నక్క తోక!

నక్క వొకటి వుచ్చులో చిక్కుకొని తోక వదిలేసింది. ఆ అవమానం యెలా గట్టెక్కాలా అని ఆలోచించి వో వుపాయం కనిపెట్టింది. ఇతర నక్కల్ని పిలిచి తోకలు కోసేసుకొమ్మని చెప్పింది.

“తోకలుంటే వెధవ పీడ! లేనిపోని బరువు!” అని చెప్పింది.

“నీ తోక పోకపోయివుంటే ఆ ముక్క అనేదానివి కాదు నువ్వు!” అని వో నక్క అంది.

తోకలేని నక్క మళ్ళీ నోరెత్తకుండా అక్కడి నుంచి చక్కా పోయింది.

చకచకా పోయిందే కాని దాని మనసు మనసులో లేదు. తోక తెగిన చోట మంట లేదు. మరెక్కడో మంట మండిపోతూ వుంది. దాన్ని ఆర్పడం అవివేకం అనుకుంది. ఆ మంటని అడవికి అంటించేయాలనీ అనుకుంది. ఎందుకంటే ‘తోకలేని నక్క… తోకలేని నక్క’ అని తోటి నక్కలు పిలవడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.

“నువ్వు నక్క పుట్టుక పుట్టావు. అది మర్చిపోకు” అంది ముత్తాత నక్క. ఆ మాటల్లోని అంతరార్ధం అర్థమయ్యి గ్రహించాల్సింది గ్రహించిందో లేదోనని “జంతువుల్లోకెల్లా నక్క జాతి వుత్తమమైంది. తెలివైంది. దాన్ని చర్రితార్ధకం చెయ్యి. ఆచంద్రతారార్కం చెయ్యి…” అని తోకలేని నక్క నెత్తిమీద కుడి పాదం పెట్టి దీవించింది.

ఒక మహత్తర కార్యానికి సిద్ధమై దీర్ఘశ్వాస తీస్తూ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ పరిసరాలను మర్చిపోయి ముందుకు నడిచింది తోకలేని నక్క. ముసలి సింహమొకటి వేటాడే శక్తిలేక తన ముందుగా వెళుతున్న నక్కమీదికి పంజా విసిరి కాలికింద అదిమి పట్టింది. తోకలేని నక్క భయపడకుండా సింహాన్ని చూసి నవ్వింది. ఆ నవ్వుతో సింహానికి పిర్ర గిల్లినట్టయ్యింది.

“ఎవరూ చూడకుండా నన్ను గబుక్కున తినెయ్యి” కన్నుగీటుతూ కవ్వింపు చూపులతో అంది తోకలేని నక్క. ప్రాణభయం లేకుండా కిందపడి కూడా నక్క బోర విరిచి మాట్లాడడం చూసిన సింహానికి తనమీద తనకే అనుమానం వచ్చింది. తన పాదాన్ని తనే కరుచుకొని నొప్పి పుట్టాక “నేను తింటే నువ్వు చస్తావే” వుక్రోషంగా అంది. “నేనా? నువ్వా?” పరమ శాంతంగా అంది తోకలేని నక్క.

సింహం తేరిపార చూసింది. గక్కురుమంది. “నీ తోక?” అడిగింది సింహం.

“దేవుడికిచ్చేశాను” అంది తోకలేని నక్క. సింహానికి అర్థం కాలేదు. అయోమయంగా చూస్తుంటే, “తోకలేని నక్కని తిని చూడు…” నవ్వింది నక్క.

ఏమవుతుంది అన్నట్టుగా చూసింది సింహం.

“నీ వీర్యం నిర్వీర్యం అవుతుంది. నీ గతి నిర్గతి అవుతుంది. నీ జాతి నిర్‌జాతి అవుతుంది. సింహాల్ని చూసి చిట్టెలుకలు తోకలూపుతాయి…” అచ్చం వీరబ్రహ్మంగారిలా మాట్లాడుతోంది.

అప్పటికే ముసలి సింహం వెనుకన చేరిన మిగిలిన సింహాలన్నీ ముఖాముఖాలు చూసుకున్నాయి. అలాగే తుప్పల్లో దాక్కొని వున్న నక్కలూ మిగతా జంతువులూ వెర్రి చూపులు చూస్తున్నాయి.

“నేను అబద్దం ఆడొచ్చు కదా? తిని చూడు. తేలిపోతుంది” ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తూ అంది తోకలేని నక్క.

ముసలి సింహం నక్కమీంచి కాలుతీసి దబ్బున నక్క కాళ్ళమీద పడిపోయింది. మిగతా వాటిల్లో కొన్ని సింహాలు శిరస్సు వంచి ప్రణామం చేశాయి. మరికొన్ని అలానే చూస్తుంటే, వాటి తలిదండ్రులు తిట్టిమరీ ప్రణామం చేయించాయి.

తోకలేని నక్క లేచి వొంటికి అంటిన మట్టిని తోకతో అలవాటుగా దులుపుకోబోయింది. తోక తెగిన సంగతి గుర్తుకువచ్చి ముడ్డిని వూపి సర్దుకొని సరిపెట్టుకున్న నక్క ముసలి సింహం నెత్తిమీద కాలు పెట్టింది. ఒక్కక్షణం కళ్ళుమూసి తెరచింది. దీవించింది. తరువాత అక్కడినుండి జ్ఞానభారంతో కదిలినట్టు కదిలింది. దైవమే కదిలి వెళుతున్నట్టు కళ్ళున్న జంతుజాలాలన్నీ రెప్పలార్పకుండా చూశాయి.

అక్కడి వాతావరణం అంతా స్తంభించింది. తోకలేని నక్క కదిలాక వాతావరణంలో కదలిక వచ్చింది.

ఈ అపురూప దృశ్యాన్ని అడవంతా కథలు కథలుగా చెప్పుకుంది.

ఆ రాత్రి వెన్నెల కురిసింది. తడుస్తూ నక్కలన్నీ అడవిలో గుమికూడాయి.

తోకలేని నక్క రాతిమీద మూతిని, ముందరి కాళ్ళని ఆనించి వెనుక కాళ్ళపై బోడి ముడ్డిని పైకెత్తి విగ్రహంలా కదలకుండా వుంది. ధ్యానంలో మునిగినట్టు కళ్ళు మూసుకుంది.

మల్లగుల్లాలు పడి లజ్జుగుజ్జులయ్యాక నక్కలన్నిటి తరుపున పెద్దనక్క “మేం మీకేమి చెయ్యగలం?” అని అడిగి ముందరి రెండుకాళ్ళను జోడించింది. తోకలేని నక్క కళ్ళు తెరచి చూసి బదులు పలుకకుండా మళ్ళీ కళ్ళు మూసుకుంది.

“నిన్ను గురించి తప్పుగా మాట్లాడిన మనవాళ్ళని క్షమించు. వీలైతే నీ జాతేనని గ్రహించు. నిగ్రహించు. అనుగ్రహించు…” కొన్ని నక్కలు అప్పటికప్పుడు అపరిమిత భక్తాగ్రేసరులుగా మారిపోయి సాగిలబడ్డాయి. అయినా తోకలేని నక్క మాట్లాడలేదు.

“రాత్రి భగవంతుడు నా కలలో కనిపించి ‘తన తోకని నాకిచ్చిన మీ జాతి నక్క కాదది. జాతిరత్నం. మీ జాతికో మార్గం చూపిస్తుంది. దిశానిర్దేశం చేస్తుంది’ అని చెప్పి మాయమయిపోయాడు” అంది ముత్తాత నక్క.

నక్కల జాతి మూగవోయి చూసింది.

“దేవుడికి తోకెందుకిచ్చావ్? పీకెందుకివ్వలేదు?”

ధిక్కార తిరుగుబాటు స్వరం విని తోకలేని నక్క నవ్వింది. మెచ్చుకుంది. “ప్రశ్నించడం ద్వారానే జవాబుల్ని శోధించగలుగుతాం. ఆ దైవాన్ని కూడా!”

నక్కలన్నీ నిశ్శబ్దంగా చూస్తున్నాయి.

“అసలు నీతోక యేమయ్యింది?”

తోకలేని నక్క కళ్ళు తెరచి చూసింది. తన జాతి మొత్తం తన జవాబుకోసం యెదురుచూస్తున్నట్టు గ్రహించింది. నిట్టూర్పుగా దిగశ్వాసని వొదిలింది. మోర పైకెత్తింది. ఊళ వేసి వొళ్ళు దులుపుకుంది.

“నా మానాన నేను తోకూపుకుంటూ పోతుంటే దేవుడు యెదురయ్యాడు. నేను నా వూపులో వుండి దేవుణ్ణి గమనించలేదు. అప్పుడు అడ్డం పడిన దేవుడు ‘వొరే పిల్ల నక్కగా… నక్క తోకని, అదే నీ తోకని నువ్వు తొక్కొచ్చావని నేను నీకు దర్శనమిస్తే, నువ్వు నీ తోక శాశ్వతమని నన్ను చూడ అంధుడివయ్యావు. అందువల్ల నా వునికికే పెద్ద ప్రమాదమే తెచ్చి పెట్టావు. ఏ తోకని చూసి ముచ్చట పడ్డావో ఆ తోకే మీ జాతికి అవరోధం అగుగాక’ అని దీవించాడు. అప్పటికీ నేను ‘తోక లేకుండా మా నక్కల్ని వూహించలేను’ అన్నాను. ‘బోడి తోక… బోడి తోకని… నాకు లేని తోక నీకెందుకురా’ అని దేవుడు చిరాకు పడ్డాడు. అలా దేవుడుకీ నాకూ అడ్డం పడ్డ తోకని అక్కడికక్కడే పెరికి తీసి దేవుని చేతిలో పెట్టాను. ఆ క్షణాన నాలో యేదో జరిగింది. బయట మాత్రం వురుములూ మెరుపులూ…” తోకలేని నక్క చెప్పుకుపోతోంది.

“పిడుగులు పళ్ళేదా?”

“తోకతోనే వుంటే పిడుగులు పడతాయి” స్థిరంగా వుంది తోకలేని నక్క గొంతు.

అర్థంకాక వెర్రి ముఖాలేసుకు చూస్తున్నాయి మిగతా నక్కలు.

“తోక యెంత ప్రమాదకారో మీకు తెలీదు. మనం వెళ్ళిన చోటుకల్లా తోక వొస్తుంది. నీడ కూడా చీకట్లో వెంటరాకుండా ఆగిపోతుంది. కాని తోక…” చెప్పలేనట్టు తలడ్డంగా వూపి యెగశ్వాసని భారంగా పీల్చింది తోకలేని నక్క.

“తోక లేకపోవడం అవమానం కాదా?”

“కాదు, తోకే అవమానానికి ప్రతీక. ఎక్కడికి వెళ్ళినా తోకలా తగిలేవుంటాడని అందుకే కదా మనుషులు హీనంగా అంటుంటారు…” తోకలేని నక్క చెప్పడం పూర్తి కాలేదు.

“జంతువులన్నాక తోక లేకుండా యెలా?”

“ఔను… మనం యెప్పటికీ జంతువులుగానే వుండదలచుకుంటే నిరభ్యంతరంగా మీ తోకని మీతోనే వుంచుకోండి” అని ఆగి తన జాతి ముఖాలు చూసి చదివి మళ్ళీ “పోని తోక మంచిదే. కాని ఆ తోక కుక్క తోకంత వుంటుందే కాని కనీసం గేదె తోకంత కూడా లేకపోవడం అవమానం కాదా? కోతి కొండముచ్చు తోకలంత పొడవు కూడా లేకపోవడం అవమానం కాదా?” తిరిగి ప్రశ్నించింది తోకలేని నక్క.

తోకలున్న నక్కలన్నీ ఆలోచనలో పడ్డాయి.

“తోక వుంటే వాలిన యీగల్నీ దోమల్నీ తోలొచ్చు. కాని అది మన యేకాగ్రతకి భంగం కలిగిస్తుందని యేనాడన్నా ఆలోచించారా? పైగా తోక భారం లేకపోవడం వల్ల వేగంగా పరిగెత్తవచ్చు. అదంతా కాదు, తోకని పట్టుకుంటే చాలు మనం దొరికిపోతామా లేదా? ప్రాణం మీదికి తెచ్చే ఆపదలు వెంట తగిలించుకు తిరగడం అవసరమా? తోక అంత అవసరమే అయితే తెగినచోట తిరిగి మొలకెత్తుతుంది. గరిక చిగురేసినట్టు. లేదే? పోని కనీసం తోక వెనకన లేకుండా ముందున ముఖమ్మీద మీసకట్టులా వున్నా అందంగా బాగుణ్ణు. అదీ కాదే?” తోకలేని నక్క మాటలకు నిజమేనన్నట్టు మిగతా నక్కలు తోకలూపాయి.

నిశ్శబ్దం ఆవరించింది.

“చూడండి… వేటగాడికే కాదు, వుత్కృష్ట జన్మమెత్తిన యే నరమానవుడికీ తోక లేదు. తోకలేని నక్క అంటే దైవ సంతతి. అంచేత యే జీవీ మనల్ని తినమన్నా తినదు. మనం రేపట్నుంచి వొదిలి పెట్టిన యే యెంగిలి మాంసమూ తిననవసరం లేదు. మనం కనిపిస్తే యీ అడవి మనకి నైవేద్యం పెట్టేలా మనం వుండాలి. ఎదవ తోకలు పెట్టుకొని మేమూ మీలాగ జంతువులమే అని కాళ్ళీడ్చుకుంటూ పొట్టకోసం తిరక్కూడదు…” తోకలేని నక్క ఆనుపానులు గుర్తెరుగుతూ చూసింది.

మళ్ళీ నిశ్శబ్దం పొగలా కమ్ముతుండగా “మన తెలివిని తట్టుకోలేని మూర్ఖ జంతువులు జిత్తులమారిగా మనమీద ముద్ర వేశాయి. నిజానికి మనం యీ అడివికి తలకాయలం. మనమేం భుజబలాలను ప్రదర్శించి వేటాడం. అలాగని యవ్వారాలూ యాపారాలు చెయ్యం. బానిసపనులు అసలేనాడూ చేసి యెరగం. మన జ్ఞానం బ్రహ్మజ్ఞానం. దాన్ని అడివి హితానికి వాడుదాం. తోకలు తెగ్గోసుకోవడానికి ముందుకు వస్తున్న నా జాతికి మంగళాశాసనం” తోకలేని నక్క మటం దిద్దుకు కూర్చుంది.

“మేం మీకేమి చెయ్యగలం?” అని మళ్ళీ భక్తాగ్రేసర నక్కలు పోటీపడుతూ ముందుకొచ్చాయి.

“మీరు నాకేం చేస్తే- మీకేం ప్రయోజనం? అయితే గియితే మీరూ నాలా మారిపోండి! అప్పుడు మన జాతికే ప్రయోజనం!” తోకలేని నక్క మాటలకు తోసుకుంటూ వీరావేశంతో ముందుకొచ్చిన కొన్ని నక్కలు వొకదాని తోకలు వొకటి పరపరా కొరుక్కున్నాయి. కసకసా కోసుకున్నాయి. మరి కొన్ని బండరాతికేసి ముడ్డిని బరబరా రుద్ది రుద్ది అరగదీసుకొన్నాయి. తోకలు రాల్చుకున్నాయి.

తోకలు లేని నక్కలు తోకలున్న నక్కలపై పడ్డాయి. తోకలు కత్తిరించే దాక నిద్రపోమని శపథం చేశాయి. మోర తెరచి పళ్ళని కత్తుల్లా కదిలిస్తూ తోక కనిపిస్తే చాలు కొరికి పారేశాయి.

తోకలు కుప్పలా పోగుపడ్డాయి. కాదు, కొండలా పోగుపడ్డాయి.

తోకలేని నక్క నెమ్మదిగా కళ్ళు తెరచి ఆ కమనీయ దృశ్యాన్ని ఆస్వాదిస్తూ చూసింది. ఆనందతాండవం చేసింది.

అదే సమయంలో యీతకు వచ్చిన నక్కకు పురిటి నొప్పులు వచ్చాయి. పంటి బిగువున ప్రసవించింది. బుల్లి నక్క అరుపుని విని ఆనందించింది. అంతలోనే ఆనందం ఆవిరయ్యింది. తోకతో పుట్టిన తన పిల్లని చూసి తెగ బాధపడిపోయింది. మంత్రసాని నక్క బొడ్డు కోసినప్పుడే తోక కూడా కోసేసింది. అప్పుడు తల్లినక్క కళ్ళు తళతళ మెరిశాయి.

“తోకల్లేని నక్కలకు మంగళాశాసనం” మళ్ళీ అని ముడ్డిని వూపి తన జాతి జనులను దీవించింది తోకలేని నక్క.

నక్కల వూళలతో ఆ అడివి దద్దరిల్లింది.

ఆ వొక్క రాత్రి వేలకొద్దీ తోకలు నేలరాలాయి. కొత్త చరిత్ర మొదలయ్యింది.

అలా తెల్లవారింది మొదలు…

ఏ వొక్క నక్క తోకతో కనిపించినా తోకలేని నక్కలన్నీ కలిసి తొక్కి చంపేసేవి. అంతే కాదు, అవి తప్పించుకు పారిపోయి తలదాచుకున్నా అడివిలో అడుగుపెట్టలేనివిగా అంటరానివిగా అడివికి దూరంగా మిగిలేవి. తోకతో వున్న నక్క ముఖం చూస్తే సకల దరిద్రాలూ చుట్టుకుంటాయని నమ్మకాలు ప్రబలాయి. తోక వున్న నక్కలకూ ఆ నమ్మకం లేకపోలేదు.

బొడ్డు తాడు కోసినా కోయ్యకపోయినా పుట్టిన వెంటనే అంటే పురిట్లోనే తోక కోసెయ్యడం సాంప్రదాయంగా మారింది.

ఏమయినా తోక లేకపోవడం మొదట విడ్డూరం. వింత. తరువాత నేరం అయ్యింది.

అంతేకాదు, తోకతో కనిపిస్తే ఆ నక్కది వేరే అడివి అని, తమ జాతిని భ్రష్టు పట్టిస్తోందని, ఆ భ్రష్టత్వం పోవాలంటే బానిసత్వం చేసి విముక్తి కావడం వొకటే మార్గమని… అప్రకటిత శాసనంగా అమలు చేశాయి తోకల్లేని నక్కలు.

అలా కొన్ని శతాబ్దాలు గడిచాయి. తోకని కోసుకున్న నక్కలే గాని తోకలేకుండా పుట్టిన వొక్క నక్కా భూమ్మీద కనిపించలేదు.

తోకల్ని కొరుక్కుతింటూ బతుకుతున్న నక్కలకు తోక మీద మోజు పుట్టింది. అవి తమ బుజ్జి బుజ్జి పిల్లల బుల్లి బుల్లి తోకలను కోసే ముందు సున్నితంగా తడిమి ముద్దు పెట్టుకోనేవి. ముద్దులాడుతూ కంటతడి పెట్టుకోనేవి. కోసిన తోకల్ని భద్రంగా దాచుకొని రహస్యంగా చూసుకొని చాటుగా కుమిలి కుమిలి యేడ్చేవి. తోకలున్న కాలాన్ని తలచుకొని శోకంగా మారేవి.

పిల్ల నక్కలకి యిదంతా అర్థమయ్యేది కాదు. అందుకని తమ బోడి ముడ్డిల మీద తోకలు కట్టుకొని గెంతుతూ తలిదండ్రులని ఆనంద పెట్టాలని ఆరాటపడేవి.

“నక్క తోక తొక్కినవాళ్ళు అంత అదృష్టవంతులైతే, ఆ తోక మన ముడ్డెనకాల వుంటే మనమెందుకు అదృష్టవంతులం కాము?”

పిల్ల నక్కల ప్రశ్నలకు పెద్ద నక్కలు సమాధానం చెప్పలేకపోయేవి. ‘మన పెద్దలు యిలా యెందుకు పెట్టారో, కారణం లేకుండా అయితే వుండదు’ అని నక్కలు గట్టిగా అనుకోనేవి. ‘ఇప్పుడా అప్పుడా మా తాతముత్తాతల వాళ్ళ ముత్తాతల కాలంనుండి వొస్తున్న సాంప్రదాయం. విదాయకం. ఆచరించడం మన విధి’ అని చెప్పుకోనేవి.

‘ఎద్దు యెప్పుడూ వొకపక్కే పడుకోదు’ అన్నట్టు కాలం కూడా వొక్కలాగే లేదు. ధర్మం నాలుగు కాళ్ళమీద నడవడం లేదని నక్కలు వాపోతున్న కాలంలో తోకమీద నడిచే నక్కొకటి కనిపించింది. ఆ నక్క గురించి ఆనోటా ఆనోటా అడివంతా పాకిపోయింది. ఆ నక్కని చూడడానికి తోకలున్న నక్కలే కాదు, తోకలులేని నక్కలు కూడా ఆరాటపడ్డాయి.

ఆ ఆరాటం అటుంచి పోరాటం వొచ్చిపడింది. తోకలున్న నక్కలన్నీ వొక్కటయ్యాయని దండు కట్టాయని తెలిసి తోకల్లేని నక్కలన్నీ వొక్కటయ్యాయి. కాలు దువ్వుకున్నాయి. కథన శంఖం పూరించుకున్నాయి.
అడివి యుద్ధక్షేత్రమయ్యింది. ఊళల్తో వులిక్కిపడింది. నక్కలే అయినా రెండు వైరి వర్గాలుగా ఆజన్మ శత్రువులుగా మారిపోయాయి. శైవ వైష్ట్నవుల మాదిరిగా కాట్లాడుకు చచ్చేవి. అనేక నక్కల ప్రాణార్పణలతో యుద్ధం ముగిసింది.

తోకలున్న నక్కలవైపే విజయం నిలబడింది. కొన్ని తోకల్లేని నక్కలు కూడా తోకలున్న నక్కలే గెలవాలని కోరుకున్నాయి. తెరచాటుగా చెయ్యవలసిన సహకారం బాగానే చేశాయి. మొత్తానికి తోకలున్న నక్కలు నెగ్గి బలప్రదర్శన చేయడంతో మిగిలిన నక్కలు తోకలు తెగ్గోసుకోవడం మానేశాయి.

ఇప్పుడు తోకలేని నక్క అంటే బుర్రలేని నక్క అని తోటినక్కలు వెక్కిరిస్తున్నాయి. ‘తోకల్లేకుండా బతుకుతాము లేదంటే చస్తాము’ అనుకున్న నక్కలు తోకలతో పాటు పీకలూ కోసుకున్నాయి. తప్పితే తమ మతం మార్చుకోలేదు.

ఇటు తోకలేని నక్క కనపడితే చాలు తోటి నక్కలు తొక్కి చంపేస్తున్నాయి. ఏమీ మారలేదు. తోక వుండడం లేకపోవడం తప్ప.

భూమి గుండ్రంగా వుండడం వల్ల యెక్కడ మొదలయ్యిందో అక్కడికే వచ్చి ఆగింది.

ఏమయితేనేం యిప్పుడు తమకి తోకలున్నాయని- తోకల వెనుక యింత రక్త సిక్త చరిత్ర వుందని- చాలా నక్కలకి తెలీనే తెలీదు. తెలుసుకోవాలని ఆసక్తీ లేదు. అవసరమూ రాలేదు.

అయితే రెండు రకాల చరిత్రలని నక్క చరిత్రకారులు నమోదు చేశారు. తోకలు లేని ప్రాభవ చరిత్ర వొకటయితే, తోకలు వున్న వైభవ చరిత్ర మరొకటి. రెండు చరిత్రల్లోనూ తోకల గురించి వుంది తప్పితే, పాపం ‘నక్క’ గురించి యెక్కడా వీసమాత్రమయినా లేదు!

(టాల్ స్టాయ్‌కి కృతజ్ఞలతో)

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. నాలుగు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. అల్లిబిల్లి కథలు పిల్లల కథా సంపుటం. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- ఇంకా జాతీయాల మీద వచ్చిన పురాణ పద బంధాలు, పిల్లల సమస్యల మీద వచ్చిన ఈ పెద్దాళ్ళున్నారే వంటి పుస్తకంతో ఇరవైయ్యేడు వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’ కాలమ్స్ కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

5 thoughts on “నక్క తోక!

  1. మూఢత్వాన్ని బాగా చెప్పారు

  2. నమస్తే సర్. కథ చాలా ఆసక్తికరంగా ఉంది.

  3. ఈ కథను ఆడియో రూపంలో వినిపించేందుకు మీ అనుమతి కోరుతున్నాను. మీ అభిప్రాయం తెలియజేయండి. “స్పందనాస్వరం” యూట్యూబ్ చానల్ ద్వారా కథలను వినిపిస్తున్నాను.
    డాక్టర్: జి.వి.కృష్ణయ్య. కొత్తపట్నం, ప్రకాశం జిల్లా. సెల్: 9866381977. Thankyou.

Leave a Reply