నవతరాన్ని కలగన్న జాషువా

వినుకొండ అంటే తడుముకోకుండా గుర్తొచ్చేది మహాకవి గుర్రం జాషువా పేరు. వినుకొండలో పుట్టిన జాషువా విశ్వనరుడిగా ఎదిగాడు. తెలుగు సాహిత్య పరిమళాలు చేరిన ఈ ప్రపంచ పటంలో ఏ మూలకు వెళ్లినా, వినుకొండ అంటే “మహాకవి గుర్రం జాషువా పుట్టిన గడ్డ కదా” అంటారు. ఈ వినుకొండ ప్రాంతానికి ఇంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాడు విశ్వనరుడు జాషువా. ఆయన బాల్యం, యవ్వనం వినుకొండ మట్టి వాసనలో పెనవేసుకుని ఉంటుంది . ఇక్కడి గాలి, ప్రకృతి, పరిసరాలు నుంచి జాషువా సాహిత్య పాఠాలు నేర్చుకున్నాడు.

పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు ప్రాంతంలో వినుకొండ వెనుకబడిన గ్రామం. ఇది 120 ఏళ్ల క్రితం నాటి మాట. ఈ ప్రాంతానికి క్రైస్తవ మిషనరీలు రాకముందు దళితుల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఒంగోలు కేంద్రంగా క్రైస్తవ మిషనరీని స్థాపించిన క్లౌ దొర వినుకొండ ప్రాంతంలోనూ ఆధ్యాత్మిక బోధనతో పాటు ఇంగ్లీష్ , తెలుగు విద్యకు శ్రీకారం చుట్టాడు. దీని కారణంగా దళితుల జీవితాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. వినుకొండకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చాట్రగడ్డపాడు గ్రామం జాషువా తల్లిదండ్రుల స్వగ్రామం. గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్న ప్రశాంతమైన పల్లెటూరు అది. జాషువా తండ్రి గుర్రం వీరయ్య, తల్లి మందా లింగమ్మలది వర్ణాంతర, ప్రేమ వివాహం. అప్పట్లో వర్ణాంతర వివాహం సాహసంతో కూడుకున్న విషయం. దీని కారణంగా వీరికి కుటుంబ, గ్రామస్తుల సహకారం కరువవడంతో దంపతులిద్దరూ వినుకొండకు చేరారు. గుర్రం వీరయ్య క్రైస్తవ్యాన్ని స్వీకరించి బోధకుడిగా జీవితాన్ని ప్రారంభించారు. వినుకొండలోని మిస్సమ్మ బంగ్లా ఆవరణలో క్రైస్తవ మిషనరీల సహకారంతో లింగమ్మ , వీరయ్య నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే 1895 సెప్టెంబర్ 28న గుర్రం జాషువా జన్మించారు. జాషువా బాల్యం వినుకొండ ప్రాంతంలో వైవిధ్యభరితంగా గడిచింది. గ్రామం చిన్నది కావడం, ఒక పక్కన అతి పెద్ద కొండ, ఊరి చుట్టూ చెట్లు చేమలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. ఇక్కడి ప్రకృతి, ప్రశాంత వాతావరణం జాషువాలో తార్కిక చింతనకు బీజాలు వేశాయి. జాషువాకు చిన్నప్పుడే దేశభక్తి, తర్కబుద్ధి ఉండేది. ఇక్కడ చిన్నకొండ, నిమ్మలబావి, ఊరి చివర రాజుల కాలం నాటి పాడుబడిన మసీదు, మిస్సమ్మతోటలో జాషువా బాల్యం నాటి గుర్తులు ఎన్నో ఉన్నాయి.

ఆనాటి సాంఘిక పరిస్థితులు, తాను అనుభవించిన వాస్తవ పరిస్థితులు జాషువాలో ప్రశ్నించే తత్వాన్ని పెంచాయి. వీటితో పాటు ప్రకృతి ఆరాధన, తాత్విక చింతన, మానవతా భావం జాషువాకు అలవడ్డాయి. కవిత్వం పట్ల ఆసక్తితో చిన్న వయసు నుండే కవిత్వం రాయడం ప్రారంభించాడు. అవధానాలు మీద ఆసక్తి పెంచుకొని అవధానం చేశారు. 1906 నుంచి 1909 వరకు వినుకొండలో హైస్కూల్ విద్య ముగిసేసరికి మరెంతో పరిణితి సాధించాడు. బాపట్లలో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఉభయ భాషా ప్రవీణుడు అయ్యాక స్వగ్రామం అయిన చాట్రగడ్డపాడులో మూడు రూపాయల జీతానికి మాస్టారు ఉద్యోగం చేశాడు. అస్పృశ్యత, అంటరానితనాన్ని నిరసిస్తూ జాషువా చేసిన రచనలు ఒకవైపు అయితే, దేశభక్తి ,ప్రకృతిలోని వస్తువులను తీసుకుని రచించిన ఖండకావ్యాలు మరోవైపు. ఏడు భాగాలు ఖండకావ్యాలలో ప్రతి వస్తువు వినుకొండ ప్రకృతితో ఎంతో కొంత ముడిపడి ఉంటుంది.

20 ఏళ్ల వయసులోనే జాషువా ‘హిమదామార్కధర పరిణయము’, ‘కన్యకా పరమేశ్వరి’, ‘రుక్మిణి కళ్యాణం’, ‘మాదాలస’ వంటి కావ్యాలను జాషువా రచించాడు. ప్రస్తుతం ఇవి అలభ్యాలు. జాషువా బాల్యం, యవ్వనం సుమారు 23 ఏళ్ళపాటు వినుకొండతో పెనవేసుకుని ఉన్నాయి. ఆయన జీవితంలో వినుకొండతో ఉన్న అనుబంధం మరపురానిది అని జాషువా తన ఆత్మకథలో చెప్పుకున్నాడు. అందుకే, “నన్ను మరిచినా నిను మరువను, వినుకొండా ! నీకు నా పవిత్ర ప్రణతుల్ “అంటాడు జాషువా.

23 ఏళ్ల వయసులో బతుకుదెరువు కోసం వినుకొండను వదిలి గుంటూరు, రాజమండ్రి వెళ్ళాడు. వినుకొండలో ప్రకృతి నుంచి, ఈ ప్రశాంత వాతావరణం నుంచి, ఇక్కడ నేర్చుకున్న విద్య నుంచి, పరిస్థితుల నుంచి, తాత్విక ఆలోచనల నుండి పుట్టిన జాషువా కవిత్వం విశ్వవ్యాప్తం అయింది. ఆయనది మానవతా వాదం అందుకే జాషువా ఇలా అంటాడు…

“తల్లిదండ్రులు లేని బిడ్డల జూచి కన్నీరు
దానంబు చేయు నేత్రములు నావి
జంతు కోటికి గల్గు స్వామి భక్తి మెచ్చి
తృప్తి నందెడు నవ్య దృష్టి నాది
సకల కార్మిక సమాజముల జీవిత కథా
నఖము లాలించు కర్ణములు నావి
కఠిన చిత్తుల దురాగతములు ఖండించి
కనికార మెలపించు కలము నాది “

జాషువా రచనలు అనుభవంలో నుంచి పుట్టిన కావ్యాలు కాబట్టే చిరస్మరణీయంగా నిలిచాయి. ఆయన నవతరాన్ని కలగన్నాడు. ఆయనది మానవతా దృక్పథం.

(సెప్టెంబర్ 28న గుర్రం జాషువా జయంతి)

గుంటూరు జిల్లా వినుకొండ స్వగ్రామం. ఉపాధ్యాయురాలు. తెలుగు సాహిత్యంలో డిగ్రీ, ఎంఏ, డీఎడ్, బీఎడ్ చదివారు. వినుకొండలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(తెలుగు)గా పనిచేస్తున్నారు. విద్యార్థులకు తెలుగు సాహిత్యాన్ని బోధించడం అత్యంత ఇష్టం.

Leave a Reply