నాణేనికి రెండోవైపు

మరణం అనివార్యం.

ఎవరూ కాదనలేని సత్యం.

ప్రతి రోజూ అనేకానేక మరణాలు. కారణాలు అనేకం.

ఓ కవి అన్నట్లుగా కళ్ళు తెరిస్తే జననం. కళ్ళు మూస్తే మరణం.

ఈ రెండింటి మధ్య నడిచే జీవితం. ఆ కాలాన్ని మాటువేసి కాటువేసి కబళింప చూస్తున్న మాయదారి కరోనా.

ఇది సహజ పరిణామంలో భాగమో, లేక మానవ నిర్మితమో, లేక మానవ ప్రయోగమో, లేక జీవసాంకేతిక ఆయుధమో… తెలియదు.

కానీ, అమెరికా నుంచి ఆఫ్రికా వరకు, ఇండియా నుంచి ఈజిప్ట్ వరకు ఎల్లలు లేకుండా లోకమంతా సమభావం చూపిస్తూ విలయతాండవం ఆడుతున్నది.

ప్రపంచమంతా యుద్ధభూమి గా మారిపోయింది. అటువంటి క్లిష్ట సమయంలో డాక్టర్ శ్రీరామ్ కదనరంగంలో సైనికుడిలా రాత్రి పగలు పని చేసాడు.

శ్రీరామ్ వంటి ఎందరో వైద్య సిబ్బంది నిద్రాహారాలు మరచి కరోనాపై పోరాటం చేశారు. చేస్తున్నారు.

కరోనా ఇటలీలో అడుగుపెట్టి వారిని అతలాకుతలం చేస్తూ వేలకు వేలమందిని మట్టిలో కలిపేస్తున్నప్పుడు కూడా తమ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అసలది పెద్ద సమస్య కానే కాదని కరోనా పాజిటివ్ లపై దృష్టి పెట్టలేదు. ప్రమాదాన్ని పసిగట్టలేదు. నిపుణుల సూచనలు చెవికెక్కించుకోలేదు. తప్పంతా చైనా దంటూ ఆడిపోసుకోవడం తప్ప చేసిందేమీ లేదు.

నిర్దిష్ట ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన ప్రభుత్వం, పోరాడాల్సిన ప్రభుత్వ వైఫల్యం కారణంగా పరిస్థితి భయానకంగా మారింది. ఎటు చూసినా శవాల కుప్పలతో అంటువ్యాధికి పెద్ద మూల్యం చెల్లించుకుంది.

న్యూయార్క్ నగరాన్ని సునామీలా కోవిడ్ -19 చుట్టేసినప్పుడు కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ కోఆర్డినేటర్ గా పనిచేశాడు డాక్టర్ శ్రీరామ్.

ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న ఐసీయూ బెడ్స్ అవసరం గుర్తించి తాత్కాలిక ఆసుపత్రుల ఏర్పాటులో కీలకపాత్ర వహించాడు. మాన్ హట్టన్ లో జేవిట్స్ సెంటర్ వంటివాటిని ఆసుపత్రులు గా మార్చేశారు. అందుబాటులో ఉన్న వనరులతో ఆగమేఘాల మీద అదనపు బెడ్స్ ఏర్పాటు, వైద్య సదుపాయాలు సమకూర్చుకోవడం జరిగింది. రోగులకు వైద్యం అందుబాటులోకి తేవడంలో ఇతోధికంగా కృషి చేశాడు డాక్టర్ శ్రీరామ్. అతని సూచనలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి సహకరించింది.

రోజులు గడిచే కొద్దీ అనూహ్యంగా కుప్పలుతెప్పలుగా వచ్చి పడిన మరణాలు, చూసి చూసి మెలిపెట్టే మనసును శాంతపరచుకుంటూ తనవంతు కృషి చేయడంలో కృతకృత్యుడయ్యాడు డాక్టర్ శ్రీరామ్.

వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి రోగుల ప్రాణాలు కాపాడడంలో నిమగ్నమయ్యారు. భయంతో వస్తున్న రోగులకు మానసిక ధైర్యాన్ని అందిస్తే, ఆ క్రమంలో కొందరు డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ జీవితాల్ని త్యాగం చేశారు.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న అమెరికా ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. క్రమంగా పరిస్థితి కాస్త మెరుగుపడింది. వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం అయ్యింది.

దేశంలో పరిస్థితి అంతకంతకు మెరుగవుతున్నది. జన జీవనం సాధారణ స్థితికి వస్తున్నది.

భారత్ కంటే వంద కోట్లపైనే తక్కువ జనాభా ఉన్న అభివృద్ధి చెందిన దేశం అమెరికా కంటికి కనిపించని క్రిమితో తలకిందులైంది. అంత పెద్ద కష్టం వస్తే భారత్ తట్టుకోగలదా అమెరికా పౌరుడిగా మారిన డాక్టర్ శ్రీరామ్ మదిలో ప్రశ్న.

మొదటి దశలో మాతృదేశం సులభంగానే బయటపడడం అతనికి ఎంతో ఊరటనిచ్చింది.

హమ్మయ్య గండం గట్టెక్కింది అనుకున్నంత సేపు పట్టలేదు రెండో దశ విరుచుకుపడి విస్తరించడానికి.

పేదలు అధికంగా ఉన్న మాతృదేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విలయం, రోజు రోజుకు పెరుగుతున్న కరోనా మరణాలు డాక్టర్ శ్రీరామ్ ను తీవ్ర ఆందోళనకు గురిచేసాయి. తనలో తనే తీవ్రంగా మదనపడుతున్నాడు.

అతని లాగే ప్రపంచం నలుమూలలా ఉన్న భారతీయ సంతతి వారు మాతృదేశం పట్ల ఆందోళన పడుతున్నారు. మాతృభూమి కోసం మానవత్వంతో స్పందిస్తున్నారు. తమ వంతు సహకారం అందించడానికి సమాయత్తం అయ్యారు. విరాళాలు డబ్బు రూపంలో, అవసరమైన వైద్య పరికరాల రూపంలో సహాయం అందించడమే కాకుండా తాము ఉంటున్న దేశాల నుంచి సహాయం కోసం ఆ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. టెలి మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి బృందాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

శ్రీరామ్ ఆలోచనలు మాత్రం జన్మభూమికి వెళ్లి సేవ చేసి ఋణం తీర్చు కొమ్మని బోధిస్తున్నాయి. ఇప్పుడు నీ అవసరం ఈ దేశంలో కంటే నీ మాతృదేశంలో ఎక్కువ. ఇక్కడ నువ్వు సుఖంగా ఉండటం కాదు. నువ్వు అందలం ఎక్కడానికి నీ దేశం చాలా చేసింది. మరి నీ దేశానికి నువ్వేం ఇచ్చావ్? నీకు జన్మనిచ్చిన దేశం శవాల దిబ్బగా మారకముందే వెళ్లు. కొందరినైనా కాపాడు. ఆ శక్తి, ఆ బాధ్యత నీ పై ఉంది. వెళ్ళు శ్రీరామ్… వెళ్ళు. అంతా అయిపోయాక నువ్వేం చేయగలవు? ఎవరికి చేయగలవు? ఇప్పుడే వెళ్ళు… నీకు జన్మనిచ్చిన దేశానికి నువ్వు ఇంతవరకు ఇచ్చింది ఏమీ లేదు. కన్న తల్లిని కాపాడుకోవడంలో నువ్వు సమిధ అయినా పర్వాలేదు వెళ్ళమని డాక్టర్ శ్రీరామ్ మనస్సు ప్రబోధిస్తున్నది.

నిజానికి అతనికి మాతృదేశం తో ఉన్న సంబంధ బాంధవ్యాలు చాలా తక్కువ. అయినా ఈ ఆపద కాలంలో అతని ఆలోచనలన్నీ అటువైపే ప్రయాణిస్తున్నాయి.

జనాలు ఎక్కువ సౌకర్యాలు తక్కువ ఉన్న దేశం మరింత అప్రమత్తంగా ఉండాలి. మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ అలా జరగడం లేదెందుకు? ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వని తనం, భయంకరమైన నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజా ఆరోగ్య వ్యవస్థ డొల్లతనం బయటపడింది.

అయ్యో… ఎలా… ఎన్ని వేల, లక్షల ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోనున్నాయో. గాలిలో దీపం పెట్టి, తప్పెట్లు తాళాలతో కరోనా మాయం చేసేశాం అని విర్రవీగిన వాళ్ళు ఇప్పుడు ప్రజలకు ఏమి సమాధానం చెప్పగలరు? ఇంత బాధ్యతారాహిత్యం ఏంటి? ఎన్నో ప్రశ్నలు అతనిలో. తెగని ఆలోచనలతో అశాంతిగా, అన్యమనస్కంగా ఉంటున్నాడు శ్రీరామ్.

అతని భార్య రేష్మ గత నాలుగు రోజులుగా శ్రీరామ్ ని గమనిస్తున్నది. ఇన్నాళ్లు నిద్రాహారాలు ఉన్నా లేకున్నా ధైర్యంగా యుద్ధరంగంలో నిలిచిన రామ్ కి ఏమైంది. ఇప్పుడు ఇలా మారిపోయాడు. తనలో తనే ఉంటున్నాడు. ఏదో కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. ఎందుకో అర్థం కావడం లేదు. దీర్ఘాలోచనలో పచార్లు చేస్తున్న భర్తను చూస్తూ అనుకుంది.

శ్రీరామ్, రేష్మ లది పాతికేళ్ల సహజీవనం. శ్రీరామ్ భారతీయుడు, రేష్మ పాకిస్తానీ. ఇద్దరూ న్యూయార్క్ నగరంలో వైద్యులు. ఇద్దరి మతాలు వేరు. దేశాలు వేరు. భాషలు వేరు. ఎల్లలు లేని ప్రేమ ఇద్దరినీ ఒకటి చేసింది. ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ ముందుకు సాగుతున్నది వారి జీవనం. వారి ప్రేమ ఫలంగా ఇద్దరు మగ పిల్లలు. ఒకరికి 18, ఒకరికి 16 ఏళ్ళు. భార్య కళ్ళలో మెదులుతున్న ప్రశ్నలు శ్రీరామ్ కి అర్ధమవుతున్నాయి.

గత వారంగా మొద్దుబారిన చైతన్యాన్ని తట్టి లేపి భార్య, పిల్లలని సమావేశపరచాడు. “కరోనా ప్రకృతి వైపరీత్యమో, మానవ తప్పిదమో, వైద్య వ్యవస్థల వైఫల్యమో, అన్నీ కారణమో తెలియదు కానీ కరోనా రెండో దశలో వేగంగా విస్తరిస్తోంది. భారతదేశంలో రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయి, సరైన చికిత్స దొరక్క ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను.” అంటూ మనసులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలు, గాయమై సలుపుతున్న భావాల మడతల్ని వారి ముందు విప్పాడు.

ముగ్గురి ముఖాలలో అంతులేని ఆశ్చర్యం.

నిశ్శబ్దంగా విన్న ముగ్గురూ మౌనమే సమాధానం గా అతని కేసి తదేకంగా చూస్తున్నారు.

ఆ మౌనాన్ని ఛేదిస్తూ “మా ఊహకి అందని నిర్ణయం. హాట్సాఫ్ టు యూ నాన్నా… మనసుకు నచ్చిన పనిలో ఉండే కిక్కే వేరు. పెను విపత్తు కాలంలో ఒక డాక్టర్ గా మీ స్పందన అభినందనీయం” అంటూ వెళ్లి తండ్రిని అభినందిస్తూ హగ్ చేసుకున్నాడు పెద్ద కొడుకు సమీర్.

నిన్నమొన్నటి వరకు చెయ్యి పట్టుకొని తిరిగిన కొడుకు ఆరడుగుల ఎత్తే కాదు వ్యక్తిగా ఎదిగిపోయాడు. హుందాగా వ్యవహరిస్తున్నాడు, పరిణతితో ఉన్నాడు అని ఆశ్చర్యంగా సమీర్ ని చూస్తున్నాడు శ్రీరామ్.

“నాన్నా… నీకెవరున్నారక్కడ? నానమ్మ తాతయ్య ఎవరూ లేరుగా, అయినా అక్కడికి వెళ్లకుండా సాయం చేయవచ్చుగా… కొంతమంది అమెరికన్ ఇండియన్స్ భారతదేశానికి సహాయం అందించవలసిందిగా బిడెన్ పై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు తమ వంతు సాయంగా డబ్బులు పంపిస్తే, మరికొందరు అవసరమైన వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు పంపిస్తున్నారు. మీరు అలా చేయొచ్చుగా నాన్నా” చిన్నవాడి ప్రశ్న.

“నాకు జన్మనిచ్చిన తల్లి స్పర్శ, ప్రేమ తెలియదు. నాన్నేపెంచారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ఫీజు కట్టి నన్ను మెడిసిన్ చదివించేంత స్థోమత లేదు. శ్రద్దగా చదివి మెడిసిన్ సీటు తెచ్చుకుంటే సరిపోదు. నా దేశమే నాకీ చదువు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్ షిప్ తోనే చదివా. అదే కనుక లేకపోతే ఈ రోజు ఏ స్థితిలో ఉండేవాన్నో. ఉస్మానియా వైద్య కళాశాల లో ఎంబీబీఎస్, తర్వాత ఎయిమ్స్ ఢిల్లీ లో పీజీ మాతృదేశపు భిక్షే కదా… ఈ రోజు ఇంత వైభోగం వెలగబెడుతున్నానంటే కారణం నా మాతృభూమి. అదంతా చెప్పినా వీళ్ళకి అర్థం కాదు” మనసులోనే అనుకున్నాడు డాక్టర్ శ్రీరామ్.

ఉవ్వెత్తున ఎగుస్తున్న ఉద్వేగాన్ని అణుచుకుంటూ, “నువ్వన్నది నిజమేరా. ఎవరి పరిధిలో వారు మాతృభూమికి చేయూత ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. నేను ప్రత్యక్షంగా పాల్గొనాలనుకుంటున్నాను” అన్నాడు శ్రీరామ్.

“నాన్నా కష్టకాలంలో ఎక్కడో ఉన్న వాళ్ళు గుర్తొచ్చారు. నీ చుట్టూ ఉన్నవాళ్లు నీ వాళ్ళు కాదా? రెండో వాడు సాహిర్ తండ్రి కళ్లలోకి సూటిగా చూస్తూ మరో ప్రశ్న సంధించాడు.

“మనకి కూడు గుడ్డ ఇస్తున్న ఈ దేశాన్ని కాదని అనలేదుగా… ఇది ఎక్కువ అది తక్కువ కాదు. ఇక్కడున్న వాళ్ళకి నాన్న తక్కువ చేయలేదుగా… అక్కడ! భారత్ బొందల గడ్డగా మారకూడదని నాన్న తాపత్రయం.” తండ్రి వైపు వకాల్తా పుచ్చుకున్న సమీర్.

“మనిషి కష్టకాలంలో ఉన్నప్పుడు మాతృ దేశంపై ప్రేమ అభిమానం గౌరవం అర్థమవుతుంది కావచ్చు” అన్నది రేష్మ.

“ఇక్కడ మా గురించి మీరేమి దిగులు పడకండి. మేం చిన్న పిల్లలం కాదు. మాతో అమ్మ ఉంటుంది. ఇక్కడ ఉండి ఏమీ చేయలేకపోతున్నానని బాధ పడడం కన్నా వెళ్లడం ఉత్తమం నాన్నా. అది మీ ఆరోగ్యానికి మంచిది. ఆ దేశానికి మీలాంటి వాళ్ళు అవసరం” తండ్రి తన వృత్తిని ఎంత ప్రేమిస్తాడో ఎరిగిన సమీర్.

“నాన్నా నిన్ను నొప్పించాలని కాదు నా సందేహం వెలి బుచ్చానంతే” పుట్టిన గడ్డపై తండ్రి మమకారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ సాహిర్.

రేష్మ వచ్చి భర్త పక్కన కూర్చుంది. అతని చేయి తన చేతిలోకి తీసుకుని ఆత్మీయ స్పర్శ నందిస్తూ “మనం డాక్టర్లం. ఇక్కడ ఉన్న, ఎక్కడ ఉన్న యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు యుద్ధం చేయాల్సిందే. పోతున్న ప్రాణాలు నిలబెట్టాల్సిందే. అది మన వృత్తి ధర్మం రామ్.” ప్రోత్సహిస్తూ రేష్మ.

తన మనసెరిగిన భార్యా పిల్లలకి ధన్యవాదాలు తెలిపి తన ప్రయాణ ఏర్పాటు చేసుకోవడంలో మునిగిపోయాడు శ్రీరామ్.

ఎక్కడికి వెళ్ళాలి, ఢిల్లీ వెళ్లాలా..? హైదరాబాద్ వెళ్లాలా? ప్రశ్న తలెత్తింది. ఢిల్లీ లో పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మొదట కొంత కాలం ఢిల్లీ లో ఉండి ఆ తర్వాత హైదరాబాద్ వెళితే బాగుంటుందేమో సలహా ఇచ్చింది భార్య రష్మి. ఆ సూచన, సలహా నచ్చింది.

ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి, తన రాకను తెలియజేస్తూ ఎయిమ్స్ లో పనిచేస్తున్న మిత్రులు రాబర్ట్, వేదాంత లకు, వైజాగ్ లో ఉంటున్న మూర్తికి మెయిల్ చేశాడు. ఆ క్షణమే తన ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. న్యూయార్క్ లో తను పనిచేస్తున్న హాస్పిటల్ కి మూడునెలలు సెలవు పెట్టాడు. కావలసిన సరంజామా ఏర్పాట్లు చేసుకున్నాడు.

ఏ విషయంలోనూ ఎవరికీ భారం కాకూడదని నాలుగు జతల బట్టలతో పాటు PPE కిట్స్, సర్జికల్ మాస్క్ లు, N95 మాస్కులు, గ్లౌవ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాడు. కోవిడ్ హాస్పిటల్ కి దగ్గర హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాడు. స్వచ్చందంగా మాతృదేశానికి సహకరించడానికి బయలు దేరాడు శ్రీరామ్.


శ్రీరామ్ ఊహించిన దానికంటే మరింత అధ్వానంగా ఉంది వాస్తవ పరిస్థితి. ప్రజా ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. యంత్రాలు ఉంటే టెక్నిషియన్స్ లేరు. టెక్నిషియన్స్ ఉంటే యంత్ర పరికరాలు లేవు. ఆక్సిజన్, మందులు సరిపోవు. సరిపడా స్టాఫ్ లేరు. ఉన్న సిబ్బంది కూడా వివిధ కారణాలతో తగ్గిపోతున్నారు. వృత్తి ధర్మం మరిచి ప్రాణాలపై తీపితో కొందరు డాక్టర్లు ఇంట్లో కాలక్షేపం చేస్తున్నారు.

ఉన్న పరికరాలు, పనిముట్లు ఉపయోగించే స్థితి లేదు. పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందిపై పనిభారం విపరీతంగా పెరిగి పోతున్నది. పీజీ విద్యార్థులు, తాత్కాలిక సిబ్బంది పనిభారం మోస్తున్నారు. ప్రాణాలకు తెగించి వైరస్ తో పోరాడుతున్న వైద్య సిబ్బంది తీవ్ర ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. కొందరు కొరోనాకి గురయ్యారు.

మరో పక్క అత్యాధునిక వైద్యం పేరుతో కొండచిలువలా చుట్టేసిన పెద్ద పెద్ద ఆస్పత్రులు. ప్రజా ఆరోగ్య రక్షణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో స్పష్టమవుతున్నది. ఈ విధమైన బలహీన ఆరోగ్య వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలో ఉండదేమో..!

సెకండ్ వేవ్ రావచ్చని తెల్సినా సన్నద్ధత లేదు. సిబ్బంది నియామకం , ఆక్సిజన్ సరఫరా , బెడ్స్ పెంచడం ,మందులు అందుబాటులోకి తేవడం వంటి వాటి గూర్చిన ఆలోచన ఉన్నట్లే లేదు.

దేశం కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సమయంలో అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా జరిగిన భారీ రాజకీయ సభలు, సమావేశాలు… మేళాలు… చాపకింద నీరులా వ్యాపించిన వ్యాధి, కార్చిచ్చులా ఇళ్లను, వీధుల్ని, పల్లెల్ని, పట్టణాల్ని, నగరాల్ని చుట్టేస్తున్నది. మృత్యువు కల్లు తాగిన కోతిలా సంచరిస్తున్నది. జీవితాల్ని కబళించివేస్తున్నది.

నిధుల లేమి, అరకొర వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలెండర్లు, సిబ్బందికి రక్షణ కవచాలు వంటి వసతుల లేమి మృత్యు గీతానికి సహకరిస్తున్నాయి.

ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజా ఆరోగ్య వ్యవస్థను అందరూ కాకపోయినా నిబద్ధులైన వైద్య బృందం భుజాలపై మోస్తున్నది. రోగుల ప్రాణానికి ప్రాణవాయువు అందించి వల్లకాట్లో కలవకుండా తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నది.

ఆ ఆసుపత్రిలో సీనియర్ వైద్యులు ఇద్దరు కరోనా బారిన పడ్డారు, సీనియర్ సిటిజన్ వైద్యుడొకరు తప్ప మిగతా వారంతా జూనియర్ డాక్టర్లు. జస్పాల్ సింగ్, యోగేశ్వర్, సిద్దిఖీ అలీ, ఆస్మా బేగం, మేరీ శ్యామల, ప్రసాద్, డేవిడ్ చైతన్య, ప్రీతి రావు తదితరులున్నారు. వరదలా వచ్చిపడుతున్న రోగుల సేవలో చేస్తున్నారు కానీ భుజం తట్టి ముందుకు నడిపే వాళ్ళు కొరవడ్డారు. ముసురు పట్టిన మనసుతో నిర్వేదంతో పనిచేసుకుపోతున్నారు వాళ్లంతా .

సరిగ్గా ఇటువంటి తరుణంలో అప్రమత్తంగా ఉండవలసిన సమయంలో డాక్టర్ శ్రీరామ్ మాతృ దేశానికి రాక ఆ డాక్టర్లలో, వైద్య సిబ్బందిలో కొండంత స్థైర్యాన్ని నింపింది. స్ఫూర్తినిచ్చింది.

పరిస్థితిని అంచనా వేసిన డాక్టర్ శ్రీరామ్ మొదట నర్సింగ్, పారా నర్సింగ్ సిబ్బంది, డాక్టర్లలో మానసిక స్థైర్యం నింపడం మొదలు పెట్టాడు. ఉన్న అతికొద్ది వనరులతో, సిబ్బందితో రోగులకు చికిత్స అందించడం కష్టమే.

అయినప్పటికీ వీలయినంత వరకు రోగులను బెడ్స్ లేవని తిప్పి పంపకుండా వైద్యం అందించే ఏర్పాట్లు మొదలు పెట్టాడు. కానీ వైద్య పరికరాలను సమకూర్చుకోవడం చాలా కష్టంగా ఉంది.

మానవ విపత్తులో అహర్నిశలు కృషి చేస్తున్నారు. వందలాది మంది రోగుల ఆరోగ్యం కోసం తమ జీవితాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు.

వారు జీవించడం కోసం కాదు ఎదుటి వారి జీవితాల్లో ఊపిరి నిలపడం కోసం రాత్రి పగలు తిండి నిద్ర త్యాగం చేస్తూ పనిచేస్తున్నారు. కానీ ఆపదలో వస్తున్న రోగులందరికీ చికిత్స చేయలేకపోతున్నారు. తిప్పి పంపాల్సి వస్తున్నది. నేలమీద పడుకోబెట్టి చికిత్స చేయడానికి కూడా వీలుకాని పరిస్థితి.

అధునాతన వైద్య పరికరాలు ఉన్నప్పటికీ మొదటి దశలో చాలా అవస్థలు పడిన స్థితి గుర్తొచ్చింది శ్రీరామ్ కి. అప్పుడు పరిస్థితి అందరికీ కొత్తే. గందరగోళమే.

కానీ ఇప్పుడు ఇక్కడి పరిస్థితి అది కాదు. మొదటి దశ అనుభవం ఉంది. బయట దేశాల్లో పరిస్థితి పై అవగాహన ఉంది. అయినా అధ్వాన్నంగా పరిస్థితులు.

ఆ రోజు ఉదయం నుంచి ఏమీ తినలేదు డాక్టర్ శ్రీరామ్. ఆకలితో ఓపిక తగ్గి అలసట, నీరసం ముంచుకొస్తున్నది. షుగర్ లెవెల్ తగ్గినట్లుంది. వచ్చి కూర్చున్నాడు.

రష్మి నుంచి వచ్చిన మెసేజ్ లు చూస్తూ తను తెప్పించుకున్న పార్సెల్ విప్పుతున్నాడు డాక్టర్ శ్రీరామ్.
అదే సమయంలో డాక్టర్ జస్పాల్ సింగ్, డాక్టర్ ప్రీతి రావు కూడా బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వచ్చారు. ppe కిట్, గ్లోవ్స్ , ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డ్ తీసి శుభ్రంగా చేతులు కడుక్కొని శ్రీరామ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు ఇద్దరు.

మాటల మధ్యలో ఒక్కసారి నా భవిష్యత్ ఏంటో నాకు దిగులేస్తున్నది అన్నాడు జస్పాల్ సింగ్.

అది జస్పాల్ సింగ్ ఒక్కడి బాధ మాత్రమే కాదు. దాదాపు పీజీ విద్యార్థులందరిలో ఆ భయం తొంగి చూస్తున్నది.

అకడమిక్ ఉపన్యాసాలు లేక తమ చదువు నిర్లక్ష్యానికి గురవుతున్నా, భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న దిగులు మేఘాలు కమ్ముకొస్తుంటే వాటిని పక్కకు తరిమేసి పనిచేస్తున్నారు పీజీ విద్యార్థులు. వచ్చే జీతం అరకొర అయినా, అధిక పనిభారం మీదేసుకుని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

కరోనా రోగుల ప్రాణం గాలిలో కలిసిపోకుండా పనిచేస్తూ వైరస్ కి గురవుతున్నారు.

కాసే చెట్టుకే దెబ్బలు అన్నట్టు పనిచేస్తున్న వారిపైనే భారమంతా. ఉన్న వారికి పనిభారం నాలుగింతలు పెంచిన ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులు అదనపు వైద్యులను నియమించలేదు. సీనియర్ వైద్యులు ఎందరో వైరస్ బారిన పడ్డారు. కొందరు కుప్పలుతెప్పలుగా తగలబడే కాష్టాల్లో కలిసిపోయారు.

“గాలికి విరిగిన చెట్టు కొమ్మల లాగా మన భవిష్యత్ ఉన్న మాట నిజమే. రేపనేది ఉంటేనే కదా ఆ ఆలోచన. రేపటిని నిలబెట్టుకోవడం మన తక్షణ కర్తవ్యం. ఇప్పటికే మనపై చాలా వత్తిడి ఉంది. అనవసర ఆలోచనలతో మరింత ఒత్తిడి పెరుగుతుంది మిత్రమా…
అటు చూడు వాళ్ళని, ఇంట్లో అయినవాళ్లు ఎవరూ స్పర్శించడానికి, దరి చేరడానికి ఇష్టపడని సమయంలో రోగుల్ని, ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నంలో ఆ సిబ్బంది. వాళ్లకన్నా మనం ఎన్నో రేట్లు మెరుగ్గా ఉన్నామని నా మనసుకు నచ్చ చెప్పుకుంటూ ఉంటా” అన్నది డాక్టర్ ప్రీతి రావు.

ఆమె మాటలు వినపడనట్లే ఉన్న జస్పాల్ “పాలన పడకేసింది. వ్యవస్థ కుప్పకూలింది. నందిని నంది, పందిని పంది అని కుండబద్దలు కొట్టలేకపోతున్నారు. ప్రైవేటు వైద్యపు దోపిడీ పై దుమ్మెత్తిపోస్తున్నారు కానీ చేవ చచ్చిన ప్రభుత్వం గురించి మాట్లాడరు. ప్రశ్నించరు. బెడ్లు లేక కోవిడ్ బాధితుల అవస్థలు, ఆర్తనాదాలు చూడలేకపోతున్నాం. ఆక్సిజన్ లేక ఈ రోజు ఇప్పటికే ముగ్గురు ఈ భూమ్మీద తమ చోటు ఖాళీ చేసి పోయారు. సమాజానికి ఎంతో చేయాల్సిన వాళ్లు, ఇవ్వాల్సిన వాళ్ళు సుడిగాలికి రాలిన ఆకుల్లా రాలిపోతున్నారు. కళ్ళముందే ప్లాస్టిక్ మూటల్లోకి బదిలీ అయిపోతున్నారు. శవాలను దహనం చేయడానికి చోటులేని స్మశానం, తమ వంతు కోసం రోజుల తరబడి ఎదురు చూసే శవాల గుట్టలు. సామూహిక అంత్యక్రియల కవురు వాసన.. మనసంతా దేవేస్తున్నది. పరిస్థితి చూస్తుంటే ఊపిరి ఆడడం లేదు.” ఆవేశపడ్డాడు డాక్టర్ జస్పాల్ సింగ్.

“కూల్ మిస్టర్ కూల్ … ఇది తప్పులు ఎంచాల్సిన సమయం కాదు. వైద్యులుగా రోగుల్ని గట్టెక్కే మార్గం తప్ప, కరోనా కర్కశ కోరల నుంచి బయటకి తేవడం తప్ప మరో ఆలోచన మన మెదళ్ళలో రానివ్వకపోవడం మంచిది.
హాహాకారాల నడుమ ఉండే మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన ఆరోగ్యానికి అంత మంచిది. మనం అందించే చిన్న ఓదార్పు కూడా ఆక్సిజన్ లా పనిచేస్తుంది. ఛిద్రమైన మనసుకు సాంత్వన ఇస్తుంది. పోతున్న ప్రాణాన్ని నిలబెడుతుంది. బి పాసిటివ్ యంగ్ బోయ్” అనునయంగా అన్నాడు డాక్టర్ శ్రీరామ్

“ఇక్కడ వైద్యులు కొందరు ప్రజల అసహాయతను ఆసరా చేసుకుని శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు. సొమ్ము చేసుకుంటున్నారు. మీరేమో సంపాదన వదులుకుని, సొంత ఖర్చుతో ఇక్కడ సేవ చేస్తున్నారు. పరాయి దేశ పౌరసత్వం తీసుకున్నప్పటికీ భారత దేశంపై మమకారం ఇంకా పోనందుకు ఆశ్చర్యం. ఆపత్కాలంలో మాతృ దేశానికి వెన్నుదన్నుగా నిలిచే మిమ్ములను చూస్తే మా అందరికీ గౌరవం సార్. కారుచీకట్లో వెలుతురులా … ” అంటున్న డాక్టర్ ప్రీతి రావు మాటలకు మధ్యలోనే అందుకుని “అది నా గొప్పతనం కాదు మనం ఎంచుకున్న వృత్తి బాధ్యత మై డియర్ డాక్టర్. మనం కొందరిలా కలల్ని అమ్మడం లేదు. మౌనంగా ఉండటం లేదు. ధైర్యం నింపుతున్నాం. సునామీలా విరుచుకుపడుతున్న సెకండ్ వేవ్ లో మనమంతా సర్వశక్తులూ ఒడ్డి మృత్యు విహారానికి అడ్డుకట్ట వేయాలి. అలా జరగాలంటే మన మెదడు, మనసు పచ్చగా ఉంచుకోవాలి. మనం చేయగలిగినంత చేయాలి. అది ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా మన బాధ్యత” చిరునవ్వుతో శ్రీరామ్.

“బయటకు చూడండి సార్.. జనం వీధుల్లో, అంబులెన్సుల్లో ఆస్పత్రిలో బెడ్ కోసం గంటలకొద్దీ పడిగాపులు పడుతున్నారు. ఆక్సిజన్ దొరక్క, వెంటిలేటర్లు లేక, ప్రాణధార ఔషధాలు అందక అల్లాడుతూ కొందరు నిర్భాగ్యులు కన్నుమూస్తున్నారు కడుపు తరుక్కుపోతుంది. అక్కడికీ, పోటెత్తుతున్న రోగులకు పడకలు లేక కారిడార్లలో, ఆవరణలో అనుకూలంగా ఉన్న చోట్ల లో ఉంచి వైద్యం అందిస్తూనే ఉన్నాం. ఆ మాత్రం జాగా కూడా లేక తిప్పి పంపాల్సి వస్తున్నప్పుడు నా మీద నాకు కోపం వస్తుంది. ప్రశాంతంగా ఎలా ఉండగలను సర్ ?
బతుకు భయం తో వచ్చిన రోగులను వెనక్కి పంపాల్సి రావడం క్షమించరాని నేరం కదా… ఆ బాధ నన్ను దహించి వేస్తున్నది సర్. ఇంటికి వెళ్లినా వారి ఆర్తనాదాల హోరు వినిపిస్తూనే ఉంటుంది” అన్నాడు డాక్టర్ జస్పాల్ మనసు భారం విప్పే ప్రయత్నంలో

జస్పాల్ ఆవేదనలో అర్థం ఉంది అనుకున్న డాక్టర్ శ్రీరామ్ నాలుగు రోజుల క్రితం ఇన్ఫెక్షన్ కి గురైన డాక్టర్ ఆస్మా బేగం, సీనియర్ డాక్టర్ యశపాల్ గురించి వాకబు చేశాడు. డాక్టర్ ప్రీతి ఏదో చెప్పబోతున్నది.

ఈ లోగా పెద్ద పెద్ద అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. ముగ్గురూ అటుకేసి పరుగెత్తారు.

డాక్టర్లపై నమ్మకంతో రాత్రి నుండి హాస్పిటల్స్ చుట్టూ పిచ్చివాడిలా తిరుగుతున్నా. ఆకాశమంత ఆశతో ఈ కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రి కి తీసుకొచ్చా.

తప్పు చేశా. చాలా పెద్ద తప్పు చేశా.

మీ చుట్టూ తిరిగి సమయం వృధా చేసుకున్నా. కావాల్సిన వైద్య పరికరాలు కొనుక్కుని మా ఇంట్లో ట్రీట్మెంట్ ఇచ్చినా బతికేవాడు మా అన్న తలబాదుకుంటున్న వాడల్లా ఆగి, ఎందుకురా! అంతంత తగలేసి మీ చదువులు?

కళ్ళ ముందు ప్రాణాలు గాల్లో కలుస్తూంటే దిక్కులు చూడ్డానికా దద్దమ్మల్లారా… లేకపోతే కాకమ్మ కబుర్లు చెప్పడానికా సన్నాసుల్లారా? బూతులు తిట్టడం మొదలు పెట్టాడు.

గాల్లో కలిసిన అన్న ప్రాణం తలుచుకుంటూ అయ్యో.., అయ్యయ్యో, భర్తను క్షేమంగా ఇంటికి తీసుకొస్తానని ఎదురుచూసే ఆ నిండు గర్భిణీ కి ఏమని సమాధానం చెప్పను?

అతని గుండె పగిలింది. మనసు మండింది. శవం ముందు చతికిలబడి అరుస్తున్నాడు. హిస్టీరిక్ గా అరుస్తున్నాడు.

ఇటువంటి హృదయవిదారక దృశ్యాలు చూడడం, ఆర్తనాదాలు వినడం ఆసుపత్రి సిబ్బంది జీవితంలో భాగం అయిపోయింది. అన్నిటినీ గుండె గుప్పెట్లో మూసేసి మౌనంగా తమ పని చేసుకుపోతున్నారు వాళ్ళు.

నెత్తి కొట్టుకుంటున్న యువకుడికి ఎదురుగా వస్తున్న డాక్టర్ చైతన్య, సమీపంలోనే ఉన్న స్టాఫ్ నర్స్ ఫాతిమా, వార్డు బాయ్ లక్ష్మీనారాయణ కనిపించారు.

ఒరే… ఊపిరి అందక విలవిల్లాడుతుంటే, మనిషి ప్రాణం పోతుంటే చోద్యం చూస్తున్నారా అని బూతులు జోడించి తిడుతూ జూనియర్ డాక్టర్ చైతన్య పై దాడి చేశాడు ఆ వ్యక్తి.

ఊహించని పరిణామానికి చేష్టలుడిగిన సిబ్బంది. చేతన లోకి వచ్చి పరుగు పరుగున అక్కడికి చేరి అతన్ని అడ్డుకోబోయిన శ్రీరామ్ కి, జస్పాల్ కి కూడా కొన్ని గాయాలు అయ్యాయి. డాక్టర్ చైతన్య ppe kit, దుస్తులు చినిగి పోతాయి. తీవ్రంగా గాయాలయ్యాయి.

అతని ఆవేశానికి కారణం తన సోదరుడికి సకాలంలో ఆక్సిజన్ అందక శ్వాస విడవడం. ఆ రోజు ఆక్సిజన్ అందక నాలుగో మరణం. ఇంకెన్ని చూడాలో…

ఏమీ చేయలేని నిస్సహాయతతో కళ్ళు మూసుకున్నాడు డాక్టర్ చైతన్య.

దేశ రాజధానిలో హాస్పిటల్స్ చుట్టూ తిరిగి చివరకు కోవిడ్ తాత్కాలిక ఆసుపత్రికి చేర్చారు. ఆ యువకుడు చాలా అలసిపోవడమే కాదు, అన్న ఏమైపోతాడో అనే మానసిక ఆందోళన, భయం వెంటాడుతుండగా అన్నను హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకొమ్మని చాలా బతిమాలాడు. ఎట్లాగయినా తన సోదరుడిని కాపాడుకోవాలన్న తాపత్రయం అతనిలో.

బెడ్స్ ఖాళీ లేవు అని చెప్పిన డాక్టర్ చైతన్య అతని దృష్టిలో నిందితుడిగా కనిపిస్తున్నాడు.

బెడ్ లేకపోయినా పర్వాలేదు. వైద్యం చేయండి. ఆక్సిజన్ పెట్టండి. ప్లీజ్ డాక్టర్, మా అన్న బాగా నలిగిపోయాడు. నిరాశ పడిపోతున్నాడు. నన్ను ఎలాగైనా బతికించాలి అని వేడుకుంటున్నాడు. చూడండి. పెదాలు రంగు మారిపోతున్నాయి. ఆక్సిజన్ తక్కువ అవుతున్నది. శ్వాస తీయడం చాలా కష్టం అవుతున్నది డాక్టర్. ప్లీజ్… కాపాడండి నడిచే దేవుళ్ళు మీరే అంటూ ప్రాధేయపడ్డాడు.

కనిపించిన చిన్న జాగా చూపుతూ ఇదిగో ఇక్కడే ఓ పక్కకి కూర్చుంటాడు. ఆక్సిజన్ పెట్టండి. ప్లీజ్, మా అన్నను కాపాడండి ప్లీజ్ అంటూ కాళ్లావేళ్లా పడిన వ్యక్తి ఇప్పుడు ఆవేశంతో రగిలిపోతున్నాడు.

బెడ్, ఆక్సిజన్ ఏమీ అందుబాటులో లేవు. కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న రోగుల్ని వెనక్కి పంపడం తప్ప నేనేం చేయలేను. నిమిత్తమాత్రుడినని చెప్పిన డాక్టర్ చైతన్య దోషి అయ్యాడు.

రోగి ప్రాణం కాపాడాలని తన ప్రయత్నం చేసే క్రమంలో ప్రోన్ పోసిషన్ లో పడుకోబెట్టమని నర్స్ కి చెప్పి ICU లో ఉన్న పేషెంట్ పరిస్థితి క్రిటికల్ గా ఉండడంతో అటు పరుగెత్తాడు డాక్టర్ చైతన్య అది అతని నేరం అయింది.

ఇప్పటికే పద్నాలుగు గంటలు పనిచేసిన సిస్టర్ ఫాతిమా శరీరం విశ్రాంతి కోరుతున్నది. ఇప్పట్లో ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు. ఓ పక్క ఇంటి వద్ద ఒంటరిగా అనారోగ్యపు తల్లి గుర్తుకొస్తుండగా ‘అరె, ఎన్ని సార్లు చెప్పాలయ్యా మీకు. మాకు నడవడానికి కూడా చోటు ఉండొద్దా’ కసిరింది సిస్టర్ ఫాతిమా. అది ఆమె తప్పయింది.

ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే పేషెంట్ ప్రాణం గాల్లో కలిసిపోయింది.

చేతినిండా డబ్బు ఉంది. హోదా ఉంది. పరపతి ఉంది. అయినా ప్రాణం కాపాడుకోలేక పోయిన బాధలో తన అక్కసంతా డాక్టర్ చైతన్య పై చూపించాడు ఆ మృతుడి తాలూకు వ్యక్తి .

డాక్టర్ చైతన్య ను దగ్గరకు తీసుకుంటూ “వైరస్ సోకి చనిపోయిన వారి కన్నా ఎక్కువమంది సకాలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు వదులుతున్నారు. ఈ పరిస్థితి ప్రతి హాస్పిటల్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మాట వాస్తవమే. కానీ అందుకు డాక్టర్ బాధ్యులు కాదు కదా.

అయ్యో… ప్రాణాలు నిలిపే డాక్టర్లకి విలువ లేకుండా పోయింది.

డాక్టర్లపై దాడి చేస్తున్నారు కానీ అందుకు కారకులైన వారిని అడగలేరు. నిందించలేరు. విలువైన ఓట్లేసి ఎన్నుకున్న వాళ్ళని గల్లాపెట్టి అడగలేరు.

కొట్టాల్సింది ఓట్లేసి గెలిపించిన వాళ్ళని కదా..! స్మశానవాటికలుగా మార్చుతున్న వారిని కదా..!

అందలమెక్కిన వాళ్ళు అందనంత దూరంలో ఉంటే ఎదురుగా ఉండి సేవలు చేస్తున్న వాళ్ళని ఎగిరెగిరి తంతున్నారు” జస్పాల్ సింగ్ గుండెల్లోంచి తన్నుకొస్తున్న ఉద్రేకాన్ని అదుపు చేసుకుంటూ అన్నాడు.

ఆలింగనం చేసుకోవడం మర్చిపోయిన కాలంలో తోటి వైద్యుడి ఆత్మీయ ఆలింగనం, స్పర్శకు డాక్టర్ చైతన్య ఉద్వేగం ఉవ్వెత్తున ఎగిసింది.

“చీకటి సొరంగంలో ఉన్నట్లు హెవీ ppe కిట్స్ తో రోజంతా ఉండడం, వైరస్ లోడ్ ఎక్కువగా ఉన్న కరోనా రోగులతో సహవాసం చేయడం ఎంత కష్టమో…వాళ్ళకేం తెలుసు ?
అరకొర వసతులతో డాక్టర్లు చేస్తున్న సేవ కన్పించడం లేదు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎదుటివారిని రక్షించే వారికి ఇచ్చే బహుమానం ఇదా…” డాక్టర్ సిద్దికీ అలీ ఆవేదన

“వైద్యులు, వైద్య సిబ్బంది కూడా కష్టంలో, బాధలో, భయంతో ఉన్న వాళ్లలో ఒక్కరేనని ప్రజలు అర్థం చేసుకోవడం లేదు” వాపోయారొకరు.

“చీకట్లో ఎంత తన్నుకు లాడినా ఏం లాభం? మనం ఆటంబాంబులు తయారు చేసుకుంటాం. కానీ ప్రాణాలు నిలిపే ఆక్సిజన్ పట్ల శ్రద్ధ చూపం. యుద్ధ ట్యాంకర్లు ఉంటాయి కానీ ఆక్సిజన్ ట్యాంకర్లు ఉండవు. అంతరిక్ష నౌకల తయారీకి ఎంతైనా ఖర్చు చేయగలం కానీ అతి చిన్న పరికరం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తయారు చేసుకోవడానికి ఆసక్తి చూపం. వ్యవస్థ వైఫల్యానికి మూల్యం చెల్లిస్తున్నాం. అత్యంత వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కాదు జనాన్ని చంపేది. మన వ్యవస్థ, వ్యవస్థే ప్రజలను చంపుతోంది. కరోనా మరణాలన్నీ మన వ్యవస్థ సాగిస్తున్న మారణహోమం లో భాగమే. మొదటివేవ్ నుంచి గుణపాఠం నేర్చుకోలేదు. సెకండ్ వేవ్ గురించి మార్చి మొదటి వారంలో చేసిన శాస్త్రవేత్తల హెచ్చరికలను నెత్తికెక్కిన్చుకున్నదీ లేదు. పొంచి ఉన్న ముప్పు పట్ల ప్రజల్ని జాగృతం చేసింది లేదు.
చేయవలసిన వాళ్లు చేయాల్సిన పని చేయక చేతులెత్తేయడం వల్ల ప్రజలు ఊపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జీవితాలు గాలిలో పెట్టిన దీపంలా మారాయి” ఎంతో సౌమ్యంగా మాట్లాడే డాక్టర్ ప్రసాద్ గొంతు ఉద్రేకంతో జీరగా.

“జనానికి సభలు, సమావేశాలు,పెళ్లిళ్లు, పార్టీలు, మేళాలు, సినిమాలు సరదాలు సంబరాలన్నీ కావాలి. చెప్పినా వినిపించుకోరు. ముప్పును అర్ధం చేసుకోరు. అడకత్తెరలో పోకచెక్కలాగా మనం చచ్చిపోతున్నాం” అన్నాడు సిద్ధికి

“జబ్బు శారీరకంగా చేసే హాని కన్నా మానసికంగా చేసే హాని ఎన్నో రెట్లు ఎక్కువ. వైద్యం అందలేదనే నిరాశ అగాధంలోకి నెట్టేస్తుంది” ఆలోచనగా అన్నది డాక్టర్ ప్రీతి రావు

“మూఢ నమ్మకాలు, వింత వింత పుకార్లతో, వాట్సాప్ యూనివర్సిటీ సమాచారంతో, భయంతో హాస్పిటల్ దాకా రాకుండా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న వాళ్ళని వేలెత్తి చూపుతున్నాం. కానీ, మన మీద మన వైద్యం మీద నమ్మకంతో హాస్పిటల్ కి వచ్చిన వాళ్ళకి, రెండు చేతులూ జోడించి వేడుకున్న వాళ్ళకి ఏం సాయం చేయ గలుగుతున్నాం? బెడ్స్ లేవని వెనక్కి పంపిస్తున్నాం, ఆక్సిజన్ లేక, వెంటిలేటర్స్ లేక మన కళ్ళముందే అచేతనంగా మారిపోతుంటే, చెట్టు ఆకుల్లా రాలుతుంటే దోషులుగా తలదించుకోవాల్సిన దుస్థితిలో మనం. చివరికి స్వంత కుటుంబ సభ్యులకు కూడా ఏమీ ఏర్పాటు చేయలేని దుస్థితి.” దుఃఖం గొంతులో సుడులు తిరుగుతుండగా జస్పాల్.

నడిచేదేవుళ్లనే నమ్మకంతో వచ్చిన వాళ్ళకి వైద్యం అందించాలనే తాపత్రయం తోనే, ఆపద మీద దండెత్తుతూనే ఉన్నా.. పడుతూన్న నిందలని, దెబ్బలని కప్పుకున్న తొడుగుల వెనక దాచేస్తూ… ఉన్న అతి కొద్ది వనరులతోనే తమ విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు వైద్యులు.

నివురుగప్పిన నిప్పులా వైద్యుల మనస్సులో చెప్పలేని ఆవేదన, ఆక్రోశం, తెలియని కోపం, నిస్సహాయత లోపలికి ఇంకిపోతూ…

నిజానికి ప్రజల కోపం వైద్యులపై కాదు. వ్యవస్థపై. వ్యవస్థని ఇలా తయారు చేసిన రాజకీయ నాయకులపై, పాలకులపై, బ్యూరోక్రాట్లపై.
వారి ఆవేదన, ఆక్రోశం వాళ్లపై వెల్లడించలేక కళ్ళ ముందు కనిపించే వైద్యులపై వెళ్లగక్కుతున్నారు. దేశంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.

ఆ యువ డాక్టర్లను, వైద్య సిబ్బందిని ఆత్మీయ ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పాలని, లోపల గూడుకట్టుకున్న విషాదాన్ని తోడేసేయ్యాలని క్టర్ శ్రీరామ్ మనసు ఆరాటపడింది. నిండా తొడుక్కున్న ముసుగుల్లోంచి అల్లాడుతున్న వైద్య సిబ్బందికి నాలుగు ధైర్య వచనాలు చెప్పి డాక్టర్ చైతన్యను తీసుకుని ముందుకు కదిలాడు శ్రీరామ్.

మరో రెండు రోజుల తర్వాత, పరిగెత్తుకుంటూ వచ్చిన నర్స్ సువార్త చెప్పిన వార్త శ్రీరామ్ నవనాడులు కుంగదీసింది. నిన్నటి వరకు తమతో కలిసి చురుకుగా పని చేసిన జూనియర్ డాక్టర్ జస్పాల్ సింగ్ ఇక కనిపించడు.

విపత్తు విసిరిన పెను సవాళ్లు ఎదుర్కొంటూ వచ్చిన ప్రతి రోగిని కాపాడేందుకు శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్న ఆ డాక్టర్ ఆత్మహత్యకు కారణం హాస్పిటల్ వాతావరణం సృష్టించే ప్రతికూల ప్రభావం.

రోజుల తరబడి పుట్టెడు దుఃఖాన్ని మోస్తూ, మనసు లోలోపలి సంక్షోభం అణచ ప్రయత్నిస్తుంటే ఎప్పుడో ఓ బలహీన క్షణం కాటేస్తుంది. కాటికి పంపిస్తుంది. అదే జరిగిందిపుడు.

ఏ మనిషికైనా ఆత్మీయ స్పర్శ, అభిమానం తో కూడిన పలకరింపు కొండంత బలాన్ని ఇస్తుంది. మనో ధైర్యాన్ని నింపుతుంది. కష్టానికి ఫలితంగా రోగి ఇంటికి వెళ్తుంటే సంతోషం. చలనంలేని మూటగా చుట్టుకుపోయినప్పుడు గుండె తరుక్కు పోతుంది. ముసలి వాళ్ళు, రోగిష్టి వాళ్ళ తో పాటు నిండు యవ్వనంలో ఉన్న వాళ్ళు, ఇంకా లోకం తెలియని వయసు వాళ్ళు కూడా మరుభూమికి చేరుతుంటే దుఃఖం పొంగుకొస్తున్నది. గుండె బద్దలవుతున్నది. అదే జరిగింది జస్పాల్ సింగ్ విషయంలో.
సున్నితమైన మనసు మీద పడే ఒత్తిడి ఫలితమే ఆత్మహత్య.

“బాలింత అయిన భార్యను, నలభై రోజుల పసిబిడ్డను వదిలి విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ జస్పాల్ సింగ్ చాలా తెలివైనవాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన జస్పాల్ సింగ్ చాలా సవాళ్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడు. ఉజ్వల భవిష్యత్తు పట్ల ఎన్నో కలలు ఉన్నవాడు.

రోజూ వైరస్ ముంగిట్లో తిరుగాడే తన ద్వారా ఇంట్లో వాళ్ళకి వైరస్ చేరుతుందేమోననే భయం, ఆందోళన చుట్టుముడుతుండగా ఇంటికి వెళ్లడం తగ్గించేసాడు. వెళ్ళినప్పుడు కూడా దూరంగా, వేరే గదిలో. వారి ఆత్మీయ స్పర్శ కు దూరంగా…ఒంటరిగా ఉండేవాడు. భర్త వృత్తిలో ఉన్న వత్తిడిని అర్థం చేసుకున్న ఆ బాలింత ఒంటరిగా పసిబిడ్డతో ఇబ్బందులు పడుతున్నది. ఆ విషయం జస్పాల్ సింగ్ కి తెలుసు. కానీ, ఏమీ చేయలేని స్థితి.

గతంలో కంటే ఐదు రెట్లు పెరిగిన పని భారం. విపరీతమైన వత్తిడి. నిద్రలేని రాత్రులు, హృదయవిదారక దృశ్యాలు ఆ డాక్టర్ ను డిప్రెషన్ కి గురి చేశాయి. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమిటో …” ఊటలాగా ఉబికి వస్తున్న దుఃఖంతో పూడుకుపోయిన స్వరంతో ప్రియారావ్.

డాక్టర్ శ్రీరామ్ తో పాటు మిగతా వైద్యులందరినీ ఆ సంఘటన బాగా కలచివేసింది.

గొంతులోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఎలా ఆపుకోవాలో తెలియక భోరుమన్నారు. రాళ్లు రప్పలు కాదు కదా. మనసున్న మామూలు మనుషులు వాళ్ళు.

మరుక్షణాన, అంతటి దుఖంలోనూ, దౌర్భాగ్య పరిస్థితిలోనూ తనను తాను కూడదీసుకుని గంభీరత ముసుగేసుకుని బుసలుకొట్టే ఉశ్వాస నిశ్వాసల మధ్య తిరుగాడడం మొదలుపెట్టారు. బతికించే దారుల కోసం వెతుకుతున్నారు, రోగులకు కొండంత ధైర్యం అందిస్తూ ఊపిరిపోస్తున్నారు ఆ వైద్య బృందం.

డాక్టర్ జస్పాల్ సింగ్ ది ఆత్మహత్య కాదు. వ్యవస్థ చేసిన హత్య అని అక్కడున్న వైద్యుల మనసులో వేదన కలచివేస్తున్నది.

అంత నిశ్శబ్దంలోనూ మెడికల్, పారా మెడికల్ సిబ్బంది రోదన, వారి లోలోపల లుంగలు చుట్టుకుంటున్న దుఃఖం చేస్తున్న సవ్వడి తననేదో ప్రశ్నిస్తున్నట్లుగా అస్థిమితంగా ఉంది డాక్టర్ శ్రీరామ్ కి.

“దారితప్పిన ప్రభుత్వాల చేతిలో జవసత్వాలు కోల్పోయిన ప్రజారోగ్యవ్యవస్థ గురించి తర్వాత ఆలోచించవచ్చు. ఇప్పుడు ఫైర్ ఫైటింగ్ లో ఉన్నాం. దానిపైనే శ్రద్ధ పెట్టాలని పాజిటివ్ గా ఆలోచించమని జస్పాల్ తో చాలా సార్లు చెప్పాను సర్. ఎందుకింత పిచ్చి పని చేశాడో.. పదే పదే గుర్తుకొస్తున్నాడు సర్” బేలగా అన్నది ఎదురుపడిన డాక్టర్ ప్రియారావ్. వాళ్లిద్దరూ పిజి లో క్లాస్ మేట్స్. మంచి స్నేహితులు.

పేషేంట్ల మీద చూపిన శ్రద్ధ వైద్యులపై కూడా చూపాలి. సున్నిత మనస్కులైన జస్పాల్ వంటి వైద్యులని ప్రేమపూర్వక పలకరింపు, ఆత్మీయత నిండిన చూపు బతికించగలవు. లోపలి దుఃఖాన్ని దింపుకునేంత విరామం, అవకాశం వైద్యులకి లేకుండా పోయింది.

నర్సింగ్ సిబ్బందిలో, వైద్యుల్లో పేరుకొంటున్న నిర్లిప్తతని గమనించి వచ్చిన దగ్గరనుండి వారిలో సానుకూల దృక్పథం పెంచే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు డాక్టర్ శ్రీరామ్.

రెండు రోజుల క్రితం జస్పాల్ మాటల్ల ధోరణి విన్నాక కౌన్సిలింగ్ తో అతని ఆలోచనల్ని కొత్త కోణంలో మళ్లించాలని అనుకున్నాడు శ్రీరామ్ . అంతలోనే ఇంతటి తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడని ఊహించలేకపోయా. సారీ జస్పాల్. మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నాడతను.

అసలే వైద్యుల కొరత తో సతమతమవుతున్న సమయంలో ప్రతిభావంతమైన డాక్టర్ ని కోల్పోవడంతో అతని మనసంతా నిస్సత్తువ ఆవరించింది. ఇక మరేవరు ఇలా వెళ్లిపోకూడదు తనకు తాను గట్టిగా చెప్పుకున్నాడు. అంతటి విషాదంలోనూ మొహం మీద సన్నని చిరునవ్వు చెదరనీకుండా పేషెంట్స్ ని పలకరిస్తూ క్రిటికల్ కేర్ యూనిట్ లోకి నడిచాడు డాక్టర్ శ్రీరామ్.

గోడవారగా జారగిలబడి కూర్చోబోయే స్టాఫ్ నర్స్ సరోజ డాక్టర్ శ్రీరామ్ ని చూసి సారీ డాక్టర్ అంటూ లేచి నుంచుంది.

విశ్రాంతి కోరుకునే ఆమె శరీరానికి పడక అవసరం లేదు. కూసింత జాగా దొరికితే చాలు ఎక్కడైనా నిద్ర లోకి జారి పోయేంత అలసటగా ఉంది.
ఇలాంటి దృశ్యాలు చూడడం ఆ డాక్టర్ లకి అలవాటైపోయింది.

ఇటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడంలో అనుభవం ఉన్న శ్రీరామ్ తోటి వైద్యులకు ఆక్సిజన్ లాంటి చతురోక్తులతో ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపే ప్రయత్నంలో ఉన్నాడు. క్రిటికల్ కేర్ లో ఉన్న రోగులను కాపాడడమే కాదు సిబ్బందిలో పెరిగిపోతున్న ఒత్తిడి, స్తబ్దతలకు ముసుగు వేసే ప్రయత్నం చేస్తున్నాడు.

ఒంటరిగా ఉన్నప్పుడు అనేకానేక ప్రశ్నలు, సందేహాలు అతన్ని చుట్టుముడుతున్నాయి.

వేల కోట్లతో ఏర్పాటు చేసిన ఎత్తైన విగ్రహం, ఆలయ నిర్మాణం, అధునాతన పార్లమెంట్ భవనాలు, బుల్లెట్ ట్రైన్ దేశ ప్రతిష్టను పెంచుతాయని దేశం ఉజ్వలంగా వెలిగిపోతోందని అమెరికాలో ఉన్నప్పుడు భావించాడు శ్రీరామ్. కానీ వెలిగిపోతున్నదా?

దేశ ప్రజలకు వైద్యం, విద్య, ఆహారం వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు తర్వాత కదా ఇవన్నీ… గతంలోనే, అంటే పాతిక ముప్పై ఏళ్ళనాడే ప్రజా ఆరోగ్యపరిస్థితి మెరుగ్గా ఉందేమో?!

ప్రపంచమంతా అతలాకుతలం చేస్తున్న కరోనా గురించి ఏడాదికాలంగా అందరికీ తెలుసు. అయినా చీమ కుట్టినట్టు లేదే…

శ్రీరామ్ ఆలోచనల్లోకి జస్పాల్ పదే పదే వస్తున్నాడు. అతను మాట్లాడిన మాటలు మైండ్ లో సుడులు తిరుగుతున్నాయి.

‘మొదటి వేవ్ లోనే వణికిపోయారు. అప్పుడు ప్రభుత్వం చేసిన దానికంటే ప్రజల కోసం ప్రజలు స్పందించి స్వచ్చందంగా చేసింది ఎక్కువ. కానీ గుణపాఠం నేర్చుకోలేదు. ఎప్పుడైనా కరోనా సెకండ్ వేవ్ పడగ విప్పొచ్చని అందరికీ తెలుసు.
అటువంటప్పుడు పాలకులు ఏం చేయాలి. ఎంత వేగంగా స్పందించాలి. దాహం అయిన తర్వాత బావి తవ్వుకోవడం కాదు కదా చేయాల్సింది. రాబోయే విపత్తుకు సన్నద్ధం అవుతూ, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు అధిక బడ్జెట్ కేటాయించి బలపరచుకోవాలి. ప్రతి జిల్లాలో ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరుచుకోవాలి. అత్యవసర చికిత్సా కేంద్రాలు, తాత్కాలిక శవాల గదులు, ఆక్సిజన్, వైద్య పరికరాలు తదితరాలన్నీ అందుబాటులో ఉంచుకోవడం వంటి ప్రయత్నాలు చేయాలి. పదవీ విరమణ చేసిన వైద్య సిబ్బందిని, శిక్షణలో ఉన్న వైద్య, నర్సింగ్ , పారా మెడికల్ విద్యార్థులను విధుల్లో చేర్చుకోవాలి. దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్ పట్ల ప్రజలకు అవగాహన పెంచాలి. ప్రజలందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందించే ఏర్పాటు చేయాలి. అది చేయకపోగా ప్రపంచానికి మనమే వాక్సిన్ అందిస్తున్నామని డబ్బా కొట్టుకున్నాం. కానీ దేశంలో 137 కోట్ల ప్రజల కోసం ఏర్పాటు చేసింది ఎంత? దాదాపు 280 కోట్ల వ్యాక్సిన్ డోస్ కావాల్సిన చోట విదిలిస్తున్న వాక్సిన్ ఏమూలకు సార్? ఒక్క ముక్కలో చెప్పాలంటే కరోనా పరిస్థితులు సమగ్ర పర్యవేక్షణకు ఓ కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. అదేమీ జరగకపోగా, కరోనా కట్టడికి ఖర్చు చేయాల్సిన సమయాన్ని ఎన్నికల యుద్ధ తంత్ర రచనలో, కుంభ మేళా నిర్వహణలో, పెద్ద ఎత్తున జనసమీకరణ, భారీ సభలు, ర్యాలీలు, లక్షలాది జన మేళాల నిర్వహణలో వెచ్చించడం, జనం ప్రాణాలను గాలికి వదిలేయడం వల్ల కదా సార్ నేటి కరోనా విస్ఫోటనం. ఈ పరిస్థితుల్లో కుంభమేళా ఏడాది ముందుకు జరపాల్సిన అవసరం ఉందా? చెప్పండి డాక్టర్ గారూ మన హాస్పిటల్స్ లో వైద్యులు లేక, సిబ్బంది లేక, వైద్య సామాగ్రిలేక నానా అవస్థలు పడుతున్నాం. అయినా నిధులు లేవు. నియామకాలు లేవు. ఎప్పుడు చేస్తారో తెలియదు. కానీ ఎన్నికలు నిర్వహించారు అంటే పాలకుల ప్రాధాన్యత ఏంటో తెలిసిపోతున్నది. ఎన్నికలు అంత అర్జెంటా? పార్లమెంటు భవనం కోసం, వేల అడుగుల విగ్రహం కోసం నిధులు వస్తాయి. హూ.. దేని మీద ఖర్చు పెట్టాలో దానిమీద పెట్టడం లేదు. పక్కన ఉన్న చిన్న దేశాన్ని భూతంగా చూపి లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. దేశమంటే మట్టి కాదు మనుషులని వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో…’ పోగుపడిన డాక్టర్ జస్పాల్ సింగ్ ఆవేశం

‘తెలియకపోవడం కాదు ఆ సేతు హిమాచలం తమ పార్టీ జెండా ఎగురవేయాలని ఆరాటం’ అని ప్రీతి రావు సమర్ధింపు గుర్తొచ్చాయి.

మాతృదేశంలో అడుగు పెట్టిన తర్వాత పరిస్థితిని క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటున్న డాక్టర్ శ్రీ రామ్ కి యువ డాక్టర్ల ఆవేదనలో అతిశయం ఏమీ కనిపించలేదు. ఆ మాటలు పదే పదే శ్రీరామ్ చెవుల్లో గింగురు మంటున్నాయి.

ఇంతమంది జనాన్ని బలితీసుకోవడం కోసమేనా వీళ్ళకి అధికారం కట్టబెట్టిందని అక్కసు వెళ్లగక్కిన ఓ పేషేంట్ ఆవేదనలో, ఆక్రోశంతో న్యాయం ఉందని శ్రీరామ్ కి స్పష్టంగా తెలుస్తూనే ఉంది.

నేతల తీరు ఇచ్చిన ఊతంతో విందులు వినోదాల్లో, ప్రార్థన మందిరాల్లో యథేచ్ఛగా కలియ తిరిగిన జనం. స్వీయ రక్షణ మరచిన ప్రజలు గుంపులు గుంపులుగా ఉండడం వల్ల కదా సెకండ్ వేవ్ విజృంభణ కొందరు, డాక్టర్లని, ఆసుపత్రులని నిందించేవాళ్ళు కొందరు.. చీకటిని తలుచుకుంటూ, తిట్టుకుంటూ కూర్చోవడం వల్ల లాభం లేదు. కళ్ళముందు కనబడుతున్న భీభత్స దృశ్యాల్లోంచి వెలుతురు జాడలు వెతుక్కోవాలి.

ఓ పక్క పట్టపగ్గాలు లేకుండా విజృంభిస్తున్న కరోనా సరికొత్త రికార్డు సృష్టిస్తూ, తన రికార్డులను తానే అధిగమిస్తూ ఉంటే.., చావు కౌగిలి కోరల్లో చిక్కి దేశ ప్రజలంతా అల్లాడిపోతూ భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటే..,

దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల పై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలంటే పిల్లిమెడలో గంట కట్టాలి. నిజాలు పలకాలి.

ఆఖరికి పిట్టల్లా రాలిపోతున్న జనాలు నాకు మందులు కావాలి, హాస్పిటల్ లో బెడ్ కావాలి, ఆక్సిజన్ కావాలి, మా ప్రాణాలు పోతున్నాయి ఏమైనా చేయండి అని ప్రాధేయపడుతున్నారు. మీరు డాక్టర్ కదా ఏమైనా చేయగలరు అనే నమ్మకంతో వచ్చిన వాళ్ళని వెనక్కి పంపాల్సిరావడం ఏ డాక్టర్ కైనా రంపపుకోతే. తమ పరిధి దాటి డాక్టర్ చేయగలిగింది చాలా తక్కువ. అది ప్రజలకు అర్ధం కాదు. ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తూ కాలం గడిపేస్తాయి.

నేరము ఒకరిదైతే శిక్ష మరొకరు అనుభవిస్తున్నారు నిజమే, కానీ ఇప్పుడు విపత్కర పరిస్థితి నుండి గట్టెక్కే మార్గాలు మాత్రమే చూడాలి అని తనలో రగిలే ఆవేదనను, దుఃఖాన్ని చితిమంటల చిటపటల్లో కలిపేసే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీరామ్.

కానీ అగ్నిజ్వాలల్లా అతని ఆలోచనలు ఎగిసిపడుతూనే ఉన్నాయి .

సందట్లో సడేమియా అన్నట్లు కొన్ని ప్రవేటు ఆసుపత్రులు, కొందరు వ్యక్తులు జలగల్ని మించిపోయారు. మందులు , ఆక్సిజన్, తదితరాలన్నీ బ్లాక్ చేసి చావు వ్యాపారం చేస్తున్నారు. ప్రజల అవసరాన్ని అవకాశంగా చేసుకుని లాభాల లెక్కలు వేసుకుంటున్నారు. దాంతో వైద్యులందరూ బదనాం అవుతున్నారు. విశ్వసనీయత కోల్పోతున్నారు.

చాలా తీవ్రంగా ఉన్న సంక్షోభం. మరింత తీవ్రంగా ఉండబోతున్న వినాశనం.

అది ఎంత కాలమో, ఎంత దూరమో, ఎన్ని దశలో.., ఎంత వేదనో మరెంత రోదనో తెలియదు. అంతు దరి తెలియని స్థితి.

అనేక సార్లు సంక్రమణ చెందుతూ తనను తాను మార్చుకుంటూ మరింత బలంగా తయారవుతున్న కంటికి కనిపించని క్రిమి

ఎలా… మునిగి పోతున్న పడవను ఎట్లా గట్టెక్కించాలి వెంటాడుతున్న ఆలోచనలతో ఎన్ ఆర్ ఐ డాక్టర్ శ్రీరామ్.

విపత్కర పరిస్థితిలో దిశానిర్దేశం చేసే ఒక నమ్మకమైన వ్యవస్థ ఏర్పాటు లేదు. అధికారంలో ఉన్నవాళ్లు బాధ్యతతో మెలగాల్సిన వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. ఇదిగో పులి అదిగో తోక చందంలా లేని పోనీ అపోహలు , భయాలు సృష్టిస్తున్నారు. వాక్సిన్ పై ప్రజలని తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నారు.

ఒక కమాండ్ కంట్రోల్ ఉండాలి. ప్రజలని హెచ్చరించడం కాకుండా చైతన్యం చేసే విధంగా ఎడ్యుకేట్ చేసే విధంగా ఆ కంట్రోల్ పనిచేయాలి. జన్యు విశ్లేషణలు ఎక్కువ జరుపుతూ ప్రజలలో షికార్లు చేస్తున్న కొత్త స్ట్రయిన్స్ పై భయాలు పోగొట్టాలి.

చేతులెత్తేసిన ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ప్రజలకి ఊపిరిపై భరోసా కలిపించాలి. దేశ భవిష్యత్ పై నమ్మకం ఇవ్వాలి. ఎలా..? తన పరిధి చాలా చిన్నది. కనీసం ఈ దేశ పౌరుడు కూడా కాదు.

అయితేనేం, ఈ దేశమూలాలు నాలో ఉన్నాయి. నేను చెయ్యవలసిన, చేయగలిగిన పని చెయ్యాల్సిందే. పర్యవసానాలు ఎలాగైనా ఉండనీ..
రష్మి అన్నట్లు యుద్ధం వచ్చినప్పుడు యుద్ధమే చేయాలి.

అవును, విధ్వంసం సృష్టిస్తున్న శత్రువుపై యుద్ధం చేయాల్సిందే.

నేరం ఎవరిదైనా, లోపం ఎక్కడున్నా సరి చేసుకోవడానికి రణరంగంలో నిలిచి యుద్ధం చేయాలి తప్పదు.

గతి తప్పుతున్న శరీరారోగ్యాన్ని, సునామీ కెరటాలలా ఎగిరిపడుతున్న మనసును అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూన్న డాక్టర్ శ్రీరామ్. కళ్ళముందు పెను విపత్తు విచ్చుకుంటున్న దృశ్యం, మహా ఉత్పాతంలో స్మశానాలుగా మారిన ఊళ్లు, ఉవ్వెత్తున ఎగిసే చితిమంటలు సాక్షాత్కరిస్తుండగా ధర్మాగ్రహంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయడం మొదలు పెట్టాడు డాక్టర్ శ్రీరామ్.

దేశంలోని వైద్యులందరి తరపున వకాల్తా తీసుకుని నాణేనికి రెండో వైపు గురించి రాయడం మొదలుపెట్టాడు.

నడవడం మొదలు పెట్టకపోతే గమ్యం ఎలా చేరగలం అని రాయడం మొదలుపెట్టాడు.

రాతి హృదయం మీద పేరుకుపోయిన దుమ్ము కొద్దిగానైనా తొలిగిపోతుందేమోనని రాయడం మొదలుపెట్టాడు.

ఎండమావుల్లో తడి చినుకులు, రాతి పగుళ్ళలోంచి పచ్చదనం వస్తాయన్న ఆశతో రాయడం మొదలుపెట్టాడు.

చితికిన బతుకుల చితి వాసనలు రాకూడదని రాయడం మొదలు పెట్టాడు.

అక్షరాలు పదాలుగా, పదాలు వాక్యాలుగా, వాక్యాలు ప్రజల గొంతుకగా మారుతున్నాయి. రాబోయే వినాశనాన్ని ఎదుర్కోవడానికి సన్నద్ధం అవుతున్నాయి.

ప్రపంచమంతా విలయతాండవం చేస్తున్న మాయదారి రోగం భారతావనికి ఏ గుణపాఠం నేర్పుతుందో.. ఏ నీతిపాఠం చెబుతుందో ..

పుట్టింది వరంగల్, పెరిగింది ఆదిలాబాద్, మెట్టింది నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో. చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. హేమలతా లవణం, లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచారు. ఆ నడకలో నిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతం చేసుకున్నారు. ఆ అనుభవాల్లోంచి రాసినవే 'భావవీచికలు', 'జోగిని', 'గడ్డిపువ్వు గుండె సందుక', 'ఆలోచనలో... ఆమె'. 'భావవీచికలు' బాలల హక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం. ILO, ఆంధ్ర మహిళాసభ, బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల 'జోగిని ". వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది. 2015లో విహంగ ధారావాహికగా వేసింది. ప్రజాశక్తి 2004లో ప్రచురించింది. గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో ... ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటాలు. 'అమర్ సాహసయాత్ర' బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ.  'ఆడపిల్లను కావడం వల్లనే' శీర్షికతో ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వ్యాసాలు వచ్చాయి. వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వివిధ అంశాలపై రేడియో ప్రసంగాలు ప్రసారమయ్యాయి.

Leave a Reply