నలుగురి కోసం నాలుగో రుణం! – కాళీపట్నం రామారావు

‘ఋణం’ అనగానే-

మన బ్యాంకు రుణమో  ప్రపంచ బ్యాంకు రుణమో గుర్తుకు వస్తూంది కదా?

ఋణమంటే అంతేనా-

అప్పులూ వడ్డీలూ సులభవాయిదాలూ కొండకచో మాఫీ యింతేనా? కాదంటే రుణాలు ఎగ్గొట్టడమూ ఐపీ పెట్టామేనా?

ఋణమంటే తీర్చడం… కాదు కాదు, తీరుస్తూ వుండడమేనా? ఋణం ఆలస్యమయ్యేకొద్దీ వడ్డీతో కలిపి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొండంత భారం కావడమేనా?

ఆ భారం భూదేవి మొయ్యగలదా?

ఆ ఋణం… అప్పు… బాకీ… తీర్చకపోతే?

మళ్ళీ జన్మకి మనకే పుట్టి తీరుస్తారంటారు వెనకటి పెద్దలు!

జన్మ జన్మలకూ తీర్చేదాక వదలని ఆ రుణం యే రుణం?

తల్లి రుణమా?

తండ్రి రుణమా?

గురువు రుణమా?

ఈ మూడు రుణాల్ని మించిన నాలుగో రుణం గురించి కాళీపట్నం రామారావు మాస్టారు చెప్పారు.

తీసుకున్నది తిరిగి యివ్వకపోవడమే రుణమన్నారు. తల్లి రుణం, తండ్రి రుణం, గురువు రుణం యెప్పుడోకప్పుడు యెంతోకొంత తీరుస్తాము. కాని తీర్చి తీరాల్సిన నాలుగో రుణం గురించి మనకు అస్సలు స్పృహ అంటే యిచ్చగాని కోరికగాని ఆశగాని చైతన్యముగాని జ్ఞానముగాని వుండదు.

మనం పుట్టినప్పట్నుంచీ యెందరెందరి దగ్గర్నుంచో యెన్నెన్నో తీసుకున్నాం. అవన్నీ తీసుకొనే కండ కొండయ్యింది. శిశువు శిఖరమయ్యింది. మనిషయ్యింది. మనీషి అయ్యింది.

మనిషి సంఘజీవి. సంఘం పట్ల వ్యక్తీ  వ్యక్తి పట్ల సంఘమూ బాధ్యత వహిస్తుంది. మనిషి జీవించే హక్కుని కాపాడడంలోనూ వెన్నుదన్నుగా నిలవడంలోనూ సంఘం ప్రధాన పాత్ర పోషిస్తుంది. సంఘమంటే వ్యక్తుల సమూహమే. ఆ సమూహంలో వృత్తుల పేరిటో ఉపాధి పేరిటో నిరంతర శారీరక శ్రమో మానసిక శ్రమో ప్రవహిస్తూ జీవనదిని దాటిస్తూ వుంటుంది. జీవనానికి పరిపుష్టిని సమకూరుస్తూ వుంటుంది. శ్రమ పరస్పరం వొకరి నుండి మరొకరికి అందుతూ వుంటుంది. శ్రమ పడడంలో తేడాలు దాన్ని వెలకట్టడంలో యెన్ని లోపాలు వున్నాసరే.

మనం తినే తిండి రైతుల కష్టార్జితమని, మనం నివసించే గూడు కూలీల శ్రమ రూపమని, మనం కట్టుకొనే బట్ట కార్మికుల శ్రమలోంచి వచ్చిందేనని లేదా దానికి తోడయిన యంత్రం తిరగడానికి దాని లోహం దగ్గర్నుంచి ఆకారం తొడుక్కొనే దాక అన్నిటా శ్రమ యిమిడి వుంది. మనం కూర్చొనే కుర్చీ, మన నెత్తిన తిరిగే ఫేను, మనం పడుకొనే పరుపు… యిలా యేది తీసుకున్నా అన్నీ శ్రమ రూపాంతరాలే. ఒక తీగలో విద్యుత్ ప్రవహించినట్టు శ్రమ అన్నిటా ప్రవహిస్తూ వుంటుంది. శ్రమని యివ్వడం శ్రమని పుచ్చుకోవడం నిత్యమూ నిరంతరమూ పరస్పరం జరుగుతూనే వుంటుంది. అంటే మన సుఖం వెనుక సౌఖ్యం వెనుక వేరొకరి శ్రమ పరిశ్రమగా ప్రతిక్షణం అందుతూనే వుంది. మరి మనం దానికి రుణపడాలి కదా?

ఈ యెరుకని అంతః దృష్టితో అందరి దృష్టికి తెస్తూ మూడు రుణాల పక్కన నాలుగో రుణాన్ని చేర్చి ‘సామాజిక రుణం’ అన్నారు కారా మాస్టారు. తల్లయినందుకు తండ్రయినందుకు గురువైనందుకు వొక అనుబంధం వల్ల రుణపడ్డంలో ఆశ్చర్యం యేమీ లేదు. ఆ రుణం తీర్చడంలో విశేషమూ లేదు. ఏ బంధమూ లేని రుణానుబంధ సంబంధంలో సామాజిక రుణాన్ని తీర్చడంలోనే సంపూర్ణత జీవితానికి సార్ధకత వుంటుంది. లెక్కల మాస్టారు చెప్పిన లెక్క యిది. ఎవరికివారు తేల్చుకోవాల్సిన లెక్క కూడా యిది.

ఈ లెక్క వెనుక యింత కథ వుంది. కథ వెనుక కథలోకి వెళ్తే 95లో అనుకుంటా కథాభిమానులూ మిత్రులూ అంతా కలిసి ‘జన పీఠం’ పేరిట లక్ష రూపాయల బహుమానం యిచ్చి హైదరాబాదులో కారా మాస్టారికి సన్మానం చేశారు. ఆ సభా సందర్భంలోనే మాస్టారు తను వొప్పుకున్న మొదటి సన్మానమని చెపుతూనే ‘యీ డబ్బు నాకెందుకు? నాకు పెన్షన్ వస్తోంది కదా?’ అని అన్నారు. ‘ఉద్యోగం చేసినప్పుడు జీతం చెల్లించారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా పెన్షన్ తీసుకుంటున్నాను కనుక సమాజానికి రుణపడి వున్నట్టు లెక్క. ఒంట్లో శక్తి వున్నంతవరకూ నాకు చేతనైన సామాజిక సేవ చేస్తాను’ అని కూడా చెప్పారు.

‘ప్రతి మనిషికి మూడు రుణాలు వుంటాయని అంటారు. తల్లి రుణం, తండ్రి రుణం, గురువు రుణం అని. నేను మరో రుణం కూడా వుంటుందని అనుకుంటున్నాను. అది సామాజిక రుణం’ అన్నారు. ‘ఇప్పటి వరకూ మూడు రుణాలను తీర్చాను, నాలుగో రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాను’ అని చెప్పారు. చెప్పిందే ఆచరించారు. ఆ ఆచరణ రూపమే ‘కథా నిలయం’. 1997 ఫిబ్రవరి 22న శ్రీకాకుళంలో కథ తనదంటూ వొక గూట్లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలోనే మాస్టారు తను తిరస్కరించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డునీ అందుకున్నారు. ఆ నగదుని యితర అవార్డుల పేరిట వచ్చిన ప్రతి పైసాని కథానిలయానికే వెచ్చిస్తూ వచ్చారు. ట్రస్ట్ యేర్పాటు చేసి కథానిలయంతో వున్న ఆస్తి సంబంధాన్ని వదులుకున్నారు.

ఆ కథని అలా వుంచితే, నాలుగో రుణం గురించి మాస్టారు నాలుగు మాటలు చెప్పేవారు.  ‘జీవిత కాలంలో మనిషి తాను పడ్డ కష్టాలకే కాదు, తాను పొందిన సుఖాలకీ సౌఖ్యాలకీ సంబంధించి కూడా ఆలోచించుకోవాలి. అలా ఆలోచించినప్పుడు తనకు సుఖ సౌఖ్యాలిచ్చిన సమాజానికి రుణపడి వున్నట్టే. ఉద్యోగిగా వుండి జీతం తీసుకున్నా కూడా ఆ జీతం ప్రజల సంపదలోనిదేనని గుర్తించాలి. ఆ ప్రజల పట్ల ఆ ప్రజలున్న సమాజం పట్ల తను బాధ్యుడుగా అనుకోవాలి. ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ పొందడమంటే అది హక్కయినా సరే సామాజిక సంపదను తీసుకున్నట్టే భావించాలి. అందుకనే సామాజిక రుణం తీర్చడం తప్పనిసరి బాధ్యత’ అని.

ఇక్కడితో మాస్టారు చెప్పిన లెక్క తెగలేదు. తేలిపోలేదు. ఇక్కడే అసలు లెక్క మొదలవుతుంది. నువ్వు సమాజం నుండి యెంత తీసుకున్నావు? తీసుకోవడంలో నీ వాటా యెంత? తిరిగి యివ్వడంలో నీ వాటా యెంత? అందరికీ వొకటే వంతు కాదు. అలా అనడానికి లేదు. నువ్వీ సమాజం నుండి సంపద పొందింది యెంత యెక్కువయితే అంత యెక్కువగా తిరిగి నాలుగో రుణం చెల్లించాలి. సమాజ సంపదలో తమ వాటా పొందలేనివాళ్ళూ వుంటారు. అప్పుడు వాళ్ళ వాటా వాళ్ళకు దక్కేలా చేయాలి. దక్కాల్సినవాళ్ళకు వాటా దక్కలేదంటే ఆ వంతు ఆ భాగం యెవరు పొందుతున్నారో యెంత పొందుతున్నారో ఆ లెక్కలన్నీ తేల్చాలి. అప్పుడే కదా యెవరి రుణం వాళ్ళు చెల్లించినట్టు. ఇంకా చెప్పాలంటే వొకరు పడ్డ సామాజిక రుణం వేరొకరు చెల్లించడం అన్యాయం. అసమానం. దాన్నే దోపిడీ అంటారు. పేరు యేదైనా కానీ యెవరి రుణం వారే చెల్లించాలి. లేదంటే అందుకు తగిన మూల్యం యెప్పుడోకప్పుడు చెల్లించాల్సి వస్తుంది.

అయితే లెక్కల మాస్టారి లెక్క ప్రకారం యీ లెక్కలన్నీ తేలినప్పుడే మాస్టారుకు నిజమైన నివాళి.

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. నాలుగు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. అల్లిబిల్లి కథలు పిల్లల కథా సంపుటం. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- ఇంకా జాతీయాల మీద వచ్చిన పురాణ పద బంధాలు, పిల్లల సమస్యల మీద వచ్చిన ఈ పెద్దాళ్ళున్నారే వంటి పుస్తకంతో ఇరవైయ్యేడు వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’ కాలమ్స్ కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

Leave a Reply