దేశం ఎప్పటికీ కనమరుగవ్వదు

ఆకాశ హార్మ్యాలు కనుమరుగయి ఉండవచ్చు
నేల దేహమంతా గాయాలమయమయీ
నెత్తుటి ఆనవాళ్ళు ఇంకా కనబడుతూ ఉండొచ్చు

తెగిపడిన మానవ అంగాల మధ్య
శూన్య మృగం పచార్లు చేస్తూ ఉండొచ్చు

క్షిపణి అవశేషాలు ఇంకా పొగలు
వదులుతూ చూపును మసకబార్చుతుండొచ్చు

వందలు వేలుగా వానజల్లుల్లా కురిసిన
బాంబులూ తూటాలూ మిగల్చిన
శిధిలాలు తప్ప
అక్కడింకా ఏమీ లేకపోవచ్చు

కానీ
కలలు కంటూ కనులు
కొన్ని మిగిలి ఉన్నాయి
చూస్తుండగానే కుప్పకూలిన ఆవాసాల
మధ్యే,
ఆశ చావని అంతరాత్మలతో మనుషులు
ఇంకా మిగలే ఉన్నారు

పట్టణమంతా చావుల పూదొట
అక్కడే పురుడోసుకుంటుంది‌ వసంతం
ఆలింగనాల అత్తరు వ్యాపిస్తుంది
ఉద్వేగాల ఊదు ధూపం విస్తరిస్తుంది
కర్తవ్య నిష్ట ఒకరి నుంచి ఇంకొకరికి పాకుతుంది

రేపటి కోసం వర్తమానం నెగడై రగులుతూ
క్షతగాత్ర శరీరాలకూ, బేల పడిన గుండెలకూ అవసరమైన తల్లి ఒడి వెచ్చదనాన్ని ఇస్తుంది

గాజాను గాజాలా నిలబెట్టిన సంకల్ప బలం
పలు యుధ్ధాల మీదుగా నిలబడిన అరబ్బీయ సాంస్కృతిక వారసత్వం
ఆక్కడి గాలిలో నీటి ఆవిరిలా కలిసే ఉన్నాయి

దేశాలు మనుషుల వల్లే కదా నిలబడేది
మిగిలి ఉన్న పిడికిళ్ళు చాలు
కొత్తగా దేశాన్ని నిలబెట్టడానికి

ఒక్క నెలవంక విడిచే వెలుతులు చాలు
ఆకాశాన్నాంత కాంతిలో ముంచడానికి
ఒకే ఒక్క తుంపర చాలు బీడపడ్డ భూమి చిగురించడానికి

పాలస్తీనాకు ఇప్పుడు సగం దేహమే
మిగిలి ఉండవచ్చు

దేశమనే భౌతిక ఉనికికి
మనుషుల మానసిక స్థైర్యమే ఇంధనం
ఎన్ని ఖాళీలనైనా పూరించగల మనో నిబ్బరం
గాజా స్వంతం

గాజా ఇప్పుడు తొలిచూరు బిడ్డ
తొలి కేరింత!
ప్రపంచ మానవ పుష్ప కరచాలనాల నుంచి
ఉదయిస్తున్న కాంతి పలవరింత!!
దాడి తర్వాత దాడి ని తట్టుకొని నిలబడ్డ
లోహ వెన్నెముక!

నిలబడుతుంది గాజా
తప్పకుండా
వినబడుతోంది కదా అక్కడి నుంచి
మధ్యధరా కేరటంలా అజా…

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

Leave a Reply