నడి తొవ్వల…

నిన్నెవరో
ఎదమీద పట్టి
ఈడ్సుకు
పోయారని విని
ఎదలు బాదుకుని

ఎంతెంత
పొగిలి పొగిలి
ఏడిచామో
కన్నీటి పర్యంతమై…

ఇయ్యాల
యెదమీద
తన్ని
ఎల్లెలకలేసి
తొక్కుకుంటూ
నువ్వెళుతున్నప్పుడు

నా కొరకంటూ
ఒక్క చుక్కా
మిగుల్చుకోలే
కళ్ళల్లో కమ్ముకున్న
దుఃఖపు జీరలు
కడిగేసుకోడానికి…

దిగాలున లేచి
దులిపేసుకు
నిలబడి
నడకనై
సాగిపోతున్నందుకు

నా నీడ
వొదలని పీడలా
నన్నెగతాళి
చేయొచ్చు గాని..

మానని గాయాల
నా పాదాలను
ముద్దాడిన కాలి బాట
నన్నొళ్ళో కెత్తుకుని

దారి బత్తెం
మూట గట్టి
చేరాల్సిన తీరానికి
నడవాల్సిన
తొవ్వ జూపింది
నా వెన్ను తట్టి !!

పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)

2 thoughts on “నడి తొవ్వల…

  1. మా సత్యం
    ఇక్బాల్
    ‘నడి తొవ్వల’ కవిత లో ప్రజా ఉద్యమకారులను, అన్యాయాన్ని ప్రశ్నించే వారిని నిరంకుశ పాలకుల ఆజ్ఞలకు తలవగ్గి హఠాత్తుగా పోలీసులు వచ్చి పట్టుకెళ్ళడం చూసి తల్లి ఎంతో ఆవేదనతో వ్యక్తీకరించిన బాధను
    తెలంగాణ మాండలికంలో వ్యక్తం చేశారు. ఉద్విగ్నతకు లోను చేస్తుంది.

Leave a Reply