గ ప్రయోజనాలు కాపాడే రాజ్యం కుట్ర పన్ని సాయిబాబను దొంగ కేసుల్లో ఇరికించి జీవిత ఖైదు చేసింది.
ఈ విషయాలన్నీ మాట్లాడిన తర్వాత అమ్మను, “నీ కూతురును చంపేసిండ్రు. నీ కొడుకును జైల్లో పెట్టిండ్రు. ఇంత హింస అనుభవిస్తున్నప్పుడు మీకు ఏమనిపిచ్చింది?” అని అడిగిన. “నా పిల్లలు ఏం తప్పు చేస్తుండ్రు. నలుగురికి మంచి జరగాలనే పోరాటం చేస్తుండ్రు కదా అని సంతోషపడ్డ,” అని గర్వంగా చెప్పింది.
“నలుగురికి మంచి జరుగొచ్చేమో కాని, మీకేమొచ్చింది?” అని అడిగిన.
“అందరు మాకేమొస్తది అనుకుంటే, ఇక మనుషులెట్ల బతుకుతరు. మేము కష్టాలు పడుతమేమో కాని మిగిలినోళ్లన్న మంచిగ బతుకుతరు కదా,” అని బదులిచ్చింది.
ఇదే కదూ! ఉద్యమాలు పిల్లలనే కాదు, తల్లులను కూడ కంటావంటె! ఆ తల్లి ఎంత గోస అనుభవించినప్పటికి గొప్ప ఉద్యమ స్ఫూర్తిని ఎత్తిపడుతుంది.
అమ్మ చివరిగా మాట్లాడుతూ, “నాకు కూడ మోడీ దగ్గరకు వెళ్ళి అడగాలని వుంది. నా కొడుకును వదిలిపెట్టమని కాదు. నా కొడుకు ఏం తప్పు చేశాడో చెప్పమని? ఎప్పటికైనా ప్రభుత్వం తప్పు తెలుసుకుంటది. నా కొడుకు బయటికి వస్తడు. ఆ నమ్మకం నాకుంది. కాని మీలాంటి వాళ్ళందరు బాగా రాయాలి, మాట్లాడాలి,” అని అన్నది.
ఎన్నో కష్టాలను భరించి గొప్ప చదువులను, వ్యక్తిత్వాలను సంపాదించుకున్న తన పిల్లలను సమాజ మార్పుకు అందించిన ఆ తల్లి మన నుండి కోరుకుంటుంది కేవలం సంఘీభావాన్ని. “నా కొడుకు బయటకు వస్తడు,” అనే ఆ తల్లి నమ్మకాన్ని నెరవేర్చే పోరాటాలకు మద్దతుగా నిలబడుదాం. ప్రజామేధావి సాయిబాబను చెర నుండి విడిపించుకుందాం.
ఇంటర్య్వూ బాగుంది చాలా విషయాలు తెలిసాయి
Thank you, Ramesh garu!
Thank you @Ashok Garu for this Interview and Kolimi for publishing it. It’s heart wrenching to even just imagine everything their family went and still going through. Simply outraged by these baseless and unjust arrests of the people who are fighting for the oppressed..!
Thank you, Sahaja garu! Yes, it is horrifying to even think what Sai and others are going through. But, at the same time, it is hope instilling to know the fact that there are people who are ready to sacrifice their lives fighting fascists. They would be remembered forever for their struggles!
రియల్లీ మూవింగ్ అశోక్ , చాలా బాగా రాశారు . కన్నీరొచ్చింది చదువుతుంటే …
Thank you, Nirmala garu!
అమ్మకి జోహార్లు!