దుగులి లేదు దీపంత లేదు

గాలిలో దీపాలు వెలిగించిన
వాన కురవని చినుకులు
నీటిపై తేలుతున్న బుడుగ
అరికాళ్ళకు వసరు

గూడు అల్లుకోరాని కాకులు
ఎన్ని భవంతుల మీద చేతి ముద్దెరలు
రెక్కల ఈకలు జారిపడ్డ గ్యాపకం..

తట్ట బుట్ట పొట్ట
రేపటికి గంటెడు జాగ కలిమి
ముగ్గు పోసిన అడుగు సూస్తె
అది నాదని మురిపెంగా
మూల వాసందానక
మూలుగలు అరిగినా
గృహ ప్రవేశం కాంగనే ఖాలీ చేసి
రోడ్డున పడిన జీవితం

మల్లా! మొదటి నాటకం
తల మీద తట్ట
చేతులను అల్లుకున్న పిట్టలు

గుడి తలుపులు
మసీదు తలుపులు
చర్చి తలుపులు
ఇప్పుడు తలుపులు మూసి ఉన్నయి

ఎక్కడ తల దాచుకునే నీడ లేక
అయ్యా నేను ఏ ఇంటి ముందల దీపం వెలిగించను
తలుపులు లేని ద్వారం వెతుకుతూ తిరుగుతన్న
కడుపుల దేవుడు పేగులు మెలేసుడు
మెతుకులు కంకిన యాది ఎవలదీ దునియా?

దుగులి లేదు దీపంత లేదు
సమరు వత్తికి మట్టి కంచుట్ల పాణం
గాలిలో దీపాలు కొండెక్కుతున్నయి

పుట్టింది అనంతారం(అనంతవరం), నల్లగొండ జిల్లా. కవి, సామాజిక కార్యకర్త. కులవృత్తి చేస్తూ సామాజిక నేపథ్యంతో కవిత్వం రాస్తున్నారు. రచనలు: వన్నె(2007), డాకలి దీర్ఘకవిత (2014), పుటం(2018) కవితా సంకలనాలు ప్రచురించారు. డెబ్భై మంది విశ్వకర్మ కవులతో 'రుంజ', 'అంకిలి' కవిత్వ సంకలనాలకు సంపాదకుడిగా పని చేశారు. "ఎరుక" సాహిత్య సాంస్కృతిక వేదికలో పని చేస్తున్నారు.

Leave a Reply