తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక చిత్రపటం ‘నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ’

తెలంగాణ ఉద్యమ ఉద్వేగాలన్నింటినీ అణువణువునా నింపుకుని కవితావాక్యాల ద్వారా మనుషులతో చేసిన ఎడతెగని సంభాషణ నందిని సిధారెడ్డి కవిత్వం. నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక, సామాజిక, జీవన మూలాల్లోకి ప్రయాణిస్తూ ఇక్కడి మట్టిలో దాగిన భూమి స్వప్నాల్ని సాకారం చేయాలని అలుపెరుగక తపించిన ఆర్ద్రకవి నందిని సిధారెడ్డి. ‘తెలంగాణ కవులెప్పుడు తలెత్తుకునే వుంటారంటూ’ పోరాటస్ఫూర్తిని చాటిన ఉద్యమ కవి. ‘మేం ఎప్పుడూ యుద్ధభూమిలో నిలబడే వుంటామంటూ’ నిర్బంధాలు, నిషేధాల్లోంచి సైతం ధిక్కార స్వరాన్ని వినిపించిన తిరుగుబాటు కవి నందిని సిధారెడ్డి. మెదక్ జిల్లా కొండపాక మండలం బందారంలో 1955 జూన్ 12న రత్నమాల, బాల సిద్ధారెడ్డి దంపతులకు జన్మించారు. బాల్యంలోంచే తండ్రి పరచిన ఎర్రపూల బాటల్లోంచి విప్లవ భావజాల చైతన్యాన్ని శ్వాసగా మలచుకున్నాడు. ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే తెలంగాణ గ్రామీణ జీవనంలో భాగమైన జానపద కళారూపాల పట్ల ఆకర్షితుడయ్యాడు. జానపదుల ఆటపాటల్లో పాల్గొంటూ తానొక పాటగాడుగా పల్లవించాలని అనుకున్నా వచన కవిత్వ దారుల్లోకి అడుగుపెట్టి ‘ఒక బాధ కాదు ఒక దుఃఖం కాదు’ అంటూ తెలంగాణ జీవితాల పెనుగులాటను ఆవేదనీకరించాడు. అలా గూడు కట్టుకున్న దుఃఖమంతా మలిదశ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పాటగా మారి తెలంగాణ గుండెల్లో ‘నాగేటి చాల్లల్ల’ గీతంగా నిర్విరామంగా ప్రతిధ్వనించాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంగా రూపుదిద్దుకున్న ప్రత్యేక తెలంగాణ కోసం సాంస్కృతిక అస్తిత్త్వాన్ని సగర్వంగా ప్రకటించిన ‘నాగేటి చాల్లల్ల నా తెలంగాణ’ పాటను మరొకసారి పాడుకుందాం. పరవశిద్దాం.

“నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ
నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ
పారేటి నీళ్ళల్ల పానాదులల్ల
పూసేటి పువ్వుల్ల పునాసలల్ల
కొంగు చాపిన నేల- నా తెలంగాణ నా తెలంగాణ
పాలు తాపిన తల్లి- నా తెలంగాణ నా తెలంగాణ”
తెలంగాణ బతుకులన్నీ పల్లెల్లోనే తండ్లాడుతుంటాయి. ఈ పాటకూడా ఆ పల్లెల పంట పొలాల్లోని నాగేటి సాల్లలోంచే పల్లవించింది. నాగేటి సాల్లలో తిరగాడిన రైతు పాదాలకు అంటిన మట్టిని వొళ్ళంతా పులుముకుని తెలంగాణ జీవితాల్లోని విభిన్న పార్శ్వాలను ఆత్మీయతతో ఆలపిస్తాడు. ఆవేదనతో విలపిస్తాడు.

రైతు జీవితం నేలతో, నీటితో పెనవేసుకున్న బతుకు బంధాన్ని చూపుతుంది. పారేటి నీటిని చూస్తే రైతు ఆనందభాష్పాలతో తడిసిపోతాడు. నాగలితో గీసే గీతల్లోంచే రైతు పువ్వులా వికసిస్తాడు. తెలంగాణ జీవ కేంద్రమైన పల్లెను, పొలానికి జీవనాడైన రైతును స్మరించుకుంటూ సిధారెడ్డి పాటను ఎత్తుకోవడంతోనే హృదయాలు ఉప్పొంగిపోతాయి. తెలంగాణ నేలను, కవి, కొంగు చాపి కోరిన కోరికలు తీర్చిన నేలతల్లిగా, మమతానురాగాలతో పాలుతాపి ఆకలి తీర్చిన అమ్మగా ఉన్నతీకరించడంతో మనసు అమ్మ ఒడిలో సేద తీరినట్లుగా మారిపోతుంది.

“తంగేడు పువ్వుల్లు – తంబాలమంతా
తీరొక్క రంగుల్ల – తీరిచీనా పువ్వు
బంగారు చీరలు బాజారులన్నీ
బతుకమ్మ పండుగ – నా తెలంగాణ నా తెలంగాణ
బంతి పూలతోట – నా తెలంగాణ నా తెలంగాణ”
తెలంగాణ పండుగల సంబురాల సారమంతా బతుకమ్మ పండుగలో ఆవిష్కృతమవుతుంది. అటువంటి తెలంగాణ బతుకు పండుగ చుట్టూ కవి ఉయ్యాలలుగుతాడు. మనల్ని ఉర్రుతలూగిస్తాడు. మనసంతా తంగేడు పూల వనంగా మారిపోతుంది. కవి ఇంతటితో సంతృప్తి చెందలేదు. ఈ పండుగ పతాకస్థాయి విశేషాలను మరింత ఆనందోత్సాహాలతో వర్ణిస్తాడు.

“కొత్తబట్టలు గట్టి – కోటి ముచ్చట్లు
పాలపిట్టలు జూసి – పడుచు చప్పట్లు
జొన్నకర్రల జెండ – జోరున్నదేమి
ఆలయి బలయి దీసె – నా తెలంగాణ నా తెలంగాణ
జంబి పంచిన ఆర్తి – నా తెలంగాణ నా తెలంగాణ”
మిత్రుల మధ్య వెల్లువెత్తే ముచ్చట్లను, ఆత్మీయ స్నేహబంధాలను దసరా పండుగ నాటి అలాయ్ బలాయ్ ఆచారాలను గుర్తుచేస్తూ ఆర్తితో అక్షరాల జంబిని పంచి పాలపిట్టలా కనిపిస్తాడు కవి. ఇక్కడ ఎక్కువగా పండించే జొన్న పంటను గుర్తుచేస్తూనే ఈ నేలమీద ఎగురుతున్న రగల్ జెండాను,తెలంగాణ వాసి దూకుడు స్వభావాన్ని కూడా సూచిస్తాడు.

“వరదగూడు గడితె వానొచ్చునంట
బురద పొలమూ దున్ని మురిసున్నరంతా
శివుని గుల్లె నీల్లు చీమలకు శక్కరి
వానకొరకు భజన – జడకొప్పులేసి
వాగుల్ల వంకల్ల – నా తెలంగాణ నా తెలంగాణ
చూపు రాలిన కండ్లు – నా తెలంగాణ నా తెలంగాణ “
వ్యవసాయమంటేనే ప్రకృతి మీద ఆధారపడి వుంటుంది. అది కరుణించకపోతే అంతా కరువే. సకాలానికి వర్షాలు లేక తెలంగాణ గొంతులు ఎండిపోయిన సందర్భాలు ఎన్నెన్నో. ఇక నీళ్ళు లేక తెలంగాణ రైతు గుండె బీటలు వారిపోతుంది. జీవితం ఎడారిలా మిగిలిపోతుంది. ఆ సందర్భంగా వాన కోసం చేసే పూజలు, అభిషేకాలు, భజనల్లో తెలంగాణ ప్రజల నమ్మకాలు మనల్ని కదిలిస్తాయి. అదిగో అటువంటి ప్రయత్నాల పరంపరను కవి ఈ పాటలో దృశ్యమానం చేస్తాడు. మనం ఎవరికోసమైనా ఎదురుచూస్తున్నప్పుడు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసాం అంటాం. ఇక్కడ కవి ఎదురు చూసి చూసి కళ్ళు రాలిపోయాయి అనే భావాన్ని ‘చూపులు రాలిపోయాయి’ అనే కొత్త వ్యక్తీకరణతో ఎదురు చూపులకు మరింత గాఢమైన చూపును అందించాడు.

“మోటగొట్టే రాత్రి – మోగిన పాట
తాడూ పేనిన తండ్రి – తలుపులున్నప్పు
కల్లమూడ్సిన అవ్వ – కలలోని గింజ
ఆరుగాలం చెమట – నా తెలంగాణ నా తెలంగాణ
ఆకలి దప్పుల మంట – నా తెలంగాణ నా తెలంగాణ”
“ఊరుగాచే తల్లి ఉరిమి చూడంగ
బువ్వలేని తల్లి బోనమొండింది
సేనుకొచ్చిన పురుగు సెరిగిబోసిందా”
సిధారెడ్డి ఈ పాటను తెలంగాణ రాష్ట్రొద్యమ భావజాల ప్రచార వ్యూహంతో రచించాడు. తెలంగాణ రాష్ట్రోద్యమం సన్నగా రాజుకునే వేళ దాన్ని ఉవ్వెత్తున ఎగసే జ్వాలగా మార్చడంలో కవులు, కళాకారుల సేవ, త్యాగం వెలకట్టలేనివి. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జరిగిన అన్యాయాలపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించింది. మరోవైపు కవులు, గాయకులు, బుద్ధిజీవులు తెలంగాణ భాష, సంస్కృతికి జరిగిన అవమానాలపై స్పందించారు.

పత్రికలు, టీవీలు తెలంగాణ భాషను, సంస్కృతిని కించపరుస్తూ విస్మరణకు గురిచేసిన చారిత్రాత్మక సందర్భాలను ప్రస్తావిస్తూ విస్తృతమైన చర్చలు, వాదనలు చేశారు. తెలంగాణ స్థానిక కళలు, పండుగలు, అనేక సాంస్కృతిక అంశాలపై కొనసాగుతున్న వివక్షపై సాహిత్య, సామాజిక ఉద్యమకారులు గళమెత్తారు. తెలంగాణ భాష, సంస్కృతి తనదైన అస్తిత్త్వాన్ని కోల్పోతున్న దశలో ‘నాగేటి చాల్లల్ల’ పాట ఆవిర్భవించింది. తెలంగాణ ఉద్యమానికి ఒక రాజకీయ సిద్ధాంత పునాదులు నిర్మాణమవుతున్న వేళ, భువనగిరి, వరంగల్ మహాసభల నేపథ్యంలో ఈ పాట పురుడు పోసుకుంది. తెలంగాణ ప్రజల గుండె ఘోషను వినిపిస్తూనే తెలంగాణ ప్రాంత సాంస్కృతిక వైభవాన్ని, తెలంగాణ పౌరుడి ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి చాటేలా సిధారెడ్డి ఈ పాటను ఆత్మగీతాలాపనగా సృజించాడు. 1997 ఆగస్ట్ 17న సిద్ధిపేటలో ‘మరసం’ నిర్వహించే తెలంగాణ ఉద్యమ సభ కోసం షేక్ బాబా కోరిక మేరకు రాశాడు సిధారెడ్డి. షేక్ బాబా, దేశపతి శ్రీనివాస్ లు ఈ పాటను పాడి సభికులను ఉద్వేగభరితుల్ని చేశారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందో లేదో గాని ఈ పాట పుట్టగానే దీని సాంస్కృతిక పరిమళం తెలంగాణ ఉద్యమమంతటా వ్యాపించింది. మరెన్నో ఉద్యమ గీతాలకు ప్రేరణగా నిలిచింది.

సిధారెడ్డి నడిసిన తొవ్వంతా తెలంగాణ పల్లెలే కదా! ఆ పల్లెల్లో కనిపించే యదార్థ వ్యధాభరిత దృశ్యాలన్నింటిని ఈ పాటలో పొందుపరిచారు. వ్యవసాయమే ఒక కుటుంబ పోరాటంగా భావించే రైతు బతుకుల్లో నిండిపోయి పారుతున్న దుఃఖాన్ని మనకు అద్దుతాడు కవి. అర్ధరాత్రుళ్ళు సైతం చేనుకు నీళ్లకోసం మోట కొడుతూ బతుకు పాట పాడుకుంటున్న తెలంగాణ రైతు జీవితమంతా ఈ పాటలో నిక్షిప్తమైంది. ఆరుగాలం కష్టపడినా కంటపడని ధాన్యపు గింజలు కల్లమూడ్సిన అవ్వ కళ్లలోని పీడకలల్ని రికార్డ్ చేస్తాడు కవి. తాము ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నా చేతికొచ్చే చేను పురుగుపట్టి పాడైపోయినా ఊరును కాపాడే గ్రామ దేవతలు కడుపు నింపే కరుణగల తల్లులున్న నేల ఇది. అందుకే బువ్వలేని తల్లి సైతం బోనం వండి పెట్టగల భక్తి భావాన్ని, త్యాగ గుణాన్ని కీర్తిస్తున్నాడు కవి.

బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ
కాట్రావులాట నా తెలంగాణ నా తెలంగాణ
శివసత్తులాట నా తెలంగాణ నా తెలంగాణ”
“దట్టిగట్టిన రోజు డప్పుచప్పుల్లు
పీరీల గుండంల పిలగాండ్ల ఆట
కుడుకాపేర్ల మొక్కు కూలి బతుకుల్లు
ఆలువాడిన పాట- నా తెలంగాణ నా తెలంగాణ
ఆత్మగల్ల చెయ్యి -నా తెలంగాణ నా తెలంగాణ “
పై చరణాలన్నింటినీ తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఉత్సవాల ఊరేగింపుగా మలిచాడు కవి. విభిన్న కుల వృత్తుల వారి నమ్మకాలు, ఆచారాలు, మొక్కులు, వినోదాలన్నింటినీ ఒకచోట మూటగట్టి అందులోని స్వచ్ఛమైన సాంస్కృతిక సౌందర్యాన్ని సొంపుగా చిత్రిస్తాడు. ఈ చరణాలను పాడుతుంటే శ్రోతలంతా కాట్రావుల్లాగా, శివ సత్తుల్లాగా మారిపోతారు. మరోసారి పీరీల నెత్తుకొని గుండం చుట్టూ అస్సయ్ ధూలా ఆడుతున్నట్లుగా అనుభూతి చెందుతాం. ఎవరికి వారు వారి ఆర్థిక స్థాయికి తగినట్టుగా పండుగలు చేసుకునే విధానం, గుండె లోతుల్లోంచి ప్రేమను తోడి పంచిపెట్టే తెలంగాణ స్వభావాన్ని ఉదాత్తంగా కవిత్వీకరిస్తాడు కవి. సహజమైన తెలంగాణ వ్యావహారిక పదాలతో, నుడికారాలతో తమ నేలలో నెలకొన్న మమకారాల వనరులను వెలికితీస్తాడు కవి.

“కలిసేటి సేతుల్ల కన్నీటి పాట
సిందోల్ల సిందుల్ల సిగురించె నాట్యం
వొగ్గు మద్దెల డప్పు వాద్య సంగీతం
కళలకే పుట్టుకా – నా తెలంగాణ నా తెలంగాణ
పాటగాచిన పట్టు – నా తెలంగాణ నా తెలంగాణ”
తెలంగాణ భౌగోళిక స్వరూపంలో అనేక జానపద కళారూపాలు సహజంగానే నిబిడీకృతమై ఉండడం విశేషం. ఎందరో అజ్ఞాత కర్తల గీతాలు మౌఖికంగా ప్రచారమవుతూ ఒక తరంనుండి మరో తరానికి బలమైన జానపద వారసత్వాన్ని అందించాయి. గ్రామీణ ప్రాంతాలలో పనులతో బాటు పాట కూడా పరుగులిడింది. నలుగురు కలిసే రచ్చబండ అందరి వలపోతలతో కలిసి కన్నీటి పాటతో కరిగిపోయేది. ఒగ్గు మద్దెల డప్పు వాద్యాల శబ్దాలతో, చిందు బాగోతుల ఆట పాటలతో తెలంగాణ కోటి రాగాలు జానపదుల నిధిగా ఎదిగిందనే కళా చరిత్రను గానం చేస్తున్నాడు నాగేటి చాల్లల్ల కవి.

తలుగు పేనిన తండ్రి తండ్లాట పాట
మంటలేని కొలిమి బతుకుల్ల మంట
నీళ్ళులేని చెరువు నిను జూసి నవ్వే
బతికి చెడ్డా బిడ్డ-నా తెలంగాణ నా తెలంగాణ
తల్లడిల్లే తల్లి -నా తెలంగాణ నా తెలంగాణ’
వలస పాలకుల రాజకీయ ఆధిపత్యంలో తెలంగాణ సవతితల్లి ప్రేమను చవి చూసింది. తెలంగాణ వాసులు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరాయికరణ దుఃఖాన్ని అనుభవించారు. దీనికి తోడు ప్రపంచీకరణ ప్రభావం, నాయకుల నిర్లక్ష్యం ఊరును వల్లకాడుగా మార్చివేసింది. తెలంగాణ పల్లె శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది. పశువుల మెడలో వేలాడవలసిన తలుగు చావు పాటకు వేలాడింది. చేతివృత్తులకు పనిలేక కరువు మంటల్లో కాలిపోయారు. తలాపున కృష్ణ, గోదావరులు ప్రవహిస్తున్నా ఎండిపోయిన చెరువులు తెలంగాణను వెక్కిరించాయి. ప్రత్యేక రాష్ట్రోద్యమానికి సత్వర ఉత్ప్రేరకాన్ని అందించే ఆవేదనాత్మక చరణాలివి. బతికి చెడ్డ బిడ్డలందరిని ఒక చోటుకు చేర్చి తల్లడిల్లిన తెలంగాణ తల్లికోసం, ఏ స్పందనలు, ఉద్యమావేశాలు లేని సాత్వికులను సైతం ఉద్యమకారులుగా మార్చివేసే సమ్మోహన శక్తిని నింపుకున్న కవితా పంక్తులివి.

“బురుజు గోడల పొగరు మెడలూ వంచంగ
గుట్టల్ల చెట్లల్ల గోగూ పూవ్వుల్లు
సద్ది మోసిన తల్లి సావు బతుకుల్ల
పానమిచ్చిన వీరకథలు బతుకంగ
గోరుకొయ్యల పొద్దు- నా తెలంగాణ నా తెలంగాణ
గోరువంకల సభలు- నా తెలంగాణ నా తెలంగాణ”
ఒక పాటకైనా, కవితకైనా ఎత్తుగడ ఎంత ముఖ్యమో, ముగింపు కూడా అంత కీలకమైందే. కవి ఆశయం, దృక్పథం బలంగా ప్రకటితమయ్యే అవకాశం ఇక్కడే. పఠితలకు దిశానిర్దేశం కలిగేది అప్పుడే. ఈ పాటకు అలాంటి శక్తివంతమైన ముగింపునిచ్చి సిధారెడ్డి మార్గనిర్దేశకుడయ్యాడు. ‘నా తెలంగాణ నా తెలంగాణ’ అనే పునరుక్తి పంక్తులు పునరుత్తేజాన్ని అందిస్తాయి.

తెలంగాణ అంటేనే పోరాటాల చరిత్ర. నిజాం నిరంకుశ పాలనపై ధిక్కార స్వరాల్ని వినిపించిన కవియోధుల రణస్థలి ఇది. తెలంగాణ సాయుధ పోరాటంలో బందూకులు పట్టి దొరల గడీలు కూలగొట్టిన రైతుల కదనరంగం ఈ నేల. డెబ్భైయ్యవ దశకంలో భూస్వాముల దోపిడీని తరిమేసిన విప్లవకారుల పోరాటస్పూర్తిని తెలంగాణ రాష్ట్రోద్యమ సందర్భంలో స్మరించుకోవడం సామాన్యమైన విషయం కాదు. గుట్టల్ల చెట్లల్ల సంచరించే గోగుపువ్వుల్లాంటి అజ్ఞాత వీరులను, అమ్మల్లా వాళ్ళ ఆకలి తీర్చిన అమాయక స్త్రీల సాహసాలను, విప్లవోద్యమాలను కాపాడటానికి ప్రాణాలర్పించిన ప్రజల త్యాగాలను వీరగాథలుగా పాడుతూ కవి మలిదశ తెలంగాణ ఉద్యమానికి క్రొంగొత్త వీరులకు ఆహ్వాన గీతికలుగా ఈ చరణాలను ప్రయోగించాడు. కవి గోరు కొయ్యల పొద్దుల్లో పొడిసిన విప్లవ వ్యూహాలను మరోసారి ఈ పాటలో ప్రతీకాత్మకంగా అల్లుకున్నాడు. రాబోయే తెలంగాణ రాష్ట్రోద్యమానికి కవితాభేరిని మోగించాడు.

ఈ పాట ప్రజాక్షేత్రంలోనే కాకుండా సినిమా మాధ్యమం ద్వారా కూడా ప్రజలకు చేరువైంది.’ఊరు తెలంగాణ’లో రసమయి బాలకిషన్ ఈ పాటకు దృశ్యరూపమిచ్చాడు. దేశపతి శ్రీనివాస్ మంచి భావోద్వేగాలు పలికే స్వరధారే కాకుండా, అభినయకారుడిగా ఈ పాటలో జీవించాడు. ఆర్.నారాయణ మూర్తి ‘వీర తెలంగాణ’ సినిమాలో తనదైన బాణీలో దృశ్యీకరించాడు. సిధారెడ్డి రాసిన ఈ తొలిపాటకే 2010 సంవత్సరంలో ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకోవడం విశేషం. విప్లవ గీతాలలో, ఉద్యమ పాటలలో కవితాభివ్యక్తి కంటే నినాదాలు, ప్రకటనలు, ప్రతిజ్ఞలు ఎక్కువగా డామినేట్ చేస్తాయనే విమర్శ వుంది. సిధారెడ్డి పాటలు మాత్రం ఆ విమర్శ పరిధిలోకి రావని చెప్పవచ్చు. తన వచన కవితలోని కవితానుభూతిని, ఆర్ద్రతావేశాలను, తెలంగాణ భాష శ్రామిక పద సౌందర్యాన్ని సిధారెడ్డి పాటలలోకి అలవోకగా అనువదించుకున్నారు. ‘పాట రాయగలిగి పాడలేనితనం మోయలేని విషాదం’ గా బాధపడినా సిధారెడ్డి పాటలన్నీ ఆయా చారిత్రక సందర్భాలలో ప్రజాదరణ పొందడం కవి సంగీత స్వర ప్రజ్ఞకు నిదర్శనం. తెలంగాణ ఆత్మగౌరవ చైతన్యాన్ని చాటిచెబుతూ తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమ గీతంగా ‘నాగేటి చాల్లల్ల నా తెలంగాణ’ నిత్య నూతనంగా ఉత్తేజాన్ని పంచి పెడుతూనే వుంటుంది.


పూర్తి పాట

ప: నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ
నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ
నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ
పారేటి నీల్లల్ల – పానాదులల్ల
పూచేటి పువ్వుల్ల – పూనాసలల్ల
కొంగు చాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ
పాలు తాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ
॥ నాగేటి॥

చ: తంగేడు పువ్వుల్లు – తంబాలమంతా
తీరొక్క రంగుల్ల – తీరిచీనా పువ్వు
బంగారు చీరలు బజారులన్నీ
బతుకమ్మ పండుగ – నా తెలంగాణ నా తెలంగాణ
బంతి పూలతోట – నా తెలంగాణ నా తెలంగాణ
॥ నాగేటి ॥

చ: వరదగూడు గడితె వానొచ్చునంట
బురద పొలమూ దున్ని మురిసున్నరంతా
శివుని గుల్లె నీల్లు చీమలకు శక్కరి
వానకొరకు భజన – జడకొప్పులేసి
వాగుల్ల వంకల్ల – నా తెలంగాణ నా తెలంగాణ
చూపు రాలిన కండ్లు – నా తెలంగాణ నా తెలంగాణ
॥ నాగేటి ॥

చ: కొత్తబట్టలు గట్టి – కోటి ముచ్చట్లు
పాలపిట్టలు జూసి – పడుచు చప్పట్లు
జొన్నకర్రల జెండ – జోరున్నదేమి
ఆలయి బలయి దీసె – నా తెలంగాణ నా తెలంగాణ
జంబి పంచిన ఆర్తి – నా తెలంగాణ నా తెలంగాణ
॥ నాగేటి ॥

చ: మోటగొట్టే రాత్రి – మోగిన పాట
తాడూ పేనిన తండ్రి – తలుపులున్నప్పు
కల్లమూడ్సిన అవ్వ – కలలోని గింజ
ఆరుగాలం చెమట – నా తెలంగాణ నా తెలంగాణ
ఆకలి దప్పుల మంట – నా తెలంగాణ నా తెలంగాణ
॥ నాగేటి ॥

చ: ఊరుగాచే తల్లి ఉరిమి చూడంగ
బువ్వలేని తల్లి బోన మొండింది
సేనుకొచ్చిన పురుగు సెరిగిబోసిందా
బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ
కాట్రావులాట నా తెలంగాణ నా తెలంగాణ
శివసత్తులాట నా తెలంగాణ నా తెలంగాణ
॥ నాగేటి ॥

చ: దట్టిగట్టిన రోజు డప్పుచప్పుల్లు
పీరీల గుండంల పిలగాండ్ల ఆట
కుడుకాపేర్ల మొక్కు కూలి బతుకుల్లు
ఆలువాడిన పాట నా తెలంగాణ నా తెలంగాణ
ఆత్మగల్ల చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ
॥ నాగేటి ॥

చ: కలిసేటి సేతుల్ల కన్నీటి పాట
సిందోల్ల సిందుల్ల సిగురించె నాట్యం
వొగ్గు మద్దెల డప్పు వాద్య సంగీతం
కళలకే పుట్టుకా – నా తెలంగాణ నా తెలంగాణ
పాటగాచిన పట్టు – నా తెలంగాణ నా తెలంగాణ
॥ నాగేటి ॥

చ: తలుగు పేనిన బతుకు తండ్లాట పాట
మంటలేని కొలిమి బతుకుల్ల మంట
నీళ్లులేని చెరువు నిను చూసి నవ్వె
బతికి చెడ్డా బిడ్డ నా తెలంగాణ నా తెలంగాణ
తల్లడిల్లే తల్లి – నా తెలంగాణ నా తెలంగాణ
॥ నాగేటి ॥

చ: బురుజు గోడల పొగరు మెడలూ వంచంగ
గుట్టల్ల చెట్లల్ల గోగూ పవ్వుల్లు
సద్ది మోసిన తల్లి సావు బతుకుల్ల
పానమిచ్చిన వీరకథలు బతుకంగ
గోరుకొయ్యల పొద్దు నా తెలంగాణ నా తెలంగాణ
గోరువంకల సభలు నా తెలంగాణ నా తెలంగాణ

** **

జ‌న‌నం: న‌ల్ల‌గొండ‌. 'ఆధునిక క‌విత్వంలో అస్తిత్వ వేద‌న‌', 'అంతర్ముఖీన క‌విత్వం' అనే అంశాల‌పై ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ ప‌రిశోధ‌న చేశారు. ప్రాథ‌మిక త‌ర‌గ‌తి నుండి డిగ్రీ స్థాయి తెలుగు పాఠ్య పుస్త‌కాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మైన స‌భ్యుడిగా, ర‌చ‌యిత‌గా, సంపాద‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనేక కవితలు, సమీక్షలు, ముందుమాటలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. పలు పురస్కరాలు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 'జీవ‌న లిపి'(క‌విత్వం), 'స‌మ‌న్వ‌య‌'(సాహిత్య వ్యాసాలు) ర‌చ‌న‌ల‌తో పాటు వివిధ గ్రంథాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

4 thoughts on “తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక చిత్రపటం ‘నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ’

  1. మీ విమర్శ విశ్లేషణ చాలా బాగుంది గురువుగారు…🙏

  2. నాగేటి చాళ్లు అంటేనే తెలంగాణ బతుకురేఖలు. మెతుకును పండించే కార్మాగారాలు. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ పోరాటాన్ని తలపైకెత్తుకొని ఉవ్వెత్తున ఎగిసిన మలిదశ ఉద్యమాన్ని ఊరూరా కదంతొక్కించి వలసపాలకుల గుండెల్లో ఉద్యమ నగారా మోగించిన పాట. పల్లె జీవనాడులను తన సాహిత్యపు అస్తిత్వంగా మార్చుకున్న మహాకవి డా. నందిని సిద్దారెడ్డి సార్. దోపిడి పాలనలో గాయపడ్డ తెలంగాణను బెబ్బులిగా మార్చి ప్రజలను చైతన్యపర్చిన అంత గొప్ప పాటకు తనదైన శైలిలో సాటిలేని సమగ్రమైన విశ్లేషణతో మళ్లీ మనముందుకు తీసుకువచ్చిన డా.ఎస్.రఘు గారికి మనస్పూర్తిగా ఉద్యమాభివందనాలు🙏

  3. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సామాజిక, సాంస్కృతిక సంపదను ఒక్క పాటలో వర్ణించిన డా. నందిని సిధారెడ్డి గారికి ,ఆ పాటను చక్కని లోతైన, అద్భుతమైన విశ్లేషణ చేసిన డా. ఎస్. రఘు గారికి అభినందనలు……..

  4. “ఇక్కడ కవి ఎదురు చూసి చూసి కళ్ళు రాలిపోయాయి అనే భావాన్ని ‘చూపులు రాలిపోయాయి’ అనే కొత్త వ్యక్తీకరణతో ఎదురు చూపులకు మరింత గాఢమైన చూపును అందించాడు. ”
    వ్యాసంలో ఇటువంటి విశ్లేషణాత్మక వాక్యాల ద్వారా పాటల పంక్తులలోని అంతర్లీన భావాలని ఎత్తి చూపడం ఈ ఆర్టికల్ లోని ప్రత్యేకత. సిద్ధారెడ్డి గారి పాటలపై సమగ్రమైన పరిశోధనకు ఈ వ్యాసం ప్రధాన భూమిక వహిస్తుందనడంలో సందేహం లేదు. పదునైన విమర్శనా శైలి, సూక్ష్మ పరిశీలనా దృష్టికి అద్దం పట్టే వ్యాసం. తెలంగాణ పాటలతనాన్ని పంచే అరుదైన వ్యాసం. అద్భుతమైన వ్యాసం అందించినందుకు రఘు సార్ గారికి ధన్యవాదాలు.

Leave a Reply