నాస్తికత్వం, హేతువాదం అనే పదాలు విదేశీయమైనవి అని విదేశాల్లోనే ఎథీజం పుట్టిందని చాలామంది భావిస్తారు. కానీ దేవుడు లేడు, స్వర్గ నరకాలు లేవు, ఈ భౌతిక ప్రపంచం ఒక్కటే నిజం అన్న ఈ భావనలు ఈనాటివి కావు. పూర్వ కాలం నుండీ మన దేశంలో ఆచరణలో ఉన్నాయి. భావవాదం, భౌతికవాదం రెండూ కూడా ప్రాచీన కాలం నుంచీ భారతదేశంలో సమాంతరంగా ప్రయాణిస్తూ వస్తున్నాయి. భావవాదం మతాన్ని నిర్మించి మనిషిని మూఢ విశ్వాసాలలో కూరుకుపోయేలా చేస్తే, భౌతికవాదం కార్యకారణాలను అన్వేషించే హేతువాదాన్ని నిర్మించింది.
శ్రీనాథుడు రాసిన కాశీఖండంలో బౌద్ధులు, చార్వాకులు, జైనులు, లోకాయతులు, వైతండికులు, పాషండులు, కాపాలికులు, దిగంబరులు, పాశుపతులు అనే తొమ్మిది రకాలైన నాస్తికులు ఆంధ్రదేశంలో ఉన్నట్లు వర్ణించాడు. వీరందరూ భౌతికవాదులు. వేమన జీవించిన కాలంలో నాస్తిక విశ్వాసాలు ప్రజల్లో బాగా ప్రచారంలో ఉండేవని ఆయన రచించిన అనేక పద్యాల ద్వారా తెలుస్తుంది.
చార్వాకులు లేదా లోకాయతులు ప్రాచీన భారతదేశంలోని నాస్తికులు, హేతువాదులు మరియు భౌతికవాదులు. “చార్వాక – లోకాయత” ఈ రెండు పదాల అర్ధాలను చూస్తే నాస్తిక, హేతువాద, భౌతికవాదాలకు” ఆనాడు ప్రజాదరణ ఉందని మనకు అర్ధమవుతుంది. “చారు” అంటే అందమైన అని అర్ధం. అందమైన వాక్కులు గలవారు కాబట్టి చార్వాకులు అనే పేరు వచ్చింది .కొన్నిచోట్ల “చార్వాకుడు” అనే పదం ఒక వ్యక్తిని సూచించటానికి వాడినప్పటికీ అనేక చోట్ల “చార్వాకులు” అనేది భౌతికవాదులైన నాస్తికులను సూచించటానికె వాడటం జరిగింది. వారి గురువు బృహస్పతి అని చెప్పబడింది. ఈ బృహస్పతి దేవతలకు గురువుగా మతగ్రంధాలలో చెప్పబడ్డ బృహస్పతి కాదు. బృహస్పతి చార్వాకాన్ని స్థాపించగా అజిత కేశకంబళి దీనిని ప్రాచుర్యం లోకి తెచ్చినట్లుగా చెప్పడమైనది. క్రీ.పూ 600వ సంవత్సరములో రచించిన బృహస్పతి సూత్రాలు చాలా వరకు కాలగర్భంలో కలసి పోగా, హైందవ శాస్త్రగ్రంథాలలో, బౌద్ధ, జైన మతాల సంభాషణలలో ప్రస్తావనలని బట్టి చార్వాక సిద్ధాంతాలని అభివృద్ధి చేయటం జరిగింది. ప్రాచీన భారతీయ తత్వాలైన అజీవిక, జైన, బౌద్ధ తత్వాలకు చార్వాకమే తత్వమూలంగా నిలచింది.
చార్వాకులకే లోకాయతులు అని మరొక ప్రసిద్ధ నామం ఉంది. “లోకేషు అయతః – లోకాయతః” అంటే లోకంలో వ్యాపించి ఉన్నదే లోకాయతము. ఇహలోకం మాత్రమే విషయముగా కల శాస్త్రం లోకాయతం. చార్వాకుల గురువు బృహస్పతి అవ్వటం వలన చార్వాకాన్ని బ్రాహస్పత్యం అని కూడా అంటారు. ఈ బృహస్పతి రాసినవి కానీ అతడి అనంతరం చార్వాకులలో ఎవరైనా రాసినవి కానీ ఏ గ్రంధాలు కూడా మనకు అందుబాటులో లేవు. వారి భావాలను గురించిన సమాచారం వారిని ఖండించిన మరియు నిందించిన వారి వద్ద నుండి మాత్రమే దొరుకుతోంది. ఇప్పుడు వీరి గురించి ‘మను స్మృతి’, వాత్సాయనుడి ‘కామ సూత్ర’, రామాయణం మరియు మహాభారతంలో ఎటువంటి ప్రస్తావనలు ఉన్నాయో పరిశీలిద్దాం.
నాస్తికో వేదనిందకః’ – ‘వేదాన్ని నిందించేవాడు నాస్తికుడు’ అంటాడు మనువు. తన స్మృతిలో ద్వితీయాధ్యాయంలోని పదవ శ్లోకంలో ఇలా చెప్తాడు.
“ధర్మబోధకాలైన వేదస్మృతుల గూర్చి ధర్మవివేచన సమయంలో ఎదురు ప్రశ్న వేయుట తగని పని.” ధర్మ గ్రంధాలను ప్రశ్నించొద్దు అని చెప్పినవెంటనే ప్రశ్నించేవారిని ఉద్దేశించి తదుపరి శ్లోకాన్ని ఇలా చెప్తాడు
“ధర్మానికి పరమప్రమాణమైన వేదాన్ని, స్మృతిని హేతుశాస్త్రమైన తర్కాన్ననుసరించి అవమానపరిచే ద్విజుడిని సాధుపురుషులందరు తిరస్కరించాలి. వేదనింద చేయువాడు నాస్తికుడే ఔతాడు.”
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలవారికి మాత్రమే ఉపనయనాధికారం ఉండేది. వేదాధ్యయనం మాత్రం బ్రాహ్మణులకే పరిమితం. కాబట్టి మనువు చెప్పినదానిబట్టీ అర్ధమయ్యే విషయం ఏమిటంటే చార్వాకులు వేదాలు, స్మృతులలో ఏముందో తెలియకుండానే విమర్శలు, ఖండనలు చేయలేదు అని.
వాత్సాయనుడు తన కామసూత్ర గ్రంధంలో ధర్మాచరణ చేయరాదు అని చెప్పే లోకాయతులను ఖండించే క్రమంలో వారి వాదనలను ఒక శ్లోకంలో ఇలా తెలియచెప్తాడు. “ధర్మములను ఆచరింపరాదు , ఎందుకంటే అవి భవిష్యత్ ఫలాలు కలిగినవి, పైగా ఆ ఫలాలు దక్కుతాయో లేదో కూడా అనుమానమే. ఎటువంటి మూర్ఖుడు తన చేతిలో ఉన్నదాన్ని వదులుకుని ఎప్పుడో ఏదో వస్తుందని ఎదురుచూస్తాడు? రేపటి నెమలి కన్నా నేటి పావురమే మేలు. పొందటంలో అనిశ్చితి ఉన్న బంగారు నాణెం కన్నా ఖచ్చితంగా పొందగలిగే రాగి నాణాన్ని పొందటం ఉత్తమం – అనేది లోకాయతుల వాదన” యజ్ఞయాగాదులలాంటి ధర్మకార్యములు ఇహలోక ఫలానికి సంబంధించినవి కావు, ఈ జన్మలో ఎటువంటి ఫలాన్నీ ఇవ్వకుండా మరు జన్మలో ఫలాన్ని ఇస్తాయి కాబట్టి చేయటం వ్యర్థం, మూర్ఖులే యజ్ఞయాగాదుల వంటి కార్యాలను చేస్తారు అనేది లోకాయతుల వాదన అని వాత్సాయనుడు చెప్తున్నాడు.
వాల్మీకి రామాయణం అయోధ్య కాండలో దశరథుడి మరణానంతరం అడవిలో ఉన్న రాముడిని కలవటానికి భరతుడు వెళ్ళినప్పుడు, రాముడు భరతుడికి రాజ్యపాలనలో మెళకువలు, జాగ్రత్తలు చెప్తూ లోకాయతుల ప్రస్తావన చేస్తాడు. వారితో జాగ్రత్త అని చెప్తాడు. వాల్మీకి రామాయణం, అయోధ్య కాండ, నూరవ సర్గ, 38,39 శ్లోకాలలో ఇలా అంటాడు రాముడు —
“లోకాయతులనే (భౌతికవాదులైన) బాహ్మణులను నువ్వు ఆదరించటం లేదనే భావిస్తున్నాను. ఎందుకంటే వారు అవివేకులు, కానీ అన్నీ తమకే తెలుసు అనుకుంటారు. ఇతరుల మనస్సులను వక్రమార్గం పట్టించటంలో వీరు నిపుణులు. గొప్ప ధర్మగ్రంధాలు ఉన్నప్పటికీ కూడా దుర్భుద్ధులైన వీరు తమ యొక్క తార్కిక చతురతతో వ్యర్ధ చర్చలు చేస్తుంటారు. వారిని ఆదరించవద్దు.” అని అయోధ్యను పాలిస్తున్న భరతుడికి సలహా ఇస్తున్నాడు.
రాముడి మాటల ద్వారా అర్ధం అవుతున్న విషయాలు :
- లోకాయతులు వేదాలు మరియు ఇతర ధర్మ గ్రంధాలను ధిక్కరిస్తారు, వాటిని వారు లక్ష్యపెట్టరు.
- వేదాలను ఖండించటానికి, విమర్శించటానికి లోకాయతులు తర్కిస్తూ చర్చలు, తర్కించటంలో వారు బాగా చాతుర్యం కలిగి ఉన్నారు.
- వారు అలా తర్కించి, చర్చించి, విమర్శించి ప్రజలకు వేదాల పైన నమ్మకంపోయేలా, వైదిక మార్గాన్ని వీడేలా చేయటంలో నైపుణ్యం కలిగి ఉన్నారు.
ఇక మహాభారతం విషయానికి వస్తే చార్వాకుల గురించి కానీ చార్వాక తత్వం గురించి కానీ ప్రత్యక్షంగా లేదు. చార్వాకుడు అనే రాక్షసుడి ప్రస్తావన మాత్రమే ఉంటుంది. మహాభారతంలోని శాంతి పర్వంలో యుద్ధం ముగిశాక రాజ్యాధికారాన్ని ధర్మరాజు స్వీకరించే సందర్భంలో చార్వాకుడి ప్రస్తావన వస్తుంది. హస్తినాపురం ప్రజలంతా ఉత్సవంలా గుమిగూడి ఉన్నప్పుడు బ్రాహ్మణులంతా అతనిని కీర్తిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు ఇలా అంటాడు. “ఓ ధర్మరాజా! సకల బ్రాహ్మణులు నన్ను తమ ప్రతినిధిగా పంపారు. వారి సందేశం విను. మహాపాపములు చేసిన వాడు ఇతడేమి రాజు? తండ్రులను, అన్నలను, తమ్ములను, పుత్రులను శంక లేకుండా చంపాడు. విద్యనేర్పిన గురువు అని కూడా చూడకుండా ద్రోణుని చంపాడు. ఈ ప్రకారంగా అందరూ నిన్ను అసహ్యించుకుంటున్నారు. ఇంకా నీకీ రాజ్యమెందుకు? బంధువుల నందరినీ చంపి రాజభోగములు అనుభవిస్తున్నావా! నీకు మహా పాపం చుట్టుకుంటుంది.”
అతడి మాటలకు బ్రాహ్మణులు ఆశ్చర్యపోతారు. ధర్మరాజు సిగ్గుతో తలదించుకుని “బ్రాహ్మణోత్తములారా! నన్ను మీరు నిందించకండి. వ్యాసుడు మొదలగు మహా మునులు ఆజ్ఞాపిస్తేనే నేను ఈ రాజ్యపాలనకు ఒప్పుకున్నాను.” అంటాడు. అప్పుడు బ్రాహ్మణులు దివ్య దృష్టితో “అతడు దుర్యోధనుడి స్నేహితుడు చార్వాకుడు అనే రాక్షసుడనే విషయాన్ని వారు తెలుసుకుని ధర్మ రాజుని సముదాయిస్తారు. తర్వాత వారు చార్వాకుడి వైపు ఒక్క సారిగా హోంకరించగా వాడు తన నిజ స్వరూపాన్ని దాల్చి భస్మం అయిపోతాడు. తర్వాత కృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్తాడు “ఇతడు చార్వాకుడు అనే రాక్షసుడు. కృత యుగంలో బ్రహ్మను గురించి తపస్సు చేసి ఎవరి నుండి కూడా అతడికి భయం లేకుండా ఉండే వరాన్ని పొందాడు. కానీ బ్రహ్మ ఒక షరత్తు పెట్టాడు. ఎప్పుడైతే బ్రాహ్మణులకు ఇష్టం లేని పని చేస్తావో, ఆరోజే అంతం అవుతావు అని “. ఇదీ మహాభారత కథలో రాయబడ్డ విషయం.
దీనిని నుండి మనం గ్రహించవలసిన విషయాలు :
- ఇక్కడ చార్వాక తత్వాన్ని ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. కానీ పరోక్షంగా వారి వాదనను , వారి వాదనా శైలిని తెలియజేయటం, ఇంకా వారిని దుష్టులుగా చిత్రీకరించటం జరిగింది.
2.చార్వాకుడు అనే పాత్రను రాక్షసుడు అని దుర్యోధనుడి అనుయాయి అని దొంగ వేషంలో వచ్చిన కపటుడిగా కథలో కథకుడు రాయటం ద్వారా నాటి సమాజంలో వైదీకులకు చార్వాకుల పట్ల ఉన్న ద్వేష భావాన్ని వ్యక్తపరచటంగానే మనం చూడాలి. - ఆనాటి సమాజంలో చార్వాకులు చేస్తున్న పనినే ఇక్కడ కథలో చార్వాకుడి పాత్ర మాట్లాడినట్లుగా కథకుడు ఈ కథను రాసాడు. వారు వారి చుట్టూ జరిగే అహేతుకమైన, అనైతికంగా ఉన్న విషయాలను ప్రశ్నించేవారు. అదే విధంగా ఇక్కడ చార్వాకుడు అనే పాత్ర ధర్మరాజును తన బంధువులను, గురువులను చంపి రాజ్యాధికారాన్ని పొందటాన్ని ప్రశ్నిస్తాడు.
- మహాభారతం ఒకేసారి ఒకే వ్యక్తి చేత రాయబడ్డ గ్రంధం కాదు, దాని రచన అనేక శతాబ్దాల పాటు సాగింది. ఈ చార్వాకుడి ఘట్టాన్ని రాసిన కథకుడు చార్వాకుల పైన తన అక్కసును ఈ పాత్రను ఇలా సృష్టించటం ద్వారా తీర్చుకున్నాడు అని భావించవచ్చు.
అలాగే మనుస్మృతి ,రామాయణ ,భారతాల తర్వాత బౌద్ద, జైన సాహిత్యంలో , చాణక్యుని అర్థశాస్త్రంలో కూడా చార్వాకుల గురించి ఉంది. బౌద్ధ సాహిత్యం సమ్మన్నఫల సుత్త ప్రకారం బౌద్ధ, జైన మతాలకు పూర్వమే క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి ఉన్న ఆరు నాస్తిక వాదాలలో చార్వాకము, అజీవికము కూడా ఉన్నాయి. బౌద్ధ సాహిత్యం దివ్యవదన ప్రకారం లోకాయతం తార్కికపరంగా అభ్యసించవలసిన శాస్త్రం. 12వ శతాబ్దం వరకూ చార్వాకము వర్థిల్లగా తర్వాత ఇది నామరూపాలు లేకుండా పోయింది. చార్వాకులు వేదాలను తిరస్కరించారు. చార్వాకుల ప్రకారం వేదాలలో లోపాలున్నవి. అవి అసత్యాలు. ఒకే అసత్యాన్ని పలు విధాలుగా నొక్కి వక్కాణించేవి. కర్మకాండ వైదికులకు, జ్ఞానకాండ వైదికులకు మధ్య జరిగే విమర్శాత్మక చర్చలు రెంటిలోనూ ఏదో ఒకటి అసత్యమని లేదా రెండూ అసత్యాలే అయి ఉండవచ్చుననేదానికి నిదర్శనాలు అని తెలిపారు. వేదాలు అసంబద్ధ ప్రేలాపనలని, పూజారుల పొట్ట నింపటానికే ఇవి ఉత్సాహము చూపుతాయని వీటి వల్ల మరే ఇతర ఉపయోగమూ లేదని తెలిపారు. వేదాలను కనుగొన్నది మానవులే కానీ అవి ఏ విధమైన దైవాజ్ఞలు కావని తెలిపాయి.
8వ శతాబ్దపు జైన సాహిత్యంలో హరిభద్రుడు రచించిన సదర్శనసముచ్చయ ప్రకారం, లోకాయత “దేవుడు లేడు, పునర్జన్మ లేదు, కర్మ లేదు, కర్తవ్యం లేదు, కష్టఫలాలు లేవు, పాపము లేదు” అని బోధించే ఒకానొక హైందవ తత్వం. చాణక్యుని అర్థశాస్త్రంలో ఇది మూడు అన్వీక్షికిలలో ( తార్కిక తత్వాలలో) ఒకటిగా ప్రస్తావించబడినది (యోగ, సాంఖ్య, లోకాయతలు). అయితే అర్థశాస్త్రంలో లోకాయతం వేదాలకు వ్యతిరేకం కాదు, వేదాలను నమ్మేదే. ఇందులో లోకాయతం చర్చ యొక్క శాస్త్రం లేదా తర్కంగా పరిగణించబడింది.
మనదేశంలో స్పష్టమైన భౌతికవాద ఆలోచనలు చేసి, భౌతికవాద విలువలను ప్రతిపాదించిన వారిలో చార్వాకులకు, లోకాయతులకు ఒక గొప్ప స్థానం ఉంది. మన ప్రాచీన థియేటర్ ఆర్ట్ పర్ఫార్మెన్స్ లో ఒకటైన యక్షగానాలలో చర్వాక నిర్వాక అనే కొన్ని సిరీస్ పెర్ఫొర్మెన్స్ లలో చార్వాకుల ప్రస్తావన ఉంది. చైతన్యానికి మూలం పదార్థమని వీరు ప్రతిపాదించారు, అందుకే వీళ్ళు భౌతిక వాదులు అయ్యారు .
యావజ్జీవేత్ సుఖం జీవేత్ జీవోన్నాస్తి మృత్యురాగోచర:
భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుత:”
తాత్పర్యము: జీవితమంతయు సుఖముగ జీవించు. మృత్యువు కంటిచూపు నుండి తప్పించుకొనే జీవుడు లేడు. శ్మశానంలో కాలి బూడిదై పోయిన తర్వాత ఈ దేహము మరల తిరిగి వచ్చునా?
దేవుడు లేడు , ఆత్మ లేదు , స్వర్గం లేదు , నరకం లేదు , మరణాంతరం ఏమి లేదు, అనేది వీరి ప్రతిపాదన. వీళ్ళు బుద్దుని కంటే ముందే భౌతిక వాదంలో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్లారు . వీళ్ళ ప్రభావంతోనే బుద్ధుని ఆలోచనలు మొదలైనాయి అని చెప్పవచ్చు. 307 BC లో ఎపిక్యురస్ అనే గ్రీకు తత్వ వేత్త చార్వాకుల వంటి ఫిలాసపిని ప్రతిపాదించారు. మెటీరియలిజం అని అనుకుంటున్న వాదాలకి ఆ ఫిలొసఫీ ప్రాతిపదిక. మనదేశం లో మెటీరియలిసం కేవలం ఒక ఫిలాసఫీ గానే మిగిలిపోతే, మధ్యప్రాచ్య ,పశ్చిమ దేశాలలో ఫిలాసఫీని ముందుకు తీసుకెళ్లి విజ్ఞాన శాస్త్రాలుగా అభివృద్ధి చేశారు.
నాస్తికులు అంటే దేవుళ్లను వ్యతిరేకిస్తూ ఆస్తికులను అవమానించే వారు అని చాలా మంది అనుకుంటారు. కాని అది నిజం కాదు. నాస్తికులు అంటే సత్యాన్ని మాత్రమే నమ్మేవారు నిజం కోసం నిత్యం అన్వేషించే వారు. మతం అనే మత్తు మందును వదిలించుకొని ఏ మతానికి వత్తాసు పలకకుండా మానవత్వమే తమ అభిమతంగా జీవించే వారు నాస్తికులు. ఇలా జీవించడం చాలా స్వేచ్ఛగా ఆనందంగా ఉంటుంది. దెయ్యాలు,దేవుళ్లు ,అతీంద్రియ శక్తులు, కర్మఫలాలు అంటూ మూఢవిశ్వాసాలను నమ్మకుండా స్వయంశక్తితో మనుషులు జీవించడానికి ఉన్న ఏకైక మార్గం నాస్తికత్వం. నేటి సమాజం మతమౌఢ్యపు వలలో చిక్కకుండా ఉండాలంటే యుక్తాయుక్త విచక్షణ , శాస్త్రీయ దృక్పథం ఉండటం చాలా అవసరం. అంధవిశ్వాసాలను ఖండించి హేతువాద భావాలను ప్రచారం చేసిన ఆనాటి భౌతికవాదులే మనకు ఆదర్శం కావాలి .
Very well written article.
బాగుందండీ, కొన్ని కొత్త విషయాలు తెలిశాయి.