నన్నెక్కనివ్వండి బోను

నల్లకోట్లు నీలిరంగు నోట్లతో
ఒక దేశం ఒక కోర్టులో
ఫైసలా అయ్యే కేసు కాదు నాది
నన్నెక్కనివ్వండి బోను

నలుగురి నమ్మకంతో ‘అమ్మా’ అని పిలవటం తప్ప
నవమాసాలు మోసిందెవరో
ఎవరికైనా ఏమి తెలుసంటున్నాను.
సృష్టికర్తనే వెక్కిరిస్తున్న పాపిష్టిని
మీలో మిమ్మల్ని ప్రశ్నించుకొమ్మంటున్నాను
అంటున్నాను అంటాను
అనుకుంటూనే వస్తున్నాను

మనిషి మీద నమ్మకం పోగొడుతున్న మీరు
దేవుడిమీద ప్రమాణం చేయమంటారెందుకు?
దోషికి నిర్దోషికి ఒకటే సూత్రం
వల్లించిందే వల్లించి వాదిస్తారు
ఫీజు కుడితి కుండలో
న్యాయాన్ని ఎలుకలా ముంచేస్తారు
మీ ఉద్యోగాలకు ప్రమాణాలేమిటి?
ఎక్కనివ్వండి నన్ను బోను

కలలు కాగితాలు సర్దుకోండి
లో బుక్కుల్లో నా సందేహాలు రాసుకోండి
న్యాయానికి దేశాలేమిటి? యెల్లలేమిటి?

మనిషీ, రక్తం, ప్రాణం ముఖ్యం
లింగ భేదాలు వాదాలు తప్పితే
మందిర్, మజ్జిద్, చర్చి,
మతాధికారులు మతాలు యెందుకు?

ఆకలి, కామం, కలలు, కన్నీళ్లు,
మనిషిలోని మర్మజ్ఞానమంతా ఒక్కటే
దేశమేదైతేనేం? మట్టంతా ఒక్కటే
అమ్మ ఎవరయితేనేం? చనుబాల తీపంతా ఒక్కటే
బిక్కముఖాలతో చూస్తారేం?
పిచ్చివాణ్ణిగా కేసు పుట్టప్ చెయ్యండి
నన్నెక్కనివ్వండి బోను

తిన్న యింటి మర్యాదెంచని నాకు
బుద్ధుల్లో పెద్దల సహజాతాలేమైయుంటాయ్?
మంచి మనసు పరిమళాలు
విశ్వవ్యాప్తి కాకపోవు
భావితరం గుర్తించకపోదు
జగత్ప్రళయ కావ్యంలో
తపనాగ్ని జ్వాల నిలుస్తోంది
అణువణువున అగ్ని కణం
చల్లారక రగులుతోంది
నన్నెక్కనివ్వండి బోను

తీర్పు మీది జైలు మీది
భయపడతారెందుకు
మీ మనోసౌధాల నిండా
తరగని తరతరాల బూజు
అనుక్షణం చచ్చే ప్రియత్వం

కాపురాల గోపురాలలో తిరిగే పావురాళ్లారా
నరుక్కోరెందుకు తలలు
గది నాలుగు గోడల కూల్చివేసిన
దిశలు నాల్గుగా మార్చుకోండి
ప్రపంచ పౌరులు కారెందుకు అప్పుడు?

నాకు తెలుసు
మీ రాత్రి చొక్కాలు పగలు నిలవవు
పగటి చొక్కాలు రాత్రి వుండవు
మీ పెళ్లాలు పిచ్చివాళ్ళు
పాతిక చీరతో స్వర్గాన్ని కప్పుకొని,
వంటగదిలో ఆలోచనలకు
ఎసర్లు పెడుతున్నవాళ్లు
మీ వాగ్దానాల పుచ్చు గింజలు
మీ బిడ్డలు కృత్రిమ నాగరికత షోలో
మోడల్గా పనికొస్తున్నవాళ్లు
ఛీ, ఛీ యెవరు మీరు?

నీవు నేను కలిసి యెదుట వాని పిలుపుకు
‘మీరు’గాక ఏమౌతాం?
నీ గుండెలు నా గుండెలు
మూతబడిన కొండగుహలు
ఎక్కనివ్వండి నన్ను బోను
ఈ సువిశాల ప్రపంచ జీవశాలలో
సిసలైన న్యాయస్థానం ఎక్కడైనా ఉంటే
నన్నెక్కనివ్వండి బోను

నా గుండెలు పిండుకునే
కొండల్లాంటి సందేహాలు …

శాంతి మన ధ్యేయం
యుద్ధాలకు పరిమితమా?
అబద్ధమా యీ వేదన?
మాంసం ముద్దలుగా మనుషులు
శిశువులుగా జన్మించుట ఏ దేశంలో లేదు
ఏ దేశంలో నైతేనేమి?
అర్ధరాత్రి పడగ్గదుల
అంతరార్థ మొకటే గద
ప్రపంచమొక నగ్న శిలా
ఫలకము వలె కనిపిస్తున్నది.
భగవంతుడి అసలు పేరు నగ్నప్రియుడంటాను
అంటాను అంటున్నాను.
అనుకుంటూనే వస్తున్నాను
అందుకే
నన్నెక్కనివ్వండి బోను.

-1965

అస‌లు పేరు బ‌ద్ధం భాస్క‌ర్‌రెడ్డి. పేద రైతు కుటుంబంలో పుట్టాడు. హైద‌రాబాద్‌లో ఉపాధ్యాయుడిగా ప‌నిచేశాడు. ఆరుగురు దిగంబ‌ర క‌వుల్లో ఒక‌రు. 'న‌న్నెక్క‌నివ్వండి బోను'తో క‌వితాకాశంలో సూర్యుడిలా పొడుచుకొచ్చాడు. విర‌సం వ్య‌వ‌స్థాప‌క కార్య‌వ‌ర్గ స‌భ్యుడు. 1971-72లో విర‌సం కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశాడు. శ్ర‌మ‌జీవుల జీవితాల‌పై ఎన్నెన్నో పాట‌లు రాశాడు. విర‌సం మీద ప్ర‌భుత్వం బ‌నాయించిన సికింద్రాబాద్ కుట్ర‌కేసులో ముద్దాయి. క‌వితా సంపుటాలు: 'దిక్సూచి', 'ముట్ట‌డి', 'గ‌మ్యం', 'జ‌న్మ‌హక్కు'. న‌వ‌ల‌లు: ప్ర‌స్థానం, మా పల్లె. గంజినీళ్లు(నాటిక‌), చిరంజీవి, మ‌రికొన్ని క‌థ‌లు రాశారు. . ప్ర‌భుత్వం చెర‌బండ‌రాజుని నిరుద్యోగానికీ, అనారోగ్యానికీ గురిచేసి బ‌లితీసుకుంది. మెద‌డు క్యాన్స‌ర్‌తో మ‌ర‌ణించాడు.

 

Leave a Reply